MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
పేకాట
తమిళ మూలం:జయకాంతన్
స్వేచ్ఛానువాదం:సుందరేశన్
ప్రఖ్యాత తమిళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మరియు సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత జయకాంతన్[1934-2015] గారి ఈ కథా మూలం 1960 లో తమిళ వారపత్రిక "ఆనంద వికటన్" లో ప్రచురించబడింది. తెలుగు స్వేచ్ఛానువాదం సుందరేశన్ గారితో చేయబడింది.
జానకి ఒక కొత్త వాయిల్ చీర ధరించి గోడమీదున్న అద్దంముందు నిలబడి తను దువ్వుకున్న జుత్తుని ఇంకొకసారి సరిచూసుకుంది. చెమటవలన నెత్తిమీద కుంకుమబొట్టు కొంచెం తారుమారుగా కనిపించడం చూసి చేతివ్రేలుతో చీర మొన అందుకొని దాన్ని చిన్నదిగా దిద్దుకుంది. ‘ఇదీ బాగానే ఉంది’ ఇని తృప్తిపడుతూ, గాజుల డబ్బాలోనుంచి తను జాగ్రత్తగా నాలుగుసార్లు మడతబెట్టి కాపాడిన రెండురూపాయల నోటు బయటకి తీసింది. అప్పడే రవి - ఆమె రెండేళ్ళ పిల్లవాడు - పలుచబాఱిన తన రెండు కాళ్ళతో నేలమీద పాకుతూ వచ్చి, తల్లికాళ్ళముందు నిలబడి ఒక ఎగురు ఎగిరాడు.
పిల్లవాడిని ఎత్తుకొని, జానకి కిటికీ పక్కన కూర్చోబెట్టి, తను ఉతికిన ఒక కొత్త చొక్కాయి వాడికి తొడిగించింది. జుత్తుని లాలించి, కొంచెం తైలం రుద్ది, దువ్విన తరువాత నెమ్మదిగా పౌడరు పిల్లవాడి మొహంలో తట్టింది. బుగ్గలు తాకి మద్దాడిన తరువాత దిష్టి తీసింది. పిల్లవాడిని చంకలో ఎత్తిబెట్టుకొని గడియారం చూసినప్పుడు రెండు గంటలని తెలిసింది.
“ఏమే, ఈ మండుటెండలో పిల్లవాడిని ఎత్తుకొని సినిమాకి వెళ్తున్నావా?” తను అడిగిన ప్రశ్నకి జానకి ఎలా చిఱచిఱలాడుతుందో అని భయపడుతూనే, పొడినవ్వుతో సరస్వతీ అమ్మాళ్ నిలబడింది.
“అవును . . . వెళ్తున్నాను . . . మీకేం?”
“సరేలే, వెళ్ళమ్మా, నేను వద్దనను . . . ఎండ తీవ్రంగా ఉందని అన్నాను . . . అంతలోనే నేనేదో అత్తగారి స్థానంలో అధికారం చెలాయించుతున్నట్టు మండిపడుతున్నావే?”
“అత్తగారి స్థానంలో అధికారం చెలాయింపు వద్దని ఎవరన్నారు? కాని దానికిముందు మీ అబ్బాయికి భర్త స్థానం అంటే ఏమిటో నేర్పించండి.”
జానకి నోటినుంచి ఇలాగే - కాల్చినట్టు - తీష్ణమైన మాటలు తరచుగా వస్తూంటాయి. ‘అదీ న్యాయమేకదా?’ అని సరస్వతీ అమ్మాళ్ సహించుకుంటుంది.
“నేనేం చెయ్యను? ‘కన్నతల్లి, నా కర్మ!’ అని ఏడవలసిందే!” అని ఆవిడ తనలో గొణుక్కుంటారు.
“ఏమే, వాడికేం తక్కువ? వాడిని పెళ్ళి చేసుకొని ఒక పిల్లవాడికి తల్లైన తరువాతకూడా నీకెందుకు వాడంటే ఉదాసీనత?” అని ఒకసారి కోడలిని అడిగి దాని ఫలం ఏమిటో ఆవిడ బాగా అనుభవించారుగా? ఒకటా, రెండా, ఎన్ని మాటలు! అబ్బబ్బా!
