MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మేరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.
అంతర్జ్వలన - సమీక్ష -శాయి రాచకొండ
ఈ మధ్యన శ్యాం ఫోన్ చేసి సాయి బ్రహ్మానందం గారు రాసిన 'అంతర్జ్వలన' నవల 'చదివావా?' అని అడిగినప్పుడు 'నాకాయన నవల రాసినట్లు కూడా తెలీదని చెప్పాల్సి వచ్చింది. అయితే శ్యాం అక్కడితో నన్ను వదలలేదు. నాలుగు రోజుల్లో పుస్తకం మెయిల్లో వచ్చింది.
సాయి బ్రహ్మానందం గొర్తి గారు మంచి కథకులు. ఆయన కథలు చదివాను. ఎంతో వైవిధ్యం వున్న కథలు చాలా చక్కగా చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ ఆయన హాబీలు. అలాంటి హబీలలో కూడా ఆయనకున్న ప్రవేశం గుర్తించదగ్గ విశేషం.
సాయి గారు రాసిన నవల చదవడం ఇదే మొదటి సారి. ‘అంతర్జ్వలన’ ఒక ఎన్నారై కథ. ఇండియాలో పుట్టి ఒక బాచ్లర్ డిగ్రీ చేతబుచ్చుకుని, అమెరికా వచ్చి, ఇక్కడి వాతావరణంలో ఇమిడిపోయి, వ్యక్తిగతంగా ఎత్తుకి ఎదగగలిగే అవకాశాల్ని నిర్దాక్షిణ్యంగా వినియోగించుకుంటూ, తనకు తెలియకుండానే తన వాళ్ళకు, వాళ్ళు తనకిచ్చిన విలువలకూ దూరమవుతూ, ఒక రకమైన ఒంటరి జీవితాన్ని గడుపుతూ, తాను చేరిన ఎత్తును గర్వంగా పండగ చేసుకునే వేళ కన్ను మిన్ను గానక ఒక ప్రమాదంలో చిక్కుకుని చివరి శ్వాశలో తనని తాను విశ్లేషించుకునే ఒక అవకాసం కలిగినప్పుడు ఆ జీవి పొందే అంతర్మధనం ఈ నవల.
అంతర్మధనం మొదటి నాలుగు పేజీలలోనూ, చివరి రెండు పేజీలలోనూ మాత్రమే మనకు కనిపిస్తుంది. మధ్యలో ఆ మధనం లేదని కాదు. అది కేవలం తను బతికే మార్గాన్ని వెతికే ప్రయత్నమే. మిగిలిన కథంతా, కాస్తో కూస్తో సక్సెస్ చూసిన ఒక సగటు ఎన్నరై జీవితం - ఎవరైనా అన్వయించుకోవచ్చు. అమెరికా వాతావరణం తెలియని వాళ్ళకు కళ్ళకు కట్టినట్లు చూపించారు సాయి గారు.
ఆయన కథలు చదివిన నాకు ఈ నవల కొంచెం నిరుత్సాహ పరిచిందని చెప్పక తప్పదు. అమెరికా వచ్చిన సగటు మనిషి జీవితాన్ని గురించి రాస్తూ, ఆ నెరేషన్ కి అటూ ఇటూ తనదైన శైలిలో రెండు అట్టలని అందంగా అతికించి ఒక బౌండు పుస్తకం తయారు చేసినట్లనిపించింది.
పుస్తకానికి ముఖచిత్రంగా ఆయన తీసిన ఒక ఎర్రపువ్వుల ఫొటోని అందంగా తీర్చి దిద్దారు. ఎందుకో కాని, పుస్తకం అంతరార్థం ఆ బొమ్మ చెప్పలేక పోయిందేమోననిపించింది.
ఎన్నో మంచి కథలను అందిచ్చిన ఆయన కలం నుంచి ఇంకా మంచి నవలలు రావాలని, రాగలవని ఆశిస్తాను.
