MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మెడమీద వాటా అద్దెకివ్వబడును
ఆహ్వానిత మధురాలు
కొండేపూడి నిర్మల
సుభద్రకివాళ మనసు మనసులో లేదు.
వొంటిమీద నగలన్నీ వొలిచి గంపలో వేసింది. రివ్వుమంటూ వళ్లంతా చల్లటి ఏ.సి గాలి తగిలింది. నగలు తీసేస్తే ఇంత గాలి తగులుతుందా? అని ఆశ్చర్య పోలేదు. అసలా సుఖాన్ని గుర్తించే పరిస్థితిలోనే ఆమె లేదు. ఎడమ కాలితో కార్పెట్ మీద ఒక తాపు తన్నింది. గంప తుళ్ళి రాక్షసుడి నాలుక బద్ద లాంటి వడ్డాణం కిందపడింది. వెంటనే కళ్ళకద్దుకుని దాన్ని తీసి గంపలో వెయ్యలేదు. వొలికిన పళ్లరసంలో తడిసిపోయిన వారపత్రికలోకి క్రూరంగా చూస్తూ బుసలు కొడుతొంది.. అక్కడ ఆమె శత్రువు సోమరాజు రాసిన కధ వుంది. అది తన మీద రాసినట్టుగానే వుందని సుభద్ర అనుమానం,
ఛ... కాదేమోనండి, అని ఇద్దరు ముగ్గురు చెప్పినా గానీ ఆమె శాంతించలేదు. అసలు తనకింత అవమానం జరిగినా సరే దేశంలో జనం అంతా అంత ప్రశాంతంగా ఎలా బతుకుతున్నారో అర్ధంకాలేదు. అప్పనంగా అన్ని పూజలకీ వాయినాలు పుచ్చుకున్న ముత్తయిదువులన్నా కాసేపు కత్తి నూరచ్చు కదా అలా మద్దతు ఇవ్వడంలేదు. ఒకటా రెండా, నందికేశవ నోము, నారీ ఫల నోము, గ్రామ కుంకుమ నోము, గోంగూర పచ్చడి నోము, అష్టలక్ష్మీ నోము, ఆవకాయ నోము, ఒక్కో నగ కొన్నప్పుడల్లా ఒక్కో నోము నోస్తునే వుంది. ఎవరికోసం చేస్తోందివన్నీ? ఆ మాట కోడళ్ళు ముగ్గుర్నీ చాలా సార్లు అడిగింది. ఎవరికీ తెలీనట్టు మొహాలు పెట్టారు.
"మీకోసమే కదా, నేను నోచేది, అందర్నీ నోచమని చెప్పేది." హూంకరించింది. బలహీనంగా నవ్వారు వాళ్ళు.
నవ్వుతారేమిటి నవ్వులు, నవ్వుతాలుగా వుందా తన బాధ. ఛ! అంతా దొంగలు, మొన్నటికి మొన్న చిన్నకోడలు చెప్పులతో వ౦ట గదిలోకి వచ్చేసింది, అదేమిటని అడిగితే టిఫిను బాక్సు అక్కడ వుండిపోయిందిట, చెప్పులిప్పేందుకు కూడా టైము లేదట, చూస్తూ వుండు, తను పోగానే ఆ పూజ గది కాస్తా పాత టైర్ల షాపువాడికి అద్దెకిచ్చేస్తారు. అందుకని బతికుండగానే గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ ఎలా ? అదే అర్ధమయి చావడంలేదు. మనిషి అల్లకల్లోలమై పోతోంది.
"ఇప్పుడు నీ గుర్తింపుకేమయింది? ఊళ్ళో ఎవరు కొత్త నగ చేయించుకోవాలన్నా సలహా ఇచ్చేది నువ్వే కదా, ఏ కొత్త నోము నోచాలన్నా అడిగేది నిన్నే కదా ?“ పెద్దకొడుకు నచ్చజెప్పాడు.
సుభద్ర వినదల్చుకోలేదు. కబుర్లకేమిటి చాలానే చెబుతారు. ఇంతకాలం తను ఇవి వినే మోసపోయింది. ఇప్పుడలా కాదు. ఆ కొరగాని వెధవ సోమరాజుగాడ్ని దెబ్బకొట్టాలంటే గట్టి ప్రయత్నమే చెయ్యాలి. ఆలోచించింది, చించింది, చించింది. వారపత్రికని చించి పోగులు పెట్టింది. పేరు తెచ్చుకోవాలంటే చాలా దార్లు వున్నాయి. శత్రువుని శత్రువు ఆయుధం తోనే దెబ్బకొట్టాలట. ఈమధ్య టీవీ సీరియల్లో ఎవరో అన్నారు. అదే ఖరారు చేసుకోవాలి.
