top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

ఒక పోలీసు డయరీలో ఒక రోజు

 

హేమ వెంపటి

hema-vempati.jpg

"టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మేన్ !"  కాలమూ కెరటమూ ఎవరికోసమూ  ఆగవు.  కరోనాకి వెరసి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అమలవుతూ అప్పటికే ఆరు వారాలు గడిచాయి.

2020 మే నెల వచ్చింది. రోహిణీ కార్తె కావడంతో, ఎండలు విపరీతంగా ఉన్నాయి. కాలేజీకి, జనరల్ హాస్పిటల్ కి, రైతు బజారుకి, రైలు స్టేషన్ కి - ఇలా నాలుగు వైపులకు  వెళ్లే నాలుగు వీధుల కూడలి అది. ఆ కూడలిలో కరోనా కట్టడిని జనం సక్రమంగా పాటించేలా చూసే పని పోలీసు వీరాస్వామికి పడింది.

అతనితోపాటుగా అక్కడ డ్యూటీ చేసే నారాయణమూర్తి కరోనా సోకి ఆసుపత్రి పాలవ్వడంతో పోలీస్ వీరాస్వామి  ఒంటరి వాడు అయ్యాడు. ఆ కూడలిలో ఉన్న నాలుగు వీధులను ఇతడు ఒక్కడే కావలి కాస్తున్నాడు.  ఆ వీధుల వెంబడి మాస్కులు లేకుండా ఎవరు మసలినా, వ్యక్తిగత దూరం పాటించకుండా గుంపులుగా ఎవరు తిరిగినా నిలబెట్టి మందలించి, దిశా నిర్దేశం చేసి, వాళ్ళను సంస్కరించి, కర్తవ్యమ్ బోధించి పంపడం అతని డ్యూటీ. 

అప్పుడు టైం తొమ్మిది అయ్యింది. కానీ, ఎండ తీక్షణత ఎక్కువగానే ఉంది.  ఆ కోరెండలో, పోలీసు వీరాస్వామి చెమటలు కక్కుకుంటూ బాధ్యతగా  తన డ్యూటీని నిర్వహిస్తున్నాడు. ఉన్న కర్మకు ఉపాకర్మ తోడయ్యింది - అన్నట్లుగా, పోలీసు యూనిఫారంకి మాస్కుకూడా జోడయ్యింది, పాపం అతగాడికి!

"లాక్ డౌన్" వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. నున్నటి  మెటల్ రోడ్డుపై పడిన ఎండకి  అతని కళ్ళు మిరిమిట్లవుతూండడంతో అన్నీ మసక మసకగా కనిపిస్తున్నాయి. కొంచెం దూరంలో ఉన్న పక్కరోడ్డు మలుపు  తిరిగి ఎవరో తనవైపుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి. కానీ మిరిమిట్లవుతున్న తన కళ్ళు భ్రమ పడుతున్నాయేమో - అనుకున్నాడు. ఆ వ్యక్తి మరికొంచెం దగ్గరకు వచ్చాక తెలిసింది, ఆమె ఒక తలపండిన వృద్ధురాలనీ, ఆమె ముఖాన మాస్కు లేదనీను. వెంటనే అతనికి తన డ్యూటీ గుర్తొచ్చింది. ఆమెకు ఎదురుగా నడిచాడు. 

తన దారికి అడ్డుగా నిలబడ్డ పోలీసుని వింతగా చూసింది ఆ మామ్మ. 

"మాస్కేది మామ్మా?" నిలదీసి అడిగాడు ఆమెను పోలీసు వీరాస్వామి. 

ఆశ్చర్యపోయిన మామ్మ, "మాస్కంటే ఏమిటి బాబూ " అని బదులు అడిగింది.

 

"మాస్కంటే తెలియదా! ఇదిగో ఇది" అంటూ, తన జేబులోనుండి ఒక మాస్కుని తీసి ఆమె ముఖానికి తగిలించాడు వీరాస్వామి. 

కెవ్వు మంది మామ్మ!.  "అయ్య నీ మొహ మీడ్చ! నా మడి మంట కలిపేశావు కదురా! ఏకాదశి కదాని  ఉపవాసముండి, మడిగా దైవదర్శనానికి వెడుతున్నా. నా వ్రతం

 చెడగొట్టావు కదురా దుర్మార్గుడా" అంటూ గిరుక్కున వెనక్కి  తిరిగి, వచ్చిన దారినే విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. 

నిర్ఘాంతపోయిన వీరాస్వామి తేరుకునే లోగానే ఆమె మలుపు తిరిగి కనిపించకుండా  పోయింది. 

ఉసూరుమని నిట్టూర్చి వీరాస్వామి జేబులోని  రుమాలు తీసి, మాస్కును తొలగించి  ముఖం, కళ్ళు  తుడుచుకున్నాడు. 

నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధుల్లో ఉండుండీ ఒకో ప్రయివేట్ వెహికిల్ వేగంగా  వెళ్ళిపోతోంది. బక్క చిక్కిన కుక్క ఒకటి రోడ్డు వారగా తిండి వెతుక్కుంటూ తిరుగుతోంది. లాక్ డౌన్ వల్ల జనజీవనం స్తంభించడంతో మనుష్యులకే సరైన తిండి తక్కువైపోయింది. ఇక వీధి కుక్కల్లాంటి అల్ప జీవులకు తిండెక్కడ దొరుకుతుంది!

 

అప్పుడప్పుడూ ఒక్కోమనిషి అత్యవసర మైన పనులమీద బయటికి వచ్చినా వాళ్ళు కరోనా కట్టడిని అక్షరాలా పాటిస్తూ, మాస్కులు ధరించి ఉండడంతో వీరాస్వామికి  పని పడలేదు. కొంత సమయం అలా గడిచిపోయింది. అంతలో, దూరంగా కాలేజీ వీధినుండి కొందరు గుంపుగా వస్తున్నట్లు కనిపించింది.

వాళ్ళు మోటారు బైక్కులమీద వస్తుండడంతో క్షణ క్షణానికీ కూడలికి దగ్గరవుతున్నారు . 

ఒక్కొక్క బైక్ పై ముగ్గురు సవారీ చేస్తూ, పెద్ద పెద్ద కేకలు పెట్టుకుంటూ, గఫ్ఫాలు కొట్టుకుంటూ కూడలి  వైపుగా వస్తున్నారు కొందరు యువకులు. కొంచెం దగ్గరగా వచ్చేసరికి తెలిసింది వీరాస్వామికి, వాళ్ళు మాస్కులు ధరించి లేరని. వెంటనే అతనిలోని పోలీసు లేచాడు డ్యూటీ చెయ్యడానికి, కానీ వివేకమ్ నిద్రలేచింది.  

