MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
రావిశాస్త్రి ఆరుసారాకథలు – భాష – సామాజికత
వేదాంతం బాలమురళీకృష్ణమాచార్యులు
పరిచయం :- రావిశాస్ర్తిగా పేరొందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారు సాహితీ లోకంలో ప్రసిద్ధ కథకుడిగా అందరికీ సుపరిచుతుడే. ఆయన వ్రాసిన కథాసంపుటాలు, నవలలు, మనోవిశ్లేషణాత్మక నవలలు, నాటికలు, నాటకాలు మొదలైన రచనలన్నీ పాఠకులకి సామాజిక వాస్తవాల్ని మరింత చేరువచేసాయని చెప్పవచ్చు. ఆయనరచనల్లో సామాజిక సమస్యలే ప్రథాన ఇతివృత్తం. రాచకొండ కథలు, బానిస కథలు, ఆరుసారాకథలు, కథాసాగరం వంటి కథా సంపుటాల్లో, తిరస్కృతి, విషాదం అనే నాటికల్లో, నిజం అనే నాటకంలో, అల్పజీవి అనే మనోవిశ్లేషణాత్మక నవలలో సామాజిక సమస్యలను గురించి ప్రస్తావించడంతో పాటు, నాటిసమాజంలో ఉన్న వ్యక్తుల విభిన్నమనస్తత్వాన్ని, తీరుతెన్నులను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు.
రావిశాస్త్రిగారు ‘ఆరుసారాకథల’ ద్వారా మద్యపానం, అవినీతి వంటి సామాజిక సమస్యల్ని స్పృశిస్తూ, సామాజిక వాస్తవాలను విభిన్న మానవతాధోరణులను, సామాజిక వింతపోకడలను, తెలియజేశారు. సందర్భోచిత కథాసన్నివేశాల ద్వారా, పాత్రలద్వారా సామాజిక పరిస్థితులను ప్రతిఫలింప జేస్తూ సామాజిక మార్పును కాంక్షించారు.
ఉదాహరణకు ‘పాపి’ అను కథలో – మనుషుల్లో నైతికత దిగజారి, స్వార్థపరత్వం పూర్తిగా పెరిగిపోయిందని, నైతికతను విస్మరించిన మనిషి పతనానికి గురిఅవుతాడని ‘రామదాసు’ పాత్రద్వారా తెలియచెప్తూ, సమాజాభివృద్ధికి నైతిక విలువలు అత్యంతావశ్యకమన్న సందేశాన్ని అందించారు. పాఠకులకు ‘ఆరుసారాకథలు’ చదువుతున్నప్పుడు కదేతివృత్తాలన్నీ ఒకేవిధంగా సారాకి సంబంధితమై ఉన్నట్లుగా కన్పించినప్పటికీ ఒక్కోకథ ద్వారా కవి నూతనమైన సందేశాన్నిచ్చినట్లుగా గ్రహించడం జరుగుతుంది.
‘మాయ’ అనే కథలో – ముత్యాలమ్మ సారా కేసులో నిందితురాలిగా న్యాయస్థానం ముందు నిలబడుతుంది. న్యాయస్థానంలో ఆమె ప్రసంగంద్వారా సాక్షుల్ని పోలీసులు, డబ్బున్నవాళ్ళు ఎంతగా ప్రభావితం చేస్తున్నారో, డబ్బు అధికారం వంటి ప్రభావాలతో వారు ఏవిధంగా చెలామణి అవుతున్నారో యదార్థదృశ్యంగా చిత్రించినట్లు పాఠకులకి సుస్పష్టంగా అర్థమవుతుంది. న్యాయం కథలోనూ ఒక అమ్మాయి ఆక్రందన ద్వారా న్యాయాన్ని డబ్బు ప్రభావితం చేయగలదన్న వాస్తవాన్ని తెలియజెప్పారు. ఈ కథల ద్వారా – డబ్బు, అధికారం వంటివి న్యాయస్థానాల్లో న్యాయాన్ని ప్రభావితం చేయకుండా ఉండే మెరుగైన సమాజం ఏర్పడాలని రచయిత ఆకాంక్షించారు.
‘మోసం’ కథలో అప్పారావు పాత్రద్వారా లోకం తీరును ఎండగడుతూ సమాజంలో బతుకుదెరువు కోసం మోసాలు చేసినా పర్వాలేదు డబ్బుండాలి అన్న దుష్టస్వభావం కల్గిన మనుషులు పెరిగిపోతున్నారన్న సత్యాన్ని వెలిబుచ్చారు. ‘పుణ్యం’ కథలో అసూయపరుల మనస్తత్వాన్ని, పోలమ్మ పాత్రద్వారా పోలీల నిజస్వభావాన్ని బహిర్గతం చేసిన తీరు పాఠకుల్లో కథాసక్తిని కలిగిస్తుంది. ‘మోక్షం’ కథద్వారా న్యాయస్థానాల్లో అసలైన దోషులు తప్పించుకోవడం, అమాయకులకి శిక్షపడడం వంటి పరిస్థితులు ఉన్నాయన్న వాస్తవాన్ని నిర్భయంగా ప్రకటించారు.
ఈ కథల ద్వారా రచయిత లోకంలోని ఈర్ష్యాసూయా ద్వేషాలు, మోసాలు, మాయలు చేయడం వంటి కుళ్ళును కడిగేస్తూ సమాజంలో నైతిక విలువలు పెంపొందాలన్న సందేశాన్నందించారు.
వైవిధ్యాంశాలు:- ఈ కథాసంపుటిలో పదప్రయోగశైలి, అలంకార ప్రయోగం అను రెండంశాలు పాఠకునికి వైవిధ్యంగా అనిపిస్తాయి. ప్రతికథలో ఉత్తరాంథ్రమాండలిక భాష ప్రస్పుటంగా కనపడటం, సందర్భానుగుణంగా ఉపమాలంకార ప్రయోగాలు ఉండడం వైవిధ్యతకు నిదర్శనంగా కనబడుతుంది.
ఉదా:- ‘మాయ’ కథలోని అంకి (అంకె), ఒచ్చేను (వస్తాను), వారసం (వర్షం), శానా (చాలా) వంటిపదాలన్ని ఉత్తరాంధ్ర మండలికానికిచెందినవే.
కథల్లోని పాత్రలను పరిశీలిస్తే ఒక్కోక్కపాత్ర నాటి సమాజాన్ని ప్రతిబింబించే సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పవచ్చు. ప్రతిపాత్ర పాఠకునికి నిత్యజీవితంలో ఎదురయ్యే వ్యక్తుల్లాగా అనిపించడం. ఇది ఆయన పాత్రచిత్రణకు తార్కాణం.
మధ్యపానం, అవినీతి వంటివి సమాజాభివృద్ధికి హేతువులని తెల్పుతూ, వాటిని ఖండిస్తూ, తమ కర్మసంపుటి ద్వారా మానవాభ్యుతిని ఆకాంక్షించారు.
ఆధారగ్రంథాలు:-
-
ఆరుసారాకథలు – రావిశాస్త్రి.
-
తె.సాహిత్యచరిత్ర – ద్వా.నా.శాస్త్రి
డా. వేదాంతం బాలమురళీకృష్ణమాచార్యులు,
ఎమ్.ఏ.బి.ఎడ్.పి.హెచ్.డి. (తెలుగు).
గుంటూరు.