top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

ఎన్నారై కాలమ్ - 5

5. అమెరికా తెలుగు సాహిత్యం

 

Satyam Mandapati Madhuravani.com

సత్యం మందపాటి

కొంత ఎత్తునించీ చూస్తే రచయితల్లో రెండు రకాలవారు కనిపిస్తారు నాకు. ఒకరు ఊహాలోకంలో విహరిస్తూ, నేల విడిచి పూర్తిగా కల్పిత గాథలు, ఊహా చిత్రాలు వ్రాసేవారు. ఇక రెండవ రకం, తమ సమాజం చుట్టూ జరుగుతున్న సంఘటనల మీద రచనలు చేసేవారు. ఇలాటి సామాజిక స్పృహతో కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, కవితలు, పాటలు, పద్యాలు వ్రాసే రచయితల దగ్గరనించీ వచ్చే సాహిత్యం ఆయా ప్రదేశాల సంస్కృతులకు, వారి జీవితాలకూ దగ్గరగా వుండే అవకాశం వుంది. దీనివల్ల ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా, ఈనాటి సాంఘిక పరిస్థితులను సరైన అవగాహనతో పరిశీలించటానికి మంచి అవకాశం కూడా వుంటుంది.

 

ఇలాటి సాహిత్యం అమెరికా నుండి తెలుగులో వస్తే, అది అమెరికా డయాస్పొరా తెలుగు సాహిత్యం అవుతుంది. ఏ దేశం నుండి వస్తే ఆ దేశ డయాస్పొరా తెలుగు సాహిత్యం అవుతుంది.

 

ఈ పరిశీలనలోకి వెళ్ళే ముందు, అసలు డయాస్పొరా సాహిత్యం అంటే ఏమిటి అని చెప్పటం అవసరం.

 

నేను చదివినదాన్నిబట్టి, ఒక సంస్కృతిని పాటించే దేశంనించీ ఇంకొక సంస్కృతిని పాటించే దేశానికి వలస వెళ్ళి అక్కడే జీవిస్తూ, తమ సంస్కృతిని పాటిస్తూ ఆ కొత్త సంస్కృతిలో పూర్తిగా ఇమిడిపోతూ, ఆ రెండు సంస్కృతుల జీవన అనుభవాలను సమన్వయం చేస్తూ వ్రాసే సాహిత్యాన్ని డయాస్పొరా సాహిత్యం అంటారు.

 

ఈ డయాస్పొరా సాహిత్యం ఎన్నో తరాలనుంచీ మిగతా కొన్ని భారతీయ భాషల్లోనూ, విదేశే భాషల్లోనూ వున్నా, తెలుగులో అక్కడా ఇక్కడా వున్నా అసలు ప్రారంభం అయింది పంతొమ్మిది వందల సహస్రాబ్దం రెండవ భాగంలోనే అని చరిత్ర చెబుతున్నది.

 

అమెరికాకి తెలుగువారు ఎంతో ముందే కార్మికులుగానూ, చదువులకోసమూ, వేరే కారణాల వల్లా బహు కొద్దిమంది వచ్చినా, పై చదువుల కోసం మనవారు రావటం 1950-60 దశకాల్లో శ్రీకారం చుట్టి, 1970 దశకంలో ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞుల రాకతో ప్రారంభమై, 1980 దశకంలో పుంజుకుని, 1990 దశకంలో వేగం అందుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల రాకతో 2000 నుండి బాగా ఎక్కువైనట్టు తెలుస్తున్నది.

 

తెలుగువారు మొదట్లో బర్మా, మలైషియా, ఫిజీ, ఇండోనీషియా, మారిషస్, సింగపూరు, కెన్యా, దక్షిణ ఆఫ్రికా మొదలైన దేశాలతో పాటు, ఇప్పుడు అమెరికా, యూరప్, ఆఫ్రికా ఖండాలలో దేశదేశాలకు ఉద్యోగరీత్యా వలస వెళ్లి అక్కడే నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. అక్కడనించీ అలా వలస వెళ్ళినవారు అక్కడ వారి సహజీవనం గురించి వ్రాసే తెలుగు సాహిత్యమే డయాస్పొరా తెలుగు సాహిత్యం. 

