MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
యూరేకా... అమెరికా
బలభద్రపాత్రుని రమణి
ఈ వంగూరిగారు ఆరవ సదస్సు (అరవ సదస్సు అని పడిందిలెండి) కి వచ్చినప్పటి నుండీ ఈ అమెరికానీ, ఇందు నివసిస్తున్న ప్రాణులనీ చూసి ఆశ్చర్యపోతూనే వున్నా! ఇది ఐదవసారి. అయినా పెక్కు ఆశ్చర్యంగానే వుంది.
‘ప్రాణులు’ అని ఎందుకన్నాను అంటే, మనుషులేకాదు… జంతువులు, చెట్లు, మొక్కలు అన్నీకూడా డిసిప్లీన్ పాటిస్తాయి.
మొత్తం అమెరికా ఎక్కడా కూడా, మా బట్టలు ఇస్త్రీ చేసే బాలమ్మలా, హాయిగా రెండు చేతులూ ఆకాశం వైపు పెట్టి, చంకలో గోక్కునేవాళ్ళే కనిపించలా!
"మా పెరుగు తీస్కోండోయ్ హా..." అని అవలించే సోడాబుడ్డి కళ్ళద్దాల నారాయణలా ఆవలిస్తూ పెరుగు అమ్మేవాడూ కనపడలా!
ఇంకా మనతో మాట్లాడ్తూనే, మా నిర్మాత ఒకరు, పుల్ల వెదుక్కుని పళ్ళు కుట్టుకుంటూ వుంటాడు. మనం కథ చెప్తుంటామా... "అప్పుడు ఆ హీరోయిన్ ’ధు’ జారి హీరో మీద… ’ధు’ పడిందా? డైనింగ్ టేబుల్ మీద ’థు’ ఏం వున్నాయి? అవి తింటూ ’థు’ " ఇలా కథ వింటూ, పళ్ళు కుట్టుకుని ఉమ్ముకుంటూ ఆస్వాదించే సీతాఫలాల వంటి మనుషులే కనిపించలేదు. సీతాఫలం అంటే ‘మనుషుల నోళ్ళు సగం చేసిన సీతాఫలాల్లో గింజల్లా వుండడం’ అని కవి భావన.
ఇంక మిరపకాయ బజ్జీలమ్మే రాములు మధ్యలో ముక్కు చీదుకోవడం, మంచినీళ్ళు ఇచ్చే ఆయా మాలచ్చిమి తల గోక్కోవడం ఇంకా బస్సులో రైళ్ళల్లో ప్రయాణాలు చేస్తూ, మనుషులు తమని పట్టించుకోరూ, లేదా చుట్టూ ప్రపంచం మాయం అయింది అనే లెక్కల్లో నాసికా రంధ్రాలు శుభ్రం చేసుకునే వాళ్ళూ, కళ్ళల్లో పుసులు తీసుకునేవారు, కారాకిళ్ళీ కాండ్రించి వుమ్మేవాళ్ళూ, రోడ్లమీద తమ ఇష్టానికి గోడవైపు తిరిగేవాళ్ళూ ఎవరూ కనబడలా… అసలు మొక్కపాటివారు పార్వతీశాన్ని లండన్ పంపి, మన తెలుగువాళ్ళకి అక్కడ ఆచారాలూ, వ్యవహారాలూ, పార్వతీశం మార్చుకున్న తీరు తెన్నుల గురించి కొంత చెప్పారు.
మిగిలిన పని వంగూరి చిట్టెన్‍రాజుగారు, తన అమెరికామెడీల్లో, మిగతా పాఠ్యాంశాల్లో కొంత బోధించారు. లేకపోతే మెరికల్లాంటి మన కుర్రమూక అమెరికా వచ్చి ఎంత ఇబ్బంది పడివుందురు?
ఓ పార్కులో నడుస్తున్నామా? ఎదురుపడ్డ ఏ తలకాయా "ఎవరింటికొచ్చారూ? ఆ శేషాచలం కోడలివి కదా? ఓ... చలపతి కోడలివా? పిల్లలేం చేస్తున్నారూ? మెడలో ఆ గొలుసు బంగారమేనా? ఎక్కడ చేయించావూ? అన్న ప్రశ్నలే లేవూ."
