MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
ఎన్నారై కాలమ్ - 2
3. మా నైజీరియా తాతయ్య
సత్యం మందపాటి
“మీరు అని మీరననుకుంటున్న మీరు, మీరు కాదు” అన్నాడు స్వామి కంగారానంద.
కూర్చునే ఉలిక్కి పడ్డాడు బెంచికోటిలో కూర్చున్న ఆయన భక్తుడు.
“అదేమిటి స్వామీ! నేను నేను కాదా?” అడిగాడు.
“అవును. నువ్వు నువ్వూ కాదు, నేను నేనూ కాదు, నేను నువ్వూ కాదు. నువ్వు నేనూ కాదు” అన్నాడు స్వామి కంగారానంద.
ఒకటో క్లాసు సెక్షన్ బి చివరి బెంచీలో కూర్చుని కునికిపాట్లు పడేటప్పుడు ఆయన అసలు పేరు బుల్లి కనకం.
ఒకటో క్లాసుతోనే చదువు మానేసి పెద్దయాక కనకంగారు అయాడు.
స్వామిజీ అవతారం ఎత్తాక, ‘కన’ తీసేసి కంగారుకి స్వామి అయినందుకు తన ఆనందం కుసింత కలిపేసి కంగారానంద అయాడు.
ఆయన మాటలు విన్న భక్తుడికి కంగారూ, గాభరా మొదలైనవన్నీ వచ్చాయి.
“మరి మనం ఎవరం?” అని అడిగాడు.
“మనం అనుకుంటున్న మనం, మనం కాదు. అదంతా భ్రమ!” అన్నాడు కళ్ళు మూసుకుని.
స్వామి కంగారానంద పూర్వజన్మలో తను చైనీస్ వేదాంతి Confucius అని గాఢంగా నమ్మే వ్యక్తి.
అందుకేనేమో ఈ జన్మలో ఆయనకి ఆ కంగారు, గాభరా, Confusion.
**
చిన్న బుష్ అమెరికా అధ్యక్షుడిగా వున్నప్పుడు ఆయన సంస్థానంలో Rumsfeld అని డిఫెన్స్ డిపార్ట్మెంటులో ఒక కనకంగారు వుండేవాడు. ఆయన చెప్పదలుచుకున్న విషయం ఉద్దేశ్యం మంచిదే అయినా తను కంగారు పడి, అందర్నీ కంగారు పెట్టేవాడు. కంగారు పడకుండా ఒకసారి ఆయన చెప్పింది అర్ధం చేసుకుంటే నాకు అర్ధమయింది ఇది.
“There are some knowns and unknowns. Some knowns are clearly knowns, but some of them are known unknowns. We need to think about them deeply. In the same way there are some unknowns, which are really unknowns. But some of the unknowns will be knowns if you find answers for them”
ఇక్కడీ వ్యాసానికి ఇదంతగా అవసరం లేదనుకోండి, ఇంకోసారి దీని గురించి వివరంగా చెప్పుకుందాం.
ఇంకా ముందుకు వెళ్ళే ముందు మన గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణగారు చెప్పిన జోకు ఒకటి గుర్తుకి వస్తున్నది. ఆ జోకుకి బాపూగారు గొప్ప కార్టూన్ కూడా వేశారు.
శ్రీకృష్ణుడు ఒకానొక రాత్రి పూట తన రౌండ్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి తలుపుకొట్టాడుట.
రుక్మిణి తలుపు దగ్గరకు వచ్చి, “ఎవరు?” అని అడిగింది.
“నేనే” అన్నాడు అచ్చం ఎన్టీవాడిలా నీలంగా వున్న పద్మ నయనమ్ముల నల్లటి శ్రీకృష్ణుడు.
“నేనే అంటే?" అడిగింది రుక్మిణమ్మగారు అనుమానంగా.
“అది తెలుసుకోవాలనే కదా నా ప్రయత్నం!” అన్నాడా గీతాకారుడు.
అదే మరి గీతాసారం.