అమెరికా తెలుగు సాహిత్యం గురించి చెప్పేముందు ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమంది భారతదేశంనించీ చుట్టం చూపుగా అమెరికా వచ్చి, ఆరు నెలలు ఉండి, ఇక్కడ కేవలం తెలుగువారితో మాత్రమే తిరుగుతూ, విహారయాత్రలు చేస్తూ అమెరికన్ జీవన విధానాన్ని ఔపోసన పట్టినట్టు ఊహించుకుంటూ వ్రాస్తున్న రచనలు అమెరికా-తెలుగు డయాస్పొరా సాహిత్యం కానే కావు. అంతేకాదు, భారత అమెరికన్ సంస్కృతిపై సరైన అవగాహన లేకుండా వ్రాసే వీటి వల్ల ఎన్నో అపోహలకు తావు వుండటానికి అవకాశం వుంది. వాటిని వారి అమెరికా యాత్రా విశేషాలు అంటే బాగుంటుందేమో! 

ఇక అమెరికా తెలుగు సాహిత్యంలోకి వెడదాం.

 

ఉత్తర అమెరికాలో నివాసమున్న రచయితలనించీ భారతదేశంలోని ఆంధ్ర సచిత్రవారపత్రిక ఏప్రిల్ 24, 1964 సంచికలో ప్రచురింపబడిన మొట్టమొదటి కథ పేరు “వాహిని” అని తెలుస్తున్నది. రచయిత కెనడాలో నివాసమున్న కీ.శే. పులిగండ్ల మల్లికార్జునరావుగారు. ఆయన “ఆర్ఫియస్” అనే కలం పేరుతో వ్రాశారు. ఆయనే కెనడాలో 1970లో ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు పత్రిక “వాణి” సంపాదకులు కూడాను.

 

పెమ్మరాజు వేణుగోపాలరావుగారు, గవరసాన సత్యనారాయణగారు, కొంతమంది తెలుగు మిత్రులతో కలిసి ఏప్రిల్ 1970లో ప్రారంభించిన “తెలుగు భాషా పత్రిక” అమెరికానించీ ప్రచురింపబడిన మొట్టమొదటి తెలుగు చేతి వ్రాత పత్రిక.

 

చెరుకూరి రమాదేవి, దువ్వూరి నారాయణరావు, నిడదవోలు మాలతి, కిరణ్ ప్రభ, వంగూరి చిట్టెన్ రాజు, సత్యం మందపాటి మొదలైన వారు వారి మొదటి ఇన్నింగ్సులో అమెరికాకి రాకముందే భారతదేశంలో ఎన్నో కథలు, నవలలు, నాటికలు, కవితలు వ్రాసి పేరుపొందిన రచయితలు. అమెరికాకి వచ్చాక వీరందరూ అమెరికా నేపధ్యంలో తెలుగు-అమెరికా డయాస్పొరా సాహిత్యం వ్రాశారు. అలాటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు.

 

చెరుకూరి రమాదేవిగారి “పుట్టిల్లు” అమెరికా సంయుక్త రాష్ట్రాలనించీ ప్రచురింపబడిన మొట్టమొదటి కథ. సత్యం మందపాటి అమెరికా తెలుగువారి జీవితంపై వ్రాసిన కథలు “అమెరికా బేతాళుడి కథలు” రచన మాసపత్రికలో 1994లో ప్రచురింపబడ్డ మొట్టమొదటి తెలుగు డయాస్పొరా ధారావాహిక. తర్వాత 1995లో “అమెరికా బేతాళుడి కథలు” పుస్తక రూపంలో వచ్చి, అమెరికానుండి ఒకే రచయిత వ్రాసిన మొట్టమొదటి అమెరికా-తెలుగు డయాస్పొరా పుస్తకం అయింది. ఆ పుస్తకాన్ని దరిమిలా అమెరికా వచ్చేవారు ఒక గైడులా వాడుతున్నారని కూడా తెలిసింది. అది విడుదల అయిన ఆరు నెలలకే రెండవ ముద్రణ కూడా జరిగి అన్ని కాపీలూ పూర్తిగా అమ్ముడుపోయాయి. అదే సంవత్సరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి “అమెరికా తెలుగు కథానిక మొదటి సంకలనం” అమెరికా నుండి వచ్చిన మొట్టమొదటి వివిధ రచయితల కథా సంకలనంగా విడుదల అయింది.

