top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

ఎన్నారై కాలమ్ - 4

4. మరణానికి ప్రాణం పోస్తాం!

 

Satyam Mandapati Madhuravani.com

సత్యం మందపాటి

నేను యాభై ఏళ్ళుగా ఎన్నో ఉద్యోగాలు చేసి విశ్రాంత జీవనం మొదలుపెట్టాక, ఈమధ్య కరోనాగాడు మనిషి మనుగడకే అడ్డుకట్ట వేశాక, టీవీ చూడటం ఎక్కువయింది. వాటిలో ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబు జీవితంలో ఒక భాగం అయిపోయాయి.

కుటుంబ మాఫియావారు నిర్మిస్తున్న నటశూన్యుల సినిమాలు చూడలేక, వారి భాష భరించలేక, చిన్న/కొత్త నటులు వేస్తున్న కొన్ని తెలుగు సినిమాలు, చక్కటి తెలుగు మాట్లాడే డబ్బింగ్ ఆర్టిస్టులతో తీసిన మలయాళం, తమిళ్, హిందీ సినిమాలు కూడా ఎక్కువగానే చూస్తున్నాను. ఎక్కువగా అంటే వారానికి రెండూ మూడూ అని.

మన మైన్ రోడ్డు తెలుగు సినిమాల్లో అన్నిటిలోనూ, పరభాషా చిత్రాల్లోనూ టైటిల్స్ వచ్చే ముందరే, మూడు ‘గదరా సుమతీ’ సుభాషితాలు చెబుతారు. ఒకటి, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. రెండోది, సిగరెట్ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. మూడోది ఈ సినిమా తీసేటప్పుడు ఏ జంతువునీ చంపలేదు అని.

బాగుంది సుమతిగారూ అనుకుంటూ సినిమా చూస్తుంటే, అన్ని భాషా సినిమాల్లోనూ హీరో మద్యం సేవిస్తూనే వుంటాడు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ సిగరెట్ తాగి “ఏరా, చెత్త వెధవా” అంటూ హీరో ముఖం మీద పొగ వదులుతుంటుంది. (పొగ త్రాగరాదు, పీల్చవలెను లేదా వదలవలెను). అన్ని సినిమాల్లోనూ జంతువులను చంపి చికెన్, మటన్, ఫిష్ తినేస్తుంటారు, కుక్కల మీదనించీ కార్లు పోనిస్తుంటారు. అప్పుడే అనిపించేది, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటమెందుకని, ముందుగానే పైన చెప్పిన ముందస్తు జాగ్రత్త ప్రకటనలు ఇస్తారని. అప్పుడే నా చిన్ని బుర్రలో ఇంకొక ఆలోచన వచ్చింది. 

మన సినిమాల్లో ఎంతో వయొలెన్స్ వుంటుంది కదా, ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా పీకలు కోసేస్తూ చంపేసుకుంటూ వుంటారు కదా, మరి మానవ హింస, హత్యలు చేయటం నేరం అని ఎందుకు వ్రాయరు?

అలాగే ఎన్నో సినిమాల్లో మానభంగాలు వుంటున్నాయి కదా, మరి మానభంగాలు చేయటం చట్టరీత్యా నేరం అని ఎందుకు వ్రాయరు?

వారి ఉద్దేశ్యంలో సాటి మానవుల హింసలూ, హత్యలూ, మానభంగాలు ఆటలో అరటిపళ్ళేనా?

చెప్పానుగా నాది చిన్న బుర్ర అని. సినిమా వాళ్ళకి, సెన్సారు వారికీ వున్న మేథస్సు నాకు లేదు. అందుకే నేను ఎప్పుడూ అనుకునేవాడినే కానీ, ఇప్పుడే అనటం.

 

ఒక సినిమాలో నేను భరించలేక కళ్ళు మూసుకునేన్ని హింసలు వున్నాయి. ఒక సినిమా అంటే ఒకటే కాదు ఇప్పుడు వచ్చే ఎన్నో సినిమాల్లో అలాగే వుంటుందిగానీ, నేను చూసిన ఒక సినిమాలో ఇలా వుంది.