"ఆగు, నీ కొలీగ్  నారాయణమూర్తికి ఏమి జరిగిందో గుర్తులేదా? వాళ్ళు జమాజ్జట్టీల్లాంటి పదిమంది యువకులు, నువ్వు చూస్తే ఒక్కగా నొక్కడివి.

"అనువుగానిచోట అధికులమనరాదు, కొంచమైననేమీ కొదువ కాదు"  అన్నారు పెద్దలు . అది గుర్తుంచుకో..." అంటూ అంతరాత్మ హెచ్చరించింది వీరాస్వామిని. 

కొందరికి ఏదైనా ఒక రూలు ఉంటే దాన్ని భంగపరచాలన్న ఉబలాటమే ఎక్కువగా ఉంటుంది. దాన్ని అనుసరించడం వల్ల వచ్చే మేలుపై వాళ్ళ దృష్టి ఎంతమాత్రం పడదు.

 

పది రోజుల క్రితం నారాయణమూర్తీ, తానూ డ్యూటీమీద ఒకచోట కలిసి  పనిచేస్తూండగా, తను "ప్రకృతి పిలుపు" (call of nature)  రావడంతో అక్కడనుండి  వెళ్ళవలసివచ్చింది. నారాయణమూర్తి ఒక్కడే ఉన్నాడు డ్యూటీ లో.  తాను తిరిగి వచ్చేసరికి అతడు నేలమీద పడివున్నాడు లేవలేని స్థితిలో. అక్కడ  జరిగినదేమిటో చెప్పాడు బాధతో  మూలుగుతూ. "కొంతమంది గుంపుగా చేరి, మాస్కులైనా ధరించకుండా కబుర్లు చెప్పుకుంటూ, కేరింతలు కొడుతూ రోడ్డునపడి వస్తూంటే, నేను వాళ్ళని  ఆపి, హెచ్చరించాను. 'లాక్ డౌన్ ఉందని  మీకు తెలియదా? ఇలా గుంపుగా రోడ్ల వెంట  తిరగడం పనిషబుల్ నేరం ఔతుంది. మాస్కులు వేసుకోకపోడం కూడా నేరమే! మీకు కరోనా భయంలేదా ' అని అడిగా. వారిలో ఒకడు, 'మాకులేని దురద నీకెందుకు పోవోయ్' అన్నాడు తల ఎగరేసి నిరసనగా.  లాఠీతో అతని భుజం తట్టి అన్నా, 'మీకు లేకపోవడం వల్లే మేము కల్పించుకోవలసి వస్తోంది.  దీనికి పనిషమెంటు ఏమిటో తెలుసా?'  అనగానే వాళ్ళు రెచ్చిపోయారు. నా చేతిలోని  లాఠీ ఊడలాక్కొని విరిచి పారేసి, అంతా కలిసి నాపై విరుచుకు పడ్డారు. నా మాస్కు పీకేశారు,  ఒకరొకరూ నా మొహంపై ఊదారు, దగ్గారు , నానా అల్లరీ చేశారు. నేను ఒక్కడినైపోయా, సమయానికి నువ్వుకూడా లేవు .  వాళ్ళు నన్ను కొట్టి, గుద్ది, తన్ని నా ఒళ్ళంతా హూనం చేశారు" అన్నాడు నారాయణ  మూర్తి బాధతో.

వెంటనే తను అంబులెన్స్ కి ఫోను చేసి, అతన్ని తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ గాయాలు తగ్గి, ఆసుపత్రి నుండి బయటికి రాకముందే కరోనా వచ్చిందని ఋజువు కావడంతో, అటునుండి అటే అతన్ని క్వారంటైన్ కి తరలించారు. ఇంకా అతడు వెండిలేటర్ మీద, వైద్య పరివేక్షణలోనే ఉన్నాడు. చివరకు ఏమవుతుందోనని అతని భార్యాబిడ్డలు, సన్నిహితులు గగ్గోలు పడుతున్నారు.  హా! హతవిధీ!! ఆ ముఠాలో ఎవరికో కరోనా పాజిటివ్ ఉంది కాబోలు, వెంటనే అది ఇతనికి అంటింది. మంచికి పోతే,  చెడు ఎదురయ్యింది నారాయణ మూర్తికి, పాపం! 

ఆ ఆలోచన రాగానే సానుభూతితో స్పందించాడు వీరాస్వామి. 

అందుకే, "అనువుగానిచోట అధికులమనరాదు, కొంచెమైననేమీ కొదువ కాదు" అన్నారు పెద్దలు. 

"నేనిప్పుడు ఆ సూక్తిని పాటించి ఆ దుర్మార్గులనుండి తప్పించుకుంటా. దుర్మార్గులు కాకపొతే వాళ్ళు, జనానికి మేలు జరగాలని ప్రభుత్వం పెట్టిన  రూల్సుని బ్రేక్ చెయ్యాలని ఎందుకు అనుకుంటారు" అన్న ఆలోచన వచ్చింది వీరాస్వామికి.

 

ఇంగితం హెచ్చరించగా అతడు ఉన్నచోటనే ఉన్నట్లుగా స్థాణువులా బిగిసిపోయి నిలబడిపోయాడు, " డ్యూటీ ఫస్టు" అంటూ మనసు పెడుతున్న పెను  ఘోషను పంటి బిగువున  పట్టించుకోకుండా. 

బైకుల మీద వస్తున్న, శ్రీమంతుల బిడ్డలైన ఆ ఆకతాయి మూకకు అది నచ్చలేదు. కరోనా కట్టడి పాటించనందుకు సెంటర్లో కాపలాగా ఉన్న పోలీసు  తప్పకుండ చెయ్యెత్తి తమని ఆపుతాడని వాళ్ల కు తెలుసు. అలా ఆపినప్పుడు, పాతికో, పరకో చాపి ఉంచిన  అతడి చేతిలోపెట్టి, అతడి చెయ్యి కింద, తమ చెయ్యి పైనా  ఉండేలా చేసి, తమ ఆధిక్యాన్ని, అతని కక్కుర్తి గుణాన్ని నిరూపించాలన్నది వాళ్ళ ప్లాన్.  

