MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
విమల
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
తెలిసి..తెలిసీ
అనేక శిశిర, వాసంతి సమీరాలు
నా మీదుగా నడిచి వెళ్లాయి
తలలో తెల్లవెండ్రుకలు, చర్మం మీద ముడతలు,
నాకు తెలుస్తూనే వుంది
ముదిమి నన్ను మెల్లగా కమ్ముకోవడం
కన్నుల్లో ఆరని కన్నీటి జల
పెదవులపై విరిగిన నవ్వు
వర్షం కురుస్తూనే వుంది
తడిసిన చీరకుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడుతూ
అడుగులు తడబడుతున్నాయి
అయినా నడవాల్సిందే కదా!
ఇలాంటి వర్షపు రాత్రే
తెరచిన నా ఇంటి వాకిలి నుండి
పిల్ల తెమ్మెరలా వచ్చి వాలావు
నాకింకాగుర్తుంది
ఆ అరచేతిలో పుట్టుమచ్చని నువ్వు ముద్దు పెట్టుకోవడం
నీ ఉంగరాల జుట్టుతో నా చేతివేళ్ళు ఆటాడటం
నీ తేనెరంగు కళ్ళలో నా పురాస్వప్నం దొరకటం
నాకింకా గుర్తుంది
నాకెంత భయం..
స్వప్నం పక్షివలె ఎగిరిపోతుందేమోనని
పెదవులతో నీ కళ్ళు మూసి స్వప్నంతో సంభాషించటం
నాకింకా గుర్తుంది.
ఇలాంటి వర్షపు రాత్రే.
నా వొడిలో తలవాల్చి నిదురించి తెల్లవారని ఆ రాత్రి ,
నువ్వూ, కలా, వర్షము.. కలగలిసిన రాత్రి
అలాంటి అనేక రాత్రులు ఏదో తెలియని ఆనందం, దిగులు.
నిన్నిట్లా చూస్తుండగానే ఎన్ని రాత్రులు తెల్లవారాయో..
తిరిగిరాని వాళ్ళకోసం ఎదురుచూడటం
ఎంత ఎంత వేదన
జననం వలే, మృత్యువొక నిత్య పరమసత్యం
అసంకల్ప ఉచ్చ్వాస నిశ్వాసల వలె,
తెలిసి, తెలిసీ నీ కోసం వెతుకులాట.
(విశాలాంధ్ర వారి దశాబ్ది కవిత 2001-2010 నుండి)
విన్నకోట రవిశంకర్
వృక్ష చిత్రం
వసంతం గిలిగింతలు పెడితే
పూల కన్నీళ్లు ఉబికివచ్చేలా
రోజంతా కిలకిలా నవ్వుతుంది
మండే ఎండల్ని
గుండె ధైర్యంతో ఎదిరించి
తన నీడనొక నిరసనకేంద్రంగా నిలుపుతుంది
జలజలా కురిసే వానలో
తలారా స్నానం చేసి
తడి బట్టలతో సిగ్గుల మొగ్గైన
పడుచు పిల్లలా మెరుస్తుంది
శారద రాత్రిలో
ఆకు ఆకున వెన్నెలలద్దుకుని
వెండి వెలుగుల తళుకులతో వెలిగిపోతుంది
ఆఖరి ఋతువులో
ఆకుల వస్త్రాల్ని సైతం పరిత్యజించి
యోగనిద్రలో మౌనిలా నిలుస్తుంది
స్థితప్రజ్ఞతతో స్థిరంగా నిలిచే ఈ చెట్టు
ఋతుచక్రంలో ఒక ఆకుగా మారి
ఏడాదిలోనే మొత్తం జీవితాన్ని
రూపుకట్టి చూపిస్తుంది
చందలూరి నారాయణరావు
రెండు జీవితాలు
రెండు మత్తు బిళ్లలు చేసిన
నిద్ర పరిచయం
రాత్రిని జయంచింది.
రెండు కళ్ళును
విడిచేసిన కల
పగటిని రాత్రిని చేసింది.
ఒక మనిషిలో
రెండు జీవితాలు.
ఒకటి
కలకు దూరంగా కళ్ళనుంచడం.
రెండు
కళ్లకు తెలియకుండా కలలు కనడం.
* * *
ఓ చిన్న కథలా నేను...
ఇంటా
బయటా
ఓ చిన్న కథలా ఉండాలని నా కోరిక.
కొద్ది పాత్రతో
ఖచ్చితమైన కొలతతో
బరువే లేని వేషాలు.
తడబాటు లేని నడతతో
గొప్ప శబ్దాల్లేని సంభాషణలతో
భారీ వేదికలు, ఆడంబరాలు,
రంగులద్దటం లేని రంగస్థలం మీద
సున్నితంగా రక్తికట్టే సన్నివేశాలతో
విలువుగా మెరిసే పాత్రతో
అందరిని చదివించేలా
చిన్న కధలా ఉండాలని ఆశ.
ఆంగ్ల మూలం: రవీ౦ద్రనాద్ టాగూరు
తెలుగు అనువాదం: డా. పాలకుర్తి దినకర్
మేలుకో! నిద్ర మేలుకో!!