**
ఆమధ్య ఒక దూరపు మిత్రుడు గృహప్రవేశం చేసుకుంటూ సత్యనారాయణ వ్రతం ప్లస్ పార్టీకి రమ్మంటే వెళ్ళాను. అక్కడ మా పాత తరం వాళ్ళు కొద్దిమందీ, ఈ తరం వాళ్ళు ఎంతోమంది వున్నారు. అక్కడ జరిగిన కొన్ని సంభాషణలు నాలాటి చాదస్తులకు కొంచెం వింతగా వున్నాయి.
చాల పార్టీల్లో మగవాళ్ళు సినిమాలు, క్రికెట్, రాజకీయాల గురించీ, ఆడవాళ్ళు చీరలూ, నగలూ, పిల్లల గురించి మాట్లాడుకోవటం సాధారణంగా జరిగేదే. మరి ఆరోజు?
వరాహ్ అంటున్నాడు, “మీ ఆవిడ అమెరికన్ డస్సుల్లో కన్నా చీరలోనే బాగుంటుంది” అని.
వృషభ్ అడిగాడు, “మా ఆవిడ సంగతి నీకెలా తెలుసురా” ఆశ్చర్యపోతూ.
“ఫేస్ బుక్కులో మా ఆవిడ తను చీర కట్టుకున్న ఫొటో పెట్టి, శారీ ఛాలెంజ్ చేసింది. ఎంతోమంది చీరలు కట్టుకుని తమ ఫొటోలు పెట్టారు. అందులో మీ ఆవిడ ఫొటోకే ఎన్నో లైకులూ, మరెన్నో వావులూ (తెలుగు వాపులు కాదు, తెంగ్లీష్ వావులు), ఇంకా ఎన్నో లవ్వులూ వచ్చాయి. మిగతావాళ్ళకి అవన్నీ చాల తక్కువ వచ్చాయి. అందుకే అన్నాను మీ ఆవిడ చీరలో బాగుంటుంది అని” అన్నాడు వరాహ్.
అవును అతనవన్నీ లెఖ్కపెట్టి మరీ చెబుతుంటే కాదనటం ఎలా?
“మీ ఆయన ఈసారి వంకాయలు, బెండకాయలు బాక్యార్డులో బాగా పండించాడుట కదా, నసా” అడిగింది సన.
“ఓ… నేను ఇంస్టాగ్రాములో పెట్టిన ఫొటోలు చూశావా? మీరందరూ చూస్తారనే పెట్టాను. రేపు ఆయనే బెండకాయ కూర, వంకాయ కాల్చిన పచ్చడి చేస్తానన్నాడు. ఆ ఫొటోలు రేపు పెడతానులే, చూద్దురుగాని” అంది నస.
“అబ్బా… రేపటి దాకా ఆగాలా” అన్నది సన.
“మా అబ్బాయికి ఒకటే జలుబు చేసింది. ముక్కు తెగ కారిపోతున్నది” అన్నది కరోనా.
“నిన్న ఫేస్ బుక్కులో వాడి ముక్కు ఫొటో చూశాను. బాగుంది, లైక్ కూడా కొట్టాను. ఇప్పుడు ఎలా వున్నాడు” అడుగుతున్నది శ్రాద్ధ.
ఇవన్నీ వింటుంటే నాకేమనిపించిందో తెలుసా?
నేను నేను కాదు. మీరు మీరు కాదు. మనం మనం కాదు అని.
నేను స్వామీ కంగారానందతో ఏ మాత్రం కంగారు పడకుండా ఏకీభవిస్తున్నాను.
ఎందుకంటే ఇప్పుడు నువ్వూ, నేనూ అనేవే లేవు. అంతా మనమే. సిరివెన్నెలగారు చెప్పినట్టు జగమంత కుటుంబం మనది. మా ఇంట్లో నేను దగ్గితే, ఫేస్ బుక్కులో ఖంగు ఖంగుమని వినిపిస్తుంది. మీ ఇంట్లో అర్ధరాత్రి నువ్వేం చేస్తున్నావో ప్రపంచమంతటికీ ఇంస్టాగ్రాములో కనిపిస్తుంది. సప్త సముద్రాలు దాటినా కూడా ఎప్పుడు ఎవరింట్లో ఏం జరుగుతున్నదో, ప్రపంచం అనే రంగుల తెర మీద ప్రాంతీయ బేధాలు, భాషా బేధాలు లేకుండా అందరూ, అనుచితమే అయినా ఉచితంగా చూడవచ్చును. ఆలసిస్తే ఆశాభంగం!
