top of page

కథా మధురాలు

అలా మొదలైంది

Hitesh Kollipera

ప్రసూన రవీంద్రన్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ

“చిత్ర కొంచమైనా తలొంచుకుంటే బావుంటుంది కావేరీ. మరీ అంత చనువుగా అందరితోనూ మాట్లాడేస్తుంటే, తనేనా పెళ్ళికూతురు అని అనుమానం వస్తోంది.“ నిష్టూరంగా అంది కావేరి పెద్దక్క నర్మద. 
“అవునక్కా. ఇప్పటి ఆడపిల్లలు కనీసం తాళి కట్టే సమయంలోనైనా సిగ్గు నటిస్తే చాలు.“ కావేరి నిస్సహాయురాల్లా ముఖం ముడుచుకుంటూ అంది. 
***
“తాళి కట్టేటప్పుడైనా కాస్త తలొంచుకుని సిగ్గుపడవే“ మధుపర్కాలు కట్టేటప్పుడు జడ జాగ్రత్తగా పట్టుకుంటూ అంది చిత్ర స్నేహితురాలు శ్రీలత. 
ఆ గదిలోనే చిత్ర కి చాలా దగ్గరయిన స్నేహితులూ, బంధువులూ దాదాపుగా ఇరవై మంది ఆడవాళ్ళు ఉన్నారు. 
“ఒక్కసారి అందరూ నిశ్శబ్దంగా ఉండి నేను చెప్పేది వినండి“ తన కంచు కంఠాన్ని మరింత పెద్దది చేస్తూ అరిచింది చిత్ర. 
అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు తిరిగారు.
“నేను పెళ్ళిచేసుకుంటున్నాను. సిగ్గుపడే పనేదీ చెయ్యడంలేదు. పెళ్ళి ఆడదానికి ఎంత అవసరమనుకుంటున్నారో మగవాళ్ళకీ అంతే అవసరం. ఎక్కడైనా, స్త్రీ సిగ్గుపడాలి, తలొంచుకుని కూర్చోవాలి వంటి అభిప్రాయాలు పూర్తిగా పోయేవరకూ స్త్రీ అబల, నిస్సహాయురాలు అనే అభిప్రాయాలు పోవు. అటువంటి అభిప్రాయాలు సమాజంలోంచి పోయేవరకూ ఆడవాళ్ళ మీద దాడులు తగ్గు ముఖం పట్టవు. అందరికీ ఇదే చెబుతున్నాను. మార్పు మననుంచే మొదలవ్వాలి. సమానత్వం సాధించడానికి మన తరంవాళ్ళే కాదు, అన్ని తరాల ఆడవాళ్ళూ కలిసే అడుగులు వెయ్యాలి.“  చూపుడు వేలు చూపిస్తూ గట్టిగా చెబుతున్న చిత్ర మాటలు విని అందరూ ఫక్కున నవ్వేశారు.
***
“చిత్రా, అప్పుడే భోజనం చేసేస్తున్నావా? మీ మామగారూ, నీ భర్తా వచ్చేవరకూ ఆగకూడదూ.“
“మీరంతా ఆకల్లేదు, అప్పుడే తినలేమన్నారు కదా అత్తయ్యా. ఉప్మా నచ్చక నేను ఉదయం టిఫిన్ తినలేదు కదా. ఆకలి దంచేస్తోంది. “
“అందుకే అది నచ్చదు, ఇది నచ్చదు అనకుండా కొంచమైనా తింటే ఇంట్లో మగవాళ్ళు తినేదాకా ఉండగలుగుతాం“
“ఇప్పుడేమయింది? ఏం నేను తినకూడదా? “ 
“తినకూడదని కాదమ్మా. పెళ్ళయిన ఈ ముఫై ఏళ్ళలో ఒక్క రోజు కూడా నేను ఆయనకంటే ముందు ఏదీ తినలేదు.“
“ఎందుకత్తయ్యా? ఆకలివేసినప్పుడు వాళ్ళకంటే ముందు తినడంలో ఏం తప్పుంది? “
అదోలా చూసింది కావేరి కోడలివైపు. “భర్త కంటే ముందు భార్య తినడం పధ్ధతి కాదు. “ 