(రవీ౦ద్రనాద్ టాగూరు గీతాంజలిలోని 55వ కవిత కు అనువాదం)
ఇంకా నీ హృదయం తూగుతూనే వుంది
నీ కళ్లపై నిద్ర మబ్బులు తేలుతూనే ఉన్నాయి
నీకు మాటలు రావడం లేదా?
ముళ్ళ మధ్య పువ్వు సగర్వంగా తల ఎత్తుకొని ఊగుతుంది
మేలుకో! నిద్ర మేలుకో!! కాలాన్ని వృధా కానివ్వకు
ఈ రాతి బాట చివర,
నిశ్చల నీరవ నిశ్శబ్దంలో
నా మిత్రుడొకడు ఒంటరిగా కూర్చొని వున్నాడు
అతన్ని మోసం చేయకు!
మేలుకో! నిద్ర మేలుకో!!
మధ్యాహ్నo ఎండ వేడి వల్ల ఆకాశం రోప్పితే అలసటతో వుంటే నీకేంటి?
కనకనలాడుతున్న ఇసుక తన దాహపు దుప్పటిని భూమినిండా కప్పితే ఏమిటి?
నీ హృదయాంతరాలలో ఆనందం తోనికిసలాడడం లేదా?
నీవు నడిచే దారిలో అడుగడుగునా పద వీణ పలికించే భాధాస్వరాలూ వినిపించలేదా?
ఉమాదేవి పోచంపల్లి
కదిలే చైతన్య కాంతి
కోకిలల కలకూజితాలు
గుండె చప్పుళ్లలో కలిసి
నిశ్శబ్దంలో నిండిపోయాయి
ఆరని ఒక చిన్న మట్టి దీపం
కొండ కోనలకు కోట్లవెలుగు
వెల్లువలై పారుతుందేమో
అంధకారంలో నిండిపోయిన
కన్నీటి నీలినీడలు, ఒక
తటాకంలో విసిరిన రాయి
కదిలించిన అలల ఉప్పెనలా
నివురు కప్పిన చైతన్యం
సమకూర్చిన సైన్యంలా
పెల్లుబికి ప్రవహిస్తుంది
దావానలంలా, గుండెలోతుల్లోంచి
ఉబికి వస్తున్న రక్త ఘోష వలే
పొంగే దుఃఖానికవతల
వేచి యున్న ధవళకాంతుల
కర్తవ్యోధ్బోధక కాగడాలా,
నీలో నివురు కప్పుతున్న
నీరస నిరాశావాదనను
శలాక ఫలకాలుగా చేసి
పదునెక్కించే శిలలా
ఓటమిని మరి గెలవనీయని
సాహస శౌర్యాల ఉక్కు కోటలా
అన్ని వేళలా అన్నింటా
నిలువు, నీవే చైతన్యానివై
నిశ్చల సత్వానివై, వెలుగుల
వెన్నెల వాకల వాకిలై.
వారాల ఆనంద్
ఓ ‘కల’
ఓ కలేదో
నన్ను తప్పించుకు తిరుగుతున్నది
కలలు గనడం నా కిష్టమే
నా హక్కు కూడా
కళ్ళు మూసుకొని
నిద్రపోవడం నేర్చుకున్నప్పటినుండీ
నా చుట్టూరా అనేక కలలు తిరుగుతూనే వున్నాయి
నిద్రలోనే కాదు మెలకువలోనూ
చాలా కల లు
నా వెన్నంటే వున్నాయి
కొన్ని కలల్ని నేనందుకున్నాను
కొన్ని కలలు నన్నందుకున్నాయి
న్యూనతకు ఆత్మవిశ్వాసానికి నడుమ
నిద్రకూ మెలకువకూ నడుమ ఊగిసలాడే
నాకూ
కలలకూ నడుమ
ఈ దోబూచులాట మొదట్నుంచీ ఉన్నదే
కొన్ని కల లు సొగసైనవి
రక్తి కట్టిస్తాయి ఆసక్తి కలిగిస్తాయి
మైకంలా కమ్మేస్తాయి
ఇంకొన్ని కలలు గడుసైనవి
దరిచేరినట్టే చేరి ఉలిక్కిపడేలా చేస్తాయి
నిద్రనుంచి టక్కున లేపెస్తాయి
కళ్ళు తెరిస్తే ఏముంటుందీ
గడుసైన కలలు అదృశ్యమయిపోతాయి
గ్లాసెడు నీళ్ళు గట గటా తాగితే కాని
మనసు నిమ్మళం కాదు
ఇంకొన్ని కలలేమో ఊహల్లోంచి ఆలోచనల్లోంచి
రూపుదిద్దుకుంటాయి
కాళ్ళ ముందు కదలాడుతూవుంటాయి
కంట్లోంచి ఇంట్లోకి ఇంట్లోంచి అడవిలోకి
విస్తరిస్తాయి
అవును
కల గనడం నాకిష్టం మాత్రమే కాదు
నా హక్కు గూడా
కానీ
ఓ కలేదో
నన్ను తప్పించుకు తిరుగుతున్నది
చుట్టూ గాలి మొత్తం బరువు బరువు
ఊపిరాడని స్థితి
అంతా తెలిసినట్టూ ఏమీ తిలయనట్టూ వుంది
బహుశా నేనే
ఆ కలనుంచి తప్పించుకు తిరుగుతున్నానేమో