top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

కథా​ మధురాలు

పాత సినిమాలు కొంటాం

 

జయంతి ప్రకాశశర్మ

Jayathi Prakash Sarma.PNG

ఉదయాన్నే ఇంట్లో కూచుని పేపరు చదువుకుంటున్న నేను, ఆ కేక వినబడగానే గతుక్కుమన్నాను.   'అయ్యకోనేరు గట్టు మీద ఈ కేక ఏమిటి సుమీ, ' అని చెవుల్ని సాగదీసి మరీ విన్నాను.

మళ్ళీ అదే కేక  "పాత సినిమాలు కొంటాం, పాత సినిమాలు కొంటాం!'

'ఇదేఁవిటి చెప్మా, ' అని అనుకుంటూ, పేపర్ని చేత్తో పట్టుకుని, భుజం మీద ఓ తుండుగుడ్డ వేసుకుని వీధిలోకి వెళ్ళాను. 

సరిగ్గా మా ఇంటి ఎదురుగా బండాపి గట్టిగా అరుస్తున్నాడు.  బటన్స్ పెట్టుకోకుండా వేసుకున్న ఓ పాత కోటు, లోపల  టీ షర్టు, వదులుగా పాంటు, సాక్సులు లేకుండా బూట్లు, తల మీద ఇంగ్లీషు టోపి, భుజం మీద ఓ తువ్వాలు, అదేదో పాత సినిమాలో రాజ్ కపూర్ లా ఉన్నాడు.

అతని ముందో తోపుడు బండి ఉంది. పైన ఓ లాప్ టాప్, పక్కనే చిన్న సౌండ్ బాక్సులు, వాటి వైర్లు, పక్కనే ఉన్న కారు బ్యాటరీకి తగిలించి  ఉన్నాయి. ఆ బాక్సుల్లోంచి 'చేతిలో చెయ్యెసి చెప్పు బావా!'  పాట చిన్న సౌండ్ లో వినబడుతున్నాది.

"ఏంటోయ్ ! విచిత్రంగా ఉంది!" అంటూ గిరీసంలా అతని వైపు ఓ చూపు చూసా!

"అవును సార్! పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి రంగులద్ది మనకొగ్గిసినారు! పాత పాటల్ని మళ్ళీ సినిమాలో ఎట్టేసి ఇనిపిస్తున్నారు!ఇది కూడా అట్టాగే  అనమాటా! " చేతిలో ఉన్న సిగరెట్ ని గట్టిగా ఓ దమ్ము లాగి, ఎటో చూస్తూ అన్నాడు.

"కాల మహిమ"  - నా మాటలు పూర్తి కాకుండానే, లటుక్కుని అన్నాడు "కరక్టుగా అనిసారు. ఈ ఇసయం అరవై ఏళ్ల కిందట మన పింగళి మాష్టారు కూడా ఇదే అన్నారు, కాని ఇక్కడ రసపట్టు నేదు, తర్కం అసలక్కరనే నేదు!మీరన్నట్టు, కాలమయిమే అనుకోండి!" అంటూ ఓ చూపు చూసాడు.‌

"సరే, పాత సినిమాలేం చేసుకుంటావోయ్!" అంటూ అతని వైపు చూసాను. 

"కాలం మారింది కదా సార్, ఆ పాత సినిమాలో డైనాగులు మార్చి, కొత్త డైనాగులతో ఆ కథని రీమిక్స్ సేసి, నాలుగు పెగ్గుల డబ్బులు సంపాదించుకుంటున్నాను సార్!" ఆఖరి దమ్ము లాగి, సిగరెట్టు పడేసి నా వైపు చూసాడు.

వాడి ఆలోచనేఁవిటో, నాకేం అర్ధం కాలేదు. చెయ్యి తలమీదకు వెళ్ళింది. అది చూసి "మీకర్ధం కానట్టుంది. ఓ పాలి ఇది సూసెరంటే అర్ధమయి పోతుంది! మీలాంటోల్ల కోసమేనండి, ఓ ట్రయిలర్ వొట్టుకొచ్చాను!" అంటూ ఆ లాప్టాప్ ఆన్ చేసాడు.

"నేడే చూడండి, మీ అభిమాన దియేటర్లో- " అంటూ మొదలైంది!

