MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
ప్రథమాంధ్ర ప్రబంధ కర్త - నన్నెచోడ కవిరాజు
ప్రసాద్ తుర్లపాటి
"వన్నెల జిన్నెలన్ గమన వైఖరియూన్ రసపుష్టి భావముల్
ప్రన్నని జాను తెనుగును పలుకుల నవ్య కళాభిరామగా
మున్నె తెలుంగు వాణిని ఆమోఘముగా గయి సేసినట్టి న
న్నియ చోడదేవకవితా విభవంబును నెన్న శక్యమే"
అని “ కవిరాజ శిఖామణి “ గా ప్రస్తుతింపబడిన కవి నన్నెచోడుడు. నన్నెచోడుని జీవిత కాలం గురించి చాలా వాదోపవాదాలు జరిగాయి. నన్నయకు ముందువాడని కొందరంటే ( “ ఆధారం – నన్నెచోడుని కవిత్వంలో నన్నయకు ముందునాటి కాలానికి చెందిన కొన్ని ప్రయోగాలు కన్పిస్తాయి. - చిలుకూరి వీరభద్రరావు గారు క్రీ. శ. 925-40 మధ్యకాలంలోని వారని వ్రాశారు. ఆయన పద్యాన్నొకదాన్నిఆధారం చేసుకుని నన్నయ్యకు వందయేళ్ళ మునుపే ఆంధ్రకవిత వర్ధిల్లుతోందని వ్రాశారు , ఐతే నన్నెచోడుడు నన్నయకన్నా ప్రాచీనుడు అనేందుకు వీలుచిక్కే పద్యానికి పలు పాఠాంతరాలు ఉండడం, వాటికి మూలమైన ప్రతి యేదో దాని ప్రామాణ్యమేదో తెలియరాకపోవడంతో నన్నయకన్నా ప్రాచీనుడనే వాదనలు నిలువట్లేదని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు నిర్ధారించారు “ . (ఆధారం – వికీపీడియా). చివరికి, నన్నయ్య కు, తిక్కనకు మధ్య వారని నిర్ధారించడం జరిగినది. అంటే క్రీ.శ. 11160 ప్రాంతం నాటివాడుగా పండితులు భావిస్తున్నారు.
నన్నెచోడ కవిరాజుగా ప్రఖ్యాతి గాంచిన నన్నెచోడుడు శైవకవి. ఈ కవి "కుమార సంభవము" అన్న గొప్ప ప్రబంధాన్ని రచించారు. కానీ, శ్రీ మానవల్లి రామక్రిష్ణ కవిగారి కృషితో, సుమారు క్రీ.శ. 1909 ప్రాంతంలో ఈ కావ్యం వెలుగులోకి వచ్చింది. ఈ కావ్యానికి కృతిపతి -శ్రీ మల్లిఖార్జున శివయోగి.
కవికుల గురువు కాళిదాసు సంస్కృతంలో రచించిన “ కుమార సంభవం “ కావ్యం లోని ఇతివృత్తాన్నితీసుకొని శివ, స్కాంద, వాయు, బ్రహ్మాండ పురాణాల్లోనూ, భారత రామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న విశేషాలనూ ఒక ప్రబంధంగా రచించాడు. నన్నయ ప్రారంభించిన విధానంలో కాక, అచ్చ తెలుగు పదాలతో, ఎక్కువ వర్ణనలతో ఈ ప్రబంధ రచన తరువాత వచ్చిన మనుచరిత్ర, వసుచరిత్ర ఇత్యాది ప్రబంధాలకు మార్గదర్శకమైనది.
కుమార సంభవం – కథ –
సతిజన్మబున్, గణాధీశ్వర జననము, దక్ష క్రతు ధ్వంసమున్, పా
ర్వతి జన్మంబున్, భవోగ్రవ్రత చరితము, దేవద్విషత్ క్షోభమున్, శ్రీ
సుత సమ్హారంబు, భూభుత్సుత తపము, సుమసుందర్వోద్వాహమున్, ద
భ్రతి భోగంబుం, కుమారోదయము నతడ నిందార కుంభోర గెల్వున్.
