MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
ప్రేమించే మనసు
కొల్లిపర హితేష్
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ
బృందవిహార్ వర్శిటీ ఆడిటోరియం. స్నాతకోత్సవ సభ జరుగుతుంది.
“ఇప్పుడు మాట్లాడవలసినదిగా ప్రముఖ శాస్త్రవేత్త చైతన్యగారిని ఆహ్వానిస్తున్నాం. పది సంవత్సరాల పాటు నాసాలో పనిచేస్తూ అంతరిక్షం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్నో విశ్వ రహస్యాలను బయటపెట్టారు. ఇప్పుడు దేశంలో యువ శాస్త్రవేత్తలకి మార్గనిర్దేశం చేయాలనే గొప్ప ఉద్దేశంతో అక్కడ్నుంచి వచ్చేసి ఇస్రోలో చేరిన వారి దేశభక్తి అమోఘం. ఇటువంటి వ్యక్తి మన వర్శిటీ విద్యార్థి కావటం నిజంగా మనకి గర్వకారణం. చప్పట్లతో వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం” చెప్పగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది. చైతన్య పోడియం ముందుకొచ్చాడు. అంతలోనే అంతా నిశ్శబ్ధం.
“అందరికీ నమస్కారం! నిజానికి నేనే గర్వంగా ఫీలవుతున్నాను. నేను చదివిన వర్శిటికే చీఫ్ గెస్ట్ గా రావడాన్ని నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాను. ఈ వర్శిటీతో నాకు చాలా అనుబంధం ఉంది. చదువుతో పాటు జీవిత పాఠాలను కూడా నేను ఈ వర్శిటీలోనే నేర్చుకున్నాను. ముఖ్యంగా ప్రొఫెసర్ చొక్కలింగం గారు. సరైన సమయంలో వారు చేసిన మార్గనిర్ధేశం వల్లే ఇప్పుడు నేనీ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు వారు మన మధ్య లేకపోవచ్చు. కానీ వారి మాటలు, చూపిన దారి, వారి ప్రభావం నా మీద ఎప్పటికీ ఉంటుంది. నిజానికి......” మాట్లాడుతూ మాట్లాడుతూ ఠక్కున ఆగిపోయాడు చైతన్య. కారణం, వర్ష! ఎదురుగా జనాల్లో కూర్చున్న వర్షని చూసి ఆగిపోయాడు.
వర్ష? తన వర్ష! పన్నెండు సంవత్సరాల తరువాత చూస్తున్నాడు. తనేం మారలేదు. అలానే ఉంది. అవే కళ్ళు, అదే ముక్కు, అదే అందం. ఆహ్లాదకరమైన రూపం! అప్రయత్నంగా చైతన్య పెదాలపై చిరునవ్వు విరిసింది. ఆమె కూడా తననే చూస్తుంది. ఇక మాట్లాడలేకపోయాడు. ఎలాగోలా స్పీచ్ కానిచ్చి వెళ్ళి కూర్చుండిపోయాడు. ఫంక్షన్ జరుగుతున్నంత సేపు ఆమె జ్ఞాపకాలే. మరో గంటన్నరకి ఫంక్షన్ ముగిసింది.
“ఎలా ఉన్నావు?” ఆడిటోరియం బయటికొచ్చాక వెళ్ళి పలకరించాడు.
“నువ్వు ఎలా ఉన్నావు?” అడిగింది. తలాడించాడు చైతన్య.
“చాలా ఎదిగిపోయావు” అంది. నవ్వాడు.
“ఇక్కడ నువ్వూ...” అడిగాడు.
“సైన్స్ టీచర్” చెప్పింది.
రెండు నిమిషాలు ఇద్దరిమద్యా మౌనం.
“ఇంకా... ఏంటి సంగతులు?” తనే మౌనాన్ని భగ్నం చేశాడు.
“ఏముంది. నువ్వే చెప్పాలి”
“అమ్మానాన్నలు ఎలా ఉన్నారు?”
“నాన్న చనిపోయారు. అమ్మ నాతోనే ఉంటుంది”
“అవునా... ఐ యామ్ సారీ. మరి పర్సనల్ లైఫ్? భర్తా... పిల్లలు! ఇంతకీ పెళ్ళి చేసుకున్నావా?”
“పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉంటాను? ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పెద్దవాడికి ఏడు సంవత్సరాలు. తరువాత ఇద్దరు కవలలు. ఆడపిల్లలు. ఐదు సంవత్సరాలు. ఆయన ఐఓసిలో చేస్తారు”
“దట్స్ గ్రేట్! అయితే సంతోషంగానే ఉన్నావన్నమాట”
“అవును సంతోషంగానే ఉన్నాను”
మళ్ళీ మౌనం. ఈసారి మాట్లాడలేదు చైతన్య. ఆమె ఏమన్నా అడుగుతుందేమోనని చూశాడు. కానీ ఏం అడగట్లేదు. రెండు నిమిషాల తరువాత మాత్రం మాట్లాడింది.
“సరే! పిల్లలు వచ్చే టైమ్ అయింది. ఇంటికి వెళ్ళాలి” అంది. చిన్నబోయాడు.
“సరే” అన్నాడు. వర్ష వెళ్ళిపోయింది.
కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు చైతన్య. ఈ వర్శిటీలో చదివే రోజుల్లోనే వర్షతో పరిచయమైంది. ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అప్పుడు గలగలా మాట్లాడేది. మరి ఇప్పుడో? పొడిపొడిగా! ఆ రెండు సంవత్సరాలు ఆమె పంచిన అనుభూతులు, చూపించిన ప్రేమ ఇప్పటికీ తను మర్చిపోలేదు. ఆఖరికి ఆమెతో విడిపోయిన రోజు జరిగిన సంఘటనతో సహ..
“ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు”
“కొత్తగానా?”
ఆమె పలకలేదు.
“అంటే ఈరోజు గెడ్డం గీసుకున్నాను. చేతికున్న గోల్డ్ ప్లేటెడ్ వాచ్ తీసేసి డిజిటల్ వాచ్ పెట్టుకున్నాను. అందుకేనేమో...” చెప్పాడు చైతన్య. దానికీ ఆమె మాట్లాడలేదు. నడుస్తుంది. పక్కనే అతడూ నడుస్తున్నాడు.
“ఈరోజు ఏంటి స్పెషల్? ఎక్కడికన్నా వెళ్దామా... నాతో వస్తావా? ఎక్కడికో నువ్వే చెప్పు” అడిగాడు.
“ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావు?” ప్రశ్నించింది.
“నీకోసమే. నీతో మాట్లాడటానికి. నాకు నమ్మకం ఉంది, ఈరోజు మనం మనసు విప్పుకొని మాట్లాడుకుంటే మన మధ్య వచ్చిన గ్యాప్ ఫిల్ చేసుకోగలమని”
“ఇప్పటికే ఆలస్యం అయిపోయింది చైతన్య”
“ఒక్క గంట నాకు సమయం కేటాయించి నాతో రాలేవా వర్షా?”
“నేనూ అదే అనుకునేదాన్ని, రోజు మొత్తంలో ఒక్క గంట అతడు నాకోసం సమయం కేటాయించలేడా అని. ఎన్నో సాయంత్రాలు నువ్వు వస్తావని ఊహించా. నీ చేతిలో నా చేయి ఉంచి ఒక్క పదడుగులైనా నడవాలని ఆశపడ్డా. నీ నుంచి ఒక్క మెసేజ్ రాకపోతుందా అని ఎన్నో వందలసార్లు నా ఫోన్ వంక చూశా. నేను అలసిపోయా చైతన్య”
“అవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా? అయినా నా పరిస్థితి గురించి నీకు తెలియదా? పోనీ ఎప్పుడైనా నిన్ను నేను తేలిగ్గా తీసుకున్నానా? గత పదిహేనురోజులనుంచే నీలో మార్పు వచ్చింది. ఇలా మాట్లాడుతున్నావు. ఏంటి అసలు విషయం?”
