top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

 పురాణం - పాట్ లక్ డిన్నరు

Syamala Dasika

శ్యామలాదేవి దశిక

ఏమిటీ....పద్మగారు నాకోసం ఫోన్ చేసారా?

“పాట్ లక్ డిన్నర్” కి మనం ఆవపెట్టిన అరిటికాయ కూర పట్టుకొస్తున్నామని, ఈ అగ్నిహోత్రానికి విరుగుడుగా ఆవిడని ఆనపకాయ పెరుగు పచ్చడి చెయ్యమని సలహా ఇచ్చారా?

ఇస్తారు...ఇస్తారు మీ సొమ్మేం పోయింది!  “పురాణం” పేరు పెట్టుకుని మీ మగాళ్ళందరూ వారానికో రోజు ఎంచక్కా పండగ చేసేసుకుంటున్నారు! రిటైర్మెంట్ పుచ్చుకుని ఇంట్లో గోళ్ళు గిల్లుకింటూ కూర్చున్న మీ అందరికీ మంచి కాలక్షేపం దొరికింది. “ప్రవచనం” పేరుతో అందరూ ఒకచోట చేరి ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ కలగలిపి మాట్లాడుకోటానికి బాగా అలవాటు పడ్డారు!

“గోవర్ధనం గారింట్లో ప్రతి వారం శ్రీనివాసశాస్త్రి గారు “పురాణం” పేరుతో  ఏవో మంచి విషయాలు చెప్తున్నారుట! మనమూ వెళ్దామోయ్” అని మీరంటే నా చెవులను నేనే నమ్మలేకపోయాను! రిటైర్ అయిన తర్వాత బుర్రలోనుంచి ఆఫీసు తాలూకు బూజు వదిలి, ఇన్నాళ్టికి మీరు కాస్త దోవలో పడుతున్నారని ఆనందపడ్డాను.

ఇక అక్కడినుంచీ ఎవరైనా “రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది?” అనడం ఆలస్యం, వెంటనే “ఇప్పుడు ఆర్ధిక చింతన వదిలేసి, ఆధ్యాత్మిక చింతనలో పడ్డాం మేము” అంటూ గొప్పగా చెప్పుకోడం! పాపం వినేవాళ్ళు నిజమే కామోసు అనుకుంటున్నారు. మీ “ఆధ్యాత్మిక” చింతనలో బ్రహ్మాండమైన కంపెనీ...కావలసినన్ని కబుర్లు..చక్కని ఎంటర్టైన్మెంట్....పసందైన విందుభోజనం ఉన్నాయని, పురాణం క్లాసుకు  వెళ్ళేది ఆ ఫ్రింజ్ బెనిఫిట్స్ కోసరం అని వాళ్లకేం తెలుసు?!

సత్యవతి గారు చెప్తున్నారు పురాణం గ్రూప్ లో చేరినప్పటినుంచి శర్మ గారిలో వచ్చిన మార్పు గురించి.

ఆయనకు ఆఫీసు పని తప్ప ఏ పని చెయ్యడం తెలీదని మనందరికీ తెలుసు. ఇంట్లో ఏం జరుగుతోందో ఏనాడు పట్టించుకునే వారు కాదు. స్టోరుకెళ్ళి ఓ కూర పట్రావడం కూడా తెలీదు. అన్నీసత్యవతి గారు చూసుకోవాల్సిందే. అలాంటి శర్మ గారు ఇప్పుడు బజారు నుంచి ఏమైనా కావాలా అని శ్రద్ధగా అడుగుతారుట. మూడు రోజులముందు నుంచే మొదలు పెడ్తారుట “పాట్ లక్ డిన్నర్” కి ఏం వండుతున్నావూ అంటూ.  ఏమి తెలియనట్టు మాటవరసగా “బంగాళాదుంప మసాలా కూర బావుంటుందేమో...మెరపకాయ బజ్జీలు అయితే అందరూ ఇష్టంగా తింటారేమో......బిరియానీ చేస్తే వెరైటీ గా ఉంటుందేమో” అంటూ ఎడ్వైజులు ఇవ్వడంట! ఈయనగారికి ఇంత శ్రద్ధ వచ్చిందేమిటీ అని సత్యవతి గారు ఒకటే ఆశ్చర్యపోయారుట! తీరా తెలిసిందేమిటంటే ఆయనకు ఇష్టమైనవి, ఆయన తినకూడనివి పాట్ లక్ డిన్నరు వంకతో చేయించుకుని హాయిగా ఎంజాయ్ చేస్తూ పైకి ఏమి ఎరగనట్టు నాటకాలాడుతున్నారని.

