top of page

కథా​ మధురాలు

నీ యిల్లు బంగారం గాను

 

ఇర్షాద్ జేమ్స్

Irshad James.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

జయదేవ్ ఆస్టిన్, టెక్సాస్ లో ఇంటర్నేషనల్ బిగ్ మెషీన్స్ అనే కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

జయదేవ్ అమెరికా వచ్చాక Jay అని పేరు మార్చుకున్నాడు.

ఆ రోజు సాయంత్రం జయదేవ్ ఆఫీసులో పని ముగించుకుని, బయటకి వచ్చి, మాస్క్ తీసేసి, తన హోండా ఎకార్డ్ కారులో కూర్చున్నాడు.


రష్ అవర్ ట్రాఫిక్ లో ఇంటికి చేరటానికి నలభై నిమిషాలు పట్టింది.

కారు లోంచి రిమోట్ తో గరాజ్ డోర్ తెరిచి, చాలా నెమ్మదిగా కారుని గరాజు లోపల కుడి వైపు పెట్టాడు.

ఎందుకంటే, జయదేవ్ భార్య సుహాసిని అంతకు ముందే యింటికి వచ్చి, తన టొయోటా సియెనా వ్యానుని గరాజులో ఎడమ వైపు పార్క్ చేసింది.

ఆ చిన్న గరాజులో ఎక్కువ స్థలం లేక పోవటం వల్ల జయదేవ్ చాలా నెమ్మదిగా తన కారు డోరు తెరిచి, అతి కష్టం మీద ఆ యిరుకు లోంచి బయటపడి, ఇంట్లోకి వచ్చాడు.

సుహాసిని కిచెన్ లో ఇన్స్టంట్ పాట్ లో ఏదో వండుతోంది.

సుహాసిని పెళ్ళయి అమెరికా వచ్చాక Sue అని పేరు మార్చుకుంది.

“మీ టీ చల్లారిపోయింది, మైక్రోవేవ్ లో మళ్ళీ వేడి చేసుకోండి”, చెప్పింది సుహాసిని.

టీ వేడి చేసుకొని, డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్నాడు జయదేవ్.

“రియల్టర్ తో మాట్లాడారా?” అడిగింది సుహాసిని.

“మాట్లాడాను. మనం ఇంకో ఇల్లు కొనాలంటే ముందు ఈ ఇల్లు అమ్మాలి !!” చెప్పాడు జయదేవ్.  

జయదేవ్, సుహాసిని ప్రస్తుతం వుంటున్న ఇల్లు వాళ్ళకి బాగా చిన్నదయిపోయింది.

వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మిడిల్ స్కూల్ లో, హై స్కూల్ లో చదువుకుంటున్నారు.

అందుకని, ఇంకాస్త పెద్ద ఇల్లు తీసుకుందామని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు.

 

“మరి ఈ ఇల్లు అమ్మితే, మనం ఎక్కడుంటాము?” అడిగింది సుహాసిని.

“ఏదయినా అపార్ట్మెంట్లో అద్దెకి వుండాలి, ఇంకో ఇల్లు కొనే వరకు !!” చెప్పాడు జయదేవ్.

 

**

 

జయదేవ్, సుహాసిని వాళ్ళ ఇల్లు చాలా త్వరగా సేల్ అయిపోయింది.

వాళ్ళు ఒక త్రీ బెడ్రూం లగ్జరీ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు.

నిజానికి లగ్జరీ అపార్ట్మెంట్ అనేది ఒక విరోధాభాసాలకారం. (oxymoron)

అపార్ట్మెంట్ అంతా సామాను తో చిందరవందరగా వుంది.

“ఈ శనివారం రియల్టర్ తో అపాయింట్మెంట్ వుంది”, చెప్పాడు జయదేవ్.

“నేను ఆన్లైన్ లో నాలుగైదు ఇళ్ళు చూశాను. అవి చూపించమని అడుగుదాం !!” ఉత్సాహంగా అంది సుహాసిని.

జయదేవ్, సుహాసిని వాళ్ళ రియల్టర్ పేరు కాత్యాయిని.

కాత్యాయిని అమెరికా వచ్చి Kat అని పేరు మార్చుకుంది.

కాత్యాయినికి డివోర్స్ అయ్యాక, రియల్టర్ అకాడమీలో చేరి, ఆరు కోర్సులు చేసి, పన్నెండు పరీక్షలు పాసయ్యి, టెక్సస్ రియల్టర్ లైసెన్సు తెచ్చుకుంది.

ఆమెకి ఆస్టిన్ లో చాలా మంది భారతీయులు పరిచయం.

ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు కాండోలు, ఆరు ఇళ్ళుగా విజయవంతంగా కొనసాగుతోంది.

ఉదాహరణకి, ఒకసారి బాగా వర్షాలు పడి, ఒక ఇంటి చుట్టూ నీటి గుంటలు ఏర్పడి, బాగా బురదగా వుంటే, ఆ ఇంటిని water front property అని ప్రకటించి, మాంఛి రేటుకి అమ్మేసింది.

 

ఆ శనివారం ఉదయం పది గంటలకి జయదేవ్, సుహాసిని వాళ్ళ అపార్ట్మెంటుకి వచ్చింది కాత్యాయిని.

“ఐ విల్  షో యూ సం ఫెంటాస్టిక్ హౌసెస్ టుడే !!” అంది కాత్యాయిని.

