top of page

ఎన్నారై కాలమ్ - 7

8. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు!

Satyam Mandapati Madhuravani.com

సత్యం మందపాటి

అప్పారావుని అటు వైపున చూసి గబగబా అటు వెళ్ళాడు సుబ్బారావు.

రెప్పపాటులో అప్పారావు మటుమాయమయాడు.

  కొంచెం ఆగాక అప్పారావుని ఇటు వైపున చూసి గబగబా ఇటు వెళ్ళాడు సుబ్బారావు.

అప్పారావు అర నిమిషంలో అదృశ్యం అయాడు.

ఇంతకీ ఎవరీ అప్పారావు? ఎవరీ సుబ్బారావు? సుబ్బారావుని చూడగానే ఎందుకలా అప్పారావు మాయమవుతున్నాడు? వీటికి జవాబులు వెండి తెర మీదో, బుల్లి తెర మీదో చూడనఖ్కరలేదు.

గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణగారి అప్పుల అప్పారావు గురించి తెలియనివారెవరుంటారు చెప్పండి. కనిపిస్తే అప్పు తీసుకోక మానడు అప్పారావు. మళ్ళీ ఇక ఇవ్వనే ఇవ్వడు. అందుకే అప్పారావు అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఇక చిక్కడు, దొరకడు. తప్పించుకు తిరుగుతూ ఉంటాడు!

రమణగారి పుస్తకాలు ఇప్పటిదాకా చదవనివారికి, అవి చదివితే ఇట్టే తెలుస్తుంది ఈ అప్పారావంటే ఎవరో! ఏమిటో! ఈనాటి (అ)ప్రాచ్య ఆంగ్ల భాషా మీడియం రోజుల్లో తెలుగు చదవటం రాకపోతే, కనీసం బాపు రమణల “అందాలరాముడు” సినిమా చూడండి. అప్పారావెవరో అర్థమవుతుంది.

**

                

నేను ఎలిమెంటరీ స్కూలుకి వెళ్ళక ముందరే… అంటే అమ్మ పెట్టిన గోరుముద్దలు తింటూ “చందమామ రావే, జాబిల్లి రావే” మొదలైన పాటల ద్వారా నా మొట్టమొదటి చదువూ; నిక్కర్లు వేసుకుని స్కూలుకి వెళ్ళి “వినదగునెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!” మొదలైన సుమతీ, వేమన శతకాలు నేర్పిన సంస్కారంతో, మీ అందరి బాల్యంలాగానే నా బాల్యం కూడా ప్రారంభమయింది. పెద్ద కుటుంబాల్లో ఉమ్మడిగా కలసి ఉంటే ఆ చదువూ, సంస్కారం మన ఇంట్లోనే, మన బడిలోనే, మన పుస్తకాలనించీనే మనకి వచ్చేస్తాయి కదా! మరి నాకూ అంతే!

అప్పటినించీ మన శతకాలు, ముఖ్యంగా సుమతీ శతకం, వేమన శతకం చిన్నప్పుడే నా మదిలో అలా నిలచిపోయాయి. నా జీవితాన్ని సన్మార్గంలో నడిపించటనికి, వ్యక్తిత్వ వికాసానికీ ఎంతగానో ఉపయోగపడ్డాయి.

వాటి ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే, ఈనాటి గ్లోబల్ ఉద్యోగరంగంలో విజయవంతంగా ఎలా ముందుకు వెళ్ళటం అని నేను పాటించిన విజయ సూత్రాల ఆధారంగా వ్రాసిన “ఉద్యోగ విజయాలు” ధారావాహికలో ఈ శతకాల్లోని కొన్ని పద్యాలే వాడుకున్నాను. ‘శతకాలతో శతకాలు’ అనే కథలో కార్పొరేట్ మేనేజ్మెంట్ నిర్వహణలో ఈ శతకాలు మన ఉద్యోగాల్లోనూ, జీవితంలోనూ సెంచరీలు కొట్టటానికి ఎంతగా ఉపయోగపడతాయో విపులంగా వ్రాస్తే, చాలమంది పాఠకులు నచ్చాయని మెచ్చుకున్నారు. అంత గొప్ప సందేశాలున్నాయి మన శతకాల్లో. ఆ శతకాలు మరోసారి, ఈ దృష్టితో చదవండి. మీకే అర్ఢమవుతాయి. ఆచరించటం కూడా ఎంతో సులభం.

