top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

పాపం సుబ్బలక్ష్మి గారు!

 

వెదురుమూడి రామారావు

vedurumudi-Ramarao.jpg

పాపం! సుబ్బలక్ష్మి గారు నిద్ర లో గట్టిగా అరుస్తున్నారు. “పట్టుకోండి, నన్నుపట్టుకోండి, పడిపోతున్నాను“ అంటూ.

 

 పక్కనే వున్న సుబ్బారావు గారు ఆమెని గట్టిగా పట్టుకొని "అదేమీ లేదు, నువ్వు మంచం మీదే వున్నావు. అంతా బాగానే వుంది, నేనూ ఇక్కడే వున్నాను" అంటూ ఒక గ్లాసుడు మంచి నీళ్లు తాగించారు. ఆమె సుబ్బారావు గారి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆయన వైపు తిరిగి ముడుచుకొని పడుకొన్నారు. మళ్ళీ నిద్ర లోకి జారుకున్నారు ఇద్దరూ. పొద్దున్నే ఈ సంఘటన చెప్తే "ఛ, అదేం గుర్తు లేదు" అని ఊరుకొన్నారు సుబ్బలక్ష్మి గారు.

రెండు, మూడు రోజులు గడిచాయి. ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ నిద్రలో అరవటం మొదలు పెట్టారు సుబ్బలక్ష్మి గారు. “పడి పోతున్నాను, పడిపోయాను" అని.

 

మెల్లిగా బుజ్జగించి ఏమీ అవలేదని  నిద్రకి ఓ మాత్ర యిచ్చి, భరోసా యిచ్చి పడుకోబెట్టారు సుబ్బారావు గారు.మర్నాడు ఉదయాన మళ్ళీ అంతా మామూలే. ఈ విషయం ఏమీ గుర్తులేదనటమే. "తెలీదు, ఇలా అరచినట్టు గాని, జరిగినట్టు గాని ఏ మాత్రం తెలీదు" అంటూ విచారంగా మొహం పెట్టారు. ఆవిడలో సుబ్బారావు గారిని, కుటుంబాన్ని గాభరా పెడుతున్నాను అనే బాధ వ్యక్తం అవుతోంది. ఇలాగే నాలుగు అయిదుసార్లు అవుతుంటే ఇంటిల్లిపాదికీ కొంచం గాభరా వేసింది. ఇలా వూరుకొంటే యిది ఎందులోకి దారి తీస్తుందో అనే భయం, అనుమానం అందరికీ కలిగింది. అందరినీ బాధ పెడుతున్నానా ఏమని ఆవిడకీ అభిమానంగా వుంది కూడా. యిది తనకి వున్న బీపీ, షుగర్ వల్లనేమో, దాని వికారమేమో అన్న అనుమానమొకటి కలగటంతో,  ఎందుకైనా  మంచిది, డాక్టర్ ని సంప్రదిద్దాం  అని నిర్ణయించుకొన్నారు అందరూ.  ఏదయినా గాలివాటమేమో! అనీ ఓ అనుమానం ఆవిడలో.

డాక్టర్ చారి వాళ్ళ ఫామిలీ డాక్టర్. చాలా పేరున్న డాక్టర్. ఎప్పటినుంచో ఆవిడ షుగర్ కి, బీపీ కి మందులు ఇస్తున్నారు. ఆయన ద్వారా ఒక పెద్ద డాక్టర్ తో అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకి ఈ అర్ధరాత్రి అరుపుల ఉదంతం అంతా క్షుణ్ణంగా వివరించారు. చాలా సేపు చాలా సీరియస్ గా పరీక్షించి చూసి, ఆయన ఒక పది రక్త పరీక్షలు కూడా చేయించాలని లిస్ట్ రాసి ఏ ‘విశ్లేషణ కేంద్రం’ కి వెళ్లాలో  చెప్పారు. ప్రస్తుతం వాడుతున్న మందులు కాక ఇంకో రెండు రకాల మందులు రాసి యిచ్చారు. నిద్రకు కూడా కొత్త మాత్రలు ఇచ్చి ఒక వారం తరువాత వచ్చి కలవ మన్నారు. వీటితో ఆవిడకి నీరసం ఎక్కువైపోయింది. విపరీతమైన నిద్ర. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పోతున్నారు. కానీ అప్పుడప్పుడు రాత్రుళ్ళు పడిపోతున్న భావన కలగటమూ, అరవడమూ, సుబ్బారావు గారిని లేపి కంగారుపెట్టటమూ మాత్రం మరింత ఎక్కువయిపోయింది. లాభం లేదని, మళ్ళీ డాక్టర్ ని కలసి మారని పరిస్థితిని వెళ్ళబోసుకొన్నారు దంపతులు. అంతా తీరికగా విని డాక్టర్ గారు "ఈ మారు మనం ఒక MRI తీయిద్దామండి. దాన్ని స్టడీ చేసి మనం మందులు సరిగ్గా నిర్ణయించాల్సి ఉంది" అన్నారు. MRI కి  ఏ ‘విశ్లేషణ కేంద్రం’ కి వెళ్లాలో కూడా చెప్పారు. తరువాతి వారం ఆ రిపోర్టులతో మళ్ళా డాక్టర్ ని కలిశారు వాళ్ళు.

