MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వంగూరి పి.పా.
మరో సారి బుల్లి తెర పరిచయ భాగోతం
వంగూరి చిట్టెన్ రాజు
మొన్న ఒక చిన్న తమాషా జరిగింది...నాకు తెలియదు కానీ ఒకానొక తెలుగు టీవీ చానెల్ కి డాలస్ లో స్టూడియో ఉందిట. వాళ్ళు పిలిచి వారి ప్రేక్షకులకి నన్ను పరిచయం చేసే ఉద్దేశ్యంతో మా ఇంటికి హ్యూస్టన్ వస్తామని ఫోన్ చేశారు. ఇప్పటికే నేను టీవీ 9, సాక్షి, ఈటీవీ, ABN ఆంధ్ర జ్యోతి వగైరాలలో తెరం గేట్రం చేసి జుట్టు పండిపోయిన వాడిని కాబట్టి ఈ తతంగం ఎలా జరుగుతుందో బాగానే తెలుసును. ఆ మాటకొస్తే ఎంత నల్లటి నల్ల నలుపు వేసుకున్నా నాది పండిపోయిన జుట్టు తెలుసు కాబట్టే నాకు ఆ తెరంగేట్రం అవకాశాలు వచ్చాయి. జుట్టు పండని వాళ్ళు కనీసం ఒక్క సినిమాలో అయినా సైడ్ కిక్ పాత్రలో అయినా కనపడితే చాలు..టీవీలో కనపడే అవకాశాలు వాటికవే వెతుక్కుంటూ వస్తాయి. అంచేత ఈ సారి కూడా “నా జుట్టుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ” ఆ ఇంటర్వ్యూ కి ఒప్పుకున్నాను. ఎందుకయినా మంచిది అని “ఏమన్నా ఫార్మాలిటీస్ ఉన్నాయా? ఉంటే ఎంతా?“ అని కూడా ఇండియా భాషలోనే ముందే అడిగేశాను. ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏమిటంటే పెళ్ళో, తద్దినమో అయ్యాక పురోహితుడు గారు “ఇక ఫార్మాలిటీస్ కానివ్వండి” అంటే ‘ఆ దక్షిణ నా మొహాన పారెయ్యండి” అని అర్థం. అలాగే మా పొలం అమ్మకానికి రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడ గుమాస్తా కూడా ఫార్మాలిటీస్ వివరాలు చెప్పాడు. మరో కొన్నేళ్లలో అక్కడ ఎవరయినా తెలుగు నేర్చుకుంటానూ అంటే వెంటనే చంద్ర బాబు నాయుడు గారికి ఫార్మాలిటీస్ చెల్లించుకునే రోజులు వస్తున్నాయి.
నా ప్రశ్నకి “మీ దగ్గర ఫార్మాలిటీస్ ఏమిటి సార్. మీ దగ్గర పుచ్సుకోం. ఏమన్నా ఎలక్షన్లలో నుంచుంటే చెప్పండి.” అని సమాధానం వచ్చింది. ఆ సమాధానం లో నాకు రెండు సమాధానాలు వినపడ్డాయి. ఒకటేమో ”అమెరికాలో జాతీయ తంటా సంఘాల ఎన్నికల సమయంలో ఆయా సామాజిక వర్గం వారు తప్ప డబ్బిచ్చి టైము కొనుక్కునే వాళ్ళు మీ వాళ్ళలో లేరు...అనగా నా సామాజిక వర్గం లో లేరు అన మాట“. కులం పేరు చెప్తే ఎక్కడ కొంప ములుగుతుందో అని ఈ రోజుల్లో “సామాజిక వర్గం” అని చెప్పకనే చెప్తూ ఉంటారు టీవీ వాళ్ళు, రాజకీయం వారూనూ. రెండోదీ, అసలైన సమాధానం ఏమిటీ అంటే “ఇవ్వడానికి నీ దగ్గరేం ఉందోయ్ బడుద్దాయ్. నీ సంగతి మాకు పూర్తిగా సమఝ్ ఐతది” అని ఒక వ్యంగ్యం. మొత్తానికి మళ్ళీ మరొక సారి ఉచితంగా టీవీ లో కనపడే ఏర్పాటు జరిగింది. స్క్రిప్ట్ కూడా నా దగ్గర ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా, నేను చెప్పదల్చుకున్నది మాత్రమే చెప్తాననమాట.