 

వెంటనే సీను,

"అమ్మా, నాకు స్కూలు పస్టు వచ్చిందమ్మా. ఇదిగో మార్కులు!" అంటూ ఇంట్లో కొచ్చిన గోపి, తల్లి మంచం దగ్గర నిలబడి, ఆవిడకి ఆ కాగితం చూపెడతాడు.  గోపితోపాటు అతని తమ్ముడు, చెల్లి కూడా మంచం దగ్గర చేరుతారు. ఆవిడ ఆ ముగ్గుర్ని దగ్గరకి తీసుకుంటుంది.

"బాబు, ఎంత మంచి మాట చెప్పావు బాబు! కనీసం నీ నోటిని  తీపి చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉంది బాబు మీ అమ్మ! నాకు, నాకు, " ఆమె మాటలకి తుమ్ము అడ్డొచ్చింది. వెంటనే ఆ పిల్లల్ని దూరంగా తోసేస్తుంది. నోటికి అడ్డంగా కొంగు అడ్డం పెట్టుకుని గట్టిగా తుమ్ముతుంది.

"లేదమ్మా, నీకేం కాదు. నేను పెద్ద చదువులు చదివి కంప్యూటరు ఇంజినీరు అయ్యి, ఈ మహమ్మారి జ్వరానికి పెద్ద మందు కనిపెట్టి, నిన్ను బతికించుకుంటానమ్మా, బతికించుకుంటాను!!" ఆ పన్నెండేళ్ళ గోపి తల్లి చెయ్యి పట్టుకుని కళ్లంటా నీళ్లు కక్కుకుంటాడు.

"బాబు, దూరం బాబు, దూరం!" అంటూ తన చెయ్యి వెనక్కి తీసుకుంటుంది.

"అమ్మా, నాకేం కాదమ్మా, నిన్ను, నేను కాపాడుకుంటానమ్మా!" గోపి తన చేతిని తల్లి నోటికి అడ్డంగా పెట్టి అంటాడు.

"బాబు అయితే నాకో మాట ఇవ్వు!తమ్ముడ్ని, చెల్లిని బాగా చదివించి, వాళ్లు హాయిగా ఉన్న తర్వాత నా కోరిక తీరుస్తానని మాట ఇవ్వు!"

"తప్పకుండా అమ్మా, తప్పకుండా! చెప్పమ్మా చెప్పు!"

"మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటానని, నాకు మాట ఇవ్వు నాయనా!" అంటూ గోపి చేతిని తన చేతి మీదకు తీసుకోబోతుంది, సరిగ్గా ఆ సమయంలోనే గట్టిగా దగ్గు వస్తుంది. మంచినీళ్ల కోసం గోపి పరిగెడతాడు. వంటింట్లో  ఖాళీగా ఉన్న బిందెలు కనబడతాయి. అక్కడున్న గిన్నెలు, ముంతలు అన్ని తడిమి చూస్తాడు. అటు ఇటూ చూసి, ఓ గ్లాసు పట్టుకుని, రివ్వున బయటకు పరిగెత్తుతాడు. వీధి కుళాయి దగ్గరా నీళ్లు రావు.  అతడ్ని చూసి, వీధిలో వాళ్ళందరు తలుపులు వేసేసుకుంటారు. అలా గోపి పరుగెత్తుకుంటూ చెరువు దగ్గరకు వెళ్తాడు. బురదగా ఉన్న నీళ్లని, తన చొక్కా సహాయంతో వడపోత చేసి, గ్లాసులో నీళ్లు పట్టి, ఆ గ్లాసు పట్టుకుని పరిగెత్తుతాడు. ఈలోగా ఇంటి దగ్గర ఆవిడ దగ్గి, దగ్గి కళ్లు మూస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి, తల్లి మీద పడి, తమ్ముడు చెల్లి ఏడుస్తూ ఉంటారు. గుమ్మం దగ్గర చేరిన గోపి ఒక్కసారి లోపల దృశ్యం చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోతాడు. చేతిలో గ్లాసు కిందకు పడిపోతుంది.

తర్వాత సీనులో తల్లి భౌతికకాయాన్ని, గోపి ముందు, మిగతా ఇద్దరు వెనుక మోసుకుంటు నడుస్తుంటే, బ్యాక్ గ్రౌండ్ లో పాట వినబడుతుంది.

