top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

నిర్ణేత

Kanneganti Anasuya

కన్నెగంటి అనసూయ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ

Bio

“నాన్నా...” 

“ ఆ… చెప్పమ్మా, నాకు అర్ధమైంది...” అన్నాడు ఆలపాటి చదువుతున్న పేపర్ మడచి  పక్కన పెట్టి సింగిల్ సోఫాలో కూర్చున్న కూతురి వైపు చూస్తూ. అదతనింటి పేరు.  అతనలాగే ఫేమస్. ఏం మాట్లాడాలో తెలియలేదు వెన్నెలకి కాసేపు. ఇబ్బందిగా కదిలింది.

   “అమ్మని... పిలూ...” అన్నాడతను కూతురి ఇబ్బందిని గమనించి.

“అమ్మా... నాన్న రమ్మంటున్నా” రంటూ వంటింట్లోకి వెళ్ళి అప్పటికే రేవతి వస్తూండటం చూసి ఆమెని ముందుకెళ్లనిచ్చి వెనగ్గా రాసాగింది వెన్నెల. 

“ట్రేసవుట్ చెయ్యగలిగావా? “ సూటిగా విషయానికి వచ్చేసాడు ఆలపాటి.

“ఆ… నాన్నా!”  తనూ సూటిగానే  చెప్పింది. తన దగ్గరున్న నెబ్యులా వాచ్ బాక్స్ ని తండ్రికందిస్తూ…

“గుడ్...” 

“ముగ్గుర్లో... ఎవర్నీ... ఎలా?   అదీ చెప్పెయ్. మరి. ఎంత ముసలాళ్లం అయితే మాత్రం  మా అల్లుడెవరా అని  మా ఉత్సాహం మాది. కదా…! ” ఆలపాటి గొంతులో ఏదో ధైర్యం... తన కూతురి నిర్ణయం సరిగానే ఉంటుందని.           

                       ***                            ***                   ***  

“ఇక్కడ కూర్చుందామా…?”

వద్దని చెప్పకుండానే ముందుకెళ్ళిపోతున్న రాధికని  తెల్లబోయి చూశాడు  రోహిత్. అప్పటికే  కుర్చీ వెనక్కి లాగి కూర్చుండిపోయాడేమో… తప్పదన్నట్టు  లేచి ఫాలో అయ్యాడు.  

 

రాధిక, రోహిత్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్. ఇద్దరూ స్నేహితులు. నాలుగయిదు సార్లు కలసి తినటం, కలసి షాపింగ్ చేయటంతో ఏర్పడ్ద చనువు కొద్దీ ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. మా నాన్న పెద్ద కాంట్రాక్టర్. పైగా ఒక్కడ్నే కొడుకుని. బోలెడంత ఆస్తి. దానికి తోడు నా జీతం. మనకేం లోటుండదు అన్నాడు. ఏమీ మాట్లాడలేదు రాధిక. మౌనంగా ఉండిపోయింది. ఎగిరి గంతేస్తుందనుకున్నవాడల్లా... అలాంటిదేం లేకపోయే సరికి  సైలెంటయిపోయి రాధిక చేతిలో పేపర్ వెయిట్ లా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.  

 

నిజానికి రాధిక అంత అమాయకురాలేం కాదు మాటలకే పడిపోవటానికి. దగ్గరవుతున్నట్టే ఉంటుంది కానీ ఏదో తెలియని గీత గీసుకుంటుంది తన ముందు...

 

దూరంగా పోయి లాన్లో వేసిన కుర్చీలో కూర్చుంది రాధిక.  అక్కడ కూర్చుని ఏదైనా తినటమంటే ఎంతిష్టమో రాధికకి. బొగడ పూల చెట్టుకి దగ్గర్లో ఉంటుందా స్దలం. అసలే చల్లని సహజమైన చెట్ల నీడ. దానికి తోడు ఉండుండి వచ్చే పూల సువాసన. పైగా అప్పుడప్పుడూ ఒకటీ అరా పూలు టప్పున కింద రాలుతూ… తమ ఉనికిని తెలియచేస్తూ  ఉంటాయి.   వచ్చి కూర్చోక తప్పింది కాదతనికి- ”ఏం చేస్తాం తప్పదు కదా..” అనుకున్నాడు రాధిక ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ…

 

కాసేపు తర్జన భర్జనలు పడ్డ మీదట తమక్కావాల్సినవేవో  ఆర్డర్ చేసాక,  సప్లయర్ వచ్చేలోపు మెల్లగా హేండ్ బాగ్ తెరచి పెద్ద బాక్స్ బయటికి తీసింది రాధిక..