 

ముందుగా అమెరికా - తెలుగు డయాస్పొరా తెలుగు రచయితల గురించి చూద్దాం.

 

చెరుకూరి రమాదేవి, వంగూరి చిట్టెన్ రాజు, పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణ, కోమలాదేవి, కస్తూరి రామకృష్ణారావు, పూడిపెద్ది శేషుశర్మ, కొమరవోలు సరోజ, వేమూరి వెంకటేశ్వరరావు, కిడాంబి రఘునాథ్, మాచిరాజు సావిత్రి, సీయస్సీ మురళి, దేశికాచార్యులు, వింజమూరి అనసూయాదేవి, సత్యం మందపాటి ప్రభృతులతో మొదలైన అమెరికా-తెలుగు డయాస్పొరా సాహిత్యం, 1990 దశకం నించీ విస్కృతమై రాధిక నోరి, ముత్యాల సీత, కలశపూడి శ్రీనివాసరావు, వసుంధరాదేవి, పుచ్చా వసంతలక్ష్మి, వేణు దశిగి, వేలూరి వెంకటేశ్వరరావు, సుధేష్ణ, అక్కినపల్లి సుబ్బారావు, కేవీఎస్ రామారావు, డొక్కా రామ్, పిల్లలమర్రి రామకృష్ణ, విన్నకోట రవిశంకర్, డొక్కా ఫణి, చావలి రామసోమయాజులు, శారదాపూర్ణ శొంఠి, శ్యామల దశిక, ఎస్ నారాయణ స్వామి, పుచ్చా అన్నపూర్ణ, శ్యామ్ సోమయాజుల, మాచిరాజు వెంకటరత్నం, ఆరి సీతారామయ్య, చంద్ర కన్నెగంటి, చంద్రహాస్ మద్దుకూరి, వైదేహీ శశిధర్, సురేశ్ కొలిచాల, జేకే మోహన్రావు మొదలైన రచయితలు, కొంతమంది విస్తారంగానూ కొంతమంది అప్పుడప్పుడూ వ్రాస్తూనే వున్నారు.

 

నా పరిశీలనలో 2000 సంవత్సరం తర్వాత ప్రచురింపబడిన అమెరికా సాహిత్యంలో ఎన్నో కొత్త పేర్లు కూడా అంత ఎక్కువగా కాకపోయినా వినిపిస్తున్నాయి. నా పరిశీలనలో చూసిన పేర్లు ఇవి. తమ్మినేని యదుకుల భూషణ్, నిర్మలాదిత్య, తాడికొండ శివకుమార శర్మ, కల్పన రెంటాల, శ్యామలాదేవి దశిక, శర్మ దంతుర్తి, ప్రభల శ్రీనివాస్, చింతపల్లి గిరిజాశంకర్, సురేంద్ర దారా, ఉమ ఇయ్యుణ్ణి, ఉమాభారతి కోసూరి, మధు పెమ్మరాజు, కె గీత, లక్ష్మి రాయవరపు, అపర్ణ గునుపూడి, ఇర్షాద్, దీప్తి పెండ్యాల, శాయి రాచకొండ, విన్నకోట రవిశంకర్, సత్యదేవ్ చిలుకూరి, రాయుడు వృద్ధుల, తాటిపాముల మృత్యుంజయుడు, పాణిని జన్నాభట్ల, నెల్లుట్ల నవీన్ చంద్ర, సాయి బ్రహ్మానందం గొర్తి మొదలైన ఉత్తర అమెరికా రచయితలు చక్కటి డయస్పొరా తెలుగు సాహిత్యం అందిస్తున్నారు. నేను వ్రాసిన ఈ పేర్లు చాలవరకూ వంగూరి ఫౌండేషన్ వారు 1995 నించీ ఇప్పటిదాకా నిరంతరాయంగా ప్రచురిస్తున్న ‘అమెరికా తెలుగు కథానిక’ పుస్తకాలలో ప్రచురించిన రచనల్లో ఎక్కువగా కనపడినవి మాత్రమే. మిగతా కొన్ని సంస్థలు సాహిత్యానికి చిన్నవో బుల్లివో పీటలు వేస్తున్నా, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యానికేకాక, ప్రపంచ తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్నది ఒకే ఒక సంస్థ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. అమెరికా సదస్సులు, ప్రపంచ సదస్సులూ, టెక్సస్ తెలుగు సదస్సులూ నిర్వహిస్తూ, ఏటేటా ఎన్నో డయాస్పొరా పుస్తకాలు ప్రచురిస్తున్నారు కాబట్టి, వారి పుస్తకాలే నేను ఈ వ్యాసానికి ప్రామాణికంగా తీసుకున్నాను. నేను ఏ రచయిత పేరైనా ఇక్కడ ఉదహరించకపోతే, నేను సేకరించింస సమాచారంలో ఆ పేరు ప్రస్ఫుటంగా కనపడలేదన్నమాట. అంతేగానీ వేరే ఏ కారణాల వల్లా కాదు.

