top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

మృగతృష్ణ

Sasikala Volety_edited.png

ఓలేటి శశికళ

రాత్రినుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న జ్యేష్టమాసపు వాన, కళ్ళమీంచి నిద్రదుప్పట్లను లాగనీయడం లేదు. 

 

చెట్టూచేమల మీద, ఇళ్ళకప్పుల మీదా వానధారలు రథిమిక్ గా చేస్తున్న సంగీతం వింటూ , ఆదివారపు అతివిలువయిననిద్రను ఆస్వాదిస్తున్న నాకు సెల్ ఫోను అరుపు లేవక తప్పని పిలుపయ్యింది. 

 

దుప్పట్లోంచి మెల్లగా చెయ్యిసాచి, సవ్యాపసవ్య దిశలు తెలీక , చివరికి చెవికాన్చి " హలో" అన్నానో లేదో....... దడదడమని ఉరమని పిడుగుల్లాంటి మాటలు పడిపోతున్నాయి , దూసుకుపోతున్నాయి చెవుల్లోకి.

 

సుషుప్తి నుండి జాగృతికొచ్చిన బుర్ర ఆ శబ్దాలను మాటలుగా, మాటలను వ్యక్తిగా మార్చుకోడానికి కొన్ని క్షణాలు పట్టాయి. మెల్లగా గొంతు బొంగురు సవరించుకుని

" దేవక్కా!.... " అన్నా

 

" ఆ... దేవినే! కరుకుగా అరిచినట్టు దేవక్కగొంతు

 

" ఏమయిందక్కా? ఎందుకు అలా అరుస్తున్నావ్? అంతా బాగానే ఉన్నారు కదా?" 

 

"  చెప్తున్నదదే కదా! బాలేదనే! బంగారుతండ్రి, సుగుణాలపోగు, మా ఆడపడుచు దేవత, నీ కూతురికింత కన్నా మంచిసంబంధం తేగలవా? అంటూ ఓ వెధవను నా కూతురికి కట్టపెట్టించావు.  దాని బతుకా దిక్కుమాలిన అమెరికాలో తగలడిపోతోంది. పిచ్చితల్లి ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకుంది మాకోసం. ఇంక ఆపుకోలేక, ఇదిగో ఇందాకే కాల్ చేసింది. ఎంత ఏడుపు! ఎంత ఏడుపు! మాటపెగలనంత ఏడుపు. నాకూ, బావకీ గుండె నీరయిపోయింది ఆ ఏడుపుకు."

 

నాకు అక్కమాటలకు చమట్లు పట్టేసాయి. ఏమయింది సుమకి? రాఘవ్ ఏంచేసుంటాడు? అంత బాధపడడానికి!?

 

" అక్కా! ఆవేశపడకుండా కాస్త మెల్లగా చెప్తావా? ప్లీజ్"

 

" నోర్ముయ్"..... ఒక్కరుపు అరిచింది. "

"మెల్లగా చెప్పాలా? నా కూతురు గొంతుకోసావని చెప్పనా?  అది ఆత్మహత్యకు సిద్ధంగా ఉందని చెప్పనా? నీకూతురికయితే ఇలా అన్యాయం చేస్తావా? పెద్దమ్మ కూతురిననే కదా, అన్నీ తెలిసి కూడా ఆరాఘవగాడిని అంటగట్టావు. నీ సొంత అక్కయితే చేద్దువా? ఇంక సుమ ఒక్కక్షణం అక్కడుండదు. 

ఇదిగో మీబావ నెట్ లో ఎయిర్ లైన్స్ చూస్తున్నారు. ఎంత వీలయితే అంత తొందరగా వెళ్ళి సుమని తెచ్చేయడమే. నీ ఆడపడచుకి చెప్పు. ""ఛీ" అలాంటి మోసగాళ్ళతో మాట్లాడాలంటే అసహ్యమేస్తోంది. 

పోతేపోయాయి ఏభయి లక్షలు. నా కూతురికి దిష్టి తీసి పడేసాననుకుంటా".... ఆపింది దేవక్క వగరుస్తూ. 

 

తలతిరిగిపోతోంది నాకు. ఏమవుతోందక్కడ? సుమపరిస్థితి అంత దయనీయంగా ఉందా? రాఘవ మంచిపిల్లాడనుకుందే తను. తనకూతురినిచ్చి చెయ్యాలని ఎంత సరదాపడిందో. కానీ దీప్తి తను ప్రేమించిన రోహిత్ నే చేసుకుంటానంటే తప్పనిసరయి రోహిత్ తో చేసారు. 

 

కానీ రాఘవ సంబంధం పోకూడదని దేవక్క కూతురు సుమకి ఇచ్చేట్టు ఒప్పించింది తను.

 

లక్షలు ఖర్చుపెట్టి ఎంతో ఘనంగా పెళ్ళిచేసారు అక్కాబావగారు . 

అంత అందమయిన జంటనీమధ్యకాలంలో చూడలేదని అందరూ అనడమే! 

పెళ్ళయి ఎనిమిది నెలలవుతోంది. 

వెన్నిస్, స్విట్జర్ లాండ్ హనీమూన్ కెళ్ళి , అలాగే లాస్ ఏంజిలిస్ వెళ్ళిపోయారు. 

ఆడపడుచు అడపాదడపా చెప్పే సమాచారం తప్ప తనకి మరేవీ తెలీవు. 

ఇదిగో ఇప్పుడు దేవక్క భద్రకాళిలా విరుచుకు పడిపోవడమే! 

 

అక్క ఏవో చెప్పుకొస్తోంది. 

మధ్యమధ్యలో ఏడుస్తుంటే నాకే గుండె పిండేసినట్టయింది. 

తను ముగించేసరికి నాకు నెత్తురు మరిగిపోసాగింది.

 

" దేవుడా! "ఎంత అన్యాయమయిపోయింది సుమకి. 

దీప్తిలా గడుసుపిల్ల కూడా కాదు. సుమబాల వంటి సుకుమారి. బహు మెత్తన.  పెద్దకళ్ళనిండా సౌమ్యత, ఆర్ద్రత, మాటలో మృదుత్వం. 

ఎవరయినా కాస్త గొంతుపెంచితే చాలు కన్నీళ్ళ పర్యంతమయ్యే సుమ రూపం కళ్ళముందు కదిలింది. 

 

అసలెందుకిలా? రాఘవ్ ఎందుకు ఈ పెళ్ళి చేసుకున్నట్టు అసలు? చాలా ఇష్టపడి చేసుకున్నాడుగా! 