ఏమిటా ఆయుధం ?
రచన. అబ్బో. తన వల్ల అయ్యే పనేనా...?
ఆలోచించింది. అప్పుడు సరిగ్గా సాయంత్రం ఆరున్నర. అంటే సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోతూ, అక్కడ నిక్కి నీలుగుతున్న చంద్రుడి చెవి పట్టుకుని పైకి లాగి డ్యూటీకి పెట్టిన సమయం. సుభద్రకు మనసు భద్రమయ్యే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తీగలు సాగి పువ్వులు పూస్తున్నకొద్దీ పెరుగ బోయే ఆకస్మిక పరపతిని తల్చుకుంటే కాళ్ళు నేలమీద నిలబడలేదు. గాల్లో తేలిపోతున్నట్టూగా వుంది. అసలు ముందు రచయిత్రి అవుదామా, గాయనీమణి అవుదామా...? అని కాసేపు సరదా పడింది... తల్చుకుంటే గాయనీమణి అవ్వచ్చు, కానీ దానికోసం ముందు కష్టపడి నేర్చుకోవాలి, ఆ తర్వాత కచేరీ చెయ్యాలి అప్పుడు తప్ప పేరు రాదు, అదే రచయిత్రి అయితే ఇలా రాయగానే అలా పేరుతో అచ్చయిపోతుంది. కాబట్టి ఇదే బెటరు… అని నిర్ణయించేసుకుంది.
ఆ రాత్రి నిద్ర పట్టలేదు. పరధ్యానంగా గడిపింది. తెల్లారి టూత్ బ్రష్ మీద షాంపూ వొంచుకుని పళ్ళూ తోముకుంది. నగలు వేసుకోకుండా నైటీలోనే ఆరు బయట నిలబడింది. గుమ్మంలో రధం ముగ్గుకోసం చుక్కలు కలుపుతూ పనిమనిషి పొరబాట్న తనకాలు తొక్కినా పట్టీంచుకోలేదు. పవిత్ర జలం అసలే చల్లుకోలేదు.
భర్తగారు గడ్డం గీసుకు౦టూ పొరబాటున దవడ చెక్కేసుకున్నాడని రక్తం వరదలై పారి౦దని పనివాడు చెబితే, ‘ఓహో, అలాగా’ అంది ఎటో చూస్తూ,
గోచీ పోసి కట్టిన మడిచీర కాళ్లకి అడ్డంపడి బోర్లా పడినా గానీ, మోకాళ్లయినా నిమురుకోకుండా , సెల్ ఫోన్ అందుకుని ఒక నంబరు డయల్ చేసింది.
"పంతులు గారూ… రచయిత్రి అవాలంటే ఏంచెయ్యాలంటారు.” తన ఆస్థాన జ్యోతిష్కుడ్ని అడిగింది.
పంతులు గారికి ఈ మధ్యనే చెవుడు వచ్చింది. ఆ విషయం తెలిస్తే బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి మొత్తానికి ఇది కూడా ఏదో వ్రతంలాంటిదే అనుకుని, లౌక్యంగా "అమ్మా మీకు ఈ సత్సంకల్పం ఎప్పుడు కలిగింది." అడిగాడు.
"ఇందాకే... బోర్లాపడకముందు...” అనేసి నాలుక్కరుచుకుంది.
“అయ్యో బోర్లా పడ్డారా అమ్మా, గృహ మధ్యబాగంలో పడ్డారా...? గృహ ఆవరణలో పడ్డారా...? ఈశాన్యదిక్కున పడ్డారా? అగ్నేయ స్థానంలో పడ్డారా? వాయు స్థానంలో పడ్డారా ? జలస్థానంలో పడ్డారా… ? ఎక్కడ… పడ్డారు ? " ప్రశ్నించాడు.
"ఇంటి ముందున్నగడప మీద పడ్డానయ్యా, పడినప్పుడు అన్ని దిక్కులూ గిరగిర తిరిగినట్టయింది. అయినా ఆ వివరాలెందుకు మధ్యలో..."కసురుకుంది.
