MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
అక్టోబర్ 10, 11 , 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో కొన్ని ఎంపిక చేసిన ప్రసంగాల సమాహారం.
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వ్యాస మధురాలు
అవధాన కళ
డా॥ రేవూరు అనంతపద్మవాభరావు
అష్టావధానం తెలుగు వారి సొత్తు. సంస్కృతం, తెలుగు భాషలలో తప్ప మరే భాషలో ఈ ప్రక్రియ కన్పించదు.
20వ శతాబ్దంలో అష్టావధానం బహుముఖాలుగా విస్తరించి శతావధానం, సహస్రావాధానం, ద్విసహస్రావాధానంగా ప్రసిద్ధి చెందింది. ఇదొక సాహితీ క్రీడ. అవధాని ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణాశక్తికీ, పాండితీప్రకర్షకు నికషోపలం.
అనాది కాలంగా ఎందరో కవిపండితులు ఆంధ్రదేశంలో ఈ విద్యను ప్రచారం చేశారు. వారిలో తిరుపతి వేంకటకవులు ప్రాతఃస్మరణీయులు. కొప్పరపు కవులు దిగ్దిగంత యశఃకాయులు.
అయ్యకోనేరు అంతరంగం
డా॥ కొచ్చెర్లకోట జగదీశ్
మేలు కోరేవాణ్ణి మేలుకొమ్మంటూ సున్నితంగా లేపుతున్నారు అయ్యవారు. తూరుపుదిక్కు సూర్యుడికి అప్పటివరకూ పాలు కుడిపి, సాయంత్రందాకా భూలోకంలో ఆడుకురమ్మని తన పాలిండ్ల పర్వతాల మధ్యనుండి పంపేసింది. ఆ పిల్లాడు కంటికింపుగా బయటపడిన వాడు మధ్యాహ్నానికల్లా లోకులందరికీ కంటగింపుగా మారతాడు.
ఎక్కడినుండి బయల్దేరిందో కరిమబ్బుల గుంపొకటి వడివడిగా పరుగెడుతూ అయ్యకోనేటి దగ్గరకొచ్చి ఆగింది. ఏ మేఘసందేశాలు అందుకుందో సరస్సంతా ఒక్కసారి జలజలా నవ్వింది. దక్షిణగట్టునున్న కుర్రాడొకడు ఏమీ తోచక విసిరిన గులకరాయికి కితకితలొచ్చి కిలకిలమంది. అలా మొదలైన ఒక్కో అలా చెరువంతా పాకేసింది.
పైనుండి ఈ పరవశాల్ని గమనిస్తున్న మబ్బులక్కలన్నీ వాటిలో అవి మాటాడుకోవడం మొదలెట్టాయి.
ఉత్పాదక భాషగా తెలుగు
కన్నిగంటి అనూరాధ
వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన తెలుగు సాహిత్యప్రకాశాన్ని గౌరవించడానికి ఈ రోజు సమావేశమయ్యాము.
అనేక రూపాలూ, శైలులలో అభివృద్ధి చెందుతూనే ఉంది ఈ పరంపర. ప్రత్యేకంగా ప్రవాసాంధ్రులు ఈ సాహిత్య చరిత్ర గొప్పతనాన్ని తమ సాంస్కృతిక వారసత్వంగా చాటుకుంటారు. కానీ భాషకు మరొక కోణం ఉంది - దీని గురించి మనం కొంచెం అరుదుగానే మాట్లాడతాము, శ్రద్ధ వహిస్తాము. ఇటువంటి వేడుకలలో భాష గురించి మాట్లాడేటపుడు సాధారణంగా మనం సాహిత్య సాంస్కృతిక రంగాలపై దృష్టి సారించి, వాటి వెలుపల భాష ఏమి చేస్తుందో అనే వాస్తవానికి గుడ్డిగా ఉంటున్నాము అనే అనాలి.
నేను ఇక్కడ ముందు ఉంచాలనుకుంటున్నది ఏమిటంటే, తెలుగు సాంస్కృతిక భాష మాత్రమే కాదు, కార్యసాధక భాష కూడా.