"ఆ దగ్గుల తరంగాలలో

ఈ చైనా చదరంగంలో

రొంపలు దగ్గులు స్నేహము

ఎంతవరకు న్యాయము"

అంటూ పాట సాగుతుంది!

**

తర్వాత సీను తర్వాత సీనులు వస్తాయి.  గోపి సైకిలు తొక్కుతూ, ఒక భుజం మీద జొమాటో బ్యాగు, మరో భుజం మీద స్వీగ్గి బ్యాగు, వేనుక అమెజాన్ బ్యాగులతో కనబడతాడు. సాయంత్రం వీధిలైటు దగ్గర పుస్తకాలు చదువుతూ, తన వొళ్లో తల పెట్టుకుని పడుకున్న తమ్ముడ్ని, చెల్లిని జోకొడుతూ ఉంటాడు.

కేలండర్ పేజీలు రెపరెపలాడుతూ పదిసంవత్సరాలు చిరిగిపోతాయి. 

కాలేజీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది.

"మైడియర్ స్టూడెంట్స్, ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే, మన కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన గోపి, రాష్టంలోనీ అన్నీ యూనివర్సిటీలకీ ప్రధమ స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా, ఇప్పుడు ప్రపంచాన్నిహడాలేత్తిస్తున్న రోగానికి మందు కనిపెట్టాడు.  అందుకే, ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ సుశీల్ కంగాళీగారు వారి కంపెనీలో పదిలక్షల జీతంతో ఉద్యోగం ఇస్తున్నారు. వారినే ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ని  గోపికి అందచేయవలసింది కోరుతున్నాను!" అంటూ మైకు ముందు చప్పట్లు కొడుతూ ప్రిన్సిపాల్ గారు అటూ చూస్తారు. జనంలోంచి పెద్దవాడైనా గోపి పరిగెత్తుకుంటూ స్టేజి ఎక్కుతాడు. షేకండ్ కోసం చెయ్యి అందించిన కంగాళీగారికి, గోపి తన రెండు చేతులతో నమస్కరిస్తాడు. కంగాళీగారు ఓ నవ్వు నవ్వి రెండు చేతులతో ఆ  కాగితం అందిస్తాడు. 

 

జనంలో ఉన్న కంగాళీగారమ్మాయి కరీనా కంగాళీ గట్టిగా ఈలవేసి గాల్లో గోపికి ముద్దులు పంపుతుంది.

**

తర్వాత సీను,

ఆ ఉత్తరం పట్టుకుని, గోపి తన మావయ్య ఇంటికి వెళ్తాడు.  గుమ్మంలోనే ఎదురైన రాధ "బావ, ఠట్టటోయం!" అంటూ ఉత్తరాన్ని లాక్కుని లోపలకి పారిపోతుంది. "రాధ, రాధ, " అంటూ గోపి ఆమె వెంట పరిగెడతాడు. అంతలో మావయ్య ఇంట్లోంచి ఎదురొస్తూ "రా, గోపి! కంప్యూటర్ ఇంజినీరు అయావుట కదా! ఈ కరోనా  రోగానికి మందు కూడా ముందే కనిపెట్టావు కదా! చాలా సంతోషం బాబు! మీ అమ్మ కన్న కలలని నిజం చేసావు!" అంటూ " ఇదిగో కాంతం! ఏవరొచ్చారో చూడు!" అంటూ భార్యని పిలుస్తాడు.

"అయ్యో, అయ్యో, అలా అల్లుడు తియ్యటి వార్త తెస్తే, మీరెంటండి చప్పగా చెప్తారు! ఏంటో నాయనా, మా వదినే ఉంటే ఎంత సంబర పడేదో!ముప్పై ఏళ్లకే ఆ మాయదారి మహమ్మారి రోగం  వచ్చి, వదిన మన అందర్ని వదిలి గుటుక్కుమంది! ఓ బిపివా, ఓ సుగరా, పాపం గట్టిగా చీదినట్టు కూడా కనబడలేదు! గుండులా తిరిగినట్టే తిరిగి గొంతుక పూడికిపోయింది!ఎక్కడో చైనా వాళ్ళకి వచ్చిందని విన్నాం, ఆ దిక్కు మాలిన రోగం ఇన్ని సముద్రాలు దాటి ఇక్కడికే రావాలా! పోన్లే నాయనా, నువ్వో ప్రయోజకుడు అయ్యావు.  ఓ మంచి సంబంధం చూసి నీ పెళ్ళి చేస్తే మా బాధ్యత కూడా తీరుతుంది బాబు!" అంటూ ఎడం చెత్తో కొంగు పట్టుకుని కళ్ళు అద్దుకుంటుంది.

