top of page

పుస్త​క పరిచయాలు

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

సరికొత్త వేకువ’ , ‘నాట్య భారతీయం’ - ఉమా కోసూరి

ఒకే నెల్లో ఒక రచయిత/త్రి పుస్తకాలు రెండు ప్రచురించబడడం ఆశ్చర్యమే.  పుస్తక ప్రచురణ అంత సులభమైన పని కాదు. రచనలు అన్నీ ఒక చోట కూర్చడం ఒక ఎత్తు.  వాటిని టైపు చేయించడం, తప్పుల్ని దిద్దడం, అట్ట మీది బొమ్మల్ని డిజైన్ చెయ్యడం, చేయించడం, ముందు మాటలు, వెనుక మాటలు రాయడం, రాయించడం, తక్కువేమీ కాదు. ఇన్నీ చేస్తే ఫొటోలు సరిగ్గా రావు.  అట్ట మీది బొమ్మల రంగులు ముందు బాగా కనబడినవే, మళ్ళీ చూస్తే సరిగ్గా నచ్చక పోవచ్చు. అదొక యజ్ఞం.  

అలాంటిది ఉమా కోసూరి గారు రాసిన రెండు పుస్తకాలు వంగూరి ఫౌండేషన్ వారు జూన్ నెలలో ప్రచురించడం, అవి ఆటా (అమెరికన్ తెలంగాణా అసొసియేషన్) వారి ప్రపంచ మహా సభలలో ఆవిష్కరించబడడం రెండూ జరిగిపోయాయి.

మొదటి పుస్తకం 'నాట్య భారతీయం', ఒక రకంగా ఉమా గారి ఆత్మ కథ.  రెండోది 'సరికొత్త వేకువ ' కథల సంపుటి.  

ఆమె రాసిన  'విదేశీ కోడలు - కథల సంపుటి, 'ఎగిరే పావురమా' - నవల, 'వేదిక - నవల, ఇంతకు ముందే పుస్తకరూపం దాల్చాయి.  ఆమె మనసు పెట్టి రాయడం మొదలు పెట్టి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన అతి కొద్ది సమయంలోనే ఇన్ని పుస్తకాలు ప్రచురించ గలగడం ఘనతే మరి.  

 

కొన్నాళ్ళ క్రితం ‘నాట్యభారతీయం’ వారం వారం ఒక శీర్షికగా ‘గోతెలుగు’ అన్న అంతర్జాల పత్రికలో ధారా వాహికంగా వచ్చి ఎందరో చదువరులను ఆకర్షించింది.  రచయిత్రి ముందుమాటలో చెప్పినట్లుగా ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక నాట్యకారిణిగా, ఒక రచయిత్రిగా తన అనుభవాలనెన్నిటినో వ్యాసాలుగా మనముందుంచారు ఉమా భారతి గారు.  సూక్ష్మంగా చెప్పాలంటే, నృత్యకారిణిగా తానెదిగిన జీవితాన్ని, సాధించిన విజయాల్ని రచయిత్రిగా ఒక పుస్తకరూపంలో పొందుపరచడం ఆమె ఆశయంగా కనబడుతుంది.  ఈ ప్రయాణంలో ఆమెను ఒక కళాకారిణిగా తీర్చి దిద్దిన ఎవ్వరినీ మరచిపోలేదు.

 

