top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

pusta.PNG
moggalu.PNG

ఇదివరలో పాలపర్తి ఇంద్రాణి గారి పుస్తకాలు పరిచయం చేసినట్లు గుర్తు.  అందులో ఆమె రాసిన ‘ఱ’ ఒకటి. పుస్తకాలకి ఇలాంటి పేరేమిటో అనిపిస్తుంది సహజంగా.  మొదటి సారి ‘కాకీక కాకికి కాక’ అన్న పుస్తకం పేరు ముందర సరిగా అర్థమయేటట్లు చదవడమే కష్టమయింది.  కాసేపటికి ఒక కాకీక (కాకి యొక్క ఈక) కాకికి (అవును మరి కాకికి) కాక ఇంకెవరికి?    

చిట్టెన్ రాజు గారు ‘ఇంద్రాణికి ముక్కుపడక’ అంటూ రాసిన ముందు మాటలో చెప్పిన గోతిలో పడిపోయాను.  ఆయన అంటారు “ఇంద్రాణి రచనలు అనగానే ‘హమ్మయ్య’ అసలైన అనుభూతి కవిత్వం చదువుకోవచ్చును’ అని అనుకోకుండానే అనుకునే ఆమె ప్రపంచవ్యాప్త అసంఖ్యాక అభిమానులని ఈ పుస్తకం భలే బోల్తా కొట్టిస్తుంది” అని.  ఇంతకీ నేనూ మోసపోయాను. కవిత్వం కోసం పేజీలు తిప్పుతుంటే కనిపించినవి వ్యాసాలు. ఓ పదిహేడు చిన్న చిన్న వ్యాసాల సంపుటి ఈ పుస్తకం. వ్యాసాలు చిన్నవే అయినా భావాలు పదును. అవి అనుభవాల అనుభూతులు.  ఇంద్రాణి కవిత్వమే రాయనక్కరలేదు. వచనం రాసినా అంత సూదిగానూ ఉంటుంది. అంత లోతూ ఉంటుంది. అంతా గాంభీర్యతా ఉంటుంది. అంత సూక్ష్మతా ఉంటుంది.  

Walmart వ్యాసంతో మొదలవుతుంది పుస్తకం.  షాపు మధ్యలో నిలబడి చుట్టూతా చూస్తూ ఒక అబ్జర్వర్ గా కొంచెం వ్యంగ్యం, కొంచెం విసుగు భావాలతో రాసిన వ్యాసమిడి.  చదువరిని కూడా మూడువందల అరవై డిగ్రీలలో నడిపించే అబ్జర్వేషన్స్. అలాగే Nails అనే వ్యాసం కూడా ఒక వ్యంగ్య పరిశీలనే.  “నీలి నీలి సినేమాలు చూసుకుంటూ రూమ్ రెంటు షేర్లు చేసుకుంటూ ఖాళీ బడ్వైజరు టిన్నులు పోగేసి అమ్ముకునే చెత్తనాకొడుకుల్లో నా రాకుమారుడు లేదంటావు గానీ అదే రియాలిటీరా వెర్రితల్లీ.  ఆ పుష్కాల్లోంచి పుట్టిన తలగాయని శీకాయివేసి వేళ్ళ్తతో బాగా రుద్దు’ అన్న మాటల్లో పచ్చి నిజం, సమాజాన్ని నిలువునా కోసేయగలిగే మాటల ఈటెలు ఈ రచయిత్రి తన సొత్తు చేసేసుకుంది.  