కటువుగా అంటున్న అత్తగారివైపు ప్రశాంత వదనంతో చూస్తూ “ఎందుకు కాదు? ఎవరి ఆకలి వాళ్ళది కదా.“ అడిగింది చిత్ర.
“ఇటువంటి ఎదురు ప్రశ్నలు ఎప్పుడూ నాకు చేతకాలేదమ్మా. అందుకే పెద్దవాళ్ళు ఏం చెబితే అది విన్నాం. అదే చేశాం.“ 
“అందుకే సమానత్వం అనే మాట మీటింగుల్లోనూ, కథల్లోనూ తప్ప ఆడవాళ్ళ నిజ జీవితాల్లోకి నత్త నడకతో కూడా రావట్లేదు“ అత్తగారి ముఖంలోకి చిత్ర సూటిగా చూస్తూ అంది. 
***
“గౌతం, మనవి వారం రోజుల బట్టలూ ఉండిపోయాయి. నువ్వు వాషింగ్ మెషీన్ వేసి, బట్టలు ఆరేసే పని చూడు. నేను వంట పని చూసుకుంటాను. మధ్యాహ్నం కాసేపు పడుకుని లేచాక సాయంత్రం సినిమాకి వెళదాం. వస్తూ కూరలు, కొన్ని సరుకులూ తెచ్చుకోవాలి. “ 
“ఓకే డియరీ!” అంటూ భార్య బుగ్గ మీద గౌతం చిటికేస్తుంటే విసురుగా లోపలికొచ్చింది కావేరి. ఆమె ముఖం కోపంతో ఎర్రబడి ఉండటం చూసి, చిత్రని నడుంచుట్టూ చెయ్యేసి పట్టుకోవాలనుకున్నవాడల్లా అలాగే ఆగిపోయాడు.
“ఏం చిత్రా. బుధ్ధి ఉందా నీకు? మగవాడు. వాడికి నా ముందే బట్టలు ఉతికి ఆరెయ్యమని చెబుతున్నావా? “ 
అత్తగారి గొంతులో కోపం వినబడి కూడా చలించలేదు చిత్ర. 
“ఏరా నీకైనా బుధ్ధుండక్కర్లేదా? ఇవాళ బట్టలుతకమంది. రేపు బాత్రూంలు కూడా కడగమంటుంది నిన్ను. ఏం మనిషిరా?“ గౌతం ముఖంలోకి చూసింది చిత్ర. అప్పటిదాకా తన పైన ప్రేమతో అందంగా ఉన్న అతని ముఖాన్ని అవమాన ఛాయలు మింగెయ్యడం గమనించింది.
“వాషింగ్ మెషీన్లో బట్టలు వేసి, అవి ఆరెయ్యడంలో తప్పేముందత్తయ్యా? అది మగవాళ్ళు చెయ్యకూడని పనయితే బాచిలర్సంతా ఎలా బ్రతుకుతున్నారు? మన బాత్రూం మనం శుభ్రం చేసుకోవడానికి కూడా ఆడ, మగ ఏమిటి? నాకర్థం కావట్లేదు. “
“అర్థం కానిది నాకు. అవ్వ. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు? బాచిలర్ల సంగతి మనకెందుకు? ఇంట్లో ఇద్దరాడవాళ్ళం ఉన్నాం. మనం చెయ్యాల్సిన పనులన్నీ వాడికి చెబుతున్నావ్? అంతగా నీకు కష్టంగా ఉంటే ఎక్కువజీతం పడేసి పనిమనిషిని ఈ పనులకి కూడా పెట్టుకో. అంతేకానీ, ఉద్యోగస్తురాలిని అన్న అహంకారంతో నా కొడుక్కి ఇలాంటి ఆడంగి పనులు చెప్పకు. “
“అత్తయ్యా. ఆవేశపడకండి. కోపంతో ఉన్నప్పుడు మెదడు పనిచెయ్యదు. కాస్త శాంతంగా నేను చెప్పేది విని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కూర్చోండి.“ తన చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెడుతున్న చిత్ర చేతిని విదిల్చి కొట్టింది కావేరి.


