MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
రాయలే దిగి వస్తే...
శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)
సీ।। లేప్రాయమున ముగ్ధగా ప్రాకృతమ్మునన్
తేనెలూరినదయ్య తెలుగు భాష
యవ్వనమ్మున చేర్చ అందమౌ పదములన్
దీరి సుందరియాయె తెలుగు భాష
సంస్కృతమ్మును చేర్చ సరివయస్సున మారి
దివ్యత్వమున్ పొందె తెనుగు భాష
ప్రాచీన భాషగా పక్వమై జగమందు
దేవభాషగమారె తెనుగుభాష
ఆవె।। పశ్చిమాన నేడు ప్రజ్వలించుచు దేశ
దేశములకు చేరె తెనుగు భాష
అన్నిదేశములకు అధికారభాషగా
తేల్చదగినదయ్య తెనుగు భాష
అల స్వర్గాన తేట తెలుగు పద్యాలు పాడుకునే శ్రీకృష్ణ దేవరాయనికి, ఒకసారి భూలోక పర్యటన చేసి వస్తే బాగుంటుందని ఆలోచన రాగా కాలమాన పరిస్థితుల ప్రకారం దుస్తులు ధరింపజేసి అమెరికాలో ఒక పట్టణంలో ఒక బుర్ర మీసాల తెలుగాయన శరీరంలోకి దింపాడు దేవేంద్రుడు.
మీటింగుకు ఆలస్యమైపోయి హడావిడిగా కారు దిగి పరుగు లాంటి నడకతో పోబోతూంటే ఒకాయన గుద్దుకోవడంతో, పగటికల చెదిరిన ఆర్కే తేరుకుని, గుద్దుకున్న ఆయన బుఱ్ఱమీసాలను చూడగానే గుర్తుపట్టేసి చిరునవ్వుతో “హాయ్ -అయామ్ ఆర్కే” అని షేక్ హాండ్ ఇవ్వబోతే రాయలు మీసం మెలివేసి గర్జించి చిరుకోపంతో చూసాడు.
"ప్రభూ - నన్ను గుర్తు పట్ట లేదా? నేను మీ వికటకవిని - చేసిన పాపాల ఫలితంగా 20వ శతాబ్దంలో మరో జన్మ ఎత్తాను. రామకృష్ణ పేరు సంక్షిప్త రూపం ఆర్కే - ఇప్పుడే మీ రాక గురించి మీకు టూరుగైడుగా వుండమని ఆదేశించాడు దేవేంద్రుడు. ఇది 21వ శతాబ్దం, రాజ్యాలు రాచరికాలు లేవు, ప్రజాస్వామ్యంలో అభివాదం చేసే తీరు ఇదే”అన్నాడు.
పక్కనే వున్న ఆర్కే భార్య కాత్యాయిని, అతని నాటకాల పిచ్చి ముదిరి రోడ్డున పడిందో మతి భ్రమించిందో అని భయపడుతూంటే, “ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ - హీ ఈస్ కేడీయార్” అని పరిచయం చేసాడు. “నైస్ టు మీట్ యూ కేడీయార్ - అయామ్ కాట్యా - సీయూ లేటర్”అని తెలుగుయాస ఇంగ్లీషులో చెప్పి జవాబుకోసం ఎదురుచూడకుండా తన పనిమీద వెళ్ళిపోయింది.
“నా శ్రీమతి ప్రభూ” తెలుగులో మాట్లాడితే అమెరికావాళ్ళు వెలివేస్తారని ఆమె భయం” అంటూండగనే ”మరి కేడీయారు......” అని రాయలు అంటూండగా ఆర్కే “మీ పేరు షార్ట్ ఫార్మ్” అంటే పగలబడి నవ్వేసాడు రాయలు.
“మీరు సరైన సమయానికే వచ్చారు. ఇక్కడ జరుగే తెలుగు సంస్థ ఉత్సవాలలో భువనవిజయం పద్య నాటకం వేస్తే ఎలాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది నాకు. దానిగురించే కార్యకర్తలతో మాట్లాడడానికి వెళ్తున్నాను. రండి. మీ నిజ ఉనికిని ఎవరికీ తెలుపను”అన్న ఆర్కేవెంట యాంత్రికంగా నడిచాడు.