National Zoo – మనందరం జూ కెళ్ళి చక్కగా జంతువులు మనపక్కొచ్చేలా ఫూటోలు తీయించుకుంటామా ఎంచక్కగా?  ఈవిడకి ఇంకేవేవో కనబడతాయి. ‘ఈ జంతువుల్ని పట్టడం, వాట్ని జూల్లో, ఇళ్ళల్లో, బోనుల్లో పెంచడం పెద్ద యాపారం.  మాళ్ళా వాటికి పాకేజీల్లో ఆహారం. వాటికి జబ్బోస్తే మందు. డాక్టర్లు. ఏమనుకుంటున్నావ్?’ అని. ఇలా సాగుతాయి కొన్ని వ్యాసాలు.  అన్నీ కావు. ‘నేనెవరు’ అన్న ప్రశ్నతో సమాజంలో చుట్టూ వున్న వెయ్యి వేల అద్దాలలో ఇంకేదో చూస్తున్నామనుకుంటూ మన ప్రతిబింబమే మనం చూసుకుంటున్నామేమో అని గుర్తు చేస్తుంది రచయిత్రి.  ‘ఆంధ్రా విలాస్ కాఫీ క్లబ్బు’ ప్రముఖ కొన్ని దశాబ్దాల క్రితం రచయితలు, కవులని ఓ చోట చేర్చి వాళ్ళవైన డైలాగులతో సరదాగా అల్లిన రచన.  

అంత సూది పోట్లలోనూ, సీరియస్ ఆలోచనలు లేవని కాదు.  ‘యథా కాష్టంచ కాష్టంచ’ లో రచయిత్రి మాటల్లో “నిన్నటి రోజున మతాబాల్లా వెలిగిన స్నేహాలు, చిచ్చుబుడ్లలా వెళ్లివిరిసిన ఆప్యాయతలూ, ఇవాళ మాసిపోక తప్పదు.....మరణం తట్టని తలుపు లేదు.  అస్మదీయులని తస్మదీయులని ఒకే గాట కట్టి మాటు వేసి ఎత్తుకుపోతుంది” – ఒక నిస్పృహ, ఒక జీవిత సత్యం, మరి కొంచెం వేదాంతం కనిపిస్తాయి.  

కవిత్వం గురించి కొన్ని ఆలోచనలు పంచుకున్నారు ఇంద్రాణి గారు.  ఒక వ్యాసం, చిన్న సైజు పాఠమే! ‘శూన్యంలోనుండి పువ్వులు రాలినట్లు రాలతాయ’ట పదాలు కవిత్వానికి.  ‘చెవి దగ్గర రొద పెడతాయి’ట. ‘చేతి వేళ్ళ మీద వాలి రెక్కలారుస్తాయ’ట. కవిత్వం పాఠకుడి మనస్థాయిని పెంచాలంటారు రచయిత్రి.  బాధ్యత కవిమీదనే వున్నా, చదివే పాఠకుడి మనస్థాయిని బట్టి కూడా ఉంటుంది కదా, అది పెరిగినా, తరిగినా.  

నాకు నచ్చిన వ్యాసం, ‘సాహిత్యంలో శబ్దము – నిశ్శబ్దము’ – ఈ వ్యాసాన్ని రచయిత్రి ఒక సభలో చదివినట్లు జ్నాపకం.  శబ్దప్రపంచంలో నిశ్శబ్ద అనుభూతి సాహిత్యానికి, ముఖ్యంగా కవిత్వానికి ఎంత ప్రాణం పోస్తుందో నిశ్శబ్దంగానే చెబుతారు రచయిత్రి.  ఆమె ఉల్లేఖించిన ఇస్మాయిల్ గారి మాటలు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.  

వ్యాసాలు కొంచెం అటు, ఇటు అడుగులు వేసి నాట్యం చేసినా, రచయిత్రితో పాటు పాఠకులని కూడా నిశ్శబ్ద, శూన్య ప్రపంచంలో రాలుతున్న పువ్వులననుభవించేటట్లు చేస్తుంది.  చదవండి.  

