top of page

సంపుటి 1    సంచిక 4

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

ఈ మధురవాణి 2016 దసరా-దీపావళి సంచికలో మూడు పుస్తకాలు పరిచయం చేస్తున్నాం.  మొదటిది జయంతి ప్రకాశ శర్మ గారు రాసిన ‘ఎడారి పరుగు’ అనే కథా సంకలనం, ఒక  తెలుగు కవితలకు ఆంగ్లానువాదం -  ఎన్నెస్ మూర్తి గారు రాసిన ‘Wakes on the Horizon’, మూడోపుస్తకం శ్రీమతి గోవిందరాజు మాధురి గారు రాసిన 'పాణిగ్రహణం పదిరోజుల్లో' అనే కథా సంకలనం.

మహాదేవివర్మ గీతాలు

ఎడారి పరుగు ~జయంతి ప్రకాశ శర్మ

శాయి రాచకొండ

mukundra ramarao

‘ఎడారి పరుగు’ జయంతి ప్రకాశ శర్మ గారు వ్రాసిన కథల సంపుటి. 1978 నుండి 2000 సంవత్సరం వరకూ రాసి పలు పత్రికలలో ప్రచురింపబడిన కథలను ఒక సంపుటిగా ప్రచురించారు.    

 

ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ముందుమాటలో చెప్పినట్లుగా శర్మ గారి కథలు మధ్యతరగతి మందహాసాలు.  నా ఉద్దేశ్యంలో దిగువ మధ్యతరగతి అంటే నిజానికి ఇంకా దగ్గరగా ఉంటుందేమో!  కథలు చదువుతూంటే, నేను విజయనగరంలో పెరిగిన వాతావరణం కొట్టొచ్చినట్లు కనబడుతుంది.  అరవై, డెబ్భై, ఎనభైలలో అలా మధ్యతరగతి వాతావరణంలో పెరిగిన అందరూ, ఈ కథలను తమకు సులభంగా అన్వయించుకో గలరు.  కథలు చదువుతూంటే, కథకుడికీ, ఆ జీవితాన్ని అనుభవించిన పాఠకుడికీ, మధ్యలో ఒక సంబంధం ఏర్పడుతుంది. 

 

ఈ పుస్తకంలో పదిహేడు కథలు వివిధ పుస్తకాలలో ప్రచురించ బడిన కాల క్రమంలో ఉన్నాయి. ఇరవై రెండేళ్ళలొ రచయిత పొందిన పరిణితిని కూడా పాఠకులు చూడవచ్చు. 

 

శర్మ గారు సహజమైన కథకులు.  ‘చివరి మాట’ లో ఏ.ఎశ్వీ. రమణారావు గారు 'విషయాన్ని రసాత్మకంగా విపులీకరంచడంతో బాటు వైవిధ్యభరితమైన ముగింపుతో' రచనలు అందర్నీ ఆకట్టుకుంటాయని తన అభిప్రాయాన్ని చెబుతారు.  అది నిజం.  నేను మళ్ళీ చెప్పనక్కరలేదు.  కథలు చెప్పడం అందరికీ రాదు.  ఆ వచ్చిన కొందరూ రచయితలు అవాలనేమీ లేదు.  కథ చక్కగా చెబుతూ, చివరగా కొస మెరుపుల్ని తగిలించి రాయ గలిగిన వారిలో శర్మ గారు ఒకరు.

 

పుస్తకానికి 'ఎడారి పరుగు ' అన్న కథ పేరే పెట్టబడింది.  ఆ కథలో సుందరానికి తను ఎక్కవలసిన ప్రతి రైలూ, జీవితకాలం లేటే.  అట్లా కొందరు దురదృష్టవంతులుంటారా? లేక అది తమకు తాము అనుకోవడంలో ఉందా?  కథ చదవండి.

 

నాకు నచ్చిన కథ ‘వీక్షణ’.  రైలు ప్రయాణం నేపధ్యం. జీవిత ప్రయాణమే మరి.  నవ నాగరీకమయిన దుస్తులు వేసుకున్న తల్లి, పిల్లాడితో ప్రయాణం, పిల్లాడి ఏడుపు, తల్లికి తన పాలిచ్చే అవసరం, కాకుల్లా చూపులు, చివరికి శాలువా ఇచ్చి సహజ సిద్ధమయిన మాతృ ప్రేమను సంకోచించకుండా పిల్లడికి ఇచ్చే అవకాశం కలిగించడంతో కథ ముగుస్తుంది.  అయితే చివరి వాక్యం 'అవును, నిజమే, అప్పట్నుంచీ నా జుట్టుకి రంగు వేయటం మానుకున్నాను’ అన్న వాక్యం చదువరిని ఓ కుదుపు కుదిపి వంద రకాలుగా ఆలోచింపచేస్తుంది. 

