top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

రిజర్వేషన్లు

new_edited_edited_edited.jpg

ఆర్. శర్మ దంతుర్తి

నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో మేష్టారు నాన్నని పిలిచి నా గురించి చెప్పారు, “కుర్రాడు బాగా చదువుకుంటున్నాడు, తాడికొండ హైస్కూల్లో జేర్పించండి పదో తరగతికి.”

 

“కుర్రాడి చదువు సరే, అక్కడ తిండి బాగోకపోతే?” నాన్న అడిగేడు, నేను వింటూండగానే.

 

“హాస్టల్లో బాగుంటుందండి. తిండికేమీ ఢోకాలేదు. నేను వెళ్ళినప్పుడు చూసాను. మీరో సారి వెళ్ళి చూడండి పోనీ.”

 

“సరే, చూసి వచ్చాక చెప్తానండి,” నాన్న లేచాడు.

 

ఆ తర్వాత ఎవర్నో కనుక్కుని తాడికొండ వెళ్ళొచ్చాక, నాన్నకి నచ్చినట్టే ఉంది, నా చేత అప్లికేషన్ పెట్టించేడు. అందులో ఫార్వార్డ్ కేస్ట్, ఎస్ సి, ఎస్ టి అనీ మరోటనీ ఉన్నాయి కానీ, నాకైతే ఏమీ తెలియలేదు వాటి గురించి.  సంతకం పెట్టమన్న ఓ చోట పెన్నుతో గెలికేసి నా చదువులో నేను పడ్డాను.

 

మరో ఆరునెలల్లో కాబోలు, తాడికొండ నుంచి ఉత్తరం వచ్చింది సీటు వచ్చినట్టూ.  అలా నేను మొదటిసారి ఇంట్లోంచి బయటపడ్డాను పధ్నాలుగేళ్ళకే. మొదట్లో బాగానే ఉన్నా, ఇంటిమీద బెంగ, తిండి సయించేది కాదు.  హాస్టల్లో తిండి ఇంట్లో అంత బాగోలేకపోవడం, వాంతులూ, అజీర్తీ అవీ అయిన నాలుగు నెలలకి దార్లో పడ్డాను. అయినా ఎక్కడి ఇంట్లో చేసిన భోజనం? ఎక్కడి హాస్టల్లో పోసే నీళ్ళ సాంబార్?

 

తాడికొండలో ఏడాది అయ్యేసరికి ఇంటర్మీడియట్ నాగార్జున రెసిడెన్షియల్ కాలేజీలో చదవడానికి సీటొచ్చింది. అయితే ఈ సారి నాగార్జునకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫార్వార్డ్ కేస్ట్, ఎస్ సి, ఎస్ టి అనే రిజర్వేషన్ లు అంటే కొంచెం తెలిసివచ్చింది. అయినా నాగార్జునలో సీటు వచ్చేసింది కనన అంత పట్టించుకోలేదు వాటి గురించి.  మళ్ళీ హాస్టల్లో అదే నీళ్ల సాంబారు. ఈసారి అలవాటైంది కానీ ఇంటిమీద బెంగ, అలాగే ఉంది.

 

