top of page

సంపుటి 1    సంచిక 4

వ్యాస ​మధురాలు

నన్నయ కవిత్వంలో సామాజిక సందేశం

హరిత భట్లపెనుమర్తి

madhuravani.com అంతర్జాల పత్రిక  నిర్వహించిన  వ్యాస పోటీ లో బహుమతి సాధించిన వ్యాసం

ప్రాచీన సాహిత్యం మాటెత్తడమే అభివృద్ధికి నిరోధకంగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వాడైన నన్నయ రచనలో సామాజిక సందేశం వెతకబూనటం సాహసాస్పదమే! అయితే రచన విలువ అదే కాలంలో పురుడు పోసుకుందన్నదాన్ని బట్టి కాక, అదేం ప్రబోధించిందన్న విషయాన్ని బట్టి ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుచేత, ప్రాచీనమయినదేదీ నేటికి పనికి రాదని, ఆధునికమంతా శిరోధార్యమనీ భావించటానికి లేదు.

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు ఇతిహాసం, దానిని అక్షరబద్ధం చేసే సాహిత్యంలో కంటే గొప్పగా ఇంకెక్కడా దొరకవు. రామాయణ మహాభారతాలు భారతీయేతిహాసాలు. అవి ఎన్నో అమూల్యమైన వ్యక్తిత్వ వికాస పాఠాలను అందించిన విలువైన గ్రంథాలు. రామాయణంలో ఆదర్శ సమాజ చిత్రణ జరిగితే, మహాభారతంలో సజీవ పాత్ర చిత్రణ జరిగింది. అందునా తెలుగు భారతంలో అడుగడుగునా సజీవత తొణికిసలాడుతుంది. అందుకనే సగటు తెలుగువాడు కూడా “తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి” అనేంతగా భారతంతో మమేకం చెందగలిగాడు. తెలుగు సాహిత్యంలో ఎన్నో రీతులకు, రివాజులకు, మరెన్నో ప్రక్రియలకు ఆద్యుడైన నన్నయ, సాహిత్యాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తున్న నేటి ఆధునిక కవులందరికీ కూడా గురుతుల్యుడు. తన భారతాన్ని “జగద్ధితంబుగ” వెలయింపజేసి, ఈ క్రమంలో తను రాసిన ప్రతీ ఘట్టంలోనూ మానవాళికి సందేశాన్ని అందించాడు. “లోనారసి” చూడగలిగినవారికి నన్నయ అంతరార్థం బోధపడుతుంది.

రాజసూయ యాగ నిర్వహణ అనే సభాపర్వ ఘట్టం ఎన్నో అమూల్యమైన వ్యక్తిత్వ వికాసపాఠాలను అందిస్తోంది. ఆ పాఠాలను “నన్నయ కవిత్వంలో సామాజిక సందేశం” అన్న పేరుతో ఈ పరిశోధన పత్రంలో వెలికితీసే ప్రయత్నం చేస్తాను. రాజసూయం చేయడం మంచిదా? కాదా? అన్న చర్చను పక్కన పెడితే, ఒక వ్యక్తి రాజసూయం వంటి ఒక దుర్లభమైన కార్యాన్ని తలపెట్టి దానిని నిర్విఘ్నంగా పూర్తి చేసిన క్రమంలో మనం నేర్చుకోదగ్గ పాఠాలేమిటి అన్న అంశాన్ని మాత్రమే ఈ పత్రం పరిధిలోకి తీసుకుంటున్నాను.

ధర్మరాజు తాము ఇంద్రప్రస్థంలో నిర్మించుకున్న రాజ్యాన్ని సుఖంగా పరిపాలిస్తున్న కాలంలో ఒకనాడు నారద మహర్షి వచ్చి, పాండురాజు కోరికగా రాజసూయయాగం చేయమని ధర్మరాజుకు సూచిస్తాడు. అయితే ఈ సూచనతో పాటుగా ఒక మెలిక కూడా పెడతాడు. బహువిఘ్నప్రదమైన ఈ యాగం పూర్తయ్యాక ప్రజాప్రళయ కారణమైన రణం ఒకటి సంభవిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. తండ్రి చెప్పడంవలనో లేక ఇంతకు మునుపే తనకా తలపు ఉండడంవలనో ఏ కారణం వల్లనైతే నేమి ధర్మరాజు రాజసూయం చేయడానికి నిశ్చయం చేసుకుంటాడు. అయితే ఒక్కరే కూర్చుని ఏ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోకూడదని పెద్దలంటారు. ఇదే అంశాన్ని విదురనీతిలో భాగంగా విదురుడి ముఖతా తిక్కన కూడా చెప్పిస్తాడు.