మీటింగులో తెలుగు ఉత్సవాలలో ఏమేమి అంశాలు ఉండాలన్న తెలుగుప్రముఖుల చర్చ మొత్తం ఇంగ్లీషులోనే జరగడం మూలాన ఏమీ అర్థం కాక కేడీయార్ ఫ్లాష్బాక్ లోకి వెళ్ళిపోయాడు.
సినీ తారలు మిణుక్కుమని కనిపించి చటుక్కున మాయమయ్యే కార్యక్రమాలు, సినిమా పాటలకు నాట్యాలు వంటి సినిమా ఆధారంగా రూపొందించబడ్డాయి దాదాపు అన్నికార్యక్రమాలు.
భువి ప్రస్తావన ఆర్కే తేగానే మిగిలిన సభ్యులంతా నిశ్శబ్దంగా వుండిపోయారు. చాలా మందికి అది ఏమిటో తెలియదు. కానీ ఆ మాట ఒప్పుకోడానికి అహంకారం అడ్డమొచ్చింది. ఒకాయన, “సార్, ఎన్టీయార్ సైన్మల జూసిన - ఏయెన్నార్ గూడా ఉన్నడండ్ల - పజ్జాల మీద పజ్జాలు - జరంతగూడ దమాక్కెక్కలే - కానీ చూస్తందుకు వినేటాందుకు మస్తుగుండె”. అన్నాడు.
ఇంకో ఇద్దరు, పగలబడి నవ్వి, "పద్యాలా - ఎవరికి కావాలండీ పద్యాలు ?- దే నీడ్ టు గో ఇంటు ఆర్కైవ్స్ - క్లాసిక్ తెలుగు ఈస్ బోరింగ్. వద్దు లెండి" అంటూండగా
ఈ మాట విన్న కేడీయార్ కు మతిబోయి - అన్నవాని తల నరుకుదామని లేవబోతే ఆర్కే గట్టిగా చొక్కా కింది అంచు సీటుకు అదిమి పట్టి ఆపి పెట్టాడు. కానీ కేడీయార్
కం||సలసలకాగెడి నూనెను
మలమలమాడ్చేతు నిట్టి మలినాత్ముల మీ
పలువరసయె మార్చెద మిము
వెలివేసితి పురమునుండి వెడలుమ్మిపుడే
అని కూర్చున్నచోటే గర్జించాడు.
ఆ ధాటికి అదిరిపోయి, అతడెవరో తెలియని అందరూ కదలకుండా ఉండిపోయారు. తెలుగు అలవాటు తప్పి, పూర్తిగా అర్థం కాక మరికొందరు వెర్రిమొహం వేసారు.
మాండలీకంలో మాట్లాడిన అతను మటుకు ఈల వేసి చప్పట్లు కొట్టాడు.
ఆర్కేకి ఆ పద్యం భావం అందరికీ అర్థం కాలేదని తెలిసిపోయింది. అందుకుని “హీ ఈస్ కేడీయార్ - ఎ పైన్ పోయెట్ అండ్ ఆక్టర్. హీ వాంటెడ్ టు షో గ్లింప్సెస్ ఆఫ్ భువి”అన్నాడు. “ ఆల్సో హీఈస్ రెడీ టు స్పాన్సర్ దిస్ షో బై గివింగ్ ఎ బిగ్ డొనేషన్" అన్నాడు విరాళం తనే ఇచ్చేందుకు సిద్ధమై.
మరి అతను విరివిగా ఇచ్చే విరాళాలు పోతాయన్న భయంతోనో, లేదా తమను సంస్కృతి కాపాడలేని చవటలనుకున్నారో, లేదా కేడీయార్ పద్యానికి ముగ్ధులైనారో, “ఇద్దరు సినీ తారల మిణుక్కు-చటుక్కుల మధ్యలో విరామ సమయంలో ఒక ఇరవై నిమిషాలు దాటకుండా, అందరికీ అర్థమయ్యే భాషలోనే వుండే నాటకమైతే వేయమని ఆ సభ నిర్వాహకులు పరిమితులు పెట్టారు. కాదంటే వచ్చిన అవకాశం పోతుందనుకుని వాళ్ళు మనసు మార్చుకునేలోగానే అక్కడినుంచి కేడీయార్ తో సహా బైటపడ్డాడు ఆర్కే. కానీ కేడీయార్ మాత్రం కోపంచో వూగుతూనే వున్నాడు.
