MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
పాపం, భక్తుడేకదా!
మూలం: జయకాంతన్
అనువాదం: రంగన్ సుందరేశన్
ఇది 1967 లో ‘ఆనంద వికటన్’ వార పత్రికలో వెలుబడింది. ఐతే, తనొక మార్క్సిస్టుగా చెప్పుకునే జయకాంతన్ గారి కథలన్నీ యదార్థజీవితం, సామాజిక అంశాలని ప్రతిఫలింపజేస్తాయని అభిమానుల అభిప్రాయం. అలాగే “పాఠకుల వినోదం కోసం నేను ఒక వాక్యం కూడా రాయలేదు!” అని అతనూ చెప్పుకొచ్చారు. కానీ, ఈ కథలో ఒక మానవాతీత ఘటన చోటుచేసుకోవడం విమర్శకులని అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ ఊరు మధ్య ఆ కోవెల ఉంది. అయినా సందడి లేకుండా నిమ్మళంగానే ఉంది.
కోవెలంటే ఒక మైలు దూరంనుంచి చూసి, “ఆహా!” అని దాని స్థలపురాణంగురించి గొప్పగా వల్లించడానికి గోపురాలేవీ లేవు. చూసి, నివ్వెఱపడకుండా సొంత ఇంట్లోకి ప్రవేశించే భావనతో ఎవరైనా సరే ఈ కోవెలని దర్శించవచ్చు. ఏ పెద్ద ద్వారబంధమూ అడ్డు రాదు. కోవెలకి నాలుగు అడుగుల వెడల్పుకి నడవా, ప్రహరీ గొడా ఉన్నాయి. కోవెలలోకి అడుగుపెట్టగానే వరుసగా నల్లరాయి మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లమీద నిలబడితే పక్కనే దండిగా పెరిగిన పొన్నచెట్ల కాయలు, ఆశ్రయం మధ్య చల్లని పిల్లగాలి మనకి నిత్యమూ స్వాగతం చెప్తుంది. పక్కనేవున్న ఇప్పచెట్ల తోటలో ఆవులని మేయడానికి వదిలేసి కాపరులు ఈ కోవెల వసారాలో ఆవు-పులి ఆట ఆడుకుంటారు. ఆటకని వాళ్లు గీచుకున్న గీతలు గచ్చునేలమీద స్థిరంగా కనిపిస్తాయి. పగటివేళ వాళ్ళు అక్కడ ఆడుతూనో లేక నిద్రపోతూనో కాలం గడుపుతారు. దానికెవరూ ఆక్షేపించరు. వీటికి మధ్య చిన్నికృష్ణుడు ఒక అరలో సంరక్షణకని, తంతి తీగల వెనుక, చెయికి అందే దూరంలో దర్శనమిస్తాడు. మనం పిలుస్తే వెంటనే దూకి మన నడుంలో వచ్చి కూర్చుంటాడేమో అనే ధోరణిలో ముద్దుగా ఆ విగ్రహం ఉంది.
ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు మాటాడే ప్రజల ప్రీతికి పాత్రమైన ఆ కోవెలకి ఒక తమిళ బ్రాహ్మణుడే అర్చకుడుగా ఉన్నారు. కోవెలకని ఏదో కొంచెం ఆస్తి ఉండడంవలన అక్కడ నిత్యమూ దీపం వెలుగుతూనేవుంటుంది. ఉదయం, సాయంకాలం పూజలూ, సంవత్సరంకి ఒక సారి పదిరోజులకి సంబరాలు కొంచెం ఆడంబరంగానే జరుగుతాయి. సాయంకాలం స్త్రీలు కోవెలకి వస్తారు. ఆ సమయం ఆవులకాపరులు ఇళ్ళకి తిరిగివెళ్ళివుంటారు. ఇప్పచెట్లతోటలో కోకిలలు పాడుతూవుంటాయి. మధ్యాహ్నమంతా ఆవరించుకున్న వాతావరణంకి విరుద్ధంగా ఇప్పుడు సొగసు చోటుచేసుకుంటుంది. రాత్రి ఎనిమిది గంటలవరకూ ఆ ఆర్చకుడు అప్పణ్ణా కోవెలలోనే ఉంటూ, తొమ్మిది గంటలతరువాత చిన్నికృష్ణుడిని ‘కావలిలో బంధించినట్టు’ ఆ అరని మూసేసి, తాళం వేసి, ఇంటికి వెళ్తారు.
