MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నాటకం
జానకీ చామర్తి
రామం చేతులు కట్టుకుని పిట్టగోడని ఆనుకునుంచుని కళ్ళార్పకుండా చూస్తున్నాడు చందమామని.
ఇవాళ పౌర్ణమి ఏమిటి చెప్మా?... అనుకున్నాడు. వాతావరణంలో ఆగి ఆగి కొబ్బరి ఆకుల మీద నుంచి వస్తున్నచల్లగాలి, అలలు రేపినట్టు, రామంలో ఏవేవో ఆలోచనలు రేకెత్తిస్తోంది. కనబడే చందమామ గుండ్రంగా కొద్దిపాటి వంపులు తిరిగి పాతబడిన వెండి కంచంలా మెరుస్తున్నాడు అనుకున్నాడు రామం.
నిండు చందమామని చూసినప్పుల్లా వెండికంచం గుర్తొస్తుంటుంది రామానికి. దానికి కారణమూ, కథా కూడా ఉంది. రామం బాల్యంలో ఎదుర్కొన్నసంఘటనే అది.
చిన్న రామం కి ఊహ వచ్చాక తెలుస్తున్న విషయాలు, ఇంటి పరిస్ధితులు ఆలోచన రేకెత్తించేవిగానే ఉండేవి. ఇంకోలా చెప్పాలంటే అతను మెల్ల మెల్లగా వాటిగురించి ఆలోచించడం ఆరంభించాడు అనవచ్చు.
తండ్రి ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండటం లేదాస్నేహితులతో తిరగడం పేకాటలాడటం చూస్తూనే ఉండేవాడు. రామంకి తండ్రి అంటే చాలా ఇష్టంగాఉండేది. మగవారు ఏమి చెయ్యాలో,ఉద్యోగం పురుషలక్షణంలాటి విషయాలు, అర్ధం కాని పసితనం అతనిది అప్పుడు.
తండ్రి ఆప్యాయత,తన పట్ల చూపే ప్రేమ కు చిన్ని హృదయం బాగా ప్రతిస్పందించేది.
తండ్రి దగ్గర దగ్గరగానే ఉండటం, తనని ఆడించుతూ ఉండటం, తీరికగా ముద్దు చేయడం, ఎత్తుకుని వీధులు తిప్పడం, ఎప్పుడూ కోప్పడి పల్లెత్తుమాటనని తండ్రి ఎంతో నచ్చేవాడు రామానికి.
ఆ పక్కన చూద్దామంటే ధుమ, ధుమలాడుతూ విసుక్కునే తల్లి. తమ్ముడు చంటివాడని చంకనేసుకుని పనులు చేసుకుంటూ, మధ్యలో ఇంట్లోనే కూచునుండే తండ్రిని ఆమె విసుక్కుంటూ ఉండటం గమనించేవాడు, అది వింటూ తండ్రి తువ్వాలు భుజాన వేసుకు లేచిపోయేవాడు. రామం మొదటనుంచి తల్లికి దూరంగానే మెసలేవాడు కాస్త, ఇందుకేనేమో. తమ్ముడు మాత్రం ఎప్పుడూ తల్లి మెడ పెనవేసుకునే కనిపించేవాడు.
ఏమయితేనేం,రామంకి నాయనమ్మ ద్వారా ఇంటి విషయాలు తెలుస్తుండేవి. ఎందుకంటే రామం నాయనమ్మ,రామంని చిన్నప్పటినుంచే ఎదిగిన మనిషిలా భావించి కబుర్లు చెప్పేది. రామంకి అది నచ్చేది. నాయనమ్మ అతనికి చెప్పింది కదా, అతను లేక లేక పుట్టిన మొదటి సంతానమని. చంటప్పుడు అందరం నెత్తిన పెట్టుకుచూసుకునేవారమని. నానమ్మ కబుర్లలోనే తెలిసింది రామంకి,తండ్రి పనీపాటు చేయడని, కూచుని తింటుంటే,కొండంత కాకపోయినా గుట్టంత ఆస్తీ కరిగిపోతోందని. తల్లి బాధ అదేనని, ఏంచెయ్యడానికీ ఏమీ లేదని.
