MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
మరపురాని రోజు?
నిర్మలాదిత్య
రిలీఫ్... ఒక్క నిమిషం తల, భుజస్కంధాల మీదున్న మోయాలేని బరువు దిగిపోయినట్లుంది. అడ్మిషన్స్ డైరెక్టర్ నుంచి ఫోన్. ఆవిడ ఫోన్ పెట్టేసినా, తన మొబైల్ ఇంకా చెవికి ఆనించి ఉన్నానని తెలియడానికి బాగా సమయం పట్టింది. ఒక చిన్న పొరపాటు ఇంత సమస్య గా మారుతుందని ఎప్పటికి ఊహించలేదు. పొరపాటే.
చిన్నప్పటినుంచి ఏదో డాక్టరో, లాయరో అవ్వాలని ఇంట్లో వారి కోరిక. పెద్ద శ్రమలేకుండానే LSAT అడ్మిషన్ టెస్టులో మార్కులు బాగా రావడం, నేను అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న యూనివర్సిటీ లోనే ఉన్న లా స్కూల్ టాప్ 25 ర్యాంకింగ్లో ఉండటం వల్ల అప్లై చేయడం, సీటు రావడం జరిగిపోయింది. లా స్కూల్ వాళ్ళు చేరే ముందు పంపించిన అడ్మిషన్ పత్రాలలో బ్యాక్ గ్రౌండ్ చెక్ కని కొన్ని ప్రశ్నలున్న పేపర్ కూడ ఒకటి. అన్నీ రొటీన్ ప్రశ్నలే. అలాంటి ప్రశ్నలున్న ఫార్ములు ఇది వరకే నేను జవాబిచ్చి ఉండటం వల్ల చక చక పూర్తి చేసి మిగతా పేపర్లతో పాటు పంపించేసాను.
ఓ రెండు వారాల తరువాత అడ్మిషన్స్ ఆఫీసు నుంచి పిలుపు. స్కూల్ కాంపస్ లోనే ఉండటం వల్ల పొద్దున్న బ్రేక్ మధ్యలో వెళ్లాను. ఆఫీస్ వాళ్ళకి ముందే చెప్పడం వల్ల, అప్పటికే నా అపాయింట్మెంట్ అడ్మిషన్ డైరెక్టర్ తో ఉండటం వల్ల పెద్దగా వేచి ఉండాల్సిన పని పడలేదు. అడ్మిషన్ డైరెక్టర్ కు ఓ నలభై ఏండ్లు ఉంటాయేమో. బిజినెస్ సూట్ లో ఉంది. మెళ్ళో ఓ ముత్యాల సారం. లైట్ గా లిప్ స్టిక్. జుట్టు నలుపు తెలుపుల మిశ్రమాలతో ఓ గౌరవాన్ని, హుందాతనాన్ని చూస్తూనే ఆపాదిస్తున్నాయి. ఆవిడున్న ఆఫీసు కూడా, ఓ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసు లాగానే ఉంది. పని చేసుకోవడానికి మంచి పాలిష్ తో మెరుస్తున్న ఓక్ చెక్క టేబిల్, లెథర్ రివాల్వింగ్ చైర్. టేబిల్ పైన ఓ లాప్ టాప్, ఓ ఫైలు- నా అడ్మిషన్ ఫైలనుకుంటా. ఓ మూల తన ఫామిలీ ఫోటో. వెనుక పేపర్లకని ఓ షెల్ఫ్. రూంలోనే మరో మూల ఓ సోఫా సెట్, సెంటర్ టేబిల్ తో పాటు ఉంది. ఆ సెంటర్ టేబిల్ పైన ఆ రోజే విచ్చిన పూలతో వున్న వేస్.
"గుడ్ మార్నింగ్ మేమ్”, అన్నాను
"గుడ్ మార్నింగ్ మోహన్", అంటూ చేతులు కలిపి, తన టేబిల్ ముందున్న కుర్చీ వైపు సైగ చేసింది.
కుర్చీలో కూర్చున్న తరువాత, ఎలా ఉన్నావు, చదువులు ఎలా సాగుతున్నాయి లాంటి ప్రశ్నలేసి అసలు విషయానికి వచ్చింది.
