MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ రచనల పోటీ
కష్టానికి ప్రతిఫలం
హంసగీతి
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండవ బహుమతి పొందిన పద్య కథ
సీస పద్యము
కోవెల కెదురుగ గూర్చుండు వెంకమ్మ
పూలనమ్ముచు నుండు భుక్తి కొరకు
గోడు జెప్పు కొనగ తోడు లేక వగచు
పేదరాలక్కటా విన్నవించు
చుండె ప్రతి దినము జోత లిడుచు నామె
యా పరమాత్మకు నార్తి తోడ
పరిపరి విధముల భగవంతుని గొలుచు
ముక్తినీయు మనుచు భక్తితోడ !!
తేటగీతి
కాలము గడుపు చున్నది కష్టపడుచు
పండు ముదిమి గలిగియున్న భక్తురాలు
తొలుత కట్టిన మాలను తొల్లి పూజ
కొరకు దేవుని కర్పించి కొలుచు చుండె !! (1)
భావము :
కోవెల యెదురుగా పూలమ్ముకొని కష్టపడి జీవించు చున్నది వెంకమ్మ అనే వృద్ధురాలు ఆమె కటిక పేదరాలు.ఆమెకు ఎవరూలేరు . పిలిచిన పలికే దిక్కు లేదు ప్రతిరోజు పూలుకట్టి తొలిమాలను దేవుని కర్పించి తనకు ముక్తిని ప్రసాదించమని ఆదేవుని వేడుకొనేది.
తేటగీతి
జాలితో ధనికుడొకడు సాయపడగ
వృద్ధు రాలికి పదకొండు వెండి రూక
లున్న సంచినొకటి నిచ్చె సన్న జాజి
మాలలను గొని సేవకు మరలి పోయె!! (2)
భావము :
ఒక ధనికుడు వృద్ధురాలి దగ్గర సన్నజాజి మాలలను కొని ఆమెకు సాయము చేయదలచి పదకొండు వెండి రూకలున్న సంచిని ఇచ్చి పూజ చేయటానికి వెళ్ళెను.
కం
తెంక పడుచు గొనె సంచిని
వెంకమ్మ బదులు పలుకక వినయము తోడన్
బింక పడక వచ్చె మరల
జంకు బడక నమ్మసాగె జాజుల మాలల్!! (3)
భావము :
భయపడుతు సంచీని తీసుకొంది వెంకమ్మ వినయముగా బదులేమి పలుకలేదు.మరల మర్నాడు బింక పడకుండ వచ్చి జంకు లేకుండగా యథావిధిగా జాజిపూలను అమ్మసాగింది.
కం
అవ్వను జూడగ ధనికుడు
నివ్వెర పడుచుండ నామె నిర్భయముగ దా
నవ్వుచు నొక నాణెము గొని
రువ్వె నచట నున్న హుండి లోన మురియుచున్!! (4)
భావము :
ధనము తీసుకొని కూడ పూలమ్ముతున్న అవ్వను చూచి ధనికుడు నివ్వెర పడుచుండగ ఆమె నవ్వుచు ఒక నాణెము తీసి దేవుని హుండీలో పడునట్లు విసిరింది మురిసిపోతు .
మత్తకోకిల
రోజుకొక్కటి తీసి వేయుచు రూకలన్నియు వేసెలే
మోజు లేదులె ఖర్చుపెట్టగ మోక్షమే యిక కోరెగా
జాజిమాలల నల్లుచుండెను స్వామి పూజకు భక్తితో
భోజనానికి కష్టమోర్చుచు పూలనమ్ముచు నుండెలే!! (5)
భావము :
ముక్తిని కోరె ఆమెకు ధనికుడిచ్చిన రూకలను ఖర్చుపెట్టే కోరిక లేదు. అందుకే దేవుని హుండీలో రోజుకొక్కటి చొప్పున. వేసింది మళ్ళీ జాజి మాలలను కష్టపడి అల్లి అమ్ముతోంది తిండి కొరకు.
సీస పద్యము
కారణ మడుగ వెం కమ్మనా ధనికుడు
బిడియ పడి పలికె వృద్ధు రాలు
కష్టపడి గడించ నిష్ట పడుదు నయ్య!