సరే… అవన్నీ పల్లెటూరి ఆనవాయితీలు. పట్నాల్లో అలా వుండదెహే! అని నచ్చచెప్పుకున్నామా? హైదరాబాద్‍లో ఆటో ఎక్కితే ఆటోవాలా "కిదర్ జానా సాబ్?"... ఓ ఎమ్.ఎల్.ఏ బాల్‍రెడ్డి ఇంటి దగ్గరా? మీరు ఓటు ఎవరికేసిన్రు సాబ్?... వానికేసిన్రా లేదా?... థూ.. ఆ నరినిమే గానికా ఏసిన్రా? ఔలా వున్నావ్ సాబ్... నీకు దమాక్ లేదు." అని ప్రయాణంలో పిచ్చాపాటీ మాట్లాడే దిక్కేలేదు.
మనుషులుని వదిలేద్దురూ… చెట్టు, పక్క చెట్టుని చూసి, సిగ్గు తెచ్చుకుని ఎక్స్ ట్రా కొమ్మ పెరగనివ్వదూ, చిగురు తొడగదూ! దీని సిగ్గు చిమడా…
వాహనాలు ఇంకా ఒద్దిగ్గా వెళ్తున్నాయి. మా అబిడ్స్ సెంటర్లో కార్లు ఇది చూస్తే తిరగబడి నవ్వుతాయి. వీటికి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవని.
పెంపుడు జంతువులు మిలట్రీ ఆఫీసర్ అంత గంభీరంగా చూస్తాయి ఏంటీ? అదే మన రాజమండ్రిలో దగ్గరకొచ్చి, మనం కదలకుండా నిలబడితే కాలెత్తెయ్యవూ? కొన్ని ధర్మాసుపత్రుల్లో, పిల్లల్నే నోటకరుచుకు పోతుంటాయి. ఇంక రోడ్లమీద అవి చేసే వీరవిహారం ఏం వర్ణించగలం?
అసలు అమెరికా నుండొచ్చిన మా ఫ్రెండ్ పిల్లలు మొదటిసారి జూ పార్క్‌కొచ్చినట్లు రాజధాని వీధుల్లో "హార్న్... బఫెలో, పిగ్, క్యాట్, మంకీ, గోట్, షీప్, కేమెల్" అని అరుస్తూ చపట్లు కొట్టడం చూస్తే అర్ధమైంది, అక్కడ మనుషులూ జంతువులూ కలిసి ఒకే రోడ్ల మీద తిరగరని.
అసలు మనుషులూ, వారి పక్కనే జంతువులు కలిసి స్నానం చేనే ఘట్టాలు కూడా ఈ దేశంలో కనీ విని ఉండరు.
మా ఊళ్ళో పంతులుగారు గోదాట్లో బుడుంగున మునిగితే, పక్కనే తేలిన దున్నపోతు పంతుల పంచె నమిలి మింగేసిందిట.
ఆయన దిశమొలతో బజారుల్లో పరుగులు.
అసలు అమెరికాలోనే పుట్టి, అక్కడ జ్ఞానం వచ్చాక, మొదటిసారి భారతదేశం వచ్చిన మనవాళ్ళ పిల్లలు, ఇక్కడ జన జీవన స్రవంతిలో కలవడానికి ఎన్నిరోజులు పడ్తుంది? మనవాళ్ళు మొదటిసారి అమెరికా వెళ్ళి ఇన్ని పద్ధతులూ, ఇంత డిసిప్లీనూ ఎలా నేర్చుకున్నారో అని ఆశ్చర్యపోతుండగా కొంత మంది కొన్నేళ్ళయ్యాక పిల్లలని తీసుకొని వెనక్కొస్తున్నారు భారతదేశం. ఇంత స్వేచ్చా స్వాత్రంత్రాలున్న మన దేశవాళీ పద్ధతుల్ని చూసి, ఆ పిల్లలు మూర్ఛపోవడం కూడా నేను చూసాను.