 

“అమ్మో...! అంత పెద్ద బాక్సే? ఏంటది గిఫ్టా..? నాకెందుకిప్పుడు? పుట్టిన రోజూ కాదూ… పెళ్ళి రోజు కూడా కాదు...” కొంటెనవ్వు అతని ముఖమంతా పరుచుకుంది.   పక పకా నవ్వుతూనే  పెట్టె తెరచింది.

 

చేతిలోకి తీసుకుని మరీ  చూశాడు. టైటాన్ వాచ్. నెబ్యులా. ఒవెల్ షేపులో చాలా  స్లీక్ గా ఉండి తళ  తళ మెరిసిపోతూ చూడటానికి చాల నాజూకుగా, అందంగా ఉంది.

 

“ఓల్డ్ మోడల్. అయినా బానే ఉంది. ఎవరికి ? ” అన్నాడు రాధిక బోసి చేతుల వైపు చూస్తూ…

 

“నాకే! ఎలా ఉంది?”  మెల్లగా అంది అతన్నే పరిశీలనగా చూస్తూ...

 

“బాగానే ఉంది. ఎంత?’’          “ ఒన్ ఫార్టీ  థౌసండ్ “

 

“ఒన్ ఫార్టీ ధౌసండ్...! అంటే… యు మీన్ ఒన్ లేక్ ఫార్టీ...?” ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా.  కొంపదీసి కొనివ్వమని అడగదు కదా అని కూడా అనుకోకపోలేదు మనసులో...

 

“అవును… ఎగ్జాట్లీ ఒన్ లాక్ ఫార్టీ థౌసండ్ “  

“గోల్డ్ ఆర్ ఒన్ గ్రాం గోల్డ్?”

“ప్యూర్ గోల్డ్...!” నిక్కచ్చిగా అంది.

“ఓ...క్కే..ఓ..క్కే…! అయినా ఇప్పుడు వాచెస్ చాల అవుడ్డేటెడ్ కదా రాధికా ?  సెల్ఫోన్స్ వచ్చాకా పోయిన వాటిల్లో ఇదీ ఒకటి..!” నిరుత్సాహ పరచాలని చూశాడు గుండెల్లో గుబుల్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ..

 

“అఫ్ కోర్స్ ..! ఎలా ఉందో చెప్పు ముందు...”

 

“చూడ్డానికి బానే ఉంది. దానికేం.  కానీ నేనైతే ప్రిఫర్ చెయ్యను. ఇది గనక కొనుక్కున్నామంటే చచ్చినట్టు  జీవితాంతం దీన్నే వాడాలి. తప్పక భరించాల్సిన అమ్మా, నాన్నల్లా... బోర్...”

 

మనసంతా ఒకలా అయిపోయింది రాధికకి. ఈ మాటలు రోహిత్ అమ్మా నాన్నా వింటే ఎలా ఫీల్ అవుతారో అనుకుంటే  కడుపులో దేవేసినట్లయి బాక్స్ మూసేసింది.  అది గమనించిన రోహిత్ కి తనెంత తప్పుగా మాట్లాడాడో  తెలిసి వచ్చింది.  కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.

దీర్ఘంగా శ్వాస విడిచి బాక్స్ బాగ్ లో పెట్టి లేచింది. ఎందుకని  అతనడగలేకపోయాడు. ఇద్దరూ క్లియరే.

అప్పుడే ఆర్దర్ తెచ్చిన సర్వర్ తప్ప.  

**

ఈ సేవ   కౌంటర్ లో టోకెన్ నంబర్లు తీసుకొచ్చాడు రాజేష్ ఇద్దరికీ. అప్పటికే  అక్కడ కూర్చున్న రాధిక  సెల్ఫోన్లో ఏదో మెసేజ్ కి రిప్లై ఇస్తూంది.

“చాల మంది ఉన్నారు... ఎక్కువ సమయం పట్టచ్చు...” అన్నాడు టోకెన్లు జేబులో పెట్టుకుంటూ…

“ఫర్వాలేదులే... ఎలాగూ నీతో కొంచెం మాట్లాడాలనుకున్నాను..” అంది ఫోన్ ఆఫ్ చేసి చుట్టూ కలయ చూస్తూ..

అంతా సెల్ఫోన్ లోకంలో తిరుగాడుతున్నారు.

