top of page

కథా మధురాలు

నిర్ణయం

Tirumalasree

తిరుమలశ్రీ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ

“నా ఇల్లు ధర్మసత్రం కాదు, దారిన పోయే దానయ్యలందర్నీ తీసుకొచ్చి మేపడానికి. ఆ ముసలాణ్ణి వెంటనే ఇంటినుండి పంపివేయకపోతే నువ్వే వెళ్ళిపోవలసి వస్తుంది.”

          అనిల్ చిందులు త్రొక్కుతుంటే నిర్ఘాంతపోయాను నేను. అతను ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడో అర్థంకాలేదు నాకు. ‘నా ఇల్లు!’ – నిజమేనా? ఆ ఇల్లు మా ఇద్దరిదీ కాదా? దాని మీద నాకేమీ హక్కు లేదా? ఆ సంసారంలో, అతని జీవితంలో నాకూ సమాన పాత్ర ఉందని అతను ఎప్పుడు గుర్తిస్తాడు!?  “పాపం, అండీ! ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఇంటినుండి తప్పిపోయి వచ్చిన ఓ డబ్బయ్యేళ్ళ వృద్ధుడు అనాథలా వీధుల్లో తిరుగాడుతుంటే…మానవతాదృక్పథంతో ఇంటికి తీసుకువచ్చాను. అది తప్పా? అతని తాలూకు వాళ్ళను కనిపెట్టి అతన్ని వారికి అప్పగించేంత వరకు…రెండు మూడు రోజులు ఆ పెద్దాయనకు మనింట్లో ఆశ్రయమిస్తే…మనకు కలిగే కష్టమూ, నష్టమూ లేవుగా?” సౌమ్యంగా అన్నాను. గెస్ట్ రూమ్ తలుపులు మూసియున్నా, అతని అరుపులు ముసలాయనకు ఎక్కడ వినిపిస్తాయోనని బెడ్ రూమ్ తలుపు మూసేసాను.

          గత రాత్రి అనిల్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు, ఫ్రెండ్ ఎవరో డ్రింక్ పార్టీ ఇచ్చాడంటూ. ఆ సమయంలో ఆ అతిథిని గూర్చి ప్రస్తావించడం సందర్భోచితం కాదని ఊరుకున్నాను. మర్నాడు చెబితే, అదీ అతని స్పందన. అతను చూసిన చూపుకే శక్తి ఉంటే ఆ పాటికి కాలి బూడిద అయిపోయేదాన్ని నేను. తన మాటకు ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు అతనికి. పురుషాహంకారం!

“అయామ్ లీస్ట్ కన్సర్న్ డ్. నేను టూర్ నుండి తిరిగి వచ్చేసరికి ఆ ముసలాడు నాకు కనిపించకూడదు” అన్నాడు కఠినంగా. “ఇంకోసారి ఇలా వీధిలో కనిపించినవాళ్ళందరినీ ఇంటికి తీసుకు వచ్చావంటే…నువ్వు కూడా వీధిన పడవలసివుంటుంది!”  సూట్ కేస్ తీసుకుని బైటకు విసవిసా నడచాడు.

          నిస్సత్తువగా బెడ్ పైన వాలిపోయాను నేను. నా పరిస్థితి ఏమిటో నాకే అగమ్యగోచరంగా అనిపిస్తోంది…..ఐదేళ్ళ క్రితం అనిల్ తో నా వివాహమయింది. పెద్దలు కుదిర్చిన సంబంధం. అప్పటికే ఎమ్బీయే పూర్తిచేసి ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాను నేను. అనిల్ కి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. తండ్రి లాయర్, తల్లి గృహిణి. ఓ అక్క ఉంది. ఆమెకు పెళ్ళయిపోయింది. బాగా కలిగిన కుటుంబం. అందుకే వారు అడిగినంత కట్నమూ ఇచ్చి ఆ కుటుంబంలోకి నన్ను పంపించారు మావాళ్ళు. నాకు ఓ చెల్లెలు ఉంది. నాకంటె మూడేళ్ళు చిన్నది అది.