“అసలు విషయం అదే. నేనూ ఒప్పుకుంటాను, అవన్నీ చేస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదని. కానీ అవి కూడా ప్రేమలో ఒక భాగమే. అది నీకు అర్దంకావట్లేదు. ఇన్నాళ్ళు నీకు అనుకూలంగా ఉండాలని నేను నా చిన్నచిన్న ఆశలని చంపుకున్నాను. ఇప్పుడు ఉండలేకపోతున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది”
“భయమా!...”
“గత పదిహేనురోజులుగానే అంటున్నావు. కానీ ఇది పదిహేనురోజుల క్రితానిది కాదు. మన ప్రేమ మొదలైనప్పట్నుంచి ఉన్నదే. తెలిసాక కూడా మనం కలిసి జీవించాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. జీవితాంతం ఇద్దరం క్షోభ అనుభవించాలి”
“భయం! క్షోభ! ఎందుకు ఇలాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయినా రెండు సంవత్సరాలు కలిసి తిరిగిన తరువాత ఇప్పుడు తెలిసి వచ్చిందా?”
“ముందే తెలిసింది. కానీ పట్టి ఉంచాను. అది కూడా నువ్వు బయటపడ్డాకే నేను బయటపడుతున్నాను”
“నేనేం బయటపడ్డాను?”
“ఇక వాదించుకోవడం అనవసరం వదిలేసేయ్. ఆటో....” ఆటోని పిలిచింది. ఆటో వచ్చింది. ఆమె ఎక్కింది. చైతన్య ఆమెనే చూస్తున్నాడు.
“ఒక్కసారి ఆలోచించు. ఇది నీకు నువ్వో, లేక నువ్వు నాకో వేస్తున్న శిక్ష కాదు. నువ్వు మన ప్రేమకి వేస్తున్న శిక్ష” అన్నాడు.
“ఇది ముగిసిపోయింది చైతన్యా. నేను ఈ రాత్రికి మైసూర్ వెళ్ళిపోతున్నా” చెప్పింది.
“తెలిసింది. ఒక్క మాట నాకు చెప్పాలనిపించలేదా? వేరే వాళ్ళ చేత చెప్పించావు”
“ఆ ఉద్దేశం ఉంటే అసలు వాళ్ళ చేత కూడా తెలియపరిచేదాన్ని కాదు”
“నేను మారాను వర్షా. ఇంకా మారతాను కూడా. అందుకే నీకు నచ్చినట్టుగా తయారయ్యి వచ్చా. ఇక నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తా” అర్థిస్తున్నట్టుగా అన్నాడు.
“ఆహార్యం మార్చుకున్నంత తేలిగ్గా ఆలోచనలు మార్చుకోలేం చైతన్యా. మనసుకి ముసుగు తొడగాలని ప్రయత్నించకు. నీ అభిప్రాయాలు వేరు, నా ఆలోచనలు వేరు. నా ప్రపంచం చిన్నది. నీ ప్రపంచం విభిన్నమైనది. నీ ప్రపంచం నా ఆలోచనలకి అందనిది. నువ్వు నీలాగే ఉండు. అదే నీకు, నాకూ కూడా మంచిది. ఒక మంచి స్నేహితురాలిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే” చివరి మాటలు అస్పష్టంగా వినిపించాయి చైతన్యకి. స్నేహితురాలిగానా!?.....
“నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నావో నాకు ఇంకా అర్దంకావట్లేదు. నేనేం బయటపడ్డానో నాకు తెలియట్లేదు. నేనేమైనా తప్పు చేసి ఉంటే చెప్పు, సరిదిద్దుకుంటా. నాకు నీకన్నా ఏది ముఖ్యం కాదు. ఒక్క అవకాశం ఇవ్వు” చివరి ప్రయత్నంగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆటో బయల్దేరిపోయింది.
చైతన్య అటువైపే చూస్తున్నాడు. అమెకోసం అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. అతడికి బాసటగా కరిగి ప్రకృతి కూడా వర్షించడం ఆరంభించింది. కానీ ఆమె మనసు ఎందుకు కరగడం లేదో అతడికి అర్దం కావట్లేదు. కదల్లేక అలానే నించుండిపోయాడు. నిమిషాలు గడిచాయి. వెనుక నుండి ఎవరో చేయి వేయడంతో స్పృహలోకి వచ్చాడు. తిరిగి చూస్తే ఎదురుగా అతడి ప్రొఫెసర్ చొక్కలింగం. వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు.
