top of page

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

chaganti2.png
chaganti.png
konaseema.png

మూర్తిమంతమాయె మూలకమ్ము

 

‘మూర్తిమంతమాయె మూలకమ్ము’ అంటూ ముందుకొచ్చేరు మరో శాస్త్రీయ పుస్తకంతో, డా. చాగంటి కృష్ణకుమారి గారు.  

చాగంటి కృష్ణకుమారి గారు ఉపాధ్యాయ వృత్తి చేబట్టి 36 సంవత్సరాల పాటు రసాయన శాస్త్రాన్ని బోధించారు.  1992 నుండి అంటే సుమారు ముప్ఫై పైచిలుకు సంవత్సరాల బట్టి ఆవిడ సామాన్యులను దృష్టిలో పెట్టుకుని అందరికీ అర్థమయే రీతిలో, సులభ శైలిలో, ఆసక్తి కరంగా ఎన్నో శాస్త్ర విషయాలను పుస్తకాల రూపంలోనూ, ప్రసంగాల రూపంలోనూ తెలుగు పాఠకులకు, ముఖ్యంగా చదువుకునే పిల్లలకోసం అందించడం జరిగింది.    ఎన్నో గుర్తింపులందుకున్న కృష్ణకుమారి గారు వివిధ వైజ్ఞానిక అంశాలపై పలు రేడియో కేంద్రాలనుంచి ప్రసంగాలు చేశారు.  తనదంటూ ఒక యూట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తూ, తన సైన్స్ ప్రసంగాలను అందరికీ అనువైన ఈ మాధ్యమంలో కూడా అందిస్తున్నారు. 

వైజ్ఞానిక విషయాలను తెలుగులో పిల్లలకు పెద్దలకు కూడా అందించే కృషి చేస్తున్న వ్యక్తులు చాలా తక్కువమంది.  అందులో కృష్ణకుమారి గారు అగ్రగణ్యులనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రయోగం అంత సులభమైన పని కాదు.   శాస్త్రీయ పదాలను తెలుగులోకి అన్వయించడం, ఆ జ్ఞానాన్ని ఎంచుకున్న వయసు పిల్లలకు వారికి తగినట్లుగా తగు మోతాదులో అందించడం చాలా ఆలోచన, వోర్పు లతో కూడుకున్న పని.   

ఇక పుస్తకానికి వస్తే, ప్రచురణ కర్త మాటలలో, “విజ్ఞాన ప్రసార్ ప్రొజెక్టులో భాగంగా విజ్ఞానశాస్త్ర పుస్తకాలను తెలుగులో ముద్రించి విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి” అన్న ఉద్దేశ్యంతో ఈ ప్రొజెక్టు ద్వారా మొదటి పుస్తకంగా డాక్టరు చాగంటి కృష్ణకుమారి గారు రచించిన “మూర్తిమంత మాయె మూలకమ్ము” ను ఎన్నుకొని ముద్రించారు. 

రసాయన శాస్త్రంలో అన్ని పదార్ధాలలో ఉండే మూల ధాతువుల గురించి చెప్పేది పీరియాడిక్ టేబుల్ లేదా ఆవర్తన పట్టిక.  ఇంతవరకు కనుక్కున్న మూలకాలను వాటి అణు సంఖ్య ప్రకారం, వాటి స్వభావాన్ని బట్టి ఒక క్రమంలో అమర్చిన పట్టిక.  ఇన్ని మూలకాలను గుర్తుపెట్టుకునేదేట్లా?  

ఇన్ని మూలకాల గురించి పిల్లలకు నేర్పాలంటే సులభమా? అదొక పాఠంగా చెప్పేకన్నా, ఒక సులభంగా పాడుకునే పాటగానో, పద్యంగానో చెబితే పిల్లల మనసుల్లో నాటుకుపోయే అవకాశం ఉండదూ?  అందుకే కృష్ణకుమారి గారు ఎంచుకున్న మార్గం ఆటవెలది పద్యాలు.   ఉదాహరణకు మొట్టమొదటి మూలకమైన హైడ్రొజెన్ గురించి ఇలా చెబుతారు.