“నాతోనా...?” ఒక్క క్షణం తెల్లబోయినా ఎగిరి గంతేయాలనేంత ఆనందం కలిగింది అతనికి.

 

రాధిక, రాజేష్  ఇద్దరిదీ ఒకే వీధి. దగ్గర దగ్గర  ఇళ్ళు. రాకపోకలెక్కువ. పైగా చిన్నప్పట్నించీ ఇద్దరూ ఒకే స్కూలు. స్కూల్ డే ఫంక్షన్స్ లో కూడా ఒకళ్ళు ఏ డ్రామాలో ఉంటే ఇంకొకళ్లనీ అదే డ్రామాలో ఉండేట్టు చూసుకునేవారు పెద్దాళ్లు. ఎందుకంటే స్కూలు  కొంచెం దూరంగా ఉండటంతో ఒకే కార్లో అంతా కలసి వచ్చెయ్యచ్చని. వాళ్ళిద్దరూ  ఒకళ్ల నోడ్సులు ఒకరు చూసి వ్రాసుకోవటం, అర్ధం కానివి ఏవైనా ఉంటే సహాయం చేసుకోవటం… చివరికి ట్యూషన్లకి కూడా కలిసే వెళ్లేవాళ్లు. ఒకరికి ఆలస్యం ఐతే మరొకరు వాళ్ల కోసం వెయిట్  చేసేవాళ్ళు. స్కూల్లో చదువు పూర్తయ్యే వరకూ కూడా అలాగే సాగింది. ఆ పరిచయం కొద్దీ ఏ పనున్నా ఇద్దర్నీ కలిసే పంపిస్తారు ఎక్కడికైనా. అందులో ఏ భావం ఎవరికీ కనిపించేది కాదు.  ఒక్క యోగాలో చేరటానికి మాత్రం రాధిక ఎంత నచ్చ చెప్పాలని చూసినా రాజేష్ ఆసక్తి చూపలేదు. మిగతావన్నీ ఒకళ్ళు ఏది చేస్తే  రెండో వాళ్ళూ అదే.

అలా కలసి తిరగటం వల్ల ఏర్పడ్ద అభిమానమో, స్నేహమో , ఆకర్షణో , ప్రేమో ఏదైనా  కానీ మొత్తం మీద ప్రపోజల్ మాత్రం రాజేష్ వైపు నుంచే వచ్చింది రాధికకి.  “మనిద్దరం చిన్నప్పట్నించీ కలిసే ఉన్నాం. కలసి తిరిగాం. కలసి ఆడుకున్నాం. ఒకరికొకరం అంతా తెలుసనే అనుకుంటున్నాను. మనిద్దరం పెళ్ళి చేసుకుంటే ఒక్కచోటే ఉండచ్చు. పెళ్ళి చేసుకుని నువ్వు మీ అమ్మానాన్నలకు దూరమవుతావేమోననే భయం కూడా అక్కర్లేదు. ఇప్పటి దాకా జరిగినట్తే జీవితాంతం హాయిగా అన్నీ జరిగిపోతాయి. ఏమంటావు “ అన్నాడు.

ఏమీ మాట్లాడలేదు రాధిక.  రాజేష్ అంటే ఎలాంటి అభిప్రాయం లేదు ఆమె మనసులో. మంచీ, చెడూ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. ఇది కొత్త ఆలోచన. అందుకే  సమయం కావాలంది.

 

అప్పట్నించీ అతన్ని గమనిస్తూనే ఉంది. ఎక్కడో ..ఇదమిద్దంగా ఇదీ అని ఒప్పుకోలేని, చెప్పలేని భావమేదో ఆమెని సందిగ్దావస్ధలోకి నెట్తేసింది.  బహుశా ఆ సమయం ఇప్పుడొచ్చేసిందేమో… అనుకున్నాడు రాజేష్ . అందుకే… మరికొంచెం ఏకాంతం కోసం...

 

“అయితే ఒక పని చేద్దాం. ఎలాగూ మన టోకెన్ నంబర్ ముప్పై, ముప్పయ్ ఒకటి. చాల సమయం పడుతుంది. ఈ లోపు బయటికెళ్ళి ఏదైనా తినో, తాగో వద్దాం పద!” అన్నాడు రాజేష్.

 

సరేనంటూ బయటికొచ్చి… అక్కడికి దగ్గర్లో ఉన్న “పర్పుల్ ప్లమ్స్ “ బేకరి వైపు అడుగులేసింది.