ఈ పుస్తకం వంగూరి ఫౌండేషన్ వారి డెబ్భై ఎనిమిదో ప్రచురణ.  వెల రూ.80.00

 

రెండో పుస్తకం, ఇంద్రాణి గారిదే, ‘కాళీ పదములు’.   ‘మనవి మాటల’లో “మనసు అనేకానేక విషయ వాంఛల తూగుటూయ్యాలలో తల్లకిందులౌతూ, కాసేపు ఆనందానికి, కాసేపు దుఃఖానికి లోనౌతూ, మనుష్యులను సంతోషానికై బిచ్చమెత్తే ఒకానొక బేలస్థితిలో ఎదురైంది కాళి.  అప్పటినించీ నన్ను చేయి పట్టి నడిపిస్తూంది” అంటారు రచయిత్రి తనకు కలిగిన స్ఫూర్తి గురించి రాస్తూ.   

నల్లని గంగ

గొంతుకలో ఊగే 

నాలిక 

అన్న పదప్రయోగంతో మొదలౌతుంది దక్షిణేశ్వర్ కాళి గుడిపై ఆమె అనుభావన.  వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాస్తూ, ‘తల్లికోసం బిడ్డ ఎంత తపిస్తుందో, బిడ్డ తల్లికోసం ఎంత ఆరాటపడుతుందో అంతా ఇందులో ఉందం’టారు.  

కవితను చదువుతూంటే మనంకూడా ఆమెతో గుడి పక్కన గంగా నది ఒడ్డున సంధ్యావేళ కూర్చుని అనుభవించకుండానే అనుభవించగలం.  ‘అనుభూతి ధోరణిని విడవకుండానే, అధ్యాత్మిక భావాలను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ, ప్రశ్నించుకోవడమే ఇంద్రాణి కవితా ప్రస్థానంలో మరొక కోణం’ అంటారు వంగూరి చిట్టెన్ రాజు గారు తన మాట రాస్తూ.  ఇది అక్షరాలా నిజం.  

తల్లో

తుమ్మెదలకు

మత్తుమందు తాగించి

లోకపు పచ్చి వాసనలను

కప్పి పెడుతున్న 

రాత్రి 

ఎంత లోతైన  భావన! రచయిత్రి ఈ పద ప్రయోగం చేసే ముందుగానే ఆమె మెదడులోకి ప్రవేశించి వుంటే బహుశా ఆలోచనా ప్రక్రియ కొంచెం అర్థమయేదేమో!

కవితలలో జీవితపు విషాద ఛాయలు కనబడతాయి.  ఒంటరి స్త్రీ సమాజంలో ఎదుర్కునే సమస్యలు కనబడతాయి.  మగవాడి వాంఛ, అహంభావాల్ని ఎర్రని మంటల్లా కనబడుతున్న కాళిక కళ్ళు భస్మం చేయవా?

నల్లని కురులుగా పాకుతున్న నీడలో, తుమ్మెదలను తోస్తున్న గాలిలో, నీటి తుంపరల చిన్ని వానలో’ చూసింది కాళిని కవయిత్రి.  కాళిక కనిపించని రూపమేదీ? కాళిక నవ్వుల సవ్వడి వినని చోటేదీ? చిన్న పదాలతో భయంకరమైన కాళిని, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేసే ఆ తల్లిని రచయిత్రి ఎలా చూసిందో చూడండి.

ఎగసిన జ్వాలలు

కాళిక నాల్కలు 

కోపపు చూపులు 

వేల్చును కాల్చును 

కోర్కెలు పల్కులు

బిగిసిన తల్పులు 

పదం పదం భావించాలి ఈ కవితల్ని అనుభవించాలంటే.  

పై రెండు పుస్తకాలూ చదవదగినవి, రెండూ వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించినవే.  పుస్తకాలు కావాలనుకునేవారు ప్రచురణకర్తలను సంప్రదించండి.  

 

 

ఇక మూడవ పుస్తకం నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన ‘సీత జోస్యం’.  చిన్నప్పుడు అమ్మ చెప్పేది వెంకటేశ్వరరావు గారిని కమ్యూనిస్టు అనేవారని.  నాకు తెలీదు. నాకు తెలిసినదల్లా ఆంధ్ర ప్రభలో మా అమ్మ మమ్మల్ని అడపా దడపా చదివించే ఆయన రాసే సంపాదకీయాలు.  గంపెడు విషయాలు గుప్పెట్లో పట్టించినట్లుండేవి. విషయంలో స్పష్టత, భాషలో పట్టు కనబడేవి. 