          నా అత్తవారింట్లో మగవాళ్ళదే పైచేయి. ప్రతి విషయంలోనూ పురుషాధిక్యత స్పష్టమవుతుంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ మాటకు ఎదురుచెప్పడానికి వీల్లేదు. అదే చెట్టు యొక్క కొమ్మ అయిన అనిల్ కి కూడా అదే గుణం అబ్బడంలో వింతలేదు. అత్తింట్లో అడుగుపెట్టిన వారానికే ఆ పరిస్థితి అర్థమయిపోయింది నాకు.

          భార్య ఉద్యోగం చేయడం అవమానంగా భావించే తత్వం అనిల్ ది. ఐతే, పెళ్ళికి ముందే ఉద్యోగం చేయడం పట్ల నాకు గల మక్కువను గూర్చి స్పష్టం చేయడంతో ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. సందు దొరికినపుడల్లా నా ఉద్యోగం మీద సెటైర్లు వేస్తుంటాడు. తన ఉద్యోగమే గొప్ప, నాది ‘నతింగ్’ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. నాకు పిల్లలంటే ఇష్టం. కాని, అప్పుడే పిల్లలు వద్దంటాడు. నచ్చజెప్పబోతే, ‘పిల్లల్ని కనడానికి ఇంకా బోలెడు వయసు ఉందంటూ’ కసరుకుంటాడు. పడకపైన కూడా నా మూడ్స్ తో అతనికి పనిలేదు… ప్రతిదానికీ తన మాటే చెల్లాలనుకుంటాడు, చెల్లించుకుంటాడు.

          “మేడమ్!” అన్న పిలుపుతో ఆలోచనలనుండి బైటపడ్డాను నేను. పనిపిల్ల. ముసలాయన స్నానం అయిపోయిందట. నేను తీసి ఇచ్చిన అనిల్ యొక్క పంచె, చొక్కా తొడుక్కుంటున్నాడని చెప్పింది. బ్రేక్ ఫాస్ట్ కి టేబుల్ పైన ప్లేట్లు సర్దమని పురమాయించి లేచి వెళ్ళాను.

          ఆ ముసలాయనకు అరవై ఐదేళ్ళుంటాయి. సన్నగా, పొడవుగా ఉన్నాడు. మంచి కుటుంబంలోంచి వచ్చినవాడిలాగే ఉన్నాడు. నన్ను ‘ఎవరు, ఏమిటి’ అని అడక్కుండా బుద్ధిగా చెప్పినట్టు చేయసాగాడు. తన వివరాలు అడగబోతే శూన్యంగా చూస్తున్నాడు. ఆయన అవసరాలను చూడడమేకాక, ఆయన్ని జాగ్రత్తగా కనిపెట్టివుండే బాధ్యతను కూడా పనిపిల్లకు అప్పగించాను.

          ఆ పెద్దాయన ఫోటో తీసి లోకల్ పోలీస్ స్టేషన్ లోను, టీవీ ఛానెల్స్ లోనూ ఇచ్చాను. వార్తాపత్రికలలో కూడా ప్రకటన ఇచ్చాను. ఫలితంగా మూడో రోజున ఆయన కొడుకు, కోడలు వచ్చారు. వారిది పొరుగూరట. రైతు కుటుంబం. ఐదారు రోజుల క్రితం సిటీలో ఓ పెళ్ళికి వచ్చారట. కొంత కాలంగా తండ్రి ఆల్జీమర్స్ డిసీజ్ తో బాధపడుతున్నాడట. తప్పనిసరిగా పెళ్ళికి తీసుకురావలసివచ్చిందట. పెళ్ళిసందడిలో కాస్త పరాకుగా ఉండడంతో ఆయన ఎలాగో బైటకు వెళ్ళిపోయాడట. తండ్రి కనిపించకపోవడంతో రెండు రోజులపాటు సిటీ అంతా వెదికారట. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ కూడా ఇచ్చారట.

          ఏ సంబంధమూ లేకపోయినా, తండ్రిని ఆదుకుని సురక్షితంగా తమకు అప్పగించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు దంపతులు…పెద్దాయన క్షేమంగా తన కుటుంబాన్ని చేరుకోగలిగినందుకు మిక్కిలి సంతోషం కలిగింది నాకు.