విను మధురాహారంబులు
గొనుటయుఁ బెక్కఁడ్రు నిద్రగూరినయెడ మే
ల్కని యునికియుఁ గార్యాలో
చనముఁ దెరువు నడుచుటయును జన దొక్కనికిన్ (4-2-38)

ఒక్కరే కూర్చుని ఆలోచించినప్పుడు తట్టని విషయాలెన్నో ప్రాజ్ఞులతో కలిసి చర్చిస్తునప్పుడు స్ఫురణకు వస్తాయి. విభిన్న దృక్కోణాలు బయటకు వస్తాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఉత్తమమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుంది. ఈ సూక్ష్మం తెలిసినవాడు కనుక ధర్మరాజు వెంటనే మంత్రులను పిలిపించి వారి సలహా కోరతాడు.

పితృ గణహితార్థముగ స
త్క్రతు వొనరింపంగ బుద్ధి గలదు ప్రజాసం
హృతి తత్క్రతువున నగు నని
మతి నాశంకయును గలదు మానుగ నాకున్ (2-1-96)

“ఏమి సేయుదు” అని మంత్రి పురోహితవర్గంతో తన సంశయాన్ని చెప్పి, వారినుండి యాగం చేయడానికి అనుమతిని పొందుతాడు.

ధర్మరాజు స్వయంగా గొప్ప జ్ఞాని. మాయాజూదంలో కౌరవులు పాండవులను ఓడించి దాసులను చేసిన సందర్భంలో, ద్రౌపది తన దాసీత్వం గురించిన ధర్మసందేహాన్ని సభలో అడిగినప్పుడు, భీష్ముడంతటి సర్వజ్ఞుడు కూడా,  “ఈ సభలో నీ సందేహం తీర్చగలిగినవాడు ధర్మరాజు మాత్రమే. అతనే చెప్పలేని నాడు ఈ ధర్మసూక్ష్మం మరెవరికీ అర్థం కాదు”అంటాడు.  అంతటి ప్రాజ్ఞుడిగా వినుతికెక్కిన ధర్మరాజు సైతం ఒంటిగా కార్యాలోచన చేయలేదు. దీన్ని బట్టి ఎంతటి వివేకజ్ఞుడైనా, మనిషి తనను మించినవాడు లేడనే అహం వదిలి, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు విజ్ఞులైన పెద్దలతో చర్చించి నిర్ణయించుకోవాలి అని తెలుస్తోంది.

ఆ విధంగా మంత్రి పురోహితులతో చర్చించి, వారి ఆమోదం మేరకు రాజసూయం చేయాలని నిర్ణయించుకున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని పిలిపిస్తాడు.

కార్యసాధకుడి లక్షణం ప్రభావశీలురైనవారి స్నేహాన్ని సంపాదించడం, ఆ స్నేహాన్ని అవసరమైన సందర్భం వచ్చినప్పుడు తగువిధంగా వాడుకోవడం. శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. ధర్మరాజును మించిన కార్యసాధకుడు. అన్నిటినీ మించి పాండవులకు శ్రేయోభిలాషి, ఆత్మీయుడు. ఇటువంటి సందర్భాల్లో అతడి సలహా చాలా ప్రయోజనకారిగా ఉంటుంది.

