top of page

వ్యాస​ మధురాలు

నారన సూరన ఉదయనోదయము – సవిమర్శక పరిశీలన.

vempati hema

పావని 

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాసపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన వ్యాసం

ఉపోద్ఘాతము:

ఉదయనోదయము అనే ప్రబంధాన్ని తెలుగులో నారన సూరన అనే కవి రచించాడు. ఇది 5 అశ్వాసాల ప్రబంధం. దీనికి మూలాన్ని కవి తన కావ్యంలో ఎక్కడా చెప్పలేదు. కాని ఈ కథకు మూలకథ కథాసరిత్సాగరంలోని ద్వితీయ లంబకంలో ఉంది. ఈ ఉదయనోదయంను కవి భాస్కర మంత్రికి అంకితం చేశాడు. దీనిని సూచిస్తూ కథా ప్రారంభంలో ఈ విధంగా ఉంది.

 

కం.     నీ జనకుడుదయనోదయ

  మోజం గావించె సురుచిరుకోక్తుల నది సం

  యోజింపుము నా పేరిట

   భూజననుత నారధీర పుణ్యవిచారా. ( ఉ.నో. 1._21.ప.)

అని “ ఉదయనోదయం “ ను అంకితమిమ్మని ముడియము భాస్కరుడు కోరగా అంకితమిచ్చానని కవి పేర్కొన్నాడు. అలాగే వనమలివిలాసంను రచించి కొండూరి అక్కదండనాథునికి అంకితం ఇచ్చాడు. ఇది ఉదయనోదయంకు ముందు సూరన చేసిన రచన. కవి తన ఇంటిపేరు, ఊరిపేరు, కావ్యం ఎప్పుడు రాశాడో పేర్కొనలేదు. కాని ఆశ్వాసాంత గద్యలో ఇంద్రేశ్వరవర ప్రసాదలబ్ద కవితా సారుడని, నారనామాత్య పుత్రుడని మాత్రం చెప్పుకున్నాడు. ఈ ఇంద్రేశ్వరాలయం కడప మండలం చింతలపొట్టూరు అనే గ్రామంలో ఉంది.

ఈ కడప మండలంలో కృతిపతి గ్రామం ముడియం అగ్రహారం ఉండడంవల్ల ఇతడు కడపజిల్లా నివాసి అని చెప్పవచ్చు. సూరన కాలాన్ని కృతిపతి కాలాన్ని బట్టి పండితులు ౧౬వ శతాబ్ది పూర్వార్దంకు చెందినవాడిగా గుర్తించారు.

 

సూరన ఉదయనోదయంలో ఇష్టదేవతా స్తుతిని ఈవిధంగా ప్రారంభించాడు.

ఉ.  శ్రీసతి క్రొమ్మెఱుంగు మణిచిత్రిత శేషభుజంగశయ్య యు

     ద్భాసితశక్రచాపలత తాన సితాంబుద మంచు శంక బ

     ద్మాసనముఖ్యు లెవ్వని సుదాబ్ధి దలంపుదు రట్టి దేవతా

గ్రేసరు డిచ్చుగాత జయకీర్తులు లోకయబాచ శౌరికిన్.1.ప.1.ఆ       

ఈ పద్యంలో కవి విష్ణుమూర్తిని ప్రార్థించాడు.

 

ఈ ప్రబంధాన్ని వెలికితీసి నారన సూరన అనే కవిని విద్వల్లోకానికి చాటింది మానవల్లి రామకృష్ణ కవి.  దీనిని ఈయన విస్మృతకవుల జాబితాలో చేర్చి 1912 లో ప్రకటించారు. ఇక ప్రబంధ విషయానికి వస్తే సూరన తనను గూర్చి ఈవిధంగా చెప్పుకున్నాడు.