పుస్తకం నవోదయా, విశాలాంధ్రా, నవచేతనా లాంటి పేరుమోసిన అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. వెల ఇండియాలో అయితే రూ. 65, బయట $4.95 మాత్రమే.
నాలుగు తరాలు నవల - సమీక్ష
ఈ 'నాలుగు తరాలు’ అన్నది రచయిత మొదటి రచనే అయినా, ఈ రచయిత తెలుగు సాహిత్య లోకానికి కొత్తే అయినా, ఈ రచయిత తన రచనతో పాఠకులని చమత్కారంగా తన ఊహల సాలెగూడులోకి తీసుకెళ్ళి మళ్ళీ బయట పడేస్తారు.
ఆఖరుకి అందరూ నిశ్చేష్టులౌతారు. ఇంకొంత మంది ‘ఇది నిజంగా సంభవమేనా? ఈ రోజుల్లో కూడా ఇలా జరగడం సాధ్యమా?' అనీ అనుమానిస్తారు కూడా!
మరికొంతమంది దానిలోని ఇతివృత్తాన్ని సమర్థిస్తారు. “అవును! అలాగే జరగవచ్చు”అని వాదిస్తారు కూడా!
కానీ ఈ నవల చదవడం పూర్తిచేసిన ప్రతీ ఒక్కరూ, ఒక మంచిపుస్తకం చదివిన సంతృప్తి తోనే ముగిస్తారు అన్నది మాత్రం నిజం.
ముగ్గురు కుర్రవాళ్ళు, చేతిలో పైసా లేని పరిస్థితుల్లో, విధిని ఎలా ఎదిరించి, విధి విసిరిన సవాళ్ళనీ స్వీకరించి, ఆ సందర్భంగా వచ్చే అవకాశాలనీ, సవాళ్ళనీ తమకనుకూలంగా మలచుకుని, అదే సమాజంలో తమ ధార్మికబుధ్ధినీ, ఔన్నత్యాన్నీ ఎలా చాటుకున్నారన్నదే, ఈ కథ.
ఈ ముగ్గురూ తొలుత ఎనమండ్రుగురు గానూ, ఆ తరువాత పన్నెండు మందిగానూ స్నేహితులై, ఈ 'నాలుగు తరాలు’కి మంచి పునాదిని ఏర్పరుస్తారు. అవకాశాల గనీ, ఖజానా, అయిన అమెరికా కి వెళ్ళాక కూడా, సమాజానికి తమ ఋణాన్ని ఎలా తీర్చుకున్నారూ, తమ తరువాత తరాలని ఏ విధంగా మలిచారూ అన్నది ఇందులో ముఖ్య ఇతివృత్తం .
రచయిత తన పరిచయ వాక్యాల్లో చెప్పినట్టుగా, ఇంతవరకూ తన రచనలన్నీ అముద్రితమే ఐనా, అవన్నీ వ్యాపార సరళిని ప్రతిబింబించకపోయినా, ఈ నవల చదివాక మాత్రం, ఈ రచయిత కలం నుంచి మరిన్ని రచనలు ఇటువంటివే రావాలనీ, ముద్రించబడాలనీ, పాఠకులు తప్పక ఆశిస్తారు.
తప్పక చదవాల్సిన నవల. కాదు, నవలా రాజం!
ప్రస్తుతం అమజాన్ .కాం (USA) వారి వద్ద లభిస్తోందీ నవల.దాని వివరాలు...
ఱ - సమీక్ష -శాయి రాచకొండ
ఈ పుస్తకం పేరు 'ఱ ', అదే మనకు తెలిసిన, మనలో చాలా మందికి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలీని బండీ ర. అదొక బండీలా కనబడిందేమో శాస్త్రకారుడికి. ఎప్పుడైనా ఆలోచించారా ఒక్క క్షణం ఆ అక్షరం గురించి? ఏదీ? మనకంత టైముంటేగా? ఇద్దరు పిల్లలు ఎదురెదురుగా కూచుని ఆడుకుంటున్నట్లుందా? చనిపోయిన మనిషిని పడుకోబెట్టినట్లుందా? పాపాయి ఉయ్యాలలాగా ఉందా? - ఇవన్నీ రచయిత్రి, కవయిత్రి భావాలు. అంత ఊహా?