మంట తగులగానే మండిపోవు నదియె

మొదటి సంఖ్య గాన మొదటే నుండు

కలియు క్షారములను, కలియు హేలజనును

చూపు ద్వంద్వ బుద్ధి చూడచూడ

 

చాలా సులభంగా అర్థమయ్యే పద్యాలు.  పద్యం ఒక్కటీ చెప్పి ఆగలేదు.  నాలుగు పాదాలకి అర్థం చెప్తూ హైడ్రోజెన్ యొక్క ముఖ్యమైన భౌతిక రసాయాన స్వభావాన్ని ఉదాహరణలతో సహా వివరించారు.  అంతేకాదు.  మూలకాన్ని ఎవరు, ఎప్పుడు కనుక్కున్నారు, దాని వెనకేమైనా కథ ఉందా?  ఉంటే అదేమిటి?  చిన్నమాటల్లో క్లుప్తంగా ఎంతవరకు చెప్తే ఉత్సాహం ఉంటుందో అంతవరకు చెప్పారు ప్రతి మూలకానికి.  

అలాగని కేవలం గుణాత్మకంగా చెప్పడంతో ఆగలేదు. ఆ మూలకపు అణువు, పరమాణువులోని నిర్మాణమేమిటి?  ఎలెక్ట్రానులు ఏ ఆర్బిట్ లో పరిభ్రమించడం వల్ల ఆ మూలకం ప్రవర్తన ఎలా మారుతుంది?

 

ఆవర్తన పట్టికలో ఆ మూలకానికి స్థానం ఎక్కడుంది?  ఆ మూలకానికి ఇవ్వబడిన సంకేతమేమిటి?  దాని ఎటామిక్ నంబరేమిటి?  ఇలా ఎన్నో విషయాలను అతి సులభంగా అర్థమయే రీతిలో మనముందుంచారు కృష్ణకుమారి గారు.  సోడియం గురించి రాసిన పద్యం చూడండి – 

గాలి తగుల కలియు ప్రాణవాయువు తోడ

నీట భగ్గు మనుచు తేలియాడు

పడికొకటి కలిపిన సంఖ్య దాని దనగ

మూర్తిమంతమాయె మూలకమ్ము

ఇలా 29 మూలకాల గురించి క్షుణ్ణంగా చెప్పిన, అందంగా తీర్చి దిద్దబడి రంగులతో, శాస్త్రజ్ఞుల ఫోటోలతో, కనులకు ఆహ్లాదంగా వెలువరించిన ఈ పుస్తకం చాలా మంది పిల్లలు ఉపయోగించుకుంటారని ఆశిస్తాను.  

**

 కూనలమ్మ పదాలు – మరికొన్ని కవితలు

 

‘కూనలమ్మ పదాలు – మరికొన్ని కవితలు’ చాగంటి తులసి గారి కలంనుండి వెలువడిన ఒక కవితా సంపుటి. 

చాగంటి తులసి గారికి పరిచయం అక్కరలేదు.  సాహిత్యపిపాసులు  ఎవరికైనా  ఆవిడ గురించి తెలియకుండా ఉండదు. 

కూనలమ్మ పదాలు అనగానే గుర్తొచ్చేది ఆరుద్రే.  అయితే కూనలమ్మ ఆయన సృష్టి కాదు.  

వి. ఎ.కె. రంగారావు గారు తులసి గారి కూనలమ్మ పాదాల గురించి చెబుతూ, "వాటిలో హాస్యమూ, హెచ్చరికా  పడుగుపేకలు .... కొన్ని పచ్చల పిడి బాకులు.  'అబ్బా' అనిపించడంతో బాటు 'అబ్బో' అనిపిస్తాయి... వీటిలో వేదము ఉంది, వేదాంతముంది, భయపెట్టడమూ, బామాలాడమూ కూడా ఉన్నాయి. " అని.  