 

మెగా విలన్ పక్కనే వున్న ఇనుప కడ్డీ తీసుకుని హీరో తండ్రిని కళ్ళల్లో పొడిచి, గుడ్లు పీకేస్తాడు. ఆయన శరీరాన్ని రాళ్ళతో కొట్టి అతని తలని పచ్చడి చేస్తాడు. ఆయన కళ్ళూ, శరీరం పడిపోయిన చోటన వున్న భూమాత నశించిపోయిన ఆ మానవత్వపు విలువలు చూడలేక, తలెత్తుకోలేక అదే మట్టి కరిచి సిగ్గుతో ఎర్రబారింది. ఆ విషయం ఎగురుతున్న కాకులూ గద్దల ద్వారా మన గిగా హీరోకి వెళ్ళింది.

అప్పుడు ఆ గిగా హీరో అమ్మ ఆవకాయ పెడుతూ, పెద్ద కత్తితో మామిడికాయలు తరుగుతున్నది. డైలాగులు చెప్పటం చేతకాని మన తారడు వాళ్ళమ్మ దగ్గర కత్తి లాక్కుని ముందు తన చేతి మీద ఒక గంటు పెట్టుకున్నాడు. చిందిన రక్తంతో తన తల్లికి బొట్టు పెట్టి, తనూ ఆ రక్త తిలకం పెట్టుకున్నాడు. పెద్దగా అరుచుకుంటూ, కత్తి గాలిలో ఎత్తి పట్టుకుని విలన్ ఇంటికి వచ్చాడు. ముంబై గుండు విలనుకి తెలుగు చదవటం రాదు కనుక, ప్రభుత్వం వారు ఇచ్చిన ‘మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం’ అంటే ఏమిటో తెలియక పీపాలకు పీపాలు త్రాగేస్తున్నాడు. మన గిగా హీరో, విలన్ని అక్కడ వున్న అతని మందీ మార్బలాన్నీ ఒక్కడే ఊచకోత కోశాడు. చేతులూ, కాళ్ళూ, తలకాయలూ తెగి ఎగిరి క్రింద పడుతున్నాయి. నేలంతా రక్తమయం అయిపోయింది. తొడగొట్టి, పెట్టుడు మీసం ఊడిపోకుండా దాన్ని జాగ్రత్తగా తిప్పుతూ ‘సై అంటే సై’ అన్నాడు.

సినిమా చూస్తున్న చిన్న పిల్లలు భయంతో వాళ్ళమ్మల ఒళ్ళో చేరారు. వాళ్ళమ్మలు పిల్లల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని, పిల్లల కళ్ళు మూసేసి, వారి కళ్ళు కూడా వాళ్ళే మూసుకున్నారు.

ఇంకా వేళ్ళ సందుల్లోనించీ సినిమా చూస్తున్న కొందరు పెరుగుతున్న పిల్లలు, “నేను పెద్దయాక, మన హీరోలాగానే అందర్నీ నరికేస్తాను” అంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు పెద్దవుదామా, ఎవర్ని చంపుదామా అనే కోరిక కనిపిస్తూనేవుంది.

 

ఎదిగిన (?) పిల్లల నాన్నలు, బాబాయిలు, మామయ్యలు, ఆంటీసులు, అంకుల్సులు మాత్రం పెద్దగా ఈలలు వేస్తూ, “నరికేయ్, చంపేయ్” అంటూ అరుస్తూ, గిగా హీరోకి హారతి పడుతున్నారు. ప్రభుత్వం కూడా సంతోషపడి, ఆ గిగా హీరోకీ, దర్శకుడుకీ నందులూ, గిందులూ ఎవార్డులు ఇచ్చి సత్కరించారు.

నేను సైకాలజిస్టుని కాదుగానీ, మరిలాటి ప్రేక్షకుల మనస్తత్వం, ముఖ్యంగా ఇలాటి సినిమాలు చూస్తూ పెరిగే పిల్లల మనస్తత్వం ఎలా వుంటుందో ఊహించటం కష్టం కాదు. పిల్లలే కాదు, ఇలాటి సినిమాలు చూసే పెద్దలు కూడా ఇలాటివి చూసీ చూసీ అదొక దైనందిన విషయంగా అలవాటయిపోయి భారతదేశంలోనూ,  ప్రపంచ వ్యాప్తంగానూ ఎలా ప్రవరిస్తున్నారో చూస్తుంటే ఇట్టే అర్ధమయిపోతుంది.

ఏ ఒక్కరోజు వార్తలు చూసినా, చదివినా ఏమున్నది గర్వ కారణం? మత, కుల కలహాల రక్త తర్పణం, రాజకీయ నాయకుల గూండాయిజం, మారణహోమం, మాఫియాలు, బాంబు దాడులూ, గన వయొలెన్స్, హత్యలూ, మానభంగాలు… ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతంలోనే కాక, ప్రపంచమంతటా హింసాకాండ. అశాంతి పర్వం ఎక్కువయిపోయాయి.

