top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

The-Painting.jpg
toorupu-gaalulu.jpg
ayyakoneru.jpg
haveli.jpg
1628781308327_Independence Day Cover Front 2021 copy.JPG
2021-09-30_12-47-49.jpg
vasuchar.jpg

The Painting అన్న పుస్తకం నౌడూరి సూర్యనారాయణమూర్తి గారు, ఆర్.ఎస్. కృష్ణమూర్తి గారు కలిసి ఒక వంద మంచి కథలను తెలుగులోకి అనువదించాలనే సంకల్పంతో మొదలు పెట్టి, ఒక నాలుగు పుస్తకాలలో (tetralogy – The Pallette, The Easel, The Canvas, The Painting) ఆవిష్కరించాలనే సంకల్పంతో మొదలు పెట్టిన ఒక యజ్ఞం.  ఆ వరుసలో ఇది చివరి పుస్తకం. 

తెలుగు సాహిత్యం యొక్క గొప్పదనం బాహ్య ప్రపంచానికి తెలియాలంటే అవతలి భాషకి పరిచయం కావాలి.  బెంగాలీ లో వ్రాయబడిన గీతాంజలిని రబీంద్రనాథ్ టాగోర్ ఆంగ్లంలోకి అనువదించక పోయున్నట్లయితే నోబెల్ బహుమతి వచ్చి వుండేది కాదేమో.  అదే గీతాంజలిని చలం తెలుగులోకి అనువదించపోతే నాలాంటి వారికి గీతాంజలి గొప్పదనం తెలిసేది కాదేమో.  తెలుగు సాహిత్యంలో గొప్ప రచయితలు లేక మనకి గుర్తింపు రాకపోయిందా?  కాదు.  మన సాహిత్యం గొప్పదనం తెలియచేసే అనువాద మాధ్యమం బలహీనం కావడం మన దురదృష్టం. 

అనువాదాలు సులభం కాదు – ముఖ్యంగా కొన్ని కొన్ని కథలు పరాయి భాషల్లోకి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం కానే కాదు.  అవి భాషాపరంగానో, మూలకథ శైలి వల్లనో, కథలోని సందర్భం వల్లనో, ఎన్నో కారణాలవలన అవి అలివి కావు.  అందుకే అలాంటి అనువాదాలు చేసేవారిని ఎక్కువగా చూడం. 

మూర్తి గారు నిజాయితీ ఉన్న సాహితీ వేత్త, అనువాదం తెలుగు సాహిత్యానికి ఒక అవసరం అని నమ్మిన రచయిత, అటు తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో, ఆంగ్ల భాషలోనూ పట్టున్న ఒక అనువాద కర్త, వ్యక్తిగతంగా తోటి మనుషులంటే అభిమానం, ఆప్యాయత చూపించగలిగిన, ఆర్ద్రతతో సాటి మనిషిని అర్థం చేసుకోగలిగే మనిషి. ఆయన తెలుగు నుండి ఇంగ్లీషు లోకి, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, ఎన్నో కథలు, కవితలు అనువదించారు.  రెండు భాషల్లోనూ మంచి పట్టున్న మనిషి.

ఆయన ఎలాంటి కథలు ఎన్నుకుంటారు?  ఆయనకు నచ్చాలి, ఆయన హృదయాన్ని కదిలించాలి – అంతే, ఆయన కలం విజృంభిస్తుంది.  దురదృష్టవశాత్తు కృష్ణమూర్తిగారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఈ పని కొంచెం కుంటుపడి, ప్రస్తుత పుస్తకం వెలితి తీసుకురావడానికి కొంచెం సమయం పట్టిందన్నారు మూర్తి గారు.

ఈ పుస్తకంలో గురజాడ అప్పారావు గారి ‘నీ పేరేమిటి’ అన్న కథ తో మోదలై, ఆరిపరాల సత్యప్రసాద్ గారి ‘ఊహా చిత్రం’ వరకూ ఎన్నో కథలున్నాయి.  రావిశాస్త్రి, శివరాజు సుబ్బలక్ష్మి, చాసో, సాయి బ్రహ్మానందం గొర్తి, నందిగం కృష్ణారావు, మునిపల్లె రాజు, త్రిపురనేని గోపీచంద్, పిసుపాటి ఉమామహేశ్వరం, కొడాలి సదాశివరావు, కూనపరాజు కుమార్, కొండేపూడి నిర్మలా, శ్రీపాద సుభ్రహ్మణ్యశాస్త్రి, ­­­దంత స్వర్ణ శైలజ, వేలూరి శివరామ శాస్త్రి, సత్యం శంకరమంచి, వాకాటి పాండురంగారావు, ఎండపల్లి భారతి, పీవీ శేషారత్నం, - ఎక్కువమంది పాత రచయితలు రాసిన క్లాస్సిక్ కథలే అయినా, సమకాలీన రచయితలు, కొత్త రచయితలు కూడా ఆయన దృష్టిని దాటి పోలేదు కథలు ఎన్నుకోవడంలో.  