అక్రమ సంపాదనకు చటుక్కున చెయ్యి చాచే పోలీసుల బలహీనతను ఎత్తి చూపించి, తాము  వెళ్లిపోవచ్చులెమ్మని భావించిన వాళ్లకి అక్కడి పరిస్థితి దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక్క లిప్త కాలంపాటు వాళ్ళ కేరింతలు ఆగిపోయాయి. మళ్ళీ అంతలోనే తేరుకుని, విగ్రహంలా కదులూ,  మెదులూ  లేకుండా నిలబడివున్న వీరాస్వామి చుట్టూ పెద్దపెద్ద కేకలు పెట్టుకుంటూ, ముమ్మారు గుండ్రంగా తిరిగి, హేళనగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు.  అంతసేపూ ఊపిరి బిగబట్టివున్న వీరాస్వామి, వాళ్ళు వెళ్ళిపోగానే "బ్రతుకు జీవుడా" అని తెప్పరిల్లి, చెవులకు తగిలించియున్న తన మాస్కు సరైన పొజిషన్లో ఉందో, లేదో చెవుల దగ్గర తడిమి చూసుకుని, "హమ్మయ్య" అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. .  

 

లంచ్  అవర్ అయ్యింది, కానీ వీరాస్వామిని రిలీవ్ చెయ్యవలసిన పోలీస్ వెంకటరమణ మాత్రం ఇంకా అక్కడకు రాలేదు. కడుపులో ఆకలి నకనక 

లాడుతోంది వీరాస్వామికి. ఇక్కడకు చాలా దూరంలోవుంది వాళ్ళ ఇల్లు. ఏ పెట్రోలింగ్ వ్యాన్నో  పట్టుకుని వెళ్లినా సుమారుగా గంట ప్రయాణం. ఈ పూట  తనకు తప్పనిసరి ఏకాదశే -  అనుకున్నాడు బాధగా అతడు. 

కళ్ళు బైర్లు కమ్మేలా ఉంది ఎండ. నిస్సహాయంగా రమణ వచ్చే దిక్కుకు చూస్తూ పడిగాపులు పడుతున్నాడు వీరాస్వామి.  అంతలో ACP కారు అటువైపుగా  వచ్చింది. ఆ కారుని గుర్తుపట్టగానే అటెన్షన్ లో నిలబడి, కారులో ఎవరున్నారో తెలియకపోయినా, ఎందుకైనా మంచిదని ఒక సెల్యూట్ కొట్టాడు. ఈ కోరెందులో నిస్త్రాణతో కళ్ళు మూతలుపడుతూండగా, కారులో బాస్ ఉన్నదీ లేనిదీ కనిపెట్టడం కుదిరేపని కాదు. అయినా కానీ, ఆయన ఉన్నారనుకొని సాల్యూట్ చెయ్యడం క్షేమకరం.  లేరనుకుని సెల్యూట్ చెయ్యకపోతే, అవిధేయతకు తనకు శిక్ష తప్పదు. 

ఒకసారి ఏమయ్యిందంటే... 

అది ఆదివారం. సెలవు కదాని పిల్లల్ని "జూ"కి తీసుకు వెళ్లాలని ప్లాన్  చేశా.  కానీ  ఆరోజు ఉదయం, ACP గారు రమ్మనమన్నారని కబురొచ్చింది ఫోన్లో.  ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కదా! వెళ్ళాడు తను. గుమ్మంలోనే పలకరించారు అమ్మగారు.

 "మధ్యాహ్నం   అయ్యగారి ఫ్రెండ్సు వస్తున్నారు.  కాస్త  సాయంగా ఉంటావని పిలిపించా నిన్ను" అన్నారు ఆమె. 

ఇంకేముంది - ఇల్లు సద్దడం, సోఫాలకి, దిళ్ళకి తొడుగులు మార్చడం వగైరా పనులన్నీ ముగించి, ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టాడు తను. గెస్టులకు స్నాక్ గా పకోడీలు చెయ్యడానికి తలపెట్టారు అమ్మగారు. 

ఇంతవరకు తాను తల్లికిగాని, పెళ్లానికిగాని  ఇలాంటి సాయం ఎప్పుడూ చెయ్యలేదేమో, అలవాటు లేక ఉల్లిపాయ ఘాటుకి తన కళ్ళు వర్షించసాగాయి.  నీటిపొర అడ్డం రావడంతో "సార్" రావడం తనకు తెలియలేదు. తను కత్తిపీట మీదనుండి లేచి నిలబడి ఆయనకు  శాల్యూట్ చేయనందకు ఆయన తనను  ఎన్నాళ్ళో సలపసాధించారు. ఆయనకు ట్రాన్ఫర్ అయ్యాక గాని ఆయన  కోపాన్నుండి తనకు విముక్తి కలుగలేదు. "వన్స్ బిటెన్, ట్వైస్ షయ్!" 

***

ఒకపక్క ఎండా, మరో పక్కన ఆకలి! రెండూ మద్దెల దరువులా ఎడా, పెడా వాయించేస్తూంటే నిస్సహాయంగా నాలుగు వీధుల్నీ కలయజూస్తూ, కూడలికి మధ్యలో ఉన్న మెటల్ గొడుగు  తాలూకు చాలీ  చాలని నీడలో తలదాచుకుని, పోలీస్ వెంకటరమణ రాకకోసం ఎదురుచూస్తూ,  ఆపసోపాలు పడుతూ నిలబడి ఉన్నాడు  వీరాస్వామి.  

దూరాన, మార్కెట్ వైపునుండి ఒక వ్యాను వస్తూ కనిపించింది. కానీ   వీరాస్వామి అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు . ఆకలిని అణుచుకోడం కోసం సీసా ఎత్తి,  ఎండకు కాగిన ఆ వేడి నీళ్లనే కాసిని గొంతుకులో పోసుకునే సంరంభంలో ఉన్నాడు. అతనికి దగ్గరగా వచ్చి సడన్  బ్రేకుతో ఆగింది ఆ వ్యాను.

 

ఆ వ్యాను డ్రైవరు కిటికీలోంచి మొహం బయటకు పెట్టి, "ఏరా, ఇంకా ఇంటికి పోలేదా? నీకు  హాఫ్ డ్యూటీ కదా" అని అడిగాడు. 

ఆ పలకరింపుకి ఉలిక్కిపడి,  తలెత్తి చూసిన వీరాస్వామి, "ఓరి నీ ...! నువ్వుట్రా మల్లేశు !నిజానికి నాకు  ఆఫ్ డ్యుటీయే, కానీ రమణగాడు వచ్చి డ్యూటీ ఎక్కాకగాని నేను డ్యూటీ దిగడానికి లేదు. లంచ్ అవర్ దాటింది, ఆకలి దహిస్తోంది. వాడి కీవేళ  ఏ మయ్యిందోగాని ఇంకా రాలేదు" అన్నాడు.  