చాలామంది విద్యార్థులు పోటీపరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు. వారు తమ శక్తియుక్తులన్నీ వినియోగించి, కష్టపడి చదువుతారు కాని ఉత్తీర్ణులు కాలేకపోతారు, అంటే కష్టపడి పని చెయ్యడమొక్కటే సరిపోదని మనకు అర్థమవుతుంది. ఎంత కృషి చేయాలో తెలియడమే కాదు ఎలా కృషి చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఒక పరీక్షలో సఫలం కావాలనుకునేవారు ఆ పరీక్షను ఇంతకుముందు రాసి, ఉత్తీర్ణులైనవారితో మాట్లాడాలి. వారెలా సంసిద్ధులయ్యారో తెలుసుకోవాలి. గత పరీక్ష ప్రశ్నాపత్రాలు సేకరించి ప్రశ్నలెలా వస్తున్నాయో చూడాలి. ప్రస్తుత పరీక్షా విధానమేమిటో తెలుసుకోవాలి. అంటే ముఖ్యంగా ఆ పరీక్షకు సంబంధించిన చరిత్ర, వర్తమానం తెలిసి ఉండాలి లేదా అవి తెలిసినవాళ్ళతో మాట్లాడాలి.

అదే చేశాడు ధర్మరాజు. రాజుల చరిత్ర, వర్తమాన రాజకీయ పరిస్థితులు తెలిసిన నిష్ణాతుడు శ్రీకృష్ణుడు. అతడిని పిలిపించి విషయం తెలియబరుస్తాడు ధర్మరాజు. ఈ కాలంలో “కమ్యూనికేషన్ స్కిల్స్” నేర్పడానికి ప్రత్యేకంగా కొన్ని శిక్షణ కేంద్రాలు వెలిసాయి. కాని మహాభారతం క్షుణ్ణంగా చదివి వంటపట్టించుకున్నవారికి వేరే సంభాషణా తరగతులు నిర్వహించవలసిన పని లేదు.  ఇక్కడి నుండి ధర్మరాజు, శ్రీకృష్ణుడు - వీరి  సంభాషణలను నిశితంగా గమనిస్తే వారి సంభాషణా చతురత ఎంత గొప్పదో, అది కార్యసాధనలో ఎంతగా ఉపకరిస్తుందో అర్థం అవుతుంది.

ధ్యేయుఁడవు సకల లోక
స్థేయుండవు నమ్రులకు విధేయుఁడవు నయో
పాయజ్ఞుఁడ విజ్జగముల
నీ యెఱుఁగని యవియుఁ గలవె నీరజనాభా (2-1-106)

 “వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్” అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక పనికి సక్రమమైన ప్రారంభం లభిస్తే సగం పని పూర్తయినట్లేనని దానర్థం. కృష్ణుడు వంటి వ్యవహారకుశలుడిని సంప్రదించి, పనిని సక్రమంగా మొదలుపెడితే ఇకది దిగ్విజయమై పోయినట్లే. అయితే ధర్మరాజు కృష్ణుడిని పిలిపించడమైతే పిలిపించాడు కాని తాను చెప్పబోయేది చాలా సున్నితమైన అంశం. రాజసూయం చేయాలంటే రాజులందరినీ జయించి, వారినుండి కప్పం వసూలు చేయాలి. ఆ రాజులందరిలో కృష్ణుడు కూడా ఉంటాడు. అతడు కూడా కప్పం కట్టాల్సి ఉంటుంది. కనుక నేరుగా రాజసూయం చేస్తానని అనలేడు ధర్మరాజు. కృష్ణుడు చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకని ముందుగా కృష్ణుడిని సమయోచితమైన మాటలతో ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. ఆ సందర్భంలోని ఈ పద్యంలో వేసిన ప్రతీ విశేషణం సమయోచితమైనదే.