 

ప్రోజెక్ట్ అని కంపెనీ తరుఫున టీమ్ లీడ్ గా వెళ్ళిన పిల్లాడు నాలుగేళ్ళుగా అక్కడే అమెరికాలో ఉండిపోయాడు. 

ఇండియాలో స్వచ్ఛమైన స్ఫటికంలా ఉండేవాడిలో అమెరికా వెళ్ళగానే వచ్చిన ఈ మార్పంతా తమకు తెలియదే. ఎలా తెలుస్తుంది? 

చిన్న క్లూ కూడా లేదు తమకు.

 

కంప్యూటర్ లో పనిచేసుకుంటున్న శ్రీవారు ఫోనుమాట్లాడుతున్న నా హావభావాలూ, ఆశ్చర్యార్ధకాలూ గమనిస్తున్నారేమో, నన్ను చూసి " "విషయమేంటని" కళ్ళుఎగరేసారు. 

నేను ఉండమని సైగచేసి, గబగబా ఫ్రెషప్ అయ్యివచ్చేసరికి  ఆయన రెండు కాఫీమగ్గులు రెడీగా పట్టుకుని బాల్కనీలోకి దారితీసారు. 

 

వాన యింకా వెర్రిగా కురుస్తూనే ఉంది. 

అయితే ఇప్పుడు నాకది అందంగా కనిపించడం లేదు. 

నా అంతరంగం లాగే గోలగోలగా వినిపిస్తోంది. జంట నుంచో, గుంపులోంచో తప్పించుకున్న పక్షి ఒకటి వానకి రెక్కలు తడిసిపోయి, ఎగరలేక బాల్కనీ రైలింగు మీద అసక్తతతో ఒణుకుతూ దీనంగా బయటకు చూస్తోంది తనవారెవరైనా వస్తారేమోనని. 

 

నాకెందుకో చటుక్కున సుమే గుర్తొచ్చింది. అయినవారికి దూరంగా, దేశం కాని దేశంలో ఏ బాధలు పడుతోందో కదా అని. అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు చిప్పిల్లాయి. 

 

ఇద్దరం ఉయ్యాలబల్ల మీదకూర్చుని కాఫీ సిప్ చేస్తూ విషయంలోకి వచ్చాము. నేను సడన్ గా అన్నా....

 

" రాఘవకి ముందే పెళ్ళయిందట. ప్రీతి అనే కొలీగ్  తో"........

చెప్పగానే పక్కన బాంబుపడ్డట్టు ఉలిక్కిపడ్డారాయన. షాకునుండి తేరుకుని, 

 

" ఏంచెప్తున్నావ్ నువ్వు? వాడు మా రాఘవ. ఆ రోహిత్ కాడు". 

కూతురు తన ఇష్టానికెదురెళ్ళి పెళ్ళిచేసుకుందని  కోపం ఆయనకు.

 

" అవును మా గొప్ప రాఘవే. డబల్ గేం ఆడుతున్నాడు అక్కడ.  రోహిత్ కేమీ శుభ్రంగానే ఉన్నాడు . మన దీప్తిని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటూ. తెగులంతా మీవాడికే"... మాటలు కటువుగా పలికా.

 

" ఏమయిందో పూర్తిగా చెప్పు. ఏ ఒక్కరి వెర్షన్ తో  మనం అభిప్రాయాలకు రాకూడదు"

 

" సుమ వెళ్ళిన రెండు నెలల వరకూ మాధవ్ చాలా బాగా చూసుకున్నాట్ట. 

సెలవు తీసుకుని చాలా ప్లేసెస్ తిరిగారట. సాధ్యమయినంత వరకూ తను ఇంట్లోంచి పనిచేస్తూ సుమకు అమెరికా జీవితం పరిచయం చేసాట్ట., " 

 

" మరింకేం అయితే. బానే చూసుకున్నట్టే కదా. ఈ రెండో పెళ్ళం ఎక్కడనుండి ఊడిపడింది వాడికి? .......మేనల్లుడి డిఫెన్సులో ఆయన మొహం కోపంతో ఎర్రబారింది.

 

" ఉండండి. అక్కడికే ఒస్తున్నాను. 

అమెరికా వెళ్తూనే రాఘవ్ స్నేహితులందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడుట. 

అక్కడ ఆ అమ్మాయి ప్రీతిని చూపించి, "మా ప్రోజెక్ట్ హెడ్. నా మెంటార్, గైడ్ , బెస్ట్ ఫ్రెండ్ " అని పరిచయం చేసాట్ట. 

ఆ అమ్మాయి కనీసం " హలో" అని కూడా చెప్పకుండా లోపలికెళ్ళి , ఎప్పటినుండో ఆ పరిసరాలు అలవాటయినట్టు తిరిగేస్తోందట. 

 

వీలయినంత రాఘవ్ ని అంటిపెట్టుకుని కూర్చోడం, కిచెన్ లోకి వెళ్ళి అన్నీ సర్దేయడం, అందరికీ సర్వ్ చెయ్యడం చేసేస్తుంటే, సుమకి అక్కడ ఆమె స్థానమేంటో అర్ధం కాలేదుట. 

 

          కొంత సేపటికి సడన్ గా ప్రీతి,  సుమ బెడ్ రూంలో కెళ్లి వార్డ్ రోబ్ తెరిచి ఏదో వెతికేస్తుంటే , రాఘవ్ , సుమ అక్కడికి వెళ్ళారట

ఆ అమ్మాయి , " రాఘవ్! నావి కొన్ని డ్రసెస్ ఇక్కడ మర్చిపోయా. వెతుకుతున్నా " అందట. 

రాఘవ్ కంగారు పడిపోతూ సుమతో, " ఇంతకు ముందు మా టీంమేట్స్ నలుగురం ఇదే ఫ్లాట్ షేరు చేసుకునే వాళ్ళం.", అంటూ ఏదో కవర్ చేసి, కోపంగా ఆ అమ్మాయితో, " నీ బట్టలు ఇక్కడెందుకుంటాయి?" అని తీవ్రంగా చెప్పి వెళ్ళిపోయాట్ట. 

ఆ అమ్మాయి భుజాలెగరేసి పొగరుగా అక్కడనుండి విసవిస నడుచుకుంటూ పోయిందట. సుమకి అప్పుడే కొంచం అనుమానం వచ్చిందట.

 

           ఇంక పార్టీలో ఆ అమ్మాయి తాగి , చేసిన వీరంగం అంతాయింతా కాదట. 

