MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నాకు నచ్చిన కొన్ని పుస్తకాలు/రచనలు
మెడికో శ్యాం
"కొత్త పుస్తకం తెరుద్దాం. కోతిచేష్టలు మరుద్దాం" అనిపించవచ్చు కొందరికి. ”చదివిందే చదివిందే చదివిందే చదవడం ఎప్పుడూ ఇష్టం కొందరికి".
పుస్తకాలు కొన్ని రుచిచూడమన్నాడు. కొన్ని మింగమన్నాడు. కొన్ని కొరికి నమిలి మింగి... జీర్ణ మంగే అని సుభాషితం. చదవడమా? మానడమా? అని రాసేనొకసారి. ఎందుకు చదవాలో తెలియనప్పటినుంచీ ఎందుకు చదువుతున్నానో తెలియని ఇప్పటిదాకా చదువుతూనే వున్నాను.
కొన్ని కొన్ని పుస్తకాలూ, కొన్ని కొన్ని పాత్రలూ గుర్తొస్తూ వుంటాయి. ఎప్పటికీ తరగని గనిలా జ్ఞాపకాల సువాసనలు వెదజల్లుతూనే వుంటాయి.
వాటిలో కొన్ని :
పలకల వెండిగ్లాసు/దెయ్యాలకొంప
ఈ “పలకల వెండిగ్లాసు” అనే డిటెక్టివ్ నవల, ఆరుద్ర రచన. కుబేరా ప్రచురణ (1955). దెయ్యాలకొంప అనే మరో చిన్న నవలా, ఆయన ఇతర డిటెక్టివ్ కథలూ నాకు ఒకే పుస్తకంలోని వేరువేరు పేజీల్లా అనిపిస్తాయి. టూటౌన్ పోలీస్ స్టేషనూ, ఇన్స్పెక్టర్ వేణు, సబిన్స్పెక్టర్ చంద్రం , రుక్కూ , కేడీ నరిసిగాడూ వగైరా పాత్రలు సజీవంగా, నిజమైన మనుష్యులే అన్నట్టుగ్గా అనిపిస్తారు.ఇన్నేళ్ళూ మా వూళ్ళోనైనా, ఏ వూళ్ళోనైనా టూటౌన్ పోలీస్ స్టేషన్ ముందు నడిచినన్నిసార్లూ వీళ్ళు గుర్తొస్తూనేవున్నారు. ఈ ఆర్ వేణుగోపాల్రావు అనబడే ఇనస్పెక్టర్ వేణు అక్షరాలా ఆరుద్ర గారి ఆల్టర్ ఇగో అనిపిస్తాడు నాకైతే. కాని ఈ వేణుగోపాల్రావ్ చామనచాయ. మరి రామలక్ష్మి గారి 'అబ్బాయ్' ఆరుద్ర గారు మాత్రం ఆవిడన్నట్టుగ్గానే రెడ్డీ (ఎర్రని ఎరుపు)! ఇద్దరూ పరిశోధకులే. ఒకరు అపరాధ పరిశోధకులైతే, మరొకరు అపురూప పరిశోధకులు. ఈ పుస్తకాలూ, కథలనిండా అద్భుతమైన ఆలోచనలూ, వాక్యాలూ, వ్యాఖ్యలూ, అబ్జర్వేషన్సూ కనిపించి మరోసారి నా ఈ వాక్యాన్ని నిరూపిస్తాయి. "రచన గొప్పతనం రచయిత శక్తి పై ఆధార పడినంతగా రాస్తున్న విషయంపై ఆధారపడదు."
చాలా ప్రయత్నాల తర్వాత ఈ పుస్తకం పీడీఎఫ్ నెట్లో విహరించడం ఒక సంతోషకరమైన విషయమైనప్పటికీ, మళ్ళీ పుస్తకరూపంలో లభించడమే సరియైన విష(జ)యమని భావిస్తున్నాను.
హౌస్ సర్జన్/ ఆకర్షణ
ఇవి రెండు వేరు వేరు పుస్తకాలైనా, నా దృష్టిలో ఆకర్షణ, హౌస్ సర్జన్ కి ఎక్స్ టెన్షన్.
రచన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు. ఎమెస్కో ప్రచురణ.
