top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

teluguhasym.JPG
goppabhasha.JPG

తెలుగు చలన చిత్రాల్లో హాస్యం, 50 సంవత్సరాల పరిశీలన

గత ఆరు నెలలలో వంగూరి ఫౌండేషన్ వారు నాలుగు పుస్తకాలు ప్రచురించారు.  ఈ నాలుగు పుస్తకాలతో ఆ సంస్థ డెబ్భై తొమ్మిది ప్రచురణలు పూర్తిచేసిందన్న మాట.  అమెరికాలో తెలుగు పుస్తకాలు ప్రచురిస్తున్న ఏకైక సంస్థగా 1995 లో మొదలు పెట్టి ఇన్ని పుస్తకాలు వెలుగులోకి తీసుకురావడం విశేషమే.  ఈ సారి మధురవాణిలో రెండు పుస్తకాలు పరిచయం చేద్దామనుకుంటున్నాము.

'తెలుగు చలన చిత్రాల్లో హాస్యం, 50 సంవత్సరాల పరిశీలన’, యడవిల్లి కలం పేరుతో వై.వి.ఎల్.యన్.శాస్త్రి గారు రాసిన ఈ పుస్తకం తెలుగులో వచ్చిన మూకీలతో మొదలై, సుమారు యాభై, అరవై సంవత్సరాలపాటు తెలుగు సినీ రంగంలో హాస్య చరిత్రను కొద్ది పేజీలలో సూక్ష్మంగా పాఠకులకు ‘చరిత్ర’ గా విసుగు రానీయకుండా అందించిన పుస్తకిమిది.

యడవిల్లి గారు చలన చిత్ర పరిశ్రమకు, సాహిత్యానికి చిర పరిచితులే.  వంగూరి ఫౌండేషన్ వారి 75వ ప్రచురణకు 'అక్షరాభిషేకం’ చేస్తూ రాసిన ముందు మాటలో, అమెరికా హాస్య బ్రహ్మ చిట్టెన్ రాజు గారు ‘అసలు ఇటువంటి పుస్తకం రాద్దామనుకునే ఆలోచనే మెచ్చుకోతగ్గద’ని అంటారు.  నిజమే.  మన దేశ చరిత్రనికూడా మనం ఎవరో ఇతరదేశస్థులు పరిశోధన చేసి రాసినదే ఎక్కువ ఇన్ని వేల సంవత్సరాల్లో.  ఎందుకో, చరిత్రని పొందు పరచడం మన రక్తంలో లేదనిపిస్తుంది.  ఎన్నో కారణాలుండచ్చు దానికి.  అందుకే, ఎవరైనా చరిత్రని చక్కగా క్లుప్తంగా పొందు పరిస్తే అది అభినందించే విషయమే అవుతుంది రాజుగారన్నట్లు.

సినిమా మన తెలుగు వారి సాంస్కృతిక జీవిత పరిథిలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.  దానికి కారణలనేకం.  అంచేతే మనం సినిమా పాత్రలతో పాటు, మనం నవ్వుతాం, ఏడుస్తాం, వీరోచిత హీరో స్థానంలో మనల్ని మనం ఊహించుకొని గాలిలో స్వైర విహారం చేస్తాం.  

హాస్యరసం కురిపించాలంటే ఎంతో ఆలోచన కావాలి.  సందర్భానికి తగ్గట్టుగా నటన కావాలి.  మంచి డైలాగులు రాసే రచయిత కావాలి.  ఆ డైలాగుల్ని సరియైన మోతాదులో చెప్పించలిగే దర్శకుడు కావాలి. అలాంటి సినిమా తియ్యాలనుకునే నిర్మాత కావాలి.  తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ కోవలకు చెందిన వ్యక్తులకి కొదువలేదని ఈ పుస్తకం నిరూపిస్తుంది.  1932 లో మొదలైన టాకీల దగ్గరనుంచి మొన్న మొన్నటి వరకు, ఎందరినో కళాకారుల్ని, నిర్మాతలను, దర్శకులను గుర్తు చేస్తూ మనల్ని మళ్ళీ ఒక ముప్ఫై నలభై సంవత్సరాలు వెనక్కి తీసికెళ్ళి ఆ తీపి గుర్తులను నెమరువేసుకునే అవకాశం కలిగిస్తారు రచయిత.  