" నీవు నీ హై స్కూల్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ టికెట్లు ఏమైనా వచ్చాయా”, అని అడిగింది
"ఆ వచ్చాయి. ఒక్క టికెట్టే. నా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ మరుసటి రోజు, మే 26 సాయంత్రం ఓ ఎనిమిది గంటలుండవచ్చు. సంధ్యా సమయం", అన్నాను
"అంత బాగా గుర్తున్న ఆ టికెట్, రోజు తో పాటు చెప్తున్నావు, మరి అప్లికేషన్ లో ఆ టికెట్ వివరాలు రాయలేదు", అంది డైరెక్టర్
" ఏ ప్రశ్నకూ ", ఆశ్చర్యపోతూ అడిగాను.
ఆవిడ ముందున్న నా అడ్మిషన్ ఫైల్ లో నుంచి ఓ పేపర్ తీసి నాకందించింది.
అది రొటీన్ ప్రశ్ననే. ఏమైనా పోలీసు కేసులున్నాయా? అని. నాసమాధానం 'లేదు' అని.
"ట్రాఫిక్ స్టాప్, టికెట్లు ఈ ప్రశ్నకు జవాబు గా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇదివరకు ఇలాంటి అప్లికేషన్లు నింపాను. అవసరం లేదనే చెప్పారు" అన్నాను.
"కానీ, ఇది లా స్కూల్ అడ్మిషన్. నీవు ఈ ప్రశ్నకు సంబంధించి రాసిన ఫుట్ నోట్ చదివినట్లు లేదు. అది ఫైన్ ప్రింటే కానీ నువ్వు చదివి ఉండాల్సింది. అందులో క్లియర్ గా ట్రాఫిక్ టిక్కెట్ల వివరాలు కూడా రాయాలని ఉంది." అన్నది
నిజమే తొందరలోఆ ఫైన్ ప్రింటు నేను చదవలేదు.
“నువ్వు చదవాలకున్నది లా. ఇలాంటి పొరబాట్లకి తావు లేదు. నీ అడ్మిషన్ ప్రస్తుతం పెండింగ్ లో పెట్టాం. ఈ పొరబాటు కు నీ సంజాయిషీ పంపు. దాన్ని వచ్చే వారం కమిటీ మీటింగ్ లో పెట్టి నీ అడ్మిషన్ మళ్ళీ కన్ ఫర్మ్ చేస్తాం" అన్నది.
నాకు చెమటలు పోయడం మొదలెట్టాయి. ఏవో కారణాలు చెప్పబోయాను. ఆవిడ ముఖంలో ఏమాత్రం మార్పు లేదు. మీటింగు అయ్యిపోయిందన్న సంకేతం లాగా చేతులు కలిపి, మళ్ళీ ఫోన్ చేస్తానని నిలబడింది. ఇక చేసేదేమి లేక, రూము బయటకు వచ్చేసాను. అప్పటినుంచి, ఓ వారం రోజులు ఈ ఫోన్ కాల్ వచ్చేంత వరకు టెన్షనే. అందరికి ఇప్పటికే అడ్మిషన్ వచ్చేసింది అని తెలిసి పోయింది, కంగ్రాట్యులేషన్లు, పార్టీలు కూడా అయ్యిపోయాయి. ఇప్పుడు అడ్మిషన్ లేదంటే ఎక్కడ మొఖం పెట్టుకోను? ఓ చిన్న పొరపాటు. ఫైన్ ప్రింట్ కూడా చదివి ఉండాల్సింది. అదీ మతి మరపు వల్ల జరిగిన విషయం కాదు. ఆ రోజు, ఆ సమయం, ఆ ట్రాఫిక్ స్టాప్ గురించి ఎందరికి ఎన్ని సార్లు తిరిగి, తిరిగి చెప్పలేదు? ఈ దెబ్బతో ఇక ఆ రోజు నా జీవితాంతం మరపురాని రోజుగానే మిగిలిపోతుంది.