సీ.    కౌండిన్యగోత్ర విఖ్యాతుండ సత్కవి

             మాన్యుండ నారనమంత్రి మణికి

వనిత యక్కాంబకు వర తనూజుడ గిసా

                 నాఖ్యునకును కుననాహ్వయునకు

       గారాపు సయిదోడ నారయణ పదార

                 వింద సంసేవనా విమల మతిని         

       కావ్యనిష్ణాతుడ గజరావు బిరుదాంకు

                లగు రాచవారికి దగు హితుండ 

తే.    సృష్టి వాచామగోచర స్నిగ్ధ వర్త

        నాభిరమ్యుండ బంధులోకానుభావ్య

        మానవిభవుండ నయకళామందిరుండ

        సూరనాఖ్యుండ సత్త్వసంశోభితుండ.(ఉ.నో.15.ప. 1.ఆ.)

 

పై పద్యంలో కవి తనది కౌండిన్య గోత్రమని, నారనమంత్రి అక్కాంబలకు పుత్రుడని, కిసనాఖ్యుడు, కూననాహ్వయుడు అనే ఇద్దరికి తమ్ముడని చెప్తూ విష్ణుమూర్తిని సేవించేవాడని, విష్ణుమూర్తి దయవల్ల కావ్యంలో నిష్ణాతుడయినట్లు, బంధువులను గౌరవించే సూరన సత్త్వగుణ శోభితుడని చెప్పుకున్నాడు.

 

ఉదయనోదయంలో కొన్ని పద్యాలు అసంపూర్తిగా వున్నాయి. ఇవి పూర్తిగా ఉంటే ప్రబంధం ఇంకా రసవంతంగా ఉండేది. అయితే  ఉదయనోదయంలోని అవతారికా పద్యగద్యములందు అధికభాగంను, ఆశ్వాసాద్యంత పద్యములను సూరన కుమారుడగు నారన రచించాడు.

 

ఉదయనోదయ- నామౌచిత్యము:

ఉదయనోదయం  ౫ ఆశ్వాసాల శృంగారస ప్రధానమైన ప్రబంధం. ఇందులో కథానాయకుడైన ఉదయనుని కథా, అతని జన్మకు కారకుడైన సహస్రానికుని గాధ వర్ణించబడ్డాయి. మను చరిత్రలాగా ఈ ఉదయనోదయాన్ని ౨ భాగాలుగా చేయవచ్చు. మొదటిభాగం సహస్రానికుని చరిత్ర, రెండవభాగం ఉదయనుని ఉదయము, అభ్యుదయము. దీనికి మూలము సోమదేవుని సంస్కృత కథాసరిత్సాగరం. ఉదయనోదయంలో కొన్ని ఉపకథలు, సహస్రానికుని కథ ఉన్ననూ వాటికి ప్రధాన కథతో సంబంధం ఉండడంవల్ల వస్త్వైక్యం కనిపిస్తుంది. ఉదయనోదయంలో ప్రధాన సన్నివేశం ఉదయనుని వివాహము. దీనికి పరస్పర సంబంధం కల సంఘటనలు అనేకం ఉన్నా వాటిని ప్రధాన కథకు అన్వయించి రచన చేశారు కవి. ద్వితీయాశ్వాసంలో నాయకుడు ఉదయించినట్లు ఈవిధంగా తెలిపాడు.

కం.   ఉదయాచల శిఖరంబున

       నుదయించుట జేసి వీనికుచితము నామం

       బుదయనుడని  యవ్వేళను

       విదితంబుగ దివ్యవాణి వినిపించె దగన్. (268.ప.ఉ.నో.2.ఆ.) 