ఇచ్చిన నాణెము లెన్ని నాళ్ళు
తిండి బెట్టు పిదప తిండికై జూడగ
కష్టము మరిచిన కాయమపుడు
సహకరించదె యలసత్వము పెరుగగ
కనుక వేసితి నేను ధనము నంత !
ఆటవెలది
కానుకీయ లేదు కష్టపడినగాని
ధనము లేక నేను దైవమునకు
నిప్డు సంత సంబు నెంతగ పొందితి
వెండి రూక లీయ వేల్పు కొరకు!! (6)
భావము:
అలా పడేయటానికి ధనికుడు కారణం అడిగాడు .అప్పుడామె ఇలా అన్నది "నువ్విచ్చిన ధనంతో కొన్నాళ్ళు మాత్రమే హాయిగా ఉండగలను.కష్టంలేకుండా ఉన్న శరీరం ఆ తరువాత పని చేయటానికి సహకరించదు.అప్పుడు పూట గడవడం కష్టం అవుతుంది.నేను ఎంత కష్టపడిన ఆ దేవునికి కానుకీయ లేదు. ఇప్పడు నీవిచ్చిన వెండి రూకలను ఆ దేవునికే కానుకగా ఇచ్చాక చాలా సంతోషం చెందాను."
ఉత్పలమాల
కష్టము చేయుచుండగను గౌరవ మిచ్చును లోకమంతయున్
కష్టము లేనిచో జనుల కాయపు భారము హెచ్చు చుండులే
ఇష్టము తోడ కష్ట పడ నీశుడు మెచ్చుచు మోక్షమిచ్చులే
స్పష్టము చేయగా నిటుల స్వామికి చేర్చితి రూకలన్నియున్!! (7)
భావము :
కష్టపడుతుంటే లోకమంతా మెచ్చుకుని గౌరవిస్తారు .కష్టపడక పోతే శరీర బరువు పెరుగుతుంది.ఇష్టంగా కష్టపడితే ఆ ఈశ్వరుడు కుడా మెచ్చి మోక్షమిస్తాడు.ఇది తెలిపేందుకే నేను ఆ స్వామికే వెండి రూకలన్ని సమర్పించాను.
తేటగీతి
పలుకగ నిటుల వెంకమ్మ, పరవశించె
ధనికుడా మాటలను విని తాను గూడ
నా దినము నుండి ప్రతి రోజు నందరివలె
కష్టపడుదు నని తెలిపె కచ్చితముగ!! (8)
భావము :
వెంకమ్మ మాటలు విన్న ధనికుడు సంతోషించ ఆరోజు నుంచి ప్రతిరోజు అందరివలె తానుకూడ కష్టపడతానని తెలిపాడు.
తేటగీతి
తల్లి లేదని తెలిపె నా ధనికుడపుడు
తమకు పెద్ద దిక్కుగ నుండి దయను జూపు
మనుచు వేడు కొనగ నామె కనులు తడిసె
బయలు దేరె వెంకమ్మయె పరవశమున !! (9)
భావము :
తనకు తల్లి లేదని తమకు పెద్ద దిక్కుగ ఉండమని ధనికుడు వెంకమ్మను వేడుకొనగా ఆమె కనులు కన్నీటితో తడిశాయి.ఆమె అతడికి తల్లిగా ఉండేందుకు సంతోషంగా బయలు దేరింది
ఆటవెలది
పనిని మానలేదు బ్రతికినంత వరకు
పూలు కట్టు చుండె పూజకొరకు
నాదరించె నతడు నమ్మగ పూజించి
కష్ట పడిన దీరు కలలు గదర !! (10)
భావము :
ధనికుడి వెంట వెళ్ళిన వెంకమ్మ బ్రతికినంత కాలం తన పనిని మానలేదు.పూజ కోసం పూలు కట్టిస్తూనే ఉంది. ధనికుడు కూడా ఆమెను ఆదరించి కన్నతల్లిగ పూజించాడు .