 వెంటనే స్పందించాడు మల్లేశు. అతడు వీరాస్వామికి చిన్ననాటి స్నేహితుడు.

 

"అలాగా! ఆగు" అంటూ, తన సహాయకుణ్ణి పిలిచాడు మల్లేశు, "అరె బాలూ! సారుకి ఒక పేకెట్ ఇవ్వరా" అన్నాడు.   బాలూ ఒక పార్సిల్ తీసి వీరాస్వామి చేతిలో ఉంచాడు. 

ఆపై మల్లేశు వీరాస్వామివైపు తిరిగి, " రమణ వచ్చాక తీరికగా ఇంటికి వెళ్లొచ్చులే, ముందుగా నువ్వు ఈ భోజనం చెయ్యి.  ఈ రోజు నేను రైలు స్టేషన్లో ఉన్న వలస కూలీలకు భోజనం తీసుకెడుతున్నా. నేను వెళ్ళాలి, నాకోసం వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారు, పాపం! " అంటూ, వీరాస్వామికి భోజనం పేకెట్టు, చల్లని మంచినీళ్ల సీసా ఇచ్చి మల్లేశు తన పనిమీద వెళ్ళిపోయాడు.

ఆ పార్సిల్ చేత పట్టుకుని వీరాస్వామి, తిండి తినడానికి తగిన శుభ్రమైన చోటుకోసం  చుట్టుపక్కల కలయజూశాడు. ఎక్కడా శుభ్రమైన చోటు కనిపించలేదు. "స్వచ్చ్  భారత్" ఉద్యమము ఇట్టే వచ్చి అట్టే మాయమైపోయింది. ఆ ఉద్యమ లీడర్లందరూ చీపురుకట్టలు పట్టుకుని ఫోటోలు దిగి తృప్తిపడిపోయారు. ఆంధ్రులు ఆరంభ శూరులని మరోసారి ఋజువయ్యింది.

 

రోడ్లవార చెత్త చెదారం చాలానే పేరుకుని ఉంది. నానారకాల  కస్మెలం ఉంది అక్కడ.  తినడానికి అనువైన చోటుకోసం వెతుక్కుంటున్న వీరాస్వామికి, " రోడ్డు మాత్రమే శుభ్రంగా ఉంది" అనిపించింది. వేగంగా కదిలే కార్లవల్ల ప్రేరేపితమైన గాలి ఎప్పటికప్పుడు రోడ్డుని శుభ్రపరుస్తుంది కనుక! వచ్చేకార్లు, వెళ్ళేకార్లు ఒకదానినొకటి గుద్దుకోకుండా మధ్యలో కట్టబడిన డివైడర్ పక్కన కూర్చుని, ముందుగా  కాసిని చల్లని నీళ్లు గొంతుకులో పోసుకుని, ఫుడ్ పేకెట్ విప్పాడు వీరాస్వామి. 

ఆ సమయంలో ఒక కారు అటువైపుగా వచ్చింది. కడుపుని దహిస్తున్న ఆకలిని చల్లార్చే పనిలో, ఆవురావురుమంటూ తిండి తింటున్న వీరాస్వామి ఆ కారుని గమనించలేదు. కానీ, ఆ కారులోని వ్యక్తి  ఒక్క క్షణం అక్క డ ఆగి, తన సెల్ఫోన్లో  వీరాస్వామి భోజనం చేస్తున్న తీరుని  రెండే రెండు సెకన్లపాటు వీడియోగా తీసి రయ్యిన వెళ్ళిపోయాడు, తనకు ట్విట్టర్ లో,  ఫేస్ బుక్ లో పెట్టడానికి ఒక అద్భుతమైన పోస్టు దొరికిందన్న సంబరంతో. 

****

భోజనం ముగించి, లేచేసరికి, పోలీస్ వెంకటరమణ అగుళ్ళు కక్కుకుంటూ, పరుగులాంటి నడకతో తనవైపుకు రావడం కనిపించింది వీరాస్వామికి.

    

వస్తూనే, "అన్నా! క్షమించు... తప్పైపోయింది, సారీ" అంటూ తల వంచుకుని వీరాస్వామి చేతులు పట్టుకున్నాడు రమణ.

జఠరాగ్ని చల్లారడంతో శాంతించిన వీరాస్వామి, రమణను ఏమీ కోప్పడలేదు. "ఏమయ్యింది రమణా! ఎందుకింత ఆలస్యమయింది" అని మాత్రమే అడిగాడు.

రమణ నిట్టూర్చి చెప్పసాగాడు, " అన్నా!  ఏం చెప్పమంటావు.  ఇక్కడకని బయలుదేరి వస్తూంటే మా ఊరి వాడొకడు కనిపించి, "బాబ్బాబూ! ఈ ఉపకారం చెయ్యి, చచ్చి నీ కడుపున పుట్టి, నీ సేవ చేసుకుంటాను. కూతుర్ని చూడాలని వచ్చిన నేను ఇక్కడ చిక్కుకున్నాను" అంటూ నా వెంటపడ్డాడు.

 

ఆయబ్బి తెలంగాణానుండి ఆంధ్రాకు వచ్చాడు. లాక్ డౌన్ మూలంగా స్వేఛ్చగా బోర్డర్ దాటడానికి వీలుకాదు కదా! పోలీసులనుండి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికెట్ పుట్టించడానికి నా సాయం అడిగాడు. పాపం! పెద్దవాడు. కాదనలేకపోయాను. నీకు ఇబ్బందవుతుందన్నది ఆ సమయంలో నాకు గుర్తురాలేదు. బోర్డర్ దాటేందుకు కావలసిన ఏర్పాటు చేసేసరికి గంట పట్టింది. అతనిని సాగనంపి ఇవతలకు వచ్చాక అది గుర్తొచ్చి, పరుగుపరుగున ఇటు వచ్చా. మన్నించు అన్నా!"

అతను చేసిన మంచి పనేకాదు, అతని అపాల్జేటిక్ టోను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన అతని నిబద్ధత కూడా వీరాస్వామి హృదయం ద్రవించేలా చేశాయి. వెంటనే అన్నాడు, "అది నీ పుణ్యమో లేక నా సుకృతమోగాని, మంచి సమయానికి నా స్నేహితుడు మల్లేశు దేవుడిలా వచ్చి నా క్షుదార్తి తీర్చి, నన్ను రక్షించాడు. లేకపోతే ఈ రోహిణీకార్తె ఎండకి ఆకలి తోడై, ఈసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయి ఉండేవాణ్ణి. పోలీసు కూడా మానవమాత్రుడే  కదా! కానీ ఆ  కోణంలో ఆలోచించరు ఎవరూ. సరేలే, అయినదేదో అయ్యింది, ఇక నేను వెళతాను" అన్నాడు వీరాస్వామి. 