“అవును, మీరే కన్నారు, ఆ బాధ మీరు పడవలసింది న్యాయం. దానితోబాటు నాకు చేసిన పాపంకి కలిసి ఏడవండి! . . . కణ్ణా, రా, మనం వెళ్దాం” అని జానకి పిల్లవాడిని తీసుకొని బయలుదేరింది.
“ఏమైనా, . . . నీ మొగుడితో ఒక మాట . . . ” అని అనాలని ఆవిడకి అనిపించింది, కాని నోట ఏ మాటా రాలేదు. జానకికి అదే ఆలోచన వచ్చిందేమో?
‘అవును, మహా గొప్ప మొగుడు! అని గొణుక్కుంటూ ఆమె వీధిలోకి దిగి నడిచింది.
సరస్వతీ అమ్మాళ్ ఆమెను చూస్తూ గడపదగ్గర నిలబడ్డారు.
మే మాసం, వేసవి కాలంలో, నల్లటి టార్ రోడులో, పాదరక్ష లేకుండా, పిల్లవాడిని చంకలో పెట్టుకొని జానకి నడుస్తోందే? అసలు సినిమా అంటే దానికి అంత పిచ్చా?
కొన్నిసమయాల్లో జానకి ఇలా మతిమీరి ఏమైనా చేస్తుంది. అది వికలాంగులకి ఏర్పడే వెఱ్ఱిలాగ; దాన్ని ఒక విధంగా ఇతరులకి తెలియజేయాలని ఆవేశం కలుగుతుంది; అప్పుడే మనసుకి శాంతి కలుగుతుంది.
అసలు జానకి జీవితంలోని వైకల్యం ఏమిటి?
గడపలో నిలబడుతూ జానకి స్వరూపం తన కళ్ళనుంచి మాయమైన తరువాత సరస్వతీ అమ్మాళ్ ఒక నిట్టూర్పు వదిలి మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు గోడలో వేలాడుతున్న జానకి - శివస్వామి పెళ్ళి ఫోటో చూసింది.
శివస్వామి ఆవిడ కొడుకే. కాని అతన్ని పెళ్ళికొడుకుగా చూడడంలో ఆవిడకి ఎటువంటి సంతోషమూ లేదు.
అందగత్తె జానకికి పక్క - ఆమె భుజంకి సరిగ్గా - పొట్టిగా, లావుగా . . . ఇదేం అవలక్షణం! మకమకలాడే ఆ కళ్ళు . . . ఆ వెర్రి నవ్వూ, ముందుకు తోసుకొని వచ్చే ఆ పళ్ళు . . . ఇదేం ఘోరం!
‘పాపం జానకి!’
పెళ్ళికి ముందు అమ్మాయి ఎన్ని కలలు కన్నదో ఎవరికి తెలుసు? అంతరాత్మలో లేచిన అన్ని మధుర అభిలాషలు చెరుపుకొని వాడిపక్కన ఎలాగ నిలబడిందో!
‘నేనే పాపిని . . . నా కొడుకు కోసం ఈ అందాల అమ్మాయి బతుకు నాశనం చేసాను!’ అని అంటూ సరస్వతీ అమ్మాళ్ చీరమొనతో కన్నీళ్ళు తుడుచుకుంది.
శివస్వామికి లభించిన భార్యను చూసి ఊరంతా విస్తుపోయింది. పిల్లకాయలుకూడా అతన్ని ‘శివస్వామి’ అని ఉత్తికే పిలవరు. అతని పేరంటేనే అంత నవ్వులాట! ‘జడ్డి శివస్వామి’, ‘మంకు శివస్వామి’, ‘పిచ్చి శివస్వామి’, ‘జపాను శివస్వామి’ - అని అందరూ అతన్ని ఎగతాళి చేసినప్పుడు ఆ తల్లి మనసు ఎలా నొచ్చుకుంది!