“సార్ మీరు ఇక్కడా?...” మాటలు రాలేదు చైతన్యకి.
“ఈరోజు నువ్వు నా క్లాస్ అటెండ్ చేయలేదు?”
“సార్ అది...” నసిగాడు.
“పోయిన సెమిస్టర్ లో నువ్వు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చావు. మరి ఈసారి?”
“ఖచ్చితంగా టాప్ చేస్తాను సార్”
“ఖచ్చితంగా టాప్ చేయవు. నేను ఇప్పుడు నీ పేపర్నే వాల్యూ చేసి వస్తున్నాను. కష్టపడి పాస్ మార్కులు వేసి వచ్చాను. అలాంటిది నువ్వు టాప్ ఎలా చేస్తావు?”
“సారీ సార్!” తలదించుకున్నాడు చైతన్య.
“ఏంటి చైతన్య ఎందుకు ఇలా మారిపోయావు? ఇదివరకు ఎలా ఉండేవాడివి? ఇప్పుడెలా ఉంటున్నావు? జూనియర్ ప్రొఫెసర్లకి పాఠాలు చెప్పే స్థాయి నీది. నీ శక్తి నీకు తెలీడం లేదు. దేవుడు నీకు గొప్ప మేధస్సును ఇచ్చాడు. ఇదివరకు ప్రతిరోజూ నా దగ్గరికొచ్చి ఏదొక కొత్త ఆలోచన పంచుకునేవాడివి. ఇప్పుడు కనీసం క్లాస్ కూడా అటెండ్ చేయలేకపోతున్నావు. నాకు తెలిసి ఇదే మొదటిసారి నువ్వు క్లాస్ కి రాకపోవటం. ఒక్కటి గుర్తుపెట్టుకో, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నీకున్న మేధస్సుతో, ఆలోచనలతో గొప్ప ఆవిష్కరణలు చేయొచ్చు. వాటిని మానవాళి శ్రేయస్సుకి ఉపయోగించచ్చు. మనం ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్నప్పుడు, అడ్డువస్తున్నాయి అనుకుంటే మనకిష్టమైన వాటిని కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉండాలి”
“సార్?” తలెత్తి చూశాడు చైతన్య.
“నీ వ్యక్తిగత విషయాలగురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అవి నీ వ్యక్తిగతం. కానీ ఒక గురువుగా నిన్ను సరైన దారిలో పెట్టాలనేదే నా తాపత్రయం. నీకు ఏది ముఖ్యమైనదో ఆలోచించుకోవాల్సింది నువ్వే. నిన్న రాత్రి ప్రాజెక్టు సబ్మిట్ చేసినట్టున్నావు కదా?” అడిగారు.
“చేశాను సార్” చెప్పాడు.
“చూశాను. నీ నుంచి నేను అలాంటి ప్రాజెక్టు కాదు ఎక్స్పెక్ట్ చేసింది. ఐ రియల్లీ ఫీల్ షేమ్ ఆన్ యు. నువ్వు తలచుకుంటే విభిన్న ఆవిష్కరణలు చేయగలవు. నిర్ణయించుకోవాల్సింది నువ్వే. ఆపై నీ ఇష్టం” చెప్పేసి వెళ్ళిపోయారు ప్రొఫెసర్ చొక్కలింగం.
చైతన్య ఆలోచిస్తున్నాడు. ఆమేమో తనదొక విభిన్న ప్రపంచమంటుంది. సారేమో తను తలచుకుంటే విభిన్న ఆవిష్కరణలు చేస్తావంటుంన్నాడు. ఇంతకీ తనెవరు? తనేం చేయగలడు? తన దారి ఏది? ఏం నిర్ణయం తీసుకోవాలి? ఆలోచిస్తుంటే తలబద్దలైపోతున్నట్టు అన్పిచింది. కళ్ళు బైర్లుగమ్ముతున్నాయి. కళ్ళు మూసుకున్నాడు. ఐదు నిమిషాలు గడిచాయి. కళ్ళు తెరిచాడు. నిర్ణయించుకున్నాడు. చేతిలో ఉన్న సెల్ ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి అందులోని వర్ష నెంబర్ని శాశ్వతంగా డిలీట్ చేశాడు.
