MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.
'నవ్వులో శివుడున్నాడురా' శ్రీరమణ గారు రాసిన హాస్య వ్యాస సంపుటి.
శ్రీరమణ గారి రచనల గురించి పెద్దగా చెప్పనక్కరలదేమో! ఆయన పేరు వినంగానే గుర్తొచ్చేది ‘మిథునం’ సినిమా. సినిమా, దానితోబాటు ఆ చిన్ని కథ, డైలాగులు మరిచిపోలేనివి చాలా మందికి. నవోదయా బుక్ స్టోర్స్ కెళ్ళినప్పుడు పుస్తకం చూసి రెండు పేజీలు తిప్పంగానే పుస్తకం మొత్తం చదవాలనిపించింది.
ఈ పుస్తకంలో కూర్చినవన్నీ, శ్రీరమణ గారు గతంలో ప్రచురించిన హాస్య ప్రధానమైన వ్యాసాలు. వ్యాసాలు మూడు భాగాలుగా ఉన్నాయి. మొదటివి ఆయన ఇదివరలో చేసిన పదిహేను రేడియో ప్రసంగాలు. రెండవ భాగం పూర్తిగా బాపు, రమణల పై రాసిన వ్యాసాలైనా, చేసిన ప్రసంగాలైనా. ఇక మూడవ భాగం పత్రికలకు అప్పుడూ అప్పుడూ రాసిన వ్యాసాలు – ‘సశేషాలూ, విశేషాలూ’ అన్నారు. చివరలో ఓ పేరడీ కథ కూడా జోడించారు. బహుశా ఇంకే పుస్తకంలోకీ దూరకుండా ఉండిపోయిన అదో సశేషమై ఉండవచ్చు.
పుస్తకానికి హాస్యం అనే ప్రధాన లక్ష్యమయినా, రచయిత తను రాసిన విధానంబట్టి ఒక ప్రత్యేకత జోడించడం జరుగుతుంది. శ్రీరమణ గారు మొదటి భాగంలో రాసిన వ్యాసాలన్నిటిలోనూ ఆయన ఎన్నుకున్న అంశాలు ప్రముఖ రచయితలు, కవుల జీవితాలలో జరిగిన సంఘటనలు. ఈ సంఘటనల ఆధారంగా 2012 ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రసంగాలు అన్నీ. పుస్తక నేపథ్యం – పుస్తకానికి ముందు మాట – రాస్తూ, ‘నవ్వులో శివుడున్నాడురా’ అన్న శీర్షిక తనది కాదని, మల్లాది శివరామకృష్ణశాస్త్రిగారిదని చెబుతూ, ఆ రెండు పేజీలలో కూడా శాస్త్రి గారికీ, బాపు రమణలకూ మధ్య ఉన్న అనురాగ భూరిత సంబంధం గురించి ఒక సంఘటన చెబుతారు. చదవడానికి ఎంతో ఆహ్లాదం, ఆర్ద్రత కలిగించే ఇలాంటి సంఘటనలు పుస్తకం నిండా కోకొల్లలు.
“నవ్వులో శివుడున్నాడు, కానీ శివుడులో నవ్వు కనిపించడు’ అంటూ మొదలవుతుంది మొదటి వ్యాసం. ‘ఆనందానికి లిపి నవ్వు’ అంటారు. అలాగే మనిషికి గొప్ప అలంకారం కూడా నవ్వే అంటారు. మత గ్రంథాలలోగానీ, మతప్రవక్తల ప్రవచనాలలోగానీ హాస్యానికి చోటుండదు అంటూనే ఆదిశంకరులవారి రచనలో కూడా ఎంతో చమత్కారం చూడగలుగుతారు శ్రీరమణ గారు. భజగోవింద శ్లోకాలన్నీ అక్షరాల్లో గీసిన వ్యంగ్య చిత్రాలంటారు. ‘హాస్యం కేవలం నవ్వించేది మాత్రమే కాదు. ఒక మెరుపు; ఒక పొగరు, ఒక విగరు కల ఒక పదం, ఒక వాక్యం ఏదైనా సరే’ అని అభిప్రాయం వెలిబుచ్చుతారింకొక వ్యాసంలో.