సుమతీ శతకకారుడు భద్రభూపాల మహారాజు (కవిగా బద్దెన నామధేయుడు) వ్రాసిన సుమతీ శతకంలోని ఒకే ఒక్క పద్యం ఈ వ్యాస రచనలో స్పూర్తికి తగ్గట్టుగా తీసుకున్నాను. ఈ గొప్ప పద్యంలో ఎంతో సులభంగా ఆయన చెప్పిన మంచి విషయాన్ని, ఈ రోజుల్లో మనవాళ్ళు నిత్యజీవితంలో స్వలాభాల కోసం ఎలా దుర్వినియోగం చేస్తున్నారో సరదాగా చెప్పాలనే ఒక కొంటె ఆలోచనతో ఈ వ్యాసం వ్రాస్తున్నాను. అంతేగానీ నాకెంతో ఇష్టమైన ఈ గొప్ప పద్యంలోని అర్ధాన్ని హేళన చేయటం నా ఉద్దేశ్యం కాదు.

ఇదిగో ఆ పద్యం.

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి యన్యుల మనముల్‌

నొప్పింపక, తానొవ్వక,

తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!

ఇంత చక్కటి పద్యానికి తాత్పర్యం చెప్పటం అనవసరం. అంత సులభ శైలిలో వ్రాసిన గొప్ప పద్యం.

**

1991వ సంవత్సరంలో మా ఇంట్లోనే ఆస్టిన్ తెలుగు సాహిత్య సదస్సులు మొదలుపెట్టాను. జనం ఎక్కువమంది వస్తారని, సదస్సు అవగానే పకోడీలు, కాఫీలు కూడా ఇచ్చేవాళ్ళం. అప్పటినించీ ఇప్పటిదాకా, మధ్యే మధ్యే నెల తప్పినా, వటుడింతై ఇంతితై అన్నట్టుగా ఈనాటికి ఆకాశహర్మ్యాన జూమ్ జూమంటూ మా హస్తినాపురంలో (ఆస్టిన్‍లో) తెలుగు సాహిత్య సదస్సులు నిర్వహిస్తున్నాం.

మేమీ సదస్సులు మొదలుపెట్టిన కొత్తల్లో జరిగిన సంఘటన ఒకటి, ఈనాటికీ నా మనసులో మెదిలినప్పుడల్లా చివుక్కుమంటుంది.

 సదస్సు పూర్తయాక పకోడీలు తింటూ, ఒక రావణాసురుడు, “అమ్మో! మీ ఇంటి గ్రంథాలయంలో ఎన్ని గొప్ప పుస్తకాలు ఉన్నాయో!” అంటూ నాకెంతో విలువైన తెలుగు పుస్తకాలు పదో, పన్నెండో తీసుకుని, ఒక సంచీలో పెట్టుకుని చదవగానే ఇచ్చేస్తాను అన్నాడు.

ఆరుద్రగారు చెప్పిన వేదం, “అరువిచ్చిన బుక్కు, తిరిగొస్తే గొప్ప లక్కు” అనే కూనలమ్మ పదం గుర్తొచ్చి, “అమ్మో, అప్పేకాదు. అరువు కూడా ఇవ్వను. ఇవ్వనుగాక ఇవ్వను. నేను గుంటూరు, విజయవాడల్లో ఎంతో కష్టపడి సంపాదించి కొనుక్కున్న పుస్తకాలివి” అన్నాను. కొడవటిగంటి, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ముళ్ళపూడి, కాళీపట్నం, శ్రీశ్రీ, ఆరుద్ర… మరి ఇలాటి ఎందరివో అమూల్యమైన పుస్తకాలున్నాయి వాటిల్లో.