యధాప్రకారం ఒప్పుకున్న సమయానికి గంట తరవాత ఆ చానెల్ అమెరికా సీయీవో గారు, ప్రొడ్యూసర్, ఒక కెమేరా మనిషి, ఇద్దరు ఆడ పిల్లలు మా ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి అంద చందాలు చూడగానే ఏంకరమ్మాయి అని అనుమానం వేసింది. నోరు విప్పి రెండు మాటలు మాట్లాడగానే అది కన్ ఫర్మ్ అయిపోయింది. ఆ రెండో అమ్మాయి పాపం చాలా మంచి అమ్మాయే కానీ, చేతుల్లో ఇమిడి పోయే యోడా అనబడే మా చిన్న కుక్క పిల్లని ని చూడగానే ఎగిరి గంతేసి..అంటే ఆనందంతో కాదు సుమా....హడిలి చచ్చిపోయి ...బెంచీ ఎక్కేసింది. అనగా సోఫా లో ముడుచుకుని భయం భయంగా కూచుండి పోయింది. “హారినీ..ఈ కుక్క పిల్ల నా టీవీ ఇంటర్వ్యూ అవకాశాన్ని చెడగొట్టేసిందే” అని నేను అనుకుంటూ ఉంటే అది చూసి పాపం జాలి వేసి ఆ కుక్క యజమాని...అంటే మా పెద్దమ్మాయి ఆ కుక్క పిల్లని ఎక్కడో దాచేసి వాతావరణం తేలిక పరిచింది.
మొత్తానికి కెమెరా మనిషీ, ప్రొడ్యూసరూ, ఆ అమ్మాయీ మాట్లాడుకుని మా ఇంట్లో ఉన్న సోఫాలనీ, మొక్కలనీ, బల్లలనీ అటు ఇటూ తిప్పేసి నా ఇంటర్వ్యూ జరగ వలసిన నేపధ్యం హంగులు...అనగా బేక్ డ్రాప్ తయారు చేశారు. అంటే మా లివింగ్ రూమ్ యదాతధంగా టీవీ లో కనపడడానికి పనికి రాదు అని నాకు తెలిసి పోయింది. ఈ పర్నిచర్ మార్పిడి తతంగం జరుగుతూ ఉండగా ఏంకరమ్మాయి మా లైబ్రరీ గదిలో పుస్తకాలు, నాకు వాళ్ళూ, వీళ్ళూ ఇచ్చిన పతకాలూ, ప్రశంసా పత్రాలూ పరిశీలించడం మొదలుపెట్టింది. ఆవిడ తిరగేస్తున్న పుస్తకాలు అన్నీ ఇంగ్లీషువే. వాటి పక్కనే నా పుస్తకాలు కూడా ఉన్నా వాటిజోలికి వెళ్లక పొవడంతో నేను అవమాన భారం భరించ లేక “నీకు తెలుగు చదవడం వచ్చా?” అని ఆ అమ్మాయిని అడిగేశాను. “ఆఫ్ కోర్స్. ఐ కెన్ రీడ్ తెలుగు” అని సొగసుగా బాపు గారు ముఖ చిత్రం వేసిన నా పుస్తకం తీసి టైటిల్ చదివేసి నా కేసి గర్వంగా చూసింది. నేను కూడా అంతే గర్వంగా ఆ అమ్మాయి కేసి చూసి “అది ఎవరు వ్రాశారో తెలుసా?” అని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి ఆ పుస్తకం అట్ట మీద నా పేరు చూసి “ఇక్కడ మీ పేరు ఉందే. మీరు కథలు రాస్తారా?” అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్య పోయింది. నేను కూడా అదే విధంగా నా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మూర్చ్చపోయాను. ఎందుకంటే నా గురించి ఆ మాత్రం కూడా తెలియకుండా, తెలుసుకోకుండా నన్ను ఆ అమ్మాయి వారి టీవీ ప్రేక్షకులకి ఎంత గొప్ప పరిచయము చేయునూ అనే విపరీతమైన ఆశ్చర్యమే నా మూర్చ్చ కి కారణం.