ఈ రోజుల్లో కొన్ని కోవెలలో అర్చకులు సేవ అని ఏదో చేసితీరాలని చేస్తున్నారే - అలా కాకుండా అప్పణ్ణా శ్రద్ధతోనూ, అందులో ఒక విధమైన సుఖానుభావంతోనూ, చిన్నికృష్ణుడు విగ్రహంని అలంకరిస్తారు. చూసి, చూసి అన్ని ముచ్చటలూ చేసి మురిసిపోవడం అతనికి అలవాటైపోయింది. ఒక తల్లి తన పాపని శృంగారించినట్టు ఉంటుంది అతని వాలకం. అందులో అతనికి గాఢమైన తృప్తి. తనకి సంతానం లేదన్న కొఱతని అప్పణ్ణా తీర్చుకుంటున్నారని కొందరు ఎగతాళి చేసేవారు. కాని ఆ మాటలు విని, నొచ్చుకొని, ఒక పక్క బాధ పడుతూ, మరొక పక్క నమ్ముతూ ఆ దంపతులు గడిపిన రోజులన్నీ గతించాయి. ఇప్పుడు అప్పణ్ణాకి వయస్సు యాభైకి మించిపోయింది. భార్యకి దరిదాపుగా యాభై ఐపోయింది. అందువలన సంతానం గురించి ఆ బెంగకూడా వాళ్ళకి లేదు.
అతని భార్య పట్టమ్మాళ్ అప్పుడప్పుడు కోవెల చుట్టుపక్కనున్న తోటలో పువ్వులు కోయడానికి వస్తుంది. తఱచుగా రోజూ అప్పణ్ణావే పువ్వులకని వస్తారు. పట్టమ్మాళ్ ఆ పూలని శ్రద్ధతో దండగా అల్లుతుంది. పొద్దున్నే ఆవిడ చిన్నికృష్ణుడికని ఫలహారం వండుతుంది. దాన్ని అప్పణ్ణా దేవుడికి నైవేద్యంగా అర్పించిన తరువాతే ఇద్దరూ భోంచేస్తారు.
వాళ్ళ ఇంటి ముందు ‘ఇక్కడ కోవెల ప్రసాదం దొరుకును’ అని సుద్దతో రాసిన ఒక బోర్డు వేలాడుతుంది. అదే వాళ్ల జీవనోపాయం అనికూడా అనవచ్చు. కాని ఆ దంపతులు బ్రతుకుతెరువుకోసం, ఆచారం అనుసరించకుండా ఏదీ చెయ్యరు. అది నిజంగానే నైవేద్యం చేసిన ప్రసాదమని అందరికీ తెలుసు.
కృష్ణుడు కోవెల ప్రసాదం, కృష్ణుడి కోవెల అర్చకుడు, కృష్ణుడి కోవెల అర్చకుని భార్య - ఇలాగ ఆ కోవెలతో సంబంధించిన వ్యక్తులతోబాటు కోవెలతో ఎటువంటి సంబంధమూ లేని ఇంకొక జీవికూడా ఉంది. దాన్ని’కృష్ణుడు కోవెల ముసలమ్మ’ అని అందరూ పిలుస్తారు. దాని పూర్వోత్తరం ఎవరికీ తెలియదు. కొన్నిసంవత్సరాలముందు ఈ ప్రాంతంలో ఆ ముసలమ్మ కనిపించింది. ఒక చెయిలో ఊత కోల, చుట్టబెట్టిన మారు చీర ఉన్న ఒక మురికి సంచితో ఒక సాయంకాలం ఆమె ఈ ఇప్పతోటలోకి ప్రవేశించింది. ‘ఇక నా బతుకు చాలు!’ అని అంటూన్నట్టు ఆమె మెడమీద తల నిత్యమూ ఆడుతునేవుంటుంది.