ఆర్కే అందుకుని "ఏమయింది ఆంధ్రభోజా? ఎందుకంత కోపంగా వున్నారు?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నడిరోడ్డుమీదనే రాయలవారు:
కం||భువనవిజయమంటే యది
చివరయనగ తెలియకుండ చీకటిపడినన్
అవిరామముగా సాగుచు
కవులను ఉత్సాహపరచు ఘనమగు సభయే
కానీ నీ ఉత్సాహము మండిపోనూ
కం||పలురకముల కార్యక్రమ
ములుగల యుత్సవమునందు మోతలమధ్యన్
వలెనంటే అరగంటయె
కలదు భువనవిజయమునకు కవితలు చదువన్
అని అనే కార్యకర్తల కార్యక్రమ నిబంధనలకు లోనుచేసి కించపరుస్తున్నారు మా భువనవిజయాన్ని. ఆ నిబంధనలమూలాన, కవుల భావప్రకటన గొడ్డలిపోటుకు గురియయ్యింది.అని తన ఆక్రోశం వెళ్ళబుచ్చాడు.
ఇది జరుగుతుండగా పలు వర్ణాల జనం రోడ్డుమీద వున్న మాచుట్టూ గుమిగూడి, అది ఏదో ఫ్లాష్మాబ్ కార్యక్రమమనుకుని చప్పట్లు కొట్టి కొన్ని డాలర్లు వేసేసి తమ దారెంబడి తాము వెళ్ళిపోయారు. ఆర్కే మెల్లగా కేడీయార్ ను కారులోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సముదాయిస్తూ
ఆవె|| నేను మదరుటంగునే తప్ప
అదరు లాంగ్వేజి యూసు మానివేతుననుచు
మాతృభాషయన్న మక్కువెక్కునయన్న
మాటకూడయాంగ్లమందెజెప్పు
కం||వందల టిక్కెట్లనుకొని
మందల జనమొత్తురు సినిమావారలకై
కందములన్ చదివిన ఇబ్
బందులపాల్జేతురన్న భయమదియుండెన్
అని అనగా, కేడీయార్ అందుకుని
కం||తెలుగున మాట్లాడుటయే
తలనొప్పియనేటివారి దరివలదోయీ
వెలెవెలబోవే కవితలు
విలువ తెలియనట్టివారు వినిబోరనగన్
వినగోరనివారికి పట్టి కూర్చోబెట్టి వినిపించడమేలనో. నిజానికి చూస్తే
కం||అలరించవు కవితలు మము
వలదు కవుల సభలనేటి మందలకన్నా
తెలుగన అభిరుచి మెండుగ
కలవారొక పదుగురున్న కవులకు చాలున్
కం||కొందరు వినిననుయది మన
నందరి నుత్సాహపరచు ననునది నిజమే
అందముగా పద్యపు మక
రందమ్ముల నందజేతు మానందమిడన్
అని, నా పాలనలో రాజిల్లజేసిన తెలుగు దినదిన ప్రవర్ధమానమై వుంటుందన్న ఆశతో ఒకసారి చూసి పోదామని వచ్చాను. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. అని కాయానిష్క్రమణం చేసేసాడు కేడీయార్ - సారీ కృష్....
ఇంతసేపు కేడీయార్ గా మసలిన మీసాలాయన అసలు ప్రపంచంలోకి వచ్చి, ద్దేశించి, మీరెవరు, ఈ కారెవరిది, నేను ఇక్కడెందుకు ఉన్నాను అని ప్రశ్నల వర్షం కురిపిస్తుఁడగా మీటింగునుంచి బైటికి వచ్చిన సభ్యుడు “సార్ .....కేడీయార్ .... జబర్దస్త్ పద్యం పాడి హిలాయించేసినావన్నా .. మెంబల్రంతా హడల్ నేను మాత్రం ఫిదా“ అనడంతో అంతకుముందు పద్యం అన్న పదం కూడా ఎరుగని మీసాలాయన బిత్తరచూపులు చూస్తూండిపోయాడు.
*****
సగటు ప్రవాసాంధ్రుల తెలుగు సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలపై ఒక చిన్న వ్యంగ్య రచన - సరదాగా నవ్వించడం కోసమేకానీ ఎవరినీ కించపరచే ఉద్దేశ్యంతో వ్రాసినది కాదు.