కవిత్వంలో ఆధునికత
తమ్మినేని యదుకుల భూషణ్
కవిత్వం - ఆధునికత; ఒక రకంగా ఆలోచిస్తే ఆధునికత లేనిది కవిత్వమే లేదు. కొత్తగా చెప్పడమన్నది, కథకైనా, కవితకైనా చాలా ముఖ్యం.
మనం, ఏదైనా కొత్తగా చెప్పకపోతే మళ్ళీ, పాత చింతకాయ పచ్చడే అనిపిస్తుంది అందరికీ.
ఈ కొత్తగా చెప్పడమంటే మళ్ళీ అందరికీ అనిపించవచ్చు. ‘ప్రతి ముప్పై నలభై ఏళ్లకు పాతబడుతూనే ఉంటాయి, చెప్పే పద్ధతులు గానీ, భావాలు గానీ, మళ్ళీ మళ్ళీ పాతబడుతూనే ఉంటాయి.’ అని. మరి, ఏది ఆధునికత? ఆధునికతను మనం సరిగా నిర్వచించలేకపోతే, ఇక postmodernism అని కూడా ఒకటుంది కదా, మరి అదేమిటి? ఇటువంటివన్నీ చాలా సందేహాలు రావచ్చు. “మరి , ఇన్ని గొడవలుంటే , నీవు పది నిమిషాల్లో ఎలా చెబుతావయ్యా ఆధునికత గురించి?” అని మీరందరూ అడగవచ్చు. నా ప్రయత్నం నేను చేస్తాను.
కవిత్వం - వ్యక్తిత్వం
విన్నకోట రవిశంకర్
కవిత్వం, సాహిత్యం వంటివి దేశాన్నో సమాజాన్నో సమూలంగా మార్చుతాయనే వాదం మీద నాకు నమ్మకం లేదుగాని, సమాజంలోని కొంతమంది వ్యక్తుల జీవితాన్ని ప్రభావితంచేసి, వారి వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో అవి పాత్ర వహించటానికి అవకావం ఉందని మాత్రం అంగీకరిస్తాను.
“సాహిత్యం అవసరమా?” అన్న వ్యాసంలో ఇస్మాయిల్ గారు ఒక సంఘటన గురించి చెబుతారు. ఒకసారి ఒక చురుకైన కుర్రాడు ఆయన్ని అడుగుతాడు “ఈ సాహిత్యం ఇవన్నీ ఎందుకండీ? ఇవి లేకుండా ప్రపంచం నడవదా?” అని. దానికాయన “నిరభ్యంతరంగా, నడుస్తుంది. కాని ఇప్పుడు నడుస్తున్న విధంగా కాదు. అప్పుడు జనం ఇలా ఉండరు. వారి మధ్య అవగాహన ఇంత నిశితంగా ఉండదు. జీవితాన్ని అనుభవించి, ఆనందించే శక్తి కూడా క్షీణిస్తుంది.” అని. కవిత్వం ప్రధానంగా చేసే పని మన హృదయాల్ని మెత్తబరచటం, మనిషిలో సహజంగావుండే సౌందర్యదృష్టి, చేతనాసౌకుమార్యం వంటివాటిని పెంపొందించటం.
కవిత్వం – వైయక్తికత, సామాజికత
డా॥ వైదేహి శశిధర్
సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం ప్రస్తావన వచ్చినపుడు తరచుగా వినబడే చర్చ “కవిత్వంలో వైయక్తికత ప్రధానమా లేక సామాజికత ప్రధానమా” అని. నా వరకూ ఇది చాలా అనవసరమైన చర్చగా అనిపిస్తుంది. ఎందుకంటే కవిత్వంలో రెండూ ఉంటాయి ఉండవచ్చు. They are not mutually exclusive.
అయితే కవిత్వంలో తప్పనిసరిగా ఉండాల్సింది ఆకట్టుకునే కవిత్వీకరణ. ఈ కవిత్వీకరణను సమర్ధవంతంగా సాధించడానికి అవసరమైనది శిల్పం.
నా ఉద్దేశ్యంలో కవిత్వం ఎప్పుడూ మొదట వైయక్తికమే. తరువాత అది సామాజికంగా పరిణమించవచ్చు. సామాజికత లేని కవిత్వం ఉంటుందేమో కానీ వైయక్తికత లేని కవిత్వం ఉండదు.