 

ఆ సరికి ఆవిడ  దీనంగా, నీరసంగా  కనిపిస్తున్నారు. ఆ పెద్ద డాక్టర్  ఎమ్మారై రిపోర్టు చాలా తీక్షణంగా చదివి  “అంతా బాగుంది, ఏమీ లేదు" అని మళ్ళీ మందులు మార్చారు.

ఆ మందులతో నిద్ర బాగా పట్టటం తో కొంచం వ్యవధి వచ్చింది. కానీ మళ్ళీ ఆ పడిపోతున్నట్టున్న భావన, భయం తో అరవడం కొనసాగుతూనే వుంది. ఇంటిల్లిపాదీ విచారంగా వున్నారు. ఏం కారణం అయి ఉంటుంది? ఏం చెయ్యాలి? దూరంగా యూనివర్సిటీ లో చదువుతున్న మనవడు కూడా మామ్మ గారిని చూడడానికి వస్తానని అంటున్నాడు. పక్కింటి రమణ రావు గారు ఒక సలహా ఇచ్చారు. "ఇలాంటివి మామూలుగా నరాలకు సంబంధించిన జబ్బు అయి ఉండవచ్చు, ఒక మంచి నరాల వైద్యుడికి చూపించడం మంచిది". అని ఒక ఉచిత సలహా పారేశారు.

కష్టపడి మంచి నరాల వైద్యుడితో అపాయింట్మెంట్ కుదిరింది. అన్ని మెడికల్ రిపోర్ట్స్, ంఋఈ చూసి ఆయన "ఎందుకైనా మంచిది. మనం ఒక ECG తీయిద్దాం. దీనితో బ్రెయిన్ లో ఏమైనా అలజడులు వున్నాయేమో తెలుస్తుంది. ఈ లోపున పాత మందులు అన్ని ఆపేసి ఈ కొత్త మందులు వేసుకోండి. మంచి ECG కై పక్కనే వున్న 'గణేశా విశ్లేషణ కేంద్రం’ కి వెళ్ళండి" అని చెప్పారు. అలాగే ఆ నివేదిక ని తీసుకొని మళ్ళీ డాక్టర్ గారి ని కలిశారు. “బ్రెయిన్ లో ఏమీ లేదు. బాగా రెస్ట్ తీసుకోండి తగ్గిపోతుంది!” అని నవ్వుతూ సాగనంపారు డాక్టర్ గారు. మందులు మార్చటం వల్ల కడుపులో మంట, గ్యాస్ ఎక్కువై పోయాయి.  ఇంకా అప్పుడప్పుడు పడిపోతున్న ఫీలింగ్ ఉంటూనే వుంది.

ఇంకెవరో చెప్పారని మంచి మానసిక వైద్యుడిని కలసి ఈ విషయం ప్రస్తావించారు సుబ్బారావు గారు.ఇలాంటి జబ్బు ని 'స్లీప్ అప్నియా' అంటారు. వీటికి నిద్ర, రెస్ట్ అవసరం. ఏం గాభరా పడకండి.వయసుతో ఇలాంటివి  వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి మందులు అన్ని మానేయండి.“ అంటూ కొన్ని రకాల ప్రాణాయామాలు, వ్యాయామాలు చెప్పారు.

మందులు మానేయడం వల్ల తిరిగి బీపీ, షుగర్ మళ్ళా ఎక్కువై పోయాయి సుబ్బలక్ష్మి గారికి. ఆవిడ చాలా అస్వస్థతగా కనబడుతున్నారు. అందరిని  బాధ పెడుతున్నానే బాధా ఎక్కువైంది ఆవిడకి. ఈ లోపున పనిమీద వేరే ఊరు వెళ్ళి, ఊళ్ళోకి అడుగుపెడుతూనే ఈ వార్త విన్న సుబ్బారావు గారి స్నేహితులయిన సిద్ధాంతి గారు చాలా ఆందోళన పడుతూ ఉడుకు దుడుకు వచ్చి మంచి ఉపాయం చెప్పారు. "జనదృష్టి వల్ల ఇలా అవుతూ ఉండడానికి ఆస్కారం వుంది. ఆ మహాతల్లిది పెద్ద మనసు, పెద్ద సాయం. ఎవరి దృష్టి అయినా పడి ఉంటుంది. అంచేత కొన్ని జపాలు, పూజలు చేయించి దానాలు ఇప్పించండి. అన్నీ సర్దుకుంటాయి.“ అని! అదీ నిజమనిపించి ఆదివారం ఉదయం నాలుగు గంటల నించి  ఎనిమిది గంటలవరకు ఇంట్లో ముగ్గులు వేసి, జపాలు పూజలు జరిపించారు. ఈ హడావిడికి ఆవిడ బాగా అలసి పోయి సుఖంగా నిద్రపోయారు ఆ రాత్రి."హమ్మయ్య! ఇక బెంగ లేదు" అని గాలి పీల్చుకొన్నారు అందరూ. కానీ మర్నాడు మళ్ళీ మామూలే. అర్ధరాత్రి ఏదో టైం లో గబుక్కున లేచి సుబ్బారావు గారిని పట్టుకొంటూనే వున్నారు. కొంచెం సమయం తరువాత ఆయన వైపు కి తిరిగి హాయిగా పడుకుంటున్నారు.