సతిజన్మము నుండి తారకాసురవధ వరకు జరిగిన కథ. సతి జన్మం, వినాయక సంభవం, దక్ష యజ్ఞ విధ్వంసం, సతి దేవి అగ్నిప్రవేశం, పార్వతి జననం, శివుని తపస్సు, తారకాసుర వృత్తాంతము, మన్మధ దహనం, పార్వతి తపస్సు, గౌరి కళ్యాణం, కుమారస్వామి జననం, తారకాసుర సంహారం మొదలైన అంశాలను తీసుకొని 12 అశ్వశాల వర్ణనాత్మకమైన ప్రబంధం గా రచించాడు.
నన్నె చోడుడు "జాను తెలుగు"లో – అంటే తెలుగు భాషలో స్వభావ సిద్ధంగా వాడే సంస్కృత సమాసాలు జన సామాన్యంలో వ్యవహరింపబడే దేశి పదాలతో అన్వయించి అన్వయ కాఠిన్యం లేకుండా మంజులమై సరసమై, ప్రసన్నమైన తెలుగు లో తన రచన సాగించాడు.
మృదువైన సూక్తులు, మేలిమి భావాలు, మనోహర కాంతులు, రమణీయ వర్ణనలు ఈయన కావ్యంలో కానవస్తాయి.
వర్ణనలు – ఉదాహరణలు -
పార్వతి తపోదీక్ష వర్ణన -
పవడంపు లత మీద, ప్రాలేయపటలంబు
పర్వెనా మొయినిండ భస్మమలది
లాలితంపగు కల్పలత పల్లవించెనా,
కమనీయ ధాతు వస్త్రములు కట్టి
మాధవీలత కళమాలికత ముసరెనా
రమణ రుద్రాక్ష మాలికలు వెట్టి
వరహేమ లతికపై బురె నెమ్మి యూగెనా,
సమ్మతంబగు జడలు పూని
హరుడు మహేశ్వరీ రూపమైన చెలువ
మభినయించెనో యని, మునులర్థి జూడ
గురు తపశ్శక్తి మూర్తి సేకొనిన కరణి
దగలి యుమ (ఉమ) తపోవేషంబు దాల్చి
పార్వతీ దేవి పసుపుముద్దలాంటి తన శరీరం నిండా విభూది పులుముకుంది. అది ఎలా ఉందంటే- పగడాల తీగ మీద తెల్లని మంచు పడ్డట్టుగా ఉంది. ధరించిన రుద్రాక్ష మాలికలు -మాధవీలత మీద తుమ్మెదలు వ్రాలినట్టుగా ఉన్నాయి. ముడి వేయకుండా ఉన్న కురులు బంగారు తీగ మీద (హేమ లతలపై) మగ నెమలి పింఛం ఆరబోసుకొని ఊగుతున్నట్టుంది. ఈ రూపాన్ని చూస్తూ మునులు, సాక్షాత్తూ పరమేశ్వరుడే పరమేశ్వరీ రూపాన్ని అభినయిస్తున్నాడా అనుకుంటున్నారు !
