MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
పుస్తక పరిచయాలు
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.
‘సత్యమేవ జయతే’
సత్యం మందపాటి గారు తెలుగు సాహిత్య ప్రపంచానికి సుపరిచితులే. అమెరికా వాస్తవ్యులు. తెలుగంటే వల్లమాలిన అభిమానం. తెలుగు భాషని ఖూనీ చేసేవారంటే ఆయనకు కొంచెం, కొంచెమేం, బాగానే కోపం. గత నలభై, యాభై సంవత్సరాల్లో, ఎన్నో కథలు, వ్యాసాలు, ముఖ్యంగా ప్రవాసాంధ్రుల జీవితాలకు అద్దంపట్టే ఎన్నో రచనలు చేసారు. ఒకప్పుడు అమెరికాకి రావడానికి వీసా కోసం క్యూలలో నుంచుంటూ ఆయన పుస్తకాలు చదివేవారట కూడా. ఆ పుస్తకాలు ఒక రకంగా అమెరికా రావడానికి, వచ్చి ఇక్కడ పడే బాధల్ని అర్ధం చేసుకుని ఎట్లా బతకాలి అని నేర్చుకోవడానికి గైడ్లుగా ఉపయోగ పడ్డాయన్న మాట. ఆయన 1969లో అమెరికా వచ్చిన దగ్గరనుంచి రాసిన చాలా రచనలు ఇక్కడి జీవితాలతో ముడిపడినవే. అమెరికా రచయితలలో ధారాళంగా రాయగలిగే ఒకరిద్దరిలో సత్యం గారు ఒకరు.
సత్యం గారి రచనలు పదమూడు అచ్చు పుస్తకాలుగానూ, మరో తొమ్మిది ఈ-పుస్తకాలుగానూ వచ్చినయ్యి. అందులో చివరగా వచ్చిన రెండు పుస్తకాలను ఈ మధురవాణి సంచికలో పరిచయం చేస్తున్నాను.
‘సత్యమేవ జయతే’ సిలికానాంధ్రావారి 'సుజనరంజని ' అంతర్జాల మాసపత్రికలో అయిదేళ్ళపాటు ప్రతి నెలా 'అమెరికాలం ' శీర్షికగా నెలనెలా సత్యం మందపాటి గారు రాసిన అరవై ఒక్క వ్యాస సంకలనం. శీర్షిక పేరు కూడా సత్యమేవ జయతే.
సత్యం గారి మాటల్లో, ఈ వ్యాసాలు "అమెరికాలో నివసిస్తున్న భారతీయుల, ముఖ్యంగా తెలుగువారి కష్టసుఖాల గురించి చర్చించడమే కాకుండా, భారతదేశంలో పరిస్థితులు, కులాలతో మతాలతో అక్కడ ముణిగి తేలుతున్న రాజకీయాలు, అమెరికాలో కాకిలా వాలిన ఆ రాజకీయాల, సాంఘిక వాతావరణ దిగుమతులూ, ప్రపంచీకరణలో ముందూ వెనుకలూ, మానవత్వపు విలువలూ, వ్యక్తిత్వ వికాసపు కబుర్లు.....". సత్యం గారి కథల్లోనూ, వ్యాసాల్లోనూ సునిశిత హాస్యం, మరికొంచెం వ్యంగ్యం, చివరకి ఒక సందేశం ఉండడం మామూలు. ఇవీ అంతే. అయితే, ఈ రచనల్లో ఎన్నో అంశాలపై రచయిత అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. రచనాంశాలు కల్పితాలు కావు. ఆయన చెప్పినట్లు, ఇవన్నీ నిత్యజీవితంలో మనందరం అనుభవించేవే. అయితే చాలామందిమి పట్టించుకోం. సత్యం గారు తనకెదురుగా నిలబడ్డ సమాజంపై ఆయన పొందిన స్పందన - పాజిటివ్, నెగటివ్ - మనముందుంచారు. "కొన్ని సీరియస్ విషయాల మీద, కుసింత వ్యంగ్యంగానూ, మరింత ఆవేదనతోనూ వ్రాసినవీ వ్యాసాలు" అంటారు సత్యం గారు. ఆవేదన చాలా కనబడుతుంది. ఒక సర్వ సమాజ పౌరుడిగానూ, సమాజంలో తను చూస్తూన్న మంచి, చెడులను పాఠకుల ముందుంచడం, విమర్శించడం, రచయితగా తన కర్తవ్యంగా భావించి రాసిన వ్యాసాలివి.