రావణాసురుడు నవ్వాడు, “మనం పుస్తకాలు కొనుక్కునేది పలువురితో పంచుకోవటానికే కదండీ. మరీ అంత స్వార్ధమా! తప్పకుండా తిరిగి ఇస్తాను కదా, గురువుగారూ” అని, ఎలాగూ లక్ష్మణరేఖ దాటాయి కదా అని ఆ పుస్తకాలు ఎత్తుకుపోయాడు ఆ రావణాసురుడు.

మనం వద్దనుకున్నా తెలుగులోనే కాక, అరవంలో కూడా కాలం గడిచి పోచ్చి కదా. ముద్దమందారం సినిమా పాటలోలాగా, ఒకటాయె రెండాయె ఉయ్యాల, మూడూ మాసముదాకా ఉయ్యాల, అతను కనపడలేదు ఉయ్యాల, నాలుగాయ ఐదాయె ఉయ్యాల, ఆరూ ఏడయినాయి ఉయ్యాలా, ఎనిమిది తొమ్మిదాయె ఉయ్యాల,  తొమ్మిది మాసములోనా ఉయ్యాల, నా పుస్తకాలు వెనక్కి రాలేదు ఉయ్యాల, అసలు శాల్తీయే గల్లంతాయె ఉయ్యాల.

ఒకసారి వాల్‍మార్ట్, ఇంకోసారి సియర్స్ షాపుల్లో లాంగ్‍షాట్లో కనపడ్డాడు, క్లోజప్ చేసేసరికీ ఇలా కనపడి అలా మాయమయాడు. అంటే నా పుస్తకాలు ఎగ్గొట్టి, తప్పించుకు తిరుగుతూ తను ధన్యుడై, నన్ను ధన్యుడ్ని చేశాడన్నమాట. నా పది-పన్నెండు పుస్తకాలు మాత్రం, అవి ‘పోయాక’ ఇప్పటికి ముఫై వర్ధంతులు విజయవంతంగా గడుపుకున్నాయి.  ఇది నిజంగా జరిగిన కథే!  

ఆఁ! పుస్తకాలంటే గుర్తుకొచ్చింది. నేనూ ఎన్నో పుస్తకాలు వ్రాసేసి, స్వంత డబ్బులతో అచ్చేసి, నాకక్కడ పంపిణీకి దారులు తెలియవుగనుక, భారతంలో కొంతమంది పుస్తక పంపిణీదారులకు ఇస్తే, ఒకరో ఇద్దరో కొంతవరకూ దారి చూపిన దేవతలేగానీ, మిగతావారు గోదారే చూపించారు.

ఒక నాగేసర్రావయితే అమెరికానించీ ఫోన్ అని చూడగానే, ఫోన్ తీయకుండా దిండు క్రింద దాచేసుకుని, నాకేం వినపడలేదు అంటాడు. ఒక డజనుసార్లు పిలిచాక, ఎవరో అనుకుని ఫోన్ తీసినట్టున్నాడు, ఇక తప్పించుకోలేక, “ఓఁ.. మీరా. ఎన్నాళ్ళయింది సార్, మీ చక్కటి గొంతు విని. బాగున్నారా?” అన్నాడు.

“అయ్యా, మీకు నా పుస్తకాలు అమ్మకానికి ఇచ్చి మూడూ సంవత్సరాలో, ఏడు సంవత్సరాలో అయింది. ఇంతవరకూ నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఎలా ఉన్నాయి సేల్స్” అడిగాను.

“సేల్స్ అస్సలు లేవు సార్. సేల్స్ లేనప్పుడు డబ్బులెలా ఇస్తాను?” అన్నాడు.

“అదేమిటి, నా అభిమానలు కొందరు విశాఖనించీ విజయ్, కాకినాడనించీ కామేష్, మహబూబ్ నగర్ నించీ మధు, అనంతపురంనించీ అనంత్, వారి మిత్రులూ, దూరపు బంధువులూ నా కొత్త పుస్తకాలు అక్కడ బుక్‍షాపుల్లో దొరకటం లేదంటున్నారు?”

“అక్కడ స్టాక్ అయిపోయిందేమో, వాళ్ళకి మళ్ళీ పంపిస్తాను సార్” అన్నాడు.

