top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

మోడర్న్ మహాలక్ష్ములు

 

గొర్తి వాణిశ్రీనివాస్

vani srinivas.JPG

"ఆరనైదోతనము ఏ చోటనుండు?
అరుగులలికేవారి అరచేతనుండు... ఆ ఆ ఆ "


అంటూ పాటపాడుతూ వీధి అరుగుల మీద ముగ్గులు పెడుతూ తలపైకెత్తి చూసింది విజయలక్ష్మి.  

విజయలక్ష్మికి విట్టుబాబుతో పెళ్ళి జరిగి సరిగ్గా ఒక్కరోజు. అత్తవారింటికి వచ్చిన మర్నాడే తెల్లవారకముందే లేచి, వీధి వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గు గిన్నె పట్టుకుంది విజయలక్ష్మి.

మేడ పై అంతస్తులో నైటీ తో నిలబడి బ్రష్ నోట్లో పెట్టుకుని తననే చూస్తున్న అత్తగారు అనంతలక్ష్మి కనిపించింది. ముఖం చిట్లిస్తూ కోడల్ని చూసింది అనంతలక్ష్మి. ముత్యాలు ముగ్గు సినిమా గుర్తొచ్చి ముక్కు ఎగపీలుస్తూ అత్తగారి వంక చూసింది విజయలక్ష్మి. ఆ తర్వాత స్లోమోషన్ లో కిందికి చూసి, తను దిద్దిన ముగ్గులాంటి ఆకారాలని ముంగిట్లో తృప్తిగా చూసుకుని, పెరటి వైపు వెళ్ళింది.

పెరట్లో పూలుకోసుకొచ్చి పూజ మొదలెట్టింది విజయలక్ష్మి.


"ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా?
ఎక్కడ ఉన్నా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా” అని పాటలు పాడుతూ హారతి ఇచ్చింది.

"లక్ష్మీ ! అలా నాన్ సింక్ లో పాటలు పాడకే! ఏదోలా ఉంది. ప్లీజ్" అని బేలగా అన్నాడు విట్టుబాబు హారతిని భక్తిగా కళ్ళకద్దుకుంటూ.

"నాకొచ్చిన రెండుపాటలూ పాడేశాను. ఇక కొత్తవి నేర్చుకోవాలి. "అంటూ యూట్యూబ్ లో పాటలు సెర్చ్ చేయటం మొదలుపెట్టింది.

స్నానం చేసి దేవుడి గదిలోకి వచ్చిన అత్తగారితో - "అత్తయ్యా! మీ నుదుటన బొట్టేది? ఆ జుట్టేమిటి? అలా కత్తిరించుకున్నారే?" అంది లక్ష్మి, పెళ్ళివరకూ కనబడ్డ అత్తగారి రూపం కళ్ళలో కనబడుతుండగా.

" అదా? హి. హి. మరీ. ఏం లేదు. జ్వరం వచ్చి జుట్టు ఊడిపోయి మరీ పిలకలా అయిందని, ఇలా క్రాఫ్  చేయించేసుకున్నాను. పెళ్ళిలో సవరం పెట్టుకున్నానులే. అందుకే బారు జడలా కనిపించింది. " అంటూ కొడుకు విట్టు వంక గుర్రుగా చూసింది అనంత.

"అత్తయ్యా, ఈరోజు వంట ఏం చేయమంటారు? అంది కడుపులో ఆకలి కరకరలాడుతుంటే.

"కొత్త కోడలివి, నువ్వు వంటచేయటం దేనికి, స్విగ్గీ పెట్టేస్తా. నీకేంకావాలో చెప్పు " అంది అనంత ఆర్డర్ బుక్ చేస్తూ.

లక్ష్మి భర్తవంక మిర్రుగా చూసింది.


ఇద్దరూ తనని అలా చూట్టం చూసీ చూడనట్లుగా చూశాడు విట్టుబాబు.

"ఉరేయ్ బాబూ. వచ్చేటప్పుడు హెయిర్ కండిషనర్, హెయిర్ డ్రయర్ తీసుకుని రారా! జుట్టు ఫ్రిజీగా అయిపోయింది."అంది అనంత ఆఫీస్ కు వెళుతున్న కొడుకుతో.

"ఏవండీ, వచ్చేటప్పుడు సంకటహర సాయిబాబా చరిత్ర పుస్తకం తీసుకురండి. కొత్త నిత్యవ్రతమొకటి చేయాలి. లిస్టు పంపిస్తాను. పూజాసామాగ్రి తెండి." అంది లక్ష్మి.

