MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.
ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళినప్పుడు డా. కృత్తికంటి శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడెమీ వారు ప్రచురించిన రెండు పుస్తకాలిచ్చారు. ఒకటి 'బుజ్జి పత్తేదారు’, రెండవది ‘Chaso – Selected Short Stories – Translated from Telugu by K. Chandrahas and K.K. Mohapatra.’
రెండూ అనువాద గ్రంధాలే అవడం ఒక విశేషం. సాహిత్యం పదికాలాలపాటు నిలవాలంటే, ఒక భాషలోని సాహిత్య విలువలు మిగతా భాషల్లోకి విస్తరించాలంటే అనువాదాలు అవసరం. అయితే ధైర్యం చేసి ముందుకు వచ్చే అనువాదకులపై ఎంతో బాధ్యతా, భారం, ఉంటాయి. మూలంలో రచయిత చెప్పిన భావాలు మార్చకుండా చూడడం ఒక ఎత్తైతే, ఏ భాషలోకైతే అనువాదం చేయబడుతోందో ఆభాషలో పటుత్వం ఉండి, అందులోని నుడికారాలతో మూల రచయిత భావాల్ని ఆభాషా పాఠకులకు అందజేయడం మరో ఎత్తు. ఇది సులభమైన పనికాదు. నాఉద్దేశ్యంలో మన తెలుగు భాషా రచయితలకు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ గుర్తింపు రాకపోవడానికి కారణం, కావలసిన సంఖ్యలో సరియైన అనువాద రచనలు లేకపోవడమే అని.
ఆంగ్లభాషలో అనువాదం చేసేడప్పుడు ఆభాషలో పట్టుండడం, ఆభాషా పాఠకులకు అర్థం అయే రీతిలో చెప్పడం అవసరం. అంతే కాదు, తెలుగు నుడికారాలను మక్కికి మక్కీ అనువదించకుండా వుండడం కూడా ఎంతో అవసరం. అందుకు మూలభాష, అనువాద భాషలూ ప్రావీణ్యత కలిగి ఉండాలి. నాకు దొరికిన ఈ రెండు పుస్తకాలూ మంచి అనువాదాలుగా చెప్పబడటానికి అర్హంగా ఉన్నాయని నా అభిప్రాయం.
‘బుజ్జి పత్తేదారు’ -
ఒరియా మూలం పుణ్య ప్రభాదేవి గారు రాసిన చిన్న పిల్లల కథల సంపుటి. ఆకథలను తెలుగులోకి అనువదించినది చాగంటి తులసిగారు. “ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. మూల ఒడియా వాడుక భాషకు తగిన విధంగా సామాన్యంగా మనం మాట్లాడుకునే, కబుర్లు చెప్పుకునే వాడుక భాషలో అనువదించి తెలుగు పిల్లలకు అందివ్వాలన్న దృష్టితో నా అనువాదం జరిగింది." అంటారు తులసి గారు పుస్తకానికి ముందు మాట (నా మాట) రాస్తూ. ఆవిడ చెప్పినట్లుగా చమత్కారం, హాస్యం కలగలిపి మంచిచెడ్డల వివేకాన్ని కలిగిస్తూ మౌలికమైన తనదే అయిన ముద్రతో రచించినవే ఈ చిన్ని కథలు.
బహు భాషా కోవిదురాలైన తులసిగారు చేస్తున్న అనువాద సాహితి సేవలో ఇదొక చిన్న భాగం. పుణ్యప్రభాదేవి గారు 2010 లో 'కుని గోయిందా' అనే చిన్న కథల పుస్తకానికి సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత. ఆవిడ రాసిన 'పిలంక మేఘదూత', 'కాలియా బలాడా గల గల' లాంటి చిన్న పిల్లల కథల పుస్తకాలు, మరెన్నో ఇతర పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆవిడ యాభై ఏళ్ళకి పైగా విశాఖపట్నంలో నివసించడం గమనించదగ్గ విశేషం.
బుజ్జి పత్తేదారు కథల సంపుటిలో పన్నెండు కథలున్నాయి. 'మహిమల మంచం' కథలో అయిదు వందలు ఖరీదు చేసే మంచాన్ని ఒక వడ్రంగి వెయ్యి రూపాయలకి అమ్ముతాడు. మంచంతో పాటు, అందమైన కలలు కూడా. 'గాడిదకు మాటలొస్తే' అన్న కథలో గాడిద గుర్రాన్ని అనుకరించితే వచ్చే నష్టాలేమిటో తెలుస్తుంది. 'బుజ్జి పత్తేదారు' కథలో తప్పిపోయిన ఆవుని టున్నా ఎలా తిరిగి తెచ్చుకున్నాడో పిల్లల మనసుల్లో తాము పెంచుకున్న పెంపుడు జంతువులపై ఎంత మెక్కువుంటుందో చదువుతున్న లేక కథ వింటున్న పిల్లల గుండెలను తాకేలా చెబుతుంది. 'నేనూ వెళ్ళగలను' అనే కథలో ఏ పని చెయ్యాలన్నా ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో పిల్లలు సాధారణంగా చూపించే మంకు పట్టు ఉదాహరణగా తెలియచేస్తుంది. ఇలా
పన్నెండు కథలూ కూడా ఎంతో సృజనాత్మకంగా పిల్లలకు అర్థమయేలా నవ్విస్తూ కవ్విస్తూ ఉంటాయి.