రమణ మాటాడకుండా వీరాస్వామివైపు చూస్తూ రెండు చేతులు జోడించాడు. మరుక్షణం, రమణ  రాకతో డ్యూటీ దిగిన వీరాస్వామి ఇంటి దారి పట్టాడు. 

 

వేళ తప్పిన భోజనం వల్ల వీరాస్వామికి భక్తాయాసమనిపించింది. తన ఇంటివైపుగా వెళ్లే పెట్రోలింగ్ వేన్ మూడు గంటలకు పక్కవీధి గుండా వెడుతుంది. దాన్ని పట్టుకుంటే, ఇంటివరకూ సునాయాసంగా వెళ్లిపోవచ్చు.  ఆ వేను  ఇటువైపుగావచ్చే టైం దగ్గరపడింది. అక్కడున్న సిటీబస్సు షెల్టర్ లో కొద్దిసేపు నిలబడితే చాలు, అది వచ్చేస్తుంది -  అనుకున్న వీరాస్వామి అటువైపుగా నడిచాడు.

 

ఆ సరికే ఆ సిటీబస్ షెల్టర్ లోని సిమెంట్ బెంచీ మీద, వారగా ఒకామె కూర్చుని ఉంది. ఆమె ఏడుస్తోంది కాబోలు, ఉండుండీ కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. ఆమెకు ఏదో కష్టం వచ్చిందని గ్రహించిన వీరాస్వామి ఆమెకు దగ్గరగా వెళ్లి, బారెడు దూరాన నిలబడి, అనునయంగా అడిగాడు ... 

 

"మామ్మా! ఎందుకు ఏడుస్తున్నావు? నీకొచ్చిన కష్టం ఏమిటి" అని.

 

ఆ మామ్మ అతనివైపు ఆశ్చర్యంగా చూసి అంది," నా గోడు నీ కెందుకు బాబూ! నువ్వేమైనా ఆర్చే వాడివా, తీర్చేవాడివా?"

 

వీరాస్వామి నొచ్చుకుని అన్నాడు, " నేను రక్షకభటుణ్ణి మామ్మా! ఆపదలోవున్న వాళ్లకు  సాయపడడమే నా వృత్తి, ప్రవృత్తి కూడా! నీ కథేమిటో చెప్పు, నేను చెయ్య గలిగిన సాయం చేస్తా."  అలా అంటూనే  అతడు ఆమెకు ఎడంగా అక్కడి

 

సిమెంట్ బెంచీమీద కూర్చున్నాడు.  

 

"బాబూ! నేనేమీ చదువుకోలేదు. నువ్వలా పెద్దపెద్ద మాటలు చెపితే నాకు ఒక్కటీ  అర్ధమవ్వదు" అంది ఆ మామ్మ. 

 

"అదేం కాదు మామ్మా! నీ కష్టమేమిటో చెపితే నీకు నా చేతనైనంత సాయం చేస్తాను - అంటున్నా. సందేహించక నీ కథ ఏమిటో చెప్పు." 

 

"ఐతే సరే, విను బాబూ" అంటూ మామ్మ చెప్పడం మొదలుపెట్టింది.  

"నాభర్త వ్యవసాయి. మాకు లేకలేక కలిగిన ఒక్క అబ్బాయి ఉన్నాడు. మాకున్న చిన్న మడిచెక్క దున్నుకుంటూ గుట్టుగా బ్రతుకుతున్నాము. కుర్రాణ్ణి బడిలో వేశాము. మా ఊరిలో ఉన్న బడిలో అప్పట్లో ఎనిమిది తరగతులు మాత్రమే ఉండేవి. ఆపాటి  చదువు ఉంటే చాలనీ, ఆపై వ్యవసాయంలోని మెలకువలు నేర్పవచ్చుననీ అనుకున్నారు నా భర్త. కానీ, కుర్రాడికి చదువు బాగా వస్తోంది, పైకి చదివించమని పంతుళ్లు చెప్పడం వల్ల, మేము తినీ, తినకా ఎంతో కష్టం మీద వాడిని పై చదువులు చదివించాము. చదువు ముగించి  మా వాడు పట్నంలో ఉద్యోగంలో చేరాడు. ఆపై వాడినొక ఇంటివాడిని చేసి,  "అమ్మయ్య" అనుకున్నాము.

రోజులు బాగానే వెడుతున్నాయి - అనుకునే టంతలో నిరుడు నా భర్త పొలంలో  పని చేస్తున్నప్పుడు పాము కరిచి చనిపోయాడు. తండ్రికి అపరకర్మలు చెయ్యడానికి వచ్చిన మా అబ్బాయి, అక్కడ మాకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తుల్ని అయినకాడికి అమ్మేసి, నన్ను తన వెంట  ఇక్కడకు తీసుకువచ్చాడు. 

నా రాక నా కోడలికి ఎంతమాత్రం నచ్చలేదు. ఏమి మాట్లాడినా తప్పు పడుతూ,  ఏ రోజునా నాపై మొగుడితో చాడీలు చెపుతూ, ఇల్లు నరకం చేసేది. చివరకు పడలేక మా అబ్బాయి నన్ను ఈ పక్కవీధిలో ఉన్న ముసలాళ్ళ హోమ్ లో చేర్పించి  తెరిపినపడ్డాడు.