అక్కడ్నుంచి నేరుగా సాల్మన్ ఇంటికి వెళ్ళాడు. సాల్మన్ అతడి రాక గురించే వెయిట్ చేస్తున్నాడు. చైతన్య రాగానే లేచి ఎదురు వెళ్ళాడు.
“వర్షతో మాట్లాడావా? ఏమంది?” ఆతృతగా అడిగాడు.
“మనం ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి. రేపే లాస్ట్ డేట్” మెట్లవైపు వెళ్తూ అన్నాడు చైతన్య.
“నిన్న రాత్రే సబ్మిట్ చేశాంగా!”
“మన నుంచి సార్ ఎక్స్పెట్ చేసింది అలాంటి ప్రాజెక్టు కాదని చెప్పారు”
“అది సరేరా ఇంతకీ వర్ష ఏమంది? ఆ విషయం చెప్పవే?”
“నాకో ఐడియా వచ్చింది. దాని ప్రకారం ప్రాజెక్టు చేద్దాం. రాత్రంతా ఇద్దరం కష్టపడితే గాని ప్రాజెక్టు పూర్తవదు”
“నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి? వర్ష గురించి అడుగుతుంటే చెప్పవే!” అసహనంగా అన్నాడు సాల్మన్.
“ఏం చెప్పమంటావు?” అరిచాడు చైతన్య. “నాతో భవిష్యత్తు ఊహిస్తే తనకి భయం వేస్తుందంట. ఇద్దరం కలిసి జీవిస్తే క్షోభ అనుభవించాలంట. అందుకే వదిలి వెళ్ళిపోయింది. నేను చెప్పేది వినిపించుకోలేదు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రాధేయపడ్డానురా. కనికరించలేదు. ఒక్క అవకాశం ఇమ్మన్నా, ఒప్పుకోలేదు. వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయింది” ఆవేశంగా అన్నాడు. సాల్మన్ మాట్లాడలేదు.
“అరె! తనకోసం ఎన్ని చేశాను? అయినా నా వల్ల తన చిన్నచిన్న ఆశలు చంపుకుంటుందంట. నేను మాత్రం తన కారణంగా నా చదువులో వెనుకబడిపోలేదా? ఏ సార్ అయితే నా గురించి గొప్పగా చెప్పేవారో ఇప్పుడు అదే సార్ నన్ను చూసి షేమ్ ఫీలవుతున్నారు. అయినా తనకన్నా నాకు ఏది ముఖ్యం కాదని చెప్పా. అయినా వినకుండా వెళ్ళిపోయింది. ఇది ముగిసిపోయిందిరా. ఇక తనకీ, నాకు ఏ సంబంధం లేదు. తన మాట గాని, తన పేరు గాని నా ముందు ఎత్తమాకు” కోపంగా అనేసి మేడపైకి వెళ్ళిపోయాడు చైతన్య.
పీ.... పీపీ... పీ....
హారన్ మోత చప్పుళ్ళకి వర్తమానంలోకి వచ్చాడు చైతన్య. గ్రీన్ సిగ్నల్ పడింది. తను ఇంకా కదలకపోవడంతో వెనుక వాహనాలవాళ్ళు హారన్ మోగిస్తున్నారు. గేర్ మార్చి కార్ కదిల్చాడు. అనుకున్న విధంగా హోటల్ కి కాకుండా సాల్మన్ ఆఫీసు వైపు కార్ డైవర్ట్ చేశాడు. సాల్మన్ నగరంలోని ప్లానిటోరియంలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. అరగంటలో సాల్మన్ ఆఫీసు చేరుకున్నాడు చైతన్య.
“నువ్వు సిటికి వస్తున్నట్టు నాకు చెప్పనేలేదు?” కాఫీ కప్ చైతన్య వైపు తోస్తూ అన్నాడు సాల్మన్.
“బృందవిహార్ వర్శిటీ కాన్వకేషన్ కి పిలిచారు” సమాధానం చెప్పాడు చైతన్య.