మగాళ్ళందరూ, మీ గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోడానికి ఈ “పురాణం క్లాసు” పర్ఫెక్ట్ అని చక్కగా కనిపెట్టేసారు.

మూడేళ్ళ నాడు గోపాలం గారు ఉన్నట్టుండి “నేను పురాణం క్లాసుకు సైన్ అప్ చేసాను” అని స్వర్ణ గారికి చెప్పారుట. ఇంకా ప్రాక్టీసులో ఉన్న స్వర్ణ గారు ఇదేదో బానే వుంది ఈ కారణంగా నన్నాఆయన  నాలుగు మంచి విషయాలు నేర్చుకుంటారని సంతోషించారుట. మొదలు పెట్టినప్పటి నుంచీ ఏ ఒక్క రోజు మానకుండా శ్రద్ధగా వెళ్లటం చూసి ఆశ్చర్యపోయారుట. పైగా “ఈ రోజు ఏకాదశిట...ఆ రోజు షష్ఠిట... వచ్చేవారం హనుమజ్జయంతిట అందుకని మన వంతుగా బెల్లంతో అప్పాలు..పాలతో వండిన పాయసం....నేతితో చేసిన గారెలు” అంటూ లిస్టు చదివేవారుట. ఆవిడ ఎంత బిజీగా ఉన్నా ఎలాగో అలా టైం చేసుకుని ఆయన అడిగినవి చేసి పంపిస్తూ వచ్చారుట. ఒకసారి అనుకోకుండా షాపింగ్ మాల్ లో పద్మగారు కనిపిస్తే “క్షీరాబ్ధి ద్వాదశికి ప్రసాదం చేసి పంపించలేకపోయాను” అంటూ స్వర్ణగారు క్షమాపణ చెప్పుకుంటుంటే పద్మగారు తెల్లబోయారుట!

అసలు సంగతి ఏమిటీ అంటే... శాస్త్రి గారు ప్రవచనం లో భాగంగా ఆరోజు ప్రత్యేకత గురించి, అలాగే రాబోయే పండగల గురించి... ఎలా ఆరాధన చెయ్యాలి? ఎటువంటి ప్రసాదం నివేదన చెయ్యాలి? ఆరోజు ప్రత్యేకంగా చేసే వంటకాలేమిటి...లాంటి విషయాలు  ప్రస్తావిస్తే, అందరూ అసలు పూజ వదిలేసి, పొట్టపూజ గురించి మాట్లాడుకోడంట. ! శాస్త్రిగారిని సాకుగా తీసుకుని అందరూ కూడబలుక్కుని “నేను ఇది తెస్తాను, నువ్వు అది పట్రా అంటూ ప్లాన్లు వేసుకోడంట! అంతేకాని పద్మగారు పాపం ఎప్పుడూ ఏదీ తెమ్మని అడగలేదట.

అసలు మీ మగాళ్ళందరికీ వయసు పైనపడుతున్నకొద్దీ జిహ్వ చాపల్యం ఎక్కువైపోతోంది.

“అమెరికా వచ్చినా ఆవకాయ మీద మోజు పోలేదన్నట్టు” అమెరికాలో ఇన్నేళ్ళబట్టీ ఉంటున్నా...ఇంత వయసొచ్చినా అచ్చతెలుగు భోజనం మీద ప్రీతి చావలేదు. మొన్న సమ్మర్ లో ఇండియా నుంచి శరత్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఇక్కడ ఉన్నన్నాళ్ళు, మీరందరూ ఆవిడ చుట్టూ చేరి మామ్మగారు....మామ్మగారు అంటూ “మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తోంది...మా దొడ్డమ్మ గుర్తుకొస్తోంది” అంటూ ఆవిడ చేత మీక్కావలసిన వన్నీ చేయించుకున్నారు. ఆవిడో పిచ్చి మాలోకం తల్లి!  ఎన్నో ఏళ్ళ కిందట దేశం వదిలి వచ్చినా, మీరందరూ ఇంకా మన సంప్రదాయపు వంటల్ని, ఆ పాత వంటకాల్ని మర్చిపోలేదని మిమ్మలందర్నీ చూసి ఒకటే ముచ్చటపడిపోయింది. ఉన్న నాలుగు నెలల్లో ప్రతివారం పెరుగు గారెలు..... బూరెలు....అప్పడాలపిండి...కాకరకాయ పిట్ల...సజ్జోప్పాలు...గుమ్మడి వడియాలు...ఊరుపిండి...బండ పచ్చడి...రోటిపచ్చడి... కొరివికారం..నా నెత్తికాయ అంటూ ఏదో ఒక స్పెషల్ అయిటం ఉండేది భోజనంలో!