షెర్నాజ్ వాడియా, ఆంగ్ల కవయిత్రి ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసారు.  ఆమె అంటారు – “The translators have maintained the honesty of the original works and with their experitise, have gifted us a mosaic of freedom, passion, healthy sarcasm, enchantment, ethics and aesthetics, surrealism; there is a subtle sensitivity to the human condition – fears, longings, humility, honor, critical thinking, innate goodness – the gamut drawn from others.”  ఆవిడ ఇంత చెప్పిన తరువాత కథల గురించి చెప్పనక్కరలేదు.  ఆమె అనువాదం గురించి చెప్పిన మరోమాట: “Sometimes the vernacular idiom can creep in.  Perhaps the translators feel that at places literal translation conveys the ambience, flavors, and the character more sharply in keeping with the writer’s intentions.”

ఆవిడ చెప్పిన పై వాక్యం ఏ అనువాదకుల విషయంలోనైనా ముఖ్యమే.  భారతీయ భాషలన్నిటిలోనూ సుమారు ఒకే రకమయిన భావాలుంటాయి – కొంచెం అటు, ఇటూగా.  ఆంగ్ల భాషలో నుడికారాలు తప్పకుండా తేడాగా ఉంటాయి.  తెలుగు సాహిత్యం భారతదేశపు ఎల్లలు దాటి వెళ్ళాలంటే వాడియా గారు చెప్పిన ‘literal translation’ ఆంగ్లభాషలోని నుడికారాల ఆధారంగా ఇంకో స్థాయిలో అనువదించాల్సి రావచ్చు.  దానికి మెడికో శ్యామ్ గారు ఈ మధ్య చెప్పినట్లుగా కొన్ని సంస్థలు ముందుకొచ్చి ఈ పనికి పూనుకోవాలి.  భారత దేశంలో సాహిత్య అకాడమీ ఎంతో కృషి చేస్తోంది.  కాని, ఆ కృషి కూడా తెలుగు సాహిత్యకారులు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారన్నది ప్రశ్నే.

కొన్ని చోట్ల మూర్తి గారు వాడిన ఆంగ్ల పదాలు ‘flowery language’ గా అనిపించక మానదు.  అలాంటి పదాలు ఆయనకు ఎలా తట్టాయో అనిపించింది.  ఆంగ్ల పదకోశం క్షుణ్ణంగా తెలిస్తే కాని, ఆ పదాలు వాడలేరు.

మంచి పుస్తకం.  రెండు కారణాల వల్ల చదవచ్చు.  మొదటిది, మంచి (రచయితల) కథలు తెలుగులో కనక చదవకపోయి ఉన్నట్టయితే, కనీసం ఇప్పుడైనా చదవచ్చు – ఎన్నో ఒక చోటే ఉన్నాయి కాబట్టి.  రెండోది, తెలుగు రానివారు, తెలుగు చదవలేనివారు, తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలనుకునే కారణంతో. 

పుస్తకం ఖరీదు రూ. 200.00 ($20.00).  అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతుంది – అమెజాన్ లో కూడా. 

***

 

 

‘తూరుపు గాలులు’ : స్నేహితుడు మధు పెమ్మరాజు తెచ్చియిచ్చిన మంచి పుస్తకాలలో మరొకటి.  ఉణుదుర్తి సుధాకర్ గారు వ్రాసిన పదమూడు కథల సంకలనమిది. 

ఈ కథలు ఎందుకు రాశారో చెబుతూ, సుధాకర్ గారు చెప్పిన రెండు వాక్యాలు చూద్దాం. 

“చరిత్రపుటల మధ్య పేరుకుపోయిన సుదీర్ఘ నిశ్శబ్దాలు నన్ను వేధించాయి.  ఇవే నా చేత ఈ కథలని రాయించాయి.”

“వర్తమాన చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు చారిత్రక కోణాలను ఆవిష్కరించుకోవాలే తప్ప పాషాణగతాన్ని ఏకపక్షంగా, నిరంకుశంగా వర్తమానంపై రుద్దకూడదని ఈ కథలు వ్రాసే క్రమంలో నాకు బోధపడింది.” 

పై వాక్యాలు నన్ను ఒక క్షణం ఆగి ఆలోచింపచేసినై.  విద్యార్థులుగా వున్నప్పుడు చరిత్ర పాఠాలు బట్టీబట్టి పరీక్షలలో కక్కి మార్కులు తెచ్చుకుంటాం.  కాస్త పెద్దయితే, చరిత్రపై కొంచెం ఇష్టం వుంటే మళ్ళీ చదువుతాం.  అర్థం చేసుకున్నామనుకుంటాం.  కొంతమంది మహా తెలివైన వాళ్ళుంటారు – వాళ్ళు చేసే పని, అదుగో, సుధాకర్ గారు చెప్పిన పాషాణ గతాన్ని వర్తమానంపై రుద్దడం.  అలా చెయ్యడంలో చరిత్రను తిప్పి రాస్తున్నామనే అహంకారం చూస్తాం. 

సరిగ్గా అందుకు వ్యతిరేకం సుధాకర్ గారి ఆలోచనలు, కథలు. 