“చాలా సంవత్సరాలు అయింది కదా చూసి, గుర్తుపట్టలేని విధంగా ఉన్నావు. చాలా మారిపోయావు”
“వర్ష మాత్రం ఏం మారలేదు”
“నువ్వు తనని చూశావా?” ఆత్రంగా అడిగాడు సాల్మన్. తలూపాడు చైతన్య.
“మాట్లాడావా?” దానికీ తలుపాడు.
“ఏమంది?”
“తనేం మారలేదు. అలానే ఉంది. అప్పటిలానే... ఎప్పటికీ నాకు అర్ధంకాని విధంగా”
“సర్లే వదిలేయ్. జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడేందుకు చర్చించుకోవడం” టాపిక్ డైవర్ట్ చేయబోయాడు సాల్మన్.
“ఆడవాళ్ళు అందరూ ఇంతేనా లేకపోతే వర్ష మాత్రమే ఇలానా? ప్రేమను అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలరు వాళ్ళు?”
“తను నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నావు?”
“నాకు తెలీదు. బహుశా నా ప్రేమ తనకి సరిపోలేదేమో!”
మాట్లాడలేదు సాల్మన్.
“ఎన్ని మాటలు మాట్లాడింది? ఎన్నో ఊసులు చెప్పింది. చివరికి అన్నీ మర్చిపోయి కాదు పొమ్మంది. తను సంతోషంగానే ఉంది. నేనే....”
దానికీ మాట్లాడలేదు సాల్మన్. వర్ష మీద అతడికి ఇంకా కోపం తగ్గలేదని అర్దమవుతుంది.
“అప్పుడు మాట్లాడలేదు సరే. కనీసం ఇప్పుడు కూడా మాట్లాటానికి ఇష్టపడలేదు. పిల్లలు వచ్చే టైమ్ అయిందని చెప్పి వెళ్ళిపోయింది”
“పిల్లలు ఏంటి?”
“తన పిల్లలే”
“పెళ్ళి చేసుకుందా?”
“పెళ్ళి చేసుకుంది. ముగ్గురు పిల్లలు కూడా. పెద్దవాడికి ఏడు సంవత్సరాలు”
“ఏం మాట్లాడుతున్నావ్? రెండేళ్ళ క్రితం తనతో మాట్లాడా. అప్పుడు పెళ్ళి కాలేదని చెప్పింది. ఇంతలో ఏడేళ్ళ కొడుకు ఎక్కడ్నుంచి వస్తాడు?”
“ఏంటి నువ్వు మాట్లాడేది?” అర్దం కాలేదు చైతన్యకి.
“అవునురా... తనకి పెళ్ళి కాలేదు”
“అంటే ఇప్పుడు కూడా తను నాకు అబద్దం చెప్పిందా!”
“ఇక చాలు ఆపరా! తనని ప్రేమించానంటావు, మరి అంతగా ప్రేమించినవాడివి ఇదేనా తనని అర్దం చేసుకోవడం? నిజానికి నువ్వు తనని ప్రేమించినదాని కన్నా తనే నిన్ను ఎక్కువ ప్రేమించింది”
“ఏంటి నువ్వు చెప్పేది?”
“నిజం! నీకు తెలీని నిజం. తను నీకు చెప్పొద్దన్న నిజం. కానీ ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పకపోతే ఇంకా తన మీద ద్వేషం పెంచుకుంటావు. అందుకే చెప్తున్నా విను. నీకోసమే తను నిన్ను వదిలి వెళ్ళిపోయింది. నీకు గుర్తుందా? ఆ రోజు సాయంత్రం నువ్వు వర్షతో మాట్లాడి వచ్చిన తరువాత నాతో వచ్చి మాట్లాడావు. అప్పుడు నువ్వు వర్ష మీద చాలా కోపంగా మాట్లాడావు. తరువాత నువ్వు మేడ పైకి వెళ్ళిపోయాక విషయం కనుక్కుందామని నేను వర్షకి ఫోన్ చేశాను. తను నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా? చొక్కలింగం సార్!”