కొన్నాళ్ళు బాగానే గడిచింది. ఏదో భయంకరమైన మహమ్మారి వచ్చి  ఈ ప్రపంచాన్నంతటినీ మింగేస్తోందిటగా !  ఆ మాట చెప్పి మా హోమ్ వాళ్ళు, " ఇక మేమీ హోముని నడపలేము, త్వరలో మూసేస్తున్నా ము - అని ఎప్పుడో మీ ఇళ్ళకి కబురు పెట్టాము. మీవాళ్లు వచ్చి మిమ్మల్ని ఇక్కడనుండి తీసుకెళ్ళిపోతారు, మీ మీ సామాను సద్దుకుని సిద్ధంగా ఉండండి" అని కొన్నిరోజుల క్రితమే చెప్పారు. ఈ రోజుతో వాళ్ళు పెట్టిన గడువు ముగిసింది. అందరినీ వాళ్ళ వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇళ్లకు  తీసుకెళ్లిపోయారు. నేను మాత్రమే మిగిలి ఉన్నాను ఇప్పటివరకూ. ఈ పొద్దుట నా ఎదురుగానే, హోమ్ వాళ్ళు మా ఇంటికి ఫోన్ చేసి, నన్నిక్కడ అంటే ఈ సిటీబస్సు ఆగే చోటులో  కలుసుకోమని చెప్పి, ఈ చోటులో నన్ను కూర్చోబెట్టి, హోం తలుపులు మూసి,  తాళ్ళాలు వేసుకుని వెళ్లిపోయారు. మా అబ్బాయికోసం ఎదురు చూస్తూ పొద్దున్న నుండీ ఇక్కడే కూర్చుని ఉన్నా.  ఇంతవరకూ వాడు అజా ప్రజా లేడు. నాకు భయమౌతోంది. ఏమి చెయ్యడానికీ తోచడంలేదు. "

దుఃఖం వెల్లువెత్తడంతో కొంగు మొహానికి చాటుచేసుకుని, భోరున ఏడ్చింది ఆ మామ్మ. ఆమె వైపు జాలిగా చూశాడు పోలీసు వీరాస్వామి.

"సరే మామ్మా! అయిందేదో అయ్యింది! నిన్ను మీ ఇంటికి చేర్చే పూచీ నాది. ఇక బాధపడక నాకు సాయం చెయ్యి. హోమ్ వాళ్ళని పట్టుకుని మీ అబ్బాయి అడ్రస్ సంపాదించవచ్చు. కానీ, ఆ పని చెయ్యాలంటే ముందుగా  హోమ్ వాళ్ళని వెతికి పట్టుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది.  అంతవరకూ నువ్వు ఉండడానికి తగిన చోటు కావాలి. అందుకే, అంతకంటే సులువైన మార్గం మరేదైనా ఉందేమో ఆలోచించాలి."  క్షణం ఆగి ,  "మీ అబ్బాయి ఫోన్ నంబరు తెలుసా మామ్మా నీకు " అని అడిగాడు వీరాస్వామి. 

"తెలియదు బాబూ!" దీనంగా అంది మామ్మ. 

"పోనీ, ఏ ప్రాంతంలో ఉంటాడో చెప్పగలవా?"

"అదీ తెలియదు బాబూ!"

ఏమీ మాట్లాడలేకపోయాడు వీరాస్వామి. కొంతసేపు ఆలోచించి, "సరే మామ్మా! ఇది చెప్పు : నువ్వు మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు, ఆ ప్రదేశంలో నీకు వింతగా కనిపించినవి ఏమైనా ఉన్నాయేమో ఆలోచించి చెప్పు. వాటిని నువ్వు చెప్పగలిగితే ఇప్పుడే మన మక్కడకు వెళ్లిపోవచ్చు. ఒక రాయి విసిరి చూద్దాం. పండు పడితే  మన అదృష్టం పండినట్లే.  లేదంటే మరో దారి గురించి ఆలోచిద్దాం. ముందు నువ్వీ మాస్కు కట్టుకో, పెట్రోలింగ్ వేను వచ్చే వేళయింది" అంటూ వీరాస్వామి తన యూనిఫారం జేబులు తడిమి, ఒక మాస్కు తీసి ఆమెకు ఇచ్చి, అది ఎలా ధరించాలో చూపించాడు తన మాస్కుతో. అలా ఆమె చేత ఆ మాస్కు ధరింపజేశాడు.

మామ్మ ఆలోచనలో పడింది. కొంతసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది.

బాగా ఆలోచించాక మామ్మకి ఒక విషయం స్ఫురించింది. కొడుకు ఉండే అపార్టుమెంటు తాలూకు వీధివైపు బాల్కనీలోకి రాగానే ఆమెకు రోడ్డుకు ఆవలివైపున రెండు గుడులు - ఒకటి ఆంజనేయస్వామిది, మరొకటి సాయిబాబాది - పక్కపక్కల కనిపించేవి. అది ఆమెకు వింతగా తోచేది. ఇప్పుడా విషయం చెప్పింది వీరాస్వామికి.

వీరాస్వామి పెదవి విరిచాడు. "సరిపోదమ్మా. ఈ మధ్య ఈ గుళ్ళు పేట పేటకీ ఉంటున్నాయి. వాటిలో కొన్ని ఇలాగే పక్కపక్కల కూడా ఉంటున్నాయి. దీన్ని బలపరచాలంటే మరో గట్టి గుర్తు ఏదయినా ఉండాలి" అన్నాడు.

చాలాసేపు బాగా ఆలోచించగా చివరకు ఒక ముఖ్యమైన "క్లూ" గుర్తొచ్చింది ఆమెకు.

" ఆఁ, జ్ఞాపక మొచ్చింది, ప్రతి రోజూ  చీకటి పడుతూండగా, దగ్గరలోనే ఉన్న విమానాశ్రయం నుండి  బయలుదేరిన విమానం ఒకటి మా ఇంటి మీదుగా పెద్దపెట్టున రొదచేసుకుంటూ వెళ్ళిపోతుంది" అంది మామ్మ ,సంతోషంగా.

వీరాస్వామి ముఖం వికసించింది. "చాలమ్మా, ఇక చాలు.  నాకు మీ అబ్బాయి అడ్రస్ దొరికిపోయింది.  ఐతే, ఎయిర్పోర్టుకి పక్క వీధిలోవున్న ఆంజనేయస్వామి, సాయిబాబా గుడులకు ఎదుటి వరసలో ఉంటున్నాడన్నమాట మీ అబ్బాయి. నాకు అంతా   అర్థమైపోయింది. మీ అబ్బాయి పేరు చెప్పు,  ఇట్టే నిన్నక్కడకు  తీసుకెళ్లి దింపుతాను. నిన్ను  ఇల్లుజేర్చే పూచీ నాది. మేముండే ఇల్లు కూడా అక్కడకు  దగ్గరే, ఆ ప్రదేశమంతా నాకు కొట్టిన పిండి. బాగా తెలుసు. మీ అబ్బాయి పేరు చెప్పి, ఆ రెండు  గుళ్లకు ఎదుటి వరసలోవున్న నాలుగైదు బిళ్లింగుల తాలూకు వాచ్ మెన్ ని అడిగితే చాలు,  మీ అబ్బాయి ఏ  అపార్టుమెంట్లో ఉన్నారో యిట్టే తెలిసిపోతుంది. ఆవిధంగా శ్రమేమీ లేకుండానే మనం మీ అబ్బాయి ఉండే ఇల్లు కనిపెట్టవచ్చు. సరే, ఇక నడమ్మా,  పోదాం.  నిన్ను మీ వాళ్ళకు అప్పగించి, నేను మా ఇంటికి వెడతాను" అన్నాడు వీరాస్వామి, చేరువుగా వచ్చి, తనను చూసి ఆగిన "పెట్రోలింగ్ వేన్ " వైపు నడుస్తూ . 