ఎదురింటి వాళ్ళ మనవరాలు ప్రొద్దుటే బయటకొచ్చి, "వాటీజ్ దిస్ నానమ్మా? కౌ డంగ్? ఇట్సే ఎ షిట్... వై ఆర్ యూ టచింగ్ ఇట్ విత్ బేర్ హేండ్స్?" అని అరిచింది.
ఆ పదమూడేళ్ళ పిల్లకి జానకమ్మగారు "అవి గొబ్బిళ్ళే. శ్రీమహాలక్ష్మీ అవతారాలు... దణ్ణం పెట్టుకో" అని నేర్పించింది.
ఇంక ఆ పిల్ల, రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ యధేఛ్చంగా కనిపిస్తున్న "శ్రీమహాలక్ష్మీ రూపాలకి" ట్రాఫిక్ మధ్యలో ఆగి మరీ దణ్ణాలు పెట్టసాగింది. ఇంతలో ఓ ఆటో చక్రం ఆ పిల్ల ఎడమకాలు మీద నుండి వెళ్ళిపోయింది పాపం.
అసలు తొండాలు లేని ఏనుగులని చూసి ఆ అమెరికా పిల్లలు అమాంతం జ్వరపడ్డారు. దానికి తోడు, సాయంత్రం అయ్యేటప్పటికి మేజువాణీ కట్టే దోమల హోరున ప్రవహించే సైడ్ కాలువలూనూ.
భారతదేశాన్ని విమర్శించడమో, దుయ్యబట్టడమో కాదు. మా డైరెక్టర్ ఒకరన్నారు నాతో- "తొంభై ఏళ్ళ వాళ్ళ వానలో, గొడుగేసుకుని, చెంబు పట్టుకుని వెళ్తున్నారు చూడండి మరుగు దోడ్లు కట్టించుకోకుండా" అని కర్ణాటకా, మహరాష్ట్రా బోర్డర్‍లో ఒకచోట నేను చూసి అంటే "దీని బట్టి మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే తొంభై ఏళ్ళదాకా మనదేశంలో దేహాలకి ’ఇమ్యూనిటీ’ వుంది. కాబట్టి ఏం ఫర్లేదు" అన్నారు.
ఇప్పుడు అసలు సంగతికొస్తే, మా ఇంటికి అమెరికా నుండి బావగారొకరు(నాకు కేశవా, నారాయణా, గోవిందా, మధుసూధనా- అంటూ తొమ్మండుగురు బావగార్లు) మమ్మల్ని చూడ్డానికొచ్చి, చేతిలో మినరల్ వాటర్ బాటిల్ పట్టుకొచ్చారు. అది కాస్తా అయిపోయింది, నేను టిఫిన్ పట్టుకోచ్చేలోగా. మా పెద్దవాడు అప్పుడు లోపలికొచ్చి "అమ్మా... పెద్దనాన్న నీళ్ళు అయిపోయాయి. పదిరూపాయలు ఇవ్వు . కొనుక్కుంటాడు" అన్నాడు.
అలా మేము చిన్నప్పుడు దాను దగ్గర పిడత కిందపప్పు కొనుక్కుతిన్నా, ముసలి గొడుగు కింద మరమరాల ఉండలు కొనుక్కుతిన్నా, వీధి నల్లాలో నీళ్ళు తాగినా, మంగాచారిగారి బావిలోంచి నీళ్ళు తోడుకుని తాగినా ఏ జబ్బులూ రాలేదు.