అటువంటి శివస్వామికి, రూపవతి, పేదయైన జానకిని పెళ్ళిచేసి పగతీర్చుకున్నందుకు సరస్వతీ అమ్మాళ్ సంతోషపడింది. కాని కొన్నిరోజుల తరువాత తను చేసినది ఎంత ఘోరమైన పాపం అని గ్రహించి ఆవిడ రోజూ కన్నీరు కార్చుతోంది.
శివస్వామి ఒక జడ్డి, అందగాడు కాదు అనే తలవంపు మాత్రం కాదు. అతనిలో మోటుతనం, సహజంగా చిరచిరలాడే గుణం ఉందని గ్రహించిన జానకి, తన బతుకు నరకమైపోయిందని ఆత్మహత్య గురించికూడా ఆలోచించేది. అటువంటి సమయాల్లో సరస్వతీ అమ్మాళ్ జానకికి ఇచ్చిన ఆశావాదం - ఆధరణ, ధైర్యం - ఆమెను కాపాడాయి.
జానకి శాశ్వతంగా జీవించడానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డ వచ్చిన తరువాత ఆమెలో అహంకారం, మోటుతనం గూఢంగా చోటుచేసుకున్నాయి. శూన్యం, అంధకారం నిండిన జీవితంలో తనొక దీపం వెలిగించుకొని నిలబడిన గర్వం ఆమెకి కలిగింది.
జీవితంలో తనకేర్పడిన - తన మనసుకిమాత్రం తెలిసిన నిరాశని - పగతీర్చుకోవాలనే పథకంలో జానకి అందరినీ అలక్ష్యం చేసింది. ఆమె భర్త? అసలు అతనికీ భార్య అంటే ఉపేక్షే కదా? ఆమె తన్ను నిర్లక్ష్యం చెయ్యడం అతనికి తెలుసు. ఎప్పుడైనా ఒకసారి అధికారం చెలాయించడమే పురుషలక్షణం అని అతని ఉద్దేశం. అటువంటి సమయాల్లో జానకి భర్తని సముచితంగా ఎత్తిపొడిచి మాటాడడం అలవాటు చేసుకుంది. భార్య చెప్పేదేదో వినకుండానే, ఆ మాటల్లోని గూఢార్ధం గ్రహించకుండానే, జానకి తనకి ఎదురుగా మాటాడుతోందని అనే భావనలో శివస్వామి ఆమెతో మూర్ఖంగా మొత్తులాడేవాడు.
“ఇవన్నీ చూడాలనేగా మీరు ఈ పెళ్ళి చేసారు? చూడండి! తనివితీరా చూసి ఆనందించండి!” అని జానకి బొబ్బలు పెడుతుంది.
‘అవును, ఆమె చెప్తున్నది న్యాయమేకదా?’ అని సణుగుతూ సరస్వతీ అమ్మాళ్ ఆ దంపతుల జగడం అంతమయేవరకూ మరెక్కడో వెళ్ళిపోతుంది.
ఐతే ఈ గొడవ చెదురువాటుగా జరిగేదే. తక్కిన రోజుల్లో శివస్వామి తనంతట తనేదో పిచ్చిగా వాగుతూంటాడు; అదెవరూ లెక్కచెయ్యరు.
శివస్వామి ఆఫీసునుంచి రాగానే అతని వసారాలో పేకాట ఆరంభమౌతుంది. అతన్ని తప్పిస్తే ఆడేవాళ్ళందరూ వేరే వేరే వీధుల్లో కాపురమున్నారు. ఆ గుంపులోని రామభద్రన్ శివస్వామి ఆపీసులో సహోద్యుడు. అతనుండేది తాంబరంలో. అతనుగాని పేకాటకి వచ్చాడంటే ‘ఆఖరి ఎలెక్ట్రిక్ ట్రెయిన్ కి ఇంకా పది నిమిషాలే ఉన్నాయి’ అని ఎవరైనా చెప్పగానే ఆట ఆపుతారు.