చరిత్రకారుడిగా జరిగిన సంఘటనలను కూలంకషంగా అర్థంచేసుకుని వర్తమానంలో మనం చూస్తున్న సంఘటనలకు, మన ప్రవర్తనలకు వున్న సంబంధాన్ని గురించి ఆలోచించడం, ఒక శాస్త్రవేత్తగా ఆ సంబంధాన్ని కనుక్కోవడం, రచయితగా తను కనుగొన్న ఆ సత్యాలను కథలరూపంలో మనముందుంచడం, ఆయన చేసిన పని.  అదే నిజాయితీ అన్నీ కథల్లోనూ మనకు కనబడేది. 

కథల్లో కల్పన లేదా అని కాదు.  సత్యవతి గారు చెప్పినట్లుగా ఆయన చేసింది చారిత్రాత్మక కాల్పనిక సాహిత్య ప్రక్రియ. 

సుమారు అన్నీ కథల్లోనూ భారత దేశపు తూర్పు తీరం, ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతం ప్రతిబింబిస్తాయి.  సులభంగా చదివించే శైలి.  కథనం చరిత్రను దృష్టిలో పెట్టుకోని, పెట్టుకోలేని పాఠకుడిని కూడా చదివించగలదు.

‘వాళ్ళు-మనం, మీరు-మేము’ కథతో మొదలై ‘తూరుపు గాలులు’ కథ వరకూ ఒక క్రమంలో సమకాలీన సమాజపు నేపథ్యం నుంచి బౌద్ధమతం భారతదేశంలో క్షీణించుకుపోతున్న రోజుల వరకూ పేర్చబడిన చరిత్ర సత్యాలు ఈ కథలు.  వాళ్ళు-మనం, మీరు-మేము అని చూపబడే తారతమ్యాలు అతి సాధారణంగా మనకు తారసపడే, అంతే కాదు, తప్పకుండా మనలో ఉండే, జాత్యహంకారానికి దర్పణాలు.  ఉద్యోగం పోయినప్పుడు అలాంటి ‘వాళ్ళ’ మనిషే ధైర్యాన్నిస్తే?

మానసిక రోగాలకు వైద్యం చేయడంలో ఒక ప్రత్యేక పద్ధతులుండాలా?  పిచ్చికీ మంచికీ వైరుధ్యం ఎంత చిన్నదో చూపే కథ ‘బూడిదరంగు అద్వైతం’.  

“నైపుణ్యం వున్నచోట శాస్త్రం లేదు, శాస్త్రం ఉన్నచోట నైపుణ్యం లేదు.  ఇక్కడి చదువుల్లో రెండులేవు” అని 1850 ప్రాంతంలో బ్రిటీషు వాళ్ళు గుర్తించిన సత్యంగా ‘మూడు కోణాలు’ కథలో సహేతుకంగా చూపిస్తారు రచయిత.

మిగతా అన్నీ కథలూ ఒక ఎత్తైతే ‘తూరుపు గాలులు’ మరో ఎత్తు.  దీపాంకారుడనే బౌద్ధ భిక్షువు చుట్టూ తిరుగుతుంది కథ.  అవి భారత దేశంలో బౌద్ధమతం క్షీణిస్తున్న రోజులు.  శ్రీలంకలో నిలదొక్కుకున్న బౌద్ధమతం ఏ విధమైన రాజకీయాలలో ఇరుక్కుపోయిందో, మతం ఎంత గొప్పదైనా  విస్తృతంగా పెరగాలంటే రాజకీయాలు ఎంత ముఖ్యమో, రచయిత ఎంతో అవహాగనతో చెప్పిన కథ ఇది.  బౌద్ధమతానికి సంబంధించిన సందర్భాలు, సంఘటనలు, కళ్ళకు కట్టిన రీతిలో చెప్పడం బాగుంది.  ఆ రోజుల్లో నడిచే పదజాలం, ప్రదేశాల పేర్లు, ఎంతో శ్రమతో పరిశోధించి, సందర్భానుసారంగా కథలో చెప్పడం వల్ల ఆ కథ వాస్తవానికి దగ్గరలో ఉండడమే కాక చదువరులను ఆరోజుల్లోకి చెయ్యి పట్టుకు తీసుకెడుతుంది.  నియో బుద్ధిస్ట్ ఎలా పుట్టాడో అన్న ప్రశ్నకి ఈ కథ సమాధానం వెతుకుతుంది.  చరిత్ర కావాలనుకునే వారికి మళ్ళీ మళ్ళీ చదివి ఇంకా తెలుసుకోవాలని అనిపించే కథ.

సుధాకర్ గారి కలంనుండి ఇంకా ఇంకా కథలు రావాలని నా విన్నపం.  ఇలాంటి కథలు కళ్ళు తెరిపిస్తాయనడం అతిశయోక్తి కాదు.

 

పుస్తకానికి ముఖచిత్రం, లోపల ప్రతీ కథకూ తల్లావఝల శివాజీ గారు వేసిన రంగు చిత్రాలు చాలా అర్థవంతంగా బాగున్నాయి.  చిత్రాలు దళసరి తెల్ల కాగితం మీద ప్రత్యేకంగా వేసినవి.  మొత్తం పుస్తకం కూడా చాలా శ్రద్ధతో చేసినట్లుగా తెలుస్తుంది.  అంత శ్రమ తీసుకున్న రచయిత, ప్రచురణకర్తా కూడా అభినందనీయులు.