“ఆడవాళ్ళు పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ అభివృధ్ధి పథాల్లో పయనిస్తూ ఎన్నో సంస్థలని ఒంటిచేత్తో నడుపుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ పనులు ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలి, ఈ పనులు మగవాళ్ళే చెయ్యాలి అనే ఆలోచనల్లోంచి, అభిప్రాయాల్లోంచీ బయటికి రండత్తయ్యా. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా ఆడవాళ్ళ జీవితాలు మారడంలేదంటే అందుకు ముందుగా ఆడవాళ్ళనే తప్పుపట్టాలి. యుగాలుగా, తరాలుగా ఉన్న అభిప్రాయాల్ని గుడ్డిగా నమ్ముతూ, వాటినే ఆచరిస్తూ మనకి దేవుడిచ్చిన శక్తిసామర్ధ్యాల గురించి మర్చిపోయి మన స్వేఛ్చని మనమే కాలదన్నుకుంటున్నాం. ఉద్యోగం చేసే కోడలు కావాలి అనుకునే అత్తగార్లున్నారు. కానీ, ఆడవారితో సమానంగా ఇంటిపనులు చెయ్యాలని కొడుకులకి చెప్పే తల్లులే కరువయ్యారు. సమానత్వం , సమానత్వం అంటూ కొట్టుకుంటున్నాం. అదెలా వస్తుంది? ప్రతి ఇంటినుంచీ, ఆ ఇంటి ఇల్లాలి నుంచీ ప్రయత్నపూర్వకంగా సమానత్వం మొదలుకాకపోతే, సమాజం సమానత్వాన్ని ఎలా సాధిస్తుంది? మీ తరంతో, మీ  ముందు తరాలతో పోల్చకుండా, ఆలోచించి చూడండి. ఈ కాలపు అవసరాల్నీ, ఈ కాలపు స్త్రీల జీవితాన్నీ పక్కపక్కనే పెట్టి ఆలోచించండి. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎంతో సమర్ధత చూపిస్తున్నాం. కానీ, నిజంగా సమానత్వాన్ని సాధించగలుగుతున్నామా? ఎప్పటికైనా సాధిస్తామా? లోపం ఎక్కడ జరుగుతోంది. మగవాళ్ళకంటే ఎక్కువగానే శక్తిసామర్ధ్యాల్ని నిరూపించుకుంటున్న స్త్రీలకి ఈ కాలంలో ఎక్కడ ఎదురు దెబ్బ తగులుతోంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులై మన జాతిని మనమే ఎప్పటికీ మగవాడికంటే నువ్వు తక్కువే అని కించపరుచుకోవటం వల్ల కాదా? “


తన ముఖంలోకి చూస్తూ ప్రశ్నిస్తున్న కోడలి వంక ఆశ్చర్యంగా చూసింది కావేరి. చిత్ర మనసులో ఆరాటం తనకర్థమవుతోంది. చాలా విచిత్రంగా ఎంతో ఆవేశంగా కోడల్ని నానామాటలూ అనాలని అనుకున్న తన ఆవేశం ఎందుకో వెంటనే చల్లారిపోయింది. అత్తగారిగా కాక ఆడదానిగా అర్థం చేసుకుంటోందా చిత్ర మాటల్ని?