"సినిమాలు తీసే ప్రతి భాషలోనూ, ప్రతి దేశంలోనూ ఎన్నో కొత్తరకం కథలు వస్తుండగా, మన తెలుగులోనే ఈ దౌర్భాగ్యం ఎందుకని?" అని వాపోతారు ఒక వ్యాసంలో. ఇంకో చోట "మరి తెలుగు వాళ్ళకి ఎక్కడా లేని, ఎక్కడలేని తెగులుతనం ఎక్కడినుంచో వచ్చేసింది. కుల దురభిమానాలు తెలుగు వాళ్ళల్లో ఉన్నంతగా, ఇంకెవరిలోనూ కనబడవు" అంటూ తన బాధ వ్యక్తం చేస్తారు. పప్పులో కాలేసిన భ్రహ్మ (తెలుగోడి గురించే మరి!), ఎడ్డెం ఎంకటేసర్లూ, తెడ్డెం తేగరాజు, కొంచెం ఆలోచిస్తేగానీ తెలుగోడని అర్థం కాని హారీ గాంటీ, ఇలా ఎన్నో పాత్రలు దొర్లుతూ ఉంటాయి పుస్తకం నిండా - చదువరిని హాయిగా నవ్విస్తూ. ఒక్కోసారి వ్యంగ్యం మన్నే చెంప ఝళిపిస్తుంది ఎందుకంటే తెలియకుండానే మనం సంతరించుకున్న ఆల్లోచనల వల్లా, ఆచరణల వల్లా. తన అభిమానులైన బాపు రమణల గురించి, రమణగారి జోకులు, అడపా దడపా కనిపిస్తూనే ఉంటాయి పుస్తకంలో. కుల రాజకీయాలూ, అమెరికాలో అర్థాలు తెలీకుండా పిల్లలకి పెట్టుకునే పేర్లూ, పండగలన్నీ శనాదివారాల్లోనే చేసుకునే అమెరికా ఆనవాయితీలూ, ఏవీ, సత్యం గారి కలం నించి తప్పించుకోలేక పోయాయి.
414 పేజీల ఈ పుస్తకం తెలుగు సాహిత్య సౌరభం వారి ప్రచురణ. పేజీలెక్కువగా కనిపించినా, ఈ పుస్తకాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడే చదువుకోవచ్చు. మనసుని కొంచెం ఉల్లాసంగా ఉంచుకోవాలంటే ఒకటి రెండు వ్యాసాలు చదివితే చాలు. ఎంత బరువుగా ఉన్న హృదయమైనా వెంటనే తేలిక పడుతుంది మందులాగా.
ఇండియాలో పుస్తకం ఖరీదు రూ. 250 మాత్రమే. పుస్తక ప్రతులకి ఇండియాలో వి. లక్ష్మి గారిని, అమెరికాలో సత్యం గారిని, సంప్రదించండి.
****
నిజమే కల అయితే!
రెండో పుస్తకం. ఇదొక నవల. సత్యం గారు రాసిన పుస్తకాలన్నిటిలోకీ ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినదీ పుస్తకం. ఆయన మిగతా రచనలన్నీ ఒక ఒక ఎత్తైతే, ఇదొక ఎత్తు. పుస్తకం ముఖచిత్రం పై ఇదొక 'సంచలన నవల ' అని రాసారు. కాని నామట్టుకు ఇది ఒక 'పరిశోధనాత్మక నవల ' అని అనిపించింది. ఒక అపరాధ పరిశోధన నవలలా చదివించినా, ఇందులో అపరాధాలేవీ లేవు కాబట్టి ఇది అపరాధ పరిశోధన మాత్రం కాదు. ఒక రకంగా ఇది శాస్త్రీయ పరిశోధన అని చెప్ప వచ్చు. పాత్రలద్వారా చెప్పించిన సంభాషణలు ఒక్కోసారి బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’ నవల జ్ఞాపకానికి తీసుకొచ్చింది.
