MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.
మనుచరిత్రము – పరిచయము
ఇదివరలో బాలాంత్రపు వేంకటరమణ గారు రాసిన ‘తెలుగు పద్య మధురిమలు’ చదివిన పాఠకులెవరికైనా, ఆయన కలంనుంచి మరో పుస్తకం అంటే ఇట్టే అర్థమైపోతుంది, మరి ఆపుస్తకం గురించి వాళ్ళకి పరిచయం అనవసరం. మన తెలుగు పద్యాలు చాలా ఇంపుగా, సొంపుగా, ఉంటాయి. పద్యంలో కవి రాసిన పదాలు సాధారణ పాఠకుడికి కొన్ని అర్థమౌతాయి, చాలా అర్థమవవు. ఒకప్పుడు ఏమో గాని, ఇప్పటి సగటు పాఠకుడికి వచ్చిన తెలుగు పదజాలం తక్కువనే చెప్పాలి. పద్యాలలో కేవలం పదాలే కాదు, కవి చెప్పే, చెప్పాలనుకునే భావాలు, తెచ్చిన సందర్భాలు, నర్మగర్భితమైన అర్థాలు, చమత్కారాలు, ఎన్నో ఎన్నో ఉంటాయి. మనుచరిత్ర అనంగానే మనకు గుర్తుకొచ్చేది ప్రవరాఖ్యుడు, వరూధిని. ఏదో అర్థమయినట్లుగా ముసి ముసి నవ్వులు నవ్వుకుండేవాళ్ళెంతమందో ఉంటారు. అయితే, ఆ కథేమిటి, అల్లసాని పెద్దన గారు పద్యరూపంలో చెప్పిన ఆ పదాలకు అర్థమేమిటి, వాటిలో సొగసులేమిటి అనేవి ఎవరో చెబితే కానీ, చాలా మందికి తెలియదు.
వేంకటరమణ గారు అంతకు ముందు అందించిన ‘తెలుగు పద్య మధురిమలు’ పుస్తకంలో ఎన్నో పద్యాల్ని విశదీకరించి చెబుతూ ఎలా ఆస్వాదించాలో నేర్పించి పాఠకుల ప్రశంసలను పొందారు. ఆ స్పందనతోనే అందించినది ప్రస్తుత పుస్తకం ‘మనుచరిత్రము – పరిచయము’. ఆయన చేసిన ఈ చిన్ని పరిచయం ఒక క్రమంలో అందరికీ అర్థమయేలా, సరళమైన భాషలో – అంటే పెద్దన రాసిన శైలికి విరుద్ధంగా అనే చెప్పాలి మరి – ఉంటుంది. పుస్తకానికి ముందుగా ఆయన రాసిన ‘చిన్న మనవి’లో భేతవోలు రామబ్రహ్మం గారు ‘సంభాషణా శైలిలో ఆధునిక పాఠకుడి అభిరుచికి సరిపోయేటట్టు విశదపరచి, అవగాహన శక్తిని, అభ్యాసాన్ని పెంపొందించే నూత్న ప్రక్రియ ‘పాఠకమిత్ర’ ని - అంటే reader-friendly అన్నమాట – ఆయన రాసిన ‘పద్య కవితాపరిచయం-1’ లో ప్రవేశపెట్టారని, తాను కూడా అదే బాటలో నడిచి ఆ పద్ధతిని అనుసరించారని చెబుతారు.
పుస్తకంలో రాసిన క్రమం చూస్తే, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దనామాత్యుల కాలం, ఆ కాలంలో పెద్దన గారు రాసిన వివిధ రచనలతో పాటు మనుచరిత్ర కూడా రాశారన్న ఉపోద్ఘాతంతో మొదలవుతుంది. తరువాత అల్లసాని వారి కవిత్వంలోని గొప్పదనం, దానికి రాయలవారి గుర్తింపు, మనుచరిత్ర రాయడానికి నాందీవచనం పలికిన పరిస్థితులు చెప్పారు. తరువాత సంగ్రహంగా మనుచరిత్ర కథని చక్కగా పాఠకుల ముందుంచారు. దాని తరువాత పెద్దన గారి ‘పద్యాల సొబగులు’ అన్న శీర్షికలో మచ్చుకి కొన్ని పద్యాలు తీసుకొని వాటి అర్థంతో పాటు ప్రత్యేక వివరణలు, ఆ పద్యాల సందర్భంలోని కథలు ఎంతో విపులంగా, పాఠకులు పద్యాన్ని చదివి ఊహించలేని సందర్భాలను చెప్పారు రమణ గారు.