 

ఆయన ఒక హేతువాది.  మానవతా వాది. ఆయన ఆలోచనలు ఎంత బలమైనవో చూడండి ఆయన మాటలలో.  

“నాది ఆర్య, ఆర్యేతర దృష్టి కాదు.  భాహ్మణ, భ్రాహ్మణేతర దృష్టి అసలే కాదు.  అవి సంకుచిత దృష్టులు. అవి నాకుంటే, నన్ను చూచి నేనే సిగ్గు పడాలి.  జాతిమత కుల వర్గ విభేదాలన్నీ సమసి పోవాలి; సమతాస్వాతంత్ర్యాలు సర్వత్రా నెలకొనాలి; దారిద్ర్యం, దైన్యం ఈ భూతలం నుంచి మటుమాయమైపోవాలి; అణ్వస్త్రయుద్ధం ద్వారా నరజాతి, దాని నాగరికత సర్వనాశం కాగల ప్రమాదం పూర్తిగా తొలగాలి; వివేకవిజ్ణానాలు వర్థిల్లాలి; మానవునికి అతడి మానవతకు పట్టాభిషేకం జరగాలి – ఇదే నా ఆరాటం, ఇందుకే నా పోరాటం.  ఈ పోరాటంలో మీరు నా సరసను నిలిస్తే సంతోషిస్తాను; నా సమ్ముఖంలో నిలిచినా సంతోషిస్తాను; ఇదే మీకు నా ఆహ్వానం; నా పక్కనో, నా యెదుటనో బారు తీరండి, పోరులో దూకండి”.  

సుమారు 1962 ప్రాంతంలో రాసిన నాటకం ఈ ‘సీత జోస్యం’.  ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ చెప్పిన మాటలవి. 

నాటకం సుమారు ముప్ఫై పేజీలైతే, ఉపోద్ఘాతం సుమారు నూట ముప్ఫై పేజీలు.   రామాయణ గాథకు చరిత్రకాధారం ఏమైనా వున్నదా? రాముని వనవాసమేప్రాంతంలో? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎన్ని వున్నా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి ఇప్పటికీ.  అందుకు ఒక కారణం రామాయణాన్ని మరో కోణంలో చూడలేకపోవడం, తరతరాలుగా వస్తున్న మన నమ్మకాల్ని వదిలించుకోలేకపోవడం, రాముని పట్ల, రామాయణం పట్ల వుండే దైవభావాన్ని, ఆరాధనా భావాన్ని ప్రశ్నించుకునే ధైర్యం లేకపోవడం, పురావస్తు శాస్త్రజ్ఞులు సారి అయిన ప్రదేశాల్లో తవ్వకపోవడం అంటారు నార్ల.  

అయితే నార్ల గారు చూసిన కోణం ఏమిటి?  

పీఠికలో ఆయన చర్చించిన విషయాలు, రామాయణంలో నిజమెంత? లంక ఎక్కడిది? అయోధ్యకు, లంకకు, దూరమెంత? రాక్షసులెవరు? ఋషులెవరు? ఋషుల కుట్రలో రాముని పాత్ర ఏమిటి? అప్పట్లో ఆయుధాలేమి వాడారు? సీతారాముల మధ్య సంబంధమెలాంటిది?  సీత వ్యక్తిత్వమెలాంటిది?

