top of page

కథా​ మధురాలు

నవరాత్రి- 4

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

నవరాత్రి

*************           

 

 

గిరిజహరికరణం.

 

అయిదవ రోజు ‘‘పంచమి.‘‘  దేవిని స్కందమాల రూపంగా పూజించి, కారెక్కారు శాస్త్రిగారు ఆ రోజు రాత్రి అరుగు మీద కూర్చుని, కోటికి గూడెంలో స్పృహ వచ్చాక,  కలిగిన అనుభవాన్ని కోటి మాటల్లోనే చెబుతానీ రోజు అంటూ మొదలు పెట్టారు.

 

**

 అది ఒక చెంచు గూడెం. శ్రీశైలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అచ్చంపేట, ఆ వూరికి పక్కన ఒక ఏరు ప్రవహిస్తూ కృష్ణ లో కలుస్తుంది, దానికవతల అడవిలో వుందీ గూడెం, యింకా  చాలా చెంచు గూడేలూ సుగాలి తాండాలు వున్నాయట.  అతని పేరు నాగూ. ముగ్గురు భార్యలూ ఆరుమంది కొడుకులూ ఐదుగురు కూతుర్లు. కొడుకులందరికీ యిద్దరు ముగ్గురు భార్యలు పిల్లలు. ఒక్కో భార్యకు ఒక్కొక్క గుడిశ, మొత్తం యిరవై ముప్పై గుడిశలు. చుట్టూ కంపతో పెద్ద కంచె. దీన్ని యానాది సంగం అంటారు. మధ్యలో తూర్పు ముఖంగా సామి గుడిశ వుంది.  దానికెదురుముఖంగా సంగం పెద్ద గుడిశ, అందులో నాగూ

పెద్ద భార్య, దానికిటూ అటూ యింకో రెండు గుడిశల్లో  చిన్న భార్యలూ వుంటారు.

 

పొద్దు వాలేసరికి బయటికెళ్ళినవాళ్ళంతా వొక్కొక్కరే వస్తున్నారు. యెవరిళ్ళ ముందు వాళ్ళు తాము తెచ్చినవి, పళ్ళు కాయలు, దుంపలూ, చేపలూ, కుందేళ్ళూ, కౌంజు పిట్టలూ,  కట్టెలు కొట్టి యేరు దాటెళ్ళి వూళ్ళో అమ్మి సంపాదించినదంతా పెట్టారు. అందులోనుంచి కొంచం తీసుకెళ్ళి సామి గుడిశలో పెట్టివచ్చారు.

వండుకుని తిన్నాక, డోలూ, బూరా యింకా యేవో పట్టుకొచ్చి కూర్చుని వాయిస్తూ కొందరు సినిమా పాటలు పాడుతూ ఆడా మగా చిందులేశారు. లచ్చిమి వండినది నాగూకి నాకూ పెట్టింది. నాగూ నన్ను నిలబడమన్నాడు. నా వల్ల కాలేదు. “కాళ్ళు సచ్చుబడ్డాయి, మా సామి కాడికిరా. రంగం పెడతాను రేపుటాల్నుంచీ వొయిద్దిగం చేస్తాను. నలబై దినాలు నేను చెప్పిందినాల, పెట్టింది తినాల” అన్నాడు, “బయపడబాక. నడిసి, నీ గూటికిపోతావు. ఎందరికో నయం చేసినాడీ మడిసి. బొమ్మక్క మల్లన్నమీద ఆన” అనింది లచ్చిమి, “మీరేమైనా చెయ్యండమ్మా. నేను నా వాళ్ళను చేరుకుంటే చాలు. యిక్కడే వుంటాను. మీరు చెప్పినట్టు వింటాను” అని దణ్ణం పెట్టానామెకు. యిద్దరు కొడుకులొచ్చి నన్ను దేవుని గుడిశలో మధ్యలో వున్న గుంజకు ఆనించి కూర్చోబెట్టారు. గుండ్రంగా వున్న చుట్టు గుడిశ, గోడ వారగా మూరడెత్తు మట్టి అరుగు, యెర్రమట్టితో అలికి రకరకాల ముగ్గులూ, గోడలమీద బొమ్మలూ వేశారు. అరుగు మీద మట్టితో చేసిన కుండలూ, వాటిమీద చిన్నముంతలూ, ఏవో బొమ్మలూ, కొన్ని కుండలకున్న కంతలనుండి లోపల పెట్టిన నూనె దీపాల వెలుగు నిండి వుందక్కడ. మధ్యలోవున్నఆకారాలు రెండూ మల్లన్నబొమ్మక్క(శ్రీ మల్లికార్జునుడు, భ్రమరాంబ), అన్నిటికీ పసుపుకుంకుమ, వేపమండలతో అలంకరించారు, నాగూ తప్పెట అందుకుని నేను రంగం పెట్టాను.