అయిదేళ్ళప్పుడే ఎంతో ఆసక్తిగా నృత్యం నేర్చుకోవాలనే కుతూహలం చూపెట్టడం, దానికి కుటుంబ సభ్యులు, నాన్న గారు, అమ్మమ్మ, అమ్మ, గురువు సత్యం గార్ల ప్రోత్సాహం ఎంతో, ఎంతెంతో ఆమె ఈ రోజుకీ గుర్తు తెచ్చుకుని మనకు కళ్ళు చెమర్చేలా రాస్తారు ఉమా గారు.  ఆమె తండ్రి గారు ఆర్మీ మేజర్. ఆయన దగ్గరనుంచి ఉమా గారు తప్పకుండా క్రమశిక్షణను వారసత్వంగా తీసుకున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  ఉమా గారి జీవితంలో ఆయన ప్రభావం చాలా ఉంది. ఎన్నో సందర్భాలలో ఆయనని గుర్తుచేసుకోవడం పుస్తకం మొత్తంలో కనబడుతూనే ఉంటుంది. డాన్సు మొదలు పెట్టడడమే కాదు, ఆమెలో ఆ కళను ప్రోత్సహించడం, ఆమె విజయాలు తన విజయాలుగా చివర వరకూ ఆనందించడం, చూస్తాం.  ఆ తండ్రీ కూతుర్ల మధ్య అనుబంధం పుస్తకంలో కనబడుతుంది.  అలాగని ఆవిడ అమ్మ గారు, అమ్మమ్మ గారు తక్కువని కాదు.  చిన్నప్పుడే ఒకటి రెండు రచనలు చేసినా ఆయన సలహా ప్రకారం డాన్సు మీదే ఏకాగ్రత చూపించడమైంది.  

చాలా చిన్నప్పుడే రంగ ప్రవేశం చేసి, అతి త్వరలోనే దేశ విదేశాలలో నృత్య ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలను పొందారు ఉమా గారు.  వివాహం అయి అమెరికా వచ్చిన తరువాత కూడా ఎన్నో నృత్యనాటికలకు తనే పాటలు రాసి, రూపకల్పన చేసి ఎందరో ప్రేక్షకుల మన్నలను పొందారు.  

ఆవిడ మొదలు పెట్టిన అతి తక్కువ కాలం లోనే రచయిత్రిగా కూడా ఎంతో రాణించడం గమనార్హం.   

ఈ పుస్తకం ఆమె జీవిత కథ. ఆమె అనుభవాల వల్లరి.  ఆమె సాధించిన విజయాలకు ఆమే తయారు చేసుకున్న ఒక దర్పణం.  


 

ఉమా గారి రెండో పుస్తకం 'సరికొత్త వేకువ '. ఇందులో పది కథలున్నాయి.  కొన్ని మాత్రం అంతకు ముందే ప్రచురించబడినవి, అందులో కొన్ని బహుమతులు అందుకున్నవి కూడాను.  

ఉమా గారి కథలన్నీ కూడా కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలతో నడుస్తాయి.  ఆవిడ ప్రచురించిన మొదటి సంపుటికి, ఈ పుస్తకానికి మధ్య చాలా దూరమే నడిచారని చెప్పాలి. ఆమె కథనంలో కాని, శైలిలో కాని, పరిణితి కనబడుతుంది.  అంతే కాదు, కొత్త కథా వస్తువుల్ని తీసుకుని చక్కని కథలల్లడం ఈ పుస్తకంలో చూడొచ్చు.  

'సరికొత్త వేకువ’ ఒక కథ పేరు, అదే పుస్తకానికి కూడా ఎన్నుకున్నారు. బంగారం లాంటి (పేరూ బంగారమే) ఒక పదహారేళ్ళ పిల్ల బావను తప్పించుకొచ్చి హైదరాబాదులో తనను, తన కుటుంబాన్ని అభిమానించే వేరొక కుటుంబం చేరడం, వయసుకు రెట్టింపున్న అమెరికానించి వచ్చిన సాగర్ని అరాధించడం, సాగర్ అమెరికా అమ్మాయి అయిన సొఫియాని పెళ్ళిచేసుకోవడం, వాళ్ళకి కలిగిన సంతానం కృష్ణ తో బంగారం దగ్గరవడం, సాగర్ ప్రోత్సాహంతో ఆమె మెడిసిన్ చదవడం, ఈ లోపల బంగారం పెళ్ళి, సంసారానికి పనికిరాని మొగుడితో అయిదేళ్ళ కాపురం, ఒక రోజు ఆవిషయం బయటకు రావడం, ఇంతలో అమెరికాలో ఏక్సిడెంటు, సోఫియా మరణం, సాగర్ కి గాయాలు, చివరికి గాయపడ్డ సాగర్, దెబ్బతిన్న కృష్ణ బంగారం చేతిలో పెట్టడంతో కథ ముగుస్తుంది.  జీవితంలో దెబ్బ తిన్న బంగారానికి అది సరికొత్త వేకువా?  పాఠకుడిని కొంచెం సందిగ్ధంలో పడేయటం ఖాయం.  