ఇంత ఉపోద్ఘాతం తరువాత అసలు ప్రబంధం పాఠకులకు అతి సులభమైన శైలిలో, ప్రబంధంలోంచి తానెంచుకున్న కొన్ని పద్యాలు వివరిస్తారు. అంత వివరణ చదివినప్పుడు తెలుస్తుంది ఆ పుస్తకంలోని గొప్పదనం – ఎన్ని సందర్భాల వివరణ, ఎన్ని కథల నేపథ్యం పెద్దన గారి మనుచరిత్రకు ఆలవాలమయినాయో.
మనుచరిత్ర గురించి తెలుసుకోవాలన్నా, పెద్దన గారి కవిత్వపు లోతులు అవగాహన చేసుకోవాలనే ఆలోచన వున్నా, అవేమీ లేకపోయినా, ఈ పుస్తకం చదవాల్సిందే.
మొట్టమొదటి పేజీలోనే తను రాసిన పుస్తకానికి మూలమయిన మూడు పుస్తకాలు ఏవేమిటో చెప్పారు రమణ గారు.
‘మన భాష యొక్క ఔన్నత్యాన్ని మనమందరం ఆస్వాదిద్దాం, పంచుకుందాం, ముందు తరాలకి అందిద్దాం’ అనే రమణ గారి గొప్ప ఆశయం తప్పక నెరవేరుతుందని ఆశిస్తాను.
అందమైన ముఖచిత్రంతో వెలువడిన ఈ పుస్తకం ప్రచురించిన వారు జెవి పబ్లికేషన్స్ వారు. ప్రతులకు జ్యోతి వల్లభోజు గారిని సంప్రదించవచ్చు. పుస్తకం వెల 150.00 రూపాయలు.
ముక్తకాలు
ముక్తకం అంటే గూగుల్ ఆన్లైన్ తెలుగు-ఇంగ్లీష్ డిక్షనరీలో హైకు అని వచ్చింది. రచయిత వారాల ఆనంద్ గారు రాస్తూ ముక్తకాలంటే, భావం పాఠకుల స్పందనకే వదిలివేస్తూ, జీవిత సత్యాల్ని పాఠకుల ముందుంచే ముత్యాలంటారు. ‘అల్పాక్షరాలలో అనంతార్థం ఉండి, అత్యద్భుత కవితా శిల్పం నిక్షిప్తమై జాతి ముత్యంగా ప్రకాశించింది ముక్తకం’ అంటారు హాలుని గాధాసప్తశతి ఉదాహరణగా పేర్కొంటూ.
మరి ఆనంద్ గారు రాసిన ముక్తకాలు హైకూల లాగానా అంటే అలా అక్షర ప్రణామంలో కనిపించలేదు. కానీ అవి సూక్ష్మంగా, సున్నితంగా వ్యక్తం చేయబడ్డ రెండు వరుసల పదాల కూడికగా రాసిన ఒక సాహితీ ప్రక్రియ.
తెలుగులో ఆనంద్ గారెచే రాయబడ్డ ముక్తకాలను అనురాధ బొడ్ల గారు ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఒకదాని క్రింద ఒకటి (ముందు తెలుగు, దాని క్రింద ఆంగ్ల అనువాదం) పేర్చి, పేజీకి ఒక ముక్తకం చొప్పున అందించబడ్డ పుస్తకం ఇది. మూలం, అనువాదం ఒకదాని కింద ఒకటి వుండడంతో మూలం యొక్క భావం, ఆ భావాన్ని అనువాదం ఎంతవరకు దానికి న్యాయం చేకూర్చింది అన్నది సులభంగా తెలుస్తుంది. మూలం, అనువాదం, రెండూ పక్క పక్కనే ప్రచురించిన పుస్తకాలను నేను అతి తక్కువగా చూశాను. వాటిలో ఇదొకటి.
పుస్తకంలో ఉన్న పరిచయాన్ని బట్టి వారాల ఆనంద్ గారు తెలుగు సాహిత్య ప్రపంచంలో స్థిరపడ్డ ఒక కవి, విమర్శకుడు, డాక్యుమెంటరీ సినిమా నిర్మాత. అనురాధ గారు ఒక విద్యావేత్త, శిక్షకురాలు, అనువాదకురాలు.