ఆదిభట్ల నారాయణదాసు గారి ‘గిరికథే’ కావచ్చు (సాధారణంగా ఆయన చెప్పేది హరికథ కదా!), విశ్వనాథ వారి వేయి పడగలే కావచ్చు (అబ్బూరి వారు అన్నారట ‘ఇందులో పడగలే కానీ పాము కనిపించలేద’ని), గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినిమా కష్టాలే అవచ్చు, శ్రీశ్రీ గారి చమత్కారాలే అవచ్చు, భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి చతురోక్తులే కావచ్చు, పురాణాలు, జానపద సాహిత్యం, జరుక్ శాస్త్రి గారి పేరడీలు, ముళ్ళపూడి వెంకటరమణ గారి కష్టాలను కప్పిపుచ్చే హాస్యోక్తులే కావచ్చు, హాస్య బ్రహ్మగా వాసిక్కిన భమిడిపాటి కామేశ్వరరావు గారి చతురోక్తులు కావొచ్చు, సినీ గేయ రచయిత ఆత్రేయ గారి గడుగ్గాయి సమాధానాలు కావొచ్చు, పౌరాణిక నాటకాల్లో స్టేజి మీద జరిగే బ్లూపర్సే కావచ్చు, రామకృష్ణ పరమహంస తనదగ్గరకు వచ్చిన సాధకుడినిపై చూపిన జాలి వాక్యాలు కావచ్చు, ఏవీ శ్రీమణ గారి కలాన్ని తప్పించుకోలేకపోయాయి.
పుస్తకంలో ఆయన వ్యాసాలన్నీ కూడా నిలబడే హాస్యం (stand up comedy) లా నడుస్తాయి. ఆయన ఉపన్యాసం బహుశా అలానే ఉండి ఉండవచ్చు. చదివే హాస్యం కాబట్టి ఒకరినుంచి ఇంకొకరి దగ్గరకి గంతులేస్తూ నడచిపోతుంది. ప్రతి గంతులోనూ చాలా మందికి తెలియని ఎన్నో విషయాలూ తెలుస్తాయి.
పుస్తకం నిండా బాపు గారి కార్టూన్లు చదువరులను మూసిముసి నవ్వులు కలిగిస్తూ కనబడుతూ వుంటాయి – చాలానే. బాపు కార్టూన్ సంపుటి ‘కొంటె బొమ్మల బాపు’ కి ‘నానృషిః కురుతే కార్టూన్’ అంటూ శ్రీరమణగారు రాసిన ముందుమాటతో ప్రారంభమవుతుంది రెండో భాగం. ‘బాపు రమణలపై నేను రాయగలిగినంత, చెప్పగలిగినంత ఎవరూ రాయలేరు, చెప్పలేరు. ఇది అహంకారం కాదు. ఆ ఇద్దరితో నాకున్న పరిచయం, చనువుకొద్దీ అన్నమాట’ అని (ని) గర్వంగా చెప్తారు శ్రీరమణ గారు. అవును, 1974 నుండి 2011 వరకు అంటే సుమారుగా 37 ఏళ్ళు బాపు, రమణలతో కలిసి పనిచేసిన అనుబంధం. బాపుగారితో ఇంటర్వ్యూ, ముళ్ళపూడి, బాపు గార్ల సినిమా జీవిత అనుభవాలు, వారిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, వారిద్దరితో శ్రీరమణ గారి సాన్నిహిత్యం, స్నేహం, ఇలా ఎన్నో విషయాలు, విశేషాలు సహజమైన భావనతో పాఠకుల ముందుంచుతారు శ్రీరమణ గారు. వివిధ సందర్భాలలో తీసిన బాపు రమణల ఫోటోలు ఒకటికి మరోసారి చూడాలనిపిస్తుంది వారిద్దరినీ ఇష్టపడే ఎవరికైనా – ప్రస్తుతం మనతో లేని వారిద్దరికీ మనం ఇవ్వగలిగే శ్రద్ధాంజలి ఏమో! ‘బాపు నిగర్వి, కాని బాపు గర్వం రమణ’ అంటారు శ్రీరమణ.
ఇక మూడవ భాగంలో వున్న వ్యాసాలు ఒక రకంగా ఆయనే చెప్పినట్లు సశేషాలే – అవి హాస్యంకోసం రాసినవి కావు. ‘నాస్తికత్వానికి ముందుమాట’ ఒక రకంగా నాస్తికత్వం మీద శ్రీరమణ గారి ఆలోచనలు తెలియచేసే వ్యాసం. మిగిలిన వ్యాసాలు భుజంగరాయశర్మగారు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, నండూరి రామమోహనరావు గార్ల గురించి చిన్న చిన్న వ్యాసాలు. తెలుగు సాహిత్యంలో హాస్యపాత్రలు, పొగడ్త అనే మరో రెండు వ్యాసాలున్నాయి. చివరగా ‘హైజాక్ డ్రామా అను ఒక పేరడీ’ కథను జోడించారు. ఈ చివరి కథ లేకుండా వుంటే బాగుండేదేమో అనిపించింది.