"చెబుతా చెబుతా, ఆగండి... మీరు చెబుతున్నదాన్ని బట్టి అది హిరణ్యకశపుడ్ని విష్ణుమూర్తి చీల్చి చెండాడిన సమయం, అనగా సంధ్యా సమయం. ఈ సమయం లో ఆ స్థానంలో బోర్లాపడి లేచినవాళ్ళు ఏ పని చేసినా తిరుగులేదు. శత్రు శేషం వుండదు." అలవాటుగా అన్నాడు.
సుభద్రకి ఏనుగు ఎక్కినంత పనయింది. పక్కనే వున్న సోఫా ఎక్కి, హై హై నాయకా అని అరుద్దామనుకుంది.
ఆవిడకి ఎప్పటీనుంచో సోమరాజుమీద కోపంగా వుంది. సోమరాజు అభ్యుదయ రచయిత. గుప్పెడంత కండలేదు… కూచోను కుర్చీలేదు. వొంటి నిండా పొగరు మాత్రం వుంది... మొన్నటికి మొన్న చిటారుకొమ్మన వున్న మందార పువ్వు కొయ్యడానికి గోడెక్కి జారుతుంటే నవ్వుకుంటూ వెడుతున్నాడు కొంగ మెడ వెధవ... ఇప్పుడు వాడి వేలుతోనే వాడి కన్ను పొడవాలంటే అభ్యుదయ రచయితనే అయితీరాలి తిరుగులేదు - అనుకుంది.
అనుకున్నదే తడవుగా ఆ విషయం తన చిన్ననాటి స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పింది సిగ్గు సిగ్గుగా...
"రచయిత అవుదామనుకుంటున్నానే " అని,
"అలాగే అయిపో... దానికేముంది " అనేసి, " ఏమిటన్నావు. " రెట్టించింది, అనుమానమొచ్చి.
సుభద్రకున్న బలహీనతలు, బలాలు ఆమెకి తెలుసు. కొత్తగా మార్కెట్ లోకి ఏ నగ దిగినా తను వెంట వుండాల్సిందే. మూడ్ బావుంటే తరచూ అప్పులిస్తుంది. తను పట్టుచీర కొనుక్కుంటే స్నేహితురాలికి రవికల ముక్క కానుకగా ఇస్తుంది. తను గోల్డేన్ ఫేషియల్ చేయించుకునేలోపు ఆమెని రైతుబజారునుంచి కూరగాయలు తెచ్చుకోనిస్తుంది.
అంచేత మళ్ళీ అడిగింది. "ఏమిటన్నావు."
సుభద్ర ఓపిగ్గా మళ్ళీ చెప్పింది, " నా శత్రువు సోమరాజు తెలుసుగా, మొన్నటివారం వీక్లీలో నామీద ఏదో వెటకారంగా రాసినట్టనిపిస్తోంది. వాడి తిక్క తిన్నగా కుదర్చడం కోసం నేనూ రాస్తాను. రాయాలంటే రచయిత అయిపోవాలి, అంచేత అయిపోదామనుకుంటున్నాను."
"వాడి తిక్క కుదర్చడం కోసం అయితే ఏ సందులోనో దొరకబుచ్చుకుని మెత్తగా తన్నించు. అంతేగాని రచయిత అవడం ఎందుకు…? " స్నేహితురాలికి సుభద్ర లాజిక్ అర్ధంకాలేదు.
"అదికాదే నాకీ ఆలోచన వచ్చిన వెంటనే గడపమీద బోర్లా పడ్డాను. పడితే పడ్డానుగానీ ఆ సందర్భం చాలా మంచిదిట, శత్రు శేషం వుందదుట, నా శత్రువు ఎవరు, సోమరాజు, ఆ ముష్టి సోమరాజు బలమేమిటి..? వాడి రచన, సో నేనూ ఓ అభ్యుదయ రచయిత్రి అయిపోతే వాడికక్కడ చోటులేకుండా పోతుంది. అప్పుడు తిక్క కుదిరిపోతుంది."
"అయితే ఏం చెయ్యమంటావో చెప్పు, రాత్రికి రాత్రి వాడి కలం విరిచితెచ్చి నీ కోట గుమ్మానికి కట్టమంటావా, చెప్పు.... ?" ఉద్రేకపడింది .
