top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

మొలకలు

mani.jpg

మణి వడ్లమాని

పొలంగట్టున కూర్చున్న నరసయ్య చేతులు అడ్డంపెట్టుకొని పైకి చూస్తున్నాడు. ఎక్కడా వాన దేవుడు కరుణించేలాలేడు. ఇక ఈ యేడు కూడా పంటలు వేయలేనేమో? ఒక్క వాన కురవకూడదా? పచ్చని పైరు, గాదెల నిండా ధాన్యం ఈ జీవితంలో చూస్తానా? అనుకుంటున్నాడు.

ఇంతలో పక్కపొలము వీరన్నవచ్చాడు. “ఏంటి నరసయ్య అట్టా పైకి చూస్తున్నావు? అంటూ.

“ఏం లేదు వీరయ్యా ఈ యేడు కూడా పంట వేయకపోతే ఎలా? ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నా” అన్నాడు.

“అవును నరసయ్యా! నీమాట నిజమే, తీసుకున్న అప్పులు తీరేమార్గం కనిపించటంలేదు.  మొన్నే నర్సయ్య పండిన పంటకు గిట్టుబాటు ధరరాక, చేసిన అప్పులు తీర్చలేక, ఇకబతికేందుకు దారితెలియక పురుగులమందు తాగి చచ్చిపోయాడు. ఆడితోపాటుగ వాడి పెళ్ళాం బిడ్డలు కూడా పోయారు. ఇంకా అదే నా కళ్ళ ముందు తిరుగుతోంది” అని బాధపడ్డాడు.

“నిజమే! మొన్న రాజయ్య, అంతకు ముందు నారయణ, ఇంకాముందు వీర్రాజు, సూరిగాడు ఇలాఎంతమందో? మన ఊరు వాళ్ళే ఎంతమంది పోయారో?” ఆవేదనగా అన్నాడు నరసయ్య.

“సరే, సరే ఇది మనకి కొత్త కాదుగా, నారు పోసినవాడు నీరు ఇవ్వకపోడు, పద ఇంటికి పోదాము, ఎక్కువగ ఆలోచించకు నరసయ్య”  అంటూ భుజం మీద చెయ్యేసి అడుగులు ముందుకు వేసాడు వీరయ్య.

అతని పాటు నరసయ్య అడుగు కూడా ముందుకు సాగింది. కానీ అతని హృదయం మటుకు సముద్రంలా ఘోషిస్తోంది.

**

ధాత్రి ది విచిత్రమయిన మనస్తత్వం. చాల డబ్బున్న కుటుంబం లో పుట్టింది. తల్లి గొప్పడాక్టర్, తండ్రి పెద్ద  బిజినెస్ మాన్. ఈ నేపథ్యం చాలు, తనుఎంతో విలాసవంత మయిన జీవితం గడపచ్చు. కానీ ఆమె ఆలోచనలు మటుకు తనకున్నన్ని సదుపాయాలు లేని శ్రమజీవుల చుట్టే తిరిగేవి. వారిని ఆసక్తిగా గమనిస్తూ వారి గురించి తెలుసుకుంటూ వారి గురించి ఆలోచించేది.

ఆ ఆలోచనలు పంచుకునేందుకు  తల్లికి, తండ్రికి తీరిక ఉండేది కాదు.కొంతమంది  స్నేహితులకి ఇవి నచ్చేవి కాదు. ఒకళ్ళో ఇద్దరూ వినేవారు. అంతకు మించిన ప్రోత్సాహం, ఉండేది కాదు.

అప్పుడు సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫార్మ్ లో ఆమెకి  కొంత మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. దాని వల్ల తన భావాలూ, అభిప్రాయాలు  పంచుకునే వీలు కలిగింది. డబ్బు కి ఎటువంటి కొదవ లేకపోవడంతో అవసరం కనబడ్డచోటల్లా తనకు తోచిన  సాయం చేస్తూ ఉండేది. కానీ ఇంకా ఏదో చేయ్యాలి అనే తాపత్రయం మటుకు ఉండిపోయింది.