           రాను రాను అనిల్ ప్రవర్తన రుచించడంలేదు నాకు. అతని ఓవర్-బేరింగ్ యాటిట్యూడ్ ని సహించడం కష్టంగా ఉంటోంది…ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తున్నాము. ఇద్దరమూ ఉదయమే వెళ్ళి, సాయంత్రం తిరిగి వస్తాము. ఐనా అతనికి ఏ లోటూ కలగకుండా అన్నీ ఒంటిరెక్క మీద అమర్చుతుంటాను. అతని నుండి చిన్న సాయం కూడా లభించదు. అప్పటికీ ఏదో ఒక దానికి అతను నాపైన చిర్రుబుర్రులాడుతుండడం చిరాకు కలిగిస్తుంటుంది నాకు. నా ఇబ్బందిని గూర్చి వివరించబోతే, అతను చెప్పేది ఒకటే – ‘ఆ బోడి ఉద్యోగం మానేసి ఇంటిపట్టున ఉండు’.

          ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ని నేను. ఉపాధ్యాయ వృత్తి అంటే తేలిక భావం అతనికి. “ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. ఇట్జ్ ఎ నోబుల్ ప్రొఫెషన్. తల్లిదండ్రులు మనం చదువుకునేందుకు అవకాశం కల్పిస్తే, మనకు విద్యాబుద్ధులు గరపి జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేసేది గురువులే” అన్నాను నేను ఓసారి ఆవేశంగా. నిరసనగా చూసి, “అలాగని నువ్వేదో గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నట్టు ఫీలయిపోకు. నీ జీతం నా జీతంలో సగం కూడా లేదని మరచిపోకు” అన్నాడు. ‘ఎంత పొగరు!’ అనిపించింది నాకు.

          బ్యాంకులో లోన్ తీసుకుని ‘డస్టర్’ కారు కొన్నాం మేము. నిజానికి ఆ లోన్ కి సంబంధించిన ఇ.ఎమ్.ఐ. లు నా జీతంలోంచే కడుతున్నాను. అనిల్ పనిచేసే కంపెనీకి వెళ్ళే దారిలోనే నా కాలేజ్ ఉంది. ఉదయం నన్ను కాలేజ్ దగ్గర దింపి తాను ఆఫీసుకు వెళ్ళవచ్చును. సాయంత్రం వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవచ్చును. కాని, అలా చేయడం అతని ‘మేల్ ఇగో’ ని గాయపరచుతుంది. తాను వాడుతున్న పాత స్కూటర్ని నా ముఖాన పడేసి, కారును తాను వాడుతున్నాడు. పీక్ అవర్స్ లో హెవీ ట్రాఫిక్ లో స్కూటర్ పైన కాలేజ్ కి వెళ్ళిరావడం యాతనగా ఉంటోంది నాకు. అంతకు మునుపు సిటీబస్ లో వెళ్ళేదాన్ని. అదే నయమనిపిస్తుంది.

          మాంగళ్యబంధం ఐతే ఏర్పడింది గాని, మా మనసులు మాత్రం ముడివేసుకోలేకపోయాయనిపిస్తుంది నాకు. ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కలవకపోవడం ఆశ్చర్యకరమేకాక, దురదృష్టకరం కూడాను… నాకు కొంచెం చారిటీ ‘పిచ్చి’ (అనిల్ మాటల్లో!) ఎక్కువ. కలిగినంతలోనే ఏదో ఒక రూపంలో ‘హేవ్-నాట్ స్’ కోసం వెచ్చించడం అలవాటు. అది అనిల్ కి సుతరామూ కిట్టదు. ‘అభాగ్యులను’ ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదంటాడు. ‘సమాజం మనకు ఇచ్చినదాంట్లోంచి కొంత తిరిగి ఇవ్వడంలో తప్పులేదు’ అన్నది నా వాదన…పెద్ద ఖర్చులను నా ‘బోడి’ జీతం నుంచే చేయించడానికి మాత్రం తన మేల్ ఇగో అడ్డుపడదనుకుంటాను…మేరేజ్ అంటే సర్దుబాటుతనం అంటారు. ఎప్పుడూ ఆడదే సర్దుకుపోవాలా!?