"అలాంటి పప్పులేమీ వుడకవు, మొన్న కాలుకి ఫ్యాక్చరయినా గానీ ఆస్పత్రిలో కూచుని గేయం రాశాడుట, వాడి అసాధ్యం కూలా, అసలక్కడ సెలైన్ తగిలించారో, సిరా తగిలించారో అడగాలి. పత్రికల వాళ్లకి పనేముంది, అదొక గొప్పకింద అచ్చేశారు. వీళ్ళ న్యూస్ ప్రింటు పాడుగాను." శాపాలు పెట్టింది.
"ఔను. చెయ్యి విరిగితే తిక్క కుదిరేది." అన్నది, స్నేహ భక్తి పరాయణురాలైన స్నేహితురాలు.
"అదిగో, అందుకే మరి నేనూ రచయిత్రి అయిపోదామనుకుంటున్నాను. అందుకు నువు హెల్ప్ చేయాలి "అడిగింది.
"నేనా... నేనేం చెయ్యగలను."
"రోజూ కొన్ని పాత నవలలు చదివి వినిపించాలి."
" అమ్మో నాకు ఆస్తమా వుందని నీకు తెలుసు కదే, పాత పుస్తకాల జోలికే కాదు, మా ఇంటి గోడ మీద దుమ్ము దులిపి ఎంతకాలమయిందో అడుగు. అయినా గాని నీకెందుకొచ్చిన బాధే ఇది, కుమరన్స్ లోకి కనకపుష్యరాగంలో కొత్త డిజైను నెక్లెస్ వచ్చింది, పేపరు చూళ్ళేదా నువ్వు, సాయంత్రం వెడదాం పద . నేనూ పిల్లలకి యూనిఫామ్స్ తీసుకుందామనుకుంటున్నాను. " అంది మరిపించేందుకు,
" సరే అయితే ఫోను పెట్టేస్తున్నాను, నువ్వేదో స్నేహితురాలివని ఎసి కారులో తిప్పాను. నీ కొడుక్కి ఉద్యోగం వేయించాను. బంగారంలాంటి నా ఇల్లు చవగ్గా అద్దెకిచ్చాను.... ఇంకా..." ఆయాసపడింది.
ఆవును ఇంకా చాలా పెద్ద లిస్టే వుంది. అంచేత స్నేహితురాలికి ఖంగారు పుట్టీంది. ఇదేమిటిది, మొదటికే మోసం వచ్చేట్టుగా వుంది. పోనీ మనదేం పోయింది ఎంకరేజ్ చేస్తే పోలా, అనుకుని చెప్పింది
"సరేలేవే, రాసేద్దాం దానిదేముంది, కానీ చిన్న చిక్కు ఏమిటంటే ముందు అ ఆ లు రావాలి. అదొక గోల. అయినా ఫర్లేదు, నువ్వు చాలా చురుకైన దానివి, నేర్చేసుకో, " అంది.
"ఆ మాత్రం మాకూ తెలుసు., ఆఆలు కూడా రావనుకుంటున్నావా ఏమిటి...? ఎటొచ్చీ గుణింతాలే కొంచెం డౌటు” అంది మెల్లిగా. .
"కానీ బానే టైము పడుతుందేమోనే ..."
"గాడిద గుడ్డు, అసలు ఏ కధలో అయినా అ ఆలు గానీ, గుణింతాలు గానీ వరసలో ఎవరైనా రాస్తారా, కైమా కొట్టినట్టు విడదీసి సాగదీస్తేనే రచన అవుతుంది అంది ఆవేశంగా."
స్నేహితురాలు తలూపింది.
"ఏమిటీ మాట్లాడవు.”
"తలూపాను".
"అక్కడ తలూపితే ఇక్కడ ఫోన్లో నాకు కనబడి చస్తుందా... మాటల్లో చెప్పు. "
స్నేహితురాలు మాటల్తో చెప్పింది.
వెంటనే పంతులు గారికి మళ్ళీ నంబరు కలిపింది.
"పంతులు గారూ, ఏ సబ్జక్టుమీద రాస్తే బాగా పేరు వస్తుందంటారు." అడిగింది.