అట్ట మీద బొమ్మ చుస్తేనే మనకు సగం అర్థమైపోతుంది.  పుస్తకం ఆఖర్న రెండు అనుబంధాలున్నాయి.  మొదటి అనుబంధంలో హింది చిత్రాలను గురించి ప్రస్తావిస్తూ, అక్కడ చెప్పుకోదగ్గ హాస్య నటులు లేరని వాపోతారు రచయిత.  మెహ్మూద్, జానీ వాకర్, జానీ లివర్, కాదర్ ఖాన్ లాంటి వారు ఉన్నా, రచయిత ఉద్దేశంలో గోబలైజేషన్ ప్రభావం వల్ల హింది సినిమా రంగంలో హీరోలే కమెడియన్లుగా రెండు పాత్రలూ మిళితం చేసి నటిస్తున్నారని రచయిత ఉద్దేశ్యం.  రెండవ అనుబంధంలో, సంపూర్ణ కామెడీ చిత్రాలలో మేలైనవి, మన్నికైన మూడింటిని ఉదహరిస్తారు.  అవి చక్రపాణి, గుండమ్మ కఠ, అహ నా పెళ్ళంట.  మరి, మాయా బజార్ లాంటి కామెడీ చిత్రాన్నెందుకు వదిలేసారో! 

 

పుస్తకం చాలా సరళంగా, సూక్ష్మంగా ఉంది.  యాభై ఏళ్ళ చరిత్రను ఓ యాభై పేజీల్లో చెప్పడం సులభం కాదు.  యడవల్లి గారి ఆలోచన అందరి కమేడియన్లను ఒక చోట చేర్చి మనకు గుర్తు చేయడమే ధ్యేయమైతే ఆయన సఫలమైనట్లే.  అందుకేనేమో ఈ పుస్తకాన్ని ఒక పరిశీలన అని అన్నారు. చరిత్రనలేదు.  

 

ఇది వంగూరి సంస్థ వారి డెబ్భై అయిదో ప్రచురణ.  పుస్తకం ఖరీదు రూ.150. ప్రతులకు ఇండియాలోనూ, అమెరికాలోనూ ప్రచురణ కర్తలనే సంప్రదించండి.

- శాయి రాచకొండ

Anchor 1
Anchor 2

 

తెలుగే గొప్ప భాష - కాని కనుమరుగౌతున్నది.  


 

ఈ పుస్తక రచయిత పారుపల్లి కోదండ రామయ్య గారు ఆంధ్ర దేశంలోనూ, బయటా కూడా ఆయన కలిగిస్తున్న సంచలనం వినిపిస్తూనే ఉంటుంది.  రచయిత ఉద్దేశ్యంలో తెలుగు భాషే గొప్ప.  అందులో ఆయనకు వీసమెత్తైనా సందేహం, మొహమాటం లేవు.  అంత గొప్ప భాష కనుమరుగౌతోదందనేది ఒక ఆక్రోశం, ఆవేదన, 'తెలుగు వాళ్ళూ, మేలుకోండి’ అని ఒక పొలికేక ఈ పుస్తకం.  

'సంస్కృతి’ అని మనమంటే, పారుపల్లి గారు 'సంస్కురుతి’  అంటారు. సంసృత భాషనుంచి మనం పదాల్ని ఎందుకు అరువు తెచ్చుకోవాలి?  భాష వృద్ధి అవకపోవడానికి అనేక కారణాల్లో పదాల్ని పరభాషలలోంచి అరువుతెచ్చుకు వాడడం ఒక కారణం అని ఆయన అభిప్రాయం.  పదకోశాన్ని పెంచుకుంటే, భాష వృద్ధి చెందదా? 