“ఏంటి నువ్వు మాట్లాడేది?” షాకింగా ఉంది చైతన్యకి.
“అవును చొక్కలింగం సార్ వల్లే తను నిన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు చదువులో వెనుకబడిపోతున్నావని చొక్కలింగం సారే వర్ష దగ్గరకి వెళ్ళి తన మనసు విరిచేశారు. తన ప్రేమ వల్ల నువ్వు జీవితంలో పైకి రాలేవని భయపెట్టారు. అందుకే ఆ రోజు తను నీతో అలా మాట్లాడి వెళ్ళిపోయింది. నీ చదువు అయిపోయాక వర్ష నీ దగ్గరకి వద్దామనుకుంది. కానీ అప్పటికే నువ్వు తన మీద ద్వేషం పెంచుకున్నావు. అయినా కూడా నీతో ఒకసారి మాట్లాడమని చెప్పాను. దానికి తనేమందో తెలుసా? ‘నేను చైతన్యని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అతడి కళ్ళలో బాధ ఇప్పటికీ నాకు గుర్తుంది. తను కాబట్టి నేను తిరస్కరించినా తట్టుకున్నాడు. నేను తట్టుకోలేను. ఇప్పుడు నేను వెళ్ళి అడిగాక తను కాదంటే నేను బ్రతకలేను, చచ్చిపోతాను’ అంది. తరువాత తనతో కాంటాక్ట్ పోయింది. మళ్ళీ రెండేళ్ళ క్రితం రోడ్డు మీద కనబడితే మాట్లాడాను. నాన్న చనిపోయాక మైసూర్ నుంచి అమ్మతోసహా ఇక్కడకు వచ్చేశానంది. పెళ్ళి చేసుకోలేదని కూడా చెప్పింది. కనీసం నీకు పెళ్ళైందని అబద్దం చెప్తే ఆయినా, పెళ్ళి చేసుకుంటుందని ఉద్దేశంతో నీకు పెళ్ళైందని అబద్దం చెప్పాను. అందుకే పెళ్ళి చేసుకోలేదని తెలిస్తే నువ్వు బాధపడతావని, పెళ్ళైందని, ముగ్గురు పిల్లలు ఉన్నారని అబద్దం చెప్పి ఉంటుంది” వివరించాడు సాల్మన్. విషయం తెలిసి మూగబోయాడు చైతన్య. మాట్లాడలేకపోయాడు. అతడి ఒళ్ళంతా నిస్సత్తువ ఆవరించింది.
“నీ దగ్గర వర్ష అడ్రెస్ ఉందా?” అని మాత్రం అనగలిగాడు.
“ఉంది” అంటూ కంప్యూటర్లో అడ్రెస్ తీసి చైతన్యకి ఇచ్చాడు. తీసుకుని బయటకి పరిగెత్తాడు చైతన్య.
వీలైనంత వేగంగా కార్ పోనిస్తున్నాడు చైతన్య. ఇక తనకి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఆమెని కలవాలి, కలిసి తమ ప్రేమకి ఒక నిర్వచనం ఇచ్చుకోవాలి. తనకోసం, తన ఎదుగుదల కోసం తనకి దూరంగా వెళ్ళిపోయి ఆమె అనుభవించిన బాధని, పడ్డ క్షోభని తల్చుకుంటేనే మనసు చిదిమేస్తుంది అతడికి. గేర్ మార్చి మ్యాగ్జిమమ్ స్పీడ్ పెంచాడు. అతడి నిరీక్షణ తీరింది. అరగంటకి సాల్మన్ ఇచ్చిన అడ్రెస్ చేరుకున్నాడు. గేట్ ముందు నించుని కాలింగ్ బెల్ నోక్కాడు. క్షణం తరువాత వచ్చి గేట్ తీసింది వర్ష. ఎదురుగా ఉన్న చైతన్యని చూసి ఆశ్చర్యపోయింది. మాట్లాడకుండా లోపలికి నడిచాడు చైతన్య.
“మీ అమ్మగార్ని చూసి పలకరిద్దామని వచ్చాను” అన్నాడు.
“అమ్మ ఇంట్లో లేదు. గుడికి వెళ్ళింది” చెప్పింది.