‘హౌస్ సర్జన్ ఎటెండెన్స్ పుస్తకంలో సంతకం పెడుతూవుంటే నేనూ డాక్టర్నయ్యానన్న తృప్తి నా నరనరాల్లో ఆవహించిన చైతన్యం కలిగింది’ అంటూ మొదలయ్యే ఈ నవల ఆపకుండా చదివిస్తుంది. ఎస్ మధుకరరావు అనే కొత్తగా డాక్టరుగా జీవితం మొదలు పెట్టిన వ్యక్తి దృష్టికోణంలోంచి కథ చెబుతున్నట్టుగ్గా అనిపించినా , వైద్యవృత్తిలోని ఎన్నో కోణాల్ని, బహుశా అన్ని కోణాల్నీ అద్భుతంగా చెబుతారు వేణుగోపాలరావు గారు. వైద్యవృత్తిగురించీ, జీవితంగురించీ, చావుగురించీ, రకరకాల డాక్టర్ల గురించీ చాలా ఓపిగ్గా రాస్తారు. ప్రతీ వాక్యం నాకు గుర్తున్నా, ఇప్పటికీ ఆసక్తికరంగానే, ఇన్స్పైరింగ్ గానే వుంటుందని అనిపిస్తోంది. వైద్యశాస్త్రం పట్లా, రిసెర్చిపట్లా మధుకర రావుకున్న ఇష్టం, ఆకర్షణా, అబ్సెషన్ నాకూ వున్నా, అంత ఆదర్శవంతుడు కావాలా వైద్యుడు?! అవసరమా?సాధ్యమా?? అన్న ప్రశ్నలూ, నేను కా(లే)నేమో అన్న అనుమానమూ, నమ్మకమూ అంచలంచలుగా నాలో పెరుగుతూ వచ్చేయి. అవసరం లేదు అన్న అభిప్రాయానికి నేను వచ్చేను మెల్లమెల్లగా. నాలాగే వేణుగోపాలరావు గారు కూడా వచ్చినట్టున్నారు అదే అభిప్రాయానికి. అందుకే ఆయన ఆకర్షణ అనే చిన్న నవలిక(అనవచ్చునా?) రాసేరు.ఇందులో డాక్టరు కొత్తగా చిన్న ప్రయివేటు ప్రాక్టీసు/క్లినిక్ పెడతాడు. బలహీనతలకి అతీతుడు కాదు. ఆకర్షణల ప్రలోభాలకి లోనయ్యే వ్యక్తి, మధుకరరావులాంటి ఆదర్శవంతుడు కాదు. ఇతనికీ తన వృత్తిపట్ల ఇష్టమూ, ఆకర్షణా నిష్ఠా వగైరా వగైరాలున్నాయి.ఇలాంటి వ్యక్తిని నేను కాగలను. చాలా మంది కాగలరు. అలా చాలా మంది అవాలనే (బలహీనులైనా వృత్తి పట్ల నిష్ఠాగరిష్ఠులు కావాలనే) వేణుగోపాలరావుగారు ఈ ఆకర్షణ రాసేరేమో! కాని ఈ పుస్తకం ఎక్కడా దొరుకుతున్నట్లు లేదు. ఒకసారి నేను కాళీపట్నం రామారావుగారితో దీన్నిగురించి చెప్పినపుడు ఆయన వెంటనే నోట్ చేసుకున్నారు. నేను వెతుకుతాను. సంపాదిస్తాను అన్నారు మాష్టారు. మరి సంపాదించారా? అన్నది తెలియదు.
వైద్యశాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా ఈ పుస్తకాల విలువ తరుగుతుందని నేను అనుకోను. డాక్టరయినవారికీ ,కానివారికీ ఆదర్శవంతంగా, ఆకర్షణీయంగా అనిపించే అంశాలు ఎన్నో వున్నాయి ఈ పుస్తకాల్లో. శిల్పపరంగా ఒక సంవత్సరం పాటు జరిగే డైరీ అయినా, అంతకంటే విస్తృతమైన జీవితం ఈ హౌస్ సర్జన్ లో వుందని నా అభిప్రాయం.
మంచుబొమ్మలు
రచన వేల్పూరి సుభద్రాదేవి పేరుతో భట్టిప్రోలు కృష్ణమూర్తిగారు. ఇది 1966 వ సంవత్సరంలో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఆంధ్రప్రభ నవలల పోటీలో ప్రధమ బహుమతి పొందింది.