ఏమిటీ... ఆ వంటలన్నీ తింటుంటే అందరికీ చిన్నతనపు రోజులు గుర్తుకొచ్చాయంటారా?      

మరే! “దేవుడి మీదకన్నా ప్రసాదం మీద భక్తి ఎక్కువ” అని, మీ అందరికీ అసలు పురాణం కన్నా ఫుడ్డు మీద ఇంటరెస్టు! క్లాసుకు అందరికంటే ముందుగా హాజరయ్యేది మన సుబ్బారావు గారు. ప్రతివారం ఓ సంచీ బుజానేసుకుని “టైము అయిపోతోంది, ఆలస్యంగా వెళ్తే బావుండదు...అందరూ వచ్చేస్తారు” అంటూ ఒకటే హడావిడిపెట్టేస్తారుట! సంచిలో పురాణానికి సంభందించిన పుస్తకాలేవో పెట్టుకుంటున్నారు కామోసు అని అనుకునేవారుట శైలజ గారు మొదట్లో. తీరా చూస్తే బ్యాగులో ఉన్నవి పుస్తకాలు కాదుట. రకరకాల సైజులో ప్లాస్టిక్ డబ్బాలుట.  తిరిగి వచ్చేటప్పుడు లెఫ్ట్ ఓవర్స్ లో తనకు ఇష్టమైనవి తెచ్చుకోడం కోసం చాలా భక్తిశ్రద్ధలతో వాటిని బ్యాగులో పెట్టుకుని మరీ వస్తారు మావారు అని శైలజ గారు నవ్వుతూ అంటారు!

అసలు మీరందరూ ఇంతగా రెచ్చి పోడానికి కారణం గోవర్ధనం గారు కూడా లేండి. అందరూ చేరేవాల్టికి చక్కగా ఏ మాయాబజారో...గుండమ్మ కథో....నర్తనశాలో రెడీగా పెట్టి ఉంచుతారు. లోపలికి అడుగు పెట్టటం ఆలస్యం అందరూ జన్మలో ఎప్పుడూ టీ వీ మొహమే చూడనట్టు కళ్ళింతలు చేసుకుని చూడటం. ఇక అక్కడ్నించి అందరూ కుర్రాళ్లయిపోయి యాభై ఏళ్ళు వెనక్కెళ్ళి  మిమ్మల్ని మీరే మర్చిపోతారు. హాస్టల్ గోడలు దూకి ఎవరు ఏ సినిమాలు ఎన్నేసి సార్లు చూసారో.... ఎవరు అక్కినేని ఫాన్ లో.... ఎవరు ఎన్టీఆర్ ఫాన్ లో.... క్రాపులు ఎలా దువ్వుకునేవారో...అమ్మాయిలు మీవంక ఎలా చూసేవారో, కళ్ళు ఎగరేసుకుంటూ చెప్పుకోడాలు! మీ అందరికీ తగ్గట్టే శాస్త్రి గారు! పురాణం చెప్పేటప్పుడు ఎంతో పెద్దమనిషి తరహాగా ఉండే శాస్త్రిగారు సినిమాలు..సంగీతం...రాజకీయాల దగ్గర కొచ్చేసరికి ఆయనా ఓ కుర్రాడైపోతారు. ఉన్నట్టుండి హుషారుగా “బావా ఎప్పుడు వచ్చితివి....జండాపై కపిరాజు “ అంటూ పద్యం అందుకోడం మీరందరూ ఒన్స్ మోర్ అనడం. పిల్లలకంటే అన్యాయం!

ఏమిటీ.... ఆడాళ్ళు మీరు మాత్రం తక్కువ తిన్నారా అంటారా?

మీరూ అన్నారు ఆ మాట?

మొన్న పద్మనాభం గారు కూడా ఇదే మాట అన్నారుట. శారదతో  “ఏం! మగాళ్ళం మేమేనా ఎంజాయ్ చేస్తున్నది మీరు చెయ్యట్లేదా? ప్రతి వారం చక్కగా  సింగారించుకుంటూ, గుమ్మంలో అడుగు పెట్టటం ఆలస్యం “మీ చీర బావుందంటే... మీ చీర బావుందంటు....ఈ నెక్లెస్ ఎప్పుడూ చూడలేదే..... కొత్తగా కొన్నారా? మీ గాజులు భలే మెరుస్తున్నాయే!.. దుబాయ్ లో కొన్నారా” అంటూ అందరూ అత్తగార్లు, అమ్మమ్మలు,. నానమ్మలు అయినా ఇంకా కొత్త పెళ్ళికూతుళ్ళల్లే మీరు మాట్లాడుకోడంలా? ఈ వారం అందరం ఈ రంగు చీరలు కట్టుకుందాం, ఈ వారం ఈ నగలు పెట్టుకుందాం అంటూ మీరు ప్లాన్లు వేసుకోడంలా? మొన్న దీపావళి పండక్కు మీ లేడీస్ అందరూ కలిసి కావాలని ఒకే రకం చీరలు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నారుగా?

