MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
చట్టసభల్లో భాష
శ్రీనివాస్ పెండ్యాల
" చట్టసభల్లో భాష”! అదేంటి భాష ఎక్కడైనా భాషే కదా? చట్ట సభలకి ప్రతేకంగా వేరే భాష వుంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందీ, ఉండాలి అని అంటాను.
ఎందుకో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను.
ముందుగా,వాక్కు యొక్క విశిష్ఠత, దాని లక్షణం గురించి రెండు మాటలు చెబుతాను.
ఈ సమస్త ప్రాణికోటిలో ఆ మూల స్వరూపిణి వాగ్దేవి మనుష్య జాతికి మాత్రమే ఇచ్చిన వరం ఏదయినా వుందీ అంటే అది కేవలం వాక్కు.
లలితా సహస్రం లో ఒక్క మాట చెప్తారు **** మూల ప్రకృతి రవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణి *** అనగా ఆ మూలస్వరూపిణే ఈ సమస్త ప్రకృతి. అమ్మ తానుగా వ్యక్తీకరిస్తుంది. లేదా తన సృష్టి తో వ్యక్తీకరింప చేస్తుంది.
ఆ అమ్మ మనుష్య జాతికిమాత్రమే ఇచ్చిన అదనపు వరం- వాక్కు తో కూడిన విచక్షణ.
ఇక భాషా భారత దేశం విషయానికొస్తే
భారతదేశం గొప్పతనమేమంటే ఇక్కడ ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు తమ నడవడిక తో భవిష్యతరాలకు ఒక చక్కటి మార్గదర్శకం చేసారు. అంతెందుకండీ… సాక్షాత్తు ఆ మహా విష్ణువే అవతార పురుషుడై రాజై రాజ ధర్మాన్ని నేర్పించాడు.
రాజులు రాజ్యాలు రాశులు రత్నాలు పోయి ప్రజా రాజ్యాలు వచ్చాక, దేశ స్వరూపాలు ఎలా మారాయో చూస్తూనే ఉన్నాము!
చట్ట సభల గురించి మాట్లాడేముందు భారత రాజ్యాంగ నిర్మాణం, చట్ట సభల ఏర్పాటు ఎలా జరిగిందో మీ అందరికీ ఒకసారి గుర్తుచేస్తాను.
యావత్ భారత దేశానికి ఒకే రాజ్యాంగం అవసరం అని దాన్ని నిర్మించడానికి ఒక చట్టబద్దమైన కమిటి అవసరం వుంది అని 1934 లోనే గుర్తించారు. ఎం.ఎన్.రాయ్ గారిని ఇందుకు ఆద్యుడుగా పేర్కొంటారు. వీరు రాజ్యాంగం కొరకు కొంత ఉద్యమాన్ని కూడా నడిపినట్లు ఆధారాలున్నాయి.
డిసెంబర్ 6, 1946 లో రాజ్యాంగ కమిటి ని ఏర్పరచారు. యాధృచ్చికంగా ఇప్పుడు ఈ డిసెంబర్ 6 వ తేది ని మరొక మత పరమైన వివాదం వల్ల బ్లాక్ డే గా కొంత మంది పాటిస్తుంటారు. అది వేరే విషయం.
స్వాతంత్రం పూర్వం 389 మంది సభ్యులతో ఏర్పడిన కమిటీ స్వాతంత్రం తరువాత దేశ విభజన కారణంగా 299 మంది సభ్యులకు కుదించబడింది. ఈ కమిటీ అంతర్గతం గా మరో 13 ఉప కమిటీ లను ఏర్పరచి వివిధ అంశాలపై లోతయిన అధ్యయనం చేసింది.
వీటిలో ఒక ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. దీనికే డాక్టర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు గా ఉండేవారు. సమాచార క్రోడీకరణకు నియమించబడిన ఈ కమిటీలో సభ్యుల సంఖ్య 6.
కమిటీ చివరి సమావేశంలో డా అంబేద్కర్ గారు మాట్లాడుతూ ‘రాజ్యాంగ స్పూర్తికి సభ్యులందరూ మరీ ముఖ్యంగా బెనెగల్ నార్సింగ్ గారు విశేష కృషి చేసారని’ ప్రశంసించారు.
వివిధ కమిటీలు సుమారు 60 దేశాల రాజ్యాంగాలని పరిశీలించారు. అందులో ముఖ్యంగా ఇంగ్లాండ్, అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడ, సోవియట్ యూనీయన్ లాంటి 10 దేశాల రాజ్యాంగాలను నమూనాగా స్వీకరించారు
కమిటీ చివరి సమావేశం జనవరి 24 1950 లో జరగగా, జనవరి 26 వ తేదిన రాజ్యాంగాన్ని ఆమోదించారు.