ఛాయా రిసోర్స్ సెంటరు వారు ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ విక్రేతల దగ్గరా దొరుకుతుంది.  ఈ పుస్తకం ఖరీదు రూ. 180.00.

* * *

‘అయ్యకోనేరుగట్టు కథలు’ జయంతి ప్రకాశ శర్మ గారు వ్రాసిన మరో కథల సంపుటి.  ఇదివరలో ఆయన రాసిన మరొక కథల సంపుటి ‘ఎడారి పూలు’ ఈ శీర్షికలోనే పరిచయం చెయ్యడం జరిగింది. 

ప్రాంతీయత, అంటే ముఖ్యంగా స్థలం ఆధారంగా చేసుకుని వచ్చిన కథలు కొత్త కాదు.  వెంటనే మనకు గుర్తుకొచ్చేవి సత్యం శంకరమంచి గారు వ్రాసిన ‘అమరావతి కథలు’.  ఇంకెంతమందో కూడా వ్రాసిన పుస్తకాలున్నాయి.    అదే పంథాలో వెలువరించిన పుస్తకం ఈ ‘అయ్యకోనేరుగట్టు కథలు’.  

గమనించండి.  ఇవి విజయనగరం కథలు కావు.  విజయనగరంలో పెరిగిన వారికి, పెరగని వారికి కూడా తలపులోకి వచ్చేవి బొంకుల దిబ్బ, అయ్యకోనేరు, పెద్దచెరువు, మహారాజా కళాశాలలు, మొదలైనవి.  ఇందులో అయ్యకోనేరు, దానికున్న నాలుగు గట్లు, ఆ గట్లపై ఇళ్ళల్లో నివసించే ప్రజలు, అరవైల, డెబ్భైలలో దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఈ కథలకు ఇతివృత్తాలు.  చాలీ చాలని రాబడులు, దైనందిన సాంఘిక జీవితంలో ఎదుర్కునే ఒడుదుడుకులు, మనుషుల మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాలు ఈ కథలను నడిపిస్తాయి. 

పుస్తకంలో 30 కథలున్నాయి.  చాలా మటుకు అక్కడా, అక్కడా అచ్చయినవే.  అందుచేతే చదువుటూంటే కొత్తగా అనిపించలేదు.  నేనూ విజయనగరంలో, ఉత్తరగట్టులో పెరిగాను, శర్మ గారు దక్షిణగట్టైతే.  అక్కడి పరిసరాలు, ఆంజనేయస్వామి కోవెల, గుంచీ, గుండాలవారి వీధి, కానుకుర్తివారి వీధి, కోట, అరిటిచెట్ల బడి,  ఇవన్నీ ఇద్దరం కలిసి పెరిగినవే.  కథలు ఎక్కడైనా జరగవచ్చు అంటారేమో.  కానీ, ఆ కోనేరు గట్టుదో ప్రత్యేకత.  తెల్లవారు లేచిన తరువాత ఆ చెరువును, గట్టును చూడకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా జీవితం లేదు.  చుట్టూ జరిగే అన్ని సంఘటనలకీ కోనేరు ఒక సాక్షి.   మరి శర్మ గారి ఈ కథల్లోని విజయనగరం భాషో?  భాషతో పాటు భావాలు, మానవ సహజమయిన ప్రవర్తనా శర్మ గారి కథలకు పట్టుగొమ్మలు.  కథల్లో మా విజయనగరం స్నేహితుల పేర్లు దొర్లుతూనే ఉంటాయి అక్కడక్కడా.  నాగులు, శేషు, రమేషు, మౌళి, ఇలా... అందుకే ఈ కథలు తనివి తీర నివ్వవు చదువుతూంటే. 

కొత్త సంపుటికి స్వాగతం చెబుతూ, విహారి గారు శర్మ గారి కథా శిల్పం గురించి వివరించారు.  “భుజం మీద చెయ్యి వేసి చెబుతూ, మధ్యలో క్షణం ఆగి, ఒరగా చూసి తెలిసిందా? అని అడిగి, అంతలోనే అంత చనువుతో “ఆ... నీ మొహం నీకు తెలీలేదు.  నే చెబుతా విను” అన్నట్లు గుండెను వెచ్చగా దగ్గరకు తీసుకుంటుంది...చూడండి...” అంటారు. 

కథలు చదువుటూంటే ఆయా పాత్రలు మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట తారసపడ్డ మనుషులే, వారి ప్రవర్తనే.  అందుచేతే అవి మనల్ని కదలకుండా చదివిస్తాయి.  ముసిముసిగా నవ్విస్తాయి.  జాలి పడేలా చేస్తాయి.  మన అమ్మల్ని, నాన్నల్ని, అత్తల్ని, మావల్ని, పక్కింటి పిన్నిగార్ని, ఇలా మన చుట్టుపక్కల మనషుల్నే మన ముందొక అద్దం పెట్టి చూపిస్తాయి. 