మిడ్వేస్ట్ లో విలువలు, చదువులు, సెక్యూరిటీ బాగుంటుందని ఇక్కడే స్థిరపడిపోయాం. నేను పుట్టీ పెరగడం ఇక్కడే. ఇక్కడ ఇండ్లలో తలుపులు తెరిచి ఉంచినా దొంగతనాలు ఉండవు. కానీ నా రంగు ఉన్నవాళ్లు తక్కువ. నేను గోధుమ వన్నెతో ఫెయిర్ గానే ఉన్న ఇక్కడ ఉన్న తెల్ల వారితో పోలిస్తే నేను వేరని తెలిసిపోతుంది. ఆ విషయం, నాకు ప్రీస్కూల్లోనే అవగతం అయ్యిపోయింది. ఇక్కడే పెరగడం వల్ల, నాకు నా రంగు అంతగా ఇబ్బంది పెట్టలేదు. అందరితో కలిసి మెలిగే చదివాను, పెరిగాను. కానీ, నాకు బాగా సన్నిహితుడైన స్నేహితుడు హై స్కూల్ వచ్చిన తరువాత కానీ దొరకలేదు. జేసన్ మా ఊళ్ళో నే ఉన్న మరో మిడిల్ స్కూల్ లో చదివే వాడు. హై స్కూల్ చేరిన మొదట్లో కొంచెం వంటరిగా ఓ మూల కూర్చోవడం చూసి, ఎందుకో స్పందించాను. నేనే వెళ్లి పలకరించాను. అతి తొందరలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యి, ఎక్కడ పోయినా, ఏ పని చేసినా కలిసే చేసే వాళ్ళం. చదువులు కలిసే చదివే వాళ్ళం. సైన్స్ ప్రాజెక్టులు, మాత్, డిబేట్ కాంపిటేషన్లు కలిసే ప్రిపేర్ అయ్యే వాళ్ళము. అలా డిబేట్లలో బాగా రాణించడం వల్లనేమో ఇద్దరికీ తిరిగి లా కాలేజీలో చదివే అవకాశం వచ్చింది. జేసన్ కు నాతో పాటు లా కాలేజీ అడ్మిషన్ దొరికింది. ఆ రోజు అలా గుర్తుండిపోవడానికి జేసన్ కూడా మరో కారణం కావచ్చు.
గ్రాడ్యుయేషన్ పార్టీలతో ముందు రోజు బాగా బిజీ గా గడిచిపోయింది. జేసన్ తో ఆ రోజే చివరి రోజు. తను మరుసటి రోజు వాళ్ల అమ్మ, నాన్నలతో పారిస్, వెనిస్ లకి వెళ్లి, అటు తరువాత ఈస్ట్ కోస్ట్ స్కూల్లో తను జాయిన్ అవ్వుతున్నాడు. నేను ఇటు ఇండియా వెళ్ళాలి. కొంత సేపు కంప్యూటర్ మీద గేమ్స్ ఆడాం. మా ఇంట్లోనే లంచ్ చేసాం. సినిమాకి వెళ్లాం. తరువాత తన హాలిడేస్ కని పోలో షర్టులు, షార్టులు కొనాలని ఔట్లెట్ మాల్ కి వెళ్లాం. బ్రాండెడ్ దుస్తులు చీప్ గానే దొరికాయి. షాప్ చేస్తున్నంత సేపు, ఆ షాప్ ఎంట్రీ దగ్గరున్న సెన్సార్లు అప్పుడప్పుడు అరుస్తూనే ఉన్నాయి. సామాన్యంగా ఎవరైనా బిల్ కట్టకుండా వస్తువులు దొంగతనంగానో, పొరబాటుగానో బయటకు తీసుకెళ్తుంటే అలా అరిచి షాప్ వాళ్ళను అలెర్ట్ చేస్తాయి. ఏదో మాల్ ఫంక్షన్ అయ్యినట్లుంది అనుకున్నాను. షాప్ వాళ్ళు ఆ శబ్దాలకు అలవాటు పడిపోయినట్లున్నారు. కాష్ కౌంటర్ నుంచే అలా అలెర్ట్ వచ్చిన చేతుల సైగతో కస్టమర్లను పొమ్మని చెప్తున్నారు. నేనేమీ కొనలేదు. అమ్మ ఇప్పటికే అన్నీ కొనేసి ఉంటుంది. ఇండియాకని గత మూడు నెలలనుంచి ఎడతెరగని షాపింగ్ తనకి. జేసన్ తనకు కావాల్సిన దుస్తులు కొని పే చేసిన తరువాత, బయటకు వెళ్తుంటే మళ్ళీ ఎంట్రీ దగ్గర అలెర్ట్ శబ్దాలు. అప్పటికే విని విని అలవాటు పడి పోయిన మేము నవ్వుకుంటూ అలానే పార్కింగ్ లోకి దారి తీసి, పార్కింగ్ లాట్ లో వీడ్కోలు తీసుకున్నాం. ఇద్దరి ఇళ్ళు ఊరికి అటూ ఇటు చివర్లలో ఉన్నాయి. కాబట్టి హైవే వస్తూనే తను దక్షిణం, నేను ఉత్తరం వైపు దారి తీసాం.