          ఓసారి నా కొలీగ్ ఒకామె తన బర్త్ డే పార్టీకి ఆహ్వానించింది నన్ను. సాయంత్రం కాలేజ్ ముగియగానే స్టాఫంతా కలసి ఆమె ఇంటికి వెళ్ళాము. వెళ్ళేముందు అనిల్ కి ఫోన్ చేసి చెప్పాను. ఆ వేళ్టికి అతన్ని డిన్నర్ హోటల్లో తినేయమన్నాను. సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసేసాడు.

          పార్టీ ముగిసి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలు అయిపోయింది. అనిల్ అనిలుడే అయ్యాడు. “పార్టీలో అందరితో కలసి స్టెప్పులు వేస్తుంటే ఇల్లు, మొగుడు జ్ఞాపకం రాలేదనుకుంటాను!” అన్నాడు వ్యంగ్యంగా.

          తెల్లబోతూ, “పార్టీ అన్నాక కాస్త వెనుక ముందులు అవుతుంది కదండీ.?” అన్నాను.

          కోపం ఖర్చు లేకుండా వచ్చేస్తుంది అతనికి. “పార్టీలు, ఫ్రెండ్సూ అంటూ ఆడది అర్థరాత్రి వరకు తిరుగుతుంటే, ఇంట్లో మొగుడికి ఎవరు వంట చేసిపెడతారన్న ఇంగితజ్ఞానం ఉండక్కర్లేదూ?” అంటూ అరిచాడు.

          “అదేమిటి? ఈ పూటకు మిమ్మల్ని హోటల్లో తినేయమన్నాను కదా! ఉండండి, క్షణాలలో వండేస్తాను” అన్నాను. “అవసరంలేదు” అన్నాడు పెడసరంగా.

పడుకున్నానన్న మాటే కాని, నిద్ర పట్టడంలేదు. అనిల్ ప్రవర్తనే నన్ను బాధిస్తోంది. ఎన్నోసార్లు చెప్పకుండానే తాను పార్టీలకు వెళ్ళి అర్థరాత్రి దాటాక ఇంటికి రావడం కద్దు. ఒకోసారి త్రాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ డ్రింక్స్ పార్టీ ఇచ్చారనేవాడు. ముందుగా తెలియక, వంట చేసి అతని రాక కోసం ఎదురుచూస్తూ, తినకుండా కూర్చునేదాన్ని. ఫోన్ చేస్తే కాల్స్ కట్ చేస్తాడు. వచ్చాక అడిగితే, ‘ఏం, నేను ఎక్కడికి వెళ్ళేదీ నీకు చెప్పాలా? నీ పర్మిషన్ తీసుకోవాలా?’ అంటూ ఎగిరిపడతాడు. తినబుద్ధికాక ఆ రాత్రికి అభోజనంగానే పడుకుంటాను.

          నా చెల్లెలు సరితకు పెళ్ళి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంటుకు నేను ఒక్కదాన్నే వెళ్ళడమయింది, అనిల్ తనకు ఖాళీ లేదనడంతో. సరిత నాకంటె అందంగా ఉంటుంది. ఓ ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. జీతం బాగానే వస్తోంది. హై స్పిరిట్ స్ లో ఉందది. అత్తవారు కోటీశ్వరులట. కోడలు ఉద్యోగం చేయవలసిన అవసరంలేదని మానెయ్యమన్నారట. అది ఆనందంగా ఒప్పుకుందట.

          “విద్య్త నేర్చినది కేవలం విజ్ఞానం కోసమే కాదే, పిచ్చిమొద్దూ! దాన్ని సమాజాభివృద్ధికి వినియోగించడానికి కూడా! అప్పుడే చదివిన చదువుకు సార్థకత చేకూరుతుంది” అన్నాను. నవ్వేసింది.

          అనిల్ ది ద్వంద వైఖరి. డ్యుయెల్ పర్శనాలిటీ. అందుమూలంగా నేను అనుభవించే బాధ నా మస్తిష్కాన్నినిరతమూ దొలుస్తూనే ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని సమస్య నాది. అమ్మతో పంచుకుని కొంతవరకైనా నా మనోభారాన్ని తీర్చుకోవాలనిపించింది. ఐతే అమ్మ స్పందన నేను ఊహించినదానికి భిన్నంగా లేకపోవడంతో పెద్దగా అబ్బురపడలేదు నేను. “అతను మగాడే! ఆడవాళ్ళం మనమే సర్దుకుపోవాలి. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూసుకుని బాధపడకూడదు” అంది. ‘పతియే ప్రత్యక్ష దైవం’ కాలం నాటిది మరి!