మొత్తంగా చదవదగ్గ పుస్తకం. ఎన్నో విషయాలు తెలుస్తాయి, హాయిగా నవ్వుకోవచ్చు.
VVIT వారి ప్రచురణ. ఖరీదు రూ. 180.00. అన్నీ ముఖ్యమైన పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.
*****
ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అంతర్జాలంలో 2020 అక్టోబరు 10-11 తారీఖులలో అత్యంత వైభవంగా జరిగింది. 14 దేశాల నుండి 175 మండి సాహితీవేత్తల ప్రసంగాలతో, 16 పుస్తకావిష్కరణలతో, ఒక జీవన సాఫల్య పురస్కారంతో, 15 వేదికలపై 36 గంటలపాటు నిర్విరామంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశపు విశేషాలు, సుమారు నూటముప్పై వ్యాసాలు పొందుపరచి ఎప్పటికీ నిలిచిపోయే ఒక జ్ఞాపికగా సభావిశేష సంచికను వంగూరి ఫౌండేషన్ వారు అందిస్తున్నారు. పుస్తకం ఈ-కాపీలను కినిగేలోనూ (www.kinige.com), వంగూరి ఫౌండేషన్ (www.vangurifoundation.org) వారి వెబ్ సైటులో పొందవచ్చు.
******
‘కథా కేళి’ 111 మంది రచయిత్రులు (ప్రమదలు) అల్లిన కథా కదంబమాల. 456 పేజీల పుస్తకం. జ్యోతి వల్లబోజు గారి ఆలోచనతో అంకురార్పణ జరిగి ‘ప్రమాదాక్షరి’ సాహితీ బృందం మహిళల కార్యక్రమాలలో భాగంగా కథలను సేకరించి ఈ పుస్తకరూపంలో వెలువరించడం జరిగింది. ఇంతమంది కథలు సేకరించడం ఒక ఎత్తైతే, ఆ రచయిత్రుల ఫోటోలు సేకరించి, వారి వారి ఫోన్ నంబర్లతో సహా ప్రతి కథతో పాటు ప్రచురించడం మరో ఎత్తు.
మంథా భానుమతి గారు పుస్తకానికి ముందు మాట (చదువరుల మనసులలో కథాకళి చేసే ‘కథాకేళి’) రాస్తూ, ‘కథలకు ఎన్నుకున్న కథాంశాల వైవిధ్యం చూస్తుంటే, ఈ భూమి మీద ఇన్నిన్ని విశేషాలున్నాయా అని ఆశ్చర్యం కలుగక మానదు’ అని అంటారు.
చెయ్యి తిరిగిన రచయిత్రుల దగ్గరనుంచి కొత్తగా రచనా వ్యాసంగం మొదలు పెట్టిన వారి వరకూ కథలు ఉన్నాయి. నూటపదకొండు రచయిత్రుల కలాల నుండి జాలువారిన ఈ కథలలో ఒక కథకూ ఇంకో కథకూ వైవిధ్యం వున్నమాట నిజమే కానీ, పుస్తకం మొత్తం గా చూస్తే చాలా కొన్ని కథలే కొత్తదనానికి అద్దం పట్టేవి. చిన్న చిన్న కథలు చాలా ఉన్నాయి – సుమారు నాలుగైదు పేజీలకు మించనివే. అయితే పుస్తకం సైజు కొంచెం పెద్దదే. చాలా కథలు చిన్నవే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కథలు కావాలంటే అన్నీ చదవడానికి వీలుగా వుంటుంది. పుస్తకం మంథా భానుమతి గారి ‘శృతి’ కథతో మొదలై, జ్యోతి వలబోజు గారి ‘స్మార్ట్ ఫోన్...స్మార్ట్ బామ్మ’ తో పూర్తవుతుంది.
జ్యోతి గారు చెప్పినట్లుగా ఇంతమంది రచయిత్రుల కథలను ఒక పుస్తకరూపంలోకి తీసుకురావడం ఒక యజ్ఞమే. అందుకు జ్యోతిగారు తప్పక అభినందనీయులు.
పుస్తకం ధర కేవలం రూ. 300 మాత్రమే. కావలసిన వారు పుస్తక ప్రతులను అచ్చంగా తెలుగు వారి వెబ్సైటునుండిగాని, నవోదయా బుక్ హౌస్, హైదరాబాదు నుండిగాని పొందవచ్చు.
*****