 

ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, అమెరికాలో జాతీయ తెలుగు సంఘాల గురించి కొంచెం చెప్పాల్సి వుంది. ఇక్కడ వున్న నాలుగైదు జాతీయ తెలుగు సంఘాలు ప్రతి రెండు సంవత్సరాలకీ జరిపే తిరునాళ్ళలో భారతదేశంలోని తెలుగు రాజకీయనాయకులకీ, సినిమా తారలకీ, తదితర సినిమా వారికీ, స్వాములకీ పెద్ద పీట వేసి, అమెరికా సాహిత్యాన్ని పట్టించుకోవటం లేదన్నది మనందరికీ తెలిసిన నూరు శాతం నిజం. అందుకే అక్కడి తెలుగు సాహిత్య సదస్సుల్లో తక్కువమంది కనిపిస్తారు. వారు కూడా ఎప్పుడూ కనపడే ఇండియానించీ వచ్చే సాహితీవేత్తలూ, అమెరికాలోని ఆస్థాన సాహిత్య విద్వాంసులు, లేదా కొందరు స్వయంప్రకటిత సాహితీ పెత్తందార్లు. అక్కడ సాహిత్యపరంగా చెప్పుకోదగ్గ అంశం ఒక్క అష్టావధానాలే. అదొక్కటీ తప్ప అమెరికా రచయితలు వ్రాస్తున్న డయాస్పొరా తెలుగు సాహిత్యానికి ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వకపోగా, వారి పుస్తకాలు కనీస ఖర్చులకైనా కొని ఆ తిరునాళ్ళకి వచ్చినవారికి సంచుల్లో పెట్టే ఇచ్చేంత మనసు ఈ సంస్థల్లో కనపడదు. ఒక సంస్థ అయితే ప్రతీ రెండేళ్ళకీ ఇండియాలో నవలల పోటీ పెట్టి లక్షల రూపాయల బహుమతులేకాక, ఆ పుస్తకాల ప్రచురణ కూడా చేస్తుంది కానీ, డయాస్పొరా సాహిత్యాన్ని మాత్రం వెనక బెంచీలో కూర్చోబెడుతుంది. ఈమధ్య ఒక జాతీయ సంస్థ నిర్వహించిన తెలుగు పుస్తకోద్యమం ఒక చిన్న కాంతి కిరణాన్ని మిణుక్కుమని మెరిపించింది. మంచి రోజులు వస్తాయేమో చూద్దాం!