ఇక్కడకి వచ్చిన తరువాత ‘ఇదే నా లక్ష్యం!’ అని అందరికీ చెప్తున్నట్టు ముసలమ్మ ఇక్కడే స్థిరపడిపోయింది. రోజూ తెల్లవారుతున్నప్పుడే అక్కడనుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం ఆ మురికి సంచిలో తను పోగుచేసిన బియ్యంతో తిరిగివస్తుంది. వెంటనే వంట అని ఏమీ చెయ్యక నెమ్మదిగా నిద్రపోతుంది. రాత్రి తొమ్మిది గంటలకి అప్పణ్ణా చిన్నికృష్ణున్ని ‘చెరసాలలో బంధించి’, అరకి తాళం వేసి ఇంటికి తిరిగివెళ్ళే సమయంలో ఆ ముసలమ్మ ఇప్పచెట్టుకింద మూడు రాళ్ళని పరిచి, నిప్పు ముట్టించి, వండుకోడం చూస్తారు. ఆ మరుదినం పొద్దున్నే అతను పువ్వులు కోయడానికి వచ్చినప్పుడు ఆ చెట్టుకింద మసిబారిన మట్టి గిన్నెలు బోర్లపడివుంటాయి. ముసలమ్మ కోవెలలోకి వెళ్లిందని ఆనవాలుగా కోవెల నడవలో నీళ్ళు జల్లి శుభ్రం చేసిన సూచనలు కనిపిస్తాయి. నిత్యమూ ఆడుతున్న ముసలమ్మ తల లాగే గచ్చునేల మీదున్న ముగ్గుకూడా వంకరటింకరగా, కళ్ళకి అసహ్యంగా ఉంటుంది.
ఇంతవరకూ ఆ ముసలమ్మని కోవెల లోపల అప్పణ్ణా, అతని భార్యా, ఆవుల కాపరులు ఎవరూ చూడలేదు.
కాని దానికీ కృష్ణుడు కోవెల ముసలమ్మ అని పేరు వచ్చేసింది.
అది ఎవరితోనూ మాటాడని మూగ అనే కారణంవలన దాని పేరు ఎవరికీ తెలియదు. తనకి ఇతరులు పెట్టిన పేరుతో ఆమె ఏకీభవించిందా అనికూడా ఎవరికీ తెలియదు.
ఒకరోజు అప్పణ్ణా ఏదో పనిమీద పక్కనేవున్న ఒక ఊరుకి వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు అర్ధరాత్రి ఐపోయింది. రైలు స్టేషన్ వదిలి ఇప్పతోట ద్వారా కృష్ణుడు కోవెల దాటి వస్తూంటే కోవెలలో మనుషుల సందడి వినిపించగానే అతను ఆగారు. కొంచెం తొంగి చూస్తే చిన్నికృష్ణుడు సన్నిధిలో కూర్చొనివున్న ఆ ముసలమ్మ వీపు కనిపించింది.
‘ఈ అర్ధరాత్రిలో కోవెలలో దీనికేం పని? బయట చినుకులుకూడా లేవే?’ అని ఆకాశాన్ని ఒక సారి చూసి, సందడి చెయ్యకుండా అప్పణ్ణా కోవెలలోకి ప్రవేశించారు. ఇప్పుడు ముసలమ్మ వీపుతోబాటు ఆమె ముందున్న చిన్నికృష్ణుడికీ ఆమెకీ మధ్య ఉన్న తావులో పగిలిన ఒక చిన్న కుండ, అందులోని అన్నం - పక్కనే ఉన్న నూనె దీపం వెలుతురులో కనిపించాయి.