 

ఇలా ఎన్నో వైవిధ్యమైన కథలున్నాయి.  చాలా కథలు బాగున్నాయి.  కొన్ని మాములుగా ఉన్నాయి. అన్నీ జీవితాన్ని సూక్ష్మంగా పరిశీలించి రాసినవనడంలో అనుమానం లేదు.  సరళమైన భాష,  చిన్న చిన్న కథలు.  సూక్ష్మమైన రూపంలో జీవిత అనుభవాలకు చిన్న కథల రూపం ఇచ్చి మనముందుంచిన పుస్తకం ఇది. 

 

ప్రతులకు రచయితనే సంప్రదించండి.  వెల రూ. 100 మాత్రమే.

శాయి రాచకొండ

విజయనగరం వెళ్ళినప్పుడు చాగంటి తులసి గారిని కలిసే అవకాశం కలిగించాడు శ్యాం.  ఆవిడ నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒకటి 'మహా కవయిత్రి మహాదేవివర్మ గీతాలు'.  ఇవి మహాదేవివర్మ గారు హిందీ లో రాసిన కవితలకి తులసి గారు చేసిన అనువాదాలు.  తులసి గారు అటు తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగులోనికి కూడా ఎన్నో తర్జుమా చేసారు.  ఒక భాషలో వ్యక్త పరచిన భావాలు నలుగురూ పంచుకోగలిగి, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచగలిగే అవకాశం ఈ అనువాద గ్రంధాలు మాత్రమే ఇవ్వగలవు.  అలాంటి సదుద్దేశంతో ఆవిడ అలుపులేకుండా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.​

Wakes on the Horizon    - నౌడూరి మూర్తి (ఎన్నెస్ మూర్తి)

శాయి రాచకొండ

dasari amarendra

ఆంగ్లంలోనుంచి తెలుగులోకి అనువదించడం ఒక ఎత్తైతే, తెలుగులోంచి ఆంగ్లంలోకి అనువదించడం మరో ఎత్తు.  అంతే కాదు, వచనం వేరు, కవిత్వం వేరు.  రెండోది అంత సులభం కాదు అనువాదానికి.  అంతే కాదు, ఒక కవితను అనువదించడం వేరు, ఛందోబద్ధమయిన పద్యాన్ని అనువదించడం వేరు.  పాఠకులకే అందని ఎందరో తెలుగు కవుల రచనలను ఆంగ్లంలోకి అనువదించడం నౌడూరి మూర్తి (ఎన్నెస్ మూర్తి) గారు చేసిన సాహసమే ఈ పుస్తకం ‘Wakes on the Horizon’. 

 

 

ఆంగ్లంలో అనువదించడంలో రెండు రకాల ఉద్దేశ్యాలుంటాయి.  నౌడూరి గారు చెప్పినట్లుగా అనువాదం ఒక భాషనుంచి ఇంకో భాషకు ప్రసారం చేసే భావ వల్లరి.  రచయిత తన మాతృ భాషలోని భావాల్ని అనుభవించి, ఇతర భాషలలో వారికి పంచాలనే బలవత్తరమైన కోరికతో చేసే పని.  ఇక రెండవది అనువదించిన భాషలో తన పటుత్వాన్ని చూపించడం. 

 

రవీంద్రనాథ్ టాగోర్ తన కవితలని తనే ఆంగ్లంలోకి అనువదించినప్పుడు, గీతాంజలి లాంటి గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొంది, ఆయనకు నోబెల్ బహుమతి తెచ్చి పెట్టాయి.  అంటే పాశ్యాత్య సాహితీ పరులు ఆ అనువాదాన్ని చదివి, తామే అనుభవించి, ప్రశంసించడమో, విమర్శించడమో చేయ గలగాలి.  అంటే అనువాద గ్రంధంలోని అంశాలు పరాయి భాషలోను,ఆయా  సంప్రదాయంలోను ఇమడ గలగాలి.     అప్పుడే ఈ అనువాదాలకి ఒక అర్థం కలుగుతుందని నా అభిప్రాయం.