          ఓ రోజున అనిల్ హఠాత్తుగా ఓ సాల్వో ప్రేల్చాడు – తనకు జర్మనీలోని ఓ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందట. జీతం ఇక్కడికంటె రెండింతలు ఎక్కువట. వెంటనే ఓకే చేసేసాడట!

విదేశాలకు వెళ్ళాలని అతను ప్రయత్నిస్తున్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదు అతను.

డబ్బుకోసం అయినవారందరినీ వదలి విదేశాలకు వెళ్ళడం నాకు ఇష్టంలేదు. నా ఉద్యోగం నాకు సంతృప్తిని, సంతోషాన్నీ ఇస్తోంది. ఇక్కడ నాకొక అయిడెంటిటీ ఉంది. నేను నమ్మిన, నన్ను నమ్మిన సమాజం ఉంది. పరాయిదేశంలో ఆగంతకురాలిలా జీవితం గడపడం నాకు ఇష్టంలేదు.

అదే మాట అంటే, తోక తొక్కిన త్రాచులా లేచాడతను. “నాకు నా కేరీరే ముఖ్యం. బంధువులు ఎక్కడికీ పోరు. పలుకరించుకోవడానికి సెల్ ఫోన్లు, స్కైప్ లూ ఉన్నాయి. నీ అణా కానీ ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది. డోంట్ బీ సిల్లీ!” అన్నాడు తీక్షణంగా. “ఆల్రెడీ ఆఫీసులో వన్ మంత్ నోటీస్ ఇచ్చేసాను.వచ్చే నెలలోనే మన ప్రయాణం”.

మా పెళ్ళినాటికి నా జీతం ముప్పైవేలు. అతనిది ఇరవై వేలు. ఐనా నా జీతం ఎక్కువనీ, అతనిది తక్కువనీ ఆలోచించలేదు నేను. అతనికి ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో ఎనభైవేల జీతంతో ఆఫర్ రావడంతో, అతనితో వచ్చేసాను. నేను పనిచేసే ప్రైవేట్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఈ ఊళ్ళో లేనందున రాజీనామా చేయవలసివచ్చింది. ఏడాది తరువాత ఓ ప్రభుత్వ కాలేజ్ లో లెక్చరర్ ఉద్యోగం దొరికింది. జీతం మునుపటికంటె పదివేలు తక్కువే. అయినా బాధనిపించలేదు నాకు. అతను గతాన్ని విస్మరించి నా ఉద్యోగాన్ని, జీతాన్నీ కించపరస్తూ మాట్లాడినప్పుడు మాత్రం కించిత్తు బాధ కలుగుతుంటుంది.

కాని…ఇప్పుడు…తనకు తన కెరీరే ముఖ్యం అని మాట్లాడుతున్నాడు. జర్మన్ ‘మార్క్స్’ ముందు బంధువులు, మాతృదేశము, కడకు కట్టుకున్న భార్య సైతం ఎక్కువ కాదన్నట్టు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది నాకు. ఇప్పటికే సెల్ ఫోన్లు. టీవీలూ మనుషుల మధ్య దూరాలను పెంచేసాయి. ఇక దేశం విడచి వెళ్తే, ఆ మెకానికల్ లైఫ్ లో భార్యాభర్తలు సైతం నెలకోసారి కలుసుకునే పరిస్థితి ఏర్పడినా అబ్బురపడనవసరంలేదు.

మెరిట్ తో స్వదేశంలోనే ఎదుగుదామనీ, అయినవారినందరినీ వదిలి ఎండమావులకోసం పరుగులు పెట్టవద్దనీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాను నేను. “ఐ లవ్ మై పీపుల్. ఐ లవ్ మై జాబ్. ఐ లవ్ మై కంట్రీ. అన్నిటినీ వదలి రావడానికి నాకు మనస్కరించడంలేదు” అన్నాను.