ముసలమ్మ కుండలోనుంచి ఒక పిడికెడు తీసి దాన్ని తంతి తీగల మధ్య పోనిచ్చి, చిన్నికృష్ణుడు ముఖంకి ఎదుటగా చూపిస్తూ తన మూగ బాషలో భక్తిరసంతో బతిమాలి, కృష్ణుడు దాన్ని తినేసాడు అనే తృప్తితో తనూ తినడం ఆరంభించింది. ఇలాగే ఆమె ఒక్కొక్క పిడికెడు అన్నం అతనికి తినిపించే ధోరణిలో ముద్దాడుతూ, నవ్వుతూ తనూ భోజనం చేసింది.
అప్పణ్ణా మనసులో ముందు పట్టరాని కోపం, ఆ తరువాత ఈ పిచ్చి ముసలమ్మ చేష్ట చూసి ఒక విధమైన జాలి చోటుచేసుకున్నాయి. అయనప్పటికీ దైవ సన్నిధానంలో ఇలాంటి అశుచి అతను భరించలేకపోయారు. ‘ముసలమ్మ మాటలు విందాం’ అని అతను కొంచెం ఆగారుకూడా. కాని ఆమె చేష్టలాగే ఆమె బాషకూడా అతనికి బోధపడలేదు. ఇన్నిరోజులూ ఒక ముసలమ్మగా పరిచయమైన స్త్రీ అతనికి ఇప్పుడొక నాలుగేళ్ళ బాలగా కనిపించింది.
అక్కడ జరుగుతున్నది చూస్తే అదేదో ఈ రోజు మాత్రం జరుగుతున్నఘటన కాదు, ముసలమ్మ ఈ ప్రాంతంకి వచ్చినప్పటినుంచి ఇది రోజూ జరుగుతోందని అతనికి బోధపడింది. ఆమె రోజూ కోవెల సన్నిధానం శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వెయ్యడానికి ఇదే కారణమని అతను ఊహించకలిగారు.
“ఏయ్ ముసలమ్మా!” అని అతను గట్టిగా మందలించిన కంఠధ్వని దాని చెవులకి అందనేలేదు.
సంతోషభరితమైన దాని అనుభవంలో తను అడ్డురావడంకూడా ఒక పాపమో అని అప్పణ్ణాకి భయం కలిగింది. కొంచెం సేపు అక్కడే నిలబడి ఆ దృశ్యం చూసినతరువాత తను వచ్చినది దానికి తెలియజేయకుండా తన దారిలో నడిచివెళ్ళిన అప్పణ్ణాకి ఇల్లు చేరుకున్నతరువాతకూడా నిద్ర రాలేదు.
కోవెల అర్చకుడనే హోదాలో తను ఆ ముసలమ్మని కోవెలనుంచి వెళ్ళగొట్టివుండాలని అంతరాత్మ అతన్ని పీడించింది.
‘అదేం చెత్తాచెదారం వండుతుందో ఎవరికి తెలుసు? దాన్ని దేవుడి సన్నిధానంకి తీసుకొనివచ్చి అశుద్ధం చెయ్యాలని ఆమెకి ఎలా మనసు వచ్చిందో?’ అని అప్పణ్ణా తల్లడిల్లిపోయారు. ఇక మరుదినం ఆరంభించి, తను రోజూ రాత్రివేళ ఆ కోవెల వెలుపటి తలుపులకికూడా తాళం వెయ్యాలని అతను నిశ్చయించారు.
***
ఇప్పుడెల్లా తెల్లవారిజామున కొన్ని గంటలు, సాయంకాలం కొన్ని గంటలు తప్పిస్తే మరెప్పుడూ కృష్ణుడి కోవెలలోకి ఎవరూ రావడం జరగదు. కోవెల ముందున్నరెండు ఇనుము తలుపులని - అవి చాలా రోజులుగా నేలతో నేలగా గట్టిగా పాతుకుపోయాయి, వాటిచుట్టూ పచ్చికకూడా దండిగా పెరిగిపోయింది - ప్రయాసతో బయటకి లాగించి, శుభ్రపరచి, కీళ్ళకి నూనె వెయ్యాలని, క్రిందటి వారం అప్పణ్ణా ఒక దినం కోవెలలో జరిగే సేవలు పూర్తిగా ఆపేసారు.