సమస్య మళ్ళీ పంతులు పీకకి చుట్టింది. అయినా చెప్పాడు " అది ...ఆ ఫీల్డులో తల పండిన వాళ్లను అడగాలమ్మా, "సుభద్ర వారం రోజులపాటు తల పండిన వాళ్ల కోసం చూసింది . ఒక్కరు దొరికితే ఒట్టు. ఇప్పుడందరూ హెయిర్ డై వాడ్డంవల్ల పట్టుకోలేకపోయింది… కాగా కాలనీ లో అనేక మందికి కొత్త కొత్త హెయిర్ డై బ్రాండ్స్ పరిచయం చేసింది తనే కదా. హతోస్మి. సోమరాజు వేలితో సోమరాజు కన్ను పొడుద్దామనుకుంటే తన వేలితో తన కన్ను పొడుచుకుందన్నమాట… వెంటనే తన అశాంతిని బట్వాడా చెయ్యడానికి స్నేహితురాలికి ఫోన్ చేసింది. "నువ్వే ఏదో చెయ్యాలి. శాంభవీ " అభ్యర్ధించింది
"ఏం చెయ్యను." శాంభవి.
"మొన్న పిల్లలకోసం ఏదో రాశానన్నావు" సుభద్ర.
"ఛా! అది ఆవు వ్యాసం కదే"
"అయితే ఏమిటి...?"
"ఆవు వ్యాసం అందరూ ఒకలాగే రాస్తారు అందులో ప్రతిభ, కొత్తదనం ఏముంది."- శాంభవి.
“అదీ ఆలోచించాను, మనం గేదె వ్యాసం రాస్తాం " అన్నది సుభద్ర..."
“అలా బావుటుందంటావా...? "
"ఎందుకు బావుండదు. తల పండిన రచయిత్రులు అయినా గానీ ఈ మధ్య అలానే చేస్తున్నారట కదా,"
"అవునా,”
"అలా అంటే అలా అని కాదు. సీతా స్వయంవరం అని వుందనుకో, మన కధలో రాముడు ప్రకటించిన స్వయంవరంలో శూర్పణఖ, మందోదరి లాంటి వాళ్లకి పోటీగా సీత కూడా స్వయంవరానికి వస్తుంది. విల్లు విరుస్తుంది."
"భలే వుందే"
"ఇంకా విను, మొన్న ఎవరో గాని రాశారు కదా, శ్రీకృష్ణుడు ద్రౌపదికి లైనేసినట్టు రాస్తే అవార్డు కూడా వచ్చింది."
"ఓసినీ నీకెలా తెలుసే, ఇవన్నీ" శాంభవి మురిసి ముక్కలైంది.
"అదేలేవే ఈ మధ్య కొద్దిగా వార్తలు చూస్తున్నాను."
"మరి సీరియల్సో?"
"అవన్నీ నేను కార్యసాధన పూర్తిచేసాక మళ్ళీ మొదలెడతాను."
"రచయిత్రి కాకుండానే నీలో ఇంత విజ్ఞానం వచ్చేసిందంటే, ఇంక తీరా అయిపోయాక... మేం కనిపిస్తామా...?"
"చాల్లేవే పొగిడావు. ఇంతకీ గేదె వ్యాసం రాసి పెడతావా, లేదా...?
“అబ్బ మళ్ళీ మొదటికి వచ్చావా…?" అని తల పట్టుకుంది. శాంభవి.
సుభద్ర మాత్రం నిర్దయగా ఫోను పెట్టేసింది. నగల గంప మంచం కిందకి తోసింది. పనిమనిషి ఇచ్చిన యాపిల్ జ్యూస్ చప్పరిస్తూ మేడెక్కి పిట్ట గోడ మీద కూచుంది.
వాడికోసం ఏమీ కాదు, నా ఇంట్లో నేను కూచున్నాను అని మనసుకి చెప్పుకుంది.
దూరంగా కనిపించాడు సోమరాజు. డొక్కు బండిమీద వెడుతూ తల పైకెత్తి మళ్ళీ నవ్వాడు.
"ఒరేయ్ ఆగు." చెప్పులయినా లేకుండా గబగబ మెట్లు దిగి వాడి వెంట పరుగు అందుకుంది…
ఆ పిలుపుకి రోడ్డుమీద వెడుతున్న వాళ్లు కొందరు ఇటు చూశారు. నగల్లేని సుభద్రని అంతకు ముందు ఎప్పుడూ చూడకపోవడం వల్ల ఆలస్యంగా గుర్తు పట్టారు. తెల్ల మొహం వేసుకుని బండి దిగిన శాల్తీని చూసి కళ్ళెర్రజేశారు. ఖచ్చితంగా ఈవిడ నగలన్నీ వీడే కత్తిరించి వుంటాడు. అదిగో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడుగా. ఇంకేముంది.