 

రాఘవ్ మీద పడిపోతూ, " నువ్వు రాఘవ్ కాదు " రోగ్" వి, నీ పెళ్ళికి ముందు నేను " ప్రెట్టీ" ని, ఇప్పుడు ఉత్తి ప్రీతిని " అంటూ పిచ్చిపిచ్చిగా వాగుతుంటే, రాఘవ్ ఫ్రెండొకడు ఆ అమ్మాయిని బలవంతంగా లేపి, కారులో ఇంటికి డ్రాప్ చేసాట్ట. ఆ తరువాత పార్టీ అంతా రాఘవ్ చాలా మూడీ అయిపోయాట్ట.

 

       ఇంక అప్పటినుంచీ రోజూ రాత్రి పదింటినుంచి, పన్నెండు వరకూ ఆఅమ్మాయితో వీడియో చాట్ ట. 

ఏంటి అంటే తను నా ప్రోజెక్ట్ హెడ్, ప్రోజెక్ట్ అప్ డేట్స్ చర్చిస్తున్నాం", అంటాడుట. 

అమెరికాలో క్లయింట్ కోసం అర్ధరాత్రి పనిచెయ్యక్కరలేదని తెలీని వెర్రిది కాదుగా సుమ. అయినా సభ్యత అడ్డు ఒచ్చి విషయం పొడిగించేది కాదట. 

 

           సెలవయిపోడంతో సుమని ఇంట్లోనే ఒదిలి వెళ్తుంటే తనకి బోరుకొట్టేసేదిట. 

 

ఇరుగూపొరుగూ లేక, డ్రైవింగ్ రానందున ఎక్కడికీ వెళ్ళలేక , ఇంటిమీద బెంగతో ఏడుస్తూ ఉండేదట. 

 

మధ్యలో ఒక ఇరవైరోజులు విపరీతమైన జ్వరం వస్తే కూడా రాఘవ ప్రాజెక్ట్ 'ఎండింగ్ ఫేజ్ ' అంటూ రాత్రి పన్నెండింటికి వచ్చేవాడట. 

వచ్చేకా కూడా లాప్ టాప్ తో కూర్చునేవాడట.

అప్పుడే మన దీప్తి తనని సియాటల్ తీసుకెళ్ళి నెల్లాళ్ళు ఉంచుకుంది.

 

సియాటల్ నుంచి తిరిగొచ్చాకా , సుమని రోజూ పబ్లిక్ లైబ్రరీలో దించి, సాయంత్రం పికప్ చేసుకునేవాట్ట. 

పాపం ఈపిల్ల పుస్తకాలు చదువుకుని, పెయింటింగ్స్ వేసుకుంటూ, మధ్యమధ్యలో చిన్నచిన్న షాపింగ్ చేసుకుంటూ అలవాటు పడుతోంది. 

ఇండియాలో లక్షరూపాయల జాబ్ చేసుకునే పిల్లకి అలా అనాధలా, నిరుద్యోగిగా ఖాళీగా ఉండాలంటే నరకమే కదా.

 

        పైగా రాఘవతో ఎలాంటి వైవాహికసుఖమూ లేదట. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాట్ట. ఏంటంటే వర్క్ స్ట్రెస్ అంటాడుట. 

 

      ఒకరోజు సుమ ఏదో మందులకోసం వాల్ గ్రీన్స్ కి వెడితే ఒకమ్మాయి సుమని ఆపి నువ్వు రాఘవ్ కి కజిన్ వా? అని అడిగిందట. 

 

సుమ "వైఫ్ ని" అని చెప్పగానే ఆ అమ్మాయి " నో వే! రాఘవ్ వైఫ్ ప్రీతీ. మేమంతా సేమ్ టీమ్ మేట్స్ మి. మేమే దగ్గరుండి వాళ్ళ పెళ్ళి చేసాం బే ఏరియాలో బాలాజీ టెంపుల్లో. తరవాత నాకు వేరే ఆఫర్ ఒస్తే ఆ కంపనీ ఒదిలేసా."... అందిట. 

 

సుమ బిత్తరపోయిందట ఆ అమ్మాయి మాటలకి. మొబైల్ అప్లోడ్స్ లో ఫోటోలున్నాయా అంటే, " లేవు.! ఇద్దరూ డిలీట్ చేయించేసారు. " అంటూ వారిద్దరి ప్రేమవ్యవహారమంతా చెప్పి, " నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది. రాఘవ్ ని ఒదిలి వెంటనే ఇండియా వెళ్ళిపో. ఇక్కడ ఇవన్నీ కామన్. వన్ ఫైన్ డే నిన్ను చంపేసి ఏక్సిడెంట్ అన్నా అంటాడు"... అంటూ తెగ భయపెట్టేసిందిట.

 

    "సుమ అంతలా తొందరపడే పిల్ల కాదు కదా. రాఘవ్ ప్రవర్తన గమనిద్దాం కొన్నాళ్ళు. ఆధారాలు దొరికాకా అడగచ్చు అని వెయిట్ చేసిందట. షాపులో కలిసిన పిల్ల రోజుకు రెండుమూడుసార్లు కాల్ చేసి " ఏం డిసైడ్ చేసుకున్నావ్? నిన్ను ఎయిర్ పోర్టుకు నేను దింపుతా. 

టికెట్ కూడా కొనిస్తా. " అంటూ గోలట. 

సుమకేమీ పాలుపోవట్లేదుట.

 

       మూడువారాల క్రింద ఇద్దరూ ఏదో వీకెండ్ పార్టీకెళ్ళి వచ్చాకా సుమ పడుకుండిపోయిందట. 

 

రెండో బెడ్ రూం నుండి ఏదో అరుపుల్లా వినిపిస్తుంటే మెలుకవొచ్చి, లేచి, అలికిడి చెయ్యకుండా వెళ్ళి తొంగిచూసిందట. 

 

రాఘవ్ ఫేస్ టైంలో ఆ ప్రీతీతో గట్టిగా అరస్తున్నాట్ట, తననింక వదిలేయమని, తనతండ్రి హార్ట్ పేషెంట్ , వింటే తట్టుకోలేడని, తనకి పెళ్ళయిందని, సుమ తన బాధ్యతని, పెళ్ళికి ముందు ఏదో  తెలీక  చేసినదానికి, తన ప్రమేయం లేకుండా జరిగిన దానికి  ఇంకా ఇంకా వేధించద్దనీ....ఇంకా ఏవేవో అంటుంటే , 

 

ఆ ప్రీతి మాత్రం తాపీగా , " నువ్వేం చేస్తావో తెలీదు. వన్ మంత్ లో సుమ ఇండియా పోవాలి. లేదంటే నీ తాలూకు వీడియోలన్నీ ఇక్కడ కాప్స్ కి పంపుతా. బార్స్ వెనకాల ఉంటావ్. సుమని పంపేసిన తరవాత నువ్వు డివోర్స్ కి అప్లయి చేసి నన్ను లీగల్ గా పెళ్ళిచేసుకోవాలి." అంటూ వార్నింగ్ ఇస్తోందట.

