top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

తెలుగు సాహితీ శోభ 

ప్రసాద్ తుర్లపాటి 

తెలంగాణాలో విరిసిన తెలుగు సాహితీ శోభ - 1

 

"ఆంధ్రత్వ, మాంధ్ర భాషచా! నాల్పస్య తపఃఫలం"

అన్నారు తమిళులగు అప్పయ్య దీక్షితులవారు.

సంస్కృతి, కళ, సాహిత్యం, నాగరికత, సారస్త్వము, సభ్యత, దైనందినాభివృద్ధి మున్నగు ఉత్తమ గుణముల సుగమమే మన తెలుగు సంస్కృతి.

శ్రీశైలం, భీమేశ్వరం, కాళేశ్వరం -ప్రాకారంగా ఉన్న దేశమే తెలుగు దేశం. కాకతీయుల అనంతరం, ముస్లిం దండయాత్రికులు, పాలకులు, "తెలంగాన" - "తెలంగాణ" అన్న పదానికి ప్రాచుర్యం కలిపించారు. ఓరుగల్లు నుంచి సమగ్ర ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన కాటయ నాయకుడు "ఆంధ్ర సురత్రాణ" బిరుదు ధరించాడు.

ఈ త్రిలింగ దేశంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, ఖమ్మ జిల్లాల ప్రాంతమే నేటి తెలంగాణ. ఈ ప్రాంతంలో విలసిల్లిన సాహిత్యంపై జరిపిన విహంగ వీక్షణమే ఈ వ్యాసం యొక్క సారాంశం.

 

తెలంగాణ  రాష్ట్రానికి సుమారు 5000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర కలదు. ఈ ప్రాంతంలోని సాహిత్యాభివృద్ధిని పరిశీలించేముందు, ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలించిన వారి గురించి, వారి కాలాలని పరికిద్దాము.

 

 

1. 10వ శతాబ్ధం ముందు - మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, చోఢులు.

2.1053 నుంచి -1350 -కాకతీయులు

-సాహిత్యానికి స్వర్ణయుగమనవచ్చును/. రాజులు స్వతాహాగా కవులు-కళాపోషకులు.

ప్రముఖ కవులు - శైవ కవిత్రయం - నన్నెచోడ కవిరాజు, పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్యుడు, మల్లినాథసూరి, జాయపసేనాని మొదలగువారు.

3. 1326 నుండి 1356 - పద్మనాయకులు (ముసునూరి నాయకులు)

4.1347-1512 -బహతుని సుల్తానులు

5. 1512-1687 - గోల్కొండ సుల్తానులు, కుతుబ్ షాహి వంశస్తులు

6. 1687- 1724 -మొగలాయిలు

7.1724-1948 - ఆసిఫ్ జాహి వంశస్థులు

8. 17 సెప్టంబర్ 1948 -1956  - ఇండియన్ యూనియన్, హైదరాబాద్ స్టేట్

9.1956-2014  -ఆంధ్రప్రదేశ్- సంయుక్త  రాష్ట్రము.

10. 2 జూన్ 2014 - తెలంగాణ రాష్టము.

 

ఇక ఈ వ్యాసములో తెలంగాణ ప్రాచీనకవులు, గీతకర్తలు, వాగ్గేయకారులు, ఆధునిక కవుల గురించి, వారి శైలి, దృక్పథం గురించి సోదాహరణంగా వివరిస్తాను,

 

ఈ ప్రాంతం లోని ప్రముఖ కవులు.-

I. 1100 -1225:  శైవకవిత్రయం -నన్నెచోడు కవిరాజు

-పాల్కురికి సోమనాథుడు

 -పండితారాధ్యుడు.

 

II. 1450-1510:  పోతనామాత్యుడు/బమ్మెర పోతన

-గోన బుద్ధారెడ్డి (రంగనాథ రామాయణం)

-హుళక్కి భాస్కరుడు (భాస్కర రామాయణం)

-బద్దెన (సుమతీ శతకం)

-వినుకొండ వల్లభరాయుడు (క్రీఢాభిరామము)

 

III కుతుబ్ షాహీ :   కంచెర్ల గోపన్న(దాశరథీ శతకము) (రామదాసు కీర్తనలు)

      -మల్కిభురాముడు.