ముకుంద రామారావు గారు ఈ పుస్తకం గురించి రాస్తూ, "వాటిల్లో చురకలు ఉన్నాయి, వ్యంగ్యమూ ఉంది.  చనువుగా చెప్పినట్టున్నా లోతైన భావాలూ ఉన్నాయి." అంటారు.  "బాల్యం నుండీ ఆమెకు దొరికిన సాహిత్య వాతావరణం, ఎవరికైనా చాలా అరుదుగా దొరుకుతుంది.  దానిని ఆమె అతి భద్రంగా దాచుకుని ఇదిగో ఇలా ఆమెకు నచ్చిన ప్రక్రియలో అందరితో పంచుకునే ప్రయత్నం చేయడం మన అదృష్టం."

 

తులసి గారు తను రాసిన కూనలమ్మ  పదాల గురించి చెప్పుకుంటారిలా:

తులసి సరదా రాత 

పెట్టు కొరడా వాత 

దిద్దు నీ తలరాత, ఓ కూనలమ్మ

 

తలరాతలు దిద్దారో లేదో కానీ, వాతలు మాత్రం పెట్టడం నిజం.  ఆవిడ గురించి ఆవిడే రాసుకుంటూ, 

 

విజయనగరపు మనిషి 

మట్టి నీరుల కలిశి 

ఉడుంపట్టుల తులసి, ఓ కూనలమ్మ

 

కచ్చితంగా పాఠకులు జాగ్రత్తగా ఉండవలసిందే అని హెచ్చరిస్తూనే మొదలు పెడతారు పుస్తకం .  ఆరుద్ర, తను రాసిన కూనలమ్మ పదాలకి తనదంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు.  మరి తులసి గారు అదే ప్రయోగం ఎందుకు ఎంచుకున్నారో!  తెలియకుండానే సాదృశ్యం రాకుండా మానదు కదా?  దానికి సమాధానంగా 

అన్న శంకర శాస్త్రి

మజా మాటల మేస్త్రి

...

అన్న మాటల ఆట

దొరికె మనసుకు మీట

ఇంక పట్టవె బాట, ఓ కూనలమ్మ

అంటారు.  

అయినా సరే, ఏ తులసమ్మ మాటో అంటూ రాసి తనదైన బాణీలోనే చెప్పచ్చుగా అనిపించిందెందుకో. 

ఇక రాసిన విషయాలకొస్తే అసలు రాయని విషయమేమైనా ఉందా అనిపించింది!  చెప్పే కంటే చదవడమే మంచిది.  చాసో, గురజాడ, గిడుగు, రోణంకి, ద్వారం, విఎకె, పైడిరాజు, నారాయణ బాబు, వివిన మూర్తి, రామసూరి, ఇలా ఎందరి మీదో తులసి గారి అభిప్రాయాలతో పద్యాలు – అవే, పదాలు.  వ్యంగ్యంతో కూడిన విసుర్లు, రాజకీయాలపై మొత్తులు, ఆశా భావాలు, వేదాంతం, ఒక్కటా?

చదవకు గురజాడని

మరచిపో చాసోని

తంటాలు ఎందుకని, ఓ కూనలమ్మ

 

నేటి నగర వీధులు

లక్ష కోటి బారులు

కోటి మందు షాపులు, ఓ కూనలమ్మ

 

కులపు పిలుపుల స్వీటు

మతపు మురిపెపు హాటు

సీటు గెలుపుకు గీటు, ఓ కూనలమ్మ

 

బతుకు రాసిన రాత

తుదకు తెలిసిన గీత

కడకు రాలిన జేత, ఓ కూనలమ్మ

 

ఇలా సాగిపోతాయి తులసి గారి కూనలమ్మ పదాలన్నీ. చదవవలసినవి.  అయితే ఆరుద్ర పదాలతో పోల్చకండి.  దానికి అర్ధం లేదు. 

 

ఈ పుస్తకంలో వచన కవితలు కూడా ఉన్నాయి.  వాటిని గురించి ద్వారం దుర్గాప్రసాదరావు గారు రాస్తూ, వచన కవితకు ఉండవలసిన మూడు లక్షణాలూ ఉన్న కవితలివంటారు.  