నేను ప్రాధేయపడేకొద్దీ అతని యారొగెన్స్ పెరిగిపోయింది. “మొగుడు కావాలంటే నాతో రా. ఇక్కడి మనుషులు, నీ పంతులమ్మ ఉద్యోగమే ముఖ్యమనుకుంటే…వెల్, ద డెసిషన్ ఈజ్ యువర్స్!” అంటూ మిస్చివస్ గా నవ్వుతూ భుజాలు ఎగరేసాడు. ఆ రాత్రంతా నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండిపోయాను నేను.

#

కాలగమనంలో పదిహేనేళ్ళు దొర్లిపోయాయి…

నేనిప్పుడు ఓ కాలేజ్  కి ప్రిన్సిపాల్ ని. బాధ్యతతో పాటు జీతం కూడా ఎక్కువే. ఇంట్లో కంప్యూటర్ సిస్టం ముందు కూర్చుని పనిచేసుకుంటుంటే, “హాయ్, మమ్మీ!” అంటూ పరుగెత్తుకువచ్చింది వెన్నెల. నా కూతురు. నా ఎడారి జీవితంలో కాచిన ‘వెన్నెల’.

ప్రేమతో ముద్దుపెట్టుకున్నాను. “హోమ్ వర్క్ ఉంది, మమ్మీ!” అంటూ తన గదికి పరుగెత్తింది.

వెన్నెలకు పదమూడేళ్ళుంటాయి. ఎయిత్ క్లాస్ చదువుతోంది. పసితనంలోనే పోలియో వచ్చిన కారణంగా ఎడమ కాలు చిన్నగా ఈడ్చుతుంది.

నా దృష్టి అప్రయత్నంగా గోడకు ఉన్న అనిల్ ఫోటో మీద పడింది. అతని వదనంలో యారొగెన్స్ కొట్టవచ్చినట్టు కానవస్తోంది. చిన్నగా నిట్టూర్చాను. ఆ యారొగెన్సే మా ఎడబాటుకు కారణమయింది…

ఆ రోజు – నా జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు. ‘నీకు నేను కావాలో…లేక నీవాళ్ళు, నీ ఉద్యోగమూ కావాలో నిర్ణయించుకొమ్మని’ సవాలు విసిరాడు అనిల్.  ఏ స్త్రీ కూడా చేజేతులా తన సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ఇచ్చగించదు. కాని…మా వివాహం అయినప్పట్నుంచీ నాపట్ల అతని ప్రవర్తనను నెమరువేసుకున్నాను నేను. తాను మగాడు కనుక తనదే పైచేయి కావాలన్నట్టు అడుగడుగునా అతను ప్రదర్శించే పురుషాహంకారమే జ్ఞప్తికివస్తోంది. ఆడది కూడా ఓ మనిషేననీ ఆమెకూ వ్యక్తిత్వము, ఆత్మగౌరవమూ ఉంటాయనీ గుర్తించని అతని చదువులు వ్యర్థమని ఎప్పటికైనా గుర్తించకపోతాడా, మనిషి మారకపోతాడా అని – సుమారు ఐదేళ్ళుగా ఎదురుచూసాను నేను. చదువుకు, సంస్కారానికి సంబంధంలేదని నిరూపించాడు.

కఠినతరమైనా, దురదృష్టకరమైనా ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. స్త్రీకి సంసారం ఓ ఆలంబన, అవసరమే. కాని, అదే ముఖ్యం కాదు. వ్యక్తిత్వం. ఆత్మాభిమానము కోల్పోయి జీవచ్ఛవంలా బ్రతకడం కంటే, ఒంటరి జీవితమే ఉత్తమం అనిపించింది నాకు…అలాంటి నిర్ణయం తీసుకుంటానని ఎదురుచూడలేదేమో, మొదట నిశ్చేష్టుడయ్యాడు అనిల్. తరువాత వంకరగా నవ్వాడు.

విషయం తెలిసి అమ్మ, నాన్న పరుగెత్తుకొచ్చారు. ‘భర్తే ముఖ్యం’ అంటూ నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి విఫల ప్రయత్నం చేసారు.