 

IV. 20వ శతాబ్ధము:

- కాళోజీ నారాయణరావు గారు

-దాశరథి కృష్ణమచార్యులు

-దాశరథి రంగాచార్యులు

-పీ.వీ. నరసింహారావు

-Dr. సి.నారాయణరెడ్డి మొదలయిన వారు

 

 ప్రముఖ గేయకవులు  -సుద్దాల హనుమంతు

 -గద్దర్

-గోరేటి వెంకన్న

-అందెశ్రీ

-బండి యాదగిరి

-చంద్రబోస్ మొదలగువారు

 

కథకులు -నందిని సిధారెడ్డి మొదలగు వారు.

 

నవ్యశిరీష ప్రసవ మంజుల భావ గుంభిత కావ్యరాజాలెన్నో ఈ ప్రాంతాన వెలుగొందాయి.

రమణీయ కాకతీయ రాజ్య ఘంటా ఘణంఘణలు, కాపాయ నాయకుని శౌర్య దావాగ్ని కీలలు, తెలంగాణా పీడిత బడుగు వర్గాల ఆకలి రోదనలు, ఆక్రందనలు, ప్రొద్దుప్రొద్దున అందాల పూలు పూయు కంజాత వల్లులు విరిసిల్లిన విరిపూవులు, విప్లవ వీరుల రోషనోజ్వల రుచులు, నైజాం నిరంకుశత్వంపై పోరాడిన వీరుల రోషాగ్ని జ్వాలలు, భద్రాద్రి రాముని కృపారస వీక్షణములు ఇత్యాదివి ఈ ప్రాంత కవితా వస్తువులు.

ముందుగా తెలంగాణ తొలికవుల గురించి ప్రస్తావించుకుందాము.

తెలంగాణ తొలికవులు శైవకవులు.

 

శైవ కవిత్రయం గా పెరు గాంచిన, నన్నెచోడ కవిరాజు (కుమారసంభవము), పండితారాధ్యుడు (పండితారాధ్య చరితము, రుద్రమహిమ మొ|| కావ్యముల రచయిత) మరియు పాల్కురికి సోమనాథుడు (బసవ పురాణము, వృషాధిప శతకము మొ||).

 

వీరు కాకతీయ కాలానికి చెందినవారు. ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు సామంతులయిన కాకతీయులు తమపేరున స్వతంత్ర రాజ్యములు స్థాపించుకుని ఓరుగల్లు (నేటి వరంగల్) రాజధానిగా, ఆంధ్రదేశాన్ని సుమారు 125 సంవత్సరాలు క్రీ.శ. 1053-1350 వరకూ పరిపాలించారు.

ఈ కాలం తెలుగు సాహితికి స్వర్ణయుగం. ఈ కాలంలోనే తెలుగులోని మొదటి రామాయణ కవ్యం -గోనబుద్ధారెడ్డి విరచిత, రంగనాథ రామాయణము, హళక్కి భాస్కరుని భాస్కర రామాయణము వెలుగొందాయి.

ఇక, ఈ కవుల శైలి తెలుసుకుందాము.

 

-నన్నెచోడ కవిరాజు - నన్నెచోడ కవిరాజుగా ప్రఖ్యాతి గాంచిన నన్నెచోడుడు శైవకవి.

ఈ కవి "కుమార సంభవము" అన్న గొప్ప ప్రభంధాన్ని రచించారు. కానీ, శ్రీ మానవల్లి రామక్రిష్ణ కవిగారి కృషితో, సుమారు క్రీ.శ. 1909 ప్రాంతంలో ఈ కావ్యం వెలుగులోకి వచ్చింది.  ఈ కావ్యానికి కృతిపతి -శ్రీ మల్లిఖార్జున శివయోగి.

నన్నెచోడుని కవితాశైలికి ఈ క్రింది పద్యమొక ఉదాహరణ-

 

 

సతిజన్మబున్, గణాధీశ్వర జననము, దక్ష క్రతు ధ్వంసమున్, బా

ర్వతి జన్మంబున్, భవోగ్రవ్రత చరితము, దేవద్విషత్ క్షోభమున్, శ్రీ

సుత సమ్హారంబు, భూభుత్సుత తపము, సుమసుందర్వోద్వాహమున్, ద

భ్రతి భోగంబుం, కుమారోదయము నతడ నిందార  కుంభోర గెల్వున్.

 

సతిజన్మము నుండి తారకాసురవధ వరకు జరిగిన కథ.