“అమ్మా. చిత్ర  కాలేజీలో కూడా ఇలా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చేది. నిజం చెప్పాలంటే తనని నేను ఇష్టపడ్డప్పుడే తన అలోచనల్నీ, ఆశయాల్నీ కూడా ఇష్టపడ్డాను. రేపు నాకు పుట్టబోయే కూతురు కూడా ఎంత శక్తిసామర్ధ్యాలున్నా, తన జీవితం పైన మరో వ్యక్తి అధికారం వల్ల నిస్సహాయురాలిగా మిగిలిపోకూడదు. అదీ సాటి ఆడదానివల్ల అటువంటి తిరోగమనం అస్సలు పొందకూడదమ్మా. మరో ఇరవై , ముఫ్ఫై ఏళ్ళ తరువాత అది సాధ్యపడాలంటే, అలోచనల్లో, అభిప్రాయాల్లోనే కాదు, ఆచరణలో కూడా మార్పు ఇప్పటినుంచే మొదలవ్వాలి కదమ్మా. “ 
తల్లి భుజాలు పట్టుకుని ప్రేమగా ఆవిడ కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
కోడలి వైపు చూసిన కావేరి ముఖం ప్రసన్నంగా మారిపోయింది.
***
“మొదట కొడుకు పుట్టాడు. ఇప్పుడు మహాలక్ష్మిలా ఆడపిల్ల కూడా పుట్టేసింది. ఇక ఈ బంగారుతల్లి పెళ్ళి కోసం ఇప్పటినుంచే మా అబ్బాయిలా అన్ని సేవింగ్సూ మీరు కూడా మొదలుపెట్టండి గౌతం.“ చిత్ర ఒడిలో ఉన్న పాపని ఆశీర్వదిస్తూ అంది దగ్గర బంధువైన సుభద్ర.
“ఆడపిల్లకి పెళ్ళే జీవిత పరమార్ధం అనే రోజులు పోయాయి ఆంటీ. మంచి చదువు, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే శక్తి, ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకగల సామర్ధ్యం ఇవే ఆడపిల్లలకైనా, మగవాళ్ళకైనా అవసరమైనవి.“ సుభద్ర కళ్ళలోకి చూస్తూనే అందరికీ వినపడేలా అంది చిత్ర.
“చిత్రా. ఆ పక్కింటి మీనాకుమారి చూశావా? అరవయ్యేళ్ళుంటాయ్. భర్త కూడా లేడు. పిలవని పేరంటానికి మీ వయసువారిలా కళ్ళకి ఐ లైనర్ తో సహా అంత మేకప్ కొట్టుకుని వచ్చింది. ఇటువంటి శుభకార్యాలకి ఆవిడ రావొచ్చా?“ వచ్చినవాళ్ళంతా వెళ్ళిపోగానే పరుగున చిత్ర దగ్గరకొస్తూ అంది కావేరి.
“అత్తయ్యా, ఆవిడని నా పాప నామకరణానికి రమ్మని నేనే పిలిచాను. ఆవిడ తన కోసం తను అందంగా తయారయితే అందులో మనకొచ్చే నష్టం కానీ, ఆవిడ చేసే అపచారం కానీ ఏముంది?“


“అదేవిటి చిత్రా అన్నిటికీ అలా అంటావు? ఈ వయసులో అలంకరణ ఏమిటి చెప్పు? అర్థం లేకుండా.“ ముఖం ముడుచుకుంటూ అంది కావేరి. 
“అర్థం ఉందత్తయ్యా. మనల్ని మనం ప్రేమించుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. అందుకు మనకి మనం అందంగా కనిపించాలి. దానివల్ల మనలో ఆత్మన్యూనత పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానికి వయసుతో కానీ, భర్త జీవించి ఉండటంతో కానీ సంబంధం ఏముంది? ఆవిడ కలెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏదీ లేదు. ఇలా ఉండకూడదు అని చెప్పేముందు ఎందుకు ఉండకూడదు అని కూడా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం ఇకనుంచయినా మొదలెడదాం.  భర్త లేకపోతే ఆడవారికి విలువే లేదన్నట్టు ప్రవర్తించడం మానేద్దాం.“ కావేరి చుబుకాన్ని పట్టుకుని ప్రేమగా ఆవిడ కళ్ళలోకి చూస్తూ అంది చిత్ర.