రాత్రి ఎనిమిది గంటలవగానే జానకి మరెవరినీ ఎదురుచూడక, ఒంటరిగా, పిల్లవాడిని కౌగిలించుకొని నిద్రబోతుంది. సరస్వతీ అమ్మాళ్ గడపదగ్గర నిలబడి సగం నిద్రలో “శివస్వామి, టైము పదకొంటు అవబోతుందిరా!” అని అన్నతరువాతే అతను లేచివస్తాడు. అందరూ నిష్క్రమించిన తరువాత తల్లి అన్నం వడ్డించినప్పుడుకూడా పేకాట గురించే - తను ఆటలో ఏం తప్పు చేసాడో, తనెందుకు ఓడిపోయాడో - శివస్వామి వాగుతూంటాడు.
**
“అమ్మా, అదేంటి, నువ్వు ఆ ఫోటో చూస్తూ నిలబడిపోయావ్? ఇంకొకసారి పెళ్ళి సంబరాలు చూడాలని ఉందా? నాకూ ఇష్టమే, కాని ఇప్పుడు కాఫీ కావాలి, నాలుగు గ్లాసులు!” అనే మాటలు విని సరస్వతీ అమ్మాళ్ తిరిగి చూసింది. వసారాలో పేకాటకి గుంపు జమా ఐంది.
“ఓ, ఇవాళ శనివారం కదూ? దానికేం, కాఫీ చేస్తానులే. పాలవాడు ఇంకా రాలేదు, వాడు వచ్చే సమయమే . . . ” అని అంటూ కొడుకు హాస్యం లెక్కచెయ్యకుండా, మూతి ముడుచుకొని సరస్వతీ అమ్మాళ్ వంటగదికి వెళ్ళింది.
“జానకి ఎక్కడ?”
“సినిమాకి వెళ్ళింది.”
“ఎవరికి చెప్పి వెళ్ళింది?”
“ఎవరికి చెప్పాలి? నాకే చెప్పింది.”
“లేదు. దానికి రానూ రానూ పొగరు ఎక్కువై పోయింది! ఆ సొట్ట పిల్లవాడిని తీసుకొని ఈ మండుటెండలో . . . హూం, అది రానీ . . . “ అని శివస్వామి గర్జించాడు.
“ఏం, అదేం తప్పు చేసిందని? ఈ ఎండలో గాలి కూడా లేదు . . . ‘ఇంటిలో ఉక్కగా ఉంది, నువ్వు వెళ్ళిరావమ్మా!’ అని నేనే చెప్పాను.”
“సరేలే, అదెలాగైనా పోనీ! . . . ” అని విసుగ్గుంటూ పేకముక్కలు పోగుచేసుకొని, రెండు జమ్ముచాపలు మోసుకొని శివస్వామి వసారాకి వెళ్ళాడు.
“రామభద్రన్ ఎక్కడ? ఇవాళ కనిపించడేం?” అని ఎవరో వసారాలో అడిగారు.
“మనం నాలుగుమంది ఉన్నాంగా, వాడిగురించి ఎందుకు బాధ?”
శివస్వామి పేకముక్కలు పంచిపెట్టాడు; ఆట ఆరంభమైంది.
**
‘సరైన ఈడూ జోడూ అంటే మనం చూసేది సినిమాలో మాత్రం కాదు! అదిగో, ఆ జంట ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ . . . ’ చంకలో బిడ్డతో నడుస్తున్న జానకిని తాకుతూ ఒక పట్టు చీర ముందుకు నడిచింది; జానకి తలెత్తి చూసింది.
ఆ జన సమూహంలో ఒక యువ జంట; యువకుడు తన చెయిని యువతి నడుములో పోనిచ్చి - ఆమెను కౌగిలించే ధోరణిలో - నడుస్తున్నాడు. అతను నడుస్తుంటే - అతనూ చూడడానికి సొగసుగానే ఉన్నాడు - అతని భుజం మీద, తళతళలాడే బుష్ కోటుని తాకుతూ ఆ యువతి సిల్కుచీర ముందుకు సాగుతోంది.