 

బ్రహ్మాండ, శైవ, పురాణములలోని కథనెంచుకుని, కుమారసంభవమనే ప్రభంధాన్ని నన్నెచోడ కవిరాజు రచించాడు. సంస్కృతగ్రంధమయిన కాళిదాస కుమార సంభవముల్ఫ్ పార్వతి జన్మవృత్తాంతమునుంచి, తారకాసుర వధ వరకు జరిగిన కథ. కానీ, నన్నెచోడుడు సతీదేవి జననము, దక్ష యజ్ఞము మొ|| అశ్వాసాలతో మొదలుపెట్టి తారకాసురవధ వసకు కథను నడిపించి, ప్రబంధ లక్షణములతో కూడిన గ్రంథముగా రచించాడు.

 

ఈతని కవిత్వంలో నన్నయ్యకు ముందుకాలం నాటి పదాలు కూడా కానవస్తాయి. ముఖ్యంగా పార్వతీ దేవి తపస్సు ఘట్టంలోని రుతువర్ణనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.

 

పార్వతి తపోదీక్ష వర్ణన-

 

పవడంపు లత మీద, ప్రాలేయపటలంబు

పర్వెనా మొయినిండ భస్మమలది

లాలితంపగు కల్పలత పల్లవించెనా,

కమనీయ ధాతు వస్త్రములు కట్టి

మాధవీలత కళమాలికత ముసరెనా

రమణ రుద్రాక్ష మాలికలు వెట్టి

వరహేమ లతికపై బురె నెమ్మి యూగెనా,

సమ్మతంబగు జడలు పూని

 

హరుడు మహేశ్వరీ రూపమైన చెలువ

మభినయించెనో యని, మునులర్థి జూడ

గురు తపశ్శక్తి మూర్తి సేకొనిన కరణి

దగలి యుమ (ఉమ) తపోవేషంబు దాల్చి

 

అర్థము: పార్వతీ దేవి పసుపుముద్దలాంటి తన శరీరం నిండా విభూది పులుముకుంది. అది ఎలా ఉందంటే- పగడాల తీగ మీద తెల్లని మంచు పడ్డాట్టుగా ఉంది.

ధరించిన రుద్రాక్ష మాలికలు -మాధవీలత మీద తుమ్మెదలు వ్రాలినట్టుగా ఉన్నాయి.

ముడి వేయకుండా ఉన్న కురులు బంగారు తీగ మీద (హేమలతలపై) మగ నెమలి పింఛం ఆరబోసుకొని ఊగుతున్నట్టుంది.

ఈ రూపాన్ని చూస్తూ మునులు, సాక్షాత్తూ పరమేశ్వరుడే పరమేశ్వరీ రూపాన్ని అభినయిస్తున్నాడా అనుకుంటున్నారు!

 

పండితారాధ్యుడు - శైవ కవిత్రయంగా పేరెన్నిక గన్న కవులలో పండితారాధ్యుల వారు  రెండవవారు. పండితారాధ్య చరిత్ర, రుద్రమహిమ, బసవ దేవతలు, శివతత్త్వసారము, అమరేశ్వరాష్టకము మున్నగు గ్రంధములు రచించారు.

 

కం|| పూజింపుడు, పూజింపుడు

      పూజింపుడు శివుని భక్తి

పూజింపుడుం మీ రోజ సెడు నడవడికుండుడు

రాజులు రట్టళ్ళవగుట రావెల్లిటికిన్.

 

పండితారాధ్యులు తుమ్మెద పదములను భక్తితో చెప్పినవి అని ప్రతీతి.-

 

ఉ|| శ్రీ కంఠుడను పువ్వు తుమ్మెదా!

పరమై కాంతమున వెల్గు తుమ్మెదా!

 

ఇలా తపస్సు చేస్తూ, అమ్మవారు అనుకుంటున్నారు.

 

కరమ విచారి, తద్దయు వికారి, మనంబది సారివొలెనే

తిరిగెడు కాని, దీని చలత్వము మాన్చి, నీ పదాం

బురుహములందు సంస్మరణ బొంద దయన్,

                                                సుర బృంద వంద్య,

సుస్థిరముగ నిల్పు, తత్త్వవిధి తెల్పు, సమస్థితి సల్పు శంకరా!