రైళ్ళలో మరచెంబు నిండా తీసుకెళ్ళి తాగాము. ఇరానీ హోటళ్ళలో వాడు "ఏక్ చాయ్. దస్ పానీ" అంటూ, నాలుగు వేళ్ళు గ్లాసుల్లో ముంచి పట్టుకొచ్చినా తాగాము. పానీపూరీ వాడు కుండలో చెయ్యి మోచేతిదాకా ముంచి, దొప్పలో పానీపూరీ వేసినా ’ ఇమ్యూనిటీ’ దెబ్బ తినలేదు. స్కూళ్ల దగ్గర బరఫ్‍లు "చల్లగా మెల్లగా తాగిపోరా పిల్లగా" అని రహీం, బరఫ్ కోరి, పుల్లకి వుండలా పెట్టి, కాస్త చక్కరపాకం, ఎర్రరంగూ వేసిస్తే నాక్కూంటూ తిన్నాం. ఐస్‍ఫ్రూట్‍లు రంగురంగుల్లో కారుకుంటూ తిన్నాం. మామిడి పండ్లు పోటీలు పడి చీక్కుంటూ, ఈగలు తోలుకుంటూ తిన్నాం. కాకా హోటళ్ళలో బల్లల నిండా నల్లని దుప్పటి పరిచినట్టున్న ఈగల్ని తోలేస్తూ, ఇచ్చిన కాఫీలు తాగాము. కాలేజీల ముందు పెట్టిన మిరపకాయ బజ్జీల బండి వాడు ఇచ్చిన సత్తు గ్లాసుల నీళ్ళు తాగాము. స్టేషన్ దగ్గర పెద్ద గాజు గ్లాసులో సగం పైగా కోవా వేసిన లస్సీలు తాగాము. మంగళగిరిలో మెట్ల దగ్గర అవ్వ వేసిన వేడి వేడి పెసరట్లు తిన్నాం, వెల్లుల్లి కారంతో. అపురూపమ్మ, గిన్నెలో బియ్యం పిండి గరిటెడు వేసి తిప్పి బోర్లిస్తే, ఆ దోశలు తిన్నాం, నల్లకారంతో. దాన్నే ఇప్పుడు "ఆపం" అంటున్నారు. మేం ఎప్పుడు ఆపాము కనుక? సాయంత్రాలు సెంటర్లో పెట్టే చల్ల పొంగరాల ఘుమఘుమలూ, వేడివేడి జిలేబీలూ, ఏనాడైనా ఆపాము కనుకనా?
ఇడ్లీ స్పూన్‍తో సాంబారులో నానబెట్టి, నోట్లోదాకా పెట్టుకుని మింగుతూ, ఈ సత్తుస్పూన్లు, సరిగా కడిగాడా? ఈ బజ్జీల బాండీ జన్మలో తోముతాడా? ఆపానీపూరీలో నీళ్ళు ఏ నీళ్ళతో చేసాడు అని కానీ ఆలోచించామా?
మా చిన్నప్పుడు లక్ష్మయ్య అని ఒకడు మంచినీళ్ళు తెచ్చి పోసేవాడు. వాడు ఒక రోజు రాలేదు. వాళ్ళ అమ్మ వచ్చింది, లక్ష్మయ్య ఎందుకు రాలేదు అంటే?... "వాడు రాత్రిళ్ళు బేకరీలో నానురొట్టె (బ్రెడ్) చేసే పిండి రొక్కుతాడు గదమ్మా... అందుకే నిన్న తొక్కి తొక్కి జ్వరం వచ్చింది" అందావిడ.
అప్పుడు తెలిసింది బ్రెడ్‍కి పిండి మనుషుల చేత తొక్కించేవారని. ఏవైంది ఇన్ని తిన్నా? మాకు? ఇమ్యూనిటీ పెరిగింది. భారతీయుడు ఎవరైనా వాటర్ బాటిల్‍తో అమెరికాలో ఎవరింటికైనా వచ్చాడా?
చిన్నతనంలో గోడమీద బల్లులు, గోడల్లో నల్లులు, వంటింట్లో ఎలకలు, వాటికోసం పిల్లులు, రాత్రి అయితే దోమలు వానపడితే రెక్కలు పురుగులు, ఎండాకాలం వస్తే చీమలు, ఏ కాలం అయినా ఈగలు మా దేశంలో సర్వసాధారణం మా చిన్నతనంలో తెలిసినన్ని పురుగులు ఇప్పటి పిల్లలకి తెలుసా?