‘వాళ్ళు ఎంత హాయిగా కనిపిస్తున్నారు! సినిమాల్లో మనం చూస్తున్నట్టు నిజ జీవితంలోనూ మనుషులు ఉన్నారు! నేను పాపిని . . . అటువంటి జీవితం సాధ్యం అనికూడా నేను కల్పన చెయ్యలేను, అందుకు నా బతుకే కారణం.’ జానకికి బిగ్గరగా ఏడవాలనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ముందువరుసలలోని ప్రేక్షకులు తెరలో ప్రేమ సన్నివేశాలలో ఈల వేసి సందడి చేసినప్పుడు జానకి కూడా ఆతురతగా చూసి ఆనందించింది. కాని మనసులో ఈర్ష్య, నిరాశ చోటుచేసుకున్నాయి. కొన్నిసార్లు కన్నీరు కార్చిందికూడా! అవును, దానికి పేరు వైకల్యం! ఆ పరిస్థితిలో ఏడ్చినా, అసూయపడినా ఒక విధమైన సుఖముంది. అందువలసే జానకికి సినిమా పిచ్చి పట్టుకుంది.
సినిమా కాంపౌండు వదిలి బయటికి రాగానే జానకి ఎదుటనున్న హోటలుకి దారితీసింది.
హోటల్లో ప్రవేశించగానే, ఒక మూలనున్న మేజాలో కూర్చొని ఒక స్వీట్ ఆర్డరు చేసింది.
సర్వర్ తెచ్చిన జిలేబిని మెల్లమెల్లగా పిల్లవాడికి తినిపించింది. ఆ తరువాత కాఫీని చల్లారించినప్పుడే తన్ను ఇంతసేపూ ఎవరో - ఒక వేళ తన భర్తేమో? - తేరిచూస్తున్నట్టు ఒక భావన కలిగింది. తలెత్తి చూడగానే రామభద్రన్ కనిపించాడు.
‘ఎక్కడో చూసిన మొహం . . . ’ అని జానకి తనలో చెప్పుకుంది. తన భర్తతో పేకాటకి తరచుగా వచ్చేవాడని జ్ఞాపకం రావడానికి కొంచెం సమయం పట్టింది.
రామభద్రన్ ఒక చిరునవ్వు నవ్వాడు; జానకీ లేతగా నవ్వింది.
ఇవాళే రామభద్రన్ని జానకి పూర్తిగా చూస్తోంది; మనిషి ఎంత సొగసుగా ఉన్నాడు!
చాలా రోజులుగానే రామభద్రన్ జానకి అందచందాలు చూస్తున్నాడు.
చెయి కడుక్కోవాలని జానకి లేచినప్పుడు ఆమె పక్కన వచ్చి నిలబడి, చాలా పరిచయంవున్నట్టు “ సినిమాకి వెళ్తున్నారా?” అని రామభద్రన్ అడిగాడు.
“లేదు. సినిమా చూడడమైంది.”
“అంబీ, నువ్వూ సినిమా చూసావా? నీకు నచ్చిందా?” అని ముద్దాడుతూ రవిని తన చేతులతో ఎత్తి మేజామీద రామభద్రన్ నిలబెట్టాడు. పిల్లవాడి రెండు కాళ్ళూ కింద వాలిపోయాయి.
“ఏమైందని? వీడికి నిలబడడం చేతకాదా?”
“అదేమో నాకు తెలీదు . . . రెండేళ్ళు నిండాయి, ఇంకా అలాగే ఉన్నాడు . . . మందులూ, టానిక్కులూ ఇస్తున్నాం . . . దేహంలో ఏదో దోషం అని డాక్టరు అంటున్నారు . . . వాళ్ళ నాన్నగారు వాడిని సొట్టబ్బాయి అనే పిలుస్తున్నారు; వాడి బతుకంతా అలాగే ఐపోతుందేమో అని నాకు బెంగగా ఉంది.”
“మీకేం భయం వద్దు! . . . ఇంకా ఆరుమాసాలలో పిల్లవాడు నడుస్తాడు - ఇది body weakness! అంతలోనే ఆ జడ్డి వీడిని సొట్ట అని పిలవడమా? అంబీ, ఇంకొకసారి మీ నాన్న నిన్ను సొట్ట అని పిలుస్తే ‘నేను మీలాగ సొట్ట కాదు!’ అని చెప్పేయ్ . . . తెలిసిందా?” అని రవికి చెప్పి జానకిని చూసి రామభద్రన్ చిరునవ్వు నవ్వాడు.