ఆవులకాపరులు ఇప్పుడు ఆవు-పులి ఆటలకి కోవెల మెట్లమీద గీతలు గీయడం మొదలుబెట్టారు. ఇప్పతోటలో ఆవులు మేయడం, కోకిలలు కూయడం ఆగనేలేదు. ఆ ముసలమ్మ మాత్రం ఇప్పుడు మరెక్కడా వెళ్ళకుండా ఆ చెట్టుకిందనే కూర్చొని మూసిన ఆ గుడి తలుపులని చూసి చూసి నిట్టూర్పు వదిలింది. కొన్నిసమయాల్లో లేచివచ్చి ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా ఇచ్చిన ఎంగిలి మెతుకులతో తృప్తిపడింది. చాలామట్టుకు రోజంతా చెట్టుకిందే నిద్రపోయింది. ఇప్పచెట్టుకింద మూడు రాళ్ళమధ్య ఉన్న ఆ పొయ్యి ఇప్పుడు శూన్యంగా ఉంది.
పూజకీ, పువ్వులకీ అప్పణ్ణా గుడికి వెళ్తున్నప్పుడు ముసలమ్మ అతన్ని దీనురాలుగా తేఱిచూసేది. ఎందుకో అప్పణ్ణాకి దాన్ని చూడడానికి భయం. చూడనట్టు అతను త్వరగా వెళ్ళిపోతారు. ఆ రోజు అర్ధరాత్రి తను చూసిన ఆ దృశ్యం గురించి అతను తన భార్యకికూడా ఇంతవరకూ చెప్పలేదు.
***
పదిరోజుల తరువాత చిన్నికృష్ణుడు కోవెలలో వార్షిక ఉత్సవంకి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కొవెలముందు పందిరి వేసారు. జండా ఎత్తారు. సాధారణ రోజుల్లో అపేక్షతో చూసి చూసి చిన్నికృష్ణుడిని అలంకరించే అప్పణ్ణా ఈ పుణ్య దినం కొంచెం అశ్రద్ధతోనే ఆ పనికి పూనుకున్నారు.
ముందు బాలకృష్ణుడు చేయికి కంకణం తొడిగారు.
‘ఇదేంటి, కాలుకి తొడగవలసిన అంటిమని చేయికి అందించేసాను, అందుకే అది వదులుగా ఉంది!’ అని అప్పణ్ణా తనలో తనే నవ్వుకొని దాన్ని చేయినుంచి తీసారు.
ఏం ఆశ్చర్యం, అది అంటిమకాదు. కంకణమే!
‘ఇదెలా ఇంత పెద్దగా మారిపోయింది? కిందటి సంవత్సరం ఎంత చక్కగా నా కళ్ళకి కనిపించిందే, ఇప్పుడేం ఐంది?’ అని విసుగ్గుంటూ అప్పణ్ణా ‘సరే, అంటిమని తొడిగిద్దాం!’ అని పూనుకున్నారు.
అదీ కాలులో సరిగ్గా చేరకుండా నేలమీద వాలిపోయింది!
‘ఇదేం పరీక్షరా?’ అని అనుకంపతో అప్పణ్ణా చిన్నికృష్ణుడు ముఖం చూసారు.
‘ఓ, ఆ ముఖంకూడా ముడుచుకొనివుందే! చిరునవ్వు కనిపించదేం? చిన్నికృష్ణుడు చిక్కిపోయాడా?
‘అవును, చిన్నికృష్ణుడు బాగా చిక్కిపోయాడు!’