 

కాత్యాయిని తన రేంజ్ రోవర్ కారులో జయదేవ్, సుహాసినిలని వూరంతా తిప్పి, చాలా ఇళ్ళు చూపించింది.

ఒక మంచి ఇంటి దగ్గర కారు ఆపింది కాత్యాయిని.

“ఈ ఇల్లు మీకు బాగా నచ్చుతుంది !!” ఉత్సాహంగా అంది కాత్యాయిని.

 

ముగ్గురూ కారు లోంచి దిగి, ఆ ఇంటి వైపు నడిచారు.

“ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్.  ఇంట్లో మంచి కమర్షియల్ స్టైల్ కిచెన్ కూడా వుంది!” చెప్పింది కాత్యాయిని.

“అవునా !!” అని ఉత్సాహ పడింది సుహాసిని.

“అంతే కాదు. పెద్ద త్రీ కార్ గరాజ్ కూడా వుంది !” చెప్పింది కాత్యాయిని.

“వావ్ !” అని ఎక్సయిట్ అయ్యాడు జయదేవ్.

 

“మీకు ఇంకా ఖరీదయిన ఇల్లు కావాలంటే చెప్పండి. ఇదే ఇల్లు రేపు చూపిస్తాను !!” నవ్వుతూ జోక్ చేసింది కాత్యాయిని.

జయదేవ్, సుహాసినికి ఆ ఇల్లు బాగా నచ్చింది.

కాత్యాయిని వాళ్ళని అపార్ట్మెంట్ దగ్గర దింపేసింది.

“ఇల్లు నచ్చి, ఆఫర్ పెడతారంటే, వెంటనే చెప్పండి, డోంట్ డిలే !!” అని, వెళ్ళిపోయింది కాత్యాయిని.

 

జయదేవ్, సుహాసిని ఆ ఇల్లే కావాలని నిశ్చయించుకున్నారు.

ఆ మర్నాడే కాత్యాయినికి ఫోన్ చేశారు.

“వీ వుడ్ లైక్ టు మేక్ ఎన్ ఆఫర్ !!” చెప్పాడు జయదేవ్.

“అయాం సారీ జయదేవ్, ఆ ఇల్లు ఆల్రెడీ సేల్ అయిపోయింది. కాలిఫోర్నియా ఫ్యామిలీ ఎవరో, లిస్ట్ ప్రైస్ కంటే లక్ష డాలర్లు ఎక్కువ ఆఫర్ చేసి, cash పెట్టి కొనేసుకున్నారు, ఇల్లు చూడకుండానే !!” చెప్పింది కాత్యాయిని.

 

జయదేవ్, సుహాసిని షాక్ అయ్యారు, ఆస్టిన్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి చూసి.

ఆ తర్వాత ఇంకా చాలా ఇళ్ళు చూశారు, రియల్టర్ తో.
 

వారాలు, నెలలు, గడుస్తున్నాయి.  

ఎన్ని ఆఫర్లు పెట్టినా, ఎవరో వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆఫర్ పెట్టి కొనేస్తున్నారు.

ఈ లోపల ఆస్టిన్ లో రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగిపోయాయి.

జయదేవ్, సుహాసిని బాగా నిరుత్సాహ పడిపోయారు.

**

 

 

దాదాపు ఒక సంవత్సరం గడిచింది.

ఒక రోజు కాత్యాయిని ఫోన్ చేసింది.

“ఒక మంచి ఇల్లు మార్కెట్ లోకి వచ్చింది. మీకిష్టమయితే వెంటనే వెళ్ళి చూడొచ్చు !!” చెప్పింది కాత్యాయిని.

“షూర్ !!” ఉత్సాహంగా అన్నాడు జయదేవ్.

ఆ రోజే కాత్యాయిని అపార్ట్మెంట్ కి వచ్చి, జయదేవ్, సుహాసినిలని పికప్ చేసుకుని, ఆ ఇల్లు చూపించటానికి తీసుకెళ్లింది.

ఆ ఇంటి దగ్గర కారు ఆపింది కాత్యాయిని.

ఆ ఇల్లు చూసి షాక్ అయ్యారు జయదేవ్, సుహాసిని.

అది వాళ్ళు ఒక సంవత్సరం క్రితం అమ్మేసిన పాత ఇల్లు !!

వాళ్ళు అమ్మిన ధర కంటే రెండు లక్షల డాలర్లు ఎక్కువకి అమ్ముతున్నారు !!

 

వాళ్ళ బడ్జెట్ లో, వాళ్ళకి కావలసిన లోకాలిటీలో, ఎక్కువ ఇళ్ళు లేవు.

ఇంకొన్నాళ్ళు పోతే, అపార్ట్మెంట్ లీజు పూర్తయిపోతుంది. మళ్ళీ రెన్యూ చేయాల్సి వస్తుంది.

 

చివరికి జయదేవ్, సుహాసిని ఆస్టిన్ లో వాళ్ళ పాత ఇంటినే రెండు లక్షల డాలర్లు ఎక్కువ పెట్టి, మళ్ళీ కొన్నారు !!
 

క్లోసింగ్ అయిన మర్నాడు జయదేవ్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళ ఆఫీసు నుంచి:

“Jay, అయాం సారీ, బట్ యువర్ జాబ్ ఈజ్ బీంగ్ ట్రాన్స్ఫర్డ్ టు సన్నీవేల్, కాలిఫోర్నియా. వి నీడ్ యూ దేర్ ఇమీడియట్లీ !!”


****

bottom of page