‘నేను’ అన్న కవితలో 

 

నిరంత విద్యుత్ప్రవాహాన్ని

అవాంతరాలు లేని అనంత ప్రసారాన్ని

...

మానవత్వపు వేవులెంగ్తుని

నిత్యం శక్తిని నింపే చార్జర్ ని, కవిని

అంటూ, కవిని, కవితని ఆవిష్కరిస్తారు తులసి గారు.  

 

‘క్షణికం’ అన్న కవితలో ప్రకృతిలో 

పడమటి కిటికీల ఎర్రని ఆకాశపు ముక్కలు

ఆత్రంగా గభాలున తలుపు తీస్తే

కట్టేడుట

అమ్మ నుదుటి మీది గుండ్రటి కుంకుమ

సాయంత్రపు సూరీడు!

 

అంటూ, ప్రకృతిలో కొన్ని క్షణాల్లో మాత్రమే చూడగలిగే సౌందర్యపు తునకలతో మనముందు విస్తరి పరుస్తారు. 

మరో కవితలో ‘ఎవరు పడలేదు నీడల వెంట? అంటూ కలలు కనడంలో తప్పేముందని ప్రశ్నిస్తారు.  

 

‘నా ఘోష’ అనే కవితలో కలగాపులగమై, అంతరించి పోతుందేమో అన్న వ్యధ క్రుంగదీస్తున్నా, బాధ పడుతూనే, ‘నా ఘోష వేరు’ అంటారు.  

 

పుస్తకం చాలా అందంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉంది.  తులసి గారి బొమ్మ వేసిన విధానం వల్ల తులసి గారు మనల్ని పలకరిస్తున్నట్లుగా ఉండి, ముఖచిత్రం చాలా చక్కగా వచ్చింది.  లోపల కూనలమ్మ పదాలకు తగ్గట్లుగా వేసిన అన్ని బొమ్మలూ, బాపుని గుర్తుకు తెచ్చాయి, అన్వర్ కు తనదంటూ ఒక బాణీ ఉన్నా.  ప్రతి పేజీలోనూ, ఇద్దరు ఆర్టిస్టులు కనబడతారు మనకి, ఒకరు పద్యాలు రాసి, మరొకరు బొమ్మలు వేసి.  బొమ్మలకు ఎంచుకున్న రంగుల వల్లన కూడా చాలా ఇంపుగా, కనులకు విందుగా ఉన్నాయి.  అన్వర్ కు ప్రత్యేక అభినందనలు. 

ఈ పుస్తకం అందరు పుస్తకవిక్రేతల దగ్గరా దొరుకుతుంది.  వెల, రూ. 200 మాత్రమే. 

**

కోనసీమ కథలు

 

కోనసీమ కథలు– సాయి బ్రహ్మానందం గొర్తి గారు వ్రాసిన మరొక కథాసంపుటి. ఈ సంపుటిలో పదకొండు కథలున్నాయి.  

  

బ్రహ్మానందం గారు 2008 ప్రాంతాల్లో రాసిన కథలివి.  ఇవన్నీ, ముందుగా వివిధ పత్రికలలో ప్రచురించబడ్డ తరువాత ఆడియోలు చేయబడి, ఈనాడు రేడియోలోనూ, వివిధ FM ఛానెల్స్ లోనూ, ప్రసారం కాబడ్డాయి.  వాటినే కొప్పర్తి రాంబాబు గారు తమ యూట్యూబ్ చానెల్ లో కూడా చదివి మరింతమందికి చేరేలా చూశారు.  ఆవిధంగా ఈ పుస్తకంలోని కథలన్నిటికీ, కోనసీమ కథలుగా పుస్తకంగా ప్రచురించక ముందుగానే పాఠకులనుండి మంచి స్పందనను పొందాయని చెప్పవచ్చు.