తులసి గారి అనువాదం గురించి ఎక్కువగా చెప్పనక్కరలేదు. కథలు చదువుతూంటే ఒక్క పేర్లు తప్ప తెలుగు మూల కథ చదువుతున్నట్లే ఉంటుంది.
కథలన్నీ పిల్లల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సృష్టించినవే. సృజనాత్మకంగా ఒరియా సాహిత్య సృష్టి చేసిన పుణ్యప్రభాదేవిగారి ఈ పిల్లల కథలను మనకందిస్తూ చాగంటి తులసి గారు చేసిన అనువాద కథల సంపుటిని చదవాల్సిందే. సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ఈ పుస్తకం కేవలం 85 రూపాయలు మాత్రమే.
* * *
Chaso – Selected Short Stories చాసో (చాగంటి సోమయాజులు) గారు తెలుగులో రాసిన కథలలోనుంచి ఇరవై రెండు కథలను ఎంపిక చేసి ఇంగ్లీషులోకి తర్జుమా చేసి అందించిన పుస్తకం. అనువాదకులు కె. చంద్రహాస్ గారు, కె. కె. మహాపాత్ర గారు. ఈ ఇద్దరు శ్రీరమణ గారి ‘మిథునం’ రచననుకూడా ఆంగ్లంలోకి అనువదించడం గమనార్హం. అనువాదాలే అయినా, ఆర్. కె. నారాయణ్ రాసిన పుస్తకాల్లా చక్కగా చదివిస్తాయి పుస్తకంలో కథలన్నీ.
ఈ సంపుటిలో చాసో గారికి పేరు తెచ్చిన ఎన్నో ప్రసిద్ధ కథలున్నాయి. బొండు మల్లెలు (Jasmines), వాయులీనం (Violin), లేడీ కరుణాకరం (Lady Karunaakaram), ఏలూరెళ్ళాలి (Must Visit Eluru), Soapnut Leaves (కుంకుడాకు), Kukkuteswaram (కుక్కుటెశ్వరం), When a Rock Falls (బండపాటు), Why would I lose it father? (ఎందుకు పారేస్తాను నాన్నా?) మొదలైనవి. ఇవి కాక ఎంపు, బదిలీ, ఏకరువు, మొక్కుబడి, భల్లూక స్వప్నం, పరబ్రహ్మం, కొండగెడ్డ, పనుకుల వాగు, ఫారిన్ అబ్బాయి, కవలలు, ఆవేత, చొక్కా - బొచ్చు తువ్వాలు, పోనీ తిను, చన్నీళ్ళు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.
చాసో గారి ప్రతి కథా ఒక ఆణిముత్యమే. అందుచేత కథలను గురించి ఇక్కడ చెప్పడం అనవసరం. ఇకపొతే అనువాదానికొస్తే కథలు ఇంగ్లీషులో చదువుతున్నా సులభంగా చదివించేటట్లున్నాయి. అయితే ఒక తెలుగువాడిగా కాక పరాయి దేశస్థుడిగా ఆలోచిస్తే, ఈ కథలు అదే ఒరవడిలో కనబడతాయా? మనకు అర్థమైనట్లుగా కథలు అవతలివాళ్ళకు కూడా అర్థమవుతాయా? రచయిత ఉద్దేశించి రాసిన దేశ కాల పరిస్థితులు, సామాజిక న్యాయాలు, మానవ సంబంధాలు, మనుగడకు డబ్బుకున్న ప్రాముఖ్యత, గమనించగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకొకరితో పుస్తకం చదివిస్తే కానీ పూర్తిగా తెలీదు. అయితే అనువాదకులు కొంతవరకు కృతకృత్యులయ్యారని పుస్తకం చదివిన ఎవరికైనా అనిపిస్తుంది. నా ఉద్దేశ్యమైతే ఇంకొంచెం పాశ్ఛాత్యులను దృష్టిలో పెట్టుకుని రాస్తే బాగుండునేమోనని అనిపించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ వారు అనువాద సాహిత్యానికొస్తున్న ప్రోత్సాహం ఎంతో శ్లాఘనీయం. పుస్తకం ఖరీదు కేవలం 110 రూపాయలు మాత్రమే.