అలాటప్పుడు నేనెవరు? నువ్వెవరు? అంతా మిధ్య!
అంటే మన జీవితాలు వడ్డించిన విస్తరి. ఈనాటి బఫేలోలాగ వున్నవాటిలో మీకేం కావాలో, ఏవి తీసుకుంటున్నారో అన్నది అప్రస్థుతం. అందరికీ అన్నీ కనిపిస్తాయి.
నేను ఫార్మసీకి వెడితే, ఆక్కడ ఫార్మసిస్టుకి నా వూరూ పేరూ అఖ్కర్లేదు. పుట్టిన తేదీ, నెలా, సంవత్సరం చెబితే చాలు. నా ఎత్తూ, పొడుగూ, వెడల్పూ, బరువు. నేను వేసుకునే మందులు, వేసుకోలేని మందులతో సహా అన్నీ చెప్పేస్తుంది వాళ్ళ కంప్యూటరమ్మ. మరి అమ్మ కదా. మన అమ్మకి మన గురించి తెలియనివి ఏముంటాయి!
అలాగే నేను కారులో ఇక్కడ రోడ్ల మీద జాగ్రత్తగా రూల్స్ అన్నీ పాటిస్తూ వెడుతున్నా, కారులో నాబోటి బ్రౌను దొరగారిని చూడగానే కౌబాయ్ టోపీ పెట్టుకున్న మా టెక్సస్ తెల్ల పోలీసు ఎన్ని టిక్కెట్లు ఇద్దామా అని ఆలోచిస్తూ నెమ్మదిగా నా వెనకాలే వస్తుంటాడు. తన కంప్యూటర్లో నా కారు నెంబర్ పెట్టగానే, మందపాటి సత్యనారాయణగారి జాతకం అంతా దాంట్లో వస్తుంది. అంతేకాదు నా జాతకంలో ఎన్ని గదులున్నాయి, ఏ గదిలో ఎవరున్నారు అని ఆయనకి వెంటనే తెలిసిపోతుంది. ఈయనేదో బుద్ధిమంతుడే, గడబిడరాముడు కాదు అని ఆయనకి అనిపిస్తే, పేరంటంలో ఏదో చేసి ఏమీ ఎరగనట్టు నంగనాచిలా కూర్చున్న ముతైదువులా నెమ్మదిగా పక్కనించీ వెళ్ళిపోతాడు.
గూగులమ్మగారిని మీ గురించి అడిగితే, అంతర్జాలయ్యగారి తాళపత్రాల్లో మీరు వ్రాయని మీ ఆత్మకథని, మీ పేరూ, వూరూ, పెళ్ళాం/మొగుడు (ప్లస్ ‘ఇంకెవరైనా’ వుంటే వాళ్ళ పేరుతో సహా), మీ పిల్లలూ, పిల్లులూ, మీ వయస్సూ, సొగస్సూ, జాతకం, జీవితం, ముఖచిత్రం, చదువుకునేటప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు, మీ బాంక్ ఎకౌంట్ నెంబర్లు, ఏటిఎం నెంబర్లు, మీరు ఎవరెవరికి అప్పులిచ్చారు, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇవ్వకుండా ఎగ్గొట్టారు, ఒకటేమిటి మీ జీవిత చరిత్ర సమస్తం... పేజీలకు పేజీలు వచ్చేస్తుంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనం రహస్యంగా దాచుకునే ఏ సమాచారమూ రహస్యం కాదు. నేను నేనెలా కానో నా సమాచారం కూడా నాది కాదు.
