MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
మేఘన
ఇర్షాద్ జేమ్స్
అది అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఆస్టిన్ నగరం.
సాయంత్రం ఆరు దాటినా, ఎండా కాలం కావటం వల్ల ఇంకా చాలా వేడిగా వుంది.
మేఘన, మేఘన వాళ్ళమ్మ H.E.B. కూరగాయల దుకాణం లోంచి బయటికి వచ్చారు, షాపింగ్ కార్టు తోసుకుంటూ.
ఇద్దరూ క్రాస్ వాక్ ముందు నిలబడ్డారు.
రెండు వైపుల నుంచి కార్లు వస్తున్నాయి.
కొన్ని నిమిషాల తర్వాత, "OK, ఇప్పుడు క్రాస్ చేద్దాం", అంది అమ్మ.
అమ్మ షాపింగ్ కార్ట్ ని ముందుకి తోయబోతుండగా, "Wait !!" అని అకస్మాత్తుగా పక్కనే వున్న ఒక పెట్ షాప్ వైపు పరుగెత్తింది మేఘన.
ఆ పెట్ షాప్ కిటికీ బయట ఒక పెద్ద పోస్టర్ అతికించి వుంది.
ఆ పోస్టర్ మీద ఒక చాలా అందమైన, రంగు రంగుల పక్షి బొమ్మ వుంది.
మేఘన ఆ పక్షి బొమ్మని చూస్తూ అలా నిలబడిపోయింది.
ఈ లోపల అమ్మ కూరగాయాలన్నీ కారు ట్రంక్ లో పెట్టి, మేఘన కోసం కారులో వేచి వుంది.
కొన్ని నిమిషాల తరువాత అమ్మ కారులోంచి దిగి, పెట్ షాప్ వైపు నడిచింది, మేఘనని వెతుకుతూ.
కానీ మేఘన పెట్ షాప్ కిటికీ దగ్గర లేదు.
అమ్మ పెట్ షాప్ తలుపు తెరిచి, లోపలకి అడుగు పెట్టింది.
పెట్ షాపు లోపల వెనుక భాగం లో కనపడింది మేఘన.
అక్కడ పంజరంలో వున్న అందమైన రంగు రంగుల పక్షిని చూస్తూ నిలబడి వుంది మేఘన.
"ఇంటికి వెళ్దాం పద !" అంది అమ్మ.
"అమ్మా, ఈ పక్షిని కొనివ్వు అమ్మా, ప్లీజ్ !" అంది మేఘన.
అమ్మ పక్షి వైపు చూసింది.
అది నిజంగా చాలా అందమయిన, రంగు రంగుల పక్షి.
పంజరం మీద దాని ఖరీదు వ్రాసి వుంది: డెబ్బై అయిదు డాలర్లు !!
"ఇది చాలా ఖరీదైన పక్షి. పైగా దీన్ని చూసుకోవాలంటే చాలా పని. నాకు అంత టైమ్ వుండదు. పద, వెళ్దాం!" అంది అమ్మ.
"ప్లీజ్ అమ్మా.." అంది మేఘన.
"ఇంటికి వెళ్దాం పద !!" అని అమ్మ మేఘన చేయి పట్టుకుని షాప్ లోంచి బయటకి వచ్చేసింది.
* *
రెండు రోజుల తరువాత:
మేఘన స్కూల్ బస్ లోంచి దిగి, ఉత్సాహంగా ఇంటికి పరుగెత్తింది.
లివింగ్ రూమ్ లో తన పుస్తకాల బ్యాగ్‌ని పడేసి, వేగంగా కిచెన్ లోకి పరుగెత్తింది, అమ్మ దగ్గరికి.
"అమ్మా!! బెక్కీ వాళ్ళ నాన్న ఫ్రెండుకి బేబీ సిట్టర్ కావాలంట. నేను బేబీసిట్ చెయ్యనా, ప్లీజ్?" అడిగింది మేఘన.
అమ్మ ఆశ్చర్యపోయింది.