ఇక పుస్తకానికి వస్తే, నూట ఇరవై తొమ్మిది ముక్తకాలున్నాయి ఈ పుస్తకంలో.
“గాలి కడలికకో ఆకు సవ్వడికో ఏకాగ్రత చెడితే
నేరం మనసుదే, గాలినో ఆకునో నిందించకు”
When a gentle wind or crackling leaf disturbs your focus
Never blame the wind or a leaf, your mind is at fault
అన్న ముక్తకంతో మొదలౌతుంది పుస్తకం. ప్రేమ, స్నేహం, మానవ నైజం మీద నడుస్తూ, మనసుల్నితాక గలిగే శక్తి ఉన్నవీ ముక్తకాలు. కొన్ని ఆగి ఆలోచింపచేసేవి. ప్రేమంటే ‘ఇవ్వడమే’ తెలిసిన రహదారి అంటారు రచయిత. ‘ఈ రాత్రి మరీ చీకటిదయి పోయింది, గది మరీ నిశ్శబ్దమయి పోయింది, కళ్ళు మూసుకుని మనసు తెరుచుకుని వుండిపోయా, ఒంటరితనం మరీ ఒంటరిదయి పోయింది’ అన్న ముక్తకం చదివినప్పుడు రవీంద్రుడి గీతాంజలి గుర్తుకొచ్చింది, ముఖ్యంగా చలం అనువాదాలు. రచయిత రవీంద్రనాథ్ లాంటి వారి కవిత్వం చదువుతూన్న కాలంలో తానెన్నో ముక్తకాలు రాసానన్నారు. ఎవరివో రాసినవి చదువుతూ స్పందించడం తప్పు కాదు భావాలు తనవే అయినప్పుడు ఒరవడిలో అనుకరణ ఉండడం సహజం. మరొకటి...
సగం ప్రశ్న సగం జవాబు సగం నిద్ర సగం మెలకువ
హారంలో దారంలా కాలం అల్లుకుంటూనే ఉంటుంది
చాలా ముక్తకాలు బాగున్నాయి. రచయిత ఆశించినట్లు కొన్ని క్షణాలు ఆగి ఆలోచింపచేసేవిగా ఉన్నాయి చాలా. అన్నీ చదివించేవి, అనుమానంలేదు.
ఇక అనువాదాలకి వద్దాం. చాలామంది చేసే అనువాదాలు ఏ భాషా చదువరిని దృష్టిలో పెట్టుకుని అనువదిస్తారో తెలియదు. నా పరిశీలనలో అనువదించేవారు తమ సంతృప్తి కోసమే రాసుకుంటారేమో అనిపిస్తుంది. ఇంగ్లీషులో చదువుతున్నపుడు, ఈ ముక్తకాలు కూడా అలాగే అనిపించింది. అలా అని అనురాధ గారు చేసిన అనువాదాల్ని తక్కువ చెయ్యడం కాదు తప్పని అనడం కాదు. కానీ మక్కీకి మక్కీ గా, తెలుగులో ఆలోచిస్తూ, ఆంగ్ల కవితల శిల్పాన్ని గుర్తించలేదేమోనన్నఅనుమానం రాక తప్పదు. కొన్ని అనువాదాలు బాగున్నాయి.
పుస్తకం ముఖచిత్రం మీద, మొదటి పేజీలోను, ‘ముక్తకాలు, ఆనంద్, అనువాదం అనూరాధ బొడ్ల’ అని రాసినప్పుడు, పుస్తకంలో ఆనంద్ గారు మరే భాషలోనో రాసిన వాటిని అనూరాధ గారు తెలుగులోకి అనువదించారేమో అని కొంచెం కన్ఫ్యూస్ అయ్యాను. కొంచెం లోపలికెడితేకాని తెలియలేదు. తెలుగు మూలం, ఆంగ్లానువాదం అని రచయితల పేర్లు రాస్తే బాగుండేదేమో!
Prose Poetry Forum, కరీంనగర్, తెలంగాణా వారు ప్రచురించినదీ పుస్తకం. అన్నీ లీడింగ్ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతుంది. భారత దేశంలో పుస్తకం వేల రూ. 125, బయట $7.