" విరగ్గొట్టండిరా వెధవని, ఎలా చూస్తాడో చూడు ఏమీ తెలీనట్టు... "పెడ రెక్కలు విరిచి కట్టారు. సుభద్ర ముందుకు తీసుకెళ్ళారు.
"మీరందరూ వెళ్లండి, వాడి పని నేను చూస్తాను" అంది.
అందరూ గొణుక్కుంటూ వెళ్ళిపోయారు.
సోమరాజు తలెత్తాడు. అప్పటికే జనం మెత్తగా తన్నేశారు.
సుభద్ర అడిగింది. "నామీదే కదా, నువు కధ రాసింది "
"నేనా ఎప్పుడు రాశాను"
"అదికూడా నేనే చెప్పాలా?
"........................................”
“.ఈ వారం నువు రాసిన కధ నామీదే కదా.."
"కాదు. ఎందుకలా అనుకున్నారు"
“ఆ ఏమిటీ? ఎందుకలా అనుకున్నానా, చంపేస్తాను నిజం చెప్పు.
"నిజమే చెబుతున్నాను. మీ గురించి నాకేం తెల్సు. రాయడానికి "
"ఏం తెలీకుండానే నేను రాక్షసి నని, కోడళ్లని కాల్చుకు తింటానని రాస్తావా...?"
"అయ్యో అది మీమీద కాదు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా తప్పే కదా అని రాశాను."
"తప్పొప్పులు చెప్పేటంత పెద్ద స్థాయి నీకు లేదు కానీ, చెప్పు, ముక్కు నేలకేసి రాసి సారీ చెప్పు"
"ఇదెక్కడ గోలండీ, నేను మీ గురించి రాయలేదు. జనరల్ గా ప్రపంచంలో జరిగేవి రాస్తాను. మొన్న పాకిస్తాన్ గురించి రాశాను, ముషారఫ్ ఇలా నిలదియ్యలేదు, నిన్న కల్తీ వల్ల వచ్చే క్యాన్సరు వ్యాధి గురించి రాశాను. దుకాణాదారులెవరూ ఇంటి కొచ్చి నన్ను తన్నలేదు. మీరేమిటీ ఏదో రాస్తే ఏదో అనుకుని ఇలా కొట్టించి చంపేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలెవరంటే, భుజాలు తడుముకున్నట్టు వుంది "
"ఏమిటి నన్ను దొంగ అంటావా?”
"అబ్బే అది సామెత అండీ... నేను మామూలుగా అన్నాను"
"ఈ సామెత నాదగ్గర చెప్పడానికి కారణమేమిటీ, అంటే నువు నన్ను అంటున్నట్టే కదా, "
"అయ్యో మేడమ్ నేను అనని వాటిని కూడా మీరే అనేసి..."
"నోర్ముయ్..."
"అతి తెలివితేటలు చూపించకు. నేను అసలు మంచిదాన్ని కాదు...
ఔనండీ
ఏమిటీ ఔనంటావా..
కాదండీ...
సరే ఇది చెప్పు. నన్ను చూసేనా నువ్వు రోజూ నవ్వేది."
"కాదు"
"మరెవర్ని చూసి?
"ఎవర్నీ చూసీ కాదు"
"మరి..?"
"అదిగో ఆ బోర్డుని చూసి.."
"ఏముందక్కడ?
"మెడమీద వాటా అద్దెకివ్వబడును. అది రాసింది మీరే కదా మేడమ్! " వినయంగానే అడిగాడు.
సుభద్రకి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు, “నేనే అని ఎందుకనుకున్నావు ఎవరైనా రాయచ్చు కదా…" లా ప్రశ్న వేసింది.
"ఎవరు రాసినా తప్పు తప్పేకదా, ప్రతిరోజూ అది చదవగానే నాకు నవ్వు వస్తుంది. నాకున్న అనేక దిగుళ్లలో అది ఒక రిలీఫ్ అంతే, మిమ్మల్ని చూసి నేనెందుకు నవ్వుతాను నాకేం పని.?"
సుభద్రకి అతన్ని నమ్మాలనీ వుంది. నమ్మినట్టు కనబడకూడదనీ వుంది.
"ఉద్దరించావులే గాని, వెళ్ళు" కసిరింది.
అతను కదిలాడు.
"ఆగు" పురమాయించింది.
"నువు కధకి ఏం పుచ్చుకుంటావు..?"