మాకు రోళ్ళ చుట్టూ ముడుచుకు పడుకున్న రోకలి బండలు, చెట్లమీద నుండి ’పారాచూట్’ ల దిగే గొంగళీపురుగులు, మొక్కలు పెట్టడానికి తవ్వుతుంటే గాజుపురుగులు, వానలో వచ్చే వానపాములు. హానున చెట్టు కింద దీపం గుత్తల్లా వేల్లాడే మిణుగురుపురుగులు. పూలమీద తుమ్మెదలు. తోటంతా ఝూంకారం చేసే తూనీగలు… రంగురంగుల సీతాకోక చిలుకలు, మెత్తని పచ్చిక మీద ఎర్రటి ఆరుద్ర పురుగులు. మాతోబాటు సహవాసం చేసిన బొద్దింకలూ, జిల్ల పురుగులూ, కండవూడి వచ్చేట్టు పట్టుకునే కండ చీమలు, ప్రతి చెట్టుకీ పట్టుకునే తేనేటీగలు. తీపిని ఇష్టంగా పట్టే నల్ల చీమలు. దేన్నీ వదిలి పెట్టని ఎర్రచీలలు. ఈడుస్తూ పొద్దున్న బయలదేరితే సాయంత్రానికి గది చివరికి చేరే నత్తగుల్లలూ. చెట్లమీద గెంతుతూ రంగులు మార్చే ఊసరవెల్లులూ.
అలా ప్రకృతే మేమూ, మేమే ప్రకృతిగా మమేకమై పెరిగాం.
ప్రతీ కాలం చెబుతూ వచ్చేది. "గొడుగులు బాగుచేస్తాం" అని ముందు కేకలు వినబడితే, వానాకాలం వస్తోందని గుర్తు. బజార్లలో నేపాలీ వాళ్ళిచ్చి స్వెట్టర్లు రంగుల తోరణాల్లా కడితే, చలికాలం వచ్చేసింది, ’అమ్మో’ అనుకునే వాళ్ళం.
వేసవి కాలం ముందే చల్లని కుండలూ, అందులో నల్ల పింగాణీ కుండలూ పొడగు రంజన్లూ, చలివేంద్రాలూ వెలినేవి. ఒకటేవిటి... వేసవిలో చల్లని చెరుకురసాలు, మత్తెక్కించే మల్లెపులూ, తాటి ముంజెలూ, మావిడి పడ్లూ, విసనకర్రలూ అన్నీ అమ్మొచ్చేవి.
ఇళ్ళముందు తాటాకు పందిళ్ళు వేస్తే ఇంటికి చలవ. అలాగే సాయంత్రాలు ఇళ్లముందు కళ్ళాపులూ, మల్లెపందిరి కింద మడత మంచాలు, కిటికీలకి వట్టివేళ్ళ తడికలు. ప్రొద్దుట బడికెళ్ళేటప్పుడు కడుపులో చల్లగా తరవాణీ అన్నం, ఇంటికి ఎవరొచ్చినా ఇవ్వడానికి చల్లకుండ. అవి తాగినవాళ్ళు మీరు ’చల్లగుండా’ అని దీవించేవారు.
వానాకాలం ముక్కులు కారిపోవడం, ఎండాకాలం చెమటలు కారిపోవడం పిల్లలకి పరిపాటే. అసలు ఎండాకాలం ఓ వయసొచ్చేదాకా పిల్లలని బట్టలు వేసుకునేవాళ్ళు కాదు.
చలికాలం ఇంటిముందు నెగళ్ళూ, రగ్గుల్లో దూరి పడుకోవడం ఎంత బావుండేదీ? ఆవకాయ అన్నం తిని పడుకుంటే మూతి కర్ఫూరంలా మండుతుండేది చలికి పగిలి. మోకాళ్ళకీ, చేతులకీ పెద్దవాళ్ళు మంచినూనె రాసేవాళ్ళు. కాళ్ళు పగిలితే, కిరసనాయలు షాపులో నుండి ఆ మడ్డి తెచ్చి పెట్టుకునేవాళ్ళు. వారానికోసారి ఆముదం రాసి, ఒళ్ళంతా నలుగుపెట్టి, హాబు నిండా వేడినీళ్ళు తోడి, కుంకుడు రసంతో తలంట్లు పోసేవారు. సాంబ్రాణితో పొగలు వేసేవారు.