ఆ మాటలు విని జానకి బాధపడింది; కాని నవ్వేసి ఊరుకుంది.
సర్వరు బిల్ తీసుకొనివచ్చి మేజామీద పెట్టాడు. జానకి దాన్ని అందుకున్నప్పుడు రామభద్రన్ “నేను ఇస్తాను” అని ముందుకున్నాడు. ఇద్దరి వేళ్ళు తాకటంతో బిల్ మేజానుంచి నేలమీద వాలింది. రామభధ్రన్ వోంగి దాన్ని తీసుకున్నాడు.
జానకి మోహం ఎఱ్ఱబడింది. ‘ఇంత త్వరలో ఇంత చనువు ఎలా ఏర్పడింది?’ అని నివ్వెరపోయి, నవ్వుతూ, పిల్లవాడిని ఎత్తుకుంది.
హోటలు గడప దాటి బయటకి వచ్చేవరకు జానకి మొహంలోని ఆ ఎఱ్ఱదనం పోలేదు. వెనుకనుంచి ఆమెకి రామభధ్రన్ చెప్పాడు: “మీరేం కంగారు పడవద్దు. బీచుకి వెళ్ళి రోజూ పిల్లవాడిని ఒక గంటసేపు నడుంవరకు ఇసుకలో నిలబెట్టారంటే, ఒక నెలలో వాడు నడుస్తాడు. కాలుకి బలం వస్తుంది.”
“అలాగా?”
“అవును. కావాలంటే మీరు చేసి చూడండి. ఇప్పుడు మీరు తిన్నగా ఇంటికి వెళ్తున్నారా? ఇప్పుడే వెళ్ళి . . . . అంబి, నువ్వు బీచ్ కి వస్తావా?” అని పిల్లవాడిని ముద్దాడుతూ రామభద్రన్ జానకిని చూసాడు.
‘వద్దు!’ అని అనాలని ఆమెకు ముందు అనిపించింది. కాని రామభద్రన్ కంఠభ్వని వినడంలో, అతని నవ్వుతూంటే అతన్ని చూడడంలో ఒక విధమైన ఆకర్షణ, సుఖమూ ఉన్నాయని గ్రహించి సరేనంది.
సమయం ఆరుగంటలే ఐంది. ఎండ ఇంకా తీవ్రంగానే ఉంది. ఒక పడవ నీడలో పిల్లవాడు నడుంవరకు నిలబడడానికి ఒక పల్లం తవ్వి, వాడిని అందులో నిల్చోబెట్టి, జానకి, రామభద్రన్ ముఖాముఖిగా, మౌనంగా కూర్చున్నారు.
జానకికి ఎందుకో ఏడవాలనిపించింది. ‘ఒక పరాయి మగవాడి ముందు ఏడవడమా?’ అని తలచుకొని కలవరపడింది. ఆతనూ ఏదో జ్ఞాపకంలో ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాడు. మాటిమాటికీ నిట్టూర్పులు వదిలాడు; నుదుట రుద్దుకున్నాడు.
“ఇవాళ శనివారం కదూ? మీకు ఆఫీసునుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాలనిపించలేదా?”
“రెండురోజులుగా నాకు మనసే సరిగ్గాలేదు. నేను ఇంటికి వెళ్ళలేదు, ఆఫీసుకీ వెళ్ళలేదు!”
“అయ్యయ్యో, అలాగ ఉంటే ఎలాగ? మీ ఆవిడ ఊరులో లేదు కాబోలు!” అని అంటూ జానకి నవ్వింది.
“అలాగైతే మంచిదే, నేను హాయిగా ఉంటాను . . . కాని అది ఇంట్లోవుంది, నా ప్రాణం తీస్తోంది . . . నా కర్మ!”
“అయ్యో, తిట్టకండి . . . మీ ఆవిడని మా ఇంటికి తీసుకురండి . . .
“ఇదేం గొడవరా!” అని రామభద్రన్ విసుగ్గున్నాడు.