మే నెల కావడంతో ఎనిమిదైనా ఇంకా వెలుతురుతో సంధ్యలాగే ఉంది. సూర్యుడు అప్పుడే అస్తమించి ఉండాలి. పెద్దగా జనం లేరు. కారు స్పీడ్ గా నడుపుతే ఆ సరదాయే వేరనిపించింది ఆ క్షణం. యాక్సిలరేటర్ నొక్కాను. ఓ 5 నిమిషాలలో రియర్ వ్యూ లో ఎరుపు నీలం రంగులతో పోలీస్ కార్ కనిపించింది. లేన్ మారాను. ఆ కారు కూడా మారింది. నా కారు వెంటనే పడుతున్నాడని తెలియడంతో, భయంతో, బాగా నెర్వస్ గా సైడు కు తీసుకుని కార్ స్లో చేసి చివరకు ఆపాను. విండో కిందకు దించి కాప్ కోసం ఎదురు చూడ్డం మొదలెట్టాను. ఆ పోలీసు కాప్ భారీ గానే ఉన్నాడు,
'ఎందుకు ఆపానో తెలుసా" అని అడిగాడు.
"తెలీదు" అన్నాను.
"75 స్పీడ్ లిమిట్, 90 మైళ్ళ వేగంతో పోతున్నావు. అన్నట్టు షాపింగ్ మాల్ నుంచి వస్తున్నావా?" అని మళ్ళీ అడిగాడు.
"అవును" అన్నాను.
"ఏమి కొన్నావు" అని అడిగాడు.
"అబ్బే ఏమి కొనలేదు. మా ఫ్రెండ్ కొన్నాడంతే" అన్నాను.
డ్రైవర్స్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొని, ఓ సారి కారు డిక్కీ చూసి, టికెట్ రాయడానికి తన కారుకు వెళ్లి పోయాడు.
ఓ పది నిమిషాల తరువాత టికెట్ ఇచ్చి "డ్రైవ్ సేఫ్" అని వెళ్లి పోయాడు.
టికెట్ చూశాను. 175 డాలర్లు. నేను బెస్ట్ బయ్ లో పని చేసి, కూడబెట్టిన డబ్బులకు గండి పడింది. ఏమి చేస్తాం కట్టాల్సిందే. టికెట్ చదవడం మొదలెట్టా. పేరు, అడ్రెస్స్ సరిగానే ఉంది. టికెట్ కట్టడానికి ఓ నెల రోజులు టైం ఉంది.
రేస్: కాకేసియన్
తననుకున్న నా రేస్ చూడగానే ఒక్కసారి నవ్వసాగాను. టికెట్ వచ్చిందన్న బాధ కంటే కాకేసియన్ అని కాప్ చేసిన పొరబాటే నవ్వు, ఆనందాన్ని ఇచ్చింది. సంధ్య సమయంలో నా రంగు, నా ముఖ కవళికలు కాకేసియన్ లాగ కనపడడం అంత పెద్ద పొరబాటు కాదేమో. ఇక ఆ టికెట్ ఆ సమ్మర్లో అందరికి చూపెట్టి నేను చాలా సార్లు ఆ కాప్ ఎన్కౌంటర్ మళ్ళీ మళ్ళీ చెప్పి ఆనంద పడ్డాను. అలా నా మదిలో బాగా పునాది వేసుకున్న ఆ రోజు మరపు రాని రోజు గా మిగిలి పోవడం లో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఆ నమ్మకం దేవుడికి వచ్చినట్లు లేదు. అందుకే ఈ అడ్మిషన్ మిషతో మళ్ళీ ఆ రోజు గుర్తుకు తెచ్చాడు.
ఇదిగో ఇప్పుడే అడ్మిషన్ డైరెక్టర్ ఓ వార్నింగ్, ఓ ట్రైనింగ్ క్లాస్ తో ఆ పొరబాటును మాఫీ చేస్తున్నామని, అడ్మిషన్ ఖరారు చేస్తున్నామని చెప్పింది. రిలీఫ్...