పై పద్యంలో సహస్రానికుని భార్య మృగావతి ఒక శుభముహూర్తంలో ఉదయాచల పర్వతంలో శిశువుకు జన్మనివ్వడంవల్ల ఇతనికి ఉదయనుడు అనే నామం పెట్టడం ఉచితమని ఆకాశవాణి పలికింది. ఈ ప్రబంధంలో కథ మొత్తం దాదాపుగా ఉదయనుని పుట్టుక, అభివృద్ధికి సంబంధించిన విశేషాలుండడంవల్ల ఈ ప్రబంధంకు ఉదయనోదయము అనే పేరు సార్థకమయింది. అలాగే కథాప్రారంభానికి ముందు కవి ఈ ప్రబంధానికి గల ప్రధాన ప్రయోజనం, ఉద్దేశంను ఈ విధంగా తెలిపాడు.

 

అభ్యుదయపరంపరాభివృద్ధియునభిమతార్థ సిద్ధియుంగా నాయొనర్పంబూనిన ఉదయనోదయంబను మహాప్రబంధంబు.

అభి+ఉదయం= ఆభ్యుదయం. కావున అభి+ఉదయం=ఉదయనునికి సంబంధించిన అభ్యుదయాన్ని సూచించాడు సూరన.

 

ఉదయనోదయ ఇతివృత్తం: 

ఉదయనోదయ కథ నగర వర్ణనతో ప్రారంభమవుతుంది. ఉదయనుడి తండ్రి సహస్రానికుడు. ఇతడు పాండవ వంశీయుడు. అంటే ఇతని ముత్తాత అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు,  ఇతని కొడుకు పరిక్షిత్తు, అతని పుత్రుడు జనమేజయుడు, ఇతని కొడుకు శతానీకుడు, ఇతని కొడుకు సహస్రానీకుడు, ఇతని పుత్రుడు ఉదయనుడు.

 

అయితే ఈ ప్రబంధంలో సూరన  సహస్రానీకుని వివాహం ఆతర్వాత ఉదయనుని పుట్టుక, పట్టాభిషేకం, రాజ్యాలను జయించడం, వర్ణించాడు.

 

ఉదయనునికి వేట అంటే చాల ఇష్టం. ఒక రోజు వేటకు వెళ్లి వీణ వాయిస్తూ అడవిలో చాల దూరం వెళ్లాడు ఆ సమయంలో అతని వెంట సైన్యం లేదు. చండమహాసేనుడు అవంతి రాజు. ఇతడు చాలా కాలం నుండి తన కూతురైన వాసవదత్తకు వీణ నేర్పడానికి ఉదయనుడే తగినవాడని భావించగా అతను ఒప్పుకోకపోగా పట్టి తేవాలనుకున్నాడు. ఉదయనుడు ఒంటరిగా వేటకు వెళ్లాడని తెలిసి అతనిని బంధించడానికి మాయా గజాన్ని చెక్కతో తయారు చేసి, దానిలో భటులను ఉంచి అడవిలో వదిలి పెట్టాడు. వీణా వాదంలో పరవశుడైన ఉదయనుడు అది నిజమైన గజమని నమ్మి దాని వెంట చాలా దూరం వెళ్లి అక్కడ అయోమయ పరిస్థితిలో భటులకు చిక్కి,  బందీయై అవంతీ రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ వాసవదత్తకు వీణ నేర్పడంలో నిమగ్నమౌతాడు.ఈ విషయం తెలిసిన ఉదయనుని మంత్రి యౌగంధరాయణుడు ఉదయనుని విడిపించడానికి ఉపాయం ఆలోచించి తనతో పాటు విధూషకునికూడ వెంట తీసుకొని అవంతికి బయలుదేరతాడు.