ప్రభుత్వంలోనూ, ప్రముఖుల్లోనూ, ప్రజల్లోనూ, ప్రతి చోటా, ప్రతి దేశంలోనూ… అదే!

 సినిమాలు చూసి ప్రజలు నేర్చుకుంటున్నారా? ప్రజల జీవిత కథలనే సినిమాలుగా తీస్తున్నారా?

ఎవరికైనా దీనికి జవాబేమిటో, ఎలా పరిష్కరించాలో ఏమిటో ఆలోచించే తీరికా, అవసరం వున్నాయా?

ఆదివాసుల కాలాలనించీ ఈనాటి దాకా స్వప్రయోజనాల కోసం ప్రపంచమంతటా చిన్నా పెద్దా యుద్ధాలు జరుగుతూనే వున్నాయి. దానివల్లనే ఎన్నో సమాజాలు, సంస్కృతులూ రాజ్యాలు, దేశాలు మట్టిలో కలిసిపోయాయి.

నిజంగా ఇది అవసరమా? క్రూరమైన సింహం కూడా ఆకలేస్తేనేగానీ ఆహారం కోసం తప్ప ఇంకొక జంతువుని చంపదే! మరి ఈ ‘తెలివిగల’ మనిషి సాటి మనిషిని అకారణంగా ఎందుకు చంపుకోవటం?

వీటి పర్యవసానాలు మానవత్వం వున్న మనుష్యుల మీద ఎలా వుంటాయి?

**

 కొన్నేళ్ళ క్రితం, అంటే కరోనా మానవాళిని కబళించక ముందు, నేను ఇద్దరు అమెరికన్ మిత్రులతో కలిసి, లంచ్ చేద్దామని ఒక రెస్టారెంటుకి వెళ్ళాను. ముగ్గురం ఒక పక్కగా కూర్చున్నాం.

 బాబ్ వియత్నాం యుద్ధంలో పాల్గొన్నాడు. అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా, ఆరోజుల్లో అమెరికా బలవంతంగా అక్కడికి పంపించిన వారిలో అతనూ ఒకడు. అక్కడ ఎన్నో ఊళ్ళల్లో, అడవుల్లో దాదాపు రెండేళ్ళు యుద్ధంలో పాల్గొన్నాడు.

కెవిన్ ఇంకా చిన్నవాడు కనుక చిన్న బుష్ హయాంలో ఇరాక్ మీద యుద్ధంలో ఒక సంవత్సరంపాటు పోరాడిన వ్యక్తి. అతనూ ఆయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్న వ్యక్తే!

ముగ్గురం కావలసినవేవో ఆర్డర్ చేసి అక్కడే గోడ మీద అమర్చిన టీవీలో వార్తలు వస్తుంటే చూస్తున్నాం.

ఒక సైకాలజిస్టుతో ‘యుద్ధంతర్వాత సైనికులకు వుండే మానసిక సంక్షోభం’ (పోస్ట్ వార్ ట్రోమా) మీద కొన్ని ప్రశ్నలు అడుగుతున్నది వార్తా ప్రతినిధి. మేం ముగ్గురం మౌనవ్రతం పాటించి దీక్షగా వింటున్నాము.

 

వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణ మూడు నిమిషాలే అయినా, మాలో ఎన్నో ప్రశ్నలు రేపింది. తర్వాత ఒక అరగంట ఆ విషయం మీదే చర్చించాము కూడాను. బాబ్, కెవిన్ ఇద్దరూ యుద్ధంలో పోరాడిన వారే కనుక, నాకు ఎన్నో కొత్త విషయాలు చెప్పారు.

నా చిన్నప్పుడు నా కళ్ళ ముందే ఎవరో ఒక ఈగని చంపితే విలవిల్లాడిన మనిషిని నేను. అందుకే నేనే ఎన్నో ప్రశ్నలు అడిగాను నా మిత్రులని.

 

యుద్ధంలో పోరాడే వారిలో చాలమంది ఇరవై-ముప్ఫై ఏళ్ళ మధ్య వయస్కులు. రెండేళ్ళపాటు తనకి కావలసిన వారినందరినీ వదిలేసి, అడవుల్లోనూ ఎడారుల్లోనూ, అక్కడి భాషా, సంస్కృతీ తెలియని దేశాల్లోనూ, ఎదురుగా వచ్చేవారిలో ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో గుర్తుపట్టలేని ప్రదేశాల్లోనూ, పగలూ రాత్రీ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని జీవించటం మాటలు కాదు. ప్రతి సైనికుడూ కనీసం ఒకరిని, కొండొకచో చాలమందినీ చంపుతూనే వుంటారు.