జీవితమంతా పిల్లలకోసం వెచ్చించి చివరకు ఒక స్వంత ఇల్లంటూ లేని సుందరయ్యలూ, వసంతమ్మలూ ఎంతమంది లేరు?  పిల్లలమీద ఆశ వదులుకుని మిగిలిన పెన్షన్ రాళ్లు కూడా పిల్లలు మిగలనిస్తారా అని అనుకుంటున్న సమయంలో చిన్న కొస మెరుపుతో ముగుస్తుంది ‘కోనేరు గట్టు’ కథ. 

 

ఒకప్పుడు చెప్పులు లేకుండానే నడిచేవాళ్ళం చిన్నప్పుడు.  రెండు రూపాయల చెప్పులు కొనుక్కోలేని ఎంతో మంది ఉండేవారు ఆరోజుల్లో.  శంకరానికి చెప్పులు కావలసి వస్తే దేవుడి డబ్బులు ఇచ్చిచెప్పులు కొనుక్కోమని, దేముడి ముడుపు కోసం కూడబెట్టిన డబ్బులకు అంతకంటే ప్రయోజనమేముంటుందని చెప్పే కథ ‘ఆపద్భాంధవుడు’.  ఒంటిపిల్లి రాకాసి లా బతుకుతున్న కాముడమ్మకు కూడా గుండెల్ని కదిలించే ఓ కథ వుంటుందని చెప్పే కథ ‘జాతక చక్రం’.  ఇలా సాగుతాయి కథలన్నీ. 

ఏ వూరి వాళ్ళయినా చదవాల్సిన కథలు.  అయ్యకోనేరు లేకపోవచ్చు అన్నిచోట్లా.  కానీ, మనుషులొకటేగా!

విశాఖ రసజ్ఞ వేదిక వారు ప్రచురించిన ఈ పుస్తకం కావాలనుకునేవారు రచయితనే సంప్రదించండి (జె.పి. శర్మ, మొబైల్ +91 98486 29151).  వెల రూ. 150.00. 

*****

సంక్షిప్త సమీక్షలు

"హవేలీ" (సాంఘిక కాల్పనిక నవల) - లలితా వర్మ

 

 

అందరు చదువరుల్లాగా నా చదువు కూడా చందమామ,బాలమిత్రతో మొదలై డిటెక్టివ్ నవల్స్ వైపు సాగింది.

 

డిటెక్టివ్ భగవాన్, యుగంధర్, పాణి, సమ్రాట్,వాలి ఇలా నా బుర్రంతా డిటెక్టివ్ లతో నిండిపోయింది.

ఎయిర్ ఫోర్స్ లో చేరాక పెర్రీమేసన్,అగాధాక్రిస్టీ లాంటి ఇంగ్లీష్ భాషవారు చాలాకాలం నివాసం ఉన్నారు.

     

అగాధాక్రిస్టీలా వ్రాసేవారసలు ఉండరనే నా అభిప్రాయానికి గండికొట్టారు లలితా వర్మ గారు.

   

అమెరికాలో నేను చూసిన డల్లాస్ నీ ఆర్బొరేయం నీ టచ్ చేస్తూ కొంచెం అమెరికా, కొంచెం ఇండియా, మరికొంచెం అడవిలో, హవేలీ లో పలు రుచులతో పసందైన థ్రిల్లర్, సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్, పారాసైంటిఫిక్ వంటకాన్ని అపూర్వంగావండి మన చేతులకి జ్యోతి వలబోజు గారి చేతులమీదుగా అందించారు.

  

అదేం స్పీడు బాబోయ్! మొదలుపెట్టాక చివరిదాకా ఒక్కక్షణం వదిలిపెడితే ఒట్టు. అక్షరాలే మీద కనుచూపుల్ని పరిగెత్తింపజేసి అక్షరాలా పదహారురీళ్ళ సినిమానే మనసుకి చూపించేశారు లలితా వర్మ గారు. రైటింగ్ లో డైనమిజాన్ని అద్భుతంగా చూపిన లలితా వర్మ గారు మరిన్ని నవలలు వ్రాసి తెలుగు పాఠకుల సంఖ్యని అపరిమితంగా పెంచాలని, పెంచుతారనీ నమ్ముతూ వారికి నా నమస్సులు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 

-భువనచంద్ర, సినీ గేయ రచయిత.

***

త్యాగధనుల సమాధులపై పూసిన మొగ్గలు -భీంపల్లి శ్రీకాంత్

 

భారతదేశం ఈరోజు సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందంటే దాని వెనుక ఎన్నో జీవితాల ఆత్మత్యాగం ఉంది. ఎందరో తమ పానాలను గడ్డిపోచల్లా విసిరిస్తేనే ఈరోజు స్వేచ్ఛాస్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నం. కట్టుబానిసలుగా, ఆర్థిక సమానత్వానికి, విద్యకు దూరమై ప్రజలు వందల ఏండ్లు బానిసలుగా బతికిండ్రు. అనేక ఉద్యమాల ద్వారా, ఆకలికి, అవమానాలకు ఓర్చుకొని పానాలను తృణప్రాయంగా విడిచిపెట్టి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిండ్రు. స్వాతంత్య్రం సాధించడానికి ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను ఒకసారి జ్ఞప్తికి తెస్తూ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు తాను సృష్టించిన *మొగ్గలు* కవితాప్రక్రియలో స్వాతంత్ర్యోద్యమ దీప్తిని వెలిగించారు.