 

అమెరికా సాహిత్యంలో అన్ని రకాల ప్రక్రియలూ కనిపించటం ముదావహం. ఆశుకవి పూదూరి జగదీశ్వరన్ అమెరికాలో మొట్టమొదటగా అష్టావధానం చేసి మెప్పిస్తూ దరిమిలా ఎన్నో అవధానాలు చేశారు. అలాగే ఇప్పుడు అమెరికాలోనే పెరిగిన యువ అవధాని గన్నవరం లలిత్ కాలేజీలో చదువుకుంటూనే, తెలుగు సంస్కృత భాషల్లో ప్రావీణ్యం, పద్యాలు మీద పట్టు సాధించి దేశ విదేశాల్లో అవధానాలు చేస్తున్న తెలుగు అమెరికన్. అలాగే చందోబధ్ధమైన పద్య రచనలో నిష్ణాతులు జేకే మోహనరావుగారు, రామ్ డొక్కా, ఫణి డొక్కా, జంధ్యాల జయకృష్ణ బాపూజీ మొదలైన వారు అమెరికా నివాసులే. వంగూరి చిట్టెన్ రాజు (అసలు ప్రశ్న), పెమ్మరాజు వేణుగోపాలరావుగారు (కన్యాశుల్కం), శ్యామసుందర్ యల్లంరాజు (త్యాగయ్య, గాంధీ, శివ మొదలైనవి), దామరాజు సత్యనారాయణమూర్తి, సత్యం మందపాటి (దొంగ దొంగ) మొదలైన ఎంతోమంది నాటికలు వ్రాసి స్థానికంగానే కాక పలుచోట్లా ప్రదర్శనలిస్తున్నారు. పైన చెప్పిన రచయితలలో కవితలు వ్రాస్తున్న వారు కూడా ఎంతోమంది వున్నారు. మణిశాస్త్రి, సత్యం మందపాటి, చెరుకూరి రమాదేవి, చిట్టెన్ రాజు మొదలైన వారు ఎన్నో సీడీలకు పాటలూ వ్రాశారు. ఫణి డొక్కా, సత్యం మందపాటి, చంద్ర దువ్వూరి మొదలైన వారు వ్రాసిన కథలు లఘు చిత్రాలుగా వచ్చాయి. ఎంతోమంది తెలుగు అమెరికన్ రచయితలు వ్రాసిన కథలు పలువురి నోట శ్రవణ కథలై అంతర్జాలం నిండా నిండుగా వున్నాయి. అలాగే రాయవరం విజయభాస్కర్ వారం వారం నడుపుతున్న ‘కథాకళ’ డయాస్పొరా కథలతో పాటు, భారతదేశ కథలను కూడా వినిపించి చెప్పుకోదగ్గ సేవ చేస్తున్నారు.

 

ఇక అమెరికాలో నా నలభై ఏళ్ళ దీర్ఘ సాహిత్య యాత్ర క్లుప్తంగా చూద్దాం.

 

పైన చెప్పినట్టు ఇండియాలో నా మొదటి ఇన్నింగ్సు అయాక, అమెరికాలో నా రెండవ ఇన్నింగ్సు కొంచెం మందంగా మొదలయింది. కొన్నేళ్లు నేనిక్కడ నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా కొంచెం వెనుకపడినా, నా ‘అమెరికా బేతాళుడి కథలు’తో మళ్ళీ శ్రీకారం చుట్టింది. ఎన్నో కథలతో, ఐదు నవలలతో, ఎన్నో వ్యాసాల ధారావాహికలతో, కవితలతో, నాటికలతో, పాటలతో ఇన్నేళ్ళు సంతృప్తిగా నడవటానికి కారణాలు, ఒకటి - నాకు ముఖ్యంగా తెలుగు భాష మీద వున్న వల్లమాలిన ప్రేమ. రెండవది - నాకు తెలిసిన మన అమెరికా-తెలుగు జీవితంలో చూస్తున్న కష్టసుఖాలను పలువురికి చెప్పాలి అనే కోరిక. మూడవది - భారతదేశం వదిలి అమెరికాకి, ఇతర విదేశాలకీ వలస వస్తున్న ఎన్నో వేలమందికి, కొత్త ప్రదేశంలో విజయవంతంగా నెగ్గుకు రావటానికి వలసిన సమాచారం ఇవ్వాలనే తపన. ముళ్ళపూడి వెంకటరమణ గురువుగారు నేను వ్రాసిన ఒక పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ, సరదాగా వ్రాస్తున్నా నేను ఎంతో సమాచారం ఇస్తున్నాను కనుక,  Information+Entertainment అనే రెండు మాటలూ కలిపి, నాది “ఇన్ఫోటైన్ మెంటాలిటీ” అన్నారు. ఇది స్వోత్కర్ష కాదు. అమెరికా తెలుగు డయాస్పొరా సాహిత్యానికి వున్న శక్తి ఎంతో సాటి రచయితలకు చెబుదామని నా ఉద్దేశ్యం. ఈ ప్రక్రియలో మనమందరం భాగస్థులమే!