“‘ధ్యేయుడవు’ – ఒక ధ్యేయం కలిగినవాడివి నువ్వు. నేనూ ఒక ధ్యేయంతో నిన్ను ఇక్కడకు పిలిచాను. ‘సకల లోక స్థేయుడవు’ – ప్రపంచానికంతటికీ హితం కోరేవాడివి. నేను తలపెట్టిన రాజసూయం కూడా లోకహితకరమైనదే. ముఖ్యంగా ‘నమ్రులకు విధేయుడవు’ – నమ్మినవారికీ, నమ్రతతో వేడినవారికీ లొంగి ఉంటావు. నేను కూడా నిన్ను నమ్ముకున్న వాడినే.  వినయంతో ప్రార్థిస్తున్నాను కనుక నాకు కూడా విధేయుడవై ఉండు. నిన్ను పిలిచిన ముఖ్యమైన కారణం నీవు “నయోపాయజ్ఞుడ”వని. అంటే రాజనీతిలో నిన్ను మించినవాడు లేడు కనుక నీ సలహా నాకు కావాలి ఎందుకంటే ఈ లోకంలో ‘నీ యెఱుఁగని యవియుఁ గలవె’ - నీకు తెలియనివి లేవు. ప్రస్తుతం నేను రాజసూయానికి సంకల్పించుకున్నట్లుగా నీకు ఈ పాటికి తెలిసే ఉండాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేను రాజసూయం చేయడానికి అనుకూలంగా ఉన్నాయో లేవో కూడా నీకు తెలిసే ఉండాలి”. ఈ చిన్ని కందపద్యంలో ఇంత గూఢార్థాన్ని పొందుపరిచాడు నన్నయ.

పాండుమహీపతి పనిఁజేసి నారద ముని వచ్చి వీ రెల్ల వినుచు నుండ
రాజసూయంబు తిరంబుగాఁ జేసి నీ పితృపితామహులకు హితము సేయు
మని పంచె నన్ను నెయ్యముననో నాకట్టి బలము సామర్థ్యంబుఁ గలుగు టెఱిఁగి
పంచెనో తత్క్రతు ప్రారంభమున కొడం బడితి వీరిందఱుఁ గడఁగి దీని

నిత్యసత్యవచన నిపుణనిర్మలబుద్ధి
నిర్ణయించి పనుప నీ నియోగ
కాంక్ష నున్నవాఁడఁ గమలాక్ష యనిన ధ
ర్మాత్మజునకు నిట్టు లనియెఁ జక్రి (2-1-108)

ఇక నేరుగా విషయంలోకి వచ్చేశాడు ధర్మరాజు. “పాండుభూపాలుడు పంపితే నారదుడు వచ్చి ‘వీరెల్ల వినుచు నుండ’ రాజసూయం చేయమని నన్ను ఆదేశించాడు. నాకొక్కడికీ ఏకాంతంలో చెప్పలేదు. వీళ్ళందరూ వింటూండగానే చెప్పాడు కనుక ఈ ఆలోచన నాదనుకోవద్దు. నా మీద స్నేహంతో అలా అన్నాడో లేక నాకటువంటి సామర్థ్యముందని తెలిసే అన్నాడో నాకైతే తెలియదు. వీళ్ళందరూ కూడా అదే అభిప్రాయంతో ఉండడం వలన నేనూ అందుకు ఒప్పుకున్నాను. కాని నాదేముంది! నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటాను”.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత ఇక్కడ గుర్తుకుతెచ్చుకోవాలి. ఎటువంటి అసాధ్యమైన కార్యాన్నైనా మాట నైపుణ్యంతో సాధించగలమని గుర్తుంచుకుని ప్రతీ వ్యక్తీ వాక్చాతుర్యాన్ని పెంపొందించుకోవాలని పాఠం. కనుక మహత్తరమైన మాట నేర్పరితనాన్ని ప్రదర్శించి శ్రీకృష్ణుడి చేత “నువ్వే రాజసూయ యాగం చేయడానికి సమర్థుడివి” అనిపిస్తాడు ధర్మరాజు.