 

స్వాతంత్య్రం సిద్ధించడానికి ఉరికొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి త్యాగధనుల చైతన్యస్ఫూర్తిని, పోరాటపటిమను, దేశభక్తిని ఈ మొగ్గలలో మనముందుంచారు. గాంధీజీ చేపట్టిన సహాయనిరాకరణ, విదేశీ వస్తుబహిష్కరణ, శాంతియుత పోరాటాలను, లాలా లజపతిరాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వంటి ధీరయోధుల ధైర్యసాహసాలను స్వాతంత్య్రోద్యమంలో వీరి పాత్రను మరోసారి గుర్తుచేశారు భీంపల్లి శ్రీకాంత్ గారు.

 

భారత స్వాతంత్య్రోద్యమం ప్రపంచ దేశాలకు మార్గదర్శకమైంది. ఎక్కడైతే బానిసత్వం, వర్ణ వివక్షత ఉందో ఆ ప్రాంతంలో ఉద్యమ భావజాల వ్యాప్తికి భారత స్వాతంత్య్ర ఉద్యమం బీజం వేసింది. పౌరహక్కుల కోసం అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, వర్ణవివక్షతలను పారద్రోలడానికి దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ హక్కులను సాధించుకున్నారు.

 

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు ఈ మొగ్గల నిండా దేశభక్తి, దేశం కోసం స్వాతంత్య ఆకాంక్షకై తెగింపు, జాతీయ సమైక్యత భావనను పెంపొందించే విధంగా త్యాగధనుల సమాధులపై మొగ్గలను పూయించారు. స్వాతంత్య్ర యోధులకు నివాళిగా అక్షరార్చన చేసి మొగ్గల బొండుమల్లెల దండవేసిన మొగ్గల ఆవిష్కర్త భీంపల్లి ఎంతైనా అభినందనీయులు. ఆయన కలం నుండి నిరంతరం విచ్చుకుంటున్న మొగ్గల హృదయాన్ని తడిమి చూడండి. నిత్యచైతన్యమై పారుతున్న భీంపల్లి అక్షరప్రవాహాన్ని అందరికీ తలా దోసెడు పంచుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

 

- బోల యాదయ్య

099122 06427

 

 [ స్వాతంత్ర్య మొగ్గలు, సంపాదకులు: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ప్రతులకు: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నం.8-5-38, టీచర్స్ కొలని, మహబూబ్ నగర్ - 509001, తెలంగాణ  ఫోన్ : 9032844017 ]

 

***


పకోడి పొట్లం –ఆర్.సి కృష్ణస్వామి రాజు

 

ఆరు బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు, సాయంత్రం స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ఒంటరిగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, నిర్విరామంగా సాగుతున్న మీటింగ్ మధ్యలోనో  కరకర లాడే వేడివేడి పకోడి పొట్లం మన చేతిలో ఉంటే అంతకు మించిన ఆనందం మరేముంటుంది. కృష్ణస్వామి రాజుగారి “పకోడి పొట్లం”  పుస్తకాన్ని చదివితే,  అచ్చం అలాంటి అనుభూతే  కలుగుతుంది. ఈ పుస్తకంలో  మొత్తం అరవై కథలున్నాయి. అన్నీ చిన్న కథలే! చిరుతిళ్ళు లాంటి చక్కని రుచి కలిగిన కథలే.

 

పుస్తకం అట్ట మీద కథ “పకోడీ పొట్లం” చాలా సరదాగా సాగి  పాఠకులకు  హాస్యాన్ని పంచుతుంది.  “మంత్రి  లౌక్యం”,  “నక్షత్రాల లెక్క”,  “గ్రామాధికారి సమస్య”,  “యథా రాజా -  తథా ప్రజా”  లాంటి కథలు పాత తరాన్ని ప్రతిబింబిస్తూ,  నీతి  సూత్రాలను  వల్లె వేస్తే,  “ఇంజక్షన్”,  “విస్టింగ్ కార్డు”, “కర్రీ కార్నర్”,  “హెల్మెట్”,  “హోర్డింగ్”,  “ఇన్ ఫార్మర్” లాంటి కథలు నేటి ఆధునిక సమాజానికి అద్దం పడతాయి.  “కట్నం కావాలి”,  “చదివింపులు”,  “పాదయాత్ర”,  “పాలిటిక్స్”  లాంటి  కథలు పాఠకుడిని ఆలోచింపచేస్తాయి. రచయిత సమయానుకూలంగా, సందర్భోచితంగా ప్రతి కథలోనూ ఉపయోగించిన సామెతలు ఈ పుస్తకాన్ని పాఠకుడికి మరింత దగ్గర చేస్తాయి. 