కాసేపటికి రెండు బర్గర్లు తెచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.   తింటూ తింటూ హేండ్ బాగ్ లోంఛి బాక్స్ తీసి బయట పెట్టింది… రాధిక.   “ఏంటది?“ అడిగాడు రాజేష్.

” వాచ్... నెబ్యులా గోల్డ్ వాచ్.” అని బర్గర్ ని ఒక్క కొరుకు కొరికి...

“కొనుక్కోవాలని ఉంది. నీ అభిప్రాయం ఏమిటో... అడుగుదామని…” అంది అతనివైపే పరిశీలనగా చూస్తూ…

దాన్ని చేతుల్లోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి  చూశాడు. “బాగానే ఉంది ఎంత? “ అన్నాడు. చెప్పింది రాధిక.

“అమ్మో! అంతే?“ అని , మళ్ళీ తనే..”అయినా  కొనుక్కోకుండా నీ చేతికెలా వచ్చింది అప్పుడే ఇది?” ఆశ్చర్యంగా అన్నాడు.

“బుధ్ధవరం తనిష్క్ బ్రాంచ్ ఫ్రాంచైజీ నాన్న ఫ్రండ్ దే.  ఒక్క రోజుకని అడిగి తెచ్చారు. ఆ మాత్రం చనువూ, నమ్మకం ఉందిలే ఇదరి మధ్యా..”

“అవునా? గ్రేట్.“ అంటూ అటు తిప్పి, ఇటు తిప్పి ఒకటికి పదిసార్లు దాన్నే చూస్తూ..

“నా దృష్టిలో ఇంత ఖరీదు పెట్టి బంగారు గడియారం కొనుక్కోవటం… అందమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోవటం రెండూ ఒకటే.  రెండింటినీ చాల జాగ్రత్తగా చూసుకోవాలి. అనుక్షణం కాపాడుకుంటూ ఉండాలి. నలుగురి కన్నూ వీటి మీదే ఉంటుంది. లేదంటే చేజారి పోయే ప్రమాదం ఉంది.” అని పక పకా నవ్వి...

“దీని బదులు, మామూలు వాచీలనుకో… ఇంత డబ్బుతో ప్రతి నాలుగేళ్ళకీ ఒక్కో కొత్తది కొనుక్కుని, కొనుక్కున్న ప్రతిసారీ కొత్తదనాన్ని ఎంజాయ్ చెయ్యచ్చు”

“అయితే అమ్మాయిల్తో ఎందుకు పోల్చావ్? వాళ్లూ  అంతేనా నీ దృష్టిలో ? “

తెల్లబోయాడు రాధిక మాటలకి.  తన తప్పేంటో తనకి తెలిసొచ్చే సరికి ఎలా సర్ధి చెప్పుకోవాలో తెలియక కంగారుపడిపోయాడు. “ఏదో కేజువల్ టాక్. అంతే...”

అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

 

               ***                       ***                   ***

 

“ఏంటి? యోగా  అయిపోయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా… వెంటనే వెళ్ళిపోతూ ఉంటావ్ ఎప్పుడూ. ఈ రోజేంటో స్పెషల్ చివరి దాకా ఉన్నావ్?  ఆశ్చర్యమే..! ” అన్నాడు అప్పటిదాకా యోగా చేసీ చేసీ ఉన్నాడేమో... మెడనిండా పట్టిన చెమటని నేప్కిన్ తో అణచిపెట్టి మరీ తుడుచుకుంటూ రమేష్.     నవ్వింది రాధిక. సీసా పైకెత్తి కాసిన్ని నీళ్ళు తాగి మూతపెట్టి పక్కనెడుతూ…

 

“అందరూ వెళ్ళిపోయేదాకా ఉండి నీకొకటి చూపిద్దామని. టైముందా?తర్వాత క్లాస్ ఎక్కడ? ”

 ఆఖరి గుటక కూడా వేసేసి రమేష్ వైపే చూస్తూ అంది.  

“ఎందుకు లేదు? నీకంటేనా? ఏదీ  చూపించు చూపించు “ అన్నాడు కంగారు కంగారుగా కింద పరచిన జంబుఖానా పైకి తీసి మడత పెడుతూ.  