చిన్న పేరు, చిన్న పుస్తకం, 'ఆ ఎంతసేపులే?' అనుకున్నాను. నిజంగానే ఎంతో సేపు పట్టలేదు పుస్తకం చదవడానికి. కానీ చదివిన తరువాత ఎన్ని ఆలోచనలు నా చుట్టూ తిరిగాయో, ఇంకా తిరుగుతున్నాయో! నేను పెరిగిన రోజులు గుర్తొచ్చాయి. చదువుతూన్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి బాధతో. ఆర్థికంగా బలహీన వర్గాలలో చూసిన, అనుభవించిన సంఘటనలెన్నెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. చెప్పిన అనుభవాలు ఆమెవి. కాని ఆమెకొక్కరికీ పరిమితమైన అనుభవాలు కావవి.
ఇంకా.... 'ఱ ' అనేది ఒక నవలిక అన్నారెవరో ఈ పుస్తకాన్నిసమీక్షిస్తూ…
నాకు మాత్రం ఒక సగటు దిగువ మధ్య తరగతి సమాజంలోని హిపోక్రసీకి, అనారోగ్యాలకి, గుర్తించలేని, వైద్య సదుపాయాలు లేని శారీరక, మానస రుగ్మతలతో తలక్రిందులయే సమాజానికి, తను అనుభవించిన తీవ్ర ఆవేదనలకి, ఓ దర్పం పట్టి, తనకున్న జ్ఞాపకాల దొంతరలలోనుంచి బహుశా తనని వెన్నాడే ఆలోచనలు ఈ పుస్తక రూపంలోనైనా ఆగుతాయా అని, సహజ కవయిత్రిగా సున్నితమైన, అప్పుడప్పుదు సూదుల్లా గుచ్చుతూ, వో పాతికోవంతు జీవితానికి రాసుకున్న ఆత్మ కథేమో అనిపించింది. ఆకాసమంత నిజాన్ని దాచేసుకుని ఇహ ఓ రోజు వుండలేక భళ్ళున కన్నీళ్ళో, అవి పెల్లుబికి వచ్చిన వెంటనే కలిగే సన్నని వాన జల్లో - ఊరట కలిగించే మనోస్థితిలో ఈ పుస్తకం ఆవిర్భవించిందా?
' వెంటాడుతున్న భూతకాలాన్ని తప్పించుకోలేక, నడుస్తున్న వర్తమానంలో ఇమడలేక సతమతమైపోతూ' అన్నవి రచయిత్రి మాటలు. చిన్న వయసులోనే తన వాళ్ళంటూ తనను తాకిన మనుషులు అకస్మాత్తు గానో లేక అసహజంగానో ఈ ప్రపంచాన్ని విడిచిపోయినప్పుడు తన చిన్ని హృదయంలో చేసిన గాయాలకు ఈ పుస్తకం రాయడంలో ఊరడింపు కలిగించిందా?
"గోడ అవతల కాలగర్భంలో కలిసిపోయిన తండ్రులు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దనాన్నలు, బాబాయిలు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ... వాళ్ళ బంధువులు వాళ్ళకై రకరకాల ఆకృతుల్లో కట్టించిన సమాధుల్లో అస్థి పంజరాలై, భూమాత నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ వెల్లకిలా పడుకుని ఉన్నారు." అంటారు రచయిత్రి – ఈ పుస్తకం వాళ్ళందరి గురించీ...
ఇంకా రచయిత్రి మాటలలోనే...
"ఇసుకలో పురుగులు
పరుగులు తీస్తుంటే
మనసు పొరల్లో కదిలే
గతకాలపు గుర్తులు"
-అంటారు.
ఈ పుస్తకం ఎందరి కథో...