అంటే మరి సేల్స్ బాగానే అవుతున్నాయన్నమాట. అప్పనంగా నా పుస్తకాలు షాపుల్లో పెట్టుకుని, అమ్ముడుపోయిన వాటికి డబ్బులివ్వటానికి ఏడుస్తున్నాడే అనుకున్నాను. నా పుస్తకాలు తెచ్చేసుకుంటే సరి అనుకుని, అదే అడిగాను.

 

“పోనీ, సేల్స్ అవకపోతే, నా పుస్తకాలు వెనక్కి తిప్పి పంపించేయండి”

“నా దగ్గర మీ పుస్తకాలు ఏవీ లేవు సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుస్తక విక్రయశాలల్లోనూ ఉన్నాయి” అన్నాడు.

“మరి వాళ్ళ దగ్గర లేవంటే, మళ్ళీ పంపిస్తున్నానని ఇప్పుడే కదా అన్నావు నాగేసర్రావూ”

ఇలా లంఖణానికి పెడితే, చావే వచ్చిందో, చావుకు పెడితే ఇంకేదో అయిందో తెలియకుండా తిప్పి తిప్పి అదే మళ్ళీ మళ్ళీ చెప్పాడు.

ఇలా ఏనాటినించో సాగుతూనే ఉన్నదీ అంతులేని కథ. మరీ తప్పించుకు తిరుగుతున్నాడీ ధన్యుడు.

ఇంకా రామారావయితే బహు గట్టివాడు. అడగ్గా అడగ్గా ఒకసారి కాబోలు ఫోన్ తీశాడు. నేనంటే విసుగు పుట్టినట్టుంది. దుర్యోధనుడిలా అద్దె గొంతు పెట్టుకుని గట్టిగా అన్నాడు, “మీ పుస్తకాలేవీ అమ్ముడవలేదు” అని.

“అయితే వెనక్కి ఇచ్చేయండి” అన్నాను.

“వెనక్కి ఇవ్వటానికి అవి ఇంకెక్కడున్నాయి? అవన్నీ గోడవున్లో పెడితే. చెదలు పూర్తిగా తినేశాయి. చెదల మందు కొట్టించి, మళ్ళీ కొత్త బీరువాలు చేయించటానికి చాల అయింది. దానిలో మీ వంతు యాభై తొమ్మిది వేల, మూడు వందల రూపాయల, నలభై రెండు పైసలు. మీరే నాకు డబ్బు బాకీ. ఆ డబ్బు ఎలా పంపిస్తారు, చెక్కా? బాంక్ ద్వారానా?” అన్నాడు నాటక ఫక్కీలో.

ఆ రామారావు కూడా తప్పించుకు తిరుగుతున్న ధన్యుడే మరి!

కొన్ని దశాబ్దాల క్రితం, భారతదేశంనించీ వచ్చిన ఒక సాహిత్యకారుడితో, మా ఊళ్ళోనూ, ఇతర ఊళ్ళల్లోనూ కొన్ని అవధానాలూ, సాహిత్య గోష్టులూ నిర్వహించాము. శాస్త్రపరంగానూ, విషయ జ్ఞానపరంగానూ ఆయన గట్టివాడేగానీ, ఒక వ్యక్తిగా ఆయన మీద కొన్ని అపవాదులున్నాయి. నేనవేవీ పట్టించుకోలేదు.  