ఈమద్య ఉనికి దొంగతనాలు లేదా గుర్తింపు దొంగతనాలు అంటే identity thefts ఎక్కువయిపోయాక, మీ రహస్య సమాచారం వెళ్ళకూడని వాళ్ళ దగ్గరకు చేరటం, దాని వల్ల బాంక్ బాలన్సులు గల్లంతవటం, రిటైర్మంట్ డబ్బులు కాకెత్తుకు పోవటం కూడా చూస్తూనే వున్నాం.
ఈ ఉనికి దొంగల గురించి వ్రాస్తుంటే, మా నైజీరియా తాతయ్య గుర్తుకి వచ్చాడు.
పాపం ఇప్పుడెలా వున్నాడో ఏమిటో!
**
చాలామంది తమ బాంక్ ఎకౌంట్లకీ, ఈమైలు మొదలైన వాటికీ పాస్వర్డ్ పెట్టేటప్పుడు నిర్లక్ష్యంగా వుంటారు. ఏ గుర్తింపు దొంగ అయినా, నూటికి కనీసం అరవై శాతం పైన మీ పాస్వర్డ్ సులభంగా చెప్పేయగలడు. జోగారావుగారి పాస్వర్డ్ ఆయన భార్య పేరు, అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, కుక్క పేరు, ఊరి పేరు వుండే అవకాశం చాల ఎక్కువ. కొండొకచో వీటిలో ఒకటి రెండు పేర్లు కలిపి పెట్టటం కూడా చేస్తుంటాడు సన్యాసిరావు. మన్మధరావు కొంచెం తెలివిగా, తన భార్య పేరు కాకుండా ఇటు పక్కింటి పడోసన్ సైరాబాను పేరో, అటు పక్కింటి అమ్మాయి జయసుధ పేరో పెట్టేస్తాడు. ఇహ శివరావయితే ఏటియం పిన్ నెంబరు తన పుట్టిన సంవత్సరమో, భార్య పుట్టిన సంవత్సరమో, పిల్లలు పుట్టిన సంవత్సరమో, తను పుట్టిన నెలా, రోజు కలిపి పెట్టటమో చేస్తుంటాడు. కొంతమంది తమ ఫోన్ నెంబరులోని చివరి నాలుగు నెంబర్లు పెట్టేస్తారు. కొంతమంది వాళ్ళ ఇంటి నెంబర్లలో చివరి నాలుగు నెంబర్లు పెట్టేస్తారు. మోసగాళ్ళకి మోసగాళ్ళు ఇలాటివి ఇట్టే పట్టేస్తారు. మీరు వీళ్ళదగ్గర పాస్వర్డులు దాయటం కష్టమే కాదు, కష్టమున్నర. ఇకవేళ మీ తెలివితేటలతో, ఏ ‘వన్ పాస్వర్డో’ వాడి అవి కష్టతరం చేస్తే, ఈ గుర్తింపు దొంగలకి వేరే మార్గాలున్నాయి.
దీని గురించి ఆలోచిస్తున్నప్పుడే మా నైజీరియా తాతయ్య మళ్ళీ గుర్తుకి వచ్చాడు.
పాపం ఇప్పుడెలా వున్నాడో ఏమిటో!
**
నేను పుట్టకముందే మా అమ్మగారి నాన్నగారికి, మా నాన్నగారి నాన్నగారికి పైనించీ పిలుపులు వచ్చి హడావిడిగా వెళ్ళిపోయారు. ఎవరో వరసకి తాతయ్యలే కానీ, అసలు తాతయ్యలని మేము చూడనే లేదు. అది నా జీవితంలో ఎప్పుడూ ఒక వెలితిగానే వుండేది.
నైజీరియాలోని మా ఒబుటో కుళంగ తాతయ్య సెంచరీ కొట్టిన మర్నాడే చనిపోయాడుట. ఆయనకి అక్కడ వున్న నూట పది మనవలనందర్నీ వదిలేసి, నన్ను అంటే నూట పదకొండో వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక తాన యావదాస్తీ అనగా అక్షరాలా నాలుగు వందల ఇరవై (ఫోర్ ట్వెంటీ లేదా చార్ సౌ బీస్) మిలియన్ల డాలర్లు నా పేరున వ్రాసి వెళ్లిపోయాడుట. అది నాకు అందించి, ఆయన చివరి కోరికని తీర్చటంకోసం నాకు వ్రాసినది ఆ ఈమైలు. నా బాంక్ సమాచారం అంతా పంపిస్తే, వెంటనే ఆ డబ్బులు నా ఖాతాలో జమ చేస్తారుట. తప్పకుండా ఆయన కోరిక నెరవేర్చి మమ్మల్ని ఆనందింపజేయండి అని వ్రాశాడు వాళ్ళ లాయర్ గారు. నేను మా నైజీరియా తాతయ్య పోయిన దుఃఖంలో వుండి, నా బాంక్ వివరాలు పంపించలేకపోయాను.