 

***

"అమ్మా! ముసల్ది మళ్ళీ వచ్చిందేవ్ " అంటూ ఇల్లదిరిపోయేలా పెద్దగా  కేకపెట్టింది, తలుపు తట్టగానే తలుపు తెరిచిన  ముసలమ్మ మనుమరాలు, తొమ్మిదేళ్ళపిల్ల కరుణ. గుమ్మానికి కొద్దిపాటి  ఎడంగా నిలబడి ఉన్న వీరాస్వామికి అర్థమైపోయింది ఆ ఇంట్లో ఆ పెద్దామెకున్న గౌరవం  ఏమిటో.  ఇక తను కల్పించుకోక తప్పదనుకున్నాడు. రెండడుగులు ముందుకువేసి, ఆ పెద్దామె వెనకాల తానూ ఇంట్లోకి ప్రవేశించాడు.

వంటగది లోనుండి గరిట చేత పట్టుకుని, బయటకువచ్చిన పెద్దామె కోడలు అరుణ, యూనిఫారంలో ఉన్న పోలీసుని చూసి కొంచెం జంకింది. చేతిలోనుండి గరిట జారి క్రిందపడి శబ్దం చేసింది.

ఈ లోగా కరుణ వెళ్లి, తండ్రికి వార్త చేరవేయ్యడంతో, గదిలో కూర్చుని, లాప్టాప్ మీద ఆఫీసు పనిచేసుకుంటున్న వాడల్లా బయటికి వచ్చాడు పెద్దామె కొడుకు రమేశ్. 

అతడు వస్తూనే తల్లిని చూసి, "అమ్మా!  చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావేమిటి? కబురుపెడితే నేను వచ్చేవాడిని కదా" అన్నాడు ఆశ్చర్యపోతూ. 

రమేశ్ మాటలు వినగానే అంతా అర్థమయ్యింది వీరాస్వామికి.  అతనికేమీ తెలియదనీ, హోమ్ వాళ్ళు చేసిన ఫోన్ కాల్సు అతని భార్యయే రిసీవ్ చేసుకుని, భర్తకు ఆ విషయం తెలియనీకుండా చేసిందనీ - గ్రహించాడు వీరాస్వామి. అక్కడితో, "హూ వేర్స్ ది పాంట్స్ ఇన్ దిస్ హౌస్ " అన్నది అతనికి క్షుణ్ణంగా అర్థమైపోయింది. 

ఒక్క క్షణం ఆమెవైపు సూటిగా చూసి, వీరాస్వామి ఆమె నుద్దేశించి మాటాడాడు, 

"ఇటు  చూడు చెల్లెమ్మా! ఈ పెద్దామె ఇప్పుడు ఇదివరకటిలా ఏ దన్నూ, దక్షతా  లేని "అందరూ ఉన్న అనాధ" కాదు, ఈమె వెనుక  నేనున్నాను ! ఇకనుండి నేను  ఎప్పుడూ ఈమెను కనిపెడుతూనే ఉంటా నన్నది గుర్తుపెట్టుకో. మా ఇల్లు ఇక్కడకు చాలా దగ్గర. ఇక్కడ జరిగే విషయాలు కనుక్కుంటూనే ఉంటా. ఇకనుండయినా ఈమెను జాగ్రత్తగా చూసుకో! తేడా పాడాలొస్తే నేను  ఊరుకోను. వృద్ధాప్యమన్నది అందరికీ ఉన్నదే! నీ పిల్లలకి నువ్వే "రోల్ మోడల్"వి. నీవు ఈమెకెలా చేస్తావో రేపు నీ పిల్లలు నీకూ అలాగే చేస్తారు. " తాత బోలె తరతరాలూను" అంటారు. జాగ్రత్త!

ప్రతి ఆడపిల్లా తన తల్లిదండ్రులు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కానీ, తన భర్త తల్లిదండ్రులు మాత్రం ఆమెకు శత్రువుల్లా కనిపిస్తారు. పెళ్లయిన, ఆడపిల్లకు పుట్టింటినుండి అత్తవారింటికి వచ్చాక, ఇంటిపేరు, వారసత్వముతోపాటు తల్లిదండ్రులు కూడా మారుతారని గుర్తించదు ఏ ఆడపిల్లా, ఎంత చదువు చదువుకున్నదైనాగాని, అదేమి పాపమో! ఇకపోతే ఆ అత్తగారుకూడ తన కూతురు అత్తవారి ఇంటికి శాశ్వతంగా వెళ్లిపోయిందనీ, ఆమె స్థానంలోకి, మరో ఇంట పుట్టిన పిల్ల తనకి  కోడలుగా వచ్చి ఆ లోటు తీర్చిందనీ ఎంతమాత్రం గుర్తించదు. అందుకే ఈ స్పర్ధలు, విభేదాలూను. ఇకనైనా యదార్ధం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ సుఖసంతోషాలతో హాయిగా  ఉండండి. ఇక నేను  వెళ్ళొస్తా, నా మాట గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరూకూడా  " అన్నాడు వీరాస్వామి.

"ఆగు అన్నా! టీ తాగి పోదువుగాని " అని అతన్ని సాదరంగా ఆహ్వానించింది అరుణ.

యూనిఫారంలో ఉన్న పోలీసుల్ని  చూస్తే అందరికీ భయమే మరి.  ఎలాగైనా వాళ్ళని మంచి చేసుకోవాలని చూస్తారు.

మొదట్లో ముసలమ్మ కొడుకు ఆ పోలీసు, అక్కడే ఉన్న తనతో కాకుండా తన భార్యతో మాటాడినందుకు  కష్టపెట్టుకున్నా, చివరకు తాను తన భార్యకు చెప్పలేని మాటలు అతడు నిర్భయంగా చెప్పినందుకు సంతోషించాడు.

***

రక్షకభటుడి కర్తవ్యమ్ దుష్టశిక్షణ, శిష్టరక్షణ! "నూర్గురు దోషులు తప్పించుకు పోయినా ఫరవాలేదు గాని, ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు" అనేది పోలీసుల "ఆదర్శ వాక్యం" (motto) అంటారు. కానీ అది ఎంతవరకూ అమలు  ఔతోందో పరిశీలిస్తే చాలు అసలు రంగు ఏమిటో తెలుస్తుంది.