ఇక రాజ్యాంగం లోని కొన్ని మూలాలలోకెళితే…
ఇగ్లాండ్ రాజ్యాంగాన్ని నమూనా గా తీసుకొని భారత రాజ్యాంగం లో స్పీకర్ వ్యవస్థని ఏర్పాటు చేసారు.
రాజ్యాంగ కర్తలు ఆర్టికల్ 170 ప్రకారం స్పీకర్ గారికి ఎన్నో విశేషాధికారాలను, విచక్షణాధికారాలను కల్పించారు. ఈ అధికారాలను దాదాపుగా ఏ కోర్టులు కూడా సమీక్షించ లేవు. బహుషా వారు స్పీకర్ గారిని దేవేద్రుడిగా భావించి ఉండవచ్చు.
వీటికి ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన పార్టీ ఫిరాయింపులాంటి కొన్ని చట్టాలకు మినహాయింపు అనుకోండి.
ఇక భాషా, వాటి రికార్డులకి సంబంధించి మరికొన్ని ఆర్టికళ్ళని పరిశీలిస్తే-
ఆర్టికల్ 171, 178 ప్రకారం సభను సమావేశపరచి, సభా కార్యక్రమాన్ని రికార్డ్ ల రూపంలో పొందుపరవడం జరుగుతుంది.
లోక్ సభ, రాజ్య సభల వ్యావహారిక శైలినే రాష్ట్ర శాసన సభలుకూడా అనుకరిస్తాయి. ఆర్టికల్ 105 ప్రకారం ఏ సభ్యుడు సభా మర్యాదలకు భంగం కలిగేలా ప్రవర్తించుటకు అనుమతించబడదు.
ఆర్టికల్ 380, 381 ప్రకారం రాజ్యాంగం గుర్తించిన భాషలు, మాండలికాలు, రాష్ట్రా సాంప్రదాయాల పరంగా సభలో వాడకూడని పదాలు, వ్యాఖ్యలు తో కూడిన సుమారు 900 పేజీల పుస్తకం అన్ని భాషలలో అందుబాటులో ఉంచారు. అలాగే సభ్యుల ప్రమాణస్వీకారం తో ఈ పుస్తకం ఇవ్వబడుతుంది.
ఉదాహరణకి
"భద్మాష్" అనే పదం మధ్య ప్రదేశ్ రాష్ట్ర పరంగా అభ్యంతరకరమైనది గా గుర్తించారు.
స్పీకర్ స్థానంలో ఓ స్త్రీ మూర్తి ఉంటే "Beloved madam speaker" సంభోదించకూడదు.
ఎలుక, గబ్బిలం లాంటి జీవాలతో పోల్చకూడదు. బహుషా మన నాయకుల పోలిక తో ఆ జంతుజాలాల మనోభావాలు నొచ్చుకుంటాయనే కాబోలు. అంతే కదండీ? దున్నపోతు మీద వానపడినట్లు అని పోల్చితే దున్నపోతు గారు, “అదేంటి నేను ఇంత క్రమశిక్షణగా వుంటే ఇలా పోలుస్తారు” అనుకుంటుందేమో
దొంగలు, సోమరి, మూర్ఖులు అని కూడా అనకూడదు.
అబద్ధం, మోసకారి లంటి పదాలు కూడా నిషిద్ధం!
ఈ రెండు పదాలు చెబుతుంటే. ఇటీవలి ఒక సంఘటన గుర్తుకొస్తుంది. రాజ్య సభ Chairman శ్రీ వెంకయ్య నాయుడు గారు రాజ్య సభలో ఒక సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని మోడీ గారు వాడిన పదం "అబద్దం" అలాగే ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్ గారు వాడిన పదం "మోసపూరితం" రికార్డుల నుండి తొలగించారు.
రోజువారీగా, వారాంతంగా స్పీకర్ ప్రసంగాల రికార్డులను పరిశీలించి అమోదించవలసి వుంటుంది. సభ్యుడెవరైనా పొరపాటున మాట తూలితే, దాన్ని తొలగించి వాటి స్థానంలో *** చుక్కలుగా రికార్డ్ చేయడం ఒక ఆనవాయితి. అంటే TV లలో వేసే టూఊఊఊ beep sound లాంటిది.
అప్పట్లో ఎలాంటి చుక్కలూ లేని ప్రసంగాలు చేసిన శ్రీ పి వి నరసింహ రావు, శ్రీ వాజ్ పాయ్ లాంటి ఉత్తమ పార్లమెంటేరీయన్లు ఉండేవారంటే ముందుతరాలు నమ్మలేవేమో.
రాజ్యాంగ కర్తల ఆలోచనల్లో రికార్డులంటే బహుశా ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు అలాగే సభలను ప్రత్యక్షంగా చూడలేని వారికి తమ తమ నాయకాగ్రేసరులు సభను కట్టిపడేసే వీర ప్రసంగాలు ఎలా చేసారో సరి చూసుకొవడానికి జాగ్రత్తగా పరిశీలించి గ్రంధాలయాల్లో భద్రపరిచే గంధపు చెక్కలనుకొని ఉంటారు.