అందరూ ఒకే రకం చీరలు కట్టుకుని, ఒకే రకంగా ముస్తాబై ముసిముసినవ్వులు నవ్వుకుంటూ సొంత అప్పచెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఒకరి బుజాలమీద మీద ఒకరు చేతులేసుకుని, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని రకరకాల భంగిమల్లో మాచేత అదేపనిగా ఫోటోలు తీయించుకుని ఫేస్ బుక్కుల్లో, వాట్స్యప్ లో పెట్టుకోలా?” నవ్వులు విరజిమ్ముకుంటూ..ఒయ్యారాలు ఒలకబోస్తూ మాకెవ్వరికీ మిగల్చకుండా కాకరపువ్వొత్తులు అన్నీ మీరే కాల్చారుగా?!  లొట్టలేసుకుని తింటున్నది మేమేనా? మీరు మాత్రం తినట్లేదా? పైగా అది ఒంటికి మంచిది, ఇది షుగర్ కి మంచిది అంటూ ఒకళ్ళకొకళ్ళు రెసిపీలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇంట్లో మామీద ప్రయోగాలు చెయ్యట్లా? “ అంటూ పాయింటు లేవదీసారుట పద్మనాభం గారు!

 

పైగా అంటారుట “అసలు ఇందులోతప్పేంటిటా ? ప్రవచనం పేరుతో “పుణ్యం-పురుషార్ధం” రెండూ సంపాదించుకుంటున్నాం. అల్లరిచేసినా, జోకులేసుకున్నా కాసేపేగా. పైకి నవ్వులు వినిపించినా నిజానికి ఎన్నో మంచి విషయాలు, అవసరమైన విషయాలు కూడా తెలుస్తున్నాయి కదా? టాక్స్ బ్రేకులు...సోషల్ సెక్యూరిటీ లో మార్పులు...లాంగ్ టర్మ్ ఇన్స్యూరెన్సు లు లాంటి వాటిమీద అభిప్రాయాలు, అనుభవాలు పంచుకుంటున్నా౦ కదా ? ఈ వయసులో ట్రిప్పుల కెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం కదా? నువ్వు కాశీ - రామేశ్వరం వెళ్ళాలన్నప్పుడు రెడ్డి గారు ఎన్ని ముఖ్యవిషయాలు చెప్పారు?  హెల్త్ ఇష్యుల గురించి అయితే అందరం ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నాం. నువ్వన్నట్టు వారానికి ఒక్క రోజు “పండగ” చేసుకుంటున్నాం. మంచిదేగా?! నలుగురం నాలుగు రకాలు తెచ్చుకుని, నలుగురితో పంచుకుంటున్నా౦. అంతకంటే కావలసింది ఇంకేముంది? భోజనాలకు ముందు కాసేపు మనం మాట్లాడుకునే విషయాలు, ఆ తర్వాత ఆధ్యాత్మిక పరంగా శాస్త్రిగారు చెప్పే విషయాలు అందరికీ మంచి “టానిక్” లాగా పనిచేస్తున్నాయి కదా” అంటూ ఆర్గ్యూ చేసారుట!

ఏమిటీ.... పద్మనాభం గారు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం అంటారా. అందరం కలిసి కాసేపు సంతోషంగా, సరదాగా గడపటం మన అందరి ఆరోగ్యానికి మంచిదంటారా?

నిజమేనండి! అందరం ఎక్కడెక్కడినుంచో వచ్చినా, ఏ రక్తసంబంధం లేకపోయినా అన్నదమ్ములకంటే ఎక్కువగా, అక్కచెల్లెళ్ళ కంటే ఎక్కువగా కలిసిపోయాం. ఏదో సరదాగా మీతో వాదించానే గాని ‘పురాణం” పేరుతో నలుగురిని కలుసుకోడం, నలుగురితో పంచుకోడం, నాలుగు మంచి విషయాలు తెలుసుకోడం నాక్కూడా బోలెడంత ఇష్టం!!   

అన్నట్టు చీర ఇస్త్రీ చేసుకోవాలండోయ్! ఈ వారం “చిలకాకుపచ్చరంగు” అనుకున్నాం!        

                                  

ఏమిటీ......అరిటికాయ కూరలో ఆవఘాటు అదిరిందంటారా?!!!

OOO

bottom of page