 

శంకరా, ఈ మనస్సు తెలివితక్కువది. మాటి మాటికీ, పలు వికారాలు పొందుతుంటుంది.

కుమ్మరి చక్రంలా(సారి లా) గిరగిరా తిరుగుతూ ఉంటుంది. క్షణకాలము ఎక్కడా నిలబడదు.

ఈ తిరుగుళ్ళు ఆపి, నీ పాదపద్మాలను సుస్థిరతతో స్మరించే అనుగ్రహం ప్రసాదించు స్వామీ, శివా! అని ప్రార్థిస్తుంది.

పాల్కురికి సోమనాథుడు-

వీరశైవాంధ్ర వాజ్మయమునకు మల్లికార్జున పండితారాధ్యుడు బ్రహ్మవంటివాడయినచో, పాల్కురికి సోమనాథుడు విష్ణువు వంటివాడు.

ప్రాచీన కవులలో ప్రముఖుడు, శివతత్త్వ విశారదుడు అయిన ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడు. ఈతని కవితా సృష్టి అంతయూ శైవతత్త్వానుగుణంగా నడుస్తుందని ఓ భావన.

పాల్కురికి సోమనాథుడు నివసించినది వరంగల్ సమీపాన, నల్గొండ జిల్లా, జనగామ తాలూకాలోని పాల్కురికి గ్రామము.

దేశికవితా చంధస్సున, దేశీయ కవితా శైలిలో ద్విపద కావ్యంగా బసవపురాణము అనే గ్రంధాన్ని రచించాడు.

ఇతని ఇతర రచనలు - పండితారాధ్య చరిత్రము, వృషాధిప శతకము, బసవపురాణము మొ||నవి.

 

ఉదా||

 

కం|| దేవా సంసారాంబుధి

లో వెలువడ చేసి ప్రమధలోకం బెరుగన్

నా వాడు వీడు నుండి

నావే, నన్నుంపవే, గణంబుల నడుమన్

 

పాల్కురికి వారి శబ్ధ గాంభీర్యతకు, అర్ధ గౌరవానికి ఉదాహరణ (వృషాధిప శతకము నుండి).

తజ్ఞ!జితప్రతిజ్ఞ! యుచితప్రమధానుగతజ్ఞ, నమ్రదై

వజ్ఞ! కళానిధిజ్ఞ! బలవచ్చిన భక్తి మనోజ్ఞ! దూత

స్త్రజ్ఞ! సునాద పూరిత రసజ్ఞ!తృణీకృత పంచ

యజ్ఞ, సర్వజ్ఞ, శరణమయ్య బసవా! బసవా!వృషాధిపా!

పాల్కురికి సోమనాథుని బసవపురాణమున 

"ఉరుతిర గద్య పద్యోక్తుల కంటే

సరసమై పరిగిన జాను తెనుంగు

చర్చింపగా సర్వ సామాన్యమగుట

గూర్చెద ద్విపదలు...."

 

ప్రాచీన కాలం నుండి దేశమున జీర్ణమైయున్న గేయరచనమును సర్వజనాదార పాత్రము చేసి, సారస్వత గౌరవము కల్పించి, అందు రచన చేసిన వారిలో ప్రథముడు పాల్కురికి సోమనాథుడు. మతప్రచారమునకై ఈ గ్రంధముద్దేశించబడింది కనుక, ద్విపద ఛందస్సు పాటలాగ పాడుకునే వీలు కల్పించాడు.

 

పిడపర్తి వారు తన బసవపురాణం పీఠికలో ఇలా పేర్కొన్నారు.-44సీ|| బసవ పురాణంబు, పండితారాధ్యుల చరిత్రంబు,అనుభవ సారమును, చతుర్వేద సూక్తులు,

సోమనాథ భాష్యంబు, శ్రీరుద్రభాష్యంబు,

బసవరగడ, సద్గురు రగడ,

చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య

వృషాధిప శతకంబు, నక్షిరాంక

 

తే|| గద్య పద్యములన్, పంచప్ర్కార గద్య ఇష్టకము

నాదిగా కృతుల్, భక్తి హితార్థబుద్ధి

చెప్పెనని, భక్త సభలలో చెల్లుచుండు.

 

పాల్కురికి వారి పోకడలలో కొంత బమ్మెరపోతనామాత్యుల వారి శైలి వలె పోలి ఉంటాయి.