స్వర్గంలో వున్న మా నైజీరియా తాతయ్య ఒబుటో కుళంగగారు ఏమనుకున్నాడో ఏమిటో! పాపం!
**
మా వెనకింట్లో వున్న వెనిస్సాది వేరే కథ. ఆవిడ కొడుకు పేరుతో వచ్చింది ఈమైల్. ‘అమ్మా, నేను పారిస్ వెళ్లి అక్కడ నా పర్స్ పారేసుకున్నాను. క్రెడిట్ కార్డులు, డబ్బూ అన్నీ పోయాయి. కనీసం ఐదు వేల డాలర్లయినా లేకపోతే మళ్ళీ అమెరికాకి తిరిగిరావటం కష్టం. నామీద ఏమాత్రం ప్రేమవున్నా ఫలానా చోటుకి వెంటనే డబ్బులు పంపించు అని. ఎంతైనా మాతృ హృదయం కదా! వెనిస్సా వెంటనే ఆ డబ్బు పంపించేస్తుంది.
‘మీరు భలేవాళ్ళు సార్! ఇలాటి కాకమ్మ కబుర్లకి ఎవరు మోసపోయేది’ అనుకుంటే మనం దాల్లో లెగ్గేసినట్టే! అలాటివారు నిజంగా వున్నారు స్వామీ. మీ మీద ఒట్టు! లక్షకి ఒక్కరున్నా చాలు, ఆ మోసగాళ్ళ కడుపులు అప్పనంగా నిండటానికి!
కాకపొతే ‘మీరూ, నేనూ ఇంకా బాగా ఎంతో గొప్ప తెలివైన వాళ్ళం కదా, ఇలాటి చౌకబారు ట్రిక్కులకి మనం అంత తొందరగా దొరకం!’ అని అనుకుందామనుకుంటుంటే, అలా అనుకోనీయకుండా ఒక సంఘటన జరిగింది.
ఒక శుభ సమయంలో మా ఇంట్లో ఫోను మ్రోగింది.
“ఇంటాయనగారు వున్నారా” అని అడిగాడు తెంగ్లీషులో ఆ పిలిచిన వాడు ఫల్గుణుడు.
అందుకనే అదేదో సేల్స్ కాల్ అని తెలిసినా, తెలీనట్టు ‘అవును. నేనే మా ఇంటికి ఆయన్ని’ అన్నాను.
“ఇంటాయనగారూ.. ఇంటాయనగారూ.. మరే నేను ఇన్కంటాక్సు ఆఫీసునించీ పిలుస్తున్నాను. మీరు ఇన్కంటాక్స్ ఎగ్గొట్టారని ఎఫ్బీఐ వారికి ఇట్టే తెలిసిపోయిందిష. వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవటానికి సపరివార సమేతంగా వస్తున్నారని తాజా వార్త. మిమ్మల్ని రక్షించటమే మా లక్ష్యం. అందుకని మీ పూర్తి పేరూ, బాంక్ ఎకౌంట్ నెంబరూ, సోషల్ సెక్యూరిటీ నెంబరూ ఇస్తారా! మిమ్మల్ని రక్షిస్తాం!” అని మర్యాదగా అడిగాడు. x
అతని ఇంగ్లీష్ యాస విని, నాకు అనుమానం వచ్చి, “మీరెవరు? ఎక్కడ నించి” అడిగాను ఆంగ్లంలో.
“నేనా, నా పేరు జాన్. వాషింగ్టన్ డిసీ” అన్నాడు.