కంచికి వెళ్ళకూడని కథలు
కల్లూరి శ్యామల గారు ఆప్యాయంగా మూడు పుస్తకాలు పంపించారు ఇండియా నుండి. వాటిల్లో ఆవిడ రాసిన కథల పుస్తకం, ఫిబ్రవరి, 2019లో ప్రచురించబడ్డ ‘కంచికి వెళ్ళకూడని కథలు’ ఒకటి. పుస్తకం పేరు చూసినప్పుడు అర్థం కాలేదు దాని భావమేమిటో. తన కథల ప్రపంచాన్ని గురించి రాస్తూ, శ్యామల గారు “అన్ని మంచి కథలు కంచికెళ్తాయని మన వాళ్ళంటారు. ఈ కథలు మాత్రం కంచికెళ్ళకూడదని పాఠకులని వెంటాడి ఆలోచింప చేయాలని నా కోరిక.” అంటారు. మంచి ఆలోచన. శ్యామల గారు కథా రచయిత్రి మాత్రమే కాదు, తెలుగు రచనలను కొన్ని ఆంగ్లభాషలోకి అనువదించారు కూడా. “సాహిత్య ప్రపంచం పెద్ది. అభిలాష వుండాలేగానీ ఎల్లలు లేని, అరమరికలు లేని ఒక అద్భుతమైన అపురూపమైన ప్రపంచం.” అన్న ఆవిడ దృక్పథం కూడా అంత విశాలమైనదే!
ఈ కథా సంకలనంలో పన్నెండు కథలున్నాయి. కథలకు ఎన్నుకున్న ఇతివృత్తాలు బాగున్నాయి. సాధారణంగా అన్ని కథలలోనూ చివరలో ఒక సందేశం ఇవ్వడానికి ఎన్నుకున్నారు రచయిత్రి. ‘అమ్మంటే అమ్మే’ కథలో అమ్మ చేసే పనులు ఒక్కోసారి ఏదో అనుమానాస్పదంగా ఉన్నా అవి పిల్లల బాగుకే అని నిరూపిస్తారు. ‘అమ్మ, అమెరికా పిల్లలు’ కథలో పిల్లలు అమ్మని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూడటం, చివరికి అమ్మ చేసిన త్యాగాన్ని, అమ్మకి కావలసిన స్వతంత్రాన్ని పిల్లలు గుర్తించడంతో కథ ముగుస్తుంది. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను ఎత్తి చూపించి ఆడపిల్లలు తమ ఆత్మ స్థైర్యాన్ని చూపిస్తూ తమకు మద్దతిస్తున్న ఉపాధ్యాయులు తల్లితండ్రులకు కృతజ్నతలతో ముగుస్తుంది ఇంకో కథ. అయితే సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నించలేదు రచయిత్రి. ‘పర్ఫెక్ట్ మాచ్’ అనే కథలో నలుగురు పెళ్ళి చేసుకోవాలనుకునే కుర్రాళ్ళ జీవితాల్లో ఆడపిల్లలతో వారి అనుభవాలు చెబుతూ చివరికి ఎవరెవరు ఎలా స్థిరపడ్డారు అన్నది రచయిత్రి చెప్పదల్చుకున్న విషయం. “ఇంతకీ పెళ్ళిళ్ళు స్వర్గంలో ముడిపడతాయోలేదో తెలియదు కానీ ఇలాతలంలో ఇన్ని వుచ్చులమధ్య ఇరుక్కుపోతే వివాహ వ్యవస్థ భారతీయ సంస్కృతికి వెన్నెముక అని మనం వాయించుకునే డబ్బాలు మూగబోయే సమాయమాసన్నమయింది. ఔరా కలికాలం” అని పాత్రల ద్వారా తమ అభిప్రాయం చెబుతారు. ఇంకో కథలో ‘ఎన్నో పెళ్ళిళ్ళలా ఈ పెళ్ళి కూడా ఒక జూదం. గెలుస్తామో లేదో తెలియని అంతంలేని ఒక మాయా జూదం.” అంటారు. రచయిత్రికి పెళ్ళిళ్ళమీద, అమెరికా పిల్లల తాలితండ్రుల మీద, ఉన్న కొన్ని అభిప్రాయాలు ఈ కథల ద్వారా వ్యక్తమయ్యాయేమో అనిపిస్తుంది – కథలు, రచయితల స్వంత జీవితాలు, వారి అభిప్రాయాలూ ఒక తాటిపై నడవాలని లేకపోయినా. కొన్ని కథలు కొంచెం పేలవంగా ఉన్నాయని చెప్పచ్చు, రచయిత్రి తాను చెప్పడల్చుకున్న విషయం పూరిగా చెప్పలేకపోయారేమో అనిపించింది. కథలు మరి కంచికి చేరతాయో లేదో పాఠకులే చదివి నిర్ణయించాలి.