ఇవన్నీ నానమ్మ కొడుకును వెనకేసుకొస్తూనే చెప్పేది. కాని మనవడికి ఇంకోటీ చెప్పింది,తన కొడుకు అసమర్ధుడేమో గాని చెడ్డవాడు కాదని. ఒక్కచెడ్డ అలవాటూ లేదని. ఆడే పేకాట కూడా కాలక్షేపపుసరదా. అంతే. మెత్తని మనిషి, కాని విపరీతమైన అలసత్వం. మెతకతనం, అమాయకత్వం, ఎలాబతకాలో తెలియకపోవడం. ఏంచేయాలి?. నాయనమ్మ గాని, తల్లి గాని,తండ్రి గురించి విసుక్కుని నసుక్కుంటారు తప్ప,ఆయన మంచితనంగురించినమ్మకంతో ఉంటారని రామంకి అర్ధం అయింది. అతనికి కూడా అవే భావాలు ఇంకా ఎక్కువగా ఏర్పడ్డాయి తండ్రి పట్ల. కాని విసుగు లేదు, పైగా బాగా దగ్గరుండి గమనించి కొన్నితండ్రి ఇష్టాలు తన ఇష్టాలుగా చేసేసుకున్నాడు కూడా.
ఇప్పుడు దాని గురించే గతంలోకి జారుకున్నది, ఆ ఇష్టంతో రామంఎలా మొండి పట్టుపట్టాడో..
స్వతహాగా రామం బాగా బుద్ధిమంతుడు,బడిలో చేర్చగానే శ్రద్ధగా చదువులో మునిగిపోయాడు, వేరేదీ పట్టించుకునేవాడు కాదు. లెక్కలు ఇష్టంగా చేసేవాడు, వీధి అరుగంతా అతని లెక్కలతో నిండిపోయేది, గోడలకి పాకే దశ అందుకోని సమయంలో,రామంకి తెలుగువాచకంలో పద్యాలు,శతకపద్యాలు కూడా కంఠస్తం వచ్ఛేయి. పంతళ్ళు మెచ్చుకునేవారు కూడానూ. తెలుగువాచకంలో పాఠాలు అతనికి కథలలాగే ఉండేవి. ఇవిచాలదన్నట్టు ఆ పల్లెటూరిలో ఉండే కధల పుస్తకాలు లైబ్రరీ లో ఉండే చందమామలూ బాలమిత్రలూ, రామంఊహలకి రెక్కలు తొడిగేవి.
ఇవన్నీ ఒక ఎత్తు రామం నాటకం వలలో చిక్కుపడటం ఒక ఎత్తూ. రామం తండ్రికి నాటకాల పిచ్చిఉంది, నిజమే మరి పని లేనివాళ్ళకు ఓ కాలక్షేపం అంటూ ఉండాలి కదా. అదృష్టవశాత్తూ వేషాలేసే సరదా మాత్రం లేకపోవడం ఆ ఇంటివారూ, ఊరివారూ చేసుకున్న అదృష్టం. కేవలం చూడటమే ఆనందం అతనికి. తండ్రి అడుగుజాడలలో నడిచే చిన్న రామానికి నాటకాల మోజు పట్టుకుంది. రామం వాళ్ళది ఓ మోస్తరు పల్లెటూరు. కాని నాటకాలు ప్రదర్శించేటంత కాదు. నవరాత్రులకు వాటికీ నాటకాలు నాలుగు మైళ్ళదూరంలో ఉన్న పక్క ఊరిలో వేసేవారు. తండ్రితో విడవకుండా ఆ నాటకాలకెళ్ళేవాడు రామం.
నాటకాలు అదో మాయా జగత్తు లాఉండేది, ఆ వేషాలు,ఆ పాత్రలూ,ఆ నాటక ఇతివృత్తాలూ, ఆ లైట్లూ, ఆ స్టేజీ అలంకరణ. అప్పట్లోదాదాపు అన్నీపౌరాణికాలే. రామంకు విపరీతమైన మక్కువ ఏర్పడిపోయింది,ఆ పాత్రల మీద. కృష్ణుడూ, దుర్యోధనుడూ, ఆంజనేయుడూ, కౌరవులూ పాండవులూ.. అదో ప్రపంచం. పైగా తండ్రి అతని స్నేహితుల కబుర్లు వింటూ ఇంకా కుతూహలం పెంచుకున్నాడు రామం.
