top of page

సంపుటి 3  సంచిక 1

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్త​క పరిచయాలు

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మేరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

2017 లో వంగూరి ఫౌండేషన్ వారు ​ఆరు పుస్తకాలు ప్రచురించడం గమనార్హం.  'రెండవ జాతీయ యువతరం సాహిత్య సమ్మేళనం - సభా విశేషక సంచిక', హాస్య బ్రహ్మ శంకర నారాయణ గారు రాసిన 'తీపి గుర్తులు', సోమ సుధేష్ణ గారి నవల 'నర్తకి, మరియు 'అమెరికా తెలుగు కథానిక - 13వ సంకలనం' - నాలుగూ నాలుగు ప్రత్యేక మయిన సాహితీ వస్తువులు ప్రాతిపదికలుగా వైవిధ్య నేపథ్యంతో ప్రచురించబడిన పుస్తకాలు.  అవి కాక చిట్టెన్ రాజు గారి 'అమెరికట్టు కథలు​-కమామీషులూ​, రాధిక నోరి గారి మొదటి కథా కథంబం "అకాల వసంతం" ​​డిసెంబరులో జరిగిన తెలంగాణా ప్రపంచ తెలుగు మహాసభ​ల సందర్భంగా ఆవిష్కరించబ​డ్డాయి.  2016 చివరలో వచ్చింది విన్నకోట రవిశంకర్ గారు రాసిన 'కవిత్వంలో నేను - మరికొన్ని వ్యాసాలు'.  

 

ఈసారి రెండు పుస్తకాలు ఎంచుకున్నాను పరిచయం చెయ్యడానికి.  ఒకటి విన్నకోట వారిది, మరోటి ​అమెరికా తెలుగు ​కథా​నికా​ సంకలనం.  

 

విన్నకోట రవిశంకర్ గారు రాసిన 'కవిత్వంలో నేను - మరికొన్ని వ్యాసాలు' - తాను గత సుమారు పది పదిహేనేళ్లలో రాసి వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురించిన వ్యాస సంకలనం.  

 

పుస్తకం పేరుకి తగ్గట్టుగానే రవి శంకర్ గారు కవిత్వంలో, వివిధ కవితలను విశ్లేశిస్తూ రాసిన వ్యాసాలే ఇవన్నీ.  అయితే మధ్యలో నవీన్ గారి నవలల మీద తన అభిప్రాయాలు కూడా జోడి చేశారు పుస్తకంలో.  ముందుమాటలో రాసినట్లుగా, "ముందుగా కవిత్వాన్ని ఎన్నుకుని ఆ కవిత్వ విశిష్ఠతని, విలక్షణ తత్వాన్ని విశదీకరించి, ఆ క్రమంలోనే కవి పేరు ప్రస్తావిస్తాడు తప్ప 'కవి భజన' చెయ్యడు" అన్న మాటలు అక్షారాలా నిజం.  అది విశ్లేషకుడిలో వుండాల్సిన ముఖ్య లక్షణం.   రవి శంకర్ గారు స్వతహాగా కవి అవడం వల్లా, గోల్డెన్ రూల్ ని పాటించే నిజాయితీ వున్న మనిషి అవడం వల్లా ఈ లక్షణం పుస్తకంలో స్పష్టంగా కనబడుతుంది.  "ఇతర కవుల రచనలను చదివే సమయంలో నేను గమనించిన వివరాలను పాఠకులతో పంచుకోవటం ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం" అంటారు రచయిత.   అలాగే "... కవిత్వేతర అంశాల మీద కంటే, కవితా నిర్మాణంలో అనుసరించవలసిన పద్ధతులు, ఒక భావం కవితగా రూపొందటంలో జరిగే మార్పులు మొదలైనవాటికి ప్రాధాన్యతిస్తూ - వ్యాసాలూ రాస్తే బాగుంటుందని నాకనిపిస్తుంది.  ఆ దిశగా నేను చేసిన ప్రయత్నమే ఈ వ్యాసాలు" అంటారు.  

 

'కవిత్వం రాయడం చాలా సులభం' - అలా అనుకుంటారు చాలా మంది అని అనిపిస్తుంది.  కవిత్వంద్వారా చాలా త్వరగా స్పందించ వచ్చని, కొద్దో గొప్పో ఇతర కవుల రచనలు  చదవే అలవాటుంటే తెలియకుండానే ఎవరినో అనుకరిస్తూ చక చకా రాసేయవచ్చనే ఉద్దేశ్యం కనబడుతుంది.  కానీ ఎలా రాయాలో తెలుసుకోవాలంటే ముందు ఎలా చదవాలో తెలుసుకోవాలి.  రవిశంకర్ గారి ఈ పుస్తకం కవిత్వం చదవాలనుకునే వారికి, కవులు అవుదామనుకునే వారికి కూడా ఒక గైడు.  ఒక దిక్సూచి. 