తన ఆలోచనలు  ఈ విధంగా ఉండగా ,ఆమె తల్లి తండ్రులు  ఇందుకు భిన్నంగా ఆమెకి పెళ్లిచేయాలని అనుకుంటున్నారు. దానికి తోడూ అనుకోకుండా  ఒక మంచి సంబంధం వచ్చింది. సిటీ లోనే చాల పేరు ప్రఖ్యాతలున్న బిజినెస్ ఫ్యామిలీ. వాళ్ళకి చాల కంపెనీ లు. వ్యాపారాలు  ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి కి ఏదో పార్టీ లో ధాత్రి ని కలిసాడు తనకి బాగా నచ్చింది అని చెప్పాడు.

 

                     **

“పత్రిక తెరిస్తే రైతుల ఆత్మహత్యలు. టి.వి.పెడితే  అన్నదాతల ఆత్మహత్యలు. అన్నిటిలోను ఇవే ప్రధానవార్తలు, వార్తాకథనాలు.   రైతు అంటే ఆత్మహత్యకి ప్రతీక అయినట్లుంది.

'అన్నదాత' 'వెన్నెముక' అంటారు. రైతులేనిదే 'రాజ్యం' లేదంటారు. మరి ఇదేంటి ఈ బతుకులు ఇలా తగలడ్డాయి అని బాధపడుతున్నాడు నరసయ్య.

నిజానికి నరసయ్య కాస్త చదువుకున్నవాడు. పరిస్థితిని అంచనా వేసే ఆలోచన ఉన్నవాడు. కానీ తన తోటి రైతులు దండలో పూలలా ఒక్కొక్కరుగా రాలిపోవడం బాధగా ఉంది. ఆత్మహత్య మాత్రమే పరిష్కారం అవుతుందా?   ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమేలేదా?

తనలో తనే మధనపడటం చూసిన లక్ష్మి అడిగింది భర్తను  “ఏందయ్యా అట్లా ఉన్నావు?”

“ఏం లేదు లక్ష్మిఏదో ఈ ఏడాది గడచిపోయింది. ఇక ఇప్పుడు తొలకరిజల్లు కురిసినాక మళ్ళి ఎక్కడా వానలే లేవు? ఏంచెయ్యాలో పాలుపోవటంలేదు” అన్నాడు.

“సరేలే ఈ కష్టాలు మనతోపాటుగా ఉండేవే, కళ్ళుమూసుకోఅ దేవస్తుందిలే నిద్ర” అంటూనే పడుకుండిపోయింది.

పడుకున్నభార్యను చూస్తూ అదృష్టవంతురాలు కనీసం నిద్రాదేవి అయినా ఆమె మీద కరుణ చూపిస్తోంది. నాకు అదికూడా లేదు అనుకుంటూ నిట్టూర్చాడు నరసయ్య.

 

 **

ఇంటికి చేరిన ధాత్రికి, లోపలికి వెళ్ళగానే చాలా అరుదైన దృశ్యం కనిపిచింది. తల్లి తండ్రి  హాలులోనే కూర్చొని ఉన్నారు. వాళ్ళ మొహాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

“హాయ్  మమ్మీ, హాయ్  డాడ్ ఏంటి ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటి విషయం?”  అంది. ఇద్దరూ  ఒకేసారి, “నీకో మంచి సంబంధం వచ్చింది ధాత్రీ!" వాళ్ళింకేదో చెప్పబోతూంటే, వారిని ఆపేస్తూ - “మొన్న చెప్పారు అదేనా ? అయితే నాకొద్దు”  అనేసింది.

“అసలు ఏంటో, వాళ్ళు ఎవరో ఏదీ తెలుసుకోకుండానే వద్దు అని ఎలా అంటావు?” తల్లి గొంతులో కరకుదనం వినిపించింది.

“అబ్బ మమ్మీ ! ప్లీజ్  వదిలెయ్యి ”

“ధాత్రీ చిన్నపిల్లవి కావు పెద్దదానివి అయ్యావు” అనేసరికి,

“అందుకే చెబుతున్నామమ్మీ”

“చూడు ధాత్రీ, ఇంతవరకు నీకు నచ్చినట్లుగా చేసావు, అందుకు మేము కూడా సరే అన్నాము, కానీ ఇది నీ ఫ్యూచర్ కి, లైఫ్  కి సంబంధించిన విషయము. అందుకే నేను,డాడీ ఈ సంబంధం నీకు అన్నివిధాల సరిపోతుందని అనుకున్నాము. దినేశ్, మీరు కూడా చెప్పండి” అంటూ భర్తవేపు చూసింది.