ఆవేళ ఏదో నాటకం ఉంది, ఎంతోచూడాలనుకునేది, చక చకా లెక్కలుచేసేసుకుంటున్నాడు రామం,సాయంత్రం తండ్రితో కలసివెళ్ళడానికి. అతని ఏకాగ్రతలో చుట్టూ ఏం జరుగుతోందో పట్టించుకోవడం లేదతను. ఆ కాస్త పక్క వసారాలో నుంచునుంది రామం తల్లి పార్వతి. నిండునెలలు ఆమెకు. ఉండవలసినదానికన్నా ఎత్తుగా ఉంది పొట్ట. చేత్తో వెండికంచం,చెంగట్టుకు చిన్న కొడుకు. పురిటిఖర్చులకు ఇల్లు నడపడానికి ఆ వెండి కంచం కుదువ పెట్టే విషయం మీద చర్చ నడుస్తోంది అక్కడ.
రామం తండ్రి గోపాలం తల తిప్పుకు గోడకానుకుని నుంచున్నాడు గోపాలం తల్లి,రామం నాయనమ్మ,తన భర్త చేయించిన ఆ వెండికంచం బయటకుపోవడానికి వీల్లేదని పట్టట్టకుని కూచునుంది,ఆవిడ వాదిస్తోందనడం కంటే బతిమాలుతోందనడం సబబు. ఆ గొడవ అలా సాగుతోండగానే,రామం తన లెక్కలు చేయడం ముగించాడు. ఒంగుని తొంగి చూసి, నోట్లో వేలేసుకు గొడవనాలకిస్తున్నట్టున్న తమ్ముడిని చూసి నవ్వాడు. తర్వాత ఒక్క ఉరుకున వచ్చి తండ్రి కాళ్ళకు చుట్టుకున్నాడు.
“నాన్నా! నడవండి వెడదాం, నాటకానికివేళవుతోంది.. రండి” అంటూ.
గోపాలం, రామాన్ని నాటకానికి వెళ్ళేది లేదని చెప్పబోతుండగానే, పార్వతి ఆయాసపడుతూ విసుక్కుంది కొడుకును “ పోరా..! నాటకం లేదు ఏమీ లేదు “ అంటూ. నాయనమ్మ కూడా మాటలు ఆపేసింది, తన నిరసన తెలియచేస్తున్నట్టుగా. తండ్రి బుజ్జగించబోయాడు రామాన్ని, “ ఈ సారికి వద్దులే అబ్బాయ్! తర్వాత చూడవచ్చు “ అని.
రామానికి అర్ధం అవలేదు,అప్పటిదాకా నాటకం చూడటానికి ఉవ్విళ్ళూరిపోతున్నాడు,ఇప్పుడు వద్దనేప్పటకి ఆశాభంగం,ఉక్రోషం వచ్చేసాయి. చాలా పట్టుపట్టాడు అతను, కళ్ళల్లో నీళ్ళుకూడా వచ్చాయి. “నను తీసుకువెళ్ళి నాటకం చూపవలసినదే” అనిపేచీపెట్ట సాగాడు. ఆ పేచీ చిరాకుగా అలా సాగుతూనే ఉంది.
గోపాలం భార్య కేసి తల్లి కేసి చూసి అన్నాడు “ నాటకం తీసుకెళ్ళి చూపించడమే కదా, ఇద్దరం వెళ్ళొస్తాం,ఇదేం వెండికంచం అమ్ముకోవడం, భూములు తాకట్టు పెట్టుకోవడం కాదుగా.. వెళ్ళొచ్చేస్తాం “ అంటూ నడవరా అని రామం ని తీసుకుని పక్కూరి నాటకానికి బయలుదేరాడు.