కానీ కొన్నేళ్ళ తర్వాత అమెరికాలోనే ఒక పెద్ద నగరంలో ఒక సంఘటన జరిగింది. ఆయన అవధానం చేయటానికి వచ్చి, తనకి అన్నం పెట్టిన ఒక అన్నపూర్ణగారితో, అడగరానిదేదో అడిగి, చేయరానిదేదో చేద్దామనుకున్నాడు. ఆవిడ మర్యాదగా వారించింది. ఆయన అది వినకపోతే, తన కుటుంబ సభ్యులనూ, సభా నిర్వాహకులూ హెచ్చరించింది. అందరూ కలసి చివరకు పోలీసు రిపోర్ట్ ఇవ్వటానికి సిద్ధమయారు. ఆయన ఈ తతంగం అంతా జరుగుతున్న విషయాలనుబట్టి ఊహించి. మిగతా ఊళ్లోల్లో ఎదురు చూస్తున్న కార్యకర్తల కంట కూడా పడకుండా, పోలీసులు వచ్చేలోపలే ఆయన అక్కడ ‘ఉష్... కాకీ” అని మాయమయాడు. మన తెలుగునాట ప్రత్యక్షమై, పేరంటంలో ఏదో చేసి, ఏమీ తెలియనట్టు నటించిన ముత్తైదువ మాదిరి “ష్ఁ! గప్‍చిప్” అయిపోయాడు. ఇక్కడ తప్పించుకుని ధన్యుడై, ఇప్పుడు భారతంలో వేరే అవతారం ఎత్తి, మళ్ళీ ‘బాక్ ఇన్ బిజినెస్’ అయినట్టు వింటున్నాం.

ఇక్కడే కాదు, ఇలా తప్పించుకు తిరగటం రాజకీయాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది.

పూర్వం “వెన్నుపోటు” సినిమాలో హీరోగారు ‘ఊహలు గుసగుసలాడే’ పాడుకుంటుంటే, ‘భలే చాన్సులే’ పాట పాడుతూ అల్లుడు రేలంగి ఆయన అభిమానులైన ఎంఎల్లేలందర్నీ ఓ హోటల్లో బంధించి, వాళ్ళందరూ కనపడుటలేదు అని తను కూడా తప్పించుకు తిరుగుతుంటే అందరికీ అర్థమయింది ఆ ధన్యజీవి కథ.

ఇక్కడ గమ్మత్తు అనండి, హాశ్చర్యం అనండి, ఏమంటేనేం ఆ హీరోగారి వీరాభిమానులే, అప్పటినించీ విలనుకి కూడా వీరాభిమానులుగా మారిపోయి, ఒకే పూజా మందిరంలో పెట్టుకుని ఆ ఇద్దరికీ ఒకేసారి పూజలు చేయటం. అంటే రాముడినీ, రావణాసురుడినీ, హోల్సేలుగా ఇద్దరికీ ఒకేసారి దణ్ణాలు పెట్టుకోవటం. వాళ్ళ ఇద్దరి పేర్లూ చెప్పుకుంటూ ధన్యులవటం. ధన్యమేవ జయతే!

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఇంకో మంత్రిగారు ఓటేయించుకుని ఆదరాబాదరాకి వెళ్ళిపోయి, అప్పటి నించీ ఓటర్లకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మళ్ళీ ఐదేళ్ళదాకా పాపం బిజీగా ఉంటాడేమో.

                          **

ఏమో… నాకు మాత్రం

సుమతీ శతకంలోని పద్యాలంటే అంటే ఎంతో ఇష్టం.

ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి యన్యుల మనముల్‌

నొప్పింపక, తానొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!

ఈ పద్యం అంటే ఇంకా ఎంతో వల్లమాలిన ఇష్టం.

ఏ సమయానికి ఎంతవరకూ అవసరమో తెలుసుకుని, అంతవరకే మాట్లాడి, ఇతరులని తన మాటలతో బాధ పెట్టక, తను నొచ్చుకోకుండా తిరిగేవాడే ధన్యుడు అని అర్ధం.

మాటే మంత్రము అంటే ఇదేనేమో!

ఎదుటివారి మాటలు వినకుండా, వారేం చెప్పినా విమర్సిస్తూ మాట్లాడే వారిని హెచ్చరించే పద్యం ఇది.  మాట జారితే వెనక్కి తీసుకోవటం కష్టం కదూ!

అయితే మరి ఏదన్నా నిజం సూటిగా చెప్పాలంటే, కొందరు విలనాసురులని ఇబ్బంది పెట్టాలి గదా!

నిజం నిష్టూరంగా ఉంటుంది కదా!

తప్పదు మరి! సత్యమేవ జయతే!

అందుకనేనేమో ఈరోజుల్లో మన వార్తాపత్రికలు కొన్ని, టీవీ ఛానళ్ళు మరికొన్నీ ఎన్నడూ నిజాలు చెప్పవు!

                          *****

bottom of page