 

'కవిత్వంలో నేను' అనే వ్యాసం వివిధ కవితలలో కనిపించే ఆ 'నేను ఎవరు' అన్న తాత్విక ప్రశ్నతో మొదలవుతుంది.  ఆ 'నేను' కవే అవచ్చు తనను గురించి చెప్తూ ఉత్తమ పురుషలో చెప్పడం.  మరో వ్యక్తి కావచ్చు.  కవితా వస్తువవచ్చు.  ఇస్మాయిల్, వంశీకృష్ణ, శ్రీశ్రీ, మొదలైన వారి కవితలను ఉదహరిస్తూ రవి గారు రాసిన చర్చ కవిత్వం చదవాలనుకునే వారికి ఒక పాఠం అని చెప్పవచ్చు.  

 

ఇంకో వ్యాసంలో ఇస్మాయిల్ గారి కవితాతత్వం గురించి రాస్తూ, ఆయన కవిత్వంలోని ఆశాభావం, సున్నితమైన హాస్య ధోరణి,  భూత భవిష్యత్తులపై చింత ఆందోళన కాక ఎల్లప్పుడూ వర్తమానం పట్ల అనురక్తి, ఆశాభావం కలిగి ఉన్న కవి అంటారు.  ఆ మాటలు ఉత్త మాటలు కావు.  ఉదాహారణలతో నిరూపించారు, రవి గారు.  ఇస్మాయిల్ గారి కవిత్వంతో అత్యంత సాన్నిహిత్యం వున్న రవి గారు ఆయన కవితా దృక్పథాన్ని మరింత అర్థం చేసుకోడానికి ఎవరైనా ఇంకా విశ్లేషించాలని ఆశిస్తారు, ఈ వ్యాసంలో.  

 

ఒక రెండు వ్యాసాల్లో రవి శంకర్ గారి తండ్రిగారికి సమర్పించిన నివాళులు తనని ఆయన ఎంత స్పందింపచేశారో మనకు తెలుస్తుంది.  వారి నాన్నగారు రాసిన 'తెనుగు తోట' కవితా సంకలనాన్ని ప్రచురించిన సందర్భం ఏంటో చక్కగా వివరించారు. ఆ రోజుల్లో కవికి ఉండవలసిన సామాజిక స్పృహ, అభ్యుదయ భావాలు లాంటి లక్షణాల గురించి వివరించారు.  విశ్లేషణలో ఆనాటి సందర్భం, తండ్రి గారి ఆలోచనా సరళి చాలా చక్కగా వ్యాసంలో ప్రతిబింబించారు.  

 

'శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు' అన్న వ్యాసంలో రవి గారు చూపించిన మరో దృక్పథం చదివి తీరాల్సిందే.  

 

ఇలా 26 వ్యాసాలు విలువ కట్టలేని కవితా సంపదని పంచి పెడతాయి.  ఇవి కాక కౌముది అంతర్జాల పత్రికలో 2007 నుండి 2008 వరకు 'మంచి కవితతో కాసీపు' అనే శీర్షిక కింద వచ్చిన మరో 22 వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ప్రచురించ బడ్డాయి. ప్రతి వ్యాసం చివర, విశ్లేషించబడిన కవితను ఇవ్వడం వల్ల పాఠకుడు వెతుక్కోనక్కర లేదు.  చిన్న చిన్న వ్యాసాలు చక్కగా సులభమైన రీతిలో సూక్ష్మంగా మనముందుంచుతారు రవి గారు.  

 

ఇంత మంచి పుస్తకాన్ని ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ వారిని అభినందించక తప్పదు.  కవిత్వంపై అభిమానమున్నవారు, కవిత్వం రాయాలనుకునే వారు, ఈ పుస్తకం తప్పక ఒక రిఫరెన్స్ గా చదువుకోవాల్సిందే.  

 

పుస్తకం ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే.  పుస్తకానికి తగ్గట్టుగా కవర్ డిజైన్ చేసిన రమణజీవి గారిని మెచ్చుకోవాలి.   ప్రతులకు అమెరికాలో వంగూరి ఫౌండేషన్ వారిని (vangurifoundation@gmail.com), ఇండియాలో వంగూరి ఫౌండేషన్ (ramarajuvamsee@yahoo.co.in) కాని జేవీ పబ్లిషర్స్ ను కాని (jyothivalaboju@gmail.com), సంప్రదించండి.  