ఇంట్లోంచి బయటకొచ్చిన మొత్తం ఈ మూడేళ్ళలో ఎప్పుడైనా ఇంటికెళ్ళడం, వెనక్కి వచ్చాక మళ్ళీ సత్రం భోజనం, మఠం నిద్ర.  బెంగ ఎక్కువైనప్పుడు, హాస్టల్లో కూర్చుని వచ్చేసారి ఇంటికెళ్ళాక ఏమేం తినాలో అన్నీ కాయితం మీద రాసి అమ్మకి చూపించేవాణ్ణి. ఇంట్లో వంట ఎప్పుడు మామ్మదే. ఏం చేయాలో అమ్మ చెప్పి కూర అదీ తరిగి ఇస్తే మామ్మ చేస్తుంది వంట.  ఆవిడ చదువుకున్నా, ఇంట్లో బాగా మడీ ఆచారమూను. వంట అయ్యేక ముందు దేవుడికి నైవేద్యం పెట్టి ఆవిడ పెందరాళే తినేసాక మాకు వడ్డిస్తుంది మధ్యాహ్నం అయేసరికి. నేనిచ్చిన లిస్ట్ అమ్మ దగ్గిర్నుంచి బామ్మకి చేరిపోయేది వెంఠనే.  ఇంట్లో ఉన్నంతకాలం ఈ లిస్ట్ లో రాసినవి రోజుకొకటి చేసిపెట్టేసేవారు; అలా మహారాజ భోగం - అలవాటైంది అనడం కన్నా, అలవాటు చేసారని చెప్పుకోవడం సమంజసం. మహారాజ యోగం అంటే, ఇంట్లో చేసిన కూరా, బిర్యానీ, సాంబార్, స్వీట్లూ, బూందీ, పకోడీ ఏదైనా సరే మొదటి ప్లేట్ నా వంట్లో వచ్చి వాలేది.

 

ఓ సారి అన్న అన్నాడు కూడా నిష్టూరంగా, “నేను బి.కాం చదువుతున్నాననీ వాడు పెద్ద నాగార్జునా లో చదువుతున్నాడనీ అన్నింటికీ వాడికే ముందు. సరే లేవే అమ్మా, నాకు వాడికన్నా ముందు బేంక్ లో ఉద్యోగం వస్తుంది చూడు అప్పుడైనా నాకు మొదటి సారి పెట్టవా?”

 

“లేదురా, పాపం వాడికి హాస్టల్లో తిండి బాగుండదని ఇలా పెడుతున్నాం. నువ్వైతే ఎప్పుడూ ఇక్కడే ఉంటావు కదా? అయినా నువ్వు మా పెద్ద కొడుకువి. నీతో వాడికి పోలికేమిటి?” అమ్మ బుజ్జగించేది.

 

“నువ్వూ, మామ్మా అలా అంటారు కానీ మేము చూస్తూనే ఉన్నాం కదా?” అక్క అందుకుంది పక్కనుంచి.

 

“ఛా ఊరుకోవే, మాకు మీ ముగ్గురూ సమానం కాదూ?”

 

“నా మీద ఉడుక్కుంటారెందుకూ, నేను రాసిన లిస్ట్ లో ఉన్నవన్నీ మీరూ తింటున్నారుగా?” నేను ఇలా అనేసరికి మళ్ళీ పిల్లలం అందరం ఒకటే.

 

నాగార్జునాలో ఇంటర్మీడియట్ అయ్యేలోపు ఐఐటి ఎంట్రన్స్ రాసి బయటపడ్డాను. ఏదో నాలుగొందల పైన రేంక్ వచ్చింది కానీ అప్పుడు ఇన్నాళ్ళూ వాటి గురించి చదివినా ఎప్పుడు సరిగ్గా పట్టించుకోని, అప్పుడు కొత్తగా తెలిసొచ్చిన విషయాల వల్ల వెన్ను జలదరించింది.

 

“ఈ రేంక్ కి మద్రాస్ లో సీటొస్తుందా?” నాన్న అడిగేడు.

 

“వస్తుందనుకుంటున్నా. ఆఖరికి సివిల్, మెకానికల్ లో నైనా రాదా?”

 

“మనది ఫార్వార్డ్ కేస్ట్ రా నాయనా. ముందు గవర్నమెంట్ ఆ రిజర్వేషన్ లు అన్నీ పూర్తి అయ్యేక వస్తే నీ దాకా వస్తుంది.” నాన్నసాలోచనగా చెప్పేడు.

