MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
తెలుగులో ప్రబంధ సాహిత్యము
ప్రసాద్ తుర్లపాటి
వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగము గా కీర్తించబడిన యుగము ప్రబంధ యుగము.
సంస్కృతములో దండి చెప్పిన సర్గబంధ ప్రక్రియను 12 వ శతాబ్దానికి చెందిన నన్నెచోడుడు తెలుగులోకి తీసుకుని వచ్ఛాడు.
ఈ లక్షణాల ప్రకారము అతను రచించిన కావ్యమే కుమార సంభవము. నన్నెచోడుడు అవతారికలో చెప్పినట్లు -
"వన, జలకేళి, రవిశశి
తన యోదయ, మంత్ర, గతి, రతక్షితిప, రణాం
బునిధి, మధు, ఋతు, పురోద్వా
హ, నగ, విరహ, దూత్య వర్ణనాష్టాదశమున్ "
తరువాత, అల్లసాని పెద్దన వంటి కవులు కూడా సర్గబంధ లక్ష్యనానుసారమే, ప్రబంధాలను రచించారు. రాయల వారి యుగము ప్రబంధ యుగమని చెప్పవచ్చును. అల్లసాని వారి మనుచరిత్ర, నంది తిమ్మన పారిజాతపహరణము, శ్రీకృష్ణ దేవరాయల వారి ఆముక్త మాల్యద, రామరాజ భూషణుని వసు చరిత్ర, తెనాలి రామలింగని పాండురంగ మహాత్యము, దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహత్యము, చేమకూర వేంకటకవి విజయ విలాసము మొదలగునవి ప్రబంధాలు.
ఇక కల్పిత కధలైన పింగళి సూరన కళాపూర్ణోదయము, మాదయ గారి మల్లన రాజశేఖర చరిత్రము, కందుకూరి రుద్రయ నిరంకుశోపఖ్యానము కూడ, ప్రబంధ రచనలు గానే పరిగణింపబడుచున్నవి.
ప్రబంధ రచనల లక్షణాలు :
1. స్వతంత్ర రచనలు
2. అనువాదం కాదు
3. కధ, పురాణేతిహాసాల నుంచి గ్రహించినదై వుండాలి. అది ప్రధాన కధలోని ఘట్టం కాని, ఉపకధ కాని అవుతుంది.
4. ఏక నాయకత్వం, వస్తైక్యం వుంటాయి
5. అస్టాదశ వర్ణనలు
6. అలంకార శైలి, అర్ధాతిశయమైన శబ్దము, శృంగార రస ప్రాధాన్యము
7. సజీవ పాత్ర చిత్రణ
వసు చరిత్ర కావ్య పరిచయము -
ఆంధ్ర పంచ మహా కావ్యాలలో ద్వితీయమైననూ, అద్వితీయ కవితా శిల్పముచే రాణించిన ప్రబంధము వసు చరిత్రము. ఈ ప్రబంధము యొక్క గ్రంధకర్త రామ రాజభూషణుడు, భట్టుమూర్తి అని ఇతనికి నామాంతరము.
పింగళి లక్ష్మీకాంతం గారి మాటల్లోనే చూస్తే - "ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. ఇతనికే శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు “ . ఈ అభిప్రాయంతో ఏకీభవించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
వసుచరిత్రను చదవనివాడు విద్వాంసుడే కాదన్న పండితాభిప్రాయమున్నది. మహాభారత ఆది పర్వములోని ఉపరిచర వసుచరిత్రము అన్న కధను తీసుకొని గిరికా వసురాజుల ప్రణయ వృత్తాంతము ఇతివృత్తముగా రచించబడినది ఈ ప్రబంధము. వర్ణనా చాతుర్యము చేతనూ, అలంకార విన్యాసము చేతను భాషా ప్రౌఢిమచేతనూ కవితాపాటవము చేతనూ వసుచరిత్ర ఆరు అశ్వాసముల మహా ప్రబంధా రచించబడినది. ఇందలి ప్రతి పద్యమూ రసవంతము, ప్రతి శబ్దమూ అర్ధవంతము. ఆంధ్ర వాజ్గ్మయచరిత్ర యందు వసు చరిత్ర వొక అపూర్వ సృష్టి.
ఇది భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.
ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మనమంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలహలునికి, శుక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం. వసురాజే (ఉపరిచర వసువే) మహాభారత కధకు మూల పాత్ర. యోజనగంధి గా పేరుగాంచిన సత్యవతికి జన్మనిచ్చిన తండ్రి.
వసుచరిత్రలో శుక్తిమతీ కోలాహల వృత్తాంతం అత్యంత రమణీయమైన ఘట్టం. ఈ సందర్భంలో కవి నదీ పర్వతాలకు దైవీరూపాన్ని ఆపాదించి రచించాడు. ఇలా రచించడం చమత్కారానికి మాత్రమే కాదు లౌకికానుభవానికి సంబంధించిన రాగబంధు రీతులను తెలియపరచడానికి అని అనవచ్చును.
వసు చరిత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందలి పద్యములు శ్లేషాలంకార భరితములు, సంగీతము విన్నట్లుగా చదువుకొనవచ్ఛును.
కొన్ని ఉదాహరణలు:
1. ఇష్ట దేవతా స్థుతి
శ్రీభూపుత్రి వివాహ వేళ నిజమంజీరాగ్ర రత్నస్వలీ
లాభివ్యక్తి వరాంఘ్రిరేణు భవకన్యాలీయటంచున్ మదిం
నా భావింప శుభక్రమాకలనచే దద్రత్నముం గప్పు సీ
తా భామాపతి బ్రొవుతం దిరుమలేంద్ర శ్రీ మహారయనిన్ !