సాహిత్యం పై ఆసక్తి ఉన్న పాఠకుడికి పెద్ద కథలపై మక్కువ వున్నా సమయలేమి కారణంగా చిన్న కథలను చదవడానికి ఆసక్తి చూపుతున్న నేటి కాలంలో ఇలాంటి కార్డు కథలు, మినీ కథలు  రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కృష్ణస్వామి రాజు గారికి  ఈ “పకోడి పొట్లం”  వారికి మరింత పేరు తీసుకుని రావాలని, వారు మరిన్ని మంచి కథలతో తెలుగు పాఠకుడిని రంజింపచేయాలని కోరుకుందాం. 

-పేట యుగంధర్ -9492571731

 

పుస్తకాల  కొరకు సంప్రదించండి: రచయిత ఆర్.సి కృష్ణస్వామి రాజు,  9393662821

*****

వసుచరిత్రము - పరిచయము - శ్రీ బాలాంత్రపు వేంకట రమణ

పుస్తక పరిచయము - సహస్రావధాని కోట వేంకట లక్ష్మీ నరసింహా రావు

శ్రీ బాలాంత్రపు వేంకట రమణగారు తెలుగు పంచ కావ్యాలకు పరిచయగ్రంథాలు వ్రాసే ప్రణాలికలో ఇప్పటివరకూ మనుచరిత్రము, పారిజాతాపహరణము, పాండురంగ మాహాత్మ్యము, గ్రంథాలు పూర్తి చేశారు.  ఇది వసుచరిత్ర పరిచయగ్రంథము.  ఈ గ్రంథావిష్కరణ సభ జూం లో జూన్ 27, 2021 నాడు జరిగింది.  (ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లంకెలో ఈ కార్యక్రమాన్ని చూడవచ్చును. https://youtu.be/9k0oxK222Eo.)

వసుచరిత్రము పాఠకలోకానికి చాల ప్రియమైన ప్రబంధము.  కవి రామరాజభూషణుడు. పండితులు  ఈయనను  శ్లేష యమక చక్రవర్తిగా కీర్తిస్తారు. ఈ వసుచరిత్రములో శబ్ద చమకృతిగాని అర్థచమత్కృతిగాని లేని పద్యం లేదంటే అతిశయోక్తి కాదు.  ఈ గ్రంథానికి విశిష్టమైన వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి .

శ్రీ బాలాంత్రపు వేంకటరమణగారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి ‘పాఠకమిత్ర’ వ్యాఖ్యాన శైలిని వరవడిగా పెట్టుకొని ఈ వసుచరిత్రములోని సుమారు 320 పద్యాలు తీసుకొని (గ్రంథంలో మొత్తం పద్యగద్యాలు 888, అంటే గ్రంథంలో ఇంచుమించు మూడవవంతు గ్రహించి) అసక్తికరంగా, సంక్షిప్తసుందరంగా పండిత ప్రకాండులకు, సామాన్య పాఠకులకు అమోదం కలిగేలా గ్రంథ పరిచయం చేశారు.   

ముఖ్యంగా రామరాజభూషణుడు “సంగీత కళా రహస్య నిధి”.  ఆ కారణంగా సాహిత్యంతో పాటు సంగీతజ్ఞానం ఎఱిగినవారు చేసే వ్యాఖ విశేషంగా ఉంటుంది.   శ్రీ బాలాంత్రపువారికి సంగీత సాహిత్యాలు రెంటిపైనా  అభిరుచి అధికం.  అందుచేత కొన్ని పద్యాలకు సంగీతపరమైన విశేషాంశాలు పాఠకులకు ఎంతవరకు అవసరమో అంతవరకు అందించారు. రామరాజభూషణుడు తన గ్రంథంలోని పద్యాలను పాడుతూ వీణమీద పలికించి వినిపించేవాడట.  దానికి ఉదాహరణగా రమణగారు  వసుచరిత్రలోని రెండు పద్యాలు విద్వాంసులచేత  పాడించి, వీణమీద వాయింపించి ఈ పరిచయగ్రంథంలో  వాటి Youtube links ఉంచారు.

వసుచరిత్ర మూలకథ భారతగ్రంథంనుండి స్వీకరింపబడింది.  వ్యాసుని, నన్నయను అవలోడనం చేసుకొని తొమ్మిది-పది పద్యాలలో ఉన్న విషయాన్ని తీసుకొని వసురాజు, గిరికల వివాహం 888 పద్యగద్యాలలో రసవంతంగా అందించాడు రామరాజభూషణుడు.  శుక్తిమతీ అనే నది ఉన్నది.  ఆ నదిని కోలాహలుడు అనే పర్వతం కామభావంతో అడ్డగించాడు.  ఆ కోలాహల పర్వతాన్ని వసురాజు తన కాలి బ్రొటనవ్రేలితో దూరంగా చిమ్మాడు.  కోలాహలునివల్ల శుక్తిమతికి గిరిక, వసుపదుడు అనే సంతానం కలిగింది.