 

    సుమ ఒక్కసారి గదిలోకి వెళ్ళగానే రాఘవ్ కంగారు పడిపోయి లాప్ టాప్ మూసేసి, సంభాషణ కట్ చేసేసి, సుమమీద అరవడం మొదలుపెట్టాట్ట మేనర్స్ లేవా ? అదీఇదీ అంటూ. ఆరోజునుండీ సుమ ఏడుస్తూనే ఉందట. 

 

అక్కావాళ్ళకి, అత్తగారికీ చెప్పాలో లేదో తెలీక, ఆఖరికి మీ చెల్లికి చెప్పిందట. 

అప్పుడేనా మీ చెల్లి మనతో చెప్పాలా!? 

 

ఏమీ అవ్వనట్టు " ఓ! ఆ ప్రీతి ఇంకా వీడిని పిశాచంలా పట్టే ఉందా? 

వదిలిపోయిందనుకునే మీ పెళ్ళి చేసా. అడిగినంత డబ్బు ఇచ్చినా అది నోరు ముయ్యలేదంటే, దానికి నేనేంటో చూపించాల్సిందే!! " అంటూ శివాలెత్తిందట. 

 

అయితే అత్తగారు తెలిసే చేసిందని తెలుసుకుని ఇంక రాఘవ్ తో అక్కడ ఉండలేనని డిసైడ్ చేసుకుని నిన్న అక్కకీ, బావగారికీ ఏడుస్తూ చెప్పి, తనని తీసుకుపోమని బ్రతిమాలిందట. 

 

తరవాత రాఘవ్ కాల్ చేసి తనమాట వినమని ఏదో చెప్పబోతే బావగారు కాల్ కట్ చేసి పడేసారట. 

 

ఇదిగో ఇందాకా దేవీ అక్క ఫోను చేసి అంతా నావల్లేనని శాపనార్ధాలు పెడుతోంది"....... ఆఖరి మాటలు చెప్తుంటే నా గొంతు దుఃఖంతో, అవమానంతో జీరబోయింది. 

 

           ఇదంతా విన్న మావారి మొహం కోపంతో జేవురించింది. " స్కౌండ్రల్! ఎంత పనిచేసాడు! అన్నగారికి ఎలా మొహం చూపించగలం మనం? మన మాటలు నమ్మి ఒక్కగానొక్క పిల్లని వీడికిచ్చారే, వీడింత దౌర్భాగ్యుడని తెలీక. 

 

అయినా మా చెల్లీబావ ఏం చేస్తున్నారు ఇదంతా తెలిసి. 

గడ్డి తింటోందా విజయ? వెంటనే కాల్ చేసి దాన్ని ఒకగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. 

సుమకి మనమే న్యాయం చెయ్యాలి. 

విషయం కనుక్కుని వెంటనే విడాకులిప్పించేద్దాం." అంటూ లేచివెళ్ళిపోdయారు.

 

              ఇంతలో ఫోన్ మోగింది. నా ఆడపడచు విజయ. 

" ఒదినా!"..... అంటూ భోరుమంది. 

నాకు అర్ధమయ్యింది. దేవక్క ఫోను ఒచ్చివుంటుంది తనక్కూడా అని. కొంచెం తేరుకుని మొదలుపెట్టింది విజయ.

 

" ఒదినా! ఈపాటికి నీకు తెలిసే ఉంటుంది మా రాఘవ్ గాడి నిర్వాకం. ఏం చెయ్యాలో తెలీట్లే ఒదినా. సుమని ఇండియా తెచ్చేస్తారట. 

ఈయనకీ ఏవిషయం చెప్పలేదు. ఆయన హెల్త్ కండిషన్ నీకు తెలీనిదేముంది. మా అన్నయ్యకు తెలిసిందా, నన్ను నరికేస్తాడొదినా అన్నయ్య.!!"

 

      " అయినా చాలా తప్పు చేసావ్ విజయా. విషయమంతా తెలిసి, కప్పేసి పెళ్లి చెయ్యడం అదేం సంస్కారం? నీకెంత నీ ఒక్కకొడుకు అపురూపమైతే మాత్రం, ఇంకో ఆడపిల్ల గొంతుకోస్తావా? సుమ ఏదయినా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యులు? " .... చాలా తీవ్రంగా ఒదిలా మాటలు.

 

        " ఒదినా! మీరంతా అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. వాడు అమాయకుడు. ఇరుక్కుపోయాడు". అంది విజయ.

 

      " చాల్చాలు! ఆపు విజయా! ఇంతయినా,?ఇంకా కొడుకుని వెనకేసుకొస్తున్న నిన్ను చూసి ఏమనాలో తెలీట్లేదు." 

 

" ఒదినా! ప్లీజ్. ఇప్పుడు నేనేం చెప్పినా మీకర్ధం కాదు. సుమ అసలు ఫోనే తియ్యట్లేదు. నేను అరగంటలో మీ ఇంట్లో ఉంటా. అన్నయ్యకూ, నీకూ మొత్తం చెప్తా. 

మీరే నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదమే"..... అంటూ పెట్టేసింది విజయ.

 

        మావారికి విషయం చెప్పి, స్నానపానాదులు , పూజ పూర్తిచేసుకుని, నా సహాయకురాలికి వంటలు పురమాయించి హాల్లోకొచ్చి కూర్చున్నా విజయకోసం, అన్యమనస్కంగా వేచిచూస్తూ.

 

          ఒకగంటలో, స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ విజయ ఒచ్చింది. 

పాపం చాలా ఏడిచినట్టుంది. 

కళ్ళూ, ముక్కూ ఎర్రబడి ఉన్నాయి. 

మొహమంతా దుఃఖాతిశయంతో పొంగిపోయింది. 

మమ్మల్ని చూస్తూనే మళ్ళీ దుఃఖం కట్టలుతెంచుకుంది. 

అంత కోపంలోనూ, ఏడుస్తున్న చెల్లెల్ని చూసి ఆయన మనసు కరిగిపోయింది. 

 

అనారోగ్యంతో ఉన్న భర్తని అపురూపంగా చూసుకుంటూ, ఆస్తుల్ని కాపాడుకుంటూ, ఒక్కగానొక్క కొడుకుని ఎంతో క్రమశిక్షణతో పెంచి, అందరికీ తలలోనాలుకలా ఉండే విజయంటే మాఅందరికీ ప్రాణం.