"పుచ్చుకోవడానికి రాయనండి” అన్నాడు మూతిమీద రక్తం చొక్కా కొసతో తుడుచుకుంటూ,
"నేను కధకి పాతికవేలిస్తాను, నా పేరుతో రాసి పెడతావా…?"
"రాయను"
"అదేం,"
"కావాలంటే రాసినదాన్ని అంకిత మిస్తాను. "
" అంకితమా, అంటే ఏమిటి ? "
" అప్పుడు కూడా అచ్చులో మీ పేరు చూసుకోవచ్చు."
"ఆ, ఏదో ఒక్కమాటలో అంకితమిస్తే ఎవరికి పడుతుందయ్యా…? పూర్తి కధ రాసిస్తే అది వేరు. " సుభద్ర బేరానికి దిగింది.
"చూస్తారు కదా! అందరూ గుర్తు పెట్టుకునేలా అంకితం రాస్తాను. ఒక్క నాలుగు రోజులాగండి." అని అక్కడే ఆగాడు.
సుభద్ర అర్ధం చేసుకున్నట్టుగా లోపలికెళ్ళి హ్యాండుబ్యాగ్ లోంచి లెక్క పెట్టుకోకుండా చేతికి దొరికినన్ని పెద్ద కాయితాలు ఇచ్చింది.
సోమరాజు మొహం ఎర్రబడింది. " నేను ఆగింది అందుక్కాదు, మీ పేరు తెల్సుకోలేదు, పేరేమిటో చెబితే..."
"సు...భ...ద్ర" ఇండియా ప్రెసిడేంట్ పేరులాగా చెప్పింది.
" ఓకె, సరేనండీ, " అని బండి స్టార్టు చేసి అది కదలక పోయేసరికి తోసుకుంటూ వెళ్ళిపోయాడు.
నాలుగో రోజుకల్లా ఒక పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు.
"ఇకనుంచి నేను రాయబోయే కధలన్నిటికీ శ్రీమతి సుభద్రగారే నాకు స్ఫూర్తి."
"అంటే ఏమిటయ్య నీ ఉద్దేశ్యం., ఇంకా నామీదే రాద్దామనా...? " కొట్టినట్టుగా అడిగింది.
" ఉద్దేశ్యం అంటూ ఏం వుంటుందండీ, స్ఫూర్తి అని రాశాను కదా,"
"నీ మొహంలాగే వుంది, ఇదిగో ఇది చూడు. అంకితమంటే ఇలా వుండాలి " అని ఒక నవల మొహానికేసి కొట్టింది.
పుస్తకం సోమరాజు మొహానికేసి తగిలి కింద పడింది. తెరుచుకున్న పుస్తకంలో తళతళలాడే తెల్లటి పేజీలో బంగారు రంగులో ఒక పేద్ద వ్యాసంలాంటిది వుంది, అందులో కొన్ని వాక్యాలు చదవగలిగాడు.
"అనురాగ మూర్తి, అమృత హృదయిని, స్నేహానికి నిర్వచనం అయిన సుభద్ర గారికి అంకితం " అని ముగిసింది… సోమరాజు తలెత్తి సుభద్రవైపు చూశాడు.
సుభద్ర విలాసంగా నవ్వుతూ అన్నది, " కళ్ళు బైర్లు కమ్ముతున్నాయా, అటుచూడు, అక్కడ మా మేడమీద నీ తాతలాంటి జాతీయ రచయిత వున్నాడు చూశావా, ఆయన రాశాడు నామీద… లక్ష కాపీలు అమ్ముడుపోయే పుస్తకం ఇది. అంటే అంతమందిలోకీ నా పేరు వెడుతుంది. "
సోమరాజు అటువైపు చూశాడు. నిజంగానే అక్కడ పెంట్ హౌస్ లోంచి విశ్రాంతిగా ఏదో పానీయం తాగుతూ ఒక సిల్కులాల్చీ తొంగిచూస్తోంది.
"ఆయన ఇంటర్వ్యూ కోసం పత్రికలు, చానళ్ళూ ఎలా ఎగబడతాయో తెలుసా… నాలుగు రోజులయింది, మా ఇంట్లో దిగి. ఇండియా వస్తే ఇక్కడే దిగుతాడనుకో, నా నెట్ వర్క్ చూస్తే నీ కళ్ళు తిరుగుతాయి. సాయంత్రం ఇక్కడే మా ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాను. . కావాలంటే అందరితోబాటు వచ్చి హై టీ తాగిపో. అంతేగానీ అనవసరంగా నా జోలికి రాకు తెలిసిందా..." తర్జనితో బెదిరించింది.