తండ్రి అన్యమనస్కంగానడుస్తుండటం గమనించనేలేదు రామం,ఉత్సాహంగా కబుర్లుచెపుతున్నాడు. మూడు నాలుగమైళ్ళ దూరం నడచే వెళ్ళడం,వేరేవాహనాలు లేవు వారికి. గోపాలం కి నడక బాగా అలవాటే. రామం చిన్నవాడు,నడవలేడు కూడా. కొంచం దూరం వెళ్ళాక తండ్రి, తన భుజంఎక్కించుకున్నాడు రామం ని. పొంగిపోయాడు రామం, తండ్రి మీద అభిమానం, గర్వం పొంగాయి. చాలా గొప్పగా తండ్రిమీద ఇష్టం పెరిగిపోయింది, ఆ పొంగులో తండ్రి మనఃస్ధితి కూడా తెలుసుకోలేకపోయాడు.
ఇంత హడావిడి చేసినా నిద్రకాచుకోలేక,పూర్తిగా నాటకం పూర్తిగా చూడనే లేకపోయాడు పిల్లాడు రామం. సగం నాటకం దాటేటప్పటికి కునుకుపోయిన రామంని, భుజాన ఎక్కించుకుని వెనక్కి తిరిగి ఇంటిమొహం పట్టాడు గోపాలం. మళ్ళీ ఇంచుమించు నాలుగుమైళ్ళ నడక.
వెన్నెల రాత్రి పచ్చ పైరుల మధ్యనుంచి నడక.. దారి పక్కన బావి కనిపించగానే, దింపాడు రామాన్ని, గోపాలం. నిద్రమత్తుతో నుంచున్న రామం ముందు,బావి లోంచి తోడిన నీళ్ళ బకెట్టు తో నీళ్ళు పెట్టి “ తాగుతూండరా అబ్బాయ్! నేనలా పక్కకెళ్ళొస్తాను! “అని చెట్ల చాటుకెళ్ళాడు గోపాలం.
ఆ నీళ్ళ ముందు మోకాళ్ళ మీద గొంతుక్కూచుని దోసిలితో నీరు తీసుకోబోయాడు రామం. నీళ్ళల్లో చంద్రుని ప్రతిబింబం,మత్తు వదిలింది రామానికి. తలెత్తి చంద్రుని చూసాడు, చుట్టూ చూసాడు వెన్నెల. కిందంతా పరచుకున్న వెన్నెలలో పైన చెట్టు ఆకుల నీడలు. పైరగాలి గుస గుసగా ఏదో చెపుతన్నట్టుగా ఉంది చెవిలో. లేచి నుంచుని అటూ ఇటూ నడుస్తున్నాడు రామం, తండ్రికోసం ఎదురు చూస్తూ.
టైమెంతయ్యిందో,అర్ధరాత్రి అయిందేమో కూడా తెలీలేదు. హఠాత్తుగా అతనికి కొంత భయం కూడా వేసింది, నిర్మానుష్యమైన ఆ రాత్రి సమయంలో.
ఉన్నట్టుండి అతనికి, బయల్దేరేముందు తండ్రిమాటలుగుర్తొచ్చాయి. “ఇద్దరం వెళ్ళినాటకం చూసి వస్తాం. ఇదేం వెండికంచం అమ్ముకోవడం, భూములు తాకట్టు పెట్టుకోవడం కాదుగా “.
రామం ఆలోచనలో పడ్డాడు, తల్లి చేతిలో మెరిసిన వెండికంచం కళ్ళ ముందుకొచ్చింది, “ అవును, వెండికంచం “ అనుకున్నాడు.
బయటకు వచ్చిన తండ్రి ని చూసి తటపటాయిస్తూనే ఏమడగాలో తెలియక ఇలా అడిగాడు రామం,
“నాన్నగారూ! నాటకం చూసారా”
వంగుని కాళ్ళు కడుక్కుంటున్నగోపాలం “నాటకం...” అని ఆగి “ చూసానే… నువ్వే చూడకుండా నిద్రపోయావు. నడుదా భుజం ఎక్కు“ అని పిలిచాడు.
రామం గబుక్కున చెప్పేసాడు “వద్దు, నేను నడచిరాగలను, ఎత్తుకోవద్దండీ” అంటూ.
“ఇంకా దూరముంది, మరి నడవగలవా..? “ అడిగాడు గోపాలం.
“నడవగలను“ గట్టిగానే చెప్పాడు రామం తండ్రితో.