చాలా కథలు వైద్య సంబంధమైన విషయాల చుట్టూ తిరిగిన కథలు.  పుత్తడి వెలుగులు (వైద్య శాస్త్రం మాట తెప్పించలేని పని భారత దేశం నించి వచ్చిన ఒక అమ్మమ్మ తన ఆట పాటలతో ఒక చిన్న పిల్లకు మాటలు తెప్పించడం),  అనగా అనగా ఓ జాబిలమ్మ (ఆడుతూ పాడుతూండే అమ్మాయి చక్కగా పెళ్ళి చేసుకుని హాయిగా ఉండవలసిన టైములో కేన్సరు రావడం, అతి త్వరలోనే చరమ దశకు చేరడం, 'డెత్ విత్ డిగ్నిటీ' చట్టం అమలు ఉన్న ఒరేగాన్ స్టేట్ కి వెళ్ళి తన జీవితం చాలించాలనుకోవడంతో కథ ముగుస్తుంది), 'నిరంతరం నీ ధ్యానంలో' (సరొగేట్ ప్రెగ్నెన్సీ), కథ కాని కథ (డెత్ విథ్ డిగ్నిటీ).

'కంచే చేను మేస్తే' అనే కథ టెక్సాసులొ చైల్ద్ వెల్ఫేర్  శిశు సంక్షేమం అనే ప్రభుత్వ పథకాన్ని మోసం చేస్తూ ఒక తల్లి తన కొడుకుని ఎదగనీయకుండా చేస్తున్న కథ చదివితే గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లవుతుంది.  

'ఏం మాయ చేశావో' అన్న కథలో అనాధ బాలల్ని  ఫోస్టర్ కుటుంబాలకు చేర్చే ఒక వలంటీర్, తలితండ్రుల్ని ఒక ఆక్సిడెంట్లో కోల్పోయిన పిల్లకు చేరువవడం జరుగుతుంది.  ఈ కథలో కూడా రచయిత్రి ఎన్నో వైద్య సంభంధిత పదాలు వాడతారు.

కొత్త కథా వస్తువులు, కొన్ని తప్పక ఆలోచింపచేసేవి తీసుకుని రాసిన రచయిత్రి అభినందనీయురాలు.

o   o    o

సంక్షిప్త పుస్తక పరిచయం

మట్టిపొరల్లోంచి…

 

మనసు పొరలకు మట్టిపొరలను అనుసంధానం చేస్తూ, మనిషి బ్రతుక్కీ మట్టిపొరలతో ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తూ, మానవీయతను మనిషి మూలాలను గుర్తుచేస్తూ, మనిషి జీవితం మమతానుబంధాల పందిరికి ఆత్మీయానురాగాలు అల్లుకున్నట్లుండాలని, మనిషి మట్టిలో కలిసేదాకా పనికీ పనికీ మధ్య విశ్రాంతితో కాక విరామంతో ఉత్సాహంగా ఉండాలని అందుకు పచ్చని ప్రకృతిని, పల్లెటూళ్ళను వాటి సహజత్వం కోల్పోకుండా చూసుకోవటం మన బాధ్యతంటూ , మట్టిని మనసుతో చూడమంటూ శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య రాసిన " మట్టిపొరల్లోంచి " కవితా సంపుటి పాఠకుల మనసులోకి చొచ్చుకుపోతుంది.......నానా

పేజీలు...56

వెల...రూ 60/-

కాపీల కొరకు

CRESCENT PUBLICATIONS

29-25-43A, Vemuri vari street,

Suryarao pet, Vijayawada-520002

e-mail: crescent.vja@gmail.com

bottom of page