 

అలా మొదటిసారి రిజర్వేషన్ అనేది నా పీకలమీదకి వచ్చింది. ఇంటర్వ్యూకి మద్రాస్ పిలిచారు. అన్నీ అయ్యేక నా కులం గోత్రం అన్నీ చూసిన ఐ ఐ టి ప్రొఫెసర్ అయ్యవారు చెప్పేరు, “నువ్వు ఫలానా కులానికి సంబంధించినవాడివి, అంటే నీది ఫార్వార్డ్ కేస్ట్. సివిల్, మెకానికల్ సీట్లు అన్నీ పూర్తైపోయాయి.  నీ పేరు వాటికి వెయిట్ లిస్ట్ లో పెట్టాం. మరో ఐఐటి కి వెళ్తారా?”

 

“మూడేళ్ళు కుర్రాణ్ణి వదిలి ఉన్నాం. ఇప్పుడు ఎలాగా వదలాలి మళ్ళీను. మద్రాస్ అయితే దగ్గిర అనీ…” నాన్న చెప్పేడు మరో ఐఐటి వెళ్ళమూ అన్నట్టూ.

 

“సరే అయితే, మీ ఇష్టం. సీట్లు సాధారణంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మొదటి అయిదుగురికీ వస్తాయి. మీవాడిది వెయిటింగ్ లిస్ట్ లో పధ్నాలుగో నెంబర్. చూద్దాం ఏమౌతుందో.”

 

వెనక్కి వచ్చాక ఇంట్లో కూర్చుని తలబద్దలు కొట్టుకుంటూంటే ఈ విషయాలన్నీ అమ్మకీ మామ్మకీ అర్ధం కావడానికి నాన్న విడమర్చి చెప్పేడు, “రూల్స్ ప్రకారం సర్కారు వారు మొదటి విడత షెడ్యూల్ ట్రైబ్ కి సీట్లు ఇస్తారు. రెండో విడత షెడ్యూల్ కేస్ట్ వారికి. ఎంత శాతం ఒక్కొక్కరికీ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరుగుతుంది.”

 

“మరి మన కులం ఈ మూడో విడతలోనా?” అమ్మ అడిగింది

 

“అబ్బే, తర్వాత బేక్ వార్డ్ కేస్ట్ వారిది మూడో విడత.”

 

“అంటే మనబ్బాయిది నాలుగో విడతా?” ఈ సారి బామ్మ అడిగింది.

 

“అప్పుడే? ఈ మూడో విడతలో మళ్ళీ ఎ, బి, సి, డి అనే ఉప విడతలు. ఇవన్నీ దాదాపు 52 శాతం సీట్లు గుంజేసాక మిగిలినవి ఫార్వార్డ్ కేస్ట్ అయిన మనలాంటివారికి వస్తై. ఇది గవర్నమెంట్ కాలేజీలైన ఐఐటి లాంటి చోట్ల తంతు.”

 

“మరి కొన్ని చోట్ల నా స్నేహితులు, మన కేస్ట్ వాళ్ళే మంచి సీట్లు సంపాదించారుగా?” నేను ఉండబట్టలేక అడిగేను.

 

“కొంచెం మంచి ప్రైవేట్ కాలేజీ ఐతే డిపార్ట్ మెంట్ రిజర్వేషన్ అనీ, మేనేజ్ మెంట్ కోటా, మరోటనీ ఉండొచ్చు. అందులో వచ్చి ఉండొచ్చు అనుకుంటా,” నాన్న చెప్పేడు. మొహంలో ఏదో నిస్సహాయిత జోడించి.

 

ఓ పదిహేనురోజులు టెన్షన్. ఇంత కష్టపడి పరీక్షలు పాసైనా రిజర్వేషన్ వల్ల కావాల్సినవి వదులుకోవాల్సి రావడం, అసలు సీటొస్తుందో రాదో అనే బెంగ, ఈ లోపుల మిగతా ఇంజినీరింగ్ కాలేజీలకి మరో ఎంట్రన్స్ రాయడం, దానిగురించి మరో తలనెప్పి వగైరా.

 

చివరకి ఉత్తరం వచ్చింది మద్రాసు ఐఐటి నుంచి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్ లలో కాకుండా అప్పుడే కొత్తగా పెట్టారుట – ఇంజినీరింగ్ ఫిజిక్స్ అనే బ్రాంచ్; జేరాలని ఉంటే ఫలానా రోజుకి రావొచ్చు అని.