“సరే, గబ గబా అడుగులెయ్యి,చాలా ఆలస్యమయింది” అన్నాడు తండ్రి,చకచకా అడుగులేస్తూ.
తండ్రీ కొడుకులు ఎక్కువ మాటాడుకోకుండానే గబగబా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు.
పార్వతి ఆపసోపాలు పడుతూ భోజనం వడ్డించింది. టైము ఎంతయ్యిందో కూడా తెలీదు. తమ్ముడు నిద్రపోయినట్టున్నాడు. వాడి జాడలేదు. రామం తల్లితో అన్నాడు “అమ్మా! నువ్వు పడుకో, నాన్ననేను తిన్నాక కంచాలు నేను తీసి శుద్ధి చేస్తా!”
గోపాలంకి కొరబోయింది వింటూ. పార్వతి ఆశ్చర్యంగా రామం నిచూసింది. ఆమె మొహంలోసంతోషరేఖ మెరిసింది, ఆ లాంతరు దీపపు కాంతిలో.
“పరవాలేదు,నువు తినేసి కాసేపు చదువుకో,నేను సద్దుకుంటాను” అంది, ఆ గొంతులోని సౌమ్యత,తింటున్న మజ్జిగాన్నం లాగ చల్లగా తోచింది రామానికి.
పుస్తకాలు ముందేసుకు కూచున్నా.. అన్నీ వచ్చేసినట్టే ఉండి చదవబుద్ధవలేదు ఆ రాత్రి రామానికి. పొగాకు కాలుస్తూ తండ్రి,స్నేహితులను కలవడానికి వెళ్ళడం చూసాడు. తల్లి, తమ్ముడు నిద్రపోయారు.
చదువు కట్టిపెట్టి పడుకోవడానికి నాయనమ్మ పక్కకు చేరాడు రామం. సవ్వడికి కళ్ళు విప్పిన నాయనమ్మ అడిగింది ”నాటకం బావుందా అబ్బాయ్” అని.
రామం చెప్పాడు
“నేను పూర్తిగా చూడనేలేదు. సగంలోనే నిద్రపోయా”.
“పిచ్చి సన్నాసి” అంటూ తల నిమిరింది నాయనమ్మ.
“నాయనమ్మా! వెండికంచం..” ప్రశ్నపూర్తి చేయకుండా ఆగిపోయాడు రామం.
“ లేదు “ చెప్పింది ఆమె కళ్ళు మూసుకుని. ఏ విషయమైనా దాచకుండా చెప్పే ఆమెకు ఆ క్షణాన, తానే స్వయంగా రామాచారి ఇంటిలో పెట్టి, సొమ్ము తెచ్చిందని,చిన్నవాడైన మనవడికి చెప్పడానికి మనస్కరించలేదు, తన భర్త చేయించినది, మనవడు అందులో భోంచేయాలని కోరుకునేది మరి. రామం మాటాడకుండా కళ్ళుమూసుకుని నిద్రకుపక్రమించాడు.
కాని,మళ్ళీ ఎప్పుడూ రామం నాటకం చూడటానికి తీసుకెళ్ళమనిపేచీ పెట్టలేదు, ఇంకా చెప్పాలంటే అప్పటినుంచీ నాటకం మీది ఇష్టమే పోయింది. పైగా తండ్రి రమ్మన్నా చదువుకోవాలి రానంటున్నాడు ఇప్పుడు. తల్లికి పనిలో సాయం చేస్తున్నాడు,తమ్ముడిని దగ్గరకు చేరదీస్తున్నాడు. నాయనమ్మ తో దగ్గరతనం ఇంకాపెరిగింది.
జీవితమే ఒక నాటకరంగం. ఆ నాటకం అర్ధం చేసుకోవడంమొదలెట్టాక, మామూలు నాటకాలమీద మోజు తగ్గింది రామానికి.
అలా పెరిగి పెద్దై, జీవితంలో ఎదిగి,మంచి చదువులు చదివి స్ధిరపడినా, నిండు చందమామని చూసినప్పుల్లా మాత్రం...ఇదిగో ఇలాగ... వెండికంచం ఎందుకో గుర్తొస్తుంటుంది ఇప్పటికీ.
*****