"కానీ నువ్వెప్పుడూ బేబీ సిట్టింగ్ చేయలేదు కదా? ఎలా చేస్తావు?" అడిగింది అమ్మ.
"నాకు తెలుసమ్మా, నేను చేయగలను. థాంక్స్ అమ్మా, లవ్ యూ !!" అని కిచెన్ లోంచి బయటకి పరుగెత్తింది మేఘన.
వెంటనే తన ఫ్రెండు బెక్కీ కి ఫోన్ చేసింది.
"హే బెక్కీ, మై మామ్ సెడ్ యెస్ !!" అంది మేఘన.
"గ్రేట్, ఐ విల్ లెట్ మై డాడ్ నో !!" అంది బెక్కీ.
* *
ఆ తరువాత కొన్ని వారాల పాటు మేఘన రోజూ కొన్ని గంటలు బేబీ సిట్టింగ్ చేసింది.
ఒక రోజు సాయంత్రం మేఘన ఇంటికి వచ్చి, ఆత్రంగా తన డబ్బులు లెక్క పెట్టింది.
డెబ్బై ఏడు డాలర్లు వున్నాయి !!
మేఘన వెంటనే అమ్మ దగ్గరకి పరుగెత్తింది.
"అమ్మా, చూడు!!" అని డబ్బులు అమ్మకి చూపించింది.
"ఇప్పుడు నా దగ్గర ఆ పక్షిని కొనడానికి సరిపడే డబ్బులు వున్నాయి!!" చెప్పింది మేఘన.
అమ్మ ఆశ్చర్యపోయింది.
"నేను నమ్మ లేక పోతున్నాను. నువ్వు ఆ పక్షి కోసం ఇన్ని రోజులు బేబీ సిట్టింగ్ చేసి డబ్బులు సేవ్ చేశావా !!??" అడిగింది అమ్మ.
"అవునమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆ పక్షిని కొందాం, ప్లీజ్.." అంది మేఘన.
"అలాగే" అంది అమ్మ, ఇంకా ఆశ్చర్యంగా.
మేఘన, వాళ్ళమ్మ పెట్ షాప్ కి డ్రైవ్ చేసుని వెళ్లారు.
ఆ అందమయిన రంగు రంగుల పక్షిని కొని, పంజరంలో ఇంటికి తీసుకొచ్చింది మేఘన.
* *
ఆ మరుసటి రోజు సాయంత్రం, మేఘన వాళ్ళమ్మ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చింది.
కారు గరాజ్ లో పార్క్ చేసి, లివింగ్ రూమ్ లోకి వచ్చింది.
పక్షి ఎలా వుందో చూద్దామని పంజరం దగ్గరికి వచ్చి, ఆశ్చర్యపోయింది అమ్మ !!
ఎందుకంటే, పంజరం తలుపు తెరిచి వుంది !!
పంజరంలో పక్షి లేదు !!
అమ్మ కంగారుగా మేఘన రూమ్ కి వెళ్ళింది.
"మేఘనా !! పక్షి ఏది?" అడిగింది అమ్మ.
మేఘన మౌనంగా అమ్మ వైపు చూసింది.
"పక్షి ఏమైంది !!??" మళ్ళీ అడిగింది అమ్మ.
"వదిలేశాను. ఎగిరిపోయింది !!" అంది మేఘన.
"వదిలేశావా !!??" ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.
"అవునమ్మా, కావాలనే వదిలేశాను. ఆకాశంలోకి ఎగిరిపోయింది, మేఘాల వైపు !!" చెప్పింది మేఘన.
అమ్మ ఇంకా ఆశ్చర్యం నుంచి తెరుకోలేదు.
"నీకు ఆ పక్షి అంటే చాలా ఇస్టం కదా !! ఎందుకు వదిలేసావు? అసలు అంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావు??" అడిగింది అమ్మ.
"అమ్మా, నేను కొన్నది కేవలం ఆ పక్షినే కాదు.." అంది మేఘన.
“మరి?” అడిగింది అమ్మ.
"నేను కొన్నది... ఆ పక్షి స్వేచ్ఛని !!" చెప్పింది మేఘన.
* * * * *