వయసొస్తుంటే ఆడపిల్లలకి "కాస్త చందనం పసుపూ రాసుకో అమ్మా!" , "మీగడ మొహానికి రుద్దుకో" , "వెన్నెతో నలుగు పెట్టుకో" అనేవారు. మొహానికి పౌడరూ, కళ్ళకి కాటుకా, నుదుట తిలకం బొట్టూ పెట్టుకునేవాళ్ళు.
మొహాలకి ఫౌండేషన్లూ, బేస్‍మెంట్లూలాంటి కట్టడాలు లేవు. తలకి కొబ్బరి నూనె, ఒంటికి వెన్నపూసా! కాళ్లకి పసుపూ, తలలో పూలూ. అవే అలంకరణలు.
వర్తమానంలోకొస్తే ఇప్పటి పిల్లలకి ’ఇమ్యూనిటీ’ లేదు. రకరకాల వ్యాధులూ, జ్వరాలూ, నీళ్ళు కొత్త చేస్తాయి. చర్మవ్యాధులొస్తాయి. అన్ని ఉష్ణోగ్రతలూ పడవు. తిండి అయితే మేం తిన్నట్లు జీడిమామిడి పండ్లు పీక్కుతిన్నా, పొగడ పండ్లు కోసుకుతిన్నా, చీమచింతలు రాల్చుకుని తిన్నా పడతాయా?
అసలు జామ చెట్టెక్కి, కాయలు కోసి, తిట్లు తినని బాల్యం ఒక బాల్యమేనా?
హుండీల్లో డబ్బులు దాచితే, టంగ్‍క్లీనర్‍తో వాటిని బయటకి లాగి దొంగతనం చేయని బాల్యం ఒక బాల్యమేనా?
ఆరుబయట ఆడుతూ, పెద్దవాళ్ళు చివాట్లు పెట్టేదాకా ఇళ్ళకి రాని బాల్యం ఒక బాల్యమేనా?
అన్నలతో, చెల్లెళ్ళతో ఒకే కంచంలో అన్నం ముద్దలు తింటూ, ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని, ఆటపట్టించుకోని బాల్యం ఒక బాల్యమేనా?
పిల్లలు రాత్రిపూట దుప్పట్లలో దూరి, పెద్దవాళ్ళకి వినిపించకుండా గుస గుసలతో సినిమా కథలు చెప్పుకోని బాల్యం ఒక బాల్యమేనా?
బడి ఎగ్గొట్టి, నాన్న సంతకంతో లీవ్ లెటర్, టీచర్‍కి ఇవ్వని బాల్యం ఒక బాల్యమేనా?
బడి ఎగ్గొట్టి పెద్దవాళ్ళకి తెలీయకుండా సినిమాకి వెళ్ళని బాల్యం.... ఒక… నేను చెప్పలేను.
ఇంత భూతల స్వర్గంలాంటి అమెరికాలో పిల్లలకి మా బాల్యంలో ఉన్నన్ని అనుభవాలు కొన్నైనా ఉన్నాయా? అని ఐదవ ట్రిప్‍లో కూడా అనుమానంగా వుంది.
అదండీ సంగతీ.
౦ ౦ ౦
బలభద్రపాత్రుని రమణి
పేరెన్నిన తెలుగు నవలా రచయిత్రి, కథా రచయిత్రి మరియు చలనచిత్ర కథా రచయిత్రి. కథలతో రచనా ప్రస్థానం ప్రారంభించి, నవలా రచయిత్రిగా ప్రాచుర్యం పొందారు. కొన్ని నవలలు తెలుగు చిత్రాలుగా చిత్రీకరించబడ్డాయి. వీరి నవలల్లో మానవ సంబంధాలు, సున్నిత భావోద్వేగాలని ప్రధానాంశాలుగా గమనించవచ్చు.
***