తరువాతెప్పుడో పుస్తకరూపంలో వచ్చింది. కృష్ణమూర్తిగారే చూపించారు. నేను చదివేనంటే ఎప్పుడు చదివేరని అడిగారు. సీరియల్ గా వచ్చినపుడే చదివేనంటే, నమ్మలేదు. నన్ను కథ చెప్పమన్నారు. నేను నాకు గుర్తున్నమేరకు చెబితే , ఆశ్చర్యంగా, ‘మీరు నిజంగానే చదివేరు’ అన్నారు.
రాధ, ఎల్ కాంతారావు అనే ఎల్ కే రావుకీ మధ్యన ఎర్పడిన, ఎడాలసెన్స్ నుంచీ ఎడల్ట్ దాకా సాగిన, ప్రేమకథ. ఎల్ కే రావు రాధకి మేనత్త కొడుకు. చేదుచేదుగా వున్న రుచి తియ్యతియ్యగా మారే వయసూ, తరుణం సందర్భం, ఇదీ ముఖ్యంగా ఈ నవలలో విషయం. కాంతారావుని ఎల్ కే రావు అనడంలోనూ కొంత అర్ధముంది.
చేసుకున్నవారికి చేసుకున్నత అన్నట్టుగ్గా రాసుకున్నవారికి రాసుకున్నంత పేరూ, కీర్తీ రావు అని మనకి పదేపదే తెలుస్తుంది. కాని తెల్లమొహం వేసి మళ్ళీ తెలుసుకుంటాం. కృష్ణమూర్తిగారి విషయంలో ఇది చాలా మేరకు నిజం అనిపిస్తుంది నాకు. ఆయన రచనల్లో అత్యంత పేరుపొందిన ఈ రచన ఆయన పేరుతో రాలేదు, అప్పటి ఒరిస్సా గవర్నమెంటు విధానాల వలన. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్త్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చినా ఇవాళ మనం ప్రజలకి గుర్తు చేయవలసిన పరిస్థితిలో వున్నాం. ఆయన బహుముఖీయమైన ప్రజ్ఞకీ, కృషికీ రావలిసినంత గుర్తింపు రాలేదని మాత్రమే నా అభిప్రాయం.
మళ్ళీ మనకి సాహిత్య అకాడెమీ రావాలని ఆశిస్తున్న, వస్తుందని భావిస్తున్న ఈ సమయంలో నా వినతి : గతంలో ఈ రాష్త్ర సాహిత్య ఎకాడెమీ బహుమతులు పొందిన మహానుభావుల గురించి/ వాళ్ళ రచనల గురించీ ఏదో ఒక ప్రయత్నం మొదటి ప్రయత్నంగా మన భావి అకాడెమీ సారధులు చెయ్యలని. ఈ చిన్ని వ్యాసంలోనే చాలామంది వున్నారని నా అభిప్రాయం.
ఈ మంచుబొమ్మలు ‘ అనే నవల శ్రీ వేమూరి సత్యనారాయణ గారికి చాలా ఇష్టం. దీన్ని తను సినిమాగా తియ్యాలనుకున్నట్టూ, ఇంకా అనుకుంటున్నట్టూ నాతో ఆయన చాలాసార్లు అన్నట్టు గుర్తు. ఇది సినిమాగా తియ్యడం, కనీసం ఒక టెలీఫిల్మ్ గా /సీరియల్ గా చెయ్యడం నిజంగా కృష్ణమూర్తి గారికి గ్రేట్ ట్రిబ్యూట్ అనుకుంటున్నాను. నా మనసులో ఏముందో ముందు ముందు విన్నవించుకుంటాను.