"లేదు అత్తయ్యా, మా అమ్మకి ఓ మాట ఇచ్చాను! ఆ మాట నిలబెట్టడమే నా విధి, అదే ఆమెకిచ్చే ఘనమైన నివాళి!" అంటూ గోపి కళ్లు రాధ కోసం వెతుకుతాయి!

"ఏవిటో ఆ మాట!" కాంతం నొసలు చిట్లించి చూస్తుంది.

"సమయం వచ్చినప్పుడు చెప్తాను అత్తయ్య! నన్ను అపార్ధం చేసుకోకు, మా అమ్మ తర్వాత నువ్వే మా అమ్మవి!" అంటూ గోపి పెరట్లోకి పరిగెడతాడు.

ఆమె మూతి మూడు వంకరలు తిప్పుతుంది.

పెరట్లో చెట్టు మీద కూర్చున్న రాధని చూస్తూ "రాధ, అది నా జీవితానికి నిచ్చెన వేసిన ఉత్తరం. అలా నలపకు రాధ!" గోపి అంటాడు.

"మరి నేను కూడా ఆ నిచ్చెన ఎక్కాలిగా!" రాధ కొంటెగా అంది.

"రాధ, రాధ, ! ఆ నిచ్చెన ఎక్కడానికి ఇంకా టైముంది. తమ్ముడు చదువు, చెల్లి పెళ్ళి జరగాలి కదా! మా బంగారు తల్లివి కదూ, ఇచ్చేయమ్మా!" అంటూ బతిమాలుతాడు.

"అయితే, నాకేం ఇస్తావు!" అంటూ రాధ  పెదాలమీద చూపుడు వేలు పెడుతుంది.

"రాధ, ఏవిటా సినిమాచేష్టలు! పెద్దవారు చూస్తే ఏవనుకుంటారు?" అంటూ సిగ్గు పడతాడు.

"అయ్యో బావ! ఏం అడుగుదామనా, అని నేను ఆలోచిస్తుంటే, నువ్వేటో వెళ్ళి పోయావు బావ!"

"ఓ అదా, అయితే నా మొదటి నెల జీతంతో నీకు ల్యాప్‌టాప్ కొనిపెడతానుగా, ఆ ఉత్తరం ఇవ్వు రాధ!" అంటూ చెయ్యి చాపుతాడు. రాధ ఆ చేతిని పట్టుకుని కిందకు దూకుతుంది.

"నా చేతిలో చెయ్యి వేసి చెప్పావు కదా! ఇదిగో నీ నిచ్చెన!" అంటూ కొంటెగా చూస్తూ, ఆ ఉత్తరం ఇస్తుంది.

గోపి నవ్వుకుంటూ బయటకు వెళ్తాడు!

'చేతిలో చెయ్యెసి చెప్పొద్దు బావ

పాడుకున్న పాటలు పాతబడి పోవని

వాటుసాపు ఊసులు మారి పోవని, చేతి, !'

అంటూ వారు పాట అందుకుంటారు.

**

తర్వాత సీను.

"కరీనా బేటీ, ఏ కామ్ అచ్చా నహిహై!" అంటూ సుశీల్ కంగాళీగారు కూతురు వైపు కోపంగా చూస్తారు. వాళ్ల సంభాషణ హిందిలో ఉంటుంది. కిందన తెలుగులో ఆ డైలాగులు కనబడతాయి.

"డాడీ, నేను గోపిని ప్రేమించాను. అందులో తప్పేం ఉంది డాడీ?" కరీనా నిశ్చయంగా అంది.

"అతనిలో ఏఁవుందని ప్రేమించావు బేటి! డబ్బుందా, అందం ఉందా? "

"డాడీ, అతనికి చదువు ఉంది, ఉద్యోగం ఉంది. హోదా వుంది. అంతకంటే, . మందమైన మనసుంది!రొంప, దగ్గు, జ్వరం, గొంతుకనొప్పి లేనే లేవు!ఏ స్త్రీ అయినా ఓ మగాడ్ని ఐనా, ప్రేమించడానికి ఇంకేం చూస్తుంది పాపా!" అంటూ గారాలు పోతు  తండ్రి వైపు  చూస్తుంది.