“అవునురా తల్లీ, మమ్మీకి నాకు కూడా ఇది చాల మంచి సంబంధం అనిపించింది. రోహన్ అందగాడు, చదవుకున్నవాడు, పెద్దబిజినెస్  ఫ్యామిలీ వాళ్ళది. సొసైటీలో పెద్ద స్టేటస్లో ఉన్నవాడు. నిన్ను బాగా చూసు కుంటాడు ఇక ఇంతకంటే ఏం కావాలిరా నీకు,” అని అనునయంగా అడిగాడు దినేశ్.

“కానీ డాడీ నాకు ఇంకా పెళ్లి గురించిన ఆలోచనలు రావడం లేదు. నాకు కొద్దిగా టైం కావాలి”. అని సీరియస్ గా  చెప్పింది.

“అంటే, నీ మనసులో ఎవరైనా ఉన్నారా?”

“అలాటిది ఏమిలేదు, నాకు ఆ ఇంట్రెస్ట్కూడాలేదు. అలా ఉంటే ఎప్పుడో చెప్పేదాన్ని”.

“మరి ఇంకేంటి ధాత్రి"  నీరసంగా అడిగింది తల్లి లత.

“మమ్మీ, ప్లీజ్ ఇంక ఈ టాపిక్   ఆపేయి" అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది.

ధాత్రి నిరాసక్తతకి విస్తుపోయిన దినేశ్, లతా అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

   **

రోజు లాగే తెల్లవారింది. నరసయ్య, వీరయ్య ఇద్దరూ పొలంకి బయలుదేరి వెళ్లారు. వెళుతూ  మాట్లాడుకుంటున్నారు.

“ఏంటి వీరయ్య? ఎప్పుడు నాకు ధైర్యం చెప్పేవాడివి. ఇవాలే నువ్వు దిగులుగా  ఉన్నావేంటి?”

“ఏందో మనసు బాగాలేదు రాజయ్యా”

                                                            

  **

ఈ మధ్య ధాత్రి బాగా బిజీ గా ఉంటోంది. తల్లి తండ్రి  అడిగితే ఒక  NGO ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ వివరాలు తరువాత చెబుతాను అంది. ఇంతకు  ముందు ఉన్న స్నేహితులు కాకుండా కొత్తవాళ్లు వస్తున్నారు. అందరు కూర్చొని ఏవేవో ప్రణాళికలు  వేసుకుంటున్నారు. కొంతమంది ఫీల్డ్ వర్క్ కూడా చేస్తున్నారు.

 

ఇవన్నీ చూసిన తల్లి తండ్రి ఓ రోజున కూర్చో పెట్టి అడిగారు. “ధాత్రీ,ఏంటి ఇదంతా ? వీళ్ళంతా ఎవరు? అసలు నువ్వేం చేస్తున్నావు" అని.

అప్పుడు దానికి సమాధానం గా “పంటపొలాల  పైన ఆధారపడి జీవించే రైతులు ముఖ్యంగా చదువుకోని వారంతా కూడా  ఏదో ఒక పని చేసుకొని బతకడం కోసం నగరాలకు వెళ్లిపోతున్నారు. కడుపు నిండే మార్గం లేక వలసబాట పడుతున్నారు , తినే నిత్యావసరవస్తువుల ధరలు ఆకాశాన్ని  అంటుతుంటే వాళ్ళకి ఎలా బతకాలో తెలియడం. లేదు.పైగా  పంట పండించు కుందామనుకున్న విత్తనాల నుంచి  నుంచి పంట వరకు రైతుకు అడుగడుగునా అప్పులుచేయాల్సి రావడం, తీరా అనుకున్న పంట  వివిధ కారణాల వాళ్ళచేతికి రాక అప్పులలో కూరుకు పోడమే కాక అవి తీర్చే మార్గం తెలియక  రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

అలాంటి వాళ్ళకు  బతుకు మీద ఆశ కలిపించడం, వారికీ ఏ మేరవరకు సాయం  చేయగలమో, అది చేయాలనీ, మా ఆశయం , దాని ప్రయత్నమే మా ప్రాజెక్ట్  యొక్క ముఖ్య ఉద్దేశ్యం డాడీ”  అని చెప్పింది.