కోనసీమ కథలు ఇంతకు ముందు ఇంకెవరో కూడా ప్రచురించినట్లు గుర్తు.  అయితే ఈ కథలు ఒక రకంగా ప్రత్యేకమైనవి.  మంచి కథకులైన బ్రహ్మానందం గారి కలం నుండి రావడం ఒక ఎత్తు.  రెండోది, ఒక మధ్య తరగతి కుటుంబంలో నుండి వచ్చి ఒక చిన్న ఊరిలో పెరిగిన ఎవరికైనా ఈ కథలు మనసులకు తాకుతాయి. 

కథలన్నీ ఆర్ద్రత ప్రతిబింబించేవి.  బ్రహ్మానందం గారు చెప్పిన విధానం, ఆయన ఎంచుకున్న శైలి, పాఠకులను తట్టి కుదుపుతాయి. 

‘శిరోముండనం’ కథ భర్త పోయి విధవరాలైన ఒక అమ్మమ్మ గుండు గీయించుకోవడంలో ఆమె వగచింది ‘జుట్టు పోతోందని కాదు, పోయింది తన స్వేచ్ఛ’ అని చెప్పినప్పుడు, తనకు లేని స్వేచ్ఛను ఇంకో ఆడపిల్లకు ఇవ్వడంలో సహాయం చేసిందని తెలిసినప్పుడు అదే సమాజంలో మనమూ ఒక భాగంగా ఆవిడ పరిస్థితికి కారణం అయ్యామనుకున్నప్పుడు కలిగే మానసిక స్థితి పాఠకునికి రచయిత కలిగించిన తీరు అమోఘం. 

‘సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్’ మత పరంగా మన సమాజం ఎంత దగ్గర వాళ్ళనీ ఎంత దూరంగా ఉంచుతుందో స్పష్టంగా చెప్పే కథ.

కురూపి, నల్లగా, పొట్టిగా, లావుగా ఉండే కన్నబాబు ‘అమాయకుడా, జీవితాన్ని లోతుగా చూసిన వేదాంతా? ఎదుటివారి అవివేకాన్ని గుర్తించి జాలిపడే మేధావా?’ ‘పిండంటే నిప్పటి’ చదవాల్సిందే.  కురూపులు వాళ్ళు కావాలని అవరు.  కాని సమాజంలో వాళ్ళంటే చిన్న చూపు.  ఎన్నో జటిల మానసిక స్థితులకు గురి చేసే ఇలాంటి సమాజంలో అలాంటి మనుష్యులను అర్థం చేసుకునే రోజొస్తుందా?

‘చుట్టూ ఉండే మనుషుల్లో అర్థం కాని కాంప్లెక్సిటీ – ప్రవర్తనలో కనిపించే రూపం వేరు, లోపలి దేహం వేరూనూ.’  - ‘వామనుడు’ కథలో పేరప్ప గారి పర్సనాలిటీ – ఆయన చేసే మంచి పనులకు ఆయనకు గుర్తింపు అక్కరలేదు.  పైపెచ్చు అందరి దృష్టిలో ఆయనొక పనికిరాని పిసినారి.  అలా చెలామణి అయినా ఆయన చలించడు. 

ఇలా ప్రతి కథలోనూ సమాజానికీ మనిషికీ ఉండే ఘర్షణ పాఠకుడు చూడడం జరుగుతుంది.  ఈ ఘర్షణలో మనిషీ, సమాజం ఇద్దరూ నష్టపోతారు.  అయితే కథల ద్వారా ఈ పరిస్థితిని గుర్తింపచేయడం నా ఉద్దేశ్యంలో రచయిత సాధించిన ఒక ఘనత ఈ  కథల ద్వారా.  

కొబ్బరి ఆకులు, అస్తమిస్తున్న సూర్యుని నేపథ్యంతో ముఖచిత్రం కోనసీమను ప్రతిబింబిస్తుంది.

దాదాపుగా అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరికే ఈ పుస్తకం ఖరీదు రూ. 150. 

 

*****

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 6
Anchor 7
bottom of page