ఇక్కడ మనం రెండవ కార్యసాధకుడి గురించి మాట్లాడుకుందాం. ధర్మరాజు రాజసూయం చేయాలని నిశ్చయించుకున్నట్లుగా కృష్ణుడికి అర్థం అవుతోంది. అతనికి జగదేకవీరులైన తమ్ముళ్ళ అండ ఉంది. కనుక ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేసుకోగలడు. తన ఒప్పుకోలుతో నిజానికి ధర్మరాజుకు పని లేదు. యాగం సానుకూలం కావడంలో మాత్రమే తన సలహాను కోరాడు. అయితే ఈ కార్యంవల్ల తనకు ఒనగూరే మేలు కూడా ఉంది - తనకు ఎంతో కాలంనుండి కొరకరాని కొయ్యగా ఉన్న జరాసంధుడిని వంగదీయటం. సాధారణ పరిస్థితుల్లో, ఎంతటి ఆత్మీయులైనా పాండవులను పిలిచి, తనను ఇబ్బంది పెడుతున్న కారణంగా మరొక రాజును నిర్జించమనడం సబబుగా ఉండదు. కాని ఇప్పుడు దానికి అనువైన పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడే తన చాతుర్యాన్ని, రాజనీతిని ప్రదర్శింపజేశాడు కృష్ణుడు. తన శత్రువును తమందరికీ సమిష్టి శత్రువుగా చిత్రింపజేశాడు.

ముందుగా ధర్మరాజుకి ఎన్ని రాజవంశాలున్నాయో వివరించాడు. తరువాత ఆయా రాజులంతా ఇప్పుడు జరాసంధుడి చెరలో ఉన్నారని చెప్పాడు. అంటే ఒక్క జరాసంధుడిని జయిస్తే ఆయా రాజులంతా ఇక వారి ఆధీనంలో ఉన్నట్టే అని స్థాపించాడు.

తరువాత తనకు జరాసంధుడితో కలిగిన వైరాన్ని గురించి ప్రస్తావించాడు. ‘వానితోడి వైరంబు బలవంతంబైన నమ్మధుర నుండ నొల్లక కుశస్థలంబునకు వచ్చి రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించికొని భవదాశ్రయంబున సుఖంబున్నవారము’ – “వాడితో పడలేక నీ ఆశ్రయంలోకి వచ్చి ఉంటున్నాం”.

ఆ పై జరాసంధుడు లోకకంటకుడై రాజులందరినీ చెరలో పెట్టి భైరవపూజ పేరుతో రోజుకొకరిని చొప్పున బలి ఇస్తున్నాడని చెప్పి అతడి దుర్మార్గాన్ని నిరూపించాడు.

ధర్మరాజు తన పనికోసం పిలిపిస్తే, అందులో తెలివిగా తన సొంత పనిని విడదీయడానికి వీలు లేకుండా ఇరికించాడు. కాదనలేని కారణాలు చూపించాడు. మరలా ఇది నీకోసమే సుమా అంటూ చివర్లో ముక్తాయింపు ఇచ్చాడు.

ధరణీశ! వానిఁ జంపుడు
నురుతర సామ్రాజ్య విభవ మున్నతితో సు
స్థిరమగు నీకును మఱి భా
సురముగ సమకూరు రాజసూయము సేయన్ (2-1-120)

“జరాసంధుడిని చంపితే గొప్పదైన సామ్రాజ్య విభవం నీకు సుస్థిరమౌతుంది. అంతే కాక రాజసూయం కూడా నీకు సులభసాధ్యమవుతుంది”. మరి తానే జయించలేకపోతే ధర్మరాజెలా జయించగలడని సంశయిస్తాడేమోనని ధర్మరాజు గుణగణాలను, సామర్థ్యాన్ని పొగిడి అతడి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేశాడు.  త్రిలోకవీరులైన తమ్ముళ్ళుండగా సాధ్యం కానిదేముందని పని సాధించే మార్గం చూపించాడు.

ఎంత పొగుడుతూ తెలివిగా తన పనిని అందులో జొప్పించినా, తననుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాడు కాడు ధర్మరాజు. అందుకనే వెంటనే ఒప్పేసుకోలేదు.

దనుజాహిత నీ కాహవ
మున నెదిరి మహోగ్ర దహనమునఁ బడియును గా
లని మిడుత వోలె నతికో
పనుఁడు జరాసంధుఁ డెట్లు బ్రదుకఁగ నేర్చున్ (2-1-133)

“నీతో వైరం పెట్టుకున్న వాడెవడైనా బ్రతికి బట్ట కట్టడం సాధ్యమా? ఇక వాడి పని ముగిసినట్లే. సరే కాని నీ అంతటి వాడికే లొంగలేదంటే వాడికేదో చరిత్ర ఉండే ఉండాలి. ఏదో అసాధ్యమైన వరమో, బలమో ఉండే ఉండాలి. వాడి కథేమిటో చెప్ప”మన్నాడు ధర్మరాజు. అజేయ బలపరాక్రమాలున్న సోదరులున్నా ముందు పగవాడి చరిత్ర తెలుసుకోనిదే రంగంలోకి దూకలేదు ధర్మరాజు.