 

లచ్చిమి పల్లాయి పలుకుతాది. పెట్టిన దండం యిడవకుండా కూచోవాల తెల్లారేదాకా. రేపటాల్నుంచీ వైద్దిగం మొదలుపెడతా. పెట్టింది తినాల. నేను చెప్పినట్టినాల నలబై దినాలకు లేసి యింటికి పోవాల వొప్పేనా? అడిగాడు, ”యీ దేవుళ్ళ మీద ఆన, నీవు చెప్పినట్టింటా“ అని వొట్టేశాను. తప్పెట వాయిస్తూ ఏదో అంటున్నాడు, అతని పక్కనే కూర్చుని లచ్చిమి చాలా సన్నని స్వరంతో నాగూ అన్నమాటల్నే పాటలాగా రాగం తీస్తూంది. ఆ భాషేమిటో తెలీలేదు. వాళ్ళు పొద్దున్నుంచీ మాట్లాడిన దానికీ యీ భాషకూ ఏమాత్రం పొంతనలేదు, యిద్దరూ పెద్ద బొట్లు పెట్టుకున్నారు. నాకూ పెట్టారు.

ఒక కుండలోనుండి మొగలి వాసనొస్తున్న పొడితీసి వొంటికి రాసుకుని నాకూ రాశారు ‘‘కదంపొడి‘‘ అనిచెప్పి, గోడలమీద వేలాడుతున్న విల్లంబులూ, బాణాలూ, రకరకాల పూసల దండలూ అన్నిటిమీదా చల్లారు ఆ పొడిని. తెల్లారేదాకా ఆ రంగం ఆగలేదు.

 

మరునాడు అడవిలోకెళ్ళి ఏవేవో ఆకులూ వేర్లూ తెచ్చి నూరి ఆ రసంతో నా కాళ్ళకు మర్దన చేసి ఆకులుపెట్టి కట్లు కట్టారు. రాత్రి కట్లు విప్పి, కడిగి, వేర్లు అరగదీసి గంధం పట్టువేశారు. కడుపులోకి మందులిచ్చాడు, తలకేదో నూనె అంటాడు, పావురాళ్ళు తెచ్చి వాటి రక్తం పూసేవాడు ఆ మాంసం వండిపెట్టినారు, యిరవై రోజులయింది నాగూ సాయంతో మెల్లిగా అడుగులువేస్తున్నాను. యేటికి తీసుకెళ్ళి యేటిమట్టి కాళ్ళకు పట్టించి నీరెండలో నిలబెట్టాడు, గుంట తవ్వి యిసకలో తొడలవరకూ పూడ్చివుంచాడు ఏవో వేప మండలతో మంత్రించి, దిష్టితీసి యెన్నో సేవలు చేశారిద్దరూ. కన్నబిడ్డలా చూసుకున్నారు. ప్రతి శుక్రవారం రంగంలో కూర్చోబెట్టారు, నలబై రోజూలయింది, నా అంతట నేనుఅడుగులేస్తున్నాను, పదిరోజులయ్యాక నడిపించి కొంతదూరంలోఅడవిలోవున్న బొమ్మక్క రాయి దగ్గరకు తీసుకెళ్ళి మొక్కించారు. ‘‘యింటికెప్పుడెళ్ళొచ్చు‘‘ అని అడిగాను. యిన్నాళ్ళున్నావు, యింకో వారంలో మా గూడెంలో సమారాధన జరుగుతాది  చూసి పో బిడ్డా అనింది లచ్చుమమ్మ.  

 

**

 

           ఆరోజే  నాగూ కొడుకులెళ్ళి మిగతా గూడేలవాళ్ళకు చెప్పారు. యింటికి నాలుగు సేర్లు గింజలూ  నాలుగు రూపాయలు తేవాలని కట్టుబాటుందట.

 