వెంటనే అమ్మ కు ఫోన్ చేసి చెప్పాను. నాన్నకు టెక్స్ట్ చేశా. ఇద్దరూ సంబర పడిపోయారు.
ఇంకా ఎవరితో పంచుకోను? - జేసన్ వెంటనే గుర్తుకొ చ్చాడు. జేసన్ కు డయల్ చేసి కాఫీ షాప్ కు రమ్మన్నాను. జేసన్ కొన్ని పనుల మీద ఓ రెండు రోజులు వచ్చాడు ఇక్కడికి .
జేసన్ టేస్టు తెలుసు కాబట్టి తనకు డబల్ ఎస్ప్రెస్సో, నాకో వైట్ మోకా చాక్లెట్ తీసుకున్నా.
"హలో మోహన్… వాట్స్ అప్ బడ్డీ" అన్నాడు జేసన్ అప్పటికే టేబిల్ మీద పెట్టిన ఎస్ప్రెస్సో తీసుకొని.
అడ్మిషన్లో ఓ చిక్కు ఎలా వచ్చింది అది ఎలా పరిష్కారమైనదో జేసన్ కు చెప్పాను. జేసన్ ఇంత జరిగితే నాకు చెప్పలేదే అని వాపోయినా, అది సాల్వ్ అయ్యిందని సంతోష పడ్డాడు
“నీకు గుర్తుందా? మన హైస్కూల్ చివరి రోజు మనం కలిసింది? ఇదిగో విన్నావుగా. నాకు మరపురాని రోజు గా ఎప్పటికీ నిలిచిపోతుందిక!” అన్నాను నేను.
"నువ్వైనా మరిచిపోతావేమో కానీ, నేను మాత్రం అసలే మరిచిపోలేని రోజది, తెలుసా?", అన్నాడు జేసన్ నవ్వుతూ.
జేసన్, నేను డిబేట్ పార్టనర్స్. ఇలా ఒక పాయింట్ మీద వాదించుకోవడం తెగ ఇష్టం, సరదా.
"ఓకే లెట్స్ సీ, మొదలు నీ కథ ఏంటో చెప్పు. విన్నాక ఎవరికి అది మరపురాని రోజో తెలుస్తుంది.” అన్నాను నేను.
ఆ రోజు హైవే దగ్గర విడి పోయాము కదా. ఇప్పుడనిపిస్తూంది, యాదృచ్చికం కాదేమోనని. నా వెనుకా ఓ కాప్ కారు వెంట బడింది. నేను పెరుగుతూ విన్న కధలన్నీ ఓ నిమిషం నా మదిలో
పరుగెత్తినాయి. ఆపిన వెంటనే, విండో దించి, ఆ పోలీస్ అతనికి కన్పడేటట్టు నా చేతులు స్టీరింగ్ వీల్ మీద పెట్టాను.
పోలీస్ అతను వచ్చాడు. పెద్దతనే. 50 ఏండ్లు ఉంటాయేమో. ఇక్కడే కొన్ని తరాలనుంచి ఉన్న వారి లాగ ఉన్నాడు.
"ఎందుకు ఆపానో తెలుసా" అన్నాడు .
"తెలీదు సర్, నేను స్పీడ్ లిమిట్ లోనే నడుపుతున్నాను" అన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించగలిగితేనే కారు అని అమ్మ అనింది గుర్తుకు వచ్చింది.
"దానికి కాదు నిన్ను ఆపింది. మాల్ లో షాపింగ్ చేసావా?" అన్నాడు
" అవును కొన్ని డ్రెస్సులు కొన్నాను" అన్నాను
" ఓపెన్ యువర్ ట్రంక్", అన్నాడు పోలీసతను.
లోపల కూర్చునే ట్రంక్ తెరవడానికి లీవర్ లాగాను. కాప్ ట్రంక్ లో ఉన్న షాపింగ్ బాగ్స్ చూసి, కారు డోర్ తీసి,
"స్టెప్ అవుట్ సైడ్ కిడ్డో. కేర్ ఫుల్. నీ చేతులు పైనే ఉండనీ", అన్నాడు.
నాకు మళ్ళీ నేను విన్న, చూసిన దృశ్యాలు కళ్ళెదురుగా పరిగెత్తడం మొదలెట్టాయి.
దిగిన వెంటనే, నన్ను తిప్పి, కారు మీద నొక్కి నిలబెట్టి చేతులకి సంకెళ్లు వేశారు.