కనుక ఎంతటి శక్తిసంపన్నులైనప్పటికీ కార్యానికి సంబంధించిన పూర్వాపరాలను, సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించనిదే ముందుకు వెళ్ళకూడదనేది ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం.

కృష్ణుడుచేత జరాసంధుడి చరిత్రను చెప్పించుకుని తద్వారా అసలైన కీలకం తెలుసుకున్నాడు ధర్మరాజు. అతడికి ఏ ఆయుధంవలనా చావు లేనట్లుగా పరమేశ్వరుడి వరప్రసాదం ఉంది. కనుక శ్రీకృష్ణుడి చక్రాయుధం కూడా జరాసంధుని ఏమీ చేయలేదు. మహాబలశాలి అయిన భీముడే జరాసంధుడిని మల్లయుద్ధంలో చంపాలి. భీముడికి మల్లయుద్ధంలో తిరుగులేదు కనుక జరాసంధుడి విషయంలో భయపడాల్సిన పని లేదు. ఆవల కృష్ణుడు కూడా

తడయక యేఁగి నీతి బలదర్పము లొప్పఁగ వాని డాసి క
వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం
గడిఁది రిపున్ జయింతుము జగన్నుత నన్నెద నమ్ముదేని యి
ల్లడ యిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్ (2-1-164)

“సరేలే! తరువాత చూద్దాంలే” అనడానికి అవకాశమివ్వకుండా “వెంటనే నా వెంట భీమార్జునులను పంపు. నేను వాళ్ళతో కూడా వెళ్ళి నీ(నా) కార్యాన్ని సిద్ధింపజేసుకుని వస్తాను” అని చెప్పి మళ్ళీ కాదనడానికి వీలు లేకుండా, “నన్ను నమ్మినట్లైతేనే పంపు. లేకపోతే వద్దులే” అని ధర్మరాజును తొందరపెట్టి, భీమార్జునులను వెంటపెట్టుకుని స్వయంగా దగ్గరుండి భీముడిచేత జరాసంధుడిని చంపించాడు – ఇక్కడితో ఒక కార్యసాధకుని పని పూర్తయింది.

మరి ధర్మరాజుది అప్పుడే మొదలయింది. కృష్ణుడు ఏదో మాటవరసకు చెప్పాడు కాని జరాసంధుడిని చంపినంతమాత్రాన రాజులనందరినీ జయించినట్లు కాదు. రాజసూయం చేయాలంటే నాలుగు దిక్కులు గెలవాలి. తనకు స్వంతంగా అంత సామర్థ్యం లేకపోవచ్చు. కాని తనమాటే వేదవాక్కుగా భావించే అతిలోకవీరులయిన నలుగురు తమ్ముళ్ళున్నారు. వారిని నియోగించి, పని సాధించాడు. తన తమ్ముళ్ళను నియోగించడంలో కూడా చాలా తెలివిగా వ్యవహరించాడు.

భీముడిని తూర్పు దిక్కుకు పంపాడు. తూర్పు దిక్కులో రాజులందరికీ అప్పటివరకు జరాసంధుడు సింహస్వప్నంగా ఉండేవాడు. అటువంటి వాడినే చంపిన భీముడంటే ఇంకెంత భయముండాలి. భీముడెళితే అక్కడ పని సఫలమవుతుంది. అందుకని భీముడిని తూర్పుదిక్కును జయించుకురమ్మన్నాడు.