ఆ డైలాగు వింటూనే ఆనందం పట్టలేక   నేను అక్కడే గట్టిగా చప్పట్లు కొట్టాను.

"ఆగండి సార్, ఇంకా చూడండి!" అంటూ ఆ బండివాడు నా వైపు చూసాడు.

"బేటీ, నీకెలా చెప్పాలో అర్ధం కావడం లేదు? గోపి ఈ మధ్యనే అమెరికా వెళ్లొచ్చాడు!" ఆఖరి అస్త్రంగా అన్నాడు.

"గోపి అలాంటి వాడు కాదు డాడీ! చేతులు జోడిస్తాడే తప్పా, చెయి ఇవ్వడం తెలియని అమాయకుడు డాడీ! సానిటైజర్ తో స్నానం చేసే వ్యక్తిత్వం గోపిది!

 

హేండు వాష్ చేసుకున్నంత సులభంగా నా మనసుని వాష్ చేసుకోలేను డాడీ! గోపితో జీవితాంతం క్వారంటైన్ చేయడానికి నిశ్చయించుకున్నాను, కాదనకు డాడీ!" కరీనా సిరియస్ గా అంటూ కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటుంది. చేతిలో ఉన్న టిష్యూ పేపరుతో సున్నితంగా తుడిచి, డస్ట్ బిన్ లో పడేస్తుంది!

అక్కడ సీన్ కట్ అవుతుంది.

**

మరో సీను!

మామిడి తోటలో రాధ చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంటుంది. పక్క‌నే గోపి నిలబడి ఉంటాడు. ఇద్దరూ సీరియస్ గా ఉంటారు. 

"గోపీ, నన్ను మర్చిపో! నువ్వు పెద్ద సాప్ట్ వేర్ ఇంజినీరువి, నేను మామూలు హార్డువేర్ ఇంజినీర్ని! మన మధ్య దూరం చాలా వుంది!" రాధ  చెట్టుకొమ్మ దిగి, చెట్టు మొదల్లోకి వెళ్ళి మొహం అటుతిప్పి, నోటికి చుడిదార్ అడ్డం పెట్టుకుని దుఃఖం ఆపుకుంటూ అంటుంది.

"రాధ, ఎంత మాట అన్నావు!నా ప్రేమని అపార్ధం చేసుకున్నావు రాధ, అపార్ధం చేసుకున్నావు! చిన్నప్పట్నుంచి దాచుకున్న ఈ ప్రేమకి ఏ సాప్ట్ వేర్ అడ్డు రావు రాధ! పాతిక సంవత్సరాల మన ప్రేమ హార్డు కాదా, చెప్పు రాధా, చెప్పు!" చెట్టు కొమ్మ దగ్గరే నిలబడి, ఎడం చేత్తో కాలరు పట్టుకుని, కుడి చేతి చూపుడు వేలుని లయబద్దంగా కదుపుతూ అంటాడు గోపి.

"లేదు గోపి, లేదు! నిన్ను సాప్ట్ వేర్ ఇంజినీరుగా తీర్చిదిద్ది, నీలోనే తన ఫేస్ చూసుకుంటూ, బుక్ అయిపోయిన కరీనా ప్రేమకి అన్యాయం చేస్తావా గోపి! ఒక్కమాట గుర్తుంచుకో గోపి, నిజమైన ప్రేమ మొబైల్ నెంబర్ కాదు, ప్రేమకి పోర్టబిలిటి లేదు, లేదు, లేదు!!" రాధ అంటూ మరో చెట్టు దగ్గరకి వెళ్తుంది.

"రాధా, నువ్వు నన్ను అపార్ధం చేసుకున్నావు!కరీనా, నాకు ఆఫీసువాళ్లిచ్చిన ఫోనులాంటిది మాత్రమే! జీతం ఇస్తున్నందుకు దానిమీద గౌరవమే గాని, ప్రేమ లేదు!ఆ ఫోను ఆఫీసు పనికే పరిమితం గాని, మనసుకు కాదు రాధ! నన్ను నమ్ము!మా అమ్మకి మాట ఇచ్చాను, నీకు మనసిచ్చాను! ఈ సిమ్ముని మార్చను, మార్చలేను!" గోపి శూన్యంలోకి చూస్తూ అంటాడు.