“వీళ్ళందరూ  కూడా దానికోసం పని చేసే వాళ్ళే” అని అక్కడున్న వాళ్ళని చూపించింది.

అయితే  కొన్ని చోట్లలో మాత్రం, అదీ చాలా తక్కువే అయినా, ఇపుడిపుడే టెక్నాలజీ పరంగా ముందుకు  అడుగులు పడుతున్నాయి. ఇంటర్నెట్ ఉపయోగించటం  ఆన్‌లైన్ పరిజ్ఞానం పట్ల కొంత అవగాహనను ఏర్పరచుకుంటున్నారు. వ్యవసాయానికి సంబంధించి అనేక అంశాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటున్న రైతులు తమ అమ్మకాలు కొనుగోళ్లు  ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే ఇది చాల తక్కువ శాతం ఉంది. మా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం లో ఇది కూడా ఒక భాగమే” అని ముగించింది.

దినేశ్, లత ఇద్దరూ కూడా  నోట మాటరాకుండా ఉండిపోయారు.

కూతురు  చేస్తున్నఈ  మంచిపనిని ప్రోత్సహించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పైగా  అక్కడున్న వాళ్ళలో చాల మంది ఆడపిల్లలు  ఇంచుమించుగా ధాత్రి వయస్సు వాళ్ళే ఉన్నారు.  ఈ ప్రాజెక్ట్ లో ఉండి గైడ్ చేస్తున్నారంటూ ఇంకా కొంత మంది పెద్ద వాళ్ళని కూడా పరిచయం చేసింది. 

           ****

“మనలాంటి పేదరైతులకి బ్యాంకులాళ్ళ దగ్గర, ఆ లింగయ్య లాంటి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఆళ్ళ దయ మీద ఆధారపడి వ్యవసాయం చేయడం మన కొచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, వేరేగా డబ్బు దొరకక ఇక దారి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

రేపొద్దున్న మన గతి కూడా ఇంతేరా”  అని నిర్వేదంగా అన్నాడు వీరయ్య.

“అంత దిగాలు పడకు, వీరయ్యా ఏదో జరగుతుందని అనిపిస్తుందిరా! నేను ఆత్మహత్య గురించి ఆలోచించటము లేదు. అసలు ఆ ఆలోచనే లేదు, కానీ ఈ సమస్యను ఎదురుకోవడానికి ప్రయత్నం చేద్దాము”అన్నాడు.

“అదికాదు నరసయ్యా తీసుకొన్న అప్పు తక్కువ సమయంలోనే తీర్చాలి అనడం వడ్డీరేట్లు కూడా ఎక్కవఉండటంవల్లనే కదా మొన్న రాజన్న పురుగుల మందు తాగిపోయింది. అదే భయం నాకు వేస్తోంది“ అన్నాడు బేలగా.

“వీరయ్యా! నా మాటనమ్ము, కొంతకాలం ఓపిక పట్టు.. మనకు ఓ ఆసరా అనేది దొరకుతుంది. రేపు మనదే అనే దైర్యంతో ఉండు”  అని ఉత్సాహపరిచాడు.

 

ఇలా ఒకళ్ళు దైన్యంగా ఉన్నప్పుడు  మరొక్కళ్ళు ధైర్యం చెప్పుకునేవారు.

ఇద్దరూ పొలంగట్ట్టున ఉన్న వేపచెట్టు నీడలో కూర్చున్నారు. కొంచెము దూరంలో   ఎదురుగా రైల్వేస్టేషను కనిపిస్తోంది.

                                                                     **

 

రైలు దిగిన ధాత్రి,స్నేహితులు   స్టేషన్లో చిన్నబండి దగ్గర కాఫీతాగి ఊర్లోకి నడక సాగించారు. మెడకి ఒక బ్యాక్ ప్ప్యాక్,  చెవులలో ఇయర్ ఫోన్స్  వింటూ ఉన్న కొందరు, మొదటిసారి ఊరిని అబ్బురంగా చూస్తూ మరికొందరు-మధ్య మధ్య తమకే సొంతమైన తమ సరదా ధోరణిలో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఊరి వైపుకి అడుగులు వేస్తున్నవారల్లా  అక్కడ జరుగుతున్న ఓ సంఘటన చూసి ఏదో అనుమానమొచ్చినిర్ఘాంత పోయి, వెంటనే తేరుకొని పరిగెత్తుకుంటూ వెళ్లారు.