ఆశ్చర్యపోయింది కావేరి. ఇదే కోడలితో వచ్చిన చిక్కు. ఏదీ పొగరుగా, విసురుగా అనదు. ఇలాగే మీద చెయ్యి వేసి ప్రేమగా, మెత్తగా తనను మొట్టికాయలేస్తుంది. అవును మొట్టికాయలే. ఆలోచిస్తే చిత్ర చెప్పినదాంట్లో ఏ మాత్రం తప్పులేదు. తన అభిప్రాయాన్నే ప్రశ్నించుకోవాలి. ఒక మనిషి ఇలాగే ఉండాలి అని ఎందుకు అనుకోవాలి? ఆమె భర్త బ్రతికి లేనంత మాత్రాన ఆమెను ఈ పేరంటానికి ఎందుకు పిలవకూడదు?
***
 “చిత్రా! చిత్రా!”
“రండి పెద్దత్తయ్యా. ఎన్నేళ్ళకొచ్చారో మా ఇంటికి.“ నర్మద చేతులు పట్టుకుని ఆప్యాయంగా లోపలికి తీసుకొచ్చింది చిత్ర. వాళ్ళ వెనుకే చిత్ర కూతురు ఉజ్వల రెండు పెద్ద పెద్ద లగేజ్ బేగ్స్ లోపలికి తీసుకొచ్చింది.
“ఏంటే చిత్రా. నిండా పదిహేనేళ్ళు కూడా లేవు నీ కూతురికి. అంత ధైర్యంగా ఈ రాత్రి ఎనిమిది గంటల వేళ బైక్ మీద నా కోసం దాన్ని పంపావు స్టేషన్ కి? నీ కొడుకు ఉత్తేజ్ లేడా ఇంట్లో? వాడిని పంపి ఉండొచ్చు కదా. పైగా అంత బరువైన బేగ్స్ రెండూ వద్దన్నా వినకుండా అదే మోసుకొచ్చింది బయట దాకా. చేతులు నొప్పులు చెయ్యవూ పాపం?“ దెబ్బలాడింది నర్మద.
చిత్ర ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వింది. “ఇంతకు రెండు రెట్లు బరువు కూడా అది మోస్తుంది పెద్దత్తయ్యా. మీరు బాధపడకండి. బరువులెత్తడమే కాదు, బరువైన, బాధ్యతాయుతమైన పనులు చెయ్యడం కూడా దానికి కొత్తేమీ కాదు. అలాగే దాని రక్షణ అది చూసుకోగలదు. ఆ నమ్మకం నాకుంది. అందుకు తగిన శిక్షణా అది పొందింది. “
సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు చిత్ర కొడుకు ఉత్తేజ్.
“ఏరా ఉత్తేజ్ బావున్నావా? “
“బావున్నాను పెద్ద బామ్మా. మీరంతా ఎలా ఉన్నారు? మీకు గుమ్మడికాయ పులుసంటే మహా ఇష్టంట కదా. చిన్నతాతగారేమో ఆయనకి వాతం చేస్తుందని అసలు అది వండనివ్వరుట. అమ్మ చెప్పింది. రేపు నేనే స్వయంగా మీకు గుమ్మడిపులుసు వండి పెడతాను.“ కాలేజీ నుంచి వస్తూనే పుస్తకాలు పెట్టేసి తనవైపు ఆప్యాయంగా చూస్తూ చెబుతున్న ఉత్తేజ్ వంక ఆశ్చర్యంగా చూసింది నర్మద.
“ఇంటర్ చదువుతున్నావు. నీకెందుకురా ఆ తంటాలన్నీ. మీ అమ్మ చేసిపెడుతుందిలే.“ అంది ఆవిడ నవ్వుతూ.
ఉత్తేజ్ పెద్దగా శబ్దం చేస్తూ నవ్వాడు. “పావుగంటలో గుమ్మడి పులుసు చేస్తాను పెద్దబామ్మా నేను. ఈ చదువుల బరువులోంచి కాస్త నాకూ ఓ ఊరట అనుకోండి మీకు స్పెషల్ చేసిపెట్టడం.“