రమేష్  రోజూ ఉదయాన్నే ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తాడు.  అలా యోగా గురువయ్యాడతను.  యోగా, మెడిటేషన్ నేర్పిస్తూ  యోగాతో వచ్చే ప్రయోజనాలేంటొ ఉచితంగా స్కూళ్లల్లో , కాలేజీల్లో అవగాహనా  తరగతులు ఏర్పాటు చేసి ఆసక్తికరంగా వివరిస్తూ ఉంటాడు. యువతకి చిన్నప్పట్నించే ఇవన్నీ నేర్పితే మరిన్ని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వాళ్ల వల్ల సాధ్యమౌతాయని రమేష్ అభిప్రాయం.  అలా ఒకసారి రాధిక కాలేజిలో అతని స్పీచ్ వినటం, యోగా సాధన వల్ల,  మెడిటేషన్ చెయ్యటం వల్ల తన జ్ణాపకశక్తీ, ఏకాగ్రతా బాగా పెరిగిందనీ అది తన మానసిక పరివర్తనకి  ఎంతో  తోడ్పడిందని... కధలు కధలుగా ఆసక్తికరంగా చెప్పటంతో, యోగా క్లాసుల్లో చేరింది రాధిక.      విధ్యార్ధి దశలోనే ఇవన్నీ చేస్తూ ఉండటంతో రాధిక చదువులో, పోటీ పరీక్షల్లో అందరికంటే మును ముందుకు దూసుకుపోయింది. అలా ప్రతి పనిలో రమేష్  సలహా తీసుకోవటం, క్రమేణా అతని సలహాతోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా చేరటం, సుదర్శన క్రియ చేయగలగటం… మానసికంగా మరో మెట్టు అధిగమించేటట్టు చేసింది రాధికని.     పని పట్ల ఆ అమ్మాయి కి ఉన్న అంకితభావం అతనికెంతో ఇష్టం. ఇద్దరం కలిస్తే సమాజానికి మరింతగా దిశా నిర్ధేశం చెయ్యచ్చనుకుని ఒక మంచి రోజు చూసి ప్రశాంత వాతావరణంలో తన మనసులోని మాట బయట పెట్టాడతను.         రాధిక అప్పుడేమీ మాట్లాడలేదు.   అతనింకా ఆమె నిర్ణయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏం చెబుతుందోనని.  ఏదో చూపిస్తాననే సరికి అతనిలో ఆసక్తి మరింతగా పెరిగింది.                         

 

నెమ్మదిగా టవల్లో చుట్టిన  బాక్స్ బయటికి తీసింది.

చూస్తూనే  “వెరీ నైస్...” అన్నాడు ఒకింత ఆనందంగా. దాని వైపే పరిశీలనగా చూస్తూ.

కాసేపు దాని అందచందాల గురించి, వాటర్ ప్రూఫనీ, లైఫ్ టైం ఉచిత వారెంటీ అనీ, బ్యాటరీ అయిపోయినా , రిపేర్ వచ్చినా అన్నీ జీవితకాలం ఉచిత సర్వీస్ అనీ అవీ, ఇవీ  మాట్లాడుకున్నాకా… “మొగలి రేకుల్లా నాజూగ్గా ఉన్న నీ చేతికి నైస్ గా ఉన్న ఈ వాచీ చాలా బాగుంటుంది. ఏదీ ఒక్కసారి పెట్టుకుని చూపించు” అన్నాడు. అయితే రేటెంతని అడుగుతాడేమోనని ఆసక్తిగా చూసిన రాధిక ఇక ఉండబట్టలేక  తనే అడిగింది ..

 

“అది సరేగానీ రేటెంతని అడగవా? “

“అడగను”    

“ఎందుకు? “

 

“మనసుకి నచ్చిన వస్తువు అవసరం అనుకుంటే ఎంత ఖరీదైనా కొనుక్కోవటానికి ఇష్టపడతాం. ఆ దిశగా ప్రయత్నిస్తాం. అప్పటికప్పుడు కొనుక్కునే శక్తి లేనప్పుడు  నచ్చింది కాబట్టి కొనుక్కోవాలనే ఉద్దేశ్యంతో  మరింత కష్టించి పని చేస్తాం . అది ఆశ. ఆసక్తి. ఆ సంకల్పమే  మనిషిని జీవింప చేస్తుంది. అలా కష్టపడి సాధించుకున్నవి  రెట్టింపు ఆనందాన్ని ఇస్తాయి.  అల్టిమేట్ గా మనిషి తాపత్రయం ఆనందం కోసమే కదా! అందంగా ఉంది. నీకు నచ్చింది. అది కొనుక్కుంటే నువ్వు మరింత ఆనందంగా ఉంటావు. ఇది ఒక కోణం...“ అన్నాడు..