“ఏం, మేం ఎవరూ మీ ఆవిడని చూడకూడదా? మేం ఆవిడని పేకాటకి పిలుస్తాం అని మీకు భయమా? ఆ భయం వద్దు!” అని జానకి మళ్ళీ నవ్వింది.
“తప్పకుండా చూసితీరాలంటే నా మాట వినండి . . . మీ శివస్వామికి చీరకట్టి చూస్తే ఎలాగుంటుంది? అదే నా భార్య . . . నా కర్మ!”
ఒక క్షణం జానకి స్తంబించిపోయింది.
“మరెందుకు పెళ్ళిచేసుకున్నారు?”
“కర్మంటే అదే . . . వాళ్ళ నాన్నగారే నన్ను చదివించారు . . . బోలెడు ఆస్తి . . . ఒకే ఒక కూతురు, వారసు....”
“ఎది ఎలాగైనా మీకు ఓదార్పు ఉంది . . . ” అని జానకి చెప్పడం ఆరంభించి నాలిక కఱచుకొని మౌనం వహించింది.
“చెప్పండి . . . మీ మనసులో ఏముందో చెప్పండి! . . . నేను అపార్ధం చేసుకోను!”
“మరేంలేదు!”
“మీరేదో చెప్పదలచుకున్నారు, కాని దాచుకుంచున్నారు . . . మనిద్దరి పరిస్థితి ఒకటే అని మీ ఉద్దేశం కదూ? మీ ఇంటికి వచ్చిన మొదటిరోజే మిమ్మల్ని చూసి నా మనసు ఏడ్చింది . . . మీ ప్రశ్నకూడా నాలాగే అనిపించింది . . . నేనంటున్నది అదే.”
“అవును . . . . కాదు, అసలు నా పరిస్థితి మీకంటే మరీ అధ్వాన్నం అనాలి . . . మీరు మగవారు, నేను ఆడదాన్ని . . . అంతేకాదు . . . మీరు రేపు మీకు రాబోయే ఆస్తికోసం . . . . నాకేం ఉంది? . . . నేనెందుకిలా తికమకలు పడాలి?”
తను అంటున్న మాటల్లో కొన్ని రామభద్రన్ వినాలని, మరికొన్ని తన హృదయంలోనే నిష్ఫలంగా ఉండిపోవాలనే భావనతో జానకి మాటాడింది.
ఆ తరువాత ఇద్దరూ మౌనంగా ఇసుకమీద ఏవో గీతలు గీసుకుంటూ కూర్చున్నారు.
ఇద్దరూ తమతమ మనసులో, జీవిత వర్ణనలో కనిపించే రూపాన్ని చెఱిపేసి, దానికి బదులు ఎదుట కనిపించే వ్యక్తిని కల్పన చేసుకున్నారు.
జానకి తను సినిమాలో ప్రేమ సన్నివేశాల్లో చూసి ఆనందించిన ఆ జంటని గుర్తుచేసుకుంది. ఇక ఈడూ, జోడూ అన్న ఆలోచన రాగానే ఆ జంటని మించిన జత, దాన్ని మేటిల్లే ఇంకొక జత - ఒకటి తరువాత ఒకటి - ఆమె కల్పనలో లేచాయి.
“మీ వయస్సు?” రామభద్రన్ అడిగాడు.
“ఇరవైనాలుగు . . . మీకు?”
“ఇరవై ఏడు . . .” అని చెప్పి రామభద్రన్ ఒక నిట్టూర్పు వదిలాడు. జానకి తన మనసులోనూ ఒక నిట్టూర్పు వదులుకుంది. ఇద్దరూ తమతమ మనసుని తీర్చి దిద్దుకున్నట్టు ఇసకమీద ఏమేమో రాసుకుంటున్నారు.
గభీమని జానకి పకపక నవ్వింది. ఒక నిమిషం రామభద్రన్ అదిరిపడ్డాడు. నవ్వుతూనే జానకి చెప్పింది:
“చూసారా, జీవితం ఎంత చిత్రవిచిత్రంగా ఉందో? మీరందరూ ఆడుతున్నారే, ఆ పేకాటలాగ!”
“ఏమంటున్నారు మీరు?”