‘ఇది నేను చెప్తే ఎవరైనా నమ్ముతారా? లోకజ్ఞానం అనే వంకలో నాస్తిక వాదం గట్టిగా కొనసాగే ఈ రోజుల్లో నాకు పిచ్చి పట్టిందనేకదా అంటారు? అసలు నాస్తికులు నవ్వడం అలా ఉండనీ, ఈ కోవెలకి భక్తితో చిన్నికృష్ణుడిని దర్శించడానికి వచ్చే ఏ ఆస్తికుడైనా నేను చెప్పేది నమ్ముతాడా?’ అని కలవరపడుతూ, ఏమీ తోచక, అప్పణ్ణా చాలా సేపు అక్కడే కూర్చుండిపోయారు.
రాత్రి తొమ్మిది గంటలకి కోవెల బయటకి వచ్చినప్పుడు అతను ఆ ముసలమ్మని చూసారు. సంబరాలు జరుగుతున్న పందిరి వెలుతురులో ఇరుగుపొరుగుల పిల్లలందరూ ఉద్రేకంతో ఆడుతూంటే తన్ను మరిచి ముసలమ్మ ఆ వైభవం చూసి ఆనందించడం గమనించారు.
అప్పణ్ణా దాని మొహం చూసారు. ఆమె మూగ, కాని ఆ మొహంలో ఎన్ని భావనలు, ఎన్నిఅనుభవ రేఖలు! ఎన్ని శోచనీయమైన గురుతులు!
అప్పణ్ణా ముసలమ్మగురించి ఆలోచించారు: ‘ఇప్పుడు ఈమె ఒంటరిగా కనిపించినా ఇంతకుముందు పిల్లలతో కాపురం చేసిందేమో? ఏమైందో ఎవరికి తెలుసు? దీనికి భోజనం కూడా ఒంటరిగా చేసే అలవాటు లేదు కాబోలు! అందువలనే చిన్నికృష్ణుడితో కలిసి భోంచేసిందా? దాన్ని మనం అడగలేం! మూగమనుషులు మాటాడరు, జాడగా చెప్తారు! అలాగేదో చిన్నకృష్ణుడికి ఈ మసలమ్మ తెలియజేసిందేమో? చిన్నికృష్ణుడు మాత్రం మాటాడుతాడా? నాకతను ఏదో చెప్తున్నాడా? ఇవన్నీ మాటల్లో గ్రహించడం అసాధ్యం! లోకజ్ఞానం భక్తికి శత్రువు! నేనిచ్చిన నైవేద్యం దేవుడు స్వీకరిస్తున్నాడని నేను నమ్ముతున్నాను, అది దేవుడి ప్రసాదమని ఊరులో అందరూ నమ్ముతున్నారు. అది సరే అని అంటే మరి ఈ ముసలమ్మ అంతరంగికంగా, అనురాగంతో ఇచ్చినది దేవుడు అంగీకరించడని అనడానికి నాకేం హక్కు ఉంది? దానికోసమే ఆ పదిరోజులూ చిన్నికృష్ణుడు కాచుకొనివున్నాడా? నేను పదిరోజులు వాడిని ఆకలితో వదిలేసానా?’ ఇలాంటి ఆలోచనలు అతన్ని పీడించాయి.
ఆ రాత్రి ఇంటికి తిరిగివచ్చినప్పుడు అప్పణ్ణా కోవెల బయటనున్న ప్రాకార ద్వారాలని మూయకుండా -విశాలంగా తెరిచిపెట్టి - వెళ్ళారు.
***
కొన్నిరోజులతరువాత రాత్రి తొమ్మిది గంటలకి ఇప్పతోటలో ఒక చెట్టుకింద పొయ్యిలో మండుతున్న నిప్పుని చూస్తూనే అప్పణ్ణా ఇంటికి నడిచి వెళ్ళారు. అందులో ఏదో ఉడుకుతోంది. అప్పణ్ణా భుజంమీదున్న తువ్వాలుతో తన ముక్కు మూసుకున్నారు.
పాపం, అతను భక్తుడేగా! దేవుడు కాదు!
*****