నెల్లాళ్ళ తరువాత నాకు ‘గుడ్ బై’ చెప్పి ఒంటరిగానే జర్మనీకి వెళ్ళిపోయాడు అనిల్. ఆ తరువాత ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదు. అతని సంగతులేవీ తెలియలేదు నాకు. 

ఏ మార్పు ఐనా అడ్జెస్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. అన్నిటికీ సమాధానం కాలమే చెబుతుంది. కేవలం మనుగడే ముఖ్యం కాదనీ, జీవితానికి ఓ పరమార్థం ఉండాలనీ ఆలోచించాను నేను. ఆ ఆలోచనల నుండి ఉద్భవించినదే – ‘వీ కేర్’ ఆశ్రమం. ఆల్జీమర్స్ మూలంగా ఇంటినుండి తప్పిపోయి వచ్చిన వృద్ధులను ఆదుకోవడం...వారిని వారి కుటుంబాలకు అప్పగించడం…కుటుంబాలను కనిపెట్టలేని సందర్భాలలో ‘ఆశ్రమం’ లోనే వారికి వసతి సదుపాయాలు కల్పించి ఆదరించడము… మా సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. పలువురు ఔత్సాహికులు ‘వీ కేర్’ లో వాలంటీర్స్ కావడం ముదావహం. రెగ్యులర్ స్టాఫ్ కి మాత్రం నెల జీతాలు చెల్లిస్తుంటాను. ఆశ్రమ నిర్వహణకోసం నా జీతంలో సగభాగం కేటాయించాను. దానికి తోడు, సంస్థ యొక్క సేవలను గుర్తించి కొందరు ఉదారులు విరాళాలు కూడా ఇవ్వసాగారు. ఆ పుష్కర కాలంలో ఎందరో వృద్ధులను వారి వారి కుటుంబాలతో కలిపి మంచి పేరు తెచ్చుకుంది ‘వీ కేర్’.

          అనిల్ వెళ్ళిపోయిన రెండేళ్ళకు ఓ పాపను తెచ్చుకుని పెంచుకోవాలని ఓ అనాథాశ్రమానికి వెళ్ళాను నేను. కను ముక్కు తీరు బావుండి ఆరోగ్యంగా ఉన్న ఆడ, మగ పిల్లల్ని చూపించారు నాకు. ఐతే, పోలియో సోకిన కాలితో నా వంక వింతగా చూస్తున్న ఆరేళ్ళ పసిపాప నన్ను ఆకర్షించింది. చామనచాయ ఐనా, చక్రాల్లాంటి కనులతో క్యూట్ గా ఉంది. నేను ఆ పాపను కావాలనడంతో ఆశ్చర్యపోయారంతా. ఎవరైనా బాగున్న పిల్లలను కోరుకుంటారు. కాని, అవిటిదాన్ని ఎవరు తీసుకుంటారు!? అందుకే…!

          పాపకు ‘వెన్నెల’ అని నామకరణం చేసి, చట్టబద్ఢంగా దత్తత చేసుకున్నాను. నా ఎడారి జీవితంలో తాను వెన్నెల కావాలన్నదే నా ఆకాంక్ష. ‘అమ్మా!’ అంటూ పాప నా చెంగు పట్టుకుని తిరుగుతూంటే ఓ వినూత్న అనుభూతి, అవ్యక్తమైన ఆనందమూ కలిగేవి నాలో. నా జీవితానికి కొత్త వెలుగులను తెచ్చింది వెన్నెల…

          సెల్ ఫోన్ మ్రోగడంతో ఉలికిపడి ఆలోచనలలోంచి బైటపడ్డాను నేను. అటువైపు ‘వీ కేర్’ కేర్ టేకర్…ఓ పెద్దాయన నెక్లెస్ రోడ్ లో ఎయిమ్లెస్ గా తిరుగుతుంటే గుర్తించి ఆశ్రమానికి తీసుకువచ్చారట వాలెంటీర్ ఒకరు. వెన్నెలను చూసుకోమని ఆయాకి చెప్పి, ఆశ్రమానికి బైలుదేరాను నేను.

          అక్కడ కొత్తగా వచ్చిన వృద్ధుణ్ణి చూసి ఉలికిపడ్డాను. ఆయన ఎవరో కాదు – అనిల్ తండ్రి. నా మామగారు!