అన్నీ విషయాల్లోనూ నార్ల వారు ఎన్నో గ్రంధాలను, విశ్లేషణలను, చదివి తన ఆలోచనలను ఏర్పరచు కున్నారనడంలో సందేహం లేదు.  తాను చదివిన గ్రంథాలన పుస్తకం చివర జతపరిచారు కూడా.  సాంప్రదాయవాదులంటే ఆయనకు కొంచెం చులకన చూపున్నా, సాధ్యమయినంతవరకు ఒక హేతువాదిగా, రామాయణాన్ని ఒక పరిశోధకుడిగా, ఒక విశ్లేషకుడిగా, పాఠకుడికి పరిచయం చేశారు.  ఆయన అంటారు కదా, “రామాయణంలో చారిత్రక సత్యం రవ్వంతగా వుంటే, అది క్రీస్తుకు పూర్వం పదవ శతాబ్ది ప్రాంతాల ఉత్తరభారతంలోగల కొద్దిపాటి రాజ్యాలు పెక్కింటిలో ఒకదానికి చెందిన రాజాస్థానంలోని కుట్రలకు పరిమితమని నా వైఖరి; రామరావణ యుద్ధమనేది నిజంగా జరిగివుంటే, దాన్ని ఆహారసేకరణ, ఆహారోత్పత్తి వ్యవస్థల మధ్య సంఘర్షణగా పరిగణించవచ్చని నా వాదం.  రామాయణ భారతాలైనా, అష్టాదశ మహాపురాణాలైనా వాటి ప్రధానోద్దేశాలు కులవ్యవస్థను పరిరక్షించడమే. ఫ్యూడల్ సంఘాన్ని సుస్థిరం చేయడమే”.

రామాయణ కాలంలో జనాభా చాలా తక్కువ.  అరణ్యాలెక్కువ. లంక (నీరున్న ప్రదేశం) మహా అయితే నూరు మైళ్ళ దూరంకంటే ఎక్కువకాదు.  ఋషులు పాడి, పంటలతో పాలనా పోషణా తెలిసిన జ్ణానపరులు. అయితే విస్తరించడానికి భూమి కావాలి.  అరణ్యాలను దహనం చేస్తేనే కాని కొత్త భూమి వ్యవసాయానికి రాదు. వారికి ఆటంకం అడవులలో ఉండే ఆదిమజాతి వారు.  అరణ్య దహనానికి అడ్డుకునేది ఎందుకంటే వారి జీవనమక్కడే కదా మరి? అందుకే ఋషులకు రాజుల మద్దతు కావాలి ఆ ఆదిమవాసుల్ని నిర్మూలించాలంటే.  వనవాసం ఎక్కడ చేయాలో, ఆ వనవాస జీవనంలో రాముడి చేత ఆ రాక్షసులనబడే ఆదిమజాతి వారిని ఎలా సంహరించి భూములను ఋషులకిప్పింపజేయాలో అన్నది ఋషుల కుట్ర.  రాజుల్ని పొగడడం ఆకుట్రలో ఒక భాగమే. ఆ విషయం పసికట్టిన సీతకు, రామునికి, లక్ష్మణునికి మధ్య వనవాసానికి ఎగిన కొత్తల్లో జరిగిన వాగ్వివాదమే ‘సీత జోస్యం’ నాటకం.  

నాటకం చివరిలో సీత చెప్పిన మాటలివి:

“ఔను! మీ వంశగౌరవమే మీకు కావలసింది, నేను కాదు!  వెళ్ళండి! వెళ్ళి, నిరపరాధులను చంపి, మీ వంశ గౌరవం కాపాడుకోండి!!  కానీ ఆగి ఒక్క మాట వింటారా? అవసరమైతే నన్ను విడుస్తామన్నారు. మీరంతటివారే!   మీ వంశ గౌరవానికి బలిగా ఎప్పుడో ఒకప్పుడు ఈ నట్టడివిలోనో నన్ను దిక్కులేని దాన్నిగా మీరు దిగవిడుస్తారు”!!