మొదటిసారిగా యుద్ధానికి వెళ్ళినవారిలో, అలాటి పరిస్థితుల్లో వారి మనోభావాలు ఎలావుంటాయి? వాటి ప్రభావం తర్వాత వారి శాంతియుత జీవనం మీద ఎలా వుంటుంది?

ఆరోజు టీవీలో ఎన్నో గణాంకాలు చెప్పారు. అవన్నీ పూర్తిగా గుర్తు లేకపోయినా గుర్తున్నవి కొన్నీ, తరువాత పరిశీలన చేసినవి కొన్నీ కలిపి ఇక్కడ వ్రాస్తున్నాను.

  

యుద్ధాలు చేసే సైనికులలో, పదిహేను శాతం మాత్రమే రణరంగంలో ఇంకో మనిషిని చంపటానికి వెనుకాడరుట.

మరి మిగతా ఎనభై ఐదు శాతం?

 పాతిక శాతం చంపటానికి ఇష్టపడరు కానీ, కొంచెం గుండె నిబ్బరంతో సర్దుకోగలగుతారు. ఇంకో యాభై శాతంలో కొంతమంది దేశభక్తి వలనా, ఎంతో శాతం యుద్ధరంగంలో వున్నారు కాబట్టి శత్రువుని చంపకపోతే తామే చనిపోయే అవకాశం వుంది కనుకా ఆ పని చేస్తారు. కానీ ఎన్నో సంవత్సరాలు ‘యుద్ధం
తర్వాత వుండే మానసిక సంక్షోభం’ (పోస్ట్ వార్ ట్రోమా) వల్ల మానసికంగా ఎన్నో రకాలు ఇబ్బందులకు గురవుతారుట.

ఈ గణాంకాలు విన్నాక అడిగాను, “మరి మిగతా పది శాతం?” అడిగాను నా లెక్కల గొప్పతనం చూపిస్తూ.

"ఏముంది, విపరీతమైన మానసిక క్షోభకు గురై, చివరికి ఆత్మహత్యల పాలై ప్రాణాలు విడిచిన కథలు మా స్నేహితుల్లో వింటూనే వున్నాం” అన్నాడు కెవిన్.

నాకెందుకో బాధ వేసింది. అమెరికా కానీయండి, భారతదేశం కానీయండి, ఏ దేశమైనా కానీయండి- కేవలం స్వార్ధ రాజకీయ కారణాల వల్లనే తమ దేశం కోసం అనవసరపు యుద్ధాల్లో ప్రాణాలకు తెగించి పోరాడటమే కాక, ఒకవేళ ప్రాణాలతో బయటపడితే, ఆరోగ్యంగా బ్రతకటానికి ఈ మానసిక సంక్షోభం నుండి తమ ప్రాణాలు కాపాడుకోవటానికి వారి మనసులతో మరో యుద్ధం చేయాలి!

 ‘ఓ మనిషీ! ఎటు వెడుతున్నావు?’ అనుకున్నాను మనసులో.

మరి అలాటి యుద్ధం తర్వాత కలిగే మానసిక సంక్షోభం’ ఎలావుంటుంది?

ఇలాటివారిలో, 18.3 శాతం సైనికులు మాత్రమే విపరీతంగా దీనికి గురి అవుతున్నారుట. వీరిలో సాధారణంగా మానసిక అలజడి (Mental Anxiety), మానసిక వ్యాకులత (Mental Depression), పీ.టీ.ఎస్.డి.  (Post-Traumatic Stress Disorder) లతో బాధలు పడుతున్నారుట. అయినా వీరిలో 10.4 శాతం మాత్రమే రకరకాల కారణాల వల్ల డాక్టర్ల దగ్గరికీ, సైకాలజిస్టుల దగ్గరికీ వెడుతున్నారు.

మరి ఈ మానసిక సంక్షోభం ఎలా వస్తున్నది అనేదానికీ కొన్ని అంకెలున్నాయి.

వీరిలో నూటికి కనీసం తొంభై మంది తుపాకీ కాల్పులు జరిగిన చోట ప్రత్యక్షంగా వున్న వారేనట.