"ఈ వయసులోనే అంత భక్తి ఏవిటో? ఆ దేవుడి పూజలు దేనికో? విడ్డూరం?" అంది అనంత లిప్స్టిక్ వేసుకుని, పై పెదవిని కింది పెదవితో రుద్దుకుంటూ.

"ఈవిడకి ఇంట్లో ఉన్నపుడూ ఈ జిగేల్మనే ఫ్రాకులు, ఎర్రెర్రని లిప్స్టిక్కులు, అంత నప్పని భారీ మేకప్పులేమిటో ఎందుకో?" ఒక కనుబొమ్మని పైకి లేపి గొణిగినట్టుగా అంది లక్ష్మి.
 

ఇద్దరూ ఒకేసారి విట్టుబాబు వంక గుర్రుగా చూసారు.

ఆఫీస్ నుంచి వచ్చిన విట్టుబాబు భార్య లక్ష్మికి ఫోన్ చేసి "ఫాస్ట్ గా నా క్యాబిన్ కి రా" అన్నాడు.
"మీ క్యాబినా... అదెక్కడ?" అంది.
"మేడ మీదకి" అన్నాడు విట్టు.
"మీరే నా క్యాబిన్ కి రండి" అంది
"అదెక్కడ?" అన్నాడు
"పెరట్లోకి" చెప్పింది లక్ష్మి.
పెరట్లోకి వచ్చిన విట్టుబాబు చొక్కాపట్టుకుని ఏదో అనబోయింది.
చొక్కా రెండు బొత్తాలు ఊడి లక్ష్మి చేతిలోకొచ్చాయ్
"అసలు నాతో మీరేం చెప్పారు? ఇక్కడేం జరుగుతోంది?" అంది లక్ష్మి.
"ఏం చెప్పాను?" అంటుండగా విట్టు ఫోన్ మోగింది.

"విట్టుబాబూ నువ్వు తొందరగా నా క్యాబిన్ కి రారా" అంది అనంత.

"నీక్కూడా క్యాబిన్ ఉందామ్మా! అదెక్కడ?" అన్నాడు
"మెట్లకింద" అంది.
పెరట్లోంచి మేడమెట్ల దగ్గరకు వచ్చాడు విట్టు.

"పెళ్లికి ముందు నాకు నువ్వేం చెప్పావ్. ఇక్కడ జరుగుతున్నది ఏంటి?" అంది అనంత కొడుకు చొక్కా పట్టుకుని .
చొక్కా బొత్తాలు మూడు ఊడి చేతిలోకి వచ్చాయి.

"అమ్మా ఇదేంటే! ఇద్దరూ కలిసి నా చొక్కా బొత్తాలు ఊడబీకారు.ఈ బరి వొంటితో నేనిక్కడ వుండను. ఆ.."
అంటూ అలిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు విట్టు.

అనంత ,లక్ష్మి ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటూ హాల్లోకి వచ్చారు.

లక్ష్మీ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక ఫోటో తీసి టేబుల్ మీద పెట్టింది.

"అత్తయ్యా! ఇదేంటి?" అంది లక్ష్మి
హై...ఇది నా ఫోటో !" అంది అనంత.

"ఈ ఫొటోలో మీరు ఎంత బావున్నారో చూడండి. తల్లో పూలు,చేతుల నిండా గాజులు, రూపాయి బిళ్ళంత పెద్ద బొట్టుతో అబ్బ! ఉషా ఉత్తప్ లా ఎంత పద్దతిగా ఉన్నారో. ఇప్పుడు ఈ అవతారం ఏంటి అత్తయ్యా?" అంది లక్ష్మి.

అనంత బుక్స్ ర్యాక్ లోంచి ఒక ఫోటో తీసి టేబుల్ మీద పెట్టి, 
"లక్ష్మీ! ఇదేంటి?" అంది.
"హై...ఇది నా ఫోటో!" అంది లక్ష్మి

"ఈ ఫొటోలో నువ్వెంత మోడరన్ గా ఉన్నావో చూడు. అచ్చం కత్రినా కైఫ్ లా ఉన్నావ్. ఇప్పుడు ఈ అమ్మమ్మ అవతారం ఏవిటీ?" అంది కోడల్ని ఎగాదిగా చూస్తూ.