 

వీటికి ఉదాహరణగా నేను నాలుగున్నర సంవత్సరాలు నిరాఘాటంగా వారం వారం ‘ఆంధ్రభూమి’ వార పత్రికలో వ్రాసిన ఎన్నారై కబుర్లు. వ్యాసం చివర సంపాదకులు నా ఈ-మైల్ ఇవ్వటం వల్ల పాఠకులు తమకు కావలసిన సమాచారాన్ని అడుగుతుంటే, ఒక సంవత్సరం పాటు వ్రాద్దామనుకున్న శీర్షిక నాలుగున్నర సంవత్సరాలు నడిచి, నేనే ఇక వ్రాయటానికి సమయం చాలక వ్రాయటం ఆపేయవలసి వచ్చింది. అలాగే ప్రాణాలు తీసే కాన్సర్ నేపధ్యంలో ఇక్కడ జరిగిన సంఘటనలతో వ్రాసిన ‘చీకటిలో చందమామ’ నవల, అమెరికాలో మన ఆడపిల్లల వివాహ జీవితాల్లో ఎక్కువగా జరుగుతున్న గృహహింస నేపధ్యంలో వ్రాసిన, ఈమధ్యనే బహుమతి పొందిన ‘ఎక్కవలసిన రైలు’ నవల, అలాగే అమెరికాలో వారి రంగూ, భాషా, సంస్కృతుల మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఉద్యోగాల్లో చేరిన మనవాళ్ళు విజయపథంలో ముందుకు వెళ్ళటానికి అవసరం అయే పన్నెండు కథలతో వ్రాసిన “అమెరికా ఉద్యోగ విజయాలు”. ఇలాటివే రచయితగా నాకెంతో తృప్తినిచ్చినవీ, పాఠకులకు దగ్గర చేసినవీ.

 

“ఇంకా మీరు వ్రాస్తున్నారా?” అని అడిగే మిత్రులకు, నాది ఒకటే సమాధానం. వ్రాయటం నా ఊపిరి. అది లేకపోతే నేను లేను అని. 

ఇక అమెరికాలో తెలుగు పత్రికల విషయం చూస్తే, పెమ్మరాజు వేణుగోపాలరావుగారి “తెలుగు భాషా పత్రిక”, కిడాంబి రఘునాథ్ గారు ప్రారంభించిన “తెలుగు జ్యోతి”, వంగూరి చిట్టెన్ రాజు “మధురవాణి”, దండమూడి రామ్మోహనరావు “తెలుగు అమెరికా”, కెనడా నించీ “తెలుగు తల్లి” మొదలైన అచ్చు పత్రికలు ఆనాటినించీ వున్నాయి. ఈ సైబరయుగంలో ఎన్నో మంచి అంతర్జాల పత్రికలు కూడా వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ అమెరికానించీ వస్తున్న పత్రికలు “కౌముది”, “సుజనరంజని”, “మధురవాణి”, “ఈమాట”, “సారంగ”, ‘సిరిమల్లె”, “తెలుగు తల్లి”, “తూలిక” మొదలైనవి వున్నాయి. ఈ పత్రికలన్నీ మంచి తెలుగు డయాస్పొరా సాహిత్యాన్ని అందిస్తున్నాయి, ఎంతోమంది పాత, కొత్త రచయితలని ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఈ పత్రికలు అంతర్జాలంలో వుండటం వల్ల ప్రపంచమంతటా విడుదలయిన వెంటనే చదివే సౌలభ్యం వుంది. ప్రపంచ తెలుగు సాహిత్యమే మన ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నది. 