వసురాజు చేసిన పనికి ఇంద్రుడు ఆనందించి వసురాజును తనతో సఖ్యం నెరపే అవకాశాన్ని ఇచ్చాడు. కోలాహలపర్వతం వసురాజునకు క్రీడాపర్వతం.  గిరికా వసుప్రదులు క్రమంగా పెద్దవారయ్యారు.  వసురాజు తన మిత్రునితో కలిసి తన క్రీడాపర్వతమైన కోలాహలం వద్దకు వెళ్లాడు.  అక్కడ గిరికను చూచాడు.  ప్రేమ భావంతో ఆమెపై మరులుగొన్నాడు.  రాజు మిత్రుడైన నర్మసచివుడు గిరిక చెలికత్తెలతో విహరిస్తున్న ప్రదేశానికి వచ్చాడు.  అచటకి వసురాజు వచ్చే సంఘటనకు ఏర్పాటుచేశాడు.  వసురాజు గిరికల వివాహం జరుగుతుంది.  ఇది స్థూలంగా కథ. 

దంతాఘట్టిత రాజతాచల …” అనే పద్యంలో వినాయకుని ప్రస్తావించిన తీరు, ఆ వినాయకుడు కుమారేగ్రేసరుడు ఎలా అయ్యాడో వేంకటరమణగారు చక్కగా వివరించారు. 

హనుమంతుని స్తుతించిన సీసపద్యము అనుప్రాసలలో సాగించే రుచులు, ఫలమోహరుచులు – శయము, హృత్కుశేశయము, జవము గుణగణార్జవము వంటి పదముల వివరణతో భావం పాఠకులకు చక్కగా అర్థమయే రీతిలో వివరించారు వేంకటరమణగారు. 

ఇది ఆరు ఆశ్వాసాల గ్రంథం.   శుక్తిమతి ఒక నదిగా ఒక స్త్రీగా, కోలాహలుడు పర్వతంగా పురుషుడుగా రామరాజభూషణు జమిలిగా వర్ణించిన తీరు వివరణము పాఠకులను ఆకట్టుకుంటుంది.

వసంతఋతు వర్ణన పద్యము ‘లలనాజనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగము’ వంటి పద్యాలు వీణపై కూడా పలికించిన తీరు చక్కగా సాగుతుంది వ్యాఖ్యాత వివరణలో.

అరిగాపంచమ మేవగించి నవలాలవ్వేళ హిందోళ వైఖరి సూపన్’ వంటి పద్యాలలో కవియైన రామరాజభూషణుని సంగీతప్రజ్ఞ వ్యాఖ్యాత వివరిస్తారు.

నర్మసచివుడు - గిరిక ఆమె చెలికత్తెలు ఉన్నచోటుకు వేగంగా ప్రవేశించడానికి ఆలోచించాడు. ‘స్వైరవిహార ధీరలకు సారసలోచనలున్న చోటికిన్ బోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచునే చేరక…’.  ఈ పద్యంలో సారసలోచనలు ఇతరుల ప్రవేశంతో ‘రస’భంగమై సాలోచనలు అయ్యెదరు.  ఇటువంటి పద్యాల విశేషాలు వ్యాఖ్యాత చక్కగా తెలియజేస్తారు.  ఈ పద్యంలోనే ‘నవాంబురుహాంబక’ అనే సంబోధనకు విశిష్టమైన అర్థాలు చాలా ఉన్న సంగతి మనం గుర్తించేలా  వ్యాఖ్యాత రచన సాగుతుంది.

శరత్కాలంలో నదిని, గర్భాన్నిధరించిన స్త్రీని కలిపి చెప్పిన శ్లేష పద్యాలు వ్యాఖ్యాత వివరణతో చక్కగా అవగతం అవుతాయి. 

అలాగే ఈ గ్రంథంలోని వర్ణనలు అందున్న విషయాల వివరణలు వ్యాఖ్యాత చక్కగా తేటతెల్లం చేస్తారు.

అనుప్రాసలతో పద్యాలు రామరాజభూషణుడు ఎంత అందంగా వ్రాస్తాడో వ్యాఖ్యాత ఈ పద్యాన్ని ఉదహరిస్తారుః

తమ్ములఁ బంపుదున్ మణి శతమ్ములఁ బంపుదు రాజహంసపో

తమ్ములఁ బంపుదున్ బరిచి తమ్ములఁ గానన దేవతాళిజా

తమ్ములఁబంపుదున్ ద్రుత గతమ్ముల నేనును సారణీప్రపా

తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మది తాప మేటికిన్?   

రామరాజభూషణుదు ఎన్ని సొగసులతో ఎన్ని అలంకారాలతో ఎన్ని శ్లేషలతో వసుచరిత్రను రచించాడో  వ్యాఖ్యాత శ్రీ బాలాంత్రపు వేంకటరమణగారి రచనవల్ల అందరూ ఆనందపడి ఆ గ్రంథం ఆసాంతం చదివేందుకు ఉత్సాహపడే విధంగా పొందుపరచ బడింది.  

పంచకావ్యాలలో మిగిలిన “ఆముక్తమాల్యద” పరిచయగ్రంథాన్ని కూడా శ్రీ బాలాంత్రపు వేంకటరమణగారి కలంనుంచి  త్వరలోనే వెలువడుతుందని   ఆశిస్తూ వారికి భగవంతుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదిస్తూ – స్వస్తి!

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 6
bottom of page