పద్నాలుగు సంవత్సరాల తరవాత వంశగౌరవం కోసం తనని అడవిలో వదిలివేస్తాడని సీత చెప్పిన జోస్యం.  అయితే అంతకంటే ముఖ్యమైనది నార్ల వారి ఆలోచనలు, ఆయన హేతువాద తత్వం, మానవతావాదిగా ఆయన తపన పుస్తకంలో చూడవచ్చు.  

  

ఇది విశాలాంధ్రా పబ్లిషింగ్ హౌస్ వారు 2016 లో ప్రచురించిన పుస్తకం.  ఖరీదు రూ. 130.  

తెలుగు సాహిత్యంలో పరిమళిస్తున్న "మొగ్గలు"

- పుట్టి గిరిధర్

 

తెలుగులో ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా కవిత్వం వివిధ ప్రక్రియలతో పాఠకులను అలరిస్తూ వస్తున్నది.

ముత్యాలసరాలు, వచనం, గేయం, గజల్, రుబాయీ, ముక్తకాలు, వ్యంజకాలు, పంచపదులు, హైకూలు, నానోలు, నానీలు, రెక్కలు ఇలా ఏ ప్రక్రియ చూసినా దేనికదే ప్రత్యేకం. ఇప్పుడు ప్రముఖ కవి, పరిశోధకుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ "మొగ్గలు" అనే నూతన కవితా ప్రక్రియను ఆవిష్కరించారు.అదే పేరుతో కవితా సంపుటిని వెలువరించారు. పేరులోనే పరిమళం విరజిమ్ముతుంది. మూడక్షరాల ప్రక్రియ మూడు పాదాలతో ఉంటుంది. మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని భావయుక్తంగా, అర్థవంతంగా చెబితే మూడవ పాదం దానికి సమర్థింపు వాక్యంగా ఉంటుంది. ఇప్పటికే శతాధిక కవులు ఈ మొగ్గలను వారి కలం ద్వారా పరిమళింపజేశారు. 

భీంపల్లి శ్రీకాంత్  మొదటి సంపుటిలో అందించిన మొగ్గలను పరిశీలిస్తే...ఇందులో మొత్తం మూడు వందల  మొగ్గలు ఉన్నాయి. ఇందులో అక్షరాలు లోకానికి ఎంతటి వెలుగునిస్తాయో, పుస్తకం బుద్ధిని ఎలా వికసింపజేస్తుందో, కవిత్వం మనసును ఎంత ప్రభావితం చేస్తుందో, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో, సమాజం పోకడలను, ప్రేమలు, బంధాలు ఎన్ని అనుబంధాలను పెంచుతాయో, విజయానికి పునాదులు ఎలా వేసుకోవాలో, కష్టసుఖాల కలబోతే సంసారమని, పిల్లలు ఆత్మీయతలు ఎలా ఉంటాయో, వర్షం, నది, సముద్రం, చెరువు వంటి ప్రకృతి దృశ్యాలను, అలాగే రైతు, విత్తనాలు మొదలైన వ్యవసాయ సంగతులను, రాజకీయ సంబంధ విషయాలు ఇలా సందర్భానుసారంగా అన్ని అంశాలను మొగ్గల ద్వారా అందించారు. చివరికి మొగ్గలు సాహిత్యంలో ఒక ప్రక్రియగా ఎలా సాగుతుందో, దాని ఆశయం, నిర్వచనం వివరిస్తారు.

భీంపల్లి శ్రీకాంత్  ఈ మొదటి సంపుటిలో అందించిన మొగ్గలను పరిశీలిస్తే, ఇందులో దాదాపు మూడు వందల వరకు మొగ్గలు ఉన్నాయి. మౌనం గురించిన మొగ్గలను చూస్తే...

 

"మనసు మౌనంగా ఉంటేనే కానీ

భావం ప్రకాశమై ఉన్నతంగా భాసించదు

మౌనం ఆలోచనల తరంగం!"

 

"వాడు మౌనంగా ఉన్నాడంటే

ఏదో ఆలోచనకు బీజం వేసినట్టే

మౌనం ఒక మహావిస్ఫోటనం!"