అర్జునుడిని ఉత్తరానికి పంపించాడు. అర్జునుడు జగద్విఖ్యాత పరాక్రమవంతుడు. దివ్యాస్త్ర సంపన్నుడు. దివ్యరథం కలిగినవాడు. ఉత్తరాన మార్గం సుగమం కాదు. ఆ మార్గాలలో వెళ్ళడానికి దివ్యరథారూఢుడైన అర్జునుడే కావాలి. అంతే కాక ఉత్తరంలో భగదత్తుడు వంటి లోకోత్తరవీరులున్నారు. వారిని జయించాలంటే కేవలం భుజబలమొక్కటే సరిపోదు. దివ్యాస్త్ర శక్తి సంపన్నత కల వీరులే కార్యాన్ని సాధించగలరు. కనుక అర్జునుడిని అటు నియోగించాడు.

సహదేవుడిని దక్షిణానికి పంపాడు. సహదేవుడు సకల శాస్త్ర పాండిత్యం కలిగినవాడు. మాహిష్మతీ పురంపై దండెత్తే సమయంలో అగ్నికీలలు సహదేవుడి సైన్యాన్ని చుట్టుకున్నప్పుడు, ప్రజ్ఞతో అగ్నిసూక్తం చదివి ఆపదనుండి గట్టెక్కగలిగిన నైపుణ్యం కలవాడు. దక్షిణాన కల నిషాదులను ఉక్కుపాదంతో అణిచివేయగల సామర్థ్యం కలవాడు. అది ఊహించే సహదేవుడిని దక్షిణదిశగా పంపాడు.

నకులుడిని పశ్చిమానికి నియోగించాడు. నకులుడు వినయశీలి. సౌమ్యుడు. కృష్ణుడు వినయవిధేయతలకే లొంగుతాడు తప్ప ఆవేశానికి కాదు. తెలివిగా, వినయంతో కృష్ణుడి వద్దనుండే కప్పం చెల్లింపజేసుకోగలిగే సామర్థ్యం నకులుడికే ఉంది. అలాగే మేనమామ, మహాబలశాలి అయిన శల్యునికూడా బలప్రదర్శన లేకుండానే జయించుకొచ్చాడు.

కనుక ఒక పనిని సాధించాలంటే పని చేయడానికి మనుష్యుల్ని పెట్టుకుంటే చాలదు. ఎవరెవరిని ఏయే పనులకు నియోగించాలన్న స్పష్టత కలిగి ఉండాలి.

ఈ విధంగా తమ్ముళ్ళ సాయంతో ధర్మరాజు దిక్కుల్ని జయించాడు. ఇక యాగమొక్కటీ మిగిలి ఉంది. యాగానికి పెద్దలనందరినీ ఆహ్వానించాడు. భీష్మాదులందరూ విచ్చేశారు. రాజసూయం చేయబోతున్నాడని ధర్మరాజు వారికి మునుపు ప్రత్యేకంగా సమాచారం పంపలేదు. కనుక వారు అన్యథాగా భావించకూడదు. వారిని కలుపుకుని పోవాలి. మళ్ళీ తన వాక్చాతుర్యానికి పని పెట్టాడు.

మీ యనుగ్రహమునఁ జేయంగఁ గడఁగితి
నిమ్మహాధ్వరంబు నెమ్మితోడ
దీని నిందఱును ననూనంబుగాఁ బూని
పెంపు మెఱసి నిర్వహింపవలయు (2-1-287)

“మీ అనుగ్రహం ఉండబట్టే ఇంత గొప్ప యాగం చేయగలుగుతున్నాను. మీరంతా పూనుకుని, పెద్దరికం వహించి ఈ యాగాన్ని నాచేత నిర్వహింపజేయాలి” అన్నాడు. అనడమే కాదు, వారు తమ పనేనని భావించేలాగ దుర్యోధన, దుశ్శాసనాదులతో సహా, కృప ద్రోణాచార్యులను, విదురుడిని, భీష్ముడిని ఎవరినీ విడిచిపెట్టకుండా నియోగించదగ్గ పనులలో నియోగించాడు.

ఈ కలుపుకుపోయే తత్త్వాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడు ఎవరితో ఏ పని పడుతుందో మనం ఊహించలేము. కనుక సాధ్యమైనంతవరకు నలుగురితో మంచిగా ఉండడానికే ప్రయత్నించాలి.