 

 పెద్దమనుషులనిపించుకునేవారి అన్యాయాలకి ఎదురొడ్డి నిలబడ్డం రాకున్నా అపుడపుడయినా నా యూనిఫాం మంచి చేస్తుందన్నమాట - ఇలా ఏవేవో ఆలోచించుకుంటూ  పరాకుగా తన ఇంటి వైపు నడుస్తున్న వీరాస్వామి, తన పక్కకి వచ్చి ఒక సూమో సడెన్ బ్రేకుతో ఆగడంతో ఉలిక్కిపడి,  అటువైపు తిరిగి ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.

ఆ ఊరిలో ఉన్న "సెటిలర్లు" అందరిలోకీ పెద్దవాడు, పెద్దపేరున్నవాడు అయిన పెద్దబ్బాయి కారది. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న పెద్దబ్బాయి విండో తెరిచి వీరాస్వామితో మాటాడాడు.

"రా, గురూ! రా, కారెక్కు, నీతో నాకు పనిపడింది"అన్నాడు.

"పనంటే?  పెద్దబ్బాయి లాంటి వారికి ఇక పనేం ఉంటుంది, ఏదో ఒక పాడుపని తప్ప!" అలా అనుకునేసరికి  వీరాస్వామి గుండెల్లో బండ పడింది. ఎలాగైనా పెద్దబ్బాయి బారి నుండి  తప్పించుకుపోవాలి.  డైరెక్టుగా ఎదిరిస్తే తన బతుకు ఇకపై బర్బాదే! ప్రస్తుతానికి ఏదైనా ట్రిక్ ప్లే చేసి ఈ ఆపదనుండి బయట పడాలి -  అనుకున్నాడు వీరాస్వామి. 

డ్రైవర్ కి వెనుకనున్న సీట్లలో కిక్కిరిసిపోయి కూర్చుని ఉన్న పెద్దబ్బాయి అనుయాయుల పటాలం వైపు చూపు నిగిడ్చి అన్నాడు.

"ఒద్దు బాస్! వద్దు. నేను అబ్జర్వేషన్ లో ఉన్నాను. మీవాళ్లెవరికీ మాస్కులు కూడా లేవు. నేను లోపలకు వస్తే మీ వాళ్లకి కరోనా అంటించినవాడి నౌతాను. నీకీ విషయం తెలిసేవుంటుంది, ఆవేళ మీ ఎగస్పార్టీ వాళ్ళు వచ్చి, మేము కరోనా కట్టడి కోసం  డ్యూటీ చేస్తూంటే నచ్చక, గొడవకు దిగి, మా పోలీసుల్ని కొట్టారు చూడు, ఆ వార్త మీడియాలో వైరల్ అయ్యింది, నువ్వూ చూసే ఉంటావు. అప్పుడు, మంది బలం ఉందికదాని,  వాళ్ళు పనిగట్టుకుని మా మాస్కులు పీకేసి, మా మొహాలమీద దగ్గి, తుమ్మి, ఊది -  మమ్మల్ని నానా అల్లరి పెట్టారు కదా ! వాళ్లలో రోగులే ఉన్నారో, కేరియర్లే ఉన్నారో ఏమో?  ఏమైతేనేం, మొత్తానికి మాకు మాయదారి కరోనా వ్యాధిని  అంటించారు.  నా పార్టనర్ నారా యణ మూర్తికి ఆస్త్మా  ఉండడం వల్ల వెంటనే కరోనా  బయటపడింది. ఎందుకైనా మంచిదని నేను అందరికీ దూరంగా  వుంటున్నా. అర్ధం చేసుకో, నీ మంచికోసమే చెపుతున్నా" అన్నాడు. 

కానీ వీరాస్వామికి లోలోన భయంగానేఉంది, "నువ్వు అబ్జర్వేషన్లో ఉంటే  కొరెంటైన్ నుండి బయటకు వచ్చి యూనిఫారం ఎలా వేసుకోగలిగావు" అని  ఎవరైనా ఎదురు అడుగుతారేమోనని భయపడుతూనే ఉన్నాడు. కానీ ఎవరూ అది గుర్తించినట్లు లేదు.

మేధను అట్టే కష్టపెట్టే అలవాటులేని పెద్దబ్బాయి, అతని మనుష్యులు మరో ఆలోచన లేకుండా వీరాస్వామి మాటలు నమ్మడంతో  ఆ ట్రిక్కు బాగానే  పనిచేసింది. వీరాస్వామి మాటలు పెద్దబ్బాయి తలలో ఒక పెద్ద  ప్రకంపనాన్ని సృష్టించాయి. తన  ముఠాలో వాళ్లంతా కోవిడ్ తో మంచాన పడి, మరణిస్తే, ఇక తా నొక సామాన్యుడుగా మారిపోతాడు. ఈ బుర్ర తక్కువ రౌడీలకు ఒకసారి తాగడానికి సారా పోయించి, మరోసారి తాగడానికి చాలిన డబ్బులు చేతిలో పెడితే చాలు, తాను ఏది చెప్పితే అది, మరో ఆలోచన లేకుండా చేసేస్తారు. వీళ్ళే తన బలం! తన భాగ్యం, బలగంకూడా! వీళ్ళులేకపోతే తాను కోరలుపీకేసిన త్రాచుపాము లాంటి వాడౌతాడు. ఇంక తనను చూసి భయపడేవాడు ఎవడూ ఉండడు - పెద్దబ్బాయి ఆలోచనలు అలా సాగిపోయాయి. మరుక్షణంలో  కారు కిటికీ మూసుకుంది, సూమో ముందుకు కదిలి, అక్కడనుండి వెళ్ళిపోయింది.

"బ్రతుకు జీవుడా! ఈ వేళకి ఈ గండం గడిచిపోయింది. చివరికి కరోనా పేరే ఈ రోజు నన్ను బతికించినట్టుందా? అని విరక్తిగా నవ్వుకుంటూ "టుమారో ఈజ్ అనదర్ డే!" రేపటి సంగతి రేపు చూసుకోవచ్చులే"   అనుకుని, తెరిపినిపడిన పోలీసు వీరాస్వామి తన మనసు తేలిక చేసుకుని,  గాఢంగా నిట్టూర్చి తన ఇంటి దారి పట్టాడు.   

                    *****

 

 

bottom of page