 

యౌగంధరాయణునికి మయా విద్యలు తెలుసు కావున తను మాయారూపంలో ఉదయనుని దగ్గరకు వెళ్లి సంకెళ్లను తెంచే ఉపాయాన్ని చెప్పి,  అలాగే వాసవదత్త ఉదయనుని వెంట రావటానికి వీణా తంత్రులలోమార్పులు చేశాడు. తమ పథకాన్ని ఉదయనునికి వివరించి అనుమతి పొందుతాడు. ఉదయనునిపై అమిత ప్రేమ, నమ్మకం గల వాసవదత్త భద్రావతిని అర్ధరాత్రి కౌశాంబి వైపు నడవమని ఆదేశిస్తుంది. ఈ విధంగా ఉదయనునితోపాటు వాసవదత్త కూడ వింధ్యాటవిని చేరతారు. వాసవదత్తాపహరణం జరిగిందని తెలిసి చండమహాసేనుడు తన కుమారుడైన గోపాలకుడిని వాసవదత్తా ఉదయనుల వివాహానికి అంగీకరిస్తు ధన, కనక, వస్తు, వాహనాలతో పంపుతాడు. ఈ విషయం తెలిసి వాసవదత్త ఎంతో సంతోషించింది. ఆ తర్వాత యౌగంధరాయణుడు చతురంగ బలాలతో స్వాగతం పలుకగా వాసవదత్తా సహితుడై ఉదయనుడు కౌశాంబికి చేరుకుంటాడు. అది విని పురజనులు సంతోషిస్తారు. అక్కడ అంగ రంగ వైభవంగా ఉదయన వాసవదత్తాల వివాహం జరిగింది. వారు సుఖంగా కాలం గడుపుతున్నారు. ఇది ఉదయనోదయ కథ సంక్షిప్తంగా.

ప్రబంధ వర్ణనలు:

ఈ ప్రబంధంలో కవి అష్టాదశవర్ణనలతోపాటు  ప్రకృతి వర్ణనలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తుంది.

ఊయల ఊగే కన్య అందాలను ప్రకృతితో  ఉపమించాడు.

 

సీ.    కట్టిన పూవన్నె పుట్టంబు కెంజాయ

            కమనీయ సాంధ్యరాగంబుగాగ

ముడివేడి వ్రేలు కొమ్ముడి సోగ వెండ్రుకల్

            కడలొత్తు చిమ్మ చీకటులుగాగ

     నురువడి నూగుచో నుప్పరం బెగయు ము

            క్తాహారములు తారకములుగాగ

     నిగుడు కాంతుల తోడ నెమ్మోము నెత్తమ్మి

           పరిపూర్ణ చంద్రబింబంబు గాగ.

తే.గీ. వికచ లోచన రుచులు చంద్రికలుగాగ

    యామవతియను విచికిత్స నావహింప

       నతివ యొక్కర్తు తీగ యుయ్యాల నూగె

      నింపు లిగు రొత్తు నొక పొదరింటిలోన. (ద్వి.ఆ.46.ప.)

 

కవి ఇక్కడ ప్రకృతితో స్త్రీని ఉపమించడానికి బదులు ఆమె కట్టిన  కెంజాయరంగు వస్త్రం సాంధ్యారాగమని, ఉయ్యాల ఊగినప్పుడు చెదిరిన వెంట్రుకలు చీకటని, కదిలిన హారములోని ముత్యాలు తారకలని, ముఖమే చంద్రబింబమని, కంటిమెరుపులే చంద్రికలని, స్త్రీ అందాలతో ప్రకృతిని ఉపమించి, ప్రకృతి స్త్రీ వేరు కాదనే అంతరార్ధాన్ని బోధించాడు.

 

పాత్రచిత్రణ; సహస్రానీక వర్ణనం:

 

సీ. ఎవ్వాని పటుహేతి కెదిరి పాఱక నిల్చి

               పోరురాజన్యులు బారిగొఱియ

    లెవ్వాని భుజశక్తి కిభ కిరి ఫణిపతుల్

               ప్రాపాసవడియున్న బంధువర్గ( 1-105)

 

............................ ఇత్యాదిగా గల పద్యంలో సహస్రానీకుని గొప్పతనాన్ని కవి వర్ణించాడు.

 

పై పద్యం భారతంలో తిక్కన పద్యంను పోలి ఉంది చూడండి.

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడుగు

ఎవ్వాని చరిత్ర మెల్ల లోకములకు, నొజ్జయై వినయంబు నొఱప గఱపు....