 

         దుఃఖతీవ్రత తగ్గాక, మెల్లగా కధంతా చెప్పుకుంటూ ఒచ్చింది. ఆమె కధనం ముగిసేసరికి , మా మొహాల్లో రక్తంచుక్కలేదు. 

 

" అవునా!!! నిజమా?? ఇంతమోసమా!! ఎంత వంచనో!!".... ఇవే మా భావాలు.

 

" సరే చెల్లీ! నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. నేను రామారావు అన్నయ్య, దేవీ ఒదినతో మాట్లాడతా. సాధ్యమయినంత తొందరలో ఈ సమస్య పరిష్కరిద్దాం. 

నువ్వు బెంగపడకు. ఒక తల్లిలా నువ్వు చేసింది చేసావు. తప్పుపట్టడానికేమీ లేదు. పైన భగవంతుడున్నాడు. ఆయనమీద భారం వేద్దాం" .... అని ముగించి లేచారు ఆయన.

     

భోజనానికి ఉండకుండానే విజయా వెళ్ళిపోయింది.

 

మావారు కమలాకర్ గారు రంగం సిద్ధం చేసేసుకుంటున్నారు అప్పుడే.

 

  **

 

ఒక వారం తరువాత.... శంశాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 

తెల్లవారి నాలుగ్గంటలకు నేనూ, కమలాకర్, విజయా, దేవక్క, రామారావు బావగారూ అరైవల్స్ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాం 

 

ఎమిరైట్స్ లో రాబోయే సుమ, రాఘవ్ గురించి. కొన్ని నిమిషాల తరువాత విడివిడిగా ట్రాలీలు తోసుకుంటూ ఇద్దరూ బయటకొస్తున్నారు. 

 

సుమని చూసి నిర్ఘాంతపోయాము. 

 

ఏమయిపోయింది ఆ అందమంతా? పాలరాతి రంగు శరీరం మరింత పాలిపోయి, అద్దాలంటి చెక్కిళ్ళు లోపలికిపోయి, పళ్ళు కనిపిస్తూ, కళలేని కళ్ళతో పూతికపుల్లలా! 

 

రాఘవ, గుంటకళ్ళు , గుబురు గడ్డంతో ముప్ఫైయేళ్ళకే వంగిపోయినట్లు కనిపిస్తున్నాడు.

 

వస్తూనే సుమ, ట్రాలీ వదిలేసి," అమ్మా" అంటూ పరిగెట్టుకొచ్చి తల్లిని చుట్టుకుపోయింది. దేవక్కకి దుఃఖం ఆగలేదు. 

విజయ పరుగెట్టుకెళ్ళి కొడుకును కావలించుకుంది. ఇద్దరి కళ్ళలో తడి. 

 

    కమలాకర్ ఇరుకుటుంబాలతో చెప్పారు, ఆ మరునాడు మా ఇంటిలో కలుద్దామని. 

అక్కా, బావగారూ అంత సుముఖంగా లేరు. అయినా వస్తామన్నారు. 

విజయ సుమని పలకరించబోయింది. 

కానీ సుమ మొహం తిప్పుకుంది. అదిచూసి నాకు మనసు చివుక్కుమనిపించింది. ఎవరి కార్లలో వాళ్ళం బయలుదేరాం. అక్కాబావగారు డ్రాప్ చేస్తామన్నా వినకుండా కేబ్ తీసుకుని హోటల్ కెళ్ళిపోయారు సుమతో పాటూ.

 

      అనుకున్న ఆదివారం వచ్చింది. వరుణుడిని ఆపి సూర్యుడు చార్జ్ తీసుకున్నాడు. ఏడింటికే ఎండమొదలయింది, రాబోయే వేడి చర్చలకు నాందిగా. 

 

అసలు రాఘవ ముందు రాలేనన్నాడు. 

వీడియో కాన్ఫరెన్సింగ్ పెట్టమన్నాడు. 

 

ఈయన " అక్కడకొచ్చి చంపుతా నిన్ను రాకపోతే. నీ సెలవు నేను మేనేజ్ చేస్తా. లేకపోతే ఉద్యోగం రిజైన్ చేసి రా" అని ఒక్క అరుపు అరిచేసరికి , " వస్తా మామయ్యా!" అని పిల్లిలా ఒప్పుకున్నాడు. 

 

అతని కంపనీ సీఈఓ కమలాకర్ స్నేహితులు. ఆయనతో చర్చించి రాఘవ్ ని రప్పించే ఏర్పాట్లు చేసారు. 

 

        సరిగ్గా పదింటికల్లా అందరూ బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని వచ్చారు. ఈసారి రాఘవ్ తండ్రి కూడా వచ్చారు. కాస్త ప్రిపేర్ చేసినట్టున్నారాయన్ని పాపం.

 

సరే మా సార్ అధ్యక్ష ఉపన్యాసం మొదలెట్టారు.

" ఇలాంటి రోజు ఒకటి ఒస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. రాఘవ్ ని పెంచిన మేనమామలా, ఇలా వాడిని నేరస్థుడి స్థానంలో ఉంచి మాట్లాడాల్సి వస్తుందని ఏనాడూ అనుకోలేదు. కానీ సుమకి, అన్నయ్యగారి కుటుంబానికి న్యాయం జరగాలి. అందుకే ఈ సమావేశం. ఫోనుల్లో చక్కపెట్టే వ్యవహారం కాదు. ఇది " సంసారం". అందరం మంచిచెడ్డలు నిష్పక్షపాతంగా చర్చిస్తేనే కుదుటపడేది. 

 

ఇప్పుడు ఒక్కక్కరూ మీ వెర్షన్లు చెప్పండి. 

 

అన్నగారూ! మీరు మొదలెట్టండి... " అంటూ రామారావు బావగారికేసి చూసారు.

 

          అక్క ఎంత మాటకారో, ఆయనంత సాత్వికం. ఆయన అక్కకేసి చూసి, 

 

" దేవీ అయితే సరిగ్గా చెప్తుంది" అనేసారు. 

 

ఇంక దేవక్క, చిలవలు పలవలుగా, అయ్యిందీ, అవ్వనిదీ కళ్ళకు కట్టినట్టు చెప్తూ, సినిమా చూపించేసింది. 

 

మధ్యమధ్యలో సుమ అడ్డపడుతూ, " నేనెక్కడ చెప్పానూ అలాగ?", అంటూ అడ్డుపడుతుంటే , కూతురు చెయ్యి నెట్టేసి మరీ తన వాగ్ధోరణి సాగించింది. 