వీరు వెళుతుండగానే అక్కడున్న పెద్ద చెట్టు పక్కనే  ఒక మనిషి నించొని సీసాలో ఉన్నదేదో నోట్లో పోసుకోవడము, ఆ వెంటనే బాధతో లుంగలు చుట్టుకు పోవడం కనిపించింది. వెంటనే మరింత వేగంగా దగ్గరగా వెళ్ళారు. అప్పటికే అతను కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. అతను బాధతో ఆర్తనాదాలు  చేస్తుంటే అటుగా వెళ్ళిన నరసయ్య పరుగులు పెట్టుకుంటూ వచ్చి వీరయ్యను పట్టుకొని  ‘యెంత పని చేసావు వీరయ్యా ఇప్పుడే  కదా నీకు చెప్పి ఒంటెలు పోసుకోవడానికి వెళ్ళాను. అంతలోకే ఈ పని చేసేసావా’  అని వలవల ఏడ్చాడు.

ఏదో జరిగిందని పక్క పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు  పరుగులు పెట్టుకుంటూ వచ్చారు.

అప్పటికే వీరయ్య బాధతో లుంగలు  చుట్టుకు పోతున్నాడు. అందరు కలిపి  అతన్ని మోసుకుంటూ ఊర్లో ఉన్న ఆసుపత్రి కి  తీసుకొని బయల్దేరారు.

వాళ్ళ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ఊరు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకొని ఆ తరువాత ఏం చెయ్యాలో,ఎలా చెయ్యాలో వాళ్ళని  కూర్చోబెట్టి మాట్లాడాలి అని వచ్చిన వాళ్ళు కాస్తాఅనుకోకుండా  కళ్ళముందే అతని ఆత్మహత్యా ప్రయత్నం చూసి తాము చేయగలిగిందేదయినా త్వరగా మొదలు పెట్టాల్సిందేనని రూఢీచేసుకున్నారు. ఈలోపల  మీడియావాళ్ళకి వార్త  తెలియడం తో వాళ్ళు కూడా వచ్చారు.

అక్కడ ఉన్న అమ్మవారి గుడిపక్క నుంచి వెళ్తుంటే ఊరంతా  వీళ్ళ వెనకాలే నడుస్తోంది . మహా అయితే ఆ ఊరంతా కలిపి రెండువందల మంది కూడా ఉండరేమో? అందులోనే ఇన్నిఆత్మహత్యలా అనుకుంది ధాత్రి. ప్రతి ఇంటి ముందు ముగ్గు, ఓ యెర్రమందార చెట్టు, రెండోమూడో బంతిచెట్లు ఉన్నాయి. కొంత పేడవాసనా కొడుతోంది. అక్కడున్న వాళ్ళలో ఒకలాంటి దైన్యం, నిరాశా కనిపిస్తున్నాయి.

 

అందరూ ఆసుపత్రి వైపు వెళ్లారు. ధాత్రి లోపలికి  వెళ్లి డాక్టర్ ని కలిసింది . పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంది. 48 గంటలు  గడవాలని చెప్పారు.

గబగబా అడుగులు వేస్తూ నరసయ్యతో పాటు నడవడం మొదలుపెట్టారు . ఇంత నాజూకుగా ఉన్న ఈ బస్తీ వాళ్ళు  ఈ పల్లెటూరు ఎందుకు వచ్చారో అర్ధం కాలేదతనికి, చూస్తే అందరు గొప్పింటి వాళ్ళలా ఉన్నారు అనుకున్నాడు. 

ధాత్రి మిగతా స్నేహితులు నరసయ్య  తో   మీ ఊరు  వాళ్ళందరి  తో అందరి  మాట్లాడాలని  వచ్చామని చెప్పారు.