ఈసారి తెలుగులో మామూలుగా, సౌమ్యంగా అడిగాను. “నువ్వింకా నిద్రపోలేదా రాంబాబూ? ఇప్పుడు హైద్రాబాదులో టైమెంత?” అని.
“లేదు సార్. రాత్రి ఒంటిగంట అయింది” అని తెలుగులో అంటూనే, తను చేసిన తప్పు అర్ధమైనట్టుంది వెంటనే ఫోన్ పెట్టేశాడు.
ఒక వారం గడిచాక మళ్ళీ అలాటి ఫోనే వచ్చింది. ఈసారి గుజరాతీ పటేల్ గారు. వీళ్ళందరూ, అదే స్క్రిప్టు బట్టీ పట్టినట్టున్నారు. మక్కికి మక్కి అవే డైలాగులు.
ఈసారి కొంచెం ఆట పట్టిద్దామని, “గుజరాతీగారూ, పటేలుగారూ! కొంచెంసేపు అలా ఫోనులో హోల్డ్ చేసి వుంటారా? నేను ఇంకో ఫోన్ కాల్ చేసి మీతో కాన్ఫరెన్స్ కాల్ చేయాలి” అన్నాను, నిదానమే ప్రధానం అనే సామెత నెమరు వేసుకుంటూ.
“ఇప్పుడు హోల్డేమిటి? ఎఫ్బీఐవాళ్ళు మిమ్మల్ని పట్టుకోవటానికి ఆఘమేఘాలమీద వస్తుంటే?” అన్నాడు పటేల్, ఆలస్యం అమృతం విషం అనే సామెత గుర్తు చేస్తూ.
“అందుకే.. పోలీసులని కూడా రెండో లైన్లో పిలిచి, వాళ్ళని మీతో మాట్లాడమందామని..” అంటుండగానే, భోజన సమయం అయిందో ఏమో పటేల్ గారు చటుక్కున ఫోన్ పెట్టేశారు.
తర్వాత ఆ ఫోన్ నెంబర్ గూగులమ్మ గూడులో పెట్టి, “ఇదేమిటో చెప్పమ్మా?” అని అడిగాను.
‘ఇది పవిత్ర భారతీయులు చేస్తున్న స్కాములు స్కీము, నమ్మి మోసపోకండి. అమెరికన్ పేర్లే కాకుండా పటేల్, రావు, రాయ్ అని ఇలా ఎన్నో పేర్లతో ఫోన్ చేస్తారు. ఏ రాయయయితేనేం మీ బ్యాంకులో ఐశ్వర్యం పోగొట్టుకోవటానికి. జాగ్రత్త!” అని పదిపేజీల సమాచారం వచ్చింది.
మీరూ.. జాగ్రత్తగా వుండండి. ఇలాటి స్కాములు, మన స్వాముల స్కాముల లాగానే, చాల రకాలుగా వున్నాయి. మీ గుర్తింపు పోయిందా... మీ ఆస్తులు గోవిందా.. గోవింద!
మళ్ళీ ఇంకోక్కసారి శ్రీమతి సరుకులు తెమ్మంటే సూపర్ టార్గెట్ డిపార్ట్మెంటల్ స్టోరుకి వెళ్లాను. గత నలభై ఏళ్ళుగా మేము వెడుతున్న షాపే అది! నేను టార్గెట్ డిపార్ట్మెంటల్ స్టోరులో ఎప్పటిలాగానే పాలూ, పంచదారా, కాఫీ పొడి కొనుక్కొచ్చాను.
నాలుగు రోజుల తర్వాత ఇంట్లో సోఫాలో కూర్చుని, కాలు మీద కాలు వేసుకుని, కొత్తగా తెచ్చిన కాఫీ పౌడరుతో మా ఆవిడ చేసిన వేడివేడి ఫిల్టర్ కాఫీ ఆనందంగా త్రాగుతున్నాను. అప్పుడే టీవీలో వార్తలు వస్తున్నాయి.