 

మధ్యలో" ఇవన్నీ నువు చెప్పావా?" అన్నట్టు అపనమ్మకంగా రాఘవ్ చూస్తుంటే సుమ తలదించుకుంది కూడా సిగ్గుతో ముడుచుకుపోయి.

 

ఒకసారి విజయకూడా ఆపింది.

 

" దేవీ ఒదినా! మీరు అన్యాయంగా కల్పించేసి చెప్తున్నారు" అంటే, వియ్యపురాలని కూడా చూడకుండా నోర్మూసుకోమంది అక్క. కమలాకర్ మాత్రం తన మాటలకి అడ్డువేయలేదు. 

 

అక్క ముగించగానే బావగారు అందుకుని, " దేవి కాస్త ఎక్కువ చెప్పినా మొత్తానికి ఇదీ జరిగింది. సుమని ఇంక రాఘవ్ తో పంపేది లేదండి. లాయర్ నోటీస్ పంపుతా బెంగుళూరు నుండి"., అంటూ ముగించారు. 

 

అది విన్న రాఘవ్ మొహం పాలిపోవడం గమనించాను. 

 

కమలాకర్ ఇప్పుడు సుమకేసి తిరిగారు.

" సుమా! నువ్వేం చెప్తావమ్మా?"... అనగానే సుమలేచి నిలబడింది. "

 

"కూర్చుని చెప్పమ్మా !".. అన్నా కానీ నిలబడే గొంతు సవరించుకుని మొదలు పెట్టింది.

 

" నేను రాఘవ్ ని చాలా ఇష్టపడి , కోరి చేసుకున్నా. తనంటే నాకు చిన్నప్పటినుండీ ఇష్టం. దీప్తికిచ్చి చేస్తారేమోనని నేను ఎప్పుడూ బయటపడలేదు. అయితే దీప్తికి రోహిత్ తో పెళ్ళి అయిపోవడంతో, నేనే మా నాన్నగారికి వెళ్ళి చెప్పా రాఘవ్ కిచ్చి మేరేజ్ చెయ్యమని".... 

 

ఆ మాటలు విన్న రాఘవ్ కళ్ళు మెరిసాయి. 

 

విజయ పెదాలమీద కూడా చిన్న నవ్వు మొలిచింది. 

అయితే అక్క భృకుటి మాత్రం కోపంతో ముడివడింది. సుమ కొనసాగించింది....

 

" మేము అమెరికా వెళ్ళాక చాలా మార్పులొచ్చాయి. రాఘవ్ చాలా అస్థిమితం అయిపోయేవాడు. నాకు అస్సలు సమయం కేటాయించేవాడు కాదు. రాత్రంతా ప్రాజెక్ట్ పేరుతో లాప్ టాప్ తెరుచుక్తూర్చునేవాడు. నాకు తనకీ ప్రీతికీ పెళ్ళయిందన్న వార్త తెలిసినా నేను తనని అడగలేదు. నా కళ్ళతో నేను చూసికానీ నమ్మకూడదని." 

 

వెంటనే రాఘవ్ మధ్యలో అందుకున్నాడు.

 

" నువ్వు అప్పుడే అడగాల్సింది కదా సుమ! తప్పుచేసావ్. నేను చెప్పేవాడిని కదా అసలు విషయం"...అంటూ.

 

 అతని కేసి చురుగ్గా చూస్తూ సుమ, " ఏం చెప్పేవాడివి రాఘవ్? 

"అవును ! మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళాడాము! అని చెప్తావా? "అసలు ఒక్కటైనా నిజం చెప్పావా? 

అంతా మిస్టరీయే . 

ఐ యాం డన్ విత్ యూ. 

ఐ వాంట్ టు ఎండ్ దిస్. 

ఎవరికో సెకండ్ చాయిస్ లాగా బతకవలసిన ఖర్మ నాకు లేదు. 

ఐ స్టిల్ హేవ్ మై జాబ్ హియర్. 

నేను అమెరికా తిరిగి రాదలుచుకోవట్లేదు.

నువ్వు ఆ అమ్మాయినే తెచ్చుకో. 

గుడ్ బై!"......విసురుగా మాట్లాడి , తల్లి పక్కన కూలబడి, చేతుల్లో మొహం దాచుకుంది. 

 

ఏడుస్తున్నట్టుంది. అందరి మనసులు చాలా భారంగా అయిపోయాయి ఒక్కసారి.

 

నిజమే కదా. ఎన్నో ఆశలతో కాపురంలో అడుగుపెట్టిన పిల్లకు ఇది తట్టుకోలేని షాకే కదా.

 

కమలాకర్ రాఘవ వైపు తిరిగి సైగ చేసారు. రాఘవ కూర్చున్న సోఫాలో ముందుకు జరిగి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని కూర్చుని , తన వాదన మొదలు పెట్టాడు. 

 

" ముందుగా అంకుల్, ఆంటీ, సుమా మీరు నన్ను క్షమించాలి మీ మనసులు నా వల్ల ఇంతగా బాధపడినందుకు. 

 

అమ్మ పెళ్ళికి ముందే అన్నీ చెప్పమని బలవంతపెట్టినా , సుమనెక్కడ చెయ్యిజార్చుకుంటానో అని చెప్పలేకపోయా. 

 

ఫూల్ లా నేను చేసిన తప్పు అదే. పోనీ అక్కడైనా నిజాలు చెప్పి సుమ మనసు గెలుచుకుందామనుకున్నా. కానీ ఒక విషవలయం నన్ను సుడిగుండంలా లాగేసింది..

 

 ప్రీతి నాకన్నా మూడేళ్ళు పెద్ద. 

మా ఆఫీస్ వాళ్ళు నన్ను అక్కడికి పంపేసరికి తనక్కడ టీంలీడ్ గా ఉంది. 

చాలా తెలివయింది. 

క్లయింట్ కోరుకున్న మేనేజర్. 

రెండు రోజులు హోటల్ లో ఉన్న నన్ను తన త్రీ బెడ్ రూం అపార్ట్ మెంటుకు తీసుకెళ్ళింది. 

అక్కడ ప్రీతితో పాటూ, మా కొలీగ్స్ సిరి, అజిత్, సుదీప్ లు అక్కడే ఉంటున్నారు షేర్ చేసుకుని. ప్రీతి నాకు రెంట్ కు  ఒక రూం అలాట్ చేసింది. 

 

అందరం అన్ని పనులూ చేసుకుంటూ, ఇంటినుండే పనిచేసుకునే వాళ్ళం. లైఫ్ చాలా సులువయ్యింది స్ట్రగుల్ లేకుండా..