 

“ఏం జేస్తావురా?” నాన్న అడిగేడు.

 

“ఐఐటి కనక ఏదో ఒకటి మంచిదే, వెళ్ళి చేరుతాను.” చెప్పేసాను.

 

“సరే అయితే, వెళ్ళి ట్రెయిన్ కి రిజర్వేషన్ చేయిద్దాం.”

 

“పదిహేనో తారీఖుకి ముహుర్తం బాగుందిరా అబ్బాయ్,” వంటింట్లోంచి మామ్మ చెప్పింది నాన్నతో.

 

పదిహేనో తారీఖుకి నేను ఐఐటి కి బయల్దేరేటప్పుడు, ఈ మద్రాస్ తిరుగుళ్ల వల్ల ఈ మధ్యన కుదరలేదు, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో, అందరం కల్సి భోజనం చేద్దామని అనుకున్నాం. మామ్మ వడ్డిస్తోంది.

 

“ఈ రిజర్వేషన్ల వల్ల నాక్కావాల్సిన బ్రాంచ్ లో సీటు రాలేదు,” నేను అక్కసుగా అన్నాను.

 

“మనం ఇందులో చేయగల్గింది ఏమీ లేదు. అయినా నీకు ఏదో ఒక బ్రాంచ్ లో వచ్చింది కదా సీటు? ఇంక మన చేతుల్లో లేని మిగతా విషయాలు అంత చర్చించుకోవడం అనవసరం” నాన్న అన్నాడు నిర్లిప్తంగా.

 

మేము తింటూంటే మామ్మ తన కొడుకైన మానాన్నకి ముందు, తర్వాత అమ్మకీ, అన్నకీ, అక్కకీ, చివరికీ నాకూ అలా వయసు బట్టి ఒక్కొక్కరికీ వడ్డిస్తోంది. కానీ ఇవ్వాళ మొదట నాన్నకి కూరో పచ్చడో వేయబోతూంటే

 

“నాకెందుకే, వాడికి వేయి, రేపటినుండి ఐఐటి కి వెళ్ళిపోతున్నాడు కదా” నాన్న అన్నాడు.

 

నాన్న చెప్పినది విని అమ్మనీ, అక్కనీ, అన్ననీ వదిలేసి అన్నీ నా కంచంలో గుమ్మరిస్తోంది వద్దు చాలు అంటున్నా.

 

“మామ్మ వడ్డన చూస్తే ఎందుకో ఒక్కసారి ఈ సర్కారు రిజర్వేషన్లు మా ఇంట్లో కూడా అమలు జరుగుతున్నై అనిపిస్తోంది.” నాన్నతో చెప్పేను.  

 

వడ్డించే మామ్మ విందో లోదో తెలియదు కానీ మిగతా అందరూ నాకేసి కుతూహలంగా చూసారు.

 

“మొదట మనం ఈ రిజర్వేషన్ లు గురించి అంత పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ఐఐటి లో సీటొచ్చాక ఇప్పుడు ఎవరికెన్ని సీట్లో, ఎంత శాతం కోటాయో, ముందెవరికో తెలుస్తోంది. మన ఇంట్లో కూడా అలాగే ఉంది కదా, ముందు ఏది వడ్డించాలన్నా నేను షెడ్యూల్ ట్రైబ్ అన్నట్టూ ముందు నాకు వడ్డించేస్తోంది మామ్మ.”

 

“నువ్వు షెడ్యూల్ ట్రైబ్ అయితే మరి నేనో?” అన్న అడిగేడు.

 

“వాడి తర్వాత నీకు కనక నువ్వు షెడ్యూల్ కేస్ట్ అవ్వొచ్చు” నాన్న చెప్పేడు నవ్వుతూ.