‘పోయిన రెండు మూడు వారాలుగా టార్గెట్ షాపులో క్రెడిట్ కార్డు పెట్టి మీరు ఏదయినా కొన్నారా? ఒకవేళ కొని వుంటే, మీరు గుర్తింపు దొంగల చేతుల్లో చిక్కారహో’ అని చెబుతున్నది ఆ టీవీ అమ్మాయి.
కొన్ని వేల మంది క్రెడిట్ కార్డుల జాతకాలు ఆ దొంగల చేతుల్లో వున్నాయనీ, మీ క్రెడిట్ కార్డు కంపెనీని పిలిచి ‘బాగా విచారించండి’ అని టీవీలో చెబుతున్నది అందమైన ఒక రాగి జుట్టు తెల్ల సుందరి.
“ఒకసారి నీ ఎకౌంటులోకి లాగిన్ అయి చూడరాదూ.. ఎందుకైనా మంచిది..” అంది శ్రీమతి.
‘సరే! కానీ’ అని కంప్యూటర్ ముందు కూర్చుని నా ఎకౌంట్ తెరిచాను.
టార్గెట్లో కాఫీపొడి కొన్నట్టు వుంది. పాలూ, పంచదారా, కాఫీపొడి కలిపి పదిహేను డాలర్లకి తక్కువే! కానీ దానిక్రింద, ఇంకో షాపులో రెండు వేల ఐదు వందల డాలర్లకి అరవై ఐదు అంగుళాల శామ్సంగ్ టీవీ, సరికొత్త ఫోర్కే మోడల్ కొన్నట్టుగా వుంది. అదేమిటి? అంత డబ్బు పెట్టి నేనెప్పుడు కొన్నాను అనుకుని, ఆ క్రెడిట్ కార్డు కంపెనీకి ఫోన్ చేద్దామనుకున్నాను.
వాడికి వెయ్యేళ్ళ ఆయుష్షు. నేను పిలవబోతుంటే వాడే పిలిచాడు. వాడు అంటే క్రెడిట్ కార్డు కంపెనీ. పిలిచింది మాత్రం ఒక అమ్మాయి.
“అయ్యా/అమ్మా! మీరు నిన్న టార్గెట్లో కాఫీ పౌడరు కొన్నాక, రెండు వేల ఐదు వందలు పోసి టీవి కొన్నారు. బాగుంది. మరి ఆ కాఫీ త్రాగుతూ, కొత్త టీవీలో కార్యక్రమాలు చూడటానికి, మీకు వజ్రాల ఉంగరాలు కావాలా? మీ గుర్తింపుని దొంగిలించారని మాకేదో అనుమానంగా వుంది. నిజంగా అవన్నీ మీకేనా?” అని అడిగింది.
“లేదు అమ్మడూ! నేను కాఫీ పౌడరు కొన్నది నిజమే కానీ, టీవీ కొనలేదు. మా ఆవిడ కూడా అసలు వజ్రాల ఉంగరాలు పెట్టుకోదు. సత్తె ప్రమాణం” అన్నాను.
“అదికాదు సత్తెంగారూ.. టార్గెట్ షాపుతో పాటు, ఇంకో రెండు షాపులు ఈ రెండు మూడు వారాల్లో గుర్తింపు దొంగల బారినపడ్డాయి. కొన్ని వేల ఎకౌంట్లు వాళ్ళు దొంగిలించారు. మీరు కూడా వారికి దొరికిపోయుంటారు. . నిజంగా మీరు టీవీ కొనలేదా? వజ్రాల ఉంగరాలు కొనలేదా” అడిగింది అమ్మడు.
“లేదమ్మడూ లేదు. నీ మీద ఒట్టు!” అని గట్టిగా నొక్కి వక్కాణించాను.
“లెమ్మి సీ వాట్ ఐ కెన్ డూ!” అంది అమ్మడు.
అందుకని, ‘జాగ్రత్తగా వుండండి బాబూ... జాగ్రత్తగా వుండండి! ఇలాటి ‘గుర్తింపులు’, వాటితో పాటూ ‘గుర్తింపు దొంగతనాలూ’, ఎంత మంచివాడయినా నైజీరియా తాతయ్య మనకి వద్దు!! జాగ్రత్త!
**