 

మౌనం యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించే మొగ్గలివి. ఎంత మౌనంగా ఉంటే అంత గొప్పగా వెలుగొందడం చూస్తూనే ఉంటాం. అలాగే మౌనంగా ఉండటం చేతగానితనం కాదు లోపల ఏదో ఆలోచనల అలలు కదలాడుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు కట్టలు తెంచే ప్రవాహం బయటపడుతుంది. అదే అంశాన్ని మొగ్గలుగా వ్యక్తపరిచారు.

 

"గతాన్ని తవ్వితే గానీ

భవిష్యత్తు కనిపించదు

చరిత్ర ఒక పాఠం!" ఇది వాస్తవం. పునాదులు లేకుండా భవనం లేనట్లే గత అనుభవాలు లేకుండా వర్తమానం, భవిష్యత్తు లేవు. అదే విషయాన్ని చరిత్ర పాఠంగా ఈ మొగ్గలో చెప్పారు.

కొన్ని విలువైన మొగ్గలను ఒకసారి చూస్తే...

 

తప్పటడుగులు వేయనిదే

ఏ విద్యార్థి జీవితంలో రాణించలేడు

తప్పటడుగులు ఒక గుణపాఠం!

 

కన్నీరును రుచి చూస్తేనే కానీ

బాధల బరువు తెలియదు

వేదన ఒక పచ్చిగాయం!

 

మానవత్వంతో మసిలితేనే కానీ

సమానత్వ బీజాలు నాటుకోవు

సమానత ఒక మానవతా దీపిక!

 

సాగరమెంత పొంగిపొరిలినా

దాని గమ్యం తీరం వరకే

మనసు అదుపుకో సంకేతం!

 

కవిత రాయకుండా నేను నిద్రపోతానా

కాలం నన్ను కసిదీరా కాటేస్తూనే ఉంటది

కవిత కాలాన్ని పట్టిచూపే కాగడా!

 

అజ్ఞానాంధకారం ఆవహించినప్పుడల్లా

విజ్ఞాన రేకై విచ్చుకుంటూనే ఉంటుంది

జ్ఞానాన్ని పంచే వెలుగు దివిటి పుస్తకం!

 

ఓటమిలోని ఆనందాన్ని చవిచూస్తేనే కదా

విజయాన్ని చేరుకునే మార్గాలు తెలిసేది

ఓటమి చెందడమే విజయానికి నాంది!

 

"సమాజంలో అలుముకున్న చీకట్లకు

మొగ్గలు దారి దీపాలవుతాయి

సాహిత్యంలో తొలి అడుగులు!" 

అంటూ మొగ్గలతో మొదటి అడుగులను వేస్తూనే, సమాజంలో మార్పును తెచ్చే దీపాలు కావాలనే ఆకాంక్షను తెలియజేస్తున్నారు.

ఇలా మొదటి రెండు పాదాలను లోకం నుండి గ్రహించి, మూడవ పాదాన్ని తమ అనుభవంలోంచి వ్యక్తం చేయడం ముఖ్యం. ఇలా సమాజాన్ని మూడు పాదాలు గల మొగ్గల్లో ఇనుమడింపజేస్తారు.

భీంపల్లి శ్రీకాంత్  సెప్టెంబర్ 2017 లో ప్రారంభించిన మొగ్గలను ఇప్పటికే శతాధిక కవులకు పైగా రాస్తూ ఉన్నారు. నానీల తర్వాత అంతటి ఆదరణ లభించిన ఏకైక ప్రక్రియ మొగ్గలు కావడం విశేషం. రాసే విషయంలో క్లుప్తత, భావంలో స్పష్టత, బలమైన చివరి పాదంతో మొగ్గలు మరింత విస్తరించాలి. అందరి హృదయాలను చూరగొని తెలుగు సాహిత్యంలో చిరకాలం పరిమళాలను వెదజల్లుతూ ఉండాలి.

*****

bottom of page