మరి ఇప్పుడు రికార్డులకు ఇంకా అర్ధముందంటారా?
ప్రత్యక్ష ప్రసారాలు, మొబైల్ రికార్దింగులు అడ్డూ అదుపూ లేని TV చానళ్ళూ సభలో ఒక మాట అనీ అనగానే 10 సెకనులలో సాంఘిక మాద్యమాలలో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి.
దానికి తోడు సందర్బానుసారం గా background మ్యూజిక్కులు, లాజిక్కులు, కామెడీ ఫేసులు, లైకులు, ట్రోలింగులు, స్క్రోలింగులు అబ్బో ఎన్నో… అన్నీ రమా రమి నిమిషం లో free గా జరిగిపోతాయి ఇక అన్నవారికి, కన్నవారికి, విన్నవారికి వినిపించిన వారికి సందడే సందడి.
ఇదివరలో ప్రభుత్వ విధానాలు అసెంబ్లీ సమావేశాల్లోనే వెల్లడించేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడే అక్కడే నిర్ణయాలు, శాసనాలు! సభ లేదు. ప్రభ లేదు.
మరి రికార్డులుగా వేటినని భావించాలి? ఎప్పుడో 3 నెలలకోకసారి జరిగే అసెంబ్లీ సమావేశాలా లేక రోజూ తలంటే TV చానళ్ళా? నా దృష్టిలో అన్నీ రికార్డులే
ఉదాహరణకి కొన్ని వ్యాఖ్యలు చూద్దాం .
అత్యంత సంచలనం కలిగించిన ఓ వ్యాఖ్య … ఓ ప్రముఖ నాయకుణ్ణి ఉద్దేశించి మరోక ప్రముఖ నాయకుడన్నారిలా “నీ తల్లి గర్భం నుంచి ఎందుకు పుట్టానా?” అని అనుకుంటావు.
అలాగే ఓ మాజీ మంత్రి గారు అసెంబ్లి లో మాట్లాడుతూ ప్రతిపక్షనాయకుడిని ఉద్దేశించి “మీ ఆవేశం చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. దయచేసి అలా గుడ్లురిమి చూడమాకండీ. గుడ్లు ఊడి పోగలవు”.
మరో సందర్భంలో ప్రతిపక్షనాయకుడు ఓ మంత్రి గారినుద్దేశించి “మీరు పెద్దవారయ్యాక మతిభ్రమించింది. ఇక విశ్రాంతి తీసుకోండీ”. అన్నారు ( Age discrimination is unparliamentary )
ఓ మాజీ మంత్రిని ఉద్దేశించి "ఓ ప్రస్తుత మంత్రి గారు" పేరుతో సహా పలుకుతూ -"ఆకారం పెంచావు కాని బుద్ది పెరగలేదు.”( Body shaming )
ప్రస్తుతకాలంలో ఏక వచన ప్రయోగం గర్వ కారణం.
వీటికోసం ఏ అసెంబ్లి రిజిష్టారు ను సంప్రదించనవసరం లేదు. గూగులమ్మ ని అడిగితే చాలు.
ఇక TV ప్రెస్ మీట్లు చూస్తే అవి మరీ ఘోరం. ఈ మధ్య కాలంలో సాంఘీక మాధ్యమాల్లో ఎవరికి వారే చానళ్ళు నడుపుతున్నారు. ఆ భాషా భాగోతం వేరే స్థాయి.
ఓ నాయకుణ్ని ఉద్దేశించి మరో నాయకుడు ఇలా అన్నారు "పేరుతో సహా పలుకుతూ" నడిరోడ్డు పై కాల్చేయాలి. ప్రజాసేవ కు ఈ భాషకు ఎలాంటి లంకె కుదురుతుందనుకోవచ్చు?
వారి వారి అద్బుత పథకాలు, సేవా దృక్పథం సరళ భాషలో చెప్పలేరా? గూబ గుయ్యిమనేలా వినేవారి చెవులకు చిల్లులు పడేలా బూతు పంచాంగంలో చెప్పాలా?
ఒక మారు 60, 70 దశకాల్లో ని భాషను పరిశీలించండి. ఇప్పటి పాలకులు ఎలా దిగజారారో అర్ధం అవుతుంది. మరి ప్రజలు? కొందరు చెవులప్పగించి, కొందరు చెవులుమూసుకుని బ్రతికేస్తున్నారు.
తప్పెక్కడ జరుగుతుందీ? మితిమీరి ప్రవర్తిస్తున్న పాలకులదా? పక్షవాతం తో పని కానిచ్చేస్తున్న ప్రజానీకానిదా? ఆలోచించండి.
*****