 

రెండో పుస్తకం 'అమెరికా తెలుగు కథానిక - 13వ సంకలనం.  ఈ సంకలనంలో 37 కథలున్నాయి.  అందరూ అమెరికా కథకులే (మళ్ళీ చెప్పాలా?).  అమెరికా తెలుగు కథకులకి వంగూరి గారు ఇచ్ఛే ఒక పీఠం ఈ పుస్తకం.  ఫౌండేషన్ ప్రచురించిన పదమూడు సంకలనాలూ ఎందరో అమెరికాలో స్థిరపడిన తెలుగు రచయితలకి, రచయిత్రులకి ఒక గుర్తింపు, ఒక స్థానం కలిగించాయనడంలో సందేహం లేదు.  పేరుపొందిన రచయితల దగ్గరనించి కొత్త రచయితల వరకు అందరిని ప్రోత్సహిస్తూ చేస్తున్న కృషిలో ఈ ప్రచురణ ఒక భాగం.  

 

ఇది వివిధ రచయితల సంకలనం కాబట్టి, సంపాదకుల ఆలోచనలను ఇక్కడ పాఠకుల ముందుంచడం ధర్మం.  సంపాదకుల ఉవాచలో మాట్లాడుతూ చిట్టెన్ రాజు గారు 'వైవిధ్యమైన ఇతివృత్తాలతో, తమదే అయిన శైలితో రచించిన ఈ కథలు ఈనాటి అమెరికా తెలుగు కథ పరిణితికి అ​ద్దం పడుతున్నాయి' అని అంటారు.  అమెరికా రచయితలగురించి మాట్లాడుతూ శంకగిరి నారాయణ స్వామి గారు 'మంచి కథకుండే లక్షణాలు క్షుణ్ణంగా తెలియడంతో బాటు, కథని సమర్థవంతంగా ఎలా చెప్పాలో కూడా తెలుసుకున్న తరం వీరిది' అన్నారు.  అంతే కాదు, ఈ సంకలంతో అమెరికా తెలుగు కథ తరుణ వయస్సుకు చేరిందని అనిపిస్తోందని రాసారు.  

 

ఇది 37 కథల సంకలనం.  సాయి బ్రహ్మానందం గొర్తి, చంద్ర కన్నెగంటి, నారాయణ స్వామి, చిట్టెన్ రాజు, వేమూరి వెంకటేశ్వరరావు, సత్యం మందపాటి, మధు పెమ్మరాజు లాంటి హేమా హేమీ లతో పాటు, ఎందరో కొత్త రచయితలకు ఈ పుస్తకంలో చోటివ్వడం గమనార్హం.  అయితే ఈ పుస్తకం కేవలం మంచి రచయితల కథలే ప్రచురించకుండా 'అమెరికాలోని కొత్త, పాత రచయితలందరి కథలు' ప్రచురించారనే విమర్శ రావచ్చు.  ఈ కథల సంపుటి కేవలం అమ్ముకుని సొమ్ము చేసుకో గలిగేటట్లు అయితే ఒక పది పదిహేను కథలు మాత్రం ప్రచురించితే సరిపోతుందా?  అసలు ఎవరి కథలు ప్రచురించిన పుస్తకాలు కొనే చదివేవారెంతమంది?  వంగూరి ఫౌండేషన్ ఆశయం డబ్బు చేసుకోవడం కాదు (చేసుకో లేరు కూడా).  ధనాన్ని, కాలాన్ని వెచ్చించి ప్రచురించబడ్డ ఈ పుస్తకం ముందరలో చెప్పినట్లుగా అమెరికాలోని కొత్త పాత రచతలకు ఒక పీఠం వేయడమే ఆశయం, ఆదర్శం.  మంచి కథలు ఇవ్వడంతో పాటు, మంచి కొత్త రచయితలను కూడా తయారు చేయగలిగే ప్రయత్నమిది.  

 

తప్పక చదవండి.  నారాయణ స్వామి గారు చెప్పినట్లు, సైన్స్ ఫిక్షన్ దగ్గరనుంచి ఆధ్యాత్మికత వరకూ ఎన్నో కథా వస్తువులను ఆధారంగా చేసుకుని రాసిన కథా సంపుటి ఇది.  తెలుగు గ్రామీణ జీవితం నుంచి అమెరికా జీవన విధానం వ్యక్తీకరించే డయాస్పోరా కథలు, ఎన్నో, ఎన్నెన్నో.  అమెరికా అయినా తెలుగు దేశమే అయినా మనుషులు, మనసులు ఒక్కటే అని సున్నితంగా చెప్పే కథలూ... 

 

ఫౌండేషన్ వారి 68వ ప్రచురణ ఈ పుస్తకం. మూడు వందల ఎనభై ఆరు పేజీలున్న ఈ పుస్తకం ధర కేవలం 200 రూపాయలు మాత్రమే.  .   ప్రతులకు అమెరికాలో వంగూరి ఫౌండేషన్ వారిని (vangurifoundation@gmail.com), ఇండియాలో వంగూరి ఫౌండేషన్ (ramarajuvamsee@yahoo.co.in) కాని జేవీ పబ్లిషర్స్ ను కాని (jyothivalaboju@gmail.com), సంప్రదించండి.

1
bottom of page