“మీకు కావలసిన పేకముక్కలన్నీ మీ దగ్గర ఉంటే, నాకు కావలసిన పేకముక్కలన్నీ నాదగ్గర ఉంటే, ఈ ఆట సాగుతుందా?”
“జానకి, నువ్వు ఎంత చక్కగా మాటాడుతున్నావ్?”
‘మా ఆయనగాని ఇలా చెప్పివుంటే? . . . ’ ఆ ఊహలోనే జానకి ఆహ్లాదపడింది.
“జానకి . . . ” అని పిలుస్తూ రామభద్రన్ ఆమె దగ్గరకి వచ్చాడు. అతని కళ్ళు తడిసిపోయాయి; కంఠధ్వని గరగరమని మారిపోయింది.
“జానకీ, మనమేకదా ఆ పేకముక్కలు? ఆట ఆడేది శివస్వామి, లక్ష్మి! పరస్పరంగా పేకముక్కలు మార్చుకోడమే పేకాట! జానకి, You are a smart woman! నేను ఏమంటున్నానో నీకు బోధపడిందా?”
జానకి కళ్ళు సగం నిద్రలో ఉన్నాయి; ఉహాలోకంలో మైమరిచి ఆమె తేలుతున్న ఆ సమయంలో పిల్లవాడు రవి రామభద్రన్ కోటుని పట్టుకొని “నాన్నగారూ!” అని అరిచాడు.
జానకి కళ్ళుతెరిచి పిల్లవాడిని, తన్నూ, ఆ ప్రపంచాన్ని చూసింది.
“ఇది నాన్నగారు కాదురా . . . ఇది అంకుల్ . . . నాన్నగారు మనింట్లో మనకోసం కాచుకొనివున్నారు . . . రా, వెళ్దాం!” అని రవిని జానకి ఎత్తి కౌగిలించుకుంది.
“నాకు మీ ఆలోచన నచ్చిందండి . . . ఇలా చేస్తే ఒక నెలలో రవి బాగా నడుస్తాడని నాకూ నమ్మకం కలుగుతోంది. ఇక రేపటినుంచి రోజూ మా ఆయనతో బీచ్ కి వచ్చేస్తాను . . . రానూ రానూ అతనికీ ఈ పేకాట పిచ్చి మితిమీరి పోయింది!” అని అంటూ జానకి లేచింది.
రామభద్రన్ ఏమీ బోధపడక, మౌనంగా, ఆమె వెంట నడిచాడు. గఙీమని ఆమెపక్కన చేరుకొని “మీకు నామీద కోపమా?” అని గొణిగాడు.
“బాగుంది. నాకెందుకు మీమీద కోపం? నేను పేకాటగురించి మీకు పూర్తిగా చెప్పలేదు . . . మీరన్నారుగా ఆట ఆడేది మా ఆయనా, మీ భార్యా అని? అదే పొరబాటు. వాళ్ళుకూడా పేకముక్కలే . . . ఆడేది మనుషులెవరూ కాదండి, ఆడేది దేవుడు! అతను ఆటలో పొరబాటు చేసాడని అనడానికి మనకేం హక్కు ఉంది, చెప్పండి?”
“జానకి, మీరెంత బాగా మాటాడుతున్నారు!” అని రామభద్రన్ విస్తుపోయాడు.
“రేపు ఆదివారంకదా, లక్ష్మితో మా ఇంటికి రండి, చాలా సంగతులు మాటాడుకుందాం, . . . నేను మీ ఆవిడకి ఎలా మాటాడాలో నేర్పుతాను . . .కణ్ణా, అంకుల్ కి నమస్తే చెప్పు . . . సరే, మేం వస్తాం!” అని అంటూ రాజం ఇంటికి నడిచింది.
రాత్రీ కాదు, పగలూ కాదు అనే ఆ సంధ్యాకాలంలో ‘రాత్రి వచ్చేసింది!’ అని దృఢంగా ప్రకటించినట్టు బీచ్ రోడ్డులో అన్ని దీపాలూ నిగనిగమని వెలిగాయి.
ఎక్కడచూసినా కాంతి. అదేం బయట మాత్రమేనా?
*****