 

సుమారు రెండు వందల (199) కవితలను, పద్యాలను అనువదించిన నౌడూరి గారి కలం పదునైనదే.  విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా, శ్రీశ్రీ ల దగ్గరనుంచి అఫ్సరు లాంటి సమకాలికులిక కవితల అనువాదాలు పుస్తకంలో చూడవచ్చు.  నౌడూరి గారు ఉపయోగించిన పదజాలం కొంచెం విస్తృతమే.  కొన్ని అనువాదాలు బాగున్నాయి.  కాని కొన్ని మాత్రం తగు మాత్రం గానే ఉన్నాయి.  తెలుగు నుడికారాలను అనువదించడం అంత సులభం కాదు.  రచయిత చేసిన ఈ సాహసం అభినందించదగినది.

 

"వాకిలి" వారు ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు భారత దేశంలో 199 రూపాయలు, అమెరికాలో 15.95 డాలర్లు. వంగూరి ఫౌండేషన్ వారు పంపిణీ దారులు.

పాణిగ్రహణం పదిరోజుల్లో   - గోవిందరాజు మాధురి

శాయి రాచకొండ

భువనచంద్ర, Buvanachandra

గోవిందరాజు మాధురి గారు రాసిన ఈ పుస్తకంలో కొత్తకోడలు మరియు అత్తగారి మధ్య ఉన్న వైవిద్య భావస్వరూపాలను గురించి రాసిన ఆహ్లాదకరమైన మొత్తం పది కధలు ఉన్నాయి. ఇందులో మూడు కధలు పాణిగ్రహణం పదిరోజుల్లో, (07.05.2014) అచ్చెరువు చెందిన అత్తగారు 05.09.2014), టూల్బార్ కోడలు, టూరిస్ట్ అత్తగారు (06.07.2015) ఆల్ ఇండియా రేడియో, విజయవాడ కేంద్రం నుండి ప్రసారించబడినవి.

 

ఈ పుస్తకానికి ముందుమాట రచయిత ప్రొఫెసర్ శ్రీ కవనశర్మ గారు, (బెంగళూరు) రాసారు. వారి మాటల్లో “ ఈ పుస్తకంలో మధురమైన ఆహ్లాదకరమైన పది కధలు వండి వడ్డించారు రచయిత్రి....” అని పది కధల గురించి వారి అభిప్రాయం రాసారు. అందులోనూ కధకి కావలసిన కధా నేపధ్యం గురించి.... రచయిత్రికి జ్ఞానం ఉండటం అని వారు అభిప్రాయం తెలియజేయటం అది వారు తన కిచ్చిన  ఆశీర్వచనాలతో పాటు తన అదృష్టంగా భావిస్తూ మరిన్ని కధలు రాయటానికి ప్రొత్సాహం లభించింది అని చెప్పు కున్నారు రచయిత్రి.

 

శ్రీమతి గోవిందరాజు మాధురి, ఎమ్. ఎస్.సి, (సైకాలజి) చదివి, చెనై పోర్టు ట్రస్టులో మూడు దశాబ్దాలు హ్యుమన్ రిసోర్స్ డెవలెప్ మెంట్ లో ఆఫీసర్ గా పని చేసి 2013 స్వఛ్చంద పదవీవిరమణ చేసి స్వస్ధలం అయిన గుంటూరులో స్దిరపడ్డారు.

 

ఆవిడ  రాసిన ఈ  “పాణిగ్రహణం పదిరోజుల్లో” పుస్తకం 2016 జనవరిలో ముద్రించబడినది. ఇది ఆమె రాసిన రెండవ పుస్తకం.  ఈ పుస్తకం విశాలాంద్రా పబ్లిషింగ్ హౌసే, ఆంధ్రప్రదేశ్ మరియు నవచేతన పబ్లిషింగ్ తెలంగాణాలో దొరుకును. లొగిలి.కామ్ లో కూడా ఉన్నవి.

 

ఈ పుస్తకం వెల ఇండియాలో రు. 100/-. మరియు విదేశాల్లో $10.

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మేరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

bottom of page