"షాప్ లిఫ్ట్ చేసావని, కంప్లైంట్ వచ్చింది. స్టేషన్ కు పోదాం పద" అని తన కారు వెనుకనే వున్నా కటకటాలతో జైలు లాగా ఉన్న వెనుక సీట్లో కి తోసాడు.
నా దగ్గర బిల్స్ ఉన్నాయంటే కూడా వినలేదు.
స్టేషన్ చేరిన తరువాత వెయిటింగ్ రూంలో పెట్టేసారు. షాప్ వాళ్లకి కబురు పెట్టామని. వాళ్లు చెప్పితే కానీ వదలమని.
నాకు కంట్లో నీళ్లు వచ్చేసాయి. నేను షాప్ లిఫ్ట్ చేయలేదని అనడానికి రుజువుంది నాదగ్గర. కానీ షాప్ వాళ్ళు రావాలంటారు ఏమిటి?
అమ్మ గుర్తుకు వచ్చింది.
"సర్, అమ్మకు ఫోన్ చేయనా?” అని అడిగాను
"నో. అమ్మా నాన్నలకి ఫోన్ చేయనవసరం లేదు. నీకు ఇప్పటికే 18 ఇండ్లు నిండాయి కదా. మొన్ననే పుట్టిన రోజు కూడా అయినట్లుంది"
నా డ్రైవర్ లైసెన్స్ బట్టి చెప్తున్నటున్నాడు.
అలానే వెటకారంగా "కావాలంటే నీవు నీ అటార్నీ కి చేయడానికి, ఓ ఫోన్ కాల్ చేయనిస్తాను" అని నవ్వాడు.
"సరే అలాగే కానీ. నా లాయర్ తో మాట్లాడనీయండి”. అంటూ ఆ టేబిల్ పైన ఉన్న ఫోన్ తీసుకొని మాట్లాడాను.
నేను ఫోన్ చేయటం ఆలస్యం, ఓ అరగంటలో హడావిడిగా వచ్చి, కాప్ ని ఎందుకు అబ్బాయిని డిటైన్ చేశారని అడిగింది, కోపంగా.
ఆ పోలీసతను “ఏమిటీ మీ అమ్మకు ఫోన్ చేశావా?” అని నన్ను చూసి గట్టిగా అరిచాడు.
“కాదు. ఆవిడ నా అటార్నీ నే” అని భయంగానే జవాబు చెప్పాను.
వచ్చినావిడ ముఖంలో ఏ మాత్రం జంకు లేదు. అణుచుకున్న కోపం మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది.
ఆవిడ తన ఐడెంటీడీ కార్డు చూపెట్టిన తరువాత పోలీసతను, ఆశ్చర్యం తో పక్కకు తొలిగి, అసహాయంగా ఆవిడని నాతో మాట్లాడానికి అనుమతి ఇచ్చాడు.
ఆవిడ నాకు హగ్ ఇచ్చి ఏమైనది అని అడిగింది. పూస గుచ్చినట్లు అన్నీ చెప్పాను. షాప్ వాళ్లిచ్చిన బిల్లు ఉందా? అంది. షాపింగ్ బాగ్ లో నే ఉందన్నాను.
ఆవిడ తిరిగేసరికి మరో పోలీసు మనిషి నన్ను తీసుకొచ్చినతనికి తోడుగా వచ్చాడు. ఆవిడ ప్రశ్నలు వేయసాగింది. ఇద్దరికీ సమాధానాలు దొరకలేదు.
ఇంతలో షాప్ నుంచి మేనేజర్ వచ్చాడు. ఆతను బిల్ చూసి అంతా సరిగానే ఉంది అంటూ డ్రెస్ చూస్తుంటే ఒక షర్ట్ నుంచి దొంగతనం ఆపడానికి వేసిన ప్లాస్టిక్ టాబ్ తీయలేదని తెలిసింది. మేనేజర్ షాప్ వాళ్లది పొరబాటు కాబట్టి తెగ క్షమాపణలు చెప్పడం మొదలెట్టాడు.
పోలీసు వారు కూడా అటూ ఇటూ క్షమాపణలు, పోలీసు స్టేషన్ తెచ్చినందుకు కారణాలతో బాటు కలగలిపి ఆవిడని అంతటితో ఆపేయమని అడగడం మొదలెట్టారు.