ఒక సమయంలో సుమారు సమవయస్కులైన మా నాన్నగారూ, కృష్ణమూర్తి గారూ స్నేహితులు అని ఆయనే నాకు చెప్పారు, నేనెప్పుడూ మా నాన్నగారి గురించి ఆయనతో ఏమీ చెప్పలేదని ఆశ్చర్యపోతూ. ఆయన ఆఖరి ఫేజ్ లో నేను ఒక విధంగా ఆయనకి స్నేహితుణ్ణి. ఆయన తరచుగా నా దగ్గరికి వచ్చేవారు. ఎన్నో కబుర్లు. ముఖ్యంగా నన్ను కలతపెట్టేది ఒకానొక సి.ర. (సినీ రచయిత) తో ఆయన డ్యూయెల్. చాలా బిట్టర్ గా ఫీలయ్యేవారు. నేను హెల్ప్ లెస్ గా ఫీలయ్యేవాడిని. ఈ సి.ర. ఆయన ఏదో ఒక రచనని తన స్వకీయమైన ప్రతిభతో సినీకరించాడు. సహజంగా మనందరికీ తెలిసినట్టే న్యాయాలయంలో గెలుపు కాకతాళీయంగానో , సి.ర. స్వయంకృషి వల్లో సి.ర.ని వరించింది. సినిమాలకి అంటూ ముట్టూ లంటూ వుండవని ఆయనకి చెప్పేపాటి వాణ్ణి కాను. ఈ సి.ర. ఆ తరువాత కాలంలో రకరకాల వేషాలు వేసి, ఇంకా మేధావి వేషాలు వేస్తూనే వున్నాడు. ఇలాంటి వాళ్ళని సాహిత్య గిరీశాలనడం కూడా ఒక కాంప్లిమెంటే! ఇతరుల పైత్యాల మీద కబుర్లు చెప్పడం కన్నా తను చేసిన/చేస్తున్న దద్దమ్మ పనులని ఈ పెద్దవయసులో దిద్దుకొమ్మని ఆ సి.ర. కి నా మనవి.
వేమూరి సత్యనారాయణగారికి, త్వరలో సీరియస్ గా, ఈ నవలని సినిమాగా... కృష్ణమూర్తి గారికి ట్రిబ్యూట్ గా తీయమని నా నివేదన.
అయిదురెళ్ళు
రచన- మందరపు లలిత. ఇది 1964-65 సంవత్సరాలలో ఆంధ్ర పత్రిక వార పత్రికలో సీరియల్ గా వచ్చింది.
సరదా సరదాగా చకచకా సాగే ఈ నవల/ నవలిక/ సీరియల్ కథ, ‘రామయ్యగారికి మద్రాసులో గడియారాల షాపుంది’ అంటూ మొదలౌతుంది. ఆయనకి అయిదుగురు అమ్మాయిలు. పెద్దమ్మాయి కళ. నెత్తిమీద (?) ఒక కుండ వుంటుంది. ఆమెకి కాబోయే వరుడు సుధాకర్.(కవలల్లో) రెండో అమ్మాయి గీత. ఈ అమ్మాయి స్నేహితుడు మోహన్. వీళ్ళే బహుశా హీరోయిన్ హీరోలు. ఈ యేటికి ఇద్దరం, పైయేటికి ముగ్గురం. అంతటితో ఆగినచో - అంటూ ముగిసే సరదాల, సరసాల ఉరుకుల పరుగుల కథలో మరో మూడు రెళ్ళు కూడా వున్నాయి.
మధ్య తరగతి కుటుంబంలో అక్కచెళ్లెళ్ళ మధ్య చిన్న చిన్న ఈర్ష్యలూ, ఎత్తిపొడుపులూ. కొంతలో కొంత ఆపేక్షలూ. లైట్ రొమాంటిక్ కామికల్ అనవచ్చా? వాతావరణ కల్పన, చిత్రణా , వర్ణన చాలా బాగున్నాయని నా అభిప్రాయం. నాకిష్టమైన వర్డ్ ప్లే కూడా ముఖ్యంగా సందర్భోచితంగా చాలా బావుంది.
అయితే ఇందులో ఏముంది? అంతే. ఏమీ లేదేమో? కానీ, మళ్ళీ చదవడానికి అవకాశమే రాలేదు. అదే ముఖ్యమైన ఆకర్షణేమో! గత ముఫ్పై అయిదేళ్ళకి పైగా ప్రయత్నిస్తున్నాను. మా మిత్రుడు పీవీఆర్ మూర్తిగారు తన దగ్గిర వుందనీ, పేజీలు కాపీ చేసినా పాడైపోతాయనీ, అదనీ, ఇదనీ, అంటున్నారు. కనీసం స్కాన్ డ్ కాపీ అయినా ఇమ్మని అడుగుతూనే వున్నాను. ఆయన ఇస్తానని అంటూనే వున్నాడు.