కధాంశం :
కోవెల యెదురుగా పూలమ్ముకొని కష్టపడి జీవించు చున్నది వెంకమ్మ అనే వృద్ధురాలు. ఆమె కటిక పేదరాలు.ఆమెకు ఎవరూ లేరు . పిలిచిన పలికే దిక్కు లేదు..ప్రతిరోజు పూలుకట్టి తొలిమాలను దేవుని కర్పించి తనకు ముక్తిని ప్రసాదించమని ఆదేవుని వేడుకొనేది.
ఒక ధనికుడు వృద్ధురాలి దగ్గర సన్నజాజి మాలలను కొని ఆమెకు సాయము చేయదలచి పదకొండు వెండి రూకలున్న సంచిని ఇచ్చి పూజ చేయటానికి వెళ్ళెను.భయపడుతు సంచీని తీసుకొంది వెంకమ్మ వినయముగా బదులేమి పలుకలేదు.మరల మర్నాడు బింక పడకుండ వచ్చి జంకు లేకుండగా యథావిధిగా జాజిపూలను అమ్మసాగింది.
ధనము తీసుకొని కూడ పూలమ్ముతున్న అవ్వను చూచి ధనికుడు నివ్వెర పడుచుండగ ఆమె నవ్వుచు ఒక నాణెము తీసి దేవుని హుండీలో పడునట్లు విసిరింది మురిసిపోతూ .
ముక్తిని కోరే ఆమెకు ధనికుడిచ్చిన రూకలను ఖర్చుపెట్టే కోరిక లేదు. అందుకే దేవుని హుండీలో రోజుకొక్కటి చొప్పున.వేసింది మళ్ళీ జాజి మాలలను కష్టపడి అల్లి అమ్ముతోంది తిండి కొరకు.అలా పడేయటానికి ధనికుడు కారణం అడిగాడు.
అప్పుడామె ఇలా అన్నది. "నువ్విచ్చిన ధనంతో కొన్నాళ్ళు మాత్రమే హాయిగా ఉండగలను. కష్టంలేకుండా ఉన్న శరీరం ఆ తరువాత పని చేయటానికి సహకరించదు.అప్పుడు పూట గడవడం కష్టం అవుతుంది.నేను ఎంత కష్టపడిన ఆ దేవునికి కానుకీయలేదు. ఇప్పడు నీవిచ్చిన వెండి రూకలను ఆ దేవునికే కానుకగా ఇచ్చాక చాలా సంతోషం చెందాను."
కష్టపడుతుంటే లోకమంతా మెచ్చుకుని గౌరవిస్తారు .కష్టపడక పోతే శరీర బరువు పెరుగుతుంది.ఇష్టంగా కష్టపడితే ఆ ఈశ్వరుడు కుడా మెచ్చి మోక్షమిస్తాడు.ఇది తెలిపేందుకే నేను ఆ స్వామికే రూకలన్ని సమర్పించాను.
వెంకమ్మ మాటలు విన్న ధనికుడు సంతోషించి త ఆరోజు నుంచి ప్రతిరోజు అందరివలె తానుకూడ కష్టపడతానని తెలిపాడు.
తనకు తల్లి లేదని తమకు పెద్ద దిక్కుగ ఉండమని ధనికుడు వెంకమ్మను వేడుకొనగా ఆమె కనులు కన్నీటితో తడిశాయి.ఆమె అతడికి తల్లిగా ఉండేందుకు సంతోషంగా బయలు దేరింది.
ధనికుడి వెంట వెళ్ళిన వెంకమ్మ బ్రతికినంత కాలం తన పనిని మానలేదు. పూజ కోసం పూలు కట్టిస్తూనే ఉంది. ధనికుడు కూడా ఆమెను ఆదరించి కన్నతల్లిగ పూజించాడు .
నీతి "కష్టపడిన కన్న కలలన్నీ దీరును "
(ఈ కధలో ఎవరూ లేరని తపించే వెంకమ్మ కష్ట పడటం చూసిన భగవంతుడు ఆమెకు ఆ ధనికుడు కొడుకై ఆదరించేటట్లు అనుగ్రహించాడు )
*****