 

 వీకెండ్ పార్టీలు, లాస్ వేగస్ కెళ్ళి కసీనోలలో గాంబ్లింగ్, లాంగ్ వీకెండ్ ఒస్తే సైట్ సీయింగ్ కో, హైకింగ్ కో వెళ్ళే వాళ్ళం. 

 

అన్నీ ప్రీతీ ఆర్గనైజ్ చేసేది. 

 

రానురానూ విపరీతమయిన డ్రింకింగ్, స్మోకింగ్, ఆడామగా ఫ్రెండ్ షిప్ లూ, అడపాదడపా డ్రగ్స్ మొదలు పెట్టారు. 

 

అప్పుడే నేను దూరంగా వెళ్ళి పోదామనుకున్నా. ప్రోజెక్ట్ ఇంకో ఏడాదిలో అయిపోతే ఇండియా వచ్చేయచ్చు కదా అనుకున్నా. 

 

ప్రోజెక్ట్ అయిపోయి ఇండియా ప్లాన్ చేసుకుంటుంటే ప్రీతీ పట్టుబట్టి మరీ నాకు ఎక్స్ టెన్షన్ తీసుకుంది. 

 

అమ్మకూడా పోనీలే అనుభవం వస్తుంది ఎంకరేజ్ చేసింది.  

 

ఒకసారి అందరం గ్రాండ్ కానియన్ వెళ్ళాము. ఆరోజు ప్రీతీ నన్ను పెళ్ళిచేసుకోమని అడిగింది. నేను నాకలాంటి ఉద్దేశ్యమే లేదని బ్లంట్ గా చెప్పా. 

అప్పటికేమీ మాట్లాడలేదు కానీ భయంకరమైన టార్చర్ మొదలుపెట్టింది. 

 

నేను బాండ్ లో ఉన్నా. బ్రేక్ చెయ్యడానికి లేదు. టార్గెట్స్ పెంచేసింది. నా డేటా , రిజల్ట్ లు మార్చేసేది. క్లయింట్ తో ప్రోబ్లమ్స్ ఒచ్చేసాయి. శాడిస్టిక్ గా బిహేవ్ చేసేది.  తనకితోడు ఆ సిరి ఒకత్తి తందానతానా అంటూ. కొత్తటీం ఒచ్చింది. జూనియర్స్ మధ్యలో పెట్టి ఇన్ సల్ట్ చేసేది.తరవాత ఒకసారి అందరం కార్లలో మెక్సికో బోర్డర్ దాటి వెళ్ళాం. రాత్రికల్లా తిరిగి ఒచ్చేసాం. 

 

మా ఆరెంజ్ కౌంటీకొచ్చేసరికి, నాకారుకడ్డంగా ఒకడు కారాపాడు. గన్ చూపిస్తూ! దిగా. వాడు కార్లో ఏదో వెతుక్కుని వెళ్ళిపోయాడు. ఏదో ప్రమాదం తప్పిందిలే అని ఊరుకున్నా. 

 

ఇలా ఆరునెలల్లో మరో మూడుసార్లు మెక్సికో తీసుకెళ్ళింది ప్రీతి అందరినీ. 

 

ప్రతీసారి మేము రాగానే తన మెక్సికన్ మిత్రుడు ఎడ్వార్డో ఒచ్చేవాడు. 

 

నాతో మాట్లాడుతూనే, చురుగ్గా నా కార్లోంచి ఏదో తీసి, జాకెట్లో పెట్టుకునే వాడు. 

 

నాకనుమానం రాసాగింది. 

 

అది కన్ ఫర్మ్ చేస్తూ నా పాతస్నేహితుడు ఫోన్లో అవి డ్రగ్స్ అని, ప్రీతీ , తన బాయ్ ఫ్రండ్ కలిసి చేసే అతి ప్రమాదకరమైన దందా అని, అది తెలుసుకునే తను చుప్ చాప్ ఇండియా వెళ్ళిపోయానని చెప్పాడు నాకు మిన్నువిరిగి మీదపడ్డట్టయింది. 

 

ప్రీతీని నిలదీసా. రిపోర్ట్ చేస్తా అన్నా. తేలిగ్గా నవ్వేసింది నువ్వేం చెయ్యలేవని. 

 

మెల్లగా మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోలు చూపించింది. 

 

మెక్సికోలో నా కార్ బేక్ సీట్లో, డిక్కీలో ఎవడో డ్రగ్స్ పెడుతూ. మళ్ళీ నా ఇంటి దగ్గర పేకట్స్ తీసుకుంటూ. మొహాలు లేవు. నేను మాత్రం ఇటుతిరిగి మాట్లాడుతూ!  

నేను అదిరిపోయాను. నాకాళ్ళ కింద భూమి కదిలిపోయింది. 

 

ఎంతలా ఇరుక్కుపోయానో తెలిసాకా ఇండియా పారిపోయి వచ్చేద్దామనుకున్నా. కాపలా పెట్టింది. 

 

పెళ్ళికోసం వేధింపులెక్కువయ్యాయి. ఎలా చేసుకేవాలి. 

ప్రతిరోజూ నాముందు ఎడ్వర్డో తో రాత్రంతా గడిపే అమ్మాయిని. 

 

అప్పడే అమ్మకి నేను పడే టార్చరంతా మెయిల్ చేసా. 

 

అమ్మ అమెరికా వచ్చింది . 

ప్రీతితో మాట్లాడింది. 

 

రెండుకోట్లు ఇస్తే వదిలేస్తానంది. 

 

అమ్మ ఒప్పుకుని, విజయవాడ ప్రోపర్టీ అమ్మి ప్రీతి నాన్నగారికి ఇచ్చింది.

ఆ విడియోలన్నీ డిలీట్ చేసింది ప్రీతి. 

 

ఇదంతా అయ్యి ఏడాదిన్నరయింది. 

 

ఈలోపున సుమని పెళ్ళి చేసుకుని రావడంతో మళ్ళీ అసూయ మొదలయ్యి ,  సుమని మానసికంగా వీక్ చెయ్యడానికి ఆ సిరిని వాడి నాటకం వేయిస్తోంది. 

 

ఇదంతా ఓ కుట్ర. నేను ఏవిధంగా ఆ ప్రీతికి లొంగలేదు. 

తనంటేనే నాకు కంపరం. అన్నాళ్ళలో నేను ఎలాంటి చెడ్డఅలవాటు జోలికి వెళ్ళలేదు. అది సుమకూ తెలుసు. నాదురదృష్టం కొద్దీ ప్రీతి లాంటి అమ్మాయి తగిలింది. తనెంత ప్రమాదకారో , క్రూరురాలో అందరికీ తెలుసు. 