"ఆదా..అదీ అత్తయ్యా..మీకోనిజం చెప్పాలి. పెళ్లికి ముందు నేనూ మీ అబ్బాయీ కాలేజీలో ప్రేమించుకున్నాం.ప్రేమ వివాహంలా ఉండకూడదు , పెద్దలు కుదిర్చిన పెళ్లిలా ఉండాలని పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం కుదిరేలా చేశారు మీ అబ్బాయి. మీరు చూసిన బోలెడు మంది అమ్మాయిల్లో నేను మాత్రమే మీకు నచ్చాలని ఈ ఫోటోని చూపించి , మీ అభిరుచులు ,అలవాట్లు అన్నీ చెప్పి  నువ్వు అమ్మలా వున్నావంటే అమ్మకి తప్పకుండా నచ్చుతావు అని చెప్పారత్తయ్యా మీ అబ్బాయి." అంది లక్ష్మి అమాయకంగా మొహంపెట్టి.

"అవునా! వాటే వండర్? మీ ప్రేమ విషయం నా కొడుకు నాకు చెప్పకుండా నన్ను మోసం చేసాడు. నా కొడుకు నాతో ఏమన్నాడో తెలుసా! "ఈ కాలంలో అమ్మాయిలు చాలా మోడ్రన్ గా వుంటున్నారు. నువ్వు మరీ పోర్ట్బుల్ బ్లాక్ అండ్ వైట్ టి .వి లా ఉంటే ఎలాగమ్మా! అప్డేట్ అవ్వాలి"  అన్నాడు.

"అవునత్తయ్యా! నాతో కూడా నువ్వు కోల్ కత్తా, అమ్మ చెన్నై అంత దూరంలో ఉంటే మీ ఇద్దరికీ పొసగదు. నువ్వోమెట్టు దిగి విజయనగరం దాకా రావాలి..."అన్నారు.

"ఆగాగు మిగిలింది నేను చెబుతా. నిన్ను విజయనగరం దాకా రమ్మన్నాడా? నన్ను చెన్నై నుంచి విశాఖ దాకా రమ్మన్నాడు. ఇద్దరూ అటూ ఇటూగా ఎన్ హెడ్ ఫైవ్ దగ్గర కలుసుకునేంత దరిదాపుల్లోకి వస్తే  అడ్జెస్ట్మెంట్ కుదురుతుందని నాక్కూడా చెప్పాడే.

"మీ అబ్బాయి నాక్కూడా అలాగే చెప్పారు. అందుకే మీకు నేను నచ్చాలని పూర్తిగా మీలా మారిపోయానత్తయ్యా!" అంది లక్ష్మి.

"నిజం చెప్పొద్దూ! నేను కూడా నీకోసమే మోడ్రన్ గా మారిపోయాను.అత్తగారు పాతకాలం మనిషి అని నువ్వు అసంతృప్తికి గురికాకూడదని మారుతూ మారుతూ నేను హైవే ఎక్కి కలకత్తా దాకా వచ్చేసాను

"అవునత్తయ్యా..నేనూ మీకు నచ్చాలనే మారుతూ మారుతూ చెన్నై దాకా వెళ్ళిపోయాను." అంది.

"భలేవుందే నా ముద్దుల కోడలా! మనిద్దరం ఒకరికోసం ఒకరం, ఒకరికి నచ్చాలని ఒకరం తెలియకుండానే మారిపోయాం. ఇదంతా నా కొడుకు అదే నీ మొగుడు చేసిన నిర్వాకం. ఈ మగాళ్ళున్నారే. ఎప్పుడూ ఇంతే. మనల్ని మనలా వుండనివ్వరు. వాళ్ళు మారరు. కానీ, మనల్ని మారమంటారు.."అంది అనంత.

"అవునత్తయ్యా! మనల్ని ఇంతలా మార్చేయటం అన్యాయం. ఇప్పుడేం చేద్దాం" అంది లక్ష్మి.

"చెబుతాను. ముందు నువ్వు అర్జంటుగా వెళ్లి ఆ చీర విప్పేసి హాయిగా నీకు నచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకునిరా" అంది అనంత.

"అలాగే అత్తయ్యా! మీరుకూడా ఆ డ్రెస్ విప్పేసి చక్కగా కే ఆర్ విజయలాగా చీరకట్టుకుని రండి." అంది.
ఇద్దరూ గదుల్లోకి వెళ్లి బయటకు వచ్చారు.

మోకాళ్ళ దగ్గర కంతలున్న టోన్ జీన్స్ లో కొత్త సినిమా హీరోయిన్ లా ఉన్న లక్ష్మి ని తృప్తిగా చూసుకుంది అనంత.

పట్టుచీరలో నిండుగా శ్రీవిద్యలా ఉన్న అత్తగారి వైపు ఆరాధనగా చూసింది లక్ష్మి.

ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన విట్టు భార్య డ్రెస్సుని చూసి కంగారుపడ్డాడు.

"ఒరేయ్ మీ ఆవిడని చూశావా?! వచ్చిన నాలుగురోజులకే తన ఇష్టం వచ్చినట్టు నా ముందే ఎలాంటి బట్టలేసుకుని తిరుగుతోందో చూడు" అంటూ కొడుకు చొక్కా పట్టుకుంది. ఈ సారి బొత్తాలు ఊడలేదు. చొక్కా చినిగింది. చినిగిన చొక్కాతో భార్య దగ్గరకు వెళ్ళాడు.

" ఏవండీ! నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు  అత్తయ్యగారు చాలా మోడ్రన్ మహిళ అన్నట్టు కనిపించారు. నాలుగురోజుల్లో ఎలా మారిపోయారో చూడండి. నేను మాత్రం తక్కువ తిన్నానా!?  ఇక మీదట నేను నాలాగే ఉంటాను." అంటూ విట్టుబాబు చొక్కాను లాగి ఇంకాస్త చించింది లక్ష్మి.

"ఒరేయ్ ఇటురారా! నీ భార్య అలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే నేవెళ్లి హాయిగా సాయిబాబా మఠంలో చేరిపోతా." అంది అనంత.

"ఏవండీ ఇటురండి! ఆవిడ రోజుకో రంగులు మారుస్తుంటే, ఆవిడకోసం నా మనసుకు విరుద్ధంగా మారటం నా వల్ల కాదు. "అంది లక్ష్మి.

"ఇటు రారా!" అంది అనంత చప్పట్లు కొట్టి పిలుస్తూ.
"ఇటు రండి" అంది లక్ష్మి.
ఇటు ఇటు అంటూ అత్తాకోడళ్ల వరస చూస్తుంటే ఇల్లు రణరంగంగా మారే వాతావరణం కనిపిస్తోందని భయపడ్డాడు విట్టుబాబు.

"అమ్మా! ఏంటి ఇదంతా!ఇద్దరూ కలిసి నా చొక్కా డొక్కా చించుతున్నారు. మీరిద్దరూ అతివృష్టి అనావృష్టిలా ఉంటే నేనేం చేయను?  అటు తల్లి ఇటు పెళ్ళాం. మధ్యలో ఇరుక్కుపోయాను."అని బిక్కమొహం పెట్టాడు విట్టుబాబు.

విట్టు మొహం చూసి అనంతా, లక్ష్మీ ఇద్దరూఒకేసారి పగలబడి నవ్వారు.

"ఒరేయ్ పిచ్చి సన్యాసీ! నాలా మారమని కోడలితో, కోడలి పద్ధతులను నేర్చుకోమని నాకూ చెప్పావు. కానీ చిన్నప్పటినుంచీ వచ్చిన అలవాట్లను మార్చుకోవడం అంత తేలిక కాదురా. మనింటికి వచ్చిన కోడలు బట్టలు, జుట్టు మీద పెట్టే శ్రద్ధ ఆమెని అర్ధం చేసుకోవడంలో పెడితే బాగుంటుంది." అంది అనంత.

" అత్తయ్య అంటే మరో అమ్మ. అత్తాకోడళ్ళమధ్య అర్ధం చేసుకోవడంలో వుండే సంతోషాలూ, అపార్ధాల వల్ల అలకలూ, అవి తీరి ఆనందాలూ అన్నీ ఉంటేనే కదా కాపురం సరదా సరదాగా ఉంటుంది? " అంది లక్ష్మి.

"వామ్మో! అత్తాకోడళ్లు కలిసిపోయి నాకు క్లాసు తీసుకుంటున్నారని అర్ధమైంది. అమ్మను నొప్పించకుండా ఇష్టపడిన లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని ఈ రూట్లో వచ్చాను తప్ప మరోటి కాదు.  మీరిద్దరూ పట్టాలమీదకు ఎక్కిన ఎక్స్ప్రెస్ లా దూసుకొస్తుంటే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గార్డులా
నేను దూరంగా జరిగి పచ్చజెండా ఊపుతాను. నన్ను మాత్రం మీ మాటల స్పీడ్ తో డాష్ ఇచ్చి క్రాష్ చేయకండి." అన్నాడు.


విట్టుబాబు మాటలకి అత్తాకోడళ్లు ఫక్కున నవ్వారు. విట్టు వాళ్ళ నవ్వులతో శ్రుతి కలిపాడు.

*****

bottom of page