“సరే మీ ఆయన్నీ, పిల్లల్ని పిలూ. ఒకసారి చూస్తా”
“వాళ్ళు.... వాళ్ళు ఇంట్లో లేరు.... బయటకి వెళ్ళారు” తడబడుతూ చెప్పింది వర్ష.
విరక్తిగా నవ్వాడు చైతన్య. వర్షకి అర్దంకాలేదు.
“ఇంకా నాతో అబద్దం చెప్పాలనే చూస్తున్నావా?”
“ఏంటి?”
“తప్పు నాదే! నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోగానే, వెళ్ళిపోయావని కోపం తెచ్చుకున్నానే గాని ఎందుకు వెళ్ళిపోయావని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రేమని ద్వేషంగా మార్చుకుని బ్రతికాను తప్ప కనీసం నిన్ను కలిసే ప్రయత్నం చేయలేదు. నిజం తెలుసుకునే సాహసం చేయలేదు. నిజం తెలిసేటప్పటికి ఆలస్యం అయిపోయింది. పది సంవత్సరాల ఆలస్యం! ఈ పది సంవత్సరాలు నీ మీద పిచ్చి ద్వేషంతో, ఏదో సాధించాలని పట్టుదలతో నన్ను నేను బిజీ చేసుకుని ఒక యంత్రంలా బ్రతికాను. అయినప్పటికీ నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి మనసుని ఎవరో సూదులతో పొడిచినట్టు అనిపించేది. భరించలేకపోయేవాడిని. అలాంటిది నా మీద ప్రేమతో, నా ఎదుగుదల కోసం నాకు దూరంగా వెళ్ళిపోయి ఈ పది సంవత్సరాలు నువ్వు ఎంత క్షోభ అనుభవించుంటావో తల్చుకుంటేనే భయం వేస్తుంది. ఉదయం వాళ్ళన్నట్టు నేను విశ్వ రహస్యాలను తెలుకోడానికి ఎన్నో ప్రయోగాలు చేశాను గాని నీ మనసు తెలుసుకోడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. నన్ను క్షమించు. అంతరిక్షం గురించి శోధించీ, శోధించీ నా జీవితం మొత్తం శూన్యంతో నిండిపోయింది. ఆ శూన్యాన్ని నింపగల శక్తి నీ ప్రేమకి మాత్రమే ఉంది. నాకు నీ ప్రేమని భిక్షగా వేస్తావా? నన్ను నీ ఒడిలోకి రానిస్తావా?...” అడిగాడు చైతన్య.
“ఏంటి నువ్వు మాట్లాడేది?”
“నిజం వర్ష! సాల్మన్ నాకు అంతా చెప్పాడు. ఇప్పుడు మనమధ్య రావడానికి చొక్కలింగం సార్ లేరు. నన్ను స్వీకరిస్తావా!...” చేతులు చాచి అన్నాడు.
ఇక ఉండలేకపోయింది వర్ష. ఇన్నాళ్ళ దుఃఖం ఆమె కళ్ళ ద్వారా తన్నుకొచ్చింది. పరుగున వెళ్ళి అతడి గుండెల మీద వాలిపోయింది. కూతురి కోసం గుడికి వెళ్ళిన వర్ష అమ్మగారి ప్రార్దనను ఆ దేవుడు ఇన్నాళ్ళకు ఆలకించాడు.
oooo
కొల్లిపర హితేష్
హితేష్ కొల్లిపర: గుంటూరుకు చెందిన హితేష్ కొల్లిపర వయస్సు 23 సంవత్సరాలు. చార్టర్డ్ అకౌంటెన్సీ- ఫైనల్ చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతో వ్రాసిన మొదటి కథ 'పేరమ్మ పేరాశ' 2004లో ఈనాడు-హాయిబుజ్జిలో ప్రచురితమైనది. ఇప్పటి విషయానికి వస్తే, నాలుగు కథలు స్వాతి, ఆంధ్రభూమి పత్రికలలో ప్రచురితమైయ్యాయి. 'లవ్ ఇన్స్టిట్యూట్' పేరుతో నవల ప్రచురించబడింది.
***