నవచేతనా పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన ఈ పుస్తకం వెల నూరు రూపాయలు మాత్రమే. ప్రతులకు నవచేతన బుక్ హౌస్, హైదరాబాదు వారిని సంప్రదించండి.
అష్టావక్ర నాయికలు
టీవి సీరియళ్ళలో పుట్టిన ఎందరో నాయికలు ప్రీక్షకుల్ని ఎంత కలవర పరచినా వారు వాటిని చూడక మానరు. పాత్రల్లో నటనే చూస్తారో, నటీమణులు వేసుకునే నగలు చూస్తారో, కథనే ఫాలో అవుతారో, ముందుకి వెనక్కీ జూమ్ జామ్ చేసే కెమేరా ఫోకస్ మరోలోకంలోకి తీసుకు పోతుందో, ఏమో మరి. ఏమైనా పాత సీరియళ్ళు అవవు, కొత్తవి, ఇంకా కొత్తవి వస్తూనే ఉన్నాయి. తెలుగువాళ్లు తీసే సీరియళ్ళు అంత క్రూరంగా లేకపోతే, మన తమిళులవి ఉండనే ఉన్నాయిగా, చక్కగా డబ్బింగు చేసి తెలుగు ప్రేక్షకుల మీద ప్రయోగించడానికి! అయినా మనమేం తక్కువ తిన్నామా?
ఈ పుస్తకం పై నేపధ్యంతో టీవి సీరియళ్ళలో పుట్టిన నాయకామణులపై అత్తలూరి విజయలక్ష్మి గారు రాసిన ఒక వ్యంగ్య రచన. రచయిత్రి గురించి పెద్ద పరిచయం చెయ్యనక్కరలేదు. ఆవిడ రాసిన హాస్య, వ్యంగ్య రచనలు పాఠకులకు కొత్త కాదు. ఎన్నో కథలు, నవలలు, నాటికలు రాసి పేరు తెచ్చుకున్న విజయలక్ష్మి గారి రచనా విధానం గురించి చెప్పడం అనవసరం. ఆవిడ కలం నుండి వచ్చిన మరో హాస్య రచన ఇది.
సుబ్బలక్ష్మి వర్ధమాన రచయిత్రి. ఆవిడ భర్త బాలకృష్ణ మూల మూలలూ వెదికి పట్టుకున్న ఎన్ని పత్రికలకి కథలు పంపించినా ఒక్కటి కూడా ప్రచురించబడలేదు. చివరికి భర్త ప్రోత్సాహంతో టీవి సీరియల్సు రాయడానికి ఉపక్రమిస్తుంది సుబ్బలక్ష్మి. ఆవిడ సృజనాత్మకతతో, ప్రస్తుతం నడుస్తూన్న కథలననుసరిస్తూ అవిడ విజృంభిస్తుంది. పాత్రలు కథలో రచయిత్రితో స్పందన, ప్రతిస్పందన ఎంతో నవ్విస్తూ చెప్పిన సెటైర్ ఇది. కొత్త కొత్త పేర్లతో, ముఖ్యంగా స్త్రీ పాత్రలను తయారుచేసి టీవి ప్రేక్షకులపై వదిలే సుబ్బలక్ష్మి ప్రయత్నం చివరకు మన అదృష్టంకొద్దీ సఫలీకృతం అవదు. సుబ్బలక్ష్మి సృష్టించిన నాయికలు చుక్క, తాటకి, భీభత్స, భయంకరి, దుష్టవనిత, దుష్టిత, వన్నెల, నీచిత, వంచిత, పాపిత, జిత్తుకుమారి, ఇలా ఉంటాయి. ఇంకా ఆ పాత్రల లక్షణాలను కూడా మనం సులభంగానే ఊహించుకోవచ్చు.