చిత్ర పిల్లలిద్దర్నీ చూస్తుంటే నర్మదకి చెప్పలేని ఆనందం కలిగింది.
నాలుగు రోజుల తరువాత కావేరి దగ్గర కూర్చుని “కావేరీ, నీ మనవడినీ, మనవరాల్నీ చూస్తుంటే ముచ్చటగా ఉంది. పిల్లవాడు ఇంటర్, పిల్ల పదవ తరగతి. కానీ, ఇద్దరూ అంత చక్కటి మార్కులతో చదువుల్లో ఫస్టుగా ఉండటంతో పాటు అన్ని పనులూ చురుగ్గా చేస్తూ ఇంటికొచ్చిన వాళ్ళతో ప్రేమగా కూడా మసలుతున్నారు. ఈ కాలంలో ఇటువంటి పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తున్నారు.“ అంది.


“చిత్ర పిల్లలే కాదక్కా. నా కూతురు శ్వేతకి ఇద్దరూ ఆడపిల్లలేగా. వాళ్ళిద్దరూ కూడా స్వయం సమర్ధులు వీళ్ళలాగే. అంతే కాదు చిత్రకి ఎవరెవరు సన్నిహితులో వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇలాగే పెంచారు. “పిల్లల్ని కంటాంగానీ వాళ్ళ తలరాతల్ని కాదు” అన్న నానుడిని మార్చి “పిల్లల్ని కంటాం. వాళ్ళ శక్తిసామర్ధ్యాల్ని కూడా ప్రణాళికా బధ్ధంగా వాళ్ళతో పాటే పెంచుతాం“ అన్నట్టుగా పెంచేలా అందరినీ చైతన్యపరిచింది తను. ఆడ, మగ తేడా రూపాల్లో తప్ప మరెందులోనూ కనపడదు చిత్ర స్నేహ వలయంలో. ‘ఇది నువ్వు చెయ్యలేవు’, ‘ఈ పని మగవాళ్ళే చెయ్యగలరు’ వంటి ఆలోచనలు ఈ పిల్లలకి అస్సలు తెలీవు. ఈ కాలనీ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరూ ఆడవాళ్ళని కించపరచరు. అందరాడవాళ్ళూ వాళ్ళ ఇష్టప్రకారం జీవిస్తారు. మరొకరి అధికారం వల్లో, ఆజ్ఞల వల్లో తమ ఇష్టాల్ని చంపుకుని బ్రతికే అవసరం ఎవరికీ రాదు. ప్రతి వ్యక్తీ వారిని వారు గౌరవించుకుంటారు.“ ముచ్చటగా చిత్ర వైపు చూస్తూ అంది కావేరి.


“నిజమే కావేరీ. ఆడది దేనికైనా సమర్ధురాలే అన్న నిజం తెలిసిన చోట ఆడవారి మీద దాడులు కూడా జరగవు.“ ఈ మధ్య ఆడవాళ్ళు బస్/ట్రైన్ డ్రైవర్లుగా, విమానంలో పైలట్లుగా, కుంగ్ ఫూ మొదలైన స్వీయ రక్షణా శిక్షణాధికారులుగా ఇంకా మరెన్నో ఉద్యోగాల్లో మగవారితో సమానంగా తను చూడటం గుర్తుచేసుకుంటూ నర్మద అంది.
అప్పుడే వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చి  “పెద్దత్తయ్యా, దగ్గరలోనే ఓ స్కూల్లోనూ, కాలేజీలోనూ ఇవాళ నా ఉపన్యాసం, వర్క్ షాప్ ఉన్నాయి. వెళ్ళొస్తాను.“ అంటూ కారు కీస్ తీసుకుని చిరునవ్వుతో బయటికి నడిచింది చిత్ర.

oooo

Bio
Comments

ప్రసూన రవీంద్రన్

 

***

Mani vadlamani
bottom of page