'మానవాతీత శక్తులున్నాయా? ఉంటే వాటికాధారాలేమిటి? పునర్జన్మ ఉందా? మనిషి చనిపోయాక ఏమిటౌతాడు? దేముడున్నాడా? దేముడనేవాడుంటే, నెగటివ్ ఫోర్స్, దయ్యాలు కూడా ఉంటాయా? మతమంటే ఏమిటి? హిప్నొటిజం తో మనిషి మనసు అంతరాంతరాలలోకి ప్రవేశించి పూర్వజన్మ గురించి తెలుసుకోగలమా? ఈ ప్రశ్నలకు నిర్దిష్టమయిన సమాధానాలు దొరకడం కష్టం. కానీ కాస్తో కూస్తో ఆలోచించే ఏ మనిషికైనా, పై ప్రశ్నలు రాక మానవు. సైన్సు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంది మధ్య మధ్యలో కొన్ని కథలు వింటూంటాం. ఫలానా ఫలానా వారికి పూర్వజన్మలో తానెవ్వరో, ఎక్కడ పెరిగిందో అన్నీ తెలుసట అంటూ. అందులో నిజమెంతుందో, అసలు ఉందో, లేదో, తెలియదు. శాస్త్రీయంగా శోధించే అవకాశాలు తక్కువ కూడా. ఎవరి ఆలోచనలను బట్టి వారు నమ్ముతూ ఉంటారు, నమ్మకపోతూ ఉంటారు కూడా.
సత్యం గారు, నవలలోని పాత్రలద్వారా పై ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేయిస్తూ పేరలల్ గా మరో కథ నడిపిస్తారు. ఒకటి అమెరికాలోని ఆస్టిన్ నగరంలో జరిగితే మరొకటి ఆంధ్ర దేశంలో గుంటూరులో జరుగుతూంటుంది. రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడూతూ, పాఠకుల ఆలోచనల్ని రేసు గుర్రంలా పరిగెట్టిస్తూ, సస్పెన్స్ లో ముంచి ఇంకా ఇంకా చదివిస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వారి సోషల్ ఆంథ్రోపోలొజీ, పారా సైకాలజీ డిపార్ట్మెంట్ వారు నిర్వహించే సెమినార్లో పాల్గొనడానికి వివిధ యూనివర్సిటీలనుంచి ఎంతో మంది ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. అందులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టర్ శంకర్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్, టొరోంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ చాంగ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లోనే సైకాలజీ డిపార్ట్ మెంట్ లో పని చేస్తూన్న ప్రొఫెసర్ నారాయణరావు, ఆయన మేనల్లుడు, సైన్సు ప్రాతిపదికగా కథలూ, నవలలూ రాసే ప్రహ్లాద్, కౌన్సెలింగ్ సైకాలజీలో పి.హెచ్.డి చేసి, ప్రాక్టిస్ చేస్తున్న దాక్టర్ మెలిస్సా మిల్లర్ - అందరూ కలసి చేసే ప్రాజెక్ట్ ఒక వైపు నుంచి సాగుతూంటుంది.
ఇక రెండో వైపు తిరువనంతపురం నుంచి ట్రాన్స్ఫర్ అయి గుంటూరు వచ్చిన అప్పుకుట్టన్ నాయర్, అతని భార్య మనోరమ. మనోరమ అమరావతి వెళ్ళడం, అక్కడ ఆమె మనసంతా గాభరా అయిపోయి ఎప్పుడూ తెలియని భాష, తెలుగులో మాట్లాడడంతో మొదలవుతుంది ఇంకో కథ. మనోరమకు పూర్వజన్మ వాసనలున్నాయా? సాకేతరాం ఒక డిటెక్టివ్ కాని డిటెక్టివ్ - అతని పరిశోధన జరుగుతూంటుంది.
ప్రొఫెసర్ల మధ్య సంభాషణలు, ప్రహ్లాద్ అడిగే అమాయకపు ప్రశ్నలు, దొరికీ దొరకని సమాధానాలు, ఇలా నడుస్తుంది.
రెండు సమానాంతరంగా సాగే కథలూ ఎక్కడో కలియాలిగా?
రచయిత కథని చక్కగా, మొదటినుంచి చివరవరకూ సస్పెన్స్, టెంపో చెదరనీయకుండా నడుపుతారు. నవలలో ఈ రెండు కథలనూ కలిపిన విధానం పాఠకులకు కొంచెం నిరుత్సాహ పరుస్తుంది. ఏదో అర్ధాంతరంగా కథ ఆపేయాలని ఆపేసినట్లుంటుంది. అది బహుసా రచయిత తను అనుకున్న విధమే అదేమో! ఇక్కడే పాఠకులనుకున్న నిజం కలగా మారిపోతుందేమో!
అంతం ఎట్లా ఉన్నా, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు, ఆపకుండా చదివించే పుస్తకం. ఆలోచింపచేసే అందరూ చదవదగ్గ నవల.
ఈ పుస్తకం కూడా తెలుగు సాహిత్య సౌరభం వారి ప్రచురణ. ఇండియాలో నవోదయా బుక్ హౌస్ లో కాపీలు దొరుకుతాయి. వెల రూ. 110. అమెరికాలో మాత్రం సత్యం మందపాటిగారిని సంప్రదించండి.
*****