ఆ మాట, ఈ మాట మాట్లాడుతూ  ధాత్రి శిధిలావస్థలో ఉన్న నరసయ్య ఇంటిలోపలకి వెళ్ళింది. ఓ పక్కనుంచి పెంకులు జారిపోతున్నాయి. ఇంకో పక్క వసారాలో యేవో సంచులు  పొలాలుకి పనికి వచ్చే పనిముట్లు ఉన్నాయి. ఆ ఇల్లు చూస్తుంటే ఒకప్పుడుబాగా బతికిన చిహ్నాలు కనిపిస్తున్నాయి.

ఇంతలో నరసయ్య భార్యలక్ష్మి వచ్చింది. నరసయ్య చెప్పాడు. ఆమె గురించి. అక్కడ ఉన్న బల్లమీద కూర్చొని వాళ్ళతో మాట్లాడింది.

నరసయ్య వాళ్లతో పాటు వీరయ్య కుటుంబం తో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంది. వీళ్ళ  ప్రాణాలకి విలువలేదా అనుకుంది. ఇక్కడ జరిగిన సంగతులను టీవీ వాళ్ళు లైవ్ లో చూపిస్తున్నారు.

వాళ్ళలో కొంతమంది ధాత్రి  తో కూడా మాట్లాడుతుండడం చూసిన  ధాత్రి తండ్రి ఫోన్ చేసాడు “ఏం జరిగిందని”

విషయం చెప్పింది.

“సరే అమ్మతో చెప్పి ఆ డాక్టర్ కి స్పెషల్ కేర్ తీసుకోమని  చెబుతానులే, నువ్వేమీ వర్రీ అవకు”అని చెప్పేసరికి  ధాత్రి కి మిగతావాళ్ళకి కూడా మనసు కుదుటబడింది.

అక్కడేన్న ఊరి లో  కొంత మంది తో  రైతుల కూర్చొని ధాత్రి ,ఆమె స్నేహితులు  మాట్లాడుతున్నారు 

నరసయ్యకి ముందు విషయం అర్ధంకాకపోయినా . వాళ్ళు తనలాంటి వారికీ ఏదైనా చెయ్యాలనే ధృడసంకల్పంలో ఉన్నారని  అర్థమవుతోంది. తను నమ్ముకున్న నేలమీద పెట్టుకున్న నమ్మకం నిజమయ్యి కొన్ని సమస్యలయినా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అనుకున్నాడు.

అక్కడున్న ఆ గ్రామస్తులకి ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలో, దానికి ఎన్ని కిలోల విత్తనాలను సరఫరా చేయాలో, ఎంత మోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలో తెలుసుకోవాలని   అదేవిధంగా మీరంతా ఓ సంఘంగా ఏర్పడి, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి కూడా  ఉపయోగపడేలా ఉండాలనే  దిశగాకూడా ఆలోచన చేస్తే  బావుంటుందని  ప్రభుత్వాన్ని  అడుగుదామని  ధాత్రి అనడంతో అందరూ తమ హర్షాన్ని చప్పట్లతో వ్యక్తం చేసారు.

ఇక నుంచి  మీ గ్రామ ప్రజలకు  మేము కూడా అండగా ఉంటాము. మీ దగ్గరకే వస్తాము. అందరం కలిసి సంతోషంగా ఉండేలా  చూసుకుందాము సరేనా అంది. అందరూ తలలూపారు.

వీరయ్య కూతురు,  దాత్రి  దగ్గరగా వెళ్లి  “అక్కా, మా నాయిన బతుకుతాడా?" అని ఏడ్చింది.

“మీ నాన్నకి ఏం కాదమ్మా! డాక్టర్  చెప్పారు. ఇంకో వారం పది రోజులలో  బాగయి ఇంటికి వచ్చేస్తాడు. ఇకపై మీ నాన్నకే కాదు, ఈ ఊరిలో ఏ రైతూకీ కష్టాలు దగ్గరికి రావిక "అని ఒకింత లాలనగా, మరింత ధీమాగా  ఆ పిల్లకి ధైర్యం  చెప్పింది ధాత్రి.

 ధాత్రి, మిగతా స్నేహితులు అక్కడ ఏమేమి చెయ్యాలో ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు.

                                   

  బీడువారిన  మట్టిలోంచి పచ్చని మొలకలు రావడం నరసయ్య కళ్ళ ముందు కనిపిస్తోంది.

                                                                                               

  *****

 

bottom of page