"మీరే కదండి నా జోలికి వచ్చారు, నేనేమీ రాలేదే..." గొణుక్కుంటూ, బండి స్టార్టు చేశాడు. అది మళ్ళీ కదల్లేదు. ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
"డొక్కు బండి, డొక్కు వెధవ," గట్టిగా తిట్టుకుంటూ డమామని గేటు తలుపేసి లోపలికి నడిచింది సుభద్ర.
సోమరాజు వెంటనే వెనక్కి తిరగలేదు. రోడ్డు మలుపు తిరుగుతూ ఒకసారి చూశాడు.
మెడమీద వాటా అద్దెకివ్వబడును అనే బోర్డు మీదుగా జాతీయ రచయిత తల కనబడుతుంది...సుభద్ర నుంచుని చేతులు తిప్పుతూ ఏదో చెబుతోంది.
అప్రయత్నంగా మెడ నిమురుకున్నాడు. తల భద్రంగానే వుంది. అద్దెకివ్వబడలేదు… జేబులోంచి దువ్వెన తీసి తలదువ్వుకున్నాడు. హుషారుగా ఈల వేసుకుంటూ బండిని లాగడం మొదలుపెట్టాడు.
*****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
కొండేపూడి నిర్మల
కవయిత్రి గా ఆరు పుస్తకాలేసి ఆరున్నొక్క రాగ౦ తీసేసాను కాని కధా రచయిత్రిగా ఎక్కడున్నానో తేలీదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు పత్రికల్లో పనిచేసి బస్తాలకొద్ది కధలు ఎడిట్ చేయడం వల్ల ఎలా రాయకూడదో తెలుసంతే. అయినా సాహసించి “శత్రు స్పర్శ” అనే కధల సంపుటి వేసాను. టైటిల్ మహిమ వల్లనో ఏమో ఎవరూ దాన్ని ముట్టుకున్న పాపాన పోలేదు. మనిషి ఆశాజీవి కదా , కాబట్టి ఏం అనుకోకుండా ఇంకా రాశాను. నిజానికి తర్వాత రాసిన కధలమీదే నాకేదో మమకారం ఉన్నట్టుంది. దానికితోడు వాటిలో మూడింటికి కంటి తుడుపు (కన్సొలేషన్) బహుమతులు రావడాన కాస్త తలెత్తుకు తిరగడం మొదలెట్టాను. అంతటితో అయిపోలేదు. ఇప్పుడు ఇంకో సంపుటి కి సరిపడా కహానీలున్నాయి. మెల్లిగా ఇ-బుక్ (ఆర్ధిక వనరులు లేవు కాబట్టి ) వేసుకుని ఇండియాలో ఎవరూ చూడకుండా ఇక్కడ ఆవిష్కరి౦చేసుకోవాలనే దురాశ కూడా వుంది. ఇవికాక ఆరేళ్ళపాటు ధారావాహికంగా భూమికలో అచ్చయిన “మృదంగం” కాలం పాఠకులతో కబుర్లు చెప్పే అలవాటు చేసి వదిలింది.
సరే ఇంత చేసాక అవార్డులు రాకుండా వుంటాయా? చాలా వచ్చాయి. ఇంటినిండా చెక్కలే. అటకెక్కి చూసుకుంటే నేలవిడిచి సాము చేసినంత గొప్పగా వు౦టుంది.
వృత్తి పరంగా నేనేమిటి అంటే ఒక్క మాటలో చెప్పలేను.
ఒకే ఒక్క ఐడియా ఎందరి జీవితాల్ని మార్చిందో నాకు తెలిదు కాని ఒకే ఒక్క “వలసలరాజ్యం” (గ్రామీణ స్త్రీల సమస్యలలో ఒకటయిన open defecation సమస్యపై రాసినది) కవిత, వాటర్ అండ్ సానిటేషన్ ప్రాజెక్టు లో చేర్చుకుంది. జర్నలిజం కంటే శానిటేషన్ మెరుగ్గా అనిపించి 2000 లోనే చేరిపోయాను. అది మొదలు ప్రభుత్వ ప్రభుత్వేతర శాఖలకు ట్రెయినర్ గా, మాడ్యుల్ రైటర్ గా, ట్రాన్స్ లేటర్ గా రోజు కూలి లెక్కన చిరుద్యోగాలు చేస్తున్నాను.)
***