ఒక లీడర్ గా, చలాకీగా మగ పిల్లల్ని ఆకర్షిస్తూ... చైతన్యం తన ఊపిరై మెలిగే కుతూహలం (స్నేహితురాలి పేరు) ఒక రోజు రైలు క్రింద తల పెట్టి .... అంతేకాదు ఆ పిల్ల తల వెళ్ళి ఎవరి ఒళ్ళోనో పడినట్లు విన్న ఒక పదో తరగతి చదివే పిల్ల కథ....
"వడగాలులు వీచే ఎండాకాలంలో వేపచెట్టు నీడ కిందో, మెట్ల వరుస కింది చల్లని నీడలోనో, నిర్మానుష్య వీధిని చూస్తూ వరండాలో పడక్కుర్చీలోనో కూర్చుని పుస్తకాల మీద పుస్తకాలు చదివే" చిన్నపిల్ల కథ ....
"పురుగులు పట్టిన శనగపిండిని ఒక పారదర్శక పెట్టెలో పెట్టి రోజూ కొత్తగా ఎన్ని పురుగులు పుడుతున్నాయో ఒక నోటు పుస్తకంలో రాస్తూ ఉండే" ఒక బాల శాస్త్రవేత్త కథ....
ఆటల్లో చచ్చి పోయినట్లు నటించే కిట్టూగాడు నిజంగానే రివాల్వరుతో కాల్చుకుని చచ్చిపోయినప్పుడు ఆ చిన్నారి మనసు పడిన వేదన కథ....
మంత్రగాళ్ళ కథలు చెబుతూ, తానూ ఓ రోజు మంత్రగాడినవుదామనే కలలు కంటూ ఓ రోజు తన చేతిని నరుక్కుని కృష్ణా నదికి ఆహుతి నిచ్చి ఈ రోజుకీ "చొక్కా చెయ్యి గాలికి అటూ, ఇటూ ఊగుతూంటే మొండి భుజాన్ని వేళ్ళాడేసుకుని విచారంతో నదిచిపోయే" శ్రీనుగాడిని మరచిపోలేని మనసు కథ....
జీళ్ళు కొనుక్కోవడానికి కొట్టుకెళ్ళితే, తను, మిగతా పిల్లల ఎదురుకుండానే ఆ కొట్టు మనిషిని కోర్టులో సాక్ష్యం చెప్పాడనే కక్షతో ఓ నలుగురు మనుషులు విరిగిన సోడా బాటిల్ తో పొడిచిచంపినప్పుడు ఆ చిన్నారి హృదయాలకి తాకిన గాయం జీవితంలో ఏరోజుకీ మాయమవలేని కథ....
పిసినారి తాతయ్య.... ఎందుకు తన పెద్దకొడుకంటే ద్వేషం పెంచుకున్నాడో అర్థం కాని ఒక లేత మనసు కథ....
ఇలా ఎన్నో ఎన్నెన్నో మనుషుల్ని వారి మనస్తత్వాల్ని, కాలంతో పాటు, అకాలంగా ఈ ప్రపంచం విడచి వెళ్ళిపోయిన ఎంతో మందిని చూస్తూ తాను అసహాయంగా ఉండిపోయిన ఒక యువ హ్రుదయం చెందిన మధన ...
నన్ను కలచివేసింది.... నా చిన్నప్పటి అనుభవాల్ని నెమరు వేయించింది. ఒక వెంకటేశ్వర్లు ఒక రాధని కట్టె పేడుతో కొడుతుంటే, పక్కింట్లో రామం వాళ్ళ పెద్దన్నయ్య కొట్టే దెబ్బలకి అరుస్తూంటే, చూడలేక ఇంట్లోకి పరుగెత్తి వెళ్లి గట్టిగా కళ్ళుమూసుకుని, అరుపులు, కేకలు వినలేక చెవులు మూసుకుని, ఇలా ఎందుకో అర్థం కాని ఆలోచనల బాల్యం జ్ఞాపకానికొచ్చింది.