 

తెల్లబోయి చూసింది అతని వైపు అతని విశ్లేషణకి ఆశ్చర్యపోతూ..

“ఇక రెండవ కోణం ఏమంటే… ఏదైనా వస్తువు కొనే ముందు  అది మనకు ఎంత వరకూ అవసరం అనేది ఆలోచించుకోవాలి. మంచి చెడులు బేరీజు వెయ్యాలి…” అని కాసేపాగి  కొన్ని మంచి నీళ్ళు తాగి మళ్ళీ అన్నాడు తనే…

 

“నన్ను అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు ఈ గడియారమే కనుక నీకు నచ్చిందనుకో..! దీన్ని కొనుక్కోవటం వల్ల నీకు కలిగే ఆనందం ఎంత? ఇబ్బంది ఎంత అన్నది ఆలోచించుకోవాలి. ముందు ఉపయోగాలే తీసుకో. అది ఒక ఫీల్ అంతే. ఒక స్టేటస్ సింబల్. పైగా  ఇంచుమించుగా అన్ని బంగారు నగలూ ఉన్నాయనుకున్న వాళ్లు కొనుక్కోవటానికి ఇంకేమీ లేక సాధారణంగా  ఇలాంటివి  ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదొక మానసిక ఆనందం అంతే. ఆ ఆనందం మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి సెల్ ఫోన్స్ వచ్చాకా చాల వరకూ టైము దానిలోనే చూసేస్తున్నారంతా.

 

ఇక ఇబ్బందులంటావా... చిత్తం చెప్పుల మీద అన్నట్టు… దీనిని కొన్ననాటినుంచీ అనుక్షణం దీనినే కనిపెట్టుకుని ఉండాలి. పైగా ఎక్కడికన్నా  అంటే ఏ  ఊరన్నా వెళ్ళినప్పుడు మన ఏకాగ్రతంతా దీనిపైనే ఉంటుంది ఎక్కడ పెడితే ఎవరు తీసేస్తారోనని. అదే ఏ బంగారు గాజులో అనుకో  పడుకునేటప్పుడు  చేతినే ఉంచేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వాచ్ అలా కాదు… పెట్టుకుని పడుకుంటే  నిద్దర్లో అటూ ఇటూ ఒత్తిగిల్లేటప్పుడు అద్దం మీద మనకి తెలియకుండానే గీతలు పడవచ్చు. గీతలు పడ్ద అద్దం వాచీ విలువను తగ్గిస్తుంది కాబట్టి  అద్దం మార్చాల్సి ఉంటుంది.  అఫ్ కోర్సు ఇలాంటి వాటికి  లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది. కాబట్టి  కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటాం. సో మెయింటెనెన్స్ సరిగా లేక  ఏవేవో రిపేర్లు వస్తూనే ఉంటాయి. అలా రిపేర్ కోసం షోరూములో ఇచ్చినప్పుడల్లా వాడు ఏమైనా చేస్తాడేమోనని  భయం భయంగానే ఉండాలి. అంతే కాదు. ఇంత ఖరీదు పెట్టి ఒకేసారి ఇలా వాచీ కొనుక్కోవటం వల్ల ముందు ముందు రోజుల్లో రాబోయే రకరకాల మోడల్స్ ని నువ్వు వాడలేవు. ఎందుకంటే ఒకేసారి ఇంత ఖరీదైన వాటికి అలవాటు పడ్దప్పుడు మిగతావన్నీ నీకు చిన్నవిగా అనిపిస్తాయి కాబట్టి…”

 

“అయినా గానీ మన మనసుకి నచ్చితే కొనుక్కోవటమే… కాస్తంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.”

మాట్లాడుకుంటూ ఇద్దరూ బయటికి వచ్చారేమో అప్పుడే సూర్యుని నుండి వెలువడ్ద తొలి కిరణం రాధిక మీద పడి మరింత మెరుస్తూ ఆమె నవ్వులో ఒదిగిపోయింది.

 

“సరే. నే వెళుతున్నా. నాకు టైమైపోతుంది.” అంటూ గబ గబా వెళ్ళి చెప్పులేసుకుంటున్న రమేష్ వైపు అబ్బురంగా, అపురూపంగా చూసింది రాధిక నవ్వుతూనే.    