"థాంక్స్ మామ్" అన్నాను నేను సంకెళ్లు విదుల్చుకున్న చేతుల్తో కౌగలించుకొని.
"యెస్! హి ఈజ్ మై సన్ టూ." అమ్మ నా చేయి పట్టుకొని వడి వడిగా, ఆ పోలీసు వారి మాటలను పూర్తిగా పట్టించుకోకుండా, స్టేషన్ బయటికి తీసుకెళ్లింది.
"ఇప్పుడు చెప్పు, ఎవరిది మరపురాని రోజో? " జేసన్ నవ్వుతూ అన్నా, గొంతులో ఒక్కింత కోపం, ఒక్కింత విషాదం తొంగి చూస్తూనే ఉన్నాయి.
నాలోని డిబేటర్ అంత తొందరగా ఓటమి ఒప్పకోనివ్వలేదు.
"అరే నాకు ఎప్పుడూ ఈకథ చెప్పలేదే. నీదీ మరపురాని రోజే" అన్నాను ఓటమి ఒప్పుకోకుండానే.
జేసన్ తక్కువ తిన్నాడా. అందుకే కదా నా క్లోజ్ ఫ్రెండ్.
"సరే ఆ రోజు అలా గుర్తుండి పోవడానికి కారణం, నిన్ను కాకేసియన్ అన్నాడన్న సంతోషం అని కదా, నువ్వు చెప్పేది. కానీ నా అభిప్రాయం, నీవు కాకేసియాన్ కాకపొతే నీ పరిస్థితి ఎలా ఉండేది అన్నఆలోచన ఇచ్చిన రిలీఫ్ కారణమేమో. నీ సంతోషం వల్ల కాదు ఆ రోజు గుర్తింపు ఉండిపోవడం, నీ రిలీఫ్ వల్ల" అన్నాడు.
"సరే ఆ విషయం వదిలేయి. ఇంకో దృక్పథం లో దీన్ని చూద్దాం, నీవు లా ఎందుకు చేయాలనుకుంటున్నావు" అనడిగాడు జేసన్ మళ్ళీ.
" ఏముంది నా బంధువులందరూ డాక్టర్లో, లాయర్లో. డబ్బులు బాగా వస్తాయి. హేపీ లైఫ్. అదే మోటివేషన్, మరి నీ సంగతేమిటి? మీ అమ్మ అటార్నీ, మీ నాన్న జడ్జి అవ్వడమే కదా ముఖ్య కారణం", అన్నాను నేను.
జేసన్ తల్లి తండ్రులు లా కాలేజీలో క్లాసుమేట్లు. అక్కడి పరిచయమే వారి పెళ్ళికి దారి తీసింది. ఎబోనీ(Ebony) మ్యాగజీన్ లో వారి గురించి వచ్చిన వ్యాసం చదివాను. వెరీ ఇంప్రెసివ్ కపుల్. గ్రేట్ పేరెంట్స్ కూడా.
"నువ్వు నమ్మకపోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే లా వాళ్ళను చూసి మరో ప్రొఫెషన్ కే పోదామనుకున్నాను. కానీ ఆ రోజు మా అమ్మ అటార్నీగా వచ్చి నన్ను పోలీసు స్టేషన్ నుంచి విడిపించినప్పుడు నేను కూడ అటార్నీ అవ్వాలని నిర్ణయించుకొని ఆ ఆశయానికి తెగ కష్ట పడ్డాను. కాలేజీలో సీటు రావడం నా కృషి, అదృష్టం. సివిల్ లిబర్టీస్, పబ్లిక్ ఇంటరెస్ట్ రంగాలలో కృషి చేస్తాను. నా జీవితంలోని ఆ మరపురాని రోజు, నా ఆశయం నెరవేరుస్తుందని నా గట్టి నమ్మకం", ఇప్పుడు నవ్విన జేసన్ నవ్వులో సంతోషం, దృఢ నిశ్ఛయం మాత్రం కనిపించాయి.
జేసన్ అనుభవించిన ఆ రోజే మరపురాని రోజని, అదే నా మదిలో కూడా ఉండిపోతుందని జేసన్ కి ఎలా చెప్పడం? జేసన్ చేయి పట్టుకొని గట్టిగా నొక్కాను. జేసన్ కు అర్థం అయిపోయింది.
*****