అమెరికా అంతర్జాల పత్రిక నిర్వాహకుల గురించి ఒక విషయం చెప్పి తీరాలి. పైన చెప్పిన పత్రికలేకాక, ఇలాటి ఇతర పత్రికలు కూడా వారు లాభాపేక్షతో నడపటం లేదు. అంతేకాక ఇటు రోజుకి పది గంటలపైన ఉద్యోగాలు చేసుకుంటూ, అటు అమెరికా జీవనంలో ఇంటా బయటా ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ, దాని పైన వందా, రెండు వందల పేజీల పత్రికను ప్రతి సంచికనూ అనుకున్న సమయానికే, అందంగా చక్కటి సాహిత్య విలువలతో అందించటం మాటలు కాదు. వ్యాపార రంగంలో వచ్చే ఇలాటి పత్రికల్లో ఎంతోమంది నెలసరి జీతాలకు పనిచేస్తారు. మరి ఇక్కడ, భార్యాభర్తల్లో ఒకరు సంపాదకులు, ఇంకొకరు సహాయకులు. వీరు నిజమైన ఈ అమెరికా తెలుగు డయాస్పొరా సాహిత్యాన్ని వెలికి తెస్తున్నవారు.

 

అలాగే ఈ డయాస్పొరా సాహిత్యాన్ని పుస్తక ప్రచురణ ద్వారా ప్రోత్సహిస్తున్న వంగూరి ఫౌండేషన్ వంటి బహు కొద్ది సంస్థలూ, తమ పుస్తకాలను లాభాపేక్ష లేకుండా తామే ప్రచురించుకుంటూ పలువురు పాఠకులకు అందజేస్తున్న రచయితలూ కూడా ఈ అమెరికా తెలుగు డయాస్పొరా సాహిత్య యజ్ఞంలో ఎంతోకొంత పాలుపంచుకుంటున్నవారే!

 

నాలాటి, మీలాటి రచయితలు అమెరికా తెలుగు సాహిత్యాన్ని వ్రాయగలరు. వ్రాస్తున్నాము. కాని ఈ పత్రికా సంపాదకులు, రకరకాల సాహిత్య సదస్సుల నిర్వాహకులూ, కథా సంకలనాలను ఏటేటా ప్రచురించే ఫౌండేషన్లూ లేకపోతే మేము వ్రాసేది మీకు అందే అవకాశమే లేదు.

 

అందుకే ఇంత నిస్వార్ధంతో అంతర్జాల పత్రికలను నడుపుతున్న మహాశయులకీ, ఇలాటి తెలుగు సాహిత్య సదస్సుల నిర్వాహకులకూ, అమెరికా కథా సంకలనాలు, ఇతర అమెరికా తెలుగు సాహిత్య పుస్తకాలు ప్రచురిస్తున్న రచయితలకీ, ఇలాటి ఎందరో మహానుభావులకీ, ఈ చారిత్రాత్మకమైన తెలుగు డయాస్పొరా సాహిత్యాన్ని చదువుతూ రచయితలను ప్రోత్సహిస్తున్న పాఠక దేవుళ్ళకీ శతకోటి వందనాలు అర్పిస్తూ ఈ వ్యాసాన్నిముగిస్తున్నాను.

 

*****

 

(సెప్టెంబరు, 2022లో న్యూజిలాండ్ నుండి ఆస్ట్రేలియా, సింగపూరు, ఇండియా, దక్షిణ ఆఫ్రికా, కెనడాల ద్వారా, అమెరికా దాకా వంగూరి ఫౌండేషన్ నిర్వహించిన ఎనిమిదవ ప్రపంచ సాహిత్య సదస్సులో చేసిన నా ప్రసంగ వ్యాసం ఇది. ఘనంగా జరిగిన ఈ సదస్సు నిర్వాహకులకీ, సాహితీ మిత్రులకీ ధన్యవాదాలు)

bottom of page