"నిన్నే నమ్ముకుని, నీతో వైఫై కనెక్షన్ తో ఉన్న కరీనాను అన్యాయం చేయకు గోపి! నీ పేరునే పాస్ వర్డ్ గా పెట్టుకుని, తన ప్రేమని చాటుకుంది! కరీనాగోపి అనే పేరుతో వెబ్ సైటులో రాసే కథలు, మీ ప్రేమ కథనాలు కావా గోపీ!ఒక సెల్లులో రెండు సిమ్ములు ఇముడుతాయి గాని, ఒక హృదయంలో రెండు ప్రేమలు ఇమడలేవు గోపి!" అంటూ రాధ దగ్గుకుంటూ, ముక్కు తుడుచుకుంటుంది. గొంతుక పూడుకుపోతుంది.  గోపి ఆమె చెయ్యి పట్టుకుంటాడు. వేడిగా తగులుతుంది.

గోపి ఆమెవైపు అత్రుతగా చూస్తాడు.  ‘నన్ను ముట్టుకోకు’ అన్నట్టు రాధ తల అడ్డంగా ఆడిస్తూ, పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి పోతుంది!

గోపి, ఆమె వెంట పరిగెడతాడు! రాధ మాస్కు పెట్టుకుని మంచం మీద పడుకుని ఉంటుంది.

అక్కడితో సీను అయిపోయి, లాప్ టాప్ ఆగిపోయింది!

"అదేవిటయ్యా, అలా అర్ధాంతరంగా ఆపిసావు!" అంటూ అతని వైపు చూసాను.

"మరదే, ట్రయిలర్ అంటే అలాగే ఉంటాది! సినిమా అంతా సూపెట్టితే, కిక్కు ఏటుంటాదయ్య!"

"నీ దుంపతేగ, బాగా సస్పెన్షన్ లో పడిసావు కదయ్య! ఇంతకి గోపి కరీనాని పెళ్ళి చేసుకుంటాడా, రాధనా? రాధకి వచ్చింది మామూలు జ్వరమా, మహమ్మారి కరోనా జ్వరమా? తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా, లేదా?" అంటూ అతని మొహంలోకి చూసాను.

నా మాటలు వింటూనే భళ్ళున నవ్వేడు.

అయిదడుగుల దూరం జరిగి "తస్సాదియ్యా, ఈ సస్పెన్షన్ వచ్చిసినదంటే పిచ్చరు హిట్ అనమాట! ఓ మూడొందలు ఆన్ లైన్లో నా అకౌంటుకు కట్డి, మీ ఇమెయిల్ ఎడ్రసు ఇచ్చినారంటే, పుల్లు పిచ్చరు పంపుతాను. మీ ఇంటికాడే  సూసుకో వచ్చు! ఏటటంటారు? ఇంతకీ మీ కాడ ఏవైనా పాత సినిమాలు ఉన్నాయేటి?" అంటూ అసలు విషయం అడిగాడు.

"ఆర్నీ, పాత సినిమాలు ఇంట్లో ఉండడానికి ఇదేం టినగర్ కాదు, ఇది అయ్యకోనేరు గట్టు!"  అంటూ ఓ నవ్వు నవ్వాను.

"అదేటిసార్, అక్కడోళ్లందరూ ఇక్కడికి వచ్చిసినారంటే నను కూడా ఇక్కడకి వొచ్చిసినాను. ఇంతకీ తమరు?" అంటూ సంశయంగా నా వైపు చూసాడు.

"కతలు చెప్పి, కథలు రాసుకునేవాడ్నయ్యా! సినిమాలు తీసేవాళ్లు బొంకులుదిబ్బ మీదుంటారు! అటు వెళ్ళు!" అంటూ వెనక్కి తిరిగాను.

"ఉదయన్నే మాగొప్ప బేరం దొరికింది!" గొణుక్కుంటూ వెళ్ళిపోతున్న అతడిలో నాకు ఓ కొత్త దర్శకుడు కనిపించాడు!

*****

bottom of page