నెవ్వాని కడకంట.........విరాట.2._191.ప. 

ఈ పద్యంను సూరన అనుసరించడం వల్ల పాండవుల వైభవాన్ని కీర్తిని, సహస్రానీకుడు స్థాపించాడని కవి సూచించాడు.

 

రస నిర్వహణ:

చండమహాసేనుని వద్ద బంధీయైన ఉదయనుడు వాసవదత్తకు గురువై వీణ నేర్పడానికి అంగీకరిస్తాడు. ఆ సమయంలో వాసవదత్తా వీణ నేర్చుకోవడానికి వస్తుంది. ఆమెను చూసిన ఉదయనుని మనసులో కలిగిన విభావాలను సూరన ఈవిధంగా వర్ణించాడు.

సీ.   శృంగార పవనంబుచేత కంపితయైన

              లలితమన్మధ వార్ధిలహరి వోలె

        భ్రుకటి వీచి హార భూరి డిండీరయై

                  తనరు వీత గ్రాహ తటిని వోలె....చతుర్ధాశ్వాసం.59.ప.

ఇత్యాదిగా  వర్ణించాడు.

ఛంధస్సు- అలంకారాలు

మ. కటనిర్యన్మదసౌరభంబుల దిశాగధద్విపశ్రేణి నొ

    క్కట వైముఖ్యమునొంద జేయుచు గడంకన్ మీఱు మత్తేభ మొ

    క్కటి శైలాకృతితో నడాగిరిసమాఖ్యం దాల్చి లీలాహవ

    స్ఫుటరంగంబుల నమ్మహా వభునకుం జూపుం జయోల్లాసముల్ 3-118.

 

పై పద్యంలో చండమహాసేనుని వద్ద నున్న నడాగిరి అనే ఏనుగు గొప్పతనాన్ని గురించి యౌగంధరయణుడు ఉదయనునితో చెప్తున్నాడు.ఇక్కడ  ఏనుగును గురించి మత్తేభ విక్రీడితంలో వర్ణించటం విశేషం.

అలంకారాలు:

కవి ప్రబంధంలో సందర్భాన్ని బట్టి అలంకారాలను ఉపయోగించాడు.

సీ. మదన రాకేందువదన కుంతలములు

                భ్రమరంబులకు బ్రోచు బలగ మౌట......61.ప.2.ఆ.

 

పై పద్యంలో ఆ స్త్రీ వెంట్రుకలు తుమ్మెదలకు  బలగం వలే ఉన్నాయి అని కవి భావం. కావున ఇది ఉపమాలంకారానికి ఉదాహారణ అని చెప్పవచ్చు.

అలాగే సూరన రతి బోడి, పూబోడి, మొ... పదాలను విచ్చలవిడిగా వాడెను. రతిబోడి... ఉ.నో.2-176, 4-102,5-39.

బహువ్రీహిని స్త్రీ వాచ్యంబగుచో ఉపమానం మీది మేనునకు బోడి యగుఅని బాలవ్యాకరణంలో చెప్పబడింది. ఇక్కడ రతిబోడి లో రతి శబ్దం తత్సమం. దీనిని సూరన విరివిగా వాడెను.

 

ఈవిధంగా ఉదయనోదయంలోమహాభారత,రామాయణాలలోని కథను స్వీకరించకుండ  సంస్కృతంలోని కథాసరిత్సాగరం లోని ద్వితీయ లంబకంలో కథను స్వీకరించి అష్టాదశ వర్ణనలతో పెంచి ప్రబంధంగా తీర్చిదిద్దాడు. ఈ ఉదయనోదయ కథను మొట్టమొదటి సారిగా స్వీకరించింది సూరననే.

oooo

Bio

పావని

పావని గారు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో తెలుగు సాహిత్యం లో పి.హెచ్.డి. చేయుచున్నారు

Mani vadlamani
Comments
bottom of page