గుడిశల కప్పులు సరిచేశారు. గోడలు పేడమట్టి కలిపి అలికి యెర్రమట్టి  సున్నంతో అలంకరించారు. దేవుని గుడిశ కళకళలాడుతోంది. ముందర పందిరి వేశారు, కొత్తకుండలు తెచ్చారు, సమారాధన రోజు తెల్లవారక ముందే అందరూ వచ్చేశారు. పందిరి కింద గోనేలు పరిచి విసుర్రాళ్ళు, రోళ్ళు పెట్టి ఆడ మగా దంచటం విసరటం మొదలుపెట్టారు. కొందరు పొయ్యి మీద పెద్ద బానలు పెట్టి వంట ప్రారంభించారు. మేకపోతు, కోళ్ళూ పొంగళ్ళూ వండి, నైవేద్యం పెట్టారు, యేట్లో మునిగి కొత్త బట్టలు కట్టుకున్నారు. వొక్కొక్క కుటుంబమూ దేవుని గుడిశలోనికివెళ్ళి మొక్కి వచ్చారు. పూసలామె వచ్చింది, ఆడాళ్ళంతా చుట్టూ చేరారు. పవుడరు డబ్బాలు, తిలకం సీసాలు, తలపిన్నులు, కాటుక రిబ్బన్లు, దువ్వెనలు, వాసన నూనెలు యింకా ఏవేవో కొంటున్నారు. గాజులసెట్టి గాజులమలారం తో వచ్చాడు. ఆడవాళ్ళు వొక్కొక్కరే అతనిముందు కూర్చుని మలారం లోనుంచి గాజులెంచుకుంటే సెట్టి ఆమె అరచేతిని బాగా నలిపి గుత్తంగా గాజులు తొడుగుతున్నాడు.

 

రెండుచేతులకీ గాజులు తొడిగాక  గాజులసెట్టికి మొక్కి లేస్తున్నారు, బెల్లం మిఠాయిలు, బుడగలూ, బూరలూ రకరకాల ప్లాస్టిక్ బొమ్మలూ పెద్ద అట్టకు తగిలించుకుని ఒకడూ. పీచుమిఠాయివాడూ రాగానే పిల్లల గోల యేడుపులూ అరుపులూ ఆడవాళ్ళ అలకలూ. కొన్నవాటికి మగవాళ్ళు డబ్బులో గింజలో యిచ్చి పంపటం. యిదంతా ముగిసే సరికి పొద్దు తిరిగింది. యిక తాగటం తినటం మొదలయింది, అడవి పిట్టల్ని జంతువుల్ని నెగడులో కాల్చి తింటున్నారు. నవ్వులు పరాచికాలు మిన్నంటుతున్నాయి, సాయంత్రం అసలు సంబరం మొదలైంది.

 

రకరకాల వేషాలు వేసుకుని గుడిశల్లోనించి బయటికొచ్చారు. కొందరు డోలూ తప్పెట్లూ యింకేవో వాద్యాలూ వాయిస్తూ పాటలూ డాన్సులూ నవ్వులూ, పెద్దవాళ్ళూ పిల్లలూ చుట్టూ కూర్చుని చూస్తున్నారు. ఆట జోరందుకుంది. పడుచుజంటలు మద్యలోకొచ్చి అడటమ్మొదలెట్టారు. తాగిన మైకంలో వూగి పోతున్నారు. అర్ధ రాత్రి దాకా ఆడి ఎక్కడివాళ్ళక్కడే పడిపోయారు. తెల్లవారింది. నిన్నమిగిలినవి తిని వొక్కొక్కరే వెళ్ళిపోతున్నారు, కొందరి భార్యలు వాళ్ళకు నచ్చినవాళ్ళతో వెళ్ళిపోయారు. కొన్నిగుడిశల్లో కొత్తాడవాళ్ళున్నారు. యిదంతా కొత్తేమీ కానట్టుంది. నాగూ లచ్చిమి కొత్త జంటలను సామి గుడిశలోకి ఆహ్వానిస్తున్నారు. గూడెంలో యెవరి కష్టం సుఖం వారిదే కానీ గూడెం  కట్టుబాట్లు తప్పక పాటించాల్సిందే. లేకుంటే వెలి వేస్తారు.

 

ఆ రాత్రంతా రంగం పెడుతూనే వున్నారు నాగూ లచ్చమ్మ. తరువాత మా యింటివరకూ తోడుగా వచ్చారు. నాగూ లచ్చుమమ్మ వచ్చే ముందు సామి గుడిశలోకెళ్ళాను. నేను అడవికెళ్ళే ముందే జీతమిచ్చారు. అదలాగే జేబులో వుంది. మొత్తం తీసి పెళ్ళప్పటి వుంగరం, వాచీలతో బాటు అక్కడ పెట్టాను.

 

యింటికొచ్చాక సరస్వతి పుస్తెలమ్మిన డబ్బుతో వాళ్ళకు బట్టలు కొని పెట్టింది. వాళ్ళకు ఏమిచ్చినా ఋణం తీరదయ్యా!” అంటూ. ఆ అమ్మే ఆపరేషన్ అవసరం లేకుండా నా కాళ్ళకి వాళ్ళ రూపంలో వైద్యం చేయించింది.  తన అనుభవాన్ని గుర్తుచేసుకుని , కళ్ళనిండా సంతోషంతో తాదాత్మ్యంతో అమ్మకు మొక్కాడు కోటి.

 

 

కోటి అనుభవాన్ని చెప్పటం ముగించి శాస్త్రి గారు ఆ రోజుకి విశ్రమించారు.

*****

bottom of page