ఆశ్చర్యంగా ఈ మందరపు లలితగారి మరే రచనా నేను చదవలేదు. ఈవిడ గురించిన సమాచారం ఏమీ దొరకలేదు. ఒక ప్రముఖ వార పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన రచన చేసిన రచయిత్రి గురించి మనకేమీ తెలీదు. బహుశా ఈవిడ ఆ పత్రికలో పనిచేసిందేమో కూడా! ఎన్ని రచయితల/రచయిత్రుల డైరెక్టరీలు వచ్చినా మళ్ళీ మళ్ళీ అవే పేర్లు.
ఏదైనా ప్రయత్నించి శోధించి సాధించవచ్చు అన్నదానికి ఉదాహరణగా ఈ వ్యాసం రాస్తున్న సమయంలో ఈ రచన ని ఆంధ్రప్రదేదేశ్ ప్రెస్ అకడెమి వెబ్ సైట్లో చూడ్డం జరిగింది . 2-10-1964 సంచికలో ఈ సీరియల్ ప్రారంభమైంది.
లింక్ : http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=9560
ఈ ఉరుముల మెరుపుల కథలో హీరో మోహన్ కాబట్టి, మా మిత్రుడొకాయన మోహన్ని అడిగేను. వాళ్ళింట్లో నెల్లూర్లో పాత పత్రికలు వున్నయట, అందుకని. కానీ అతగాడు నేనెప్పుడో చెప్పిన ప్రెస్ అకాడెమీ సైట్నే కోట్ చేసాడు. సరే అని చూసాం. చూసారుగా. ప్రెస్ అకాడెమీ వాళ్ళు చేసిన పని అభినందించదగినదే. కాకపోతే కాస్త యూసర్ ఫ్రెండ్లీ కాదు. అంతే. కొన్ని వుంటాయి. కొన్నివుండవు. ఏం చెయ్యగలం?!
మొత్తం పుస్తకాన్ని ఏ ఫ్రీబుక్స్ వాళ్ళో ( http://www.sathyakam.com/index.php) పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
మాడంతమబ్బు
ఇదొక కథా సంకలనం. అరవైలలో (?1960) వచ్చిందనుకుంటాను. సంకలన కర్త ఎవరో మాత్రం గుర్తులేదు. ప్రచురణకి కర్త బహుశా బాపు గారు. ఈ చిన్న సంకలనంలో ఎన్నో/అన్నీ మంచి కథలు/లే.
నాకు గుర్తున్నమేరకి కల్యాణసుందరి జగన్నాథ్ గారి 'మాడంతమబ్బు’. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి 'వర్షం'. కొడవటిగంటి కుటుంబరావు గారి 'ఫాలౌట్'. అరిగే రామారావు గారి 'నచ్చినోడు’. రావి కొండలరావు గారి 'మాయమైన మనీ పర్సు’, రుద్రాభట్ల నరసింగరావు గారి 'వరలక్ష్మి కి వరుడు’ . పూసపాటి కృష్ణం రాజు గారి 'సీతాలు జడుపడ్డది’. శివరాజు సుబ్బులక్ష్మి గారి 'మనో వ్యాధికి మందుంది’. నేనెందుకో ఆవిణ్ణీ సుబ్బులక్ష్మి అనేవాణ్ణి/అనుకునే వాణ్ణి. నేను అన్నీ మళ్ళీ మళ్ళీ చదివినా, నల్లతోలు, నచ్చినోడు, వరలక్ష్మి కి వరుడు ఇంకా ఎక్కువ సార్లు చదివేనేమో అనిపిస్తుంది.
భమిడిపాటి జగన్నాధరావు గారి 'లౌక్యుడు’ లీలగా గుర్తుంటే, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ అస్సలు గుర్తు లేదు.
ఈ సంకలనం లోని ఏ కథా, కథలు ఎలా రాయకూడదో మాత్రం చెప్పదు. ఎంత బాగా రాయవచ్చో మాత్రమే చెబుతాయి ఈ కథలు.
ఎంతో అందంగా వుండే ఈ చిన్న బుక్కు, తిరిగి చూడగలగటం కూడా గొప్ప లక్కు అనిపిస్తోంది. ఎవరైనా ప్రయత్నించి కనీసం దీని స్కాన్ డ్ కాపీ అయినా లభించేలా చేస్తే అందరం లాభిస్తాం.
****