‘వాట్స్ అప్’ లో ఈ ఉదంతాలని వింటున్న మనవడు పవన్ ఇంకా ఉండబట్టలేక హాస్టల్ నించి హుటాహుటిన బయలుదేరి వచ్చేసాడు. వాడు అందరికీ ముద్దుల మనవడు. మామ్మ దగ్గరగా కూర్చొని ముద్దు చేస్తూ " ఎందుకు మామ్మ ! ఇలా అవుతోంది? తగ్గిపోతుంది లే. నే వచ్చానుగా" అని ఓదార్చాడే కానీ మానసికంగా అలిసిపోయి ఉన్న మామ్మగారిని చూసి పవన్ చాలా బాధ పడ్డాడు. మామ్మా! ఈ రోజునించీ నేను నీ పక్కనే పడుకొంటాను. హనుమాన్ చాలీసా చెప్పుకొని పడుకొందాం.అంతా బాగా అవుతుంది, సరేనా?" అని భరోసా ఇచ్చాడు.

ఆరోజు రాత్రి తినగానే మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు మూతలు పడుతూండటంతో పడుకోడానికి రెడీ అయి మంచం మీదకి ఎక్కారు, మామ్మా మనవడు. తాతగారు మరో మూలకి చేరి ఆ సరికే గుర్రు పెడుతున్నారు. అటువైపు చూసి నిట్టూర్చింది మామ్మగారు "పాపం, ఎన్నాళ్ళయిందో ఆయనలా నిశ్చింతగా నిదరోయి?" అని.

 

ఒక్క రెండు నిముషాలు కూడా గడవలేదు.హఠాత్తుగా గట్టిగా అరచి లేచాడు పవన్. అదే పనిగా గట్టిగా నవ్వడం ప్రారంభించాడు.ఇటూ అటూ ఊగుతూ పొట్ట పట్టుకొని నవ్వుతున్నాడు. మామ్మగారు, తాతగారు, ఆ అరుపుకు పరిగెత్తుకొచ్చిన ఇంటిల్లిపాదీ గాభరాగా వాడినే చూస్తున్నారు. కొంచం సర్దుకొన్నతరువాత లేచి నించొని పవన్  నవ్వుతూ ఇలా చెప్పాడు "అయ్యో మామ్మా! ఈ మంచంకి మీ వైపు  వున్న కోళ్ల లో రెండిటికి స్క్రూలు వదులుగా అయ్యాయి.

అందుకని మీరు అటు తిరిగితే మీ బరువుకి మంచం ఒక పక్కకు ఒరుగుతోంది. అందుకని మీకు ఒక పక్కకు పడిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇన్నాళ్ళుగా. ఈ స్క్రూలు ఇలా గట్టిగా బిగించి మంచం లెవెల్ చేస్తే సరి " అంటూ అప్పటికి అపుడే వాటిని సరి చేసాడు.

 

ఇదంతా విని, మెదడులోకి అసలు విషయం ఇంకగానే ఇంటిల్లి పాదీ పడీ పడీ నవ్వుకొన్నారు.  జరిగిన రభస అంతటినీ తలుచుకుని తలుచుకుని మరీ సుబ్బలక్ష్మి గారు, సుబ్బారావు గారు తలలు పట్టుకొని నవ్వుకొన్నారు.  "మా బాబే! అవును. ఇంక అంతా బాగుంటుంది. ఇంక పడిపోనుకదా!" అంటూ తేటైన మొహంతో మంచం కోళ్ళని చూసుకున్నారు మామ్మగారు.

 

అప్పటినించి వారిద్దరూ, వాళ్ళిద్దరూ, వారితో పాటు ఇంట్లో అందరూ సుఖంగా హాయిగా నిద్ర పోసాగారు.

*****

bottom of page