పుస్తకాన్ని మూడు భాగాలక్రింద విభజించవచ్చు.  మొదటగా ఏ భాష అయినా ఎలా చచ్చిపోతుందో అనేక మైన లక్షణాలు ఉటంకించారు పారుపల్లి గారు.  తెలుగుపై ఇతర భాషల దాడులు, తెలుగు వారికి ఉన్న ఆత్మ న్యూనతా భావం, ఇవన్నీ తెలుగు భాషపై మనకు లేని అభిమానానికి కారణాలే కదా!రెండో భాగంగా తెలుగు భాష ఎంత గొప్పదో అని చెప్పడానికి ఆయనిచ్చిన ఉదాహరణలు ఎన్నో.  తెలుగు అజంత భాష అని, అవధానప్రక్రియ ఒక్క తెలుగులోనే ఉందని, ఇలా ఆయన తెలుగు భాషకున్న ప్రత్యేకతల్ని వివరించారు. అయితే అందులో సంగీతానికి తెలుగే అనువైన సుడి అని, మాటల సరదా గారడీలు ఒక్క తెలుగులోనే సాధ్యమనీ, ఉగ్రవాదానికి తెలుగు ఎడమనీ, ఇలా చెప్పిన విషయాలలో ఎంతో అతిశయోక్తి, అభిమానంతో కూడిన అసత్యం కనిపిస్తాయి.  

తెలుగు గొప్ప భాషే.  తెలుగంటే అభిమానముండాలనడంలో తప్పు లేదు.  కానీ తెలుగే గొప్ప భాష అన్నది దురభిమానమవుతుంది.  బహుశా తెలుగు భాషలో ఉన్న గొప్పదనాన్ని నొక్కి వక్కాణించి చెప్పడానికి కొంచెం అతిశయోక్తి వాడడం  పారుపూడి గారి ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.  

నూరు పేజీలకంటే కొంచెమెక్కువగా ఉన్న ఈ పుస్తకంలో, కేవలం చివరి నాలుగు పేజీలలో ఒక 23 అంశాలలో చెప్పారు తెలుగు వాళ్ళు ఏం చెయ్యాలో.  సంస్కృత పదాల బదులు తెలుగు పదాలు వాడాలని, అలాంటి తెలుగు పదాలు ఎలా చేకూర్చాలో అని ఉదాహరణలతో సహా చెప్పారు. కొన్ని కొన్ని పదాలు నవ్వు పుట్టిస్తాయి (గ్రైండర్ = రుబ్బెన, బ్రష్ = తోమెన మొదలైనవి) - ఉద్దేశ్యం మంచిదే.  ఆలోచనలు, సృజనాత్మకం గానే ఉన్నాయి. అయితే ఆచరణలో ఎంతవరకు ఉపయోగకారమో చెప్పడం కష్టం.    

పుస్తకంలో చెప్పిన ఆయన భావాలతో పాఠకులు ఏకీభవించక పోవచ్చు.  అయితే తటస్థంగా ఉండలేరన్నది ఆయన సవాల్. ‘పుస్తకమంతా చదివాక కూడా మీ మనసు మారకపోతే పట్టుపట్టి నన్ను పట్టండి, తిట్టండి, నెట్టండి, కొట్టండి, తట్టుకుంటాను, కాని పుస్తకం ఆసాంతం చదవండి’ అంటారాయన ‘మునుమాట’ లో.  

పట్టుదలతో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశిద్దాం.

పుస్తకం కేవలం ఎనభై రూపాయలు మాత్రమే.  నవోదయా బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది. ప్రతులకు అమెరికాలో అయితే వంగూరి ఫౌండేషన్ వారిని సంప్రదించండి.  

 

ఇంద్రాణి పాలపర్తి గారు రాసిన రెండు పుస్తకాల గురించి వచ్చే సంచికలో మాట్లాడుకుందాం.  

- శాయి రాచకొండ

bottom of page