 

నా పాతటీం మెంబర్ల కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను. అడగండి. 

 

తను ఏరోజూ నా కొత్తయింటికి రాకపోయినా సుమకి అనుమానం తెప్పించడానికి నానా నాటకాలూ ఆడింది. 

 

ఈమధ్య కొత్తపాట మొదలెట్టింది. 

 

ఆ వీడియోలు పెన్ డ్రైవ్ లో ఉన్నాయని, పోలీస్ కిస్తానని. 

 

సుమని ఇండియా పంపేయమని. 

 

ఒకపక్క ప్రోజెక్ట్ క్లోజింగ్ టైం. 

ఇన్ని బాధలతో సతమతమవుతూ, సుమకి న్యాయం చెయ్యలేకపోయా. 

 

సుమ నా ప్రాణం. 

నాకు జీవితంలో మిగిలిన ఆనందం ఏమన్నా ఉందంటే అది సుమతో గడిపిన క్షణాలే. 

సుమే నానుండి దూరం వెళ్ళిపోతానంటే నేను బతికీ వ్యర్ధమే అనిపిస్తోంది. 

కానీ నేను తప్పయితే చెయ్యలేదు. 

మా అమ్మమీద ప్రమాణం చేసి చెప్తున్నా. " ..... 

 

రాఘవ్ కళ్ళనుండి నీరుకారిపోతున్నాయి. విజయ కొడుకుని కావలించుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది. రాఘవ్, తనూ పడ్డ మానసికసంక్షోభానికి తెరలు తెరలుగా ఏడుస్తోంది. 

 

అందరి కళ్ళలో రాఘవ్ చెప్పిన విషయాలకు విస్మయం. 

 

ఒకఆడపిల్ల , దేశం కాని దేశంలో ఇంత తెగింపుతో, తెంపరితనంతో ఇలా చెయ్యగలదా. పైగా డ్రగ్స్ మాఫియాతో స్నేహం చేస్తూ! 

 

అందరి మొహాల్లో మిశ్రమభావాలు. ముందు తేరుకున్నది సుమే. 

 

తటాలునవలేచి మాధవ్ ని చేరింది. పరిసరాలు కూడా పట్టించుకోకుండా భర్తను గాఢపరిష్వంగం చేసుకుంది. 

 

అది చూసి అందరు మనసులూ చల్లబడ్డాయి. ఇద్దరూవెళ్ళి విజయభర్తకు నమస్కరించారు. 

 

నేను దేవక్క మొహంలోకి చూసా. పశ్చాత్తాపం కనిపిస్తోంది.,

 

బావగారయితే వెంటనే లేచెళ్ళి కూతుర్నీ, అల్లుడినీ పొదివిపట్టుకున్నారు ప్రేమతో.

 

          మళ్ళీ మా కమలాకర్ గారే అందుకుని "

"మీకీ సందర్భంలో ఒకరిని పరిచయం చెయ్యాలి"... అంటూ మా గెస్ట్ బెడ్ రూంలోకి వెళ్ళి నిన్నరాత్రి మా ఇంటికి ఒచ్చున్న మా అతిథిని పట్టుకొచ్చారు. 

 

ఆయన్ని చూడగానే విజయ దిగ్గున లేచినిలబడింది. 

ఆయన ప్రీతి నాన్నగారు. 

మొత్తం విషయమంతా సీసీ కెమేరా ద్వారా గదిలో కూర్చుని చూసి, కూతురి నిర్వాకం తెలుసుకుని సిగ్గుతో శిరస్సు అవనతం అవుతుంటే వచ్చి మాదగ్గర నిలపడ్డారు.

 

ఆయన చేతులు జోడించి విజయకేసి చూసి, " అమ్మా! మీరు నన్ను క్షమించాలి. 

నాకూతురు నా వెనుక నాకు తెలీకుండా ఇంత కధ నడుపుతోందనే తెలీదు. అఖండమైన తెలివిచ్చిన దేవుడు వక్రబుద్ధినిచ్చాడు దానికి. 

బీటెక్ లోనే పెళ్ళిచేసుకుని , కూతురు పుట్టగానే విడాకులిచ్చేసింది. ఆ పాప మాదగ్గరే పెరుగుతోంది. 

 

జీవితంలో ఎదుగుతోందనుకున్నా కానీ నైతికంగా పతనమవుతోందని ఊహించలేదమ్మా. ఆరోజు తన కూతురు జీవితం సెక్యూర్ చెయ్యడానికి మీద్వారా డబ్బూ, ఇంటిపత్రాలూ పంపుతున్నా అంటే అవునేమో అనుకున్నా, కానీ ఇంత నీచంగా సాధించిందని తెలీదు. 

 

మీరిచ్చిన వన్నీ మళ్ళీ మీ పేరుకి మారుస్తా. డబ్బు మాత్రం కొన్నాళ్ళకి ఇస్తా ..." అని అంటుంటే ఆ తండ్రి అనుభవిస్తున్న అపరాధభావానికి అందరి మనసులూ బరువెక్కాయి. 

 

ఆయనే మళ్శీ , " సార్ ! ఈ విషయాలన్నీ కంపెనీ సీఈవో కి పంపి ప్రీతికి తగిన పనిష్ మెంట్ ఇప్పించండి. దాని క్రిమినల్ మైండ్ తో మరెన్ని నేరాలు చేస్తోందో! చెయ్యబోతోందో. బాబూ రాఘవ్, సుమ మీకు కలిగిన కష్టానికి మనసార క్షమించాలి నన్ను".... అని రాఘవ చెయ్యి పట్టుకున్నాడాయన.  

సుమ అభిమానంగా ఆయన  కేసి చూసి  " ప్రీతి కూతురు  జీవితాన్ని చక్కదిద్దండంకుల్. డబ్బు గురించి బాధ పడకండి.  తల్లి ఛాయల నుండి దూరంగా మంచి వాతావరణంలో ఉంచండి"... అంటున్న సుమను ఆరాధనగా చూస్తూ నిలబడిపోయాడు రాఘవ. 

 

అప్పటి వరకూ మౌనసాక్షిలా ఉన్న రాఘవ నాన్నగారు నోరిప్పారు.

 

" అయ్యా! రామారావు గారూ మావలన మీకుటుంబానికి చాలా క్లేశం కలిగింది. ఇంక రాఘవ అమెరికా వెళ్ళబోడు. ఇండియాలోనే  ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటాడు. చాలు ఇంక ఈ ఎండమావుల వెనక పరుగులు" . ... అంటూ!!

 

అందరం ఆమోదసూచకంగా తలాడించాం. 

OOO

bottom of page