పుస్తకం చివరంటా చదివిన తరవాత రచయిత్రి చెప్పక చెప్పిన ఇంకో సత్యం కనిపించింది.
ప్రపంచానికి, తన సన్నిహిత కుటుంబానికీ ఎందుకూ పనికిరాడనే ఒక ముద్ర వేయబడిన మనిషి, తన తండ్రి, ఏ ప్రాముఖ్యతా లేని ఒక సాధారణ మనిషే అయినా, మనుషులన్నా, తన పిల్లలన్నా వల్లమాలిన ప్రేమ చూపగల ఒక గొప్ప గుణం కలిగి ఉంటే, ప్రపంచం అది గుర్తించదేం? ఆ మనిషి ఎందుకు గొప్ప తండ్రి కాకూడదు? డిస్లెక్సియాతో బాధపడే తమ్ముడు ఈ రోజు తన కాళ్ళమీద తను నిలబడగలగడానికి కారణమైన తన తండ్రికి ఇచ్చిన నివాళులా ఈ పుస్తకం? నాకైతే అదే అనిపించింది.
సుమారు అన్ని అధ్యాయాలకి, తొలుతగా ఉపోద్ఘాటంగా చెప్పిన కవితలు, తన అతి సున్నితమైన మనో భావాలని వ్యక్తం చేసిన మాటలు, నన్ను ఆకట్టుకున్నాయి. కొన్ని మీముందుంచుతాను.
"నడిరాత్రి ఫకీరు ముందు కూర్చుని చీకటిని తాగుతూ నేను"
"స్నానాల గదిలో హఠాత్తుగా నీటి జల్లులు మీద పడడం మొదలైతే భయంకరమైన తుఫాను మొదలైందని అక్కడ గోడమీద పాకుతున్న చీమ భయంతో వణికి పోతుందేమో?"
"మహాకాయ బండరాయి
పాకుడు కప్పుకు నిద్రపోతుంది
నోరంతా తెరిచిన ముసలి గుహ
ఓయంటే ఓ హోయని కేక వేస్తుంది"
"ఓటి తెప్ప
ఇసుక మేట
భోరు భోరున
మనిషి మనిషి
సగం పువ్వు సగం రాయి
నిద్దుర మత్తున
మాయ మాయ"
"ఇక్కడ నలిగిపోయిన నవ్వు మొహానికి తగిలించుకోవాలి. కన్నీళ్ళని కోటు జేబులో మడిచేయాలి. ఏడుపుని అల్మరాలో దాచేయాలి. భయాలను భుజాన వేసుకుని మోయాలి. ఎవరికోసమో నచ్చని రంగులు మెత్తుకోవాలి. ఎవరినో మెప్పించడానికి నటనల నగలను గొంతున వేసుకోవాలి. చిన్ని దీపం వెలిగించుకొని, చిన్ని లోకాన్ని ఏర్పరుచుకుని హాయిగా మురిసిపోవడానికి లేదు. ఎవడొచ్చి ఆ దీపాన్ని ఊదేస్తాడో అని, ఆ చిన్ని లోకాన్ని చిందర వందర చేస్తాడో అని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి."
"ఒక్కో పువ్వు నేళ్ళల్లో రాలుతూ
ఒక్కో వలయాన్ని సృష్టిస్తోంది
జారి పడుతున్న పూలని
జరిగి పోతున్న వలయాలని
చూస్తూ చూస్తూ చుస్తూ
కాళ్ళు ఊపడం మర్చిపోయి కూర్చుండి పోతాను
టీ చల్లారి తరకగట్టిన సంగతే గమనించలేదు"
చివరగా...
"పేరు తెలియని చెట్టు ఒకటి
వానకు తడుస్తూ నిలబడి ఉంది.
దూరాన, ఎన్నడో మరణించిన
నాన్న గొంతు వినబడుతోంది"
అవును, ఆమెకు వినబడుతోంది... అందుకే ఈ పుస్తకం ...
OOO