ఈ విధంగా యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సమయంలో తాతగారైన భీష్ముడు యాగాంతంలో సర్వసద్గుణసంపన్నుడైన వాడికి అర్ఘ్యమివ్వమని సూచించాడు. అన్నీ సజావుగా సాగి, యాగం ముగిసిపోయిందనుకున్న తరుణంలో ఈ సూచన ఒక ఉపద్రవం వంటిదే. సమస్త రాజన్యులు, బంధు మిత్రులు కొలువుతీరి ఉన్న సభలో అందరికంటే మేటి అని ఎవరిని పూజిస్తాడు. అలా చేస్తే మిగిలినవారు అలగకుండా ఉంటారా? అందుకనే తన అభిప్రాయం ఏదైనప్పటికీ ‘అట్టివాడెవ్వడు నాకెఱిఁగింపు’ అని కురువృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన తాతకే పని పెట్టాడు. భీష్ముడికి ఒకరి మెప్పుకోళ్ళతో పని లేదు. అందుచేత కృష్ణుడి పేరును ప్రతిపాదించాడు.

ఇంతజేసినా శిశుపాలుడి ఆగ్రహానికి గురికాక తప్పలేదు ధర్మరాజుకి. కృష్ణుడితో ఉన్న వ్యక్తిగత వైరం కారణంగా శిశుపాలుడు కృష్ణుడికి అర్ఘ్యప్రదానాన్ని వ్యతిరేకిస్తాడు. బంధుమిత్రులతో కూడి, యాగ మంటపంలోనే ధర్మరాజుతో యుద్ధానికి సన్నద్ధుడవుతాడు.

హిడింబాసుర, బకాసుర, జరాసంధాది మేటిబలవంతులను చంపిన భీముడికి శిశుపాలుడో లెక్క కాదు. అలాగే దివ్యాస్త్ర శక్తి సంపన్నుడయిన అర్జునుడికీ శిశుపాలుని చంపడం పెద్ద కష్టమైన పని కాదు. అయినా యాగానికని పిలిచిన ఆహూతులను తమ్ముళ్ళ చేత చంపించాడన్న అపకీర్తి వస్తుంది. కనుక కృష్ణుడిని దూషిస్తున్న శిశుపాలుడిని సంహరించాల్సినది బాధ్యత కృష్ణుడే తీసుకోవాలి. కాని స్వయంగా తానే చెప్పడం పద్ధతి కాదు.

గురుఁడని సమస్తలోకో
త్తరుఁడని నీకంటె వృద్ధతములైన నరే
శ్వరు లచ్యుతు నర్చననెడఁ
గర మభినందింప నీకుఁ గాదనఁ దగునే (2-2-20)

అని శిశుపాలుడిని ఊరుకోబెడుతున్నట్టే కనిపిస్తూ, కృష్ణుడిని మరింతగా తూలనాడేలా రెచ్చగొట్టాడు. ఆ పై, కాగల కార్యాన్ని గంధర్వులే నిర్వహించినట్లు శ్రీకృష్ణుడే శిశుపాలుడి పని పట్టేటట్లు చేశాడు. అది ధర్మరాజు లోకజ్ఞత, చాతుర్యం, కార్య నిపుణత.

ఈ విధంగా ఈ ఒక్క ఘట్టం నుండే మనం నేర్చుకోవలసిన వ్యక్తిత్వ వికాస పాఠాలెన్నో ఉన్నాయి. అవి మన నిత్యజీవితంలో అనువర్తింపజేసుకుంటే ప్రతీ ఒక్కరూ కార్యసాధకులు కావచ్చు.

 

ఉపయుక్త గ్రంథ సూచి

  1. నన్నయ. 2000. శ్రీమదాంధ్రమహాభారతం- సభాపర్వం. తితిదే ప్రచురణలు. తిరుపతి.

  2. తిక్కన. 2000. శ్రీమదాంధ్రమహాభారతం- ఉద్యోగపర్వం. తితిదే ప్రచురణలు. తిరుపతి.

Bio

హరిత భట్లపెనుమర్తి

.

***

Comments
bottom of page