వారిలో 94.5 శాతం శవాలతోనూ, శరీర భాగాల మధ్యా చాలసేపు వున్నవారు.

86.5 శాతం తమకి బాగా స్నేహితులైన వారు తమ కళ్ళ ముందే చనిపోతుంటే, అసహాయులుగా వుండిపోవలసి వచ్చిందిట.

76 శాతం యుద్ధ ప్రదేశాల్లో అన్నెంపున్నెం ఎరుగని పసిపాపలూ స్తీలూ భయంతో పరుగెడుతూ ఆ కాల్పుల్లో చనిపోవటం చూశారుట.

 

ఇలాటి ఘాతుకాలు చూసిన వారికి ఎంత గుండె నిబ్బరం వున్నా, మానసిక వ్యాధులకి గురవటం సహజం కదూ!

 

ఈ గణాంకాలు అమెరికాకి సంబంధించినవే అయినా, యుధ్దాలు చేసిన, చేస్తున్న మిగతా దేశాల్లో కూడా దాదాపుగా ఇలాగే వున్నాయి.

 

బాబ్ అన్నాడు, “గత పదిహానేళ్ళలో పైన చెప్పిన గణాంకాల్లో కొంత మార్పు వచ్చిందిట. యుద్ధానికి వెళ్ళేవాళ్ళలో, ఇంతకుముందుకన్నా కూడా ఎక్కువమంది శత్రువుల ప్రాణాలు తీయటానికి వెనుకాడటం లేదనీ, అందువల్ల ఈ ట్రోమా చాలమందిలో తక్కువగా కనిపిస్తున్నదనీ విన్నాను”.

 

ఇది మంచికా? చెడుకా? నాకు అర్ధం కాలేదు.

 

“ఈమధ్య ఒక వ్యాసం చదివాను. అదొక విచిత్రమైన పరిశీలన” అన్నాడు బాబ్.

 

"అదేమిటో చెప్పు బాబూ… బాబ్!” అడిగాను కుతూహలంగా.

 

బాబ్ అన్నాడు, “మా చిన్నప్పుడు, అంటే నాలుగు దశాబ్దాల క్రితం టీవీలో కార్టూన్లు చాల సరదాగా అహింసాపరంగా వుండేవి. మిక్కీ మౌస్, టాం అండ్ జెర్రీ, జట్సన్స్, ఫ్లింట్ స్టోన్స్ మొదలైనవి. ఇప్పుడు కార్టూన్లలో కూడా ఎక్కడ చూసినా ఒకళ్ళనొకళ్ళను చంపుకోవటమే. కార్టూనులకన్నా కూడా కంప్యూటర్ ఆటలు ఇంకా ఘోరం. ఏ ఆట చూసినా కత్తులు పెట్టి నరుక్కోవటం, సజీవంగా తగలబెట్టటం, వఠ్ఠి చేతులతో చంపేయటం, మర తుపాకులతో కాల్చి పారేయటం, బాంబులతో పేల్చేయటం మొదలైనవి. ఇలాటి ఆటలు పిల్లల మనస్థత్వాల మీద ఎలాటి ప్రభావాలు చూపిస్తున్నాయి? బ్లూ వేల్ మొదలైన ఆటలు, ఆ ఆటలు ఆడేవారిని ఆత్మహత్యకు సిద్ధం చేయటం కూడా చూస్తూనేవున్నాం. మరి అలాటి పిల్లల మానసిక పరిపక్వత ఎలా వుంటుంది? వాళ్ళు పెద్దయాక ఎలా తయారవుతారు?” అతని మాటల్లో ఆవేదన కూడా కనిపిస్తున్నది.

అవును, అతను దేశం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని వ్యక్తి.

మరి అతనిలో ఆ ఆవేదన ఎందుకు వుండదు?

**

                     

 మహాకవి శ్రీశ్రీ అన్నారు.

                  “ఆనందం అర్ణవమయితే

                  అనురాగం అంబరమయితే

                  మరణానికి ప్రాణం పోస్తాం

                  స్వర్గానికి నిచ్చెనలేస్తాం” అని.

ఆయన ఆశాజీవి.

మనం నిరాశా జీవులం కానే కాదు.

ఆయన “మరణానికి ప్రాణం పోస్తాం” అనేది, మనందరికీ ఆయన ఇచ్చిన సందేశం.

మరి మనం ఈ అహింసా కాండలో, హింసా పర్వంలో “ప్రాణాలని అంతం చేస్తాం” అంటే ఎలా?

*****

bottom of page