          నన్ను గుర్తుపట్టలేదు ఆయన. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నారు. దుస్తులు మాసివున్నాయి…ఆయన్ని ఇంటికి తీసుకు వచ్చాను. స్నానం చేయించి, ఇస్త్రీ దుస్తులు ధరింపజేసాను. నేను అన్నం తినిపిస్తుంటే, చంటిపిల్లాడిలా అనిపించారు. ఆయన పడుకున్నాక, అత్తవారి ఇంటి నంబరు పాత డైరీలో వెదికి పట్టుకుని ఫోన్ చేసాను. అన్నేళ్ళ తరువాత చేస్తున్నానేమో కించిత్తు ఉద్విగ్నతకు గురయ్యాను. అత్తగారి గొంతులోని గద్గదత్వం నాకు తెలుస్తూనేవుంది. మామగారు నా దగ్గర ఉన్నట్టు చెప్పగానే ఫోన్లోనే ఏడ్చేసిందావిడ. రెండేళ్ళ క్రితం ఆ వ్యాధి సంక్రమించిందట ఆయనకు. ప్రాక్టీసు మానేసారట. అప్పుడప్పుడు అలా తప్పిపోతుంటారట…నాలుగు రోజుల క్రితం స్పెషలిస్ట్ కన్సల్టేషన్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చారట. ఎలాగో మిస్సయిపోయారట…

          మర్నాడు కాలేజ్ కి సెలవు పెట్టేసాను నేను. బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా మా పెళ్ళినాటి ఫొటో ఆల్బం మామగారికి చూపించి ఎవరినైనా గుర్తుపడతారేమోనని ప్రయత్నించాను. శూన్యంగా చూసారంతే.

          మధ్యాహ్నానికల్లా వచ్చేసారు అత్తయ్యగారు తన తమ్ముణ్ణి, కూతుర్నీ తీసుకుని. వారినీ గుర్తుపట్టలేదాయన.

          అనిల్ గురించి అత్తయ్యగారు చెబుతూన్న విషయాలు పెద్దగా విస్మయం కలిగించలేదు నాకు…జర్మనీ వెళ్ళిన కొత్తలో అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాడట అతను. ఓసారి హఠాత్తుగా ఓ జర్మన్ యువతితో కలసి ఇండియాకు వచ్చాడట. ఆమె తన కొలీగ్ అనీ, ఆమెను పెళ్ళిచేసుకున్నాననీ చెప్పాడట. భార్య ఉండగా మరో పెళ్ళి చేసుకోవడం తగదని తండ్రి తిట్టాడట. అది తన జీవితం, తన ఇష్టం అంటూ తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడట అనిల్. అది జరిగి పదేళ్ళవుతుందట. అప్పట్నుంచే అత్తయ్యగారికి, మావయ్యగారికి మనోవ్యథతో ఆరోగ్యం క్షీణించిందట… నా ‘వియ్ కేర్’ ఆశ్రమం గురించి తెలుసుకుని మనస్ఫూర్తిగా అభినందించింది.

          అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వెన్నెల, “మమ్మీ!” అంటూ పరుగెత్తుకు వచ్చి నా మెడకు చుట్టుకుపోయి ముద్దులు పెడుతుంటే, చిన్నగా నిట్టూర్చింది ఆవిడ. “నిన్ను దూరం చేసుకున్న మేము దురదృష్టవంతులం, అమ్మా!” అంది.

          మర్నాడు వాళ్ళు మామగారిని తీసుకువెళుతూంటే ఏర్ పోర్టులో సజలనయనాలతో వీడ్కోలు పలికాను నేను.

oooo

Bio

తిరుమలశ్రీ

‘తిరుమలశ్రీ’    గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి. చేసారు. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (CAS) కి చెందిన ఆయన, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. 
తెలుగులో  వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 180 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు.
ఆంగ్లంలో   వీరి కథలు, వ్యాసాలు వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’ మున్నగు పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వీక్లీ కాలం రాసారు. ఇరువది ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి.
హిందీ లో   అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.

***

Mani vadlamani
Comments
bottom of page