ఇది సీతారాముల వివాహ వేడుక పద్యం. రామరాజ భూషణుడు రామ భక్తుడు. కళ్యాణాత్మకమైన పద్యం తో వసుచరిత్ర ప్రబంధము ప్రారంభమైనది. సీత పెళ్ళి పీటలపై తలవంచుకోని కూర్చుని ఉన్నది. ఆమె పాదాలపై అలంకారముగా నున్న రత్నములో ఆమె ముఖములో ప్రతిబింబించింది. అది చూసి ఆమె రామ పదరేణువు సోకి కాలి ఆభరణములోని రత్నం స్త్రీ ఐనదేమో అని కంగారు పడింది. అది గమనించిన రామచంద్రమూర్తి తన కాలి బొటనవేలు నొక్కే నెపంతో మూశాడు. ఆ శ్రీరాముడు కృతిపతియైన తిరుమలరాయని రక్షించు గాక.
2. వసంత శోభ వర్ణన
లలనా జనాపాంగ వలనా వసదనంగ
తులనాభికాభంగ దో:ప్రసంగ
మలసానిల విలోల దళసాసవ రసాల
ఫలసాదర శుకాల పన విశాల
మలినీగరు దనీక మలినిఏకృత ధునీ క
మలినీ సుఖితకోక కుల వధూక
మతికాంత సలతాంత లతికాంత రనితాంత
రతికాంత రణతాంత సుతనుకాంత
మక్రుత కామోద కురవకా వికల వకుల
ముకుల సకలవనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు
రామరాజ భూషణుడు మహా సంగీత వేత్త. గొప్ప వైణికుడు. ఆయన వీణ మీద వాయించి వినిపించేవాడట. ఈ పద్యశ్రవణమే మనస్సును రాగ రంజితము చేస్తుంది. వాగార్ధములు సమంగా మేళవించిన ఈ పద్యం ఒక సంగీత రసఝరి.
ఈ సీస పద్యములోని తొలి పాదములో స్త్రీల క్రీగంటి చూపులతో పరవశిస్తున్న కాముకుల కౌగలింతలున్నాయి. రెండవపాదములో మందమారుతములో కదిలే తీయని మామిడి చిగురుటాకుల తినే రాచిలుకలున్నయి. మూడవపాదములో ఆడతుమ్మెదల సమూహపు రెక్కలచేత నల్లగా ఐఎన తామర తీగలలో దాగున్న చక్రవాక పక్షులున్నాయి. నాలుగవ పాదములో పూపొదరిళ్ళలొ జంటలున్నాయి. ఇక యెత్తుగీతలో, గోరంటపూల మొగ్గలు, కోయిల పాటలున్నాయి. ఈ విధముగా పద్యమంతా వసంత శోభతో శోభిల్లుతున్నది.
3. తరుణుల నాసికా వర్ణన
నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మే
లా న న్నొల్లదటంచు, గంధఫలి బల్కాకం తపంబంది యో
షానాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్యసంవాస మై
పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబునిర్వంకలన్
తరుణుల ముక్కుని సంపెంగ పూవుతో పోలుస్తారు. అనేక పుష్పాల మీద వాలి మకరందాన్ని అస్వాదించే తేటి (తుమ్మెద) నా వద్దకు ఎందుకు రాదు ? అని సంపెంగ పూవ్వు ఒక మండు వేసవిలో (బల్ కాకన్) తపస్సు చేసింది ( వేసవిలో సంపంగి పూవులు పూయవు .. అది ఇక్కడి చమత్కారము ). ఆ తపస్సు ఫలితంగా స్త్రీ యొక్క ముక్కు (నాసిక) అకారాన్ని పొంది అన్ని పువ్వుల యొక్క సౌరభ్య - సువాసనకు స్తానమై (సంవాసియై), ఒకటి కాదు, రెండు తుమ్మెదల్ని తన కిరువైపులా ( ముక్కుకు ) (ఇర్వంకలున్) నిత్యం ఉండే కంటి చూపులు ( ప్రేక్షణ) అనే ఆడు తుమ్మెదల (మధుకరీ) వరుసల్ని (పుంజమ్ములన్) పూనింది. తపస్సు చేసినంతనే దాని కోరిక తీరింది. ఆ సంపెంగ పూవు స్త్రీ యొక్క ముక్కువలే జన్మనెత్తింది. మరి దాని కొరిక యెలా తీరింది ? కంటి చూపులు అనబడే ఆడ తుమ్మెదల వరుసల్ని ఇరువంకల పూని యున్నది కావున.
ఈ పద్యం నంది తిమ్మన (ముక్కు తిమ్మన) రచించిన పిదప రామరాజ భూషణుడు తన వసుచరిత్రలో వాడుకొనడం జరిగిందని కొంత వాదన వున్నది. ఏదైనా ఈ పద్యం వసుచరిత్ర కావ్యానికి ఎంతో శోభను చేకూర్చింది.
శ్రీ కొవెల సుప్రసన్నాచార్యులు గారన్న మాటలు, " వసుచరిత్రలోని శబ్దం కుబుసం విడువని పాము " అక్షరసత్యాలు.
ఈ విధంగా వసుచరిత్ర సుశోభితమై సాహితీజగత్తులో అజరామరంగా వెలుగొందుచున్నది.
*****