(అద్భుతమైన భావన, ఈ పోకడలోనే సీతమ్మ తల్లిలో శ్రీరామచంద్రుని దర్శించారు విశ్వనాధ వారు తన రామాయణ కల్పవృక్షం లో )
పార్వతి తపస్సు చేసుకుంటున్న గౌరి వనం –
స్థలపద్మ మృదురత్న దళ పాదతల కాంతి
గమనీయ మత్తేభ గమన లీల
సన్నుత రంభోరు సంపద నిర్ఘర
పులిన నితాంబ విస్ఫురణ పేర్మి
మానిత మృగరాజ మధ్య దేశ స్థితి
వరపయోధర భార్య వాహన శక్తి
జకిత కురంగ శాబక లోచన ద్యుతి
జమర సుకేశ పాశప్రభూతి
బేరి యందె కాదు చారు తరవయ
వంబులందు దన్ను వరుస బోలి
యునికి దద్దమరిగి యున్నట్లు యుండె నా
గౌరి వనమందు గౌరి దేవి
గౌరి వనంలో అమ్మవారు తపస్సు చేస్తోంది. పేరుకి గౌరి వనమైనా, పార్వతి దేవికీ, ఆ వనానికి పోలికలు ఉన్నాయి. ఆ వనంలో మెట్ట తామరాలు, మృదువైన రత్న దళములు ఉన్నాయి. వీటితో ఆ నేలంతా అందంగా ప్రకాశిస్తోంది. పార్వతి దేవి పాదాలు పద్మలవుతే, గోళ్ళు రత్నాల వలే ప్రకాశిస్తున్నాయి అని పోలిక. ఆ వనంలో మత్తేభాలు సంచారుస్తున్నాయి, అమ్మవారు మత్తేభ గమన. ఈ విధంగా అమ్మవారు – ప్రకృతి తత్వం ప్రకటితమవుతున్నది. కవితా పరంగా సమాస నిర్మాణం వల్ల గౌరికి, గౌరి వనానికి పోలికలు స్పురిస్తున్నాయి.
శివుని తపస్సు భగ్నమొనరించుటకు బయలుదేరిన మన్మధుని దహించుటకు పరమశివుని నేత్రము నుంచి వెల్వడిన అగ్ని ని ఈ విధముగా వర్ణించాడు –
గిరిసుతమై కామాగ్నియు
హరుమై రోషాగ్నియు, దదంగజుమై ను
ద్దుర కాలగ్నియు రతి మై
నురు శోకాగ్ని యున్ దగిలి యొక్కట నెగసెన్
పరమేశ్వరుని శరీరంలోని చతురాగ్నులు ఒక్కటి గా వెలువడ్డాయట.
పరమేశ్వర భక్తుల ఆత్మ సమర్పణ పార్వతి అమ్మవారి ప్రార్ధనలో ఈ విధంగా వర్ణించాడు –
కరమవిచారి, తద్దయు వికారి, మనంబది సారివోలెనే
తిరిగెడు గాని, నిల్వదెట, దీని చలత్వము మాన్చి నీ పదాం
బురుహములందు సంస్మరణ బొంద దయన్ సురబృందవంద్య సు
స్థిరముగ నిల్పు, తత్వవిధి దెల్పు సమస్థితి సల్పు, శంకరా !!
పరమేశ్వరా! ఈ మనస్సు తెలివిహీనమైనది, ఆవిచారి. వివిధ వికారాలు పొందుతూ వుంటుంది. కుమ్మరి చక్రములా తిరుగాడుతూ వుంటుంది. ఒక్క క్షణకాలమైనా ఎక్కడా నిలువకుండా వున్నది. దీని సంచారాన్ని ఆపి, నీ పాద సరోజముల ను నిరంతరము స్మరించే సుస్థిరతను ప్రసాదించు స్వామీ! సకల దేవతలచే ఆరాధింపబడేవాడా ! తత్వాన్ని బోధించవయ్యా !! సమస్థితి కలిగించు శంకరా !!
ఈ విధముగా నన్నెచోడ కవిరాజు దేశి తెలుగులో కుమార సంభవం అన్న ప్రబంధ కావ్యాన్ని వివిధ రకాల వర్ణనాంశాలతో, సూక్తులతో, మధురోక్తులతో రస ప్రధానమైన కావ్యంగా అందించాడు. తరువాత వచ్చిన పెద్దనాది ప్రబంధ కర్తలకు మార్గదర్శకుడైనాడు.
*****