 

ఉదా|| మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు బోవునే మదనములకు...

పై పద్యానికి సోమనాథుని ద్విపదను మాతృకగా పేర్కొంటారు.

పాల్కురికి వారి రచన- (బసవ పురాణం)

 

" క్షీరాబ్ది లోపల క్రీడించు హంస

గోరునే పడియల నీరుద్రావంగ....

జాతి ఫలములు చుంబించి చిలుక

బ్రాతి బూరుగు పండ్లుకంగొనునే...

రాకాకమల జ్యోత్స్న ద్రాపు చకోర

మాకాంక్ష సేయునే చీకటి ద్రావ,

విర దమ్మి వాసన విహరించు తేటి

పరగొని విరియునే ప్రబ్బిల విరుల

యరుదగు లింగ సదర్థుల ఇండ్ల

శరవుడ నాకొక సరకె అర్థంబు.

పాలకడలి లో విహరించు హంస మడుగు నీరు తాగ కోరనట్టుగా, జాతి ఫలముల తీయదనాన్ని రుచి చూసిన రామచిలుక బూరుగుపండ్ల వంక చూడనట్టుగా కమలాలు విరిసే వెన్నెలలు గ్రోలిన చకోరము చీకటిని కోరనట్టుగా మనోహర పుష్పాల సుగంధాల మధ్య విహరించిన తేటికి గడ్డిపూలని ఆఘ్రాణించనట్టుగా అరుదైన లిగసదర్థుల ఇండ్లలోనే నాకు అర్థం (తప్ప తక్కినవి పట్టవని భావము.)

ఈ కవి సుమారు క్రీ.శ. 1220 పూర్వపువాడని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు నిర్ధారించిరి. ఇతను ఇతర గ్రంధములలోని విషయములను కూడ శైవమతానుకూలముగా అన్వయించినాడు. పరమ నిష్టాగరిష్టుడై, వీరశైవ మతమును పూర్తిగా విశ్వసించాడు. తన కవితలను మతప్రచారమునకై రచించినా, కావ్యగౌరవము బాగుగా పోషించాడు.

****

సశేషము.

నాందీ వచనం:

తెలుగు సాహితీకోశం సుసంపన్నం. ప్రాంతాలవారీగా తెలుగు రచయితలు చేసిన సాహితీ సేద్యాన్ని విశ్లేషించే ప్రతీ సందర్భంలో  కాలానుగుణంగా సాహిత్యం విరాజిల్లిన వైనాన్ని చక్కగా విశ్లేషిస్తారు ప్రసాద్ గారు.

హ్యూస్టన్ లో  ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడ్డ ప్రపంచ తెలంగాణా కన్వెన్షన్ లో తెలంగాణా ప్రాంతానికి చెందిన సాహిత్య వైభవాన్ని ప్రసాద్ తుర్లపాటి గారు ప్రసంగించారు. ఆ ప్రసంగపాఠాన్ని మరింత విస్తృత పరిచి, మరిన్ని వివరాలు పొందుపరుస్తూ తెలంగాణా సాహిత్యం పరిఢవిల్లిన క్రమాన్ని, ఆయా రచయితల శైలిని మన madhuravani.com పత్రికకై అందివ్వనున్నారు. ముందు ముందు మరింత ఆసక్తికరంగా మారనున్న ఈ శీర్షికలో తొలి భాగం ఈ సంచికలో...

Bio

ప్రసాద్ తుర్లపాటి

సాహిత్యం పట్ల, అందునా ప్రాచీన సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కల ప్రసాద్ తుర్లపాటి గారు విభిన్న కవితా శైలులని, కవులు మరియు రచనలని చక్కగా విశ్లేషిస్తారు. 

మూడు దశాబ్ధాలుగా సాంకేతిక రంగంలో కీలక పదవులెన్నో నిర్వహించి, టీ.సీ.యెస్ లో ఉన్నతోద్యోగం చేస్తున్న ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో జన్మించారు.

సాహితీ విభాగంలో కృషికి గానూ 2016 లో NATA వారి Excellence Award అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు సాధించారు. ప్రస్తుతం శాన్ ఆంటోనియోలో వాస్తవ్యులైన వీరు నగరంలోని హిందూ టెంపుల్ పాలకమండలి సభ్యులు గా వ్యవహరిస్తున్నారు. 

***

bottom of page