తెలుగు సాహిత్యంలో హాస్య పరిణామం
డా॥ పి.ఎల్.ఎన్.ప్రసాద్
సాహిత్యంలో హాస్యానికి రెండవ స్థానం ఇచ్చినా నిజానికి ఆధునిక యుగం దాకా హాస్యానికి పెద్ద పీట వేయలేదు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోను నవ్వుకోవడం, వెటకారం, ఎత్తిపొడుపుల్లోనే హాస్యం వినిపించింది తప్ప, హృదయగత హాస్యం, లలిత హాస్యం ఆధునిక యుగం దాకా పరిమళించలేదు. ఆధునిక యుగంలో అన్ని ప్రక్రియల్లోను సామాజిక జీవిత నేపధ్యం లోనుండి, కష్టాల్లోనుండి కన్నీళ్ళలోనుండి సమస్యల్లోనుండి కూడా రచయితలు హాస్యాన్ని అందించారు. పండించారు.
ప్రాచీన యుగంలో జీవితంలో ప్రతిక్షణం కనిపించే హాస్యం సాహిత్యంలో కనిపించేది కాదు.
ఇప్పుడు జీవితంలోనుండి హాస్యం సాహిత్యంలోకి ప్రవేశించింది. ఒకప్పుడు సాహిత్యంలో విదూషకుడు మాత్రమే హాస్యాన్ని అందించాడు. ఇప్పుడు జీవిత కావ్యంలో ప్రతి పాత్ర, ప్రతి వ్యక్తి నాయక, ప్రతి నాయక, నాయికలతో సహా అందరు హాస్యాన్ని అన్ని ప్రక్రియల్లోను అందిస్తున్నారు. హాస్య రసమే విశ్వరూపం ధరించింది.
తెలుగు సాహిత్యంలో స్త్రీపాత్ర స్వాభావిక మరియు సామాజిక పరిణామక్రమం
డా॥ గౌతమి యెస్. జలగడుగుల
మనిషి ఆలోచన, ప్రవర్తన ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థలోని భౌతిక కారణాలమీద ఆధారపడివుంటుంది. ఈ భౌతిక కారణాలు మారినప్పుడే ఆ మనిషి ఆలోచనా మారుతుంది. మెల్లగా వ్యవస్థ కూడా మారుతుంది. కానీ ఆ వ్యవస్థ ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే మార్పు సంభవిస్తుంది.
ప్రాచీనకాలం నుండీ నేటి వరకూ పోలిస్తే స్త్రీ అప్పటినుండీ ఒక తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా శక్తివంతమైన పాత్రలను పోషిస్తూనేవుంది. నేడు అదనంగా పురుషులతో సమానంగా విధ్యార్హతలను పొంది డబ్బు సంపాదన ప్రక్రియలో పురుషునికి చేదోడు వాదోడుగా ఉంటున్నది. ప్రాచీన గ్రంధాలు రామాయణం, మహాభారతం, విరాటపర్వం మొదలైన వాటిలో వివిధ స్త్రీ పాత్రల స్వభావాలను చూస్తే నాడు చుట్టూవున్న సామాజిక పరిస్థితులకు పురాణ స్త్రీ కూడా నేటి స్త్రీలాగే జీవన పోరాటం సల్పింది.
కొన్ని ఉదాహరణలు చూద్దాం-
బ్రిటన్లో నవలా రచన - కధాకమామిషూ
హేమ మాచెర్ల
బ్రిటన్లో నవలా రచన, కధా కమామిషూ గురించి ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తాను. నా రెండు నవలలు ఈదేశంలో ట్రెడిషనల్ పబ్లిషర్ల ద్వారా పబ్లిష్ అయినవి కాబట్టి ఆ అనుభవం మీతో పంచుకుంటున్నాను. 1980 నుంచి 1990 వరకూ నేను తెలుగులో వ్రాసిన దాదాపు ఇరవై కధలు, దాదాపు అన్ని వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు నన్ను చాలా ప్రోత్సహించారు. వారికెప్పుడూ నేను ఋణపడి ఉంటాను.
నా రెండు నవలలకు స్ఫూర్తి ఎలా కలిగింది? ఆంగ్లభాషలో వ్రాయడానికి కారణాలు.
నా మొదటి నవల Breeze From The River Manjeera మూలాధారం ఒక నిజమయిన జీవితం.