సరదాగా చదువుకుంటూ, నవ్వుకుంటూ, కోరోనావైరస్ వల్ల గృహ నిర్భందంలో ఉన్న ఎవరైనా చక్కగా సమయం గడుపుకోవచ్చు.
విశాలాంధ్ర వారు ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు రూ. 120.
బాలవికాస్ కధలు .
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య ఆశీస్సులతో లేత వయసు బాలబాలికలకు ఉపయుక్తంగా ఉండే 'నీతి కధలు ' ' బాలవికాస్ కధలు ' ఆనే పేరుతో ముద్రించను సాహసించాను.మానవతా విలువలైన సత్య , ధర్మ ,శాంతి, ప్రేమ , అహింసలనూ , వాటి 108 ఉపవిలువలనూ చిన్నకధలద్వారా పసి బాలలకు అర్ధమయ్యే రీతిలో , వారి హృదయాల్లోకి చొప్పించడమే ఈ కధా కుసుమాల ధ్యేయం. నేటి సమాజంలో, విద్యా విధానంలో మానవతా విలువలను బోధించడం పాఠ్యప్రణాళికల్లో తగ్గిపోయింది. అందురీత్యా పాఠశాల చదువు, కళాశాల చదువు కేవలం పొట్టకూటి విద్యలకే పరిమితమై , సమాజం పట్ల తమ బాధ్యతను ఎరుక పరిచే విధానం లేకుం డా పోయింది. సమాజంలో జరిగే అనేక సంఘటనలు ఎంతో బాధాకరంగా ఉంటున్నాయి. దీనికంతా కారణం పసి వయస్సునుండే మానవతా విలువలనూ, సమాజం పట్ల తమ బాధ్యతలనూ , తల్లిదండ్రులను వృధ్ధాప్యం లో చూసుకోవలసిన విధానాన్నీ, పెద్దలనూ, అసహాయులనూ ఆదుకునే పధ్ధతినీ విద్యార్ధులకు తెలియజేయక పోడమే.
' మొక్కై వంగనిది మానై వంగునా?" కనుక చిన్నతనం నుండే పిల్లలకు మంచిని కధలద్వారా నేర్పాలనే ఉద్దేశ్యంతో , నిద్రించే సమయంలో తల్లి పిల్లలకు నీతికధలు చెప్తూ ఉంటే వారిమనస్సుల్లో అవి నిలిచిపోతాయి. అందునిమిత్తమై ఈ కధా సంపుటాలను ముద్రించే ధైర్యం చేశాను.
వీటిలో చిన్న కధలన్నీ విలువలతో కూడినవే!. ఉదా- మనసుంటే మార్గం, తల్లిప్రేమ, సాహసబాలిక, గౌతమ బుధ్ధుని ప్రేమ హృదయం,ఓర్పు, దనము,మంచి, త్యాగము,పరివర్తన,పిల్లలవిజయం,మేలుకొలుపు,శాంతికి చిరునామా, స్నేహ మాధుర్యం, నిస్వార్ధ సేవా మహత్తు ,ఎవరు త్యాగి, కర్మ ఫలం, కృతజ్ఞత, నిజాయితీ, హెచ్చ రిక అనే పేర్లతోనే , ఆ కధల్లో చెప్పనున్న నీతిని ఉటంకించడం జరిగింది. కధలను, మూడు భాగాలుగా 5నుండి 7 సం, వారికి, 8నుండి 10సం. వారికీ, 11నుండీ 13సం. వారికీ అంటే 1వ తరగతినుండీ 9 వతరగతి వరకూ వారి మానశిక, మేధ స్థాయికి అనుగుణంగా ప్రచురించడం జరిగింది.
500 కాపీలు సత్యసాయి సంస్థ పుట్తపర్తి, ప్రశాంతినిలయ ఆశ్రమంలో ఉంచగా సుమారుగా ఓక నెలలోనే అమ్ముడయ్యాయి. కనీసం ఒక్కరైనా ఈ కధా కుసుమాల వలన పరివర్తన చేందితే నా కృషి ఫలించినట్లుగా భావిస్తాను, అంతా భగవత్ కృప.
మధురవాణి సంపాదకులకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు.
ధన్యవాదాలతో,
ఆదూరి. హైమావతి శ్రీనివాసరావు.