 

           ** *                ***              ***

 

“అది… నాన్నా “

“సరేనమ్మా...! చేసుకోబోయేది నువ్వు. నీకు తెలియదా ఎవర్ని చేసుకుంటే నీ జీవితం బాగుంటుందో..!”  అన్నాడతను నవ్వుతూ భార్యకేసి చూస్తూ. అంతేకదా అన్నట్టు తలూపిందామె.

సంభ్రమంగా చూసింది తల్లిదండ్రుల వైపు.

      ***             ***          ***

 

“ముహూర్తానికి ఇంకా అరగంటే సమయం ఉంది. నువ్వెళ్ళి పెద్దలందరికీ అక్షింతలు ఇచ్చిరావయ్యా...శాస్త్రీ… సూత్రాలు జాగ్రత్తగా ముడేసుకో చేతికి. అక్షింతలు తగలాల సూత్రాలకి. తెలుసుగా ”

తన సహాయకుడు కామయ్య శాస్త్రినుద్దేశించి  సుబ్రహ్మణ్యశాస్త్రి అన్నాడు... అక్షింతల పళ్ళెంతో పాటు పసుపుతాడుకి ముడేసి ఉన్న సూత్రాలకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి అతనికి  అందిస్తూ..

 

అప్పటికే వధూవరులిద్దరి చేతా  జీలకర్రా, బెల్లం ఒకళ్ల తలమీద ఇంకొకళ్ళతో పెట్టించాడేమో… ముఖ్యులనుకున్నవాళ్లంతా  వేదికనెక్కి వరుసగా వచ్చి వధూవరులిద్దర్నీ ఆశీర్వదించి అక్షింతలు వేసి వెళుతున్నారు.  అసంఖ్యాకంగా వచ్చిన బంధుమిత్రుల ఆశీస్సులు ఎంతకీ తరగకపోయే సరికి శాస్త్రిగారు కంగారు పెట్టారేమో.

 

“ఇదిగో ఇప్పుడే వెళుతున్నా..” అన్నాడు కంగారుగా కామయ్య శాస్త్రి  పెద్దాయన చేతిలోంచి సూత్రాలందుకుంటూ..

   “ఇంకా అరగంట సమయం ఎక్కడుంది పంతులుగారు? సరిగ్గా పద్దెనిమిది నిమిషాల  ఆరు సెకన్లుంది...”

రాధిక తలమీద జీలకర్రా, బెల్లం పెట్టిన తన చేతినలానే ఉంచి అన్నాడు రమేష్.

   తెల్లబోవటం సుబ్రహ్మణ్యశాస్త్రి వంతైంది.

   “అంత కంగారుగా ఉందేవిటయ్యా. పెళ్ళి కూతురు మెళ్ళో ఎప్పుడెప్పుడు మూడు ముళ్ళేసేద్దామా అని.“ అనేసరికి అంత హడావిడిలోనూ అక్కడున్నాళ్లంతా ఫక్కున నవ్వారు.

     సిగ్గు సిగ్గుగా కళ్ళు  పైకెత్తి అరచూపుల్తో అతన్ని చూసి నవ్వింది  రాధిక.

ఇంతలో పురోహితుడన్నాడు…

   “అంత సెకన్లతో సహా చెబుతున్నావ్… నీకెలా తెలిసిందయ్యా?! అమ్మో... ఈ రోజుల్లో కుర్రాళ్లు మామూలోళ్ళు కాదండోయ్...” అన్నాడు చుట్టూ ఉన్న వాళ్లకేసి చూసి నవ్వుతూ..

 

“ఇదిగో... ఇక్కడ చూడండి...” అన్నాడు రమేష్ ఎడం కాలు కొద్దిగా పైకీ, కిందకీ ఆడిస్తూ...

తలొంచుకునే కళ్ళు తిప్పి అటు చూసిన  రాధికకి ఒకటే ఆశ్చర్యం.  అతని ఎడం కాలి పక్కగా నెబ్యులా గోల్డ్ వాచ్. తల తళా మెరుస్తూంది బాక్స్ లో . తెల్లబోయింది దాన్ని చూసి.   అప్పటికే దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు శాస్త్రిగారు..