నేను తేరుకుని, ఆ ఏంకరమ్మాయి తో నా అవ”మాన భంగాని”కి రెడీ అయిపోయాను. అప్పుడు అసలు విషయం బయట పడింది. అదేమనగా ఆ అమ్మాయీ, నేనూ మా ఆసనాలలో ఎవరి కెమెరా ఎదురుగుండా గుడ్లప్పగిస్తూ కూచుని ఉండగా ఆ ప్రొడ్యూసర్ మహాశయుడు ఆ అమ్మాయి చేతిలో రెండు కాగితాలు పెట్టి “ఓ సారి చదువుకుని రిహార్సల్ వేసుకో” అని ఆదేశించాడు. ఆ కాగితాలలో అడగవలసిన ప్రశ్నలు ఉన్నాయన మాట. ఈ అమ్మాయి చెయ్య వలసిన పనల్లా ముందు ప్రశ్న చదువుకుని, గుర్తు పెట్టుకుని కెమరా వాడు “ 1, 2, 3” అనగానే అందంగా కనపడుతూ, నవ్వుతూ ఆ ప్రశ్న అడిగెయ్యడమే. దానికి నేను సమాధానం చెప్తున్నప్పుడు కెమెరా బా వేపు ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి తరవాతి ప్రశ్న బట్టీ పదుతూ ఉంటుందన మాట. నిజానికి ఏదో మాట వరసకి నాకేసి ఓ చూపు పారేసినా ఆవిడ చూపులన్నీ కెమెరా వేపే. నేనేమో ఆ ప్రశ్నలు వింటున్నట్టు ఓవర్ ఏక్షన్ చేసేస్తుంటే ఒక సారి ఆ కెమెరా వాడు ఆపేసి “మీరు మామూలుగా ఉండండి చాలు” అన్నాడు. “ఓరినీ నీ వెధవ మర్యాద తగలడా” అనుకుని నేను తల ఊపడం, ఆ పిల్ల కేసి చేతులు చాపడం వగైరా చేష్టలు కట్టి పట్టి చేతులు కట్టుకుని “రాముడు మంచి బాలుడు” లా ఆ గంటన్నర ఇంటర్వ్యూ పూర్తి చేశాను. చాలా ఇంటర్వ్యూ లలో సాధారణం గా “మీరు ఎప్పుడు పుట్టారు?” అనే ప్రశ్న తో మొదలు పడతారు. వీళ్ళు మటుకు ఒక వినూత్నమైన పద్దతిలో “మీ జీవితంలో ఇంకా సాధించవలసినవి ఏమైనా ఉన్నాయా?” అనే ప్రశ్న తో మొదలు పెట్టారు. ఆ ప్రశ్న సరిగ్గా అర్థం కాక పాపం ఆ అమ్మాయి “మీరింకా ఎన్నేళ్ళు ఉంటారు?” అన్నట్టుగా అడిగింది. ఇక మిగతా ఇంటర్వ్యూ అంతా ఎలా జరిగిందో ఊహించుకో వచ్చును కదా!
కొస మెరుపు...కొంప ములగడమే...ఏమిటంటే నేను వాళ్ళు రాగానే వాళ్ళ కారుని మా డ్రైవ్ వే లో పార్క్ చెయ్యమని చెప్పడం మర్చిపోయాను. మా పేటలో ఒక దిక్కుమాలిన రూల్ ఉంది. అదేమిటంటే కార్లు డ్రైవ్ వే లో తప్ప రోడ్డు మీద పార్క్ చెయ్యకూడదు. ఏదైనా పార్టీ లాంటిది ఉంటే ముందే మా హోం ఓనర్స్ మేనేజే మెంట్ వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పకుండా రోడ్డు మీద కారు పార్క్ చేస్తే అర గంట లో వచ్చి “కారు టోయుట”..అనగా పట్టుకెళ్ళి బందుల దొడ్డిలో పెట్టేస్తారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. మేము ఇంట్లో నా ఇంటర్వ్యూ తతంగంలో ఉండగా బయట ఆ టీవీ వారి కారు మాయం అయిపోయింది. చచ్చినట్టు ఆ “కారు బండుల దొడ్డి” కి వెళ్లి “ఫార్మాలిటీస్” చెల్లించి ఆ కారు విడిపించుకుని వచ్చాను. ఈ దెబ్బకి ఆ ప్రొడ్యూసర్ గారి అహం బాగా దెబ్బతిని నా ఇంటర్వ్యూ అసలు టీవీ లో రాకుండా కేన్సెల్ చేసి పారేస్తాడామో అని అనుమానం గా ఉంది.
ఈ హడావుడిలో ఆ ఏంకరమ్మాయి ఫోన్ నెంబర్ అడగడం మర్చిపోయాను...ఆ ప్రొడ్యూసర్ నెంబర్ ఉంది కానీ ఆ అమ్మాయి వివరాలు చస్తే ఇవ్వడు కదా!