 

“ఆ తర్వాత వచ్చే బేక్ వార్డ్ కేస్ట్ ఎవరు మరి?” అమ్మ అడిగింది

 

“తర్వాత అక్కకి, అది బి.సి. కిందకొస్తుంది”

 

“మరిక్కడ బి. సి లలో ఎ. బి. సి. డి లు లేవా?” అన్న అడిగేడు నవ్వుతూ.

 

“ఎందుకులేవు అక్క బేక్ వార్డ్ కేస్ట్ ఎ కాటగరీ, నాన్న బి కాటగరీ లెక్కలోకి వస్తాడు. ఏ చుట్టాలో, స్నేహితులెవరైనా వస్తే వాళ్ళు నాన్న తర్వాత  సి, డి కాటగరీల కింద లెక్క.”

 

“మరి అమ్మ ఎక్కడ తేల్తుంది ఈ లిస్ట్ లో?” అక్క అడిగింది.

 

“అందరికీ మిగిలిపోయాక వడ్డించేది అమ్మకి కనక, అమ్మ ఫార్వార్డ్ కేస్ట్” అన్న నవ్వుతూ చెప్పేడు.

 

హాల్లోంచి వంటింట్లోకి అట్నుంచిటూ ఇట్నుంచటూ తిరుగుతూ వడ్డించడంలో నిమగ్నమైపోయిన మామ్మ ఇదంతా వినడం లేదనుకున్నాం గాని మామ్మ అడిగింది “మరి నా సంగతేం చేసావురా?”

 

ఏం చెప్పాలా నేను అనుకునేంతలో అన్నే చెప్పేడు,  “మామ్మా, నీది డిపార్ట్ మెంటల్ రిజర్వేషన్. అన్నింటికన్నా ముందు; వంట అవగానే ముందు నువ్వు తింటావు కదా మడి కట్టుకుని? అయితే ఉన్నది ఒకటే సీటు.”

 

మామ్మతో సహా అందరం నవ్వుతుంటే “మరి ఇందులో మిగతా కోటాలు ఎక్కడున్నై?” అడిగింది అమ్మ.

 

“ఇంకా మిగతా ఏం కోటాలు?” అక్క అడిగింది అర్ధం కానట్టూ.

 

“మేనేజ్ మెంట్ కోటా అనీ డొనేషన్ కోటా అనీ ఇంకా ఉంటాయిలే,” నాన్న చెప్పేడు.

 

“ఎవరైనా స్నేహితులో, చుట్టాలొచ్చారనుకో నాన్న తరపు వాళ్ళు ఐతే మేనేజ్ మెంట్ కోటా, అమ్మ తరపు అయితే డొనేషన్ కోటా.” ఈ సారి మళ్ళీ అన్నే చెప్పేడు.

 

“హార్నీ, మేనేజ్ మెంట్ కోటా అంటే అర్ధం అయిందిలే కానీ అమ్మ తరపువాళ్ళు చుట్టపు చూపుగా వస్తే నేనెప్పుడూ బాగానే చూస్తానుగా, డొనేషన్ కోటా అంటావేం?” మామ్మ అడిగింది ఉడుక్కుంటున్నట్టూ.

 

“బాగా చూడలేదని కాదు మామ్మా, ముందు మేనేజ్ మెంట్ కోటా అంటే కాలేజీ పెట్టినవాళ్ళ కొడుకూ, కూతురూ వగైరా ఉంటారు కదా. డొనేషన్ ఎంత ఇచ్చినా ఈ మేనేజ్ మెంట్ పిల్లల తర్వాతే ఎవరైనా. డొనేషన్ ఇచ్చినవాళ్ళని బాగానే చూస్తారు కానీ మేనేజ్ మెంట్ తర్వాతే,” అన్న చెప్పేడు.

 

“ఓరి భఢవా, సరే, సరే అన్నాలు కానీయండి, అవతల బండి వెళ్ళిపోతుంది మళ్ళీ,” మామ్మ నవ్వుతూ హెచ్చరించింది.

*****

bottom of page