 

“గమనించనే లేదు. నా మొహం మండా! బాగుందయ్యా...! ఇదేంటిది ? బంగారు వాచ్చీలాగుంది?  పెళ్లానికి కానుకిస్తున్నావా  ఏంటి?“  అటూ ఇటూ తిప్పి దాన్నే పరిశీలనగా చూస్తూ అన్నాడు శాస్త్రిగారు. అప్పటికే అక్కడున్న ఆడా, మగా పెళ్ళాళ్లంతా  నవ్వుకోసాగారు... ఒకళ్ల  చెవిలో ఒకళ్ళు గుసగుసలాడుకుంటూ.       అప్పటికే అతను  రాధిక మోములో సిగ్గుల్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటున్నాడేమో,  అవునన్నాడు పరధ్యానంగా..

“బాగుందయ్యా...! చాలా బాగుంది. ఇన్ని పెళ్ళిళ్ళు చేసానుగానీ పెళ్ళి పీటల మీదే తనతో పాటు పెళ్లానికి

బంగారు వాచ్చీ కానుగ్గా ఇచ్చే పెళ్ళికొడుకుని నిన్నే చూశాను. అయినా బంగారంలాంటి కుర్రాడివి నువ్వుండగా ఇంకా ఈ వాచీ, గీచీలెందుకయ్యా? ఏవంటావమ్మా?” అన్నాడు నవ్వుతూ రాధికను చూస్తూ..

 

“అయ్యబాబోయ్! అలా అనకండి. అదే ఈ బంగారాన్ని నాకిచ్చింది...” అంటూ జీలకర్ర చేతిని రాధిక తల మీద మరింతగా అదిమిపెట్టాడు.

అర్ధం కాని పంతులుగారు క్షణకాలం తెల్లబోయినా వధూవరుల మనసుల్లా హడావిడిగా పరుగెడుతున్న నిమిషాల ముల్లును చూసి…

“ఏవయ్యా శాస్త్రీ...! త్వరగా రా... సమయం కావస్తూంది.” అరిచాడు కంగారుగా వాచీనే చూస్తూ..

కాలం పరిగెడుతూంది. అంతకంతకీ ఎరుపెక్కుతున్న రాధిక బుగ్గల్లా.

OOO

కన్నెగంటి అనసూయ

“ఇవ్వటంలో ఉన్న హాయి మరి దేనిలోనూ లేదని ...” చెప్తూ సమాజాన్ని ఆ దిశగా నడిపించే సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సాహితీ సృజన చేస్తూ సమాజంలో అంతరించిపోతున్న మానవ సంబంధాలకు తనదైన రీతిలో జీవం పోస్తున్న రచయిత్రి శ్రీమతి కన్నెగంటి అనసూయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లా పశివేదలలో 1.12.1962 వ తేదీన జన్మించారు.

వీరు ఎం.ఏ (పొలిటికల్ సైన్స్ ), బి.ఎల్.ఐ.ఎస్.సి ( లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ ) ఎం.కాం., బి.సి.ఎ డిప్లొమాను కూడా పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో  ఎం.సి.జె. చదువుతున్నారు.

రచనలంటే ఆసక్తిగల శ్రీమతి కన్నెగంటి అనసూయగారు ఇప్పటి వరకూ 300 వరకూ   200 బాలల కధలూ,  150 కవితలూ, 2 నవలలూ వ్రాసి అనేక కధల పోటీల్లో బహుమతులు, అనేక సంస్దల నుండి గౌరవ పురస్కారములను అందుకున్నారు. వీరు వ్రాసిన “బుద్ధి బలం” అనే బాలల కధ  కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంకలనంలో చోటు చేసుకుని దేశవ్యాప్తంగా 23  భాషల్లోకి అనువదింపబడింది.

ఇంతవరకూ మూడుసార్లు టీవీల్లో , రేడియోలో ఇంటర్యూలు ఇచ్చారు,  అనేకసార్లు ఆకాశవాణిలో కధలు చదివారు.     హైదరాబాద్ ఉస్మానియా జూనియర్ ఛాంబర్ జెసిరేట్ చైర్ పర్సన్ గా అనేక మంది పేద మహిళలలకు వివాహాలు చేసారు. తదుపరి 2009 లో “మానస స్వచ్చంద సేవా సంస్ధ”ను స్థాపించి ఆనాటి నుండీ రక్తదాన శిబిరాలు, అనేక ఆరోగ్య శిబిరాలూ నిర్వహిస్తూ వస్తున్నారు.

సాహితీ సృజన, సామాజిక సేవ తనకు